అధ్యాయం 42
పైపైకి ఇంకా
పైకి … చీకటి గుయ్యారం లోకి
రాత్రి పది అయ్యుంటుంది.
ఒళ్లు హూనం చేసి, బతుకుని అతలాకుతలం చేసిన అనుభవాల నుండి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాం.
వశం తప్పిన ఇంద్రియాలు నెమ్మదిగా వశపడుతున్నాయి. ముందుగా తెప్పరిల్లిన ఇంద్రియం – వినికిడి.
అంతవరకు మా చుట్టూ
మారుమ్రోగిపోయిన ప్రళయ భీకర ఘోష స్థానంలో ఇప్పుడు చిక్కని నిశ్శబ్దం నెలకొంది.
ఆ నిశ్శబ్దంలో
గుసగుసగా మావయ్య మాటలు వినిపించాయి.
“మనం పైకి పోతున్నాం.”
“ఏంటి నువ్వనేది?”
అర్థం కాక అరిచాను.
“అవును. పైకి
పోతున్నాం.”
చేయి చాచి గోడని
తాకబోయాను. వేళ్లు చెక్కుకుపోయి రక్తం కారుతున్న చేతిని వెనక్కి తీసుకున్నాను. ప్రచండ
వేగంతో మేం పైకి కదులుతున్నాం.
“టార్చ్ కావాలి.
టార్చ్ ఏది?” అరిచాడు మావయ్య.
పెద్దగా ఇబ్బంది
పడకుండా హన్స్ టార్చ్ వెలిగించాడు. దాని కాంతిలో మేం ఎక్కడున్నామో నెమ్మదిగా అర్థం
కాసాగింది.
“నేను అనుకున్నట్టే
అయ్యింది,” అన్నాడు ప్రొఫెసర్. “మనం ఉన్న సొరంగం వ్యాసం ఇరవై నాలుగు అడుగులు వుంటుందేమో.
నీరు సొరంగం అట్టడుగు స్థానానికి చేరుకుంది. ఇప్పుడు మళ్లీ పైకి లేస్తోంది.”
“ఎక్కడికి లేస్తోంది?”
“ఏమో చెప్పలేను.
కాని దేనికైనా సిద్ధంగా ఉండాలి. చూడబోతే మన ఆరోహణా వేగం సెకనుకి పద్నాలుగు అడుగులు
ఉంటుందేమో. అంటే గంటకి పది మైళ్లు!”
“ఇలా ఎంత సేపని
పైకి కదులుతాం? ఎప్పటికీ ఆగమా? ఈ సొరంగం పైన ఏవుందో? పైన గాలి మందిరం వుండి, నీరు పైపైకి
పోవడం వల్ల ఆ మందిరంలోని గాలి సంకోచించబడి, ఒత్తిడి విపరీతంగా పెరిగి, ఆ ఒత్తిడికి
మనం నుజ్జు నుజ్జు అయితే?”
“ఏక్సెల్” మవయ్య
అనునయిస్తున్నట్టుగా అన్నాడు. “మన పరిస్థితి అంత హర్షనీయంగా ఏమీ లేదని నాకూ తెలుసు.
అనుక్షణం మన ఆఖరి క్షణం కావచ్చు. అలాగే మనకి విముక్తి నిచ్చే అమృత క్షణాలు ఏ క్షణానైనా
రావచ్చు నని అనుకోవడంలో తప్పేమీ లేదు. కనుక మంచే జరుగుతుందని ఆశిస్తూ సిద్ధంగా వుందాం.”
“మరి ఇప్పుడేం
చేద్దాం?”
“తిందాం!”
“తినడమా?” సరిగ్గ
విన్నానో లేదో సందేహం కొద్దీ అడిగాను.
మావయ్య హన్స్
కేసి తిరిగి డేనిష్ లో ఏదో అన్నాడు. హన్స్ తల అడ్డంగా ఊపాడు.
“తినడానికి అస్సలేమీ
లేదా?” మావయ్య అరిచినంత పని చేశాడు.
(ఇంకా వుంది)
0 comments