శబ్దం – భౌతిక
శాస్త్రం పాఠం. ఐసాక్ అసిమోవ్ రచనల ఆధారంగా…
శబ్దం
శబ్దం ఒక తరంగం
అని తరచు వింటుంటాం. అసలు తరంగం అంటే ఏమిటి?
తరంగం అంటే ఏమిటో,
తరంగంలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోడానికి నీటిలోని అలలని నమూనాగా తీసుకోవచ్చు.
నిశ్చలమైన నీటిలో
ఒక చిన్న రాయిని నెమ్మదిగా పడేశాం అనుకోండి.
రాయి పడ్డ చోట
నీరు కాస్త లోపలికి నొక్క బడుతుంది. గాలి లాకా కాక నీటి మీద ఒత్తిడి చేసినప్పుడు దాని
ఘనపరిమాణంలో పెద్దగా మార్పు రాదు. కనుక నీటి మీద ఒక చోట ఒత్తిడి చేస్తే, అక్కడ నీరు
కాస్త కిందికి పోతుంది. కాని ఆ నీరు కేవలం ఆ ప్రదేశం నుండి పక్కకి జరుగుతుంది. కనుక
రాయి పడ్డ చోటికి కాస్త అవతలగా నీటి మట్టం కాస్త పెరుగుతుంది.
మరి రాయి పడ్డ
చోటికి ఎటుపక్క అలా నీటి మట్టం పెరుగుతుంది?
రాయి పడింది ఓ బిందువు వద్ద అనుకుంటే, అక్కడ నుండి స్థానభ్రంశం చెందిన నీరు అన్నిపక్కలకి
కదలగలదు అనుకుంటే, ఆ మధ్య బిందువుకి చుట్టూరా నీటి మట్టం పెరగాలి అని అనుకోవలసి వుంటుంది. అందుచేత రాయి
పడ్డ చోటి చుట్టూ ఓ వలయాకారంలో నీటి మట్టం పెరుగుతుంది.
అలా పైకి లేచిన
నీరు గురుత్వం వల్ల మళ్లీ కిందకి పడుతుంది. అలా కిందకి పడుతున్న నీరు, మొదట నీట్లో
పడ్డ రాయిలాగానే ప్రవర్తిస్తుంది. నీరు కిందకి దిగిన చోట ఓ చిన్న లొత్త ఏర్పడుతుంది.
అక్కడి నీరు స్థానభ్రంశం చెంది అన్నిపక్కలకి కదులుతుంది. కాస్తంత దూరంలో మళ్లీ నీటి
మట్టం పెరుగుతుంది. ఈ సారి మొదట ఏర్పడ్డ నీటి వలయం వ్యాపిస్తూ కేంద్రానికి దూరం అవుతూ
వుంటుంది.
రాయి నీట్లో
పడ్డప్పుడు కేవలం ఒకే వలయం పుట్టి, కేంద్రం నుండి వ్యాపిస్తూ పోదు. మొట్టమొదటి వలయం
పుట్టినప్పుడు అది కేవలం దానికి అవతల మాత్రమే నీటి మట్టాన్ని పెంచదు. దాని లోపల కూడా
అంటే కేంద్రం వద్ద నీటి మట్టాన్ని పెంచుతుంది. ఆ విధంగా కేంద్రం వద్ద నీటి మట్టం పెరుగుతుంది.
అలా కేంద్రం వద్ద పైకి లేచిన నీరు మళ్లీ కింద పడుతుంది. అలా కింద పడ్డ నీరు మొదట పడ్డ
రాయిలాగే ప్రవర్తిస్తుంది. మరో వలయం పుడుతుంది. అది కేంద్రం నుండి వ్యాపిస్తూ పోతుంది.
ఆ విధంగా మొదట
మనం పడేసిన రాయి ప్రభావం వల్ల ఆ పడ్డ బిందువు కేంద్రంగా పలు వలయాలు పుట్టి, అవి క్రమంగా
కేంద్రం నుండి వ్యాపిస్తూ పోతాయి. అయితే ఆ చలనం అనంతంగా సాగుతూ పోదు. పడి లేస్తున్న
నీటిలోని గతి శక్తి క్రమంగా నీట్లోని ఉష్ణంగా మారిపోతుంది. ఆ విధంగా నిజానికి నీరు
కాస్త వేడెక్కుతుంది. గతి శక్తి పూర్తిగా ఉష్ణంగా మారినప్పుడు ఇక చలనం ఆగిపోతుంది.
(రోడ్డు మీద దొర్లించిన బంతి కాస్త దూరం దొర్లాక ఆగిపోడానికి కారణం కూడా ఇదే – రోడ్డుకి,
బంతికి మధ్య ఉండే రాపిడి వల్ల బంతి యొక్క గతి శక్తి ఉష్ణంగా మారుతుంది. ఆ కారణం చేత
బంతే కాక రోడ్డు కూడా కాస్త వేడెక్కుతుంది.) కనుక రాయిని నీట్లో పడేసినప్పుడు, రాయి
యొక్క గతిశక్తి నీటి యొక్క గతిశక్తిగా మారుతుంది. ఆ గతిశక్తి నీటి మీద పుట్టే వలయాల
రూపంలో రాయి పడ్డ కేంద్ర బిందువు నుండి దూరంగా తరలించబడుతుంది. అయితే కాలక్రమేణా ఆ
గతిశక్తి ఉష్ణం కింద మారి నష్టమైపోతుంది.
రాయి పడేయడం
వల్ల నీట్లో పుట్టిన వలయాలనే తరంగం అంటారు.
1. తరంగాన్ని పుట్టించడానికి
మొదట ఒక అలజడి (disturbance) వుండాలి. పై సందర్భంలో
రాయి వల్ల అలజడి పుట్టింది.
2. తరంగంలో శక్తి
వుంటుంది. పై సందర్భంలో పైకి కిందకి కదిలే నీటి గతిశక్తి రూపంలో ఆ తరంగం యొక్క శక్తి
వుంది.
3. తరంగం వల్ల ఒక చోటి నుండి మరొక చోటికి శక్తి ప్రసారం
(propagate) అవుతుంది. రాయిని పడేసింది ఒక చోట అయితే తరంగంలోని వలయాలు, ఆ చోటి నుండి
దూరంగా కదులుతాయి.
4. తరంగానికి మాధ్యమం
కావాలి. పై సందర్భంలో నీరు ఆ మాధ్యమం.
తరంగం యొక్క
కదలిక, పదార్థం యొక్క కదలికతో సమానం కాదు. పై సందర్భంలో వలయాలు కేంద్ర బిందువు నుండి
వేగంగా వ్యాపిస్తూ దూరం కావడం చూస్తాం. కాని నీటి మీద ఒక బిందువు వద్ద నించుని, అక్కడ
నీటి మట్టంలో కదలికలని గమనిస్తూ, అక్కడ నీరు కేవలం పైకి కిందకి మాత్రమే కదలడం కనిపిస్తుంది.
దీన్ని పరీక్షించడానికి నీటి ఉపరితలం మీద చిన్న కాగితం ముక్క వేసి చూసుకోవచ్చు. కాగితం
ముక్క ఉన్న చోటనే పైకి కిందికి కదలడం కనిపిస్తుంది గాని, వలయాలతో సమానంగా కేంద్రం నుండి
దూరంగా కదలదు.
పై లక్షణాలు
తరంగాన్ని నిర్వచిస్తాయి. తరంగం యొక్క విలక్షణతని వ్యక్తం చేస్తాయి.
(ఇంకా వుంది)
0 comments