ఆ ఫాక్స్ పంపిన వాడు స్వయంగా ఎస్. ఆర్. హాడెన్. ఎల్లీ వెతుకుతున్న
రహస్యం తన వద్ద వుందంటూ, వచ్చిన తనను కలుసుకోమంటాడు.
ఆ సమావేశం హాడెన్ యొక్క ప్రైవేట్ జెట్ లో జరుగుతుంది.
“ఎంతో కాలంగా నిన్ను కనిపెట్టుకుని వున్నాను,” చెప్పుకొస్తాడు
హాడెన్. “నీ ప్రతిభ మీద నాకు నమ్మకం వుంది. నువ్వు ఎంతో ఎత్తుకు వెళ్తావని నాకు తెలుసు.
కాస్త సహాయం అందిస్తే ఈ కోడ్ రహస్యం కూడా భేదించగలవని అనిపించింది.”
“కోడ్ ని మీరు భేదించారా?” నమ్మశక్యం కానట్టు అడుగుతుంది.
హాడెన్ చిరునవ్వు నవ్వి అవునన్నట్టు తల వూపుతాడు. “మనకి సందేశం
పంపిన వాళ్లు మన కన్నా ఎన్నో వేల ఏళ్లు ముందున్న నాగరక జీవులు. వాళ్ళ ఆలోచనా విధానం
కూడా మన కన్నా చాలా అధునాతనంగా వుండాలి. ఆ సందేశంలో పేజీలు వరుసక్రమంలో మన పుస్తకాల్లో
లాగా లేవు. ఒక ఘనం (cube) లో కొసల వద్ద మూడేసి
ముఖాలు కలుస్తాయి. అదే విధంగా ఈ పేజేలు మూడేసి కలుస్తాయి. అప్పుడ ఒక పేజీలో వున్న సమాచారం
దానికి ఆనుకుని వుండే పేజీలో పూర్తవుతుంది…”
హాడెన్ ఇచ్చిన సూచనల అనుసారం ఎల్లీ మొత్తం కోడ్ ని భేదిస్తుంది.
తార నుండి వచ్చిన సందేశంలోని అంతరార్థం తెలుస్తుంది.
ఆ సందేశంలో ఏదో ఓ కొత్తరకం వ్యోమనౌక నిర్మాణానికి సంబంధించిన
ఆదేశాలు వున్నాయి. అయితే ఆ నౌక ఎలా ప్రయాణిస్తుందో, దాన్ని శాసించే భౌతిక సూత్రాలేమిటో
ఎవరికీ అర్థం కాదు. ఆ వివరాలు సందేశంలో లేవు.
సందేశం యొక్క ప్రాధాన్యతని గుర్తించిన డ్రమ్లిన్ అంత వరకు
ఎల్లీని విమర్శించిన వాడు కాస్తా ఒక్క సారిగా ‘ప్లేటు ఫిరాయిస్తాడు.’ రహస్య సందేశాన్ని
మొత్తం తనే ఛేదించినట్టు అందరితో చెప్పుకుంటాడు. అక్కణ్ణుంచి ప్రాజెక్ట్ కి తనే నేతగా
వ్యవహరించడం మొదలెడతాడు. ఆ పరిణామానికి ఎల్లీకి ఒళ్లు మండినా, డ్రమ్లిన్ రాజకీయ బలం
ముందు చేసేదేమీ లేక ఊరుకుంటుంది.
ట్రాన్స్‍పోర్టర్ లో ఎవరు ప్రయాణిస్తారు అన్న విషయం మీద ఎంపిక
మొదలవుతుంది. పోటీలో పాల్గొన్న వారిలో కొందరు వ్యోమగాములు ఉంటారు. కాని ప్రయాణం ఎంత
ప్రమాదంతో కూడుకున్నదో అర్థం చేసుకున్న పోటీదారులు ఒక్కొక్కరే పోటీ నుండి తప్పుకుంటారు.
డ్రమ్లిన్ కూడా ఆ పోటీలో పాల్గొనడంతో ఎల్లీకి, డ్రమ్లిన్ కి
మధ్య పోటీ హోరా హోరిగా వుంటుంది. అయితే పోటీలో తను గెలుస్తానని ఎల్లీకి చిన్న ఆశ. ఎందుకంటే
పోటీ పరీక్ష నిర్వహించే బోర్డులో తనకి చిరకాల స్నేహితుడొకడు వున్నాడు. అతడి పేరు పామర్
జాస్.
ఈ పామర్ జాస్ కూడా
మతవర్గానికి చెందిన వాడే. అయితే ఇతడిది మరీ
ఛాందస వాదం కాకపోయినా ‘దైవం’ అనే తత్వం అనుభవానికి అందుతుందని ఇతడి నమ్మకం. సైన్స్ లో ప్రయోగం చేసి విషయాన్ని నిర్ధారించినట్టే స్వీయానుభవంలో దైవం అనే తత్వాన్ని తెలుసుకోవచ్చని ఇతడి వాదం. అదంతా జరగని పని కొట్టి పారేస్తుంది ఎల్లీ. ఇతడికీ
ఎల్లీకీ ఈ విషయం మీద అడపాదపా సంవాదాలు అవుతుంటాయి.
ఎల్లీ కనబరుస్తున్న ప్రతిభ, తెగువ ఇతడికి అబ్బురపాటు కలిగిస్తుంటాయి.
ఒక సన్నివేశంలో వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణలో ఎల్లీ వ్యక్తిత్వం, గొప్పదనం అద్భుతంగా
వ్యక్తం అవుతాయి.
“చూడు పామర్! నాకు పుట్టి బుద్ధెరిగిన నాటి నుండి మన చుట్టూ
కనిపించే ఈ ప్రకృతి, ఈ జీవితం, విశ్వం … వీటి గురించి ఇంతవరకు తెలియని రహస్యాలేవైనా
తెలుసుకోవాలని ఎంతో తపించేదాన్ని. ఆ రహస్యంలో ఓ చిన్న అంశం… చాలా చిన్న అంశం… తెలుసుకునే
అవకాశం ఇంత కాలం తరువాత దొరికింది. అంత గొప్ప బహుమతి కోసం ఒక ప్రాణం మూల్యం కూడా చెల్లించకపోతే
ఎలా?” అంటుంది.
ఒక పక్క ఆమె ఆ ప్రయాణంలో బయల్దేరడం ఇష్టం లేకపోయినా, ఆమె మాటల్లోని
లోతు, ఆవేశం, ధైర్యం చూసి విస్మయం చెందుతాడు పామర్ జాస్.
(ఇంకా వుంది)
0 comments