పై నుండి కిందకి
వదిలేయబడ్డ ట్రాన్స్‍పోర్టర్ పరిభ్రమిస్తున్న పెద్ద పెద్ద వలయాల మధ్య నుండి కిందికి
పడుతూ సూటిగా కింద వున్న సముద్రంలో పడిపోతుంది. అల్లంత దూరంలో కంట్రోల్ రూమ్ నుండి
ఈ తంతంతా చూస్తున్న సిబ్బంది అదిరిపోతారు. కంట్రోల్ రూమ్ లో కలకలం మొదలవుతుంది.
ఇంత ఖర్చుతో
నిర్మించిన యంత్రం విఫలమయ్యింది. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. బహుశ తార నుండి వచ్చిన
సందేశాన్ని డీకోడ్ చేసే ప్రయత్నంలో పొరబడి వుంటారు. పోనీ ఎల్లీ ప్రాణాలతో సురక్షితంగా ఉంటే చాలు. కంట్రోల్
రూమ్ లోని సిబ్బంది ఆలోచనలు ఈ రకంగా సాగుతుంటాయి.
ఎల్లీని సురక్షితంగా
కంట్రోల్ సెంటర్ కి తెచ్చి విశ్రమించనిస్తారు. పూర్తిగా మతిస్థిమితం తప్పినట్టుగా మాట్లాడుతుంటుందామె.
“నేనిప్పుడు
ఎక్కడున్నాను? ఈ రోజు ఏం తారీఖు? నేను ఎంత కాలం వెళ్లాను?” చుట్టూ వున్న వారి మీద ప్రశ్నల
వర్షం కురిపిస్తుంది.
“అయామ్ సారీ!
నువ్వు ఎక్కడికీ వెళ్ళలేదు ఎల్లీ! ట్రాన్స్‍పోర్టర్ నేరుగా నీళ్లలో పడిపోయింది,” అంటాడు
పాజెక్ట్ మేనేజర్.
“నీళ్లలో పడిపోవడం
ఏంటి? నేను నిజంగా వెళ్లాను…” అంటూ తనకి కలిగిన అనుభవాలన్నీ పూస గుచ్చినట్టు చెప్తుంది.
తను కనీసం పది, ఇరవై గంటలు వెళ్లి వుంటుందని తనకి అనిపించినట్టు చెప్తుంది.
కావలిస్తే తను
రికార్డ్ చేసిన వీడియో చూడమంటుంది. కాని కామ్ కార్డర్ లోని అంశాలని చూస్తే అంతా వట్టి
రొద తప్ప మరింకేమీ రికార్డు కాలేదని తేలుతుంది.
ఎల్లీ నిర్ఘాంతపోతుంది.
తను చెప్పింది ఎవరూ నమ్మరు. బయటికి మర్యాదగా ఊరుకున్నా తనకి నిజంగానే మతిస్థిమితం తప్పిందని
అందరూ అనుకుంటూ వుంటారు.
ఈ విషయం మీద
పెద్ద వివాదం చెలరేగుతుంది. మీడియా ఈ విచిత్రం గురించి హోరెత్తిస్తూ ఉంటుంది.
యూ.ఎస్. లో ఓ
న్యాయస్థనంలో ఈ వివాదం విచారణకి వస్తుంది. బయటి నుండి చూసే వారికి కొద్ది క్షణాల్లో
జరిగిపోయినట్టు అనిపించిన ఘటన, లోపల ట్రాన్స్‍పోర్టర్ లో వున్న ఎల్లీ కి ఎన్నో గంటల
పాటు జరిగినట్టు అనిపించడం ఎలా సాధ్యం? ట్రాన్స్‍పోర్టర్ లో కాలం నెమ్మదించినట్టు అనుకోవాలా?
అసలు అలాంటిది భౌతిక శాస్త్రం ప్రకారం సాధ్యమేనా? మొదలైన ప్రశ్నలు తలెత్తుతాయి.
భౌతిక శాస్త్రవేత్త
అయిన ఎల్లీ అలాంటిది సైద్ధాంతికంగా సాధ్యం కావచ్చేమోగాని వాస్తవంలో అలాంటి పరిణామానికి
దాఖలాలు లేవంటుంది. ఉదాహరణకి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో విశ్వంలో సుదూర స్థలాలని
కలుపుతూ ఐన్‍స్టయిన్-రోసెన్ వంతెనలు (Einstein-Rosen bridges) అనేవి వుంటాయని, వీటి ద్వార ఎంతో దూరాలని అతి తక్కువ
సమయంలో దాటే అవకాశం వుంటుందని అంటుంది. కాని ఇలాంటి వంతెనలు వాస్తవంలో వున్న ఆధారాలు
లేవు కనుక న్యాయస్థానానికి నమ్మశక్యం కానట్టుగా తోచుతుంది.
(http://en.wikipedia.org/wiki/Wormhole)
ఎల్లీ పరిస్థితి
పూర్తిగా ఇరకాటంలో పడుతుంది. ఒక విధంగా అస్తికులు ఎదుర్కునే సమస్యే శుద్ధ నాస్తికురాలైన
తను కూడా ఎదుర్కున్నట్టు అయ్యింది. అస్తికులు, అందులో ఎంతో కొంత “అనుభవం” వున్న వారు,
తమ అనుభవానికి రకరకాల పేర్లు పెడతారు. ఏదో దేవత కనిపించిందనో, కాంతి కనిపించిందనో,
ఆనందాతిరేకం అనుభవం అయ్యిందనో పట్టుపడతారు. అయితే ఆ అనుభవానికి బాహ్య ఆధారాలు ఉండవు
కనుక, అవతలి వారికి దాన్ని నిరూపించడం సాధ్యం కాదు. కనుక అలాంటి అనుభవాన్ని నమ్మినవాళ్లు
నమ్ముతారు. నమ్మని వాళ్లు నవ్విపోతారు.
న్యాయవిచారణ
పూర్తవుతుంది. ఎల్లీ చేసిన తప్పేమీ లేదని నిర్ణయిస్తుంది న్యాయస్థానం.
కాని కోర్ట్
కొడవ పూర్తైన కొంత కాలం తరువాత ఓ ఆశ్చర్యకరమైన విషయం బయట పడుతుంది. ఎల్లీ రికార్డ్
చేసిన వీడియోని మరో సారి పరిశీలించిన మీదట అందులో వున్నది మొత్తం రొదే అయినా ఆ రొద
యొక్క వ్యవధి పద్దెనిమిది గంటలు అని తేలుతుంది! కేవలం కొన్ని క్షణాల్లో అంత బారైన వీడియో
ఎలా రికార్డ్ అవుతుంది?
ఆ చిన్న సూక్ష్మం
వల్ల ఎల్లీ చెప్పిన కథనం నిజమని బయటపడుతుంది.
మతానికి, విజ్ఞానానికి
మధ్య వుండే వివాదం ఒక విధంగా నేపథ్యంగా ఉన్న ఈ సినిమా ఈ విధంగా ఆ రెండు దృక్పథాలకి
మధ్య సమన్వయం చూపడానికి ప్రయత్నిస్తుంది. ఆ సమన్వయం అందరూ ఒప్పుకుంటారని కాదు. ఎందుకంటే
ఆ రెండు ధృవాలకి మధ్య సమన్వయమనేది ప్రస్తుతానికి ఒక ఆశ, లేక ఆశయంగానే వుంది గాని అది
ఇంకా వాస్తవం కాదు.
ఏదేమైనా ఆ సినిమా
ప్రేక్షకుల మనసుల్లో ఎన్నో లోతైన ప్రశ్నలు తలెత్తేట్టు చేస్తుంది, ఆ ప్రశ్నల గురించి
ప్రేక్షకులని ఆలోచింప జేస్తుంది.
మరి మంచి సినిమా
యొక్క ప్రయోజనం అదే కదా?
0 comments