శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in other Indian Languages. Please Click here.

జలపాతపు పల్లకి నెక్కి పాతాళంలోకి

Posted by శ్రీనివాస చక్రవర్తి Friday, June 6, 2014
మేం బద్దలు కొట్టిన బండకి అవతలి పక్క ఏదో అగాధం వుంది. ముందే చీలికలు పడి వున్న ప్రదేశంలో మేం పుట్టించిన విస్ఫోటం వల్ల భూకంపం లాంటిది ఏర్పడింది. మూసి వున్న అగాధం తెరుచుకుంది. అందు లోకి సముద్రం వెల్లువలా ప్రవహించింది. ఆ ప్రవాహంలో మేమిలా కొట్టుకుపోతున్నాం.

మా పతనానికి అంతూ పొంతూ లేనట్టు వుంది. ఎక్స్ ప్రెస్ రైళ్ల కన్నా వేగంగా అందరం భూగర్భం లోతుల్లోకి  దూసుకుపోతున్నాం.
కాని అలాంటి పరిస్థితి లో కూడా నా పక్కనే ఓ చిన్న కాంతి కనిపించి మనసులో చిన్న ఆశ కలిగించింది. ఆ కాంతిలో హన్స్ ముఖం స్పష్టంగా కనిపించింది. అలాంటి పరిస్థితిలో కూడా మా సాటిలేని  వేటగాడు ఎలాగో ఓ విద్యుత్ దీపం వెలిగించాడు. ఆ వెలుగులో మా పరిసరాలు చూచాయగా కనిపిస్తున్నాయి.

నేను అనుకున్నది నిజమే అయ్యింది. మేం పడుతున్నది ఓ విశాలమైన సొరంగ మార్గం. అందుకే ఒక పక్క గోడ కనిపిస్తోంది గాని, అవతలి పక్క గోడ కనిపించడం లేదు. ఓ విశాలమైన జలపాతంతో పాటు మేం జకూడా కింద పడుతున్నాం. అతి ఉధృతమైన అమెరికన్ నదీ పాతాల కన్నా భయంకరంగా వుంది మేం వున్న జలపాతం. పాతాళపు గుండెల్లోకి గురి పెట్టి రువ్వబడ్డ జల శరాల వర్షంలో చిక్కుకున్న అనుభూతి… మా పక్కనే వున్న కరకు గోడ మీద పొడుచుకొస్తున్న రాళ్లు మా వెనుకగా ఎంత వేగంగా దూసుకుపోతున్నాయో, దాని బట్టి మేం ఎంత వేగంగా కదులుతున్నామో అర్థమవుతుంది. గంటకి ముప్పై కోసుల దూరం ప్రయాణిస్తున్నామేమో అనిపించింది.

నేను, మావయ్య ఒకరి కేసి ఒకరం నీరసంగా చూసుకున్నాం. అప్పటికే మా బుల్లి తెప్పలో కొంత భాగం విరిగి నీట్లో కొట్టుకుపోయింది. ఇక మిగతా భాగాన్ని ముగ్గరం గట్టిగా పట్టుకున్నాం.
అలా కొన్ని గంటలు గడిచాయేమో. మా పరిస్థితి మెరుగు కాకపోగా మరింత జటిలం అయ్యింది.
తెప్ప మీదకి ఎక్కించిన సరంజామాలో అప్పటికే సగానికి సగం నీటి పాలయ్యింది. ఇక మిగతా సామగ్రినైనా కాస్త స్వాధీనపరుచుకుంటే మంచిది అనిపించింది. కనుక చేతిలో వున్న లాంతరు సహాయంతో ఎంత వరకు మిగిలిందో చూద్దామని అనుకున్నాను. మా పరికరాలలో గడియారం, దిక్సూచి మాత్రం మిగిలాయి. మేం తెచ్చుకున్న తాళ్ళు, నిచ్చెనలు అన్నీ తడిసి ముద్దయి ఓ మూల కనిపిస్తున్నాయి. పలుగు, పార, గొడ్డలి మొదలైన వన్నీ ఎప్పుడో జారిపోయాయి. ఇక సంభారాలు మరొక్క రోజుకి వస్తాయేమో!
తెప్ప మీద మిగిలిన సంభారాలు చూసి పిచ్చెక్కినట్టు అయ్యింది. ఇక ముగ్గురికీ ఈ పాతాళ బిలంలో దిక్కులేని ఆకలి చావు తప్పదా? అయినా నా పిచ్చి గాని, ఇలాంటి పరిస్థితుల్లో మరెన్నో చిత్ర విచిత్ర పద్ధతుల్లో ప్రాణాలు పోయే  అవకాశం వున్నప్పుడు, ఆకలి చావే కలుగుతుందని నమ్మకం ఏంటి?

ప్రాణం మీద తీపి అంటే ఇదే కాబోలు… అలాంటి పరిస్థితిలో, అలాంటి పరిసరాల్లో కూడా ఓ చిన్న ఆశ చిగురించింది. ఎప్పటికైనా మళ్లీ ఈ అగాధం లోంచి బయట పడతామా? మళ్ళీ ఎప్పటికైనా భూమి ఉపరితలాన్ని చేరుకోగలమా? పైన కొండలు, మిట్టలు, సూర్యాస్తమయాలు మొదలైన అందాలన్నీ ఎప్పటికైనా కళ్లార చూడగలమా?

ఆ విషయమై మావయ్య ఉద్దేశం కనుక్కుందాం అనుకున్నాను. కాని ఆ పరిస్థితిలో ఆయన్ని ప్రశాంతంగా ఉండనివ్వడమే మేలని ఊరుకున్నాను.
ఇంతలో నా చేతిలోని లాంతరు దీపం కాసేపు కొట్టుమిట్టాడి తుది శ్వాస వదిలింది. ఆ కాస్త కాంతి కూడా కరువు అవ్వడంతో చుట్టూ చీకటి మరింత చిక్కన అయ్యింది. మా తెప్ప కదిలే వాలు పెరిగింది. వేగం మరింత తీవ్రతరం అయ్యింది. మావయ్య, హన్స్ లు నా చెరో జబ్బ గట్టిగా పట్టుకున్నారు.
అలా మా పయనం ఎంత సేపు సాగిందో గుర్తులేదు. దేన్నో బలంగా గుద్దుకున్నట్టు తెప్ప ఆగింది. తెప్పని ఆపింది ఏదో కఠిన తలం కాదు. అదేదో జలాశయంలా వుంది. ఆ జలపాతం లోని నీరు ఈ పాతాళ జలాశయంలోకి ప్రవహిస్తోంది.
నాకిక ఊపిరి సలపడం లేదు! మునిగిపోతున్నాను!

కాని అంతలోనే పైకి తేలాను. గుండెల నిండుగా ఊపిరి పీల్చుకున్నాను. మావయ్య, హన్స్ లు నన్ను వదలకుండా గట్టిగా పట్టుకున్నారు. మా బుల్లి తెప్ప కూడా మమ్మల్ని వదలకుండా మోసుకుపోతోంది.

(నలభై ఒకటవ అధ్యాయం సమాప్తం)
2 comments

 1. Anonymous Says:
 2. ఇలాంటి పరిస్థితుల్లో మరెన్నో చిత్ర విచిత్ర పద్ధతుల్లో ప్రాణాలు పోయే అవకాశం వున్నప్పుడు, ఆకలి చావే కలుగుతుందని నమ్మకం ఏంటి? .

  ఇంతలో నా చేతిలోని లాంతరు దీపం కాసేపు కొట్టుమిట్టాడి తుది శ్వాస వదిలింది.

  పాఠకులతో , పాతాళప్రయాణం చేయిస్తున్నట్లుంది .అంతగా లీనం చేయించేస్తున్నారు.
  అద్భుతం!.

  వర్ణన అమోఘంగా ఉంది.

   
 3. Thank you!

   

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts

Follow by Email