ఇంచుమించు ట్రిలియన్
డాలర్ల పై చిలుకు వ్యయంతో నిర్మించబడుతున్న
ట్రాన్స్‍పోర్టర్ ఓ మూఢుడి దుడుకు చేష్ట మూలంగా
కళ్ల ముందే అలా నీళ్లపాలు అవ్వడం చూసి కేప్ చుట్టూ బారులు తీరి వున్న ప్రేక్షక వర్గం
నిర్ఘాంతపోతారు.
ఎన్నో ఎదురుదెబ్బలు
రుచి చూసిన ఎల్లీ కూడా ఆ దెబ్బకి వెంటనే తేరుకోలేకపోతుంది. తను వెళ్లలేకపోయినా ఏదో
విధంగా ప్రాజెక్ట్ విజయవంతమై, ఎవరో ఒకరు ఆ యాత్ర చేసి సుదూర గ్రహ వాసులని సంపర్కించి
రాగలిగితే తనకి అంత కన్నా సంతోషకరమైన విషయం లేదు. కాని ఇప్పుడా ఆశలన్నీ నీటగలిశాయి.
అంతలో ఎస్. ఆర్.
హాడెన్ మళ్లీ తనని సంపర్కిస్తాడు. విచారపడవలసిన పని లేదని, గుట్టుగా అదే యంత్రం యొక్క
మరో నమూనాని జపాన్ లో హొకాయ్డో దీవి మీద నిర్మిస్తున్నారని చెప్తాడు. ఇంకా సంతోషకరమైన
వార్త ఏంటంటే, దీని నిర్మాణంలో మీడియా జోక్యం వుండదు. అనవసరమైన రాజకీయ పితలాటకం వుండదు.
ఎందుకంటే అందులే హాడెన్ పెట్టుబడి ఎంతో వుంది.
ఇక ట్రాన్స్‍పోర్టర్
లో ప్రయాణించబోయేది ఎవరో కాదు – హాడెన్ కి ఎంతో ప్రీతి పాత్రమైన, అతడి గౌరవాన్ని, విశ్వాసాన్ని
మొదటి నుండి చూరగొన్న డా. ఎలియనోర్ ఏరోవే!
అది విన్న ఎల్లీ
ఎగిరి గంతేస్తుంది.
ప్రయాణానికి
సన్నాహాలు మొదలవుతాయి. అందులో భాగంగా ఓ సయనైడ్
కాప్సూల్ అవసరమైతే వుంటుందని ఇస్తారు. మాన్యుయల్ లో వున్నది తప్ప మరే ఇతర జాగ్రత్తలూ
తీసుకోవద్దని వాదిస్తుంది ఎల్లీ. ఆ మాన్యుయల్ మీద, తార నుండి వచ్చిన సందేశం మీద ఆమె
నమ్మకం అలాంటిది!
గోళాకారంలో వుండే
ట్రాన్స్‍పోర్టర్ మధ్యలో వున్న ఓ కుర్చీలో కూర్చుంటుంది ఎల్లీ. అందులో ఇంకేమీ వుండవు,
కంట్రోల్ పానెళ్లు, మానిటర్లు, రంగురంగుల ఎల్. ఈ.డి…. ఇవేమీ వుండవు. హెల్మెట్ కి ఓ
చిన్న కామ్ కార్డర్ తగిలించి వుంటుంది. అప్పట్నుంచి జరగబోయేదంతా రికార్డ్ చేసి తిరిగి
వచ్చాక భూలోకానికి ప్రకటించాలనే ఉత్సాహంతో వుంది ఎల్లీ!
మూడు వలయాలలో
కరెంటు స్థాయిని క్రమంగా పెంచుతూ పోతారు. వాటి నడి బొడ్డులో తీక్షణమైన విద్యుదయస్కాంత
క్షేతం ఏర్పడుతుంది. ఆ ప్రదేశంలో ఉన్నట్లుండి ఓ చిన్నపాటి సూర్యుడు ప్రత్యక్షమైనట్టుగా
ప్రచండమైన కాంతి ఉత్పన్నమవుతుంది.
లోపల కుర్చున్న
ఎల్లీకి ట్రాన్స్‍పోర్టర్ దేహం అంతా కంపిస్తున్నట్టుగా తోస్తుంది. అంతే కాక దాని పదార్థంలో
ఏవో చిత్రమైన మార్పులు రావడం కనిపిస్తుంది. వెండి రంగులో వున్న గోడలు కాస్త క్రమంగా
పారదర్శకంగా అయిపోతున్న అనుభూతి కలుగుతుంది.
అనుకున్నట్టుగానే
ట్రాన్స్‍పోర్టర్ ని పై నుండి ఆ వలయాల మధ్య పడేట్టుగా కింద పడేస్తారు.
ఆ క్షణం ఎల్లీకి
కలిగిన అనుభూతి ఆమెని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది.
(ఇంకా వుంది)
0 comments