అధ్యాయం 43
అగ్నిపర్వతం
మమ్మల్ని విసిరేసింది
అవును. దిక్సూచి
ఇక పని చెయ్యనని మొరాయించింది. పిచ్చి పట్టి నట్టు అటు ఇటు దిక్కులు చూసింది గాని ఏది
ఎటో చెప్పలేకపోయింది.
ప్రస్తుతం చలామణిలో
వున్న భౌగోళిక సిద్ధాంతాల ప్రకారం భూమి మీద ఉండే ఖనిజ సంపద ఇప్పుడూ పూర్తి నిశ్చల స్థితిలో
వుండదు. దాని రసాయనిక కూర్పులో వచ్చే మార్పుల
వల్లనైతేనేమి, అందులోని అపారమైన ద్రవప్రవాహాల వల్లనైతేనేమి, తత్ఫలితంగా పుట్టే
తీవ్రమైన అయస్కాంత క్షేత్రాల వల్లనైతేనేమి ఖనిజ విస్తరణలో రకరకాల మార్పులు వస్తుంటాయి.
పైన జీవించే అమాయక మానవాళికి మాత్రం లోపల అంతా స్థిరంగా, స్తబ్దుగా వుందని అనిపిస్తుంది.
కాని ప్రస్తుత
స్థితిలో భూ గర్భంలో ఎంత అల్లకల్లోలంతో కూడిన వాతావరణం ఉంటుందో స్వానుభవంలో తెలుస్తోంది.
కోటి రధాలు ఒక్కసారిగా దూసుకొస్తుంటే భూమి దడదడలాడినట్టు, ఎడతెగని పర్జన్య గర్జనతో
దిక్కులు పిక్కటిల్లుతున్నట్టు మా పరిసరాలు చెవులు చిల్లులు పడే నినదాలతో మారుమోగిపోతున్నాయి.
మా దిక్సూచి
పాపం వెర్రెక్కి గిరికీలు కొడుతోంది. ఇక సందేహం లేదు. భూతలపు పైపొర ఇక ఛిన్నాభిన్నం
అవుతోంది. బలమైన బండలు బద్దలై భూమిని పెల్లగించుకుని పైకి తన్నుకొస్తాయి. పెద్ద పెద్ద
చీలికలు ఏర్పడి భూమి లోతుల్లో వుండే సలసల మరిగే పాషాణద్రవం పైకి వెళ్ళగక్కబడుతుంది.
ఇక మేమంతా ఈ పాతాళ ప్రళయంలో చిక్కుకుని భూస్థాపితం కావడం ఖాయం.
“మావయ్యా!” ఇక
ఆపుకోలేక బావురు మన్నాను. “అంతా అయిపోయింది మావయ్యా. ఇక ఆశ వదులుకున్నాను.”
“ఇప్పుడు ఉన్నట్టుండి
ఎందుకిలా డీలా పడిపోతున్నావు? ఇప్పుడేవయ్యిందని?” మావయ్య ఎప్పట్లాగే నింపాదిగా అడిగాడు.
“ఏవయ్యింది అంటావేంటి
మావయ్యా?అసలు చుట్టూ ఏం జరుగుతోందో చూస్తున్నావా? నీటి కుతకుతలు వినిపించటంలా? మంటల
భుగభుగలు వినిపించడంలా? భూకంపం రాబోతోంది, మావయ్యా. భూకంపం రాబోతోంది!” ఆవేశంగా అన్నాను.
మావయ మత్రం నిశ్చింతగా
తల అడ్డుగా ఊపాడు.
“భూకంపం వస్తోందంటావా?
నాకలా ఏమీ అనిపించడంలేదే!”
“నా కనిపిస్తోంది
మరి!”
“నువ్వు పొరబడ్డావు
అనుకుంటా.”
“మరైతే ఇదంతా
ఏంటి నీ ప్రకారం?”
“ఇదో విస్ఫోటం
ఏక్సెల్,” తాపీగా అన్నాడు మావయ్య.
“విస్ఫోటమా?”
అరిచినంత పని చేశాను. “అంటే మనం ఇప్పుడు అగ్నిపర్వతంలో వున్నామా? ఆ అగ్నిపర్వతం లోని
సొరంగం లోంచి పైకి తన్నుకొస్తున్నామా?”
“అవునని నా అభిప్రాయం.
అంతే కాదు. ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఇంతకన్నా సత్పరిమాణాన్ని ఆశించలేము.”
“ఇది సత్పరిమాణం
అంటావా?” నమ్మశక్యం కానట్టు అడిగాను.
“అవును. భూమి
ఉపరితలాన్ని వేగంగా చేరుకోడానికి ఇంత కన్నా మంచి మార్గాంతరం కనిపించడం లేదు నాకు.”
మంచి మార్గమా?
ఇక సందేహమే లేదు. మా మావయ్యకి నిజంగా పిచ్చే! కొండ పిండి కాబోతోంది, లావా వరదల్లె ప్రవహించబోతోంది,
ఆకాశమంతా మసిమయం కాబోతోంది. ఇక ఆ పాషాణ ప్రయణంలో మేం మిడుతల్లా మాడబోతున్నాం. ఇంత కన్నా
మంచి మార్గం కనిపించలేదట మా మావయ్యకి … చావటానికి!
0 comments