“ఫొర్ ట్రేఫిగ్”
అన్నాడు హన్స్ ఉత్సాహంగా డచ్ లో.
“అద్భుతం,” బదులు
ఇచ్చాడు మావయ్య.
ఆ కాస్త పదార్థం
కడుపులో పడ్డాక మళ్లీ ప్రాణం లేచొచ్చింది. అంతవరకు మొద్దు బారిపోయినట్టు ఉన్న మనసులో
ఇప్పుడు ఏవో జ్ఞాపకాలు మెదుల్తున్నాయి. కోనిగ్స్‍స్ట్రాసే లో మా ఇంట్లో నా కోసం కలలుకంటున్న
నా బంగారు గ్రౌబెన్ తీపి గుర్తులు లోనుంచి తన్నుకొస్తున్నాయి. పాపం మార్థా ఎలా వుందో?
నేనిలా చివరి
ఘడియలు లెక్కెట్టుకుంటూ పరధ్యానంగా వుంటే మావయ్య మాత్రం ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ కనిపించాడు.
మా ప్రస్తుత పరిస్థితిని బేరీజు వేసుకుంటున్నాడు కాబోలి. మావయ్యలో ఇదే అత్యద్భుతమైన
లక్షణం. ఎంత విపరీత పరిస్థితుల్లో అయినా స్థిమితం కోల్పోకుండా తక్షణ కర్తవ్యం గురించే
ఆలోచిస్తాడు గాని తబ్బిబ్బు కాడు.
ఏదో సణుగుతున్నాడు.
ఆ సణుగుడులో కూడా అక్కడక్కడ ఏదో భౌగోళిక శాస్త్ర పరిభాష జాలువారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో
భౌగోళిక శాస్త్రం గురించి, పురావస్తు పరిశోధన గురించి ఆలోచించేవాణ్ణి ఏవంటారో తెలీదు
గాని ఆ వ్యక్తి ససేమిరా మనిషి కాడు!
“ఇది విస్ఫోటక
కంకర!” తేల్చి చెప్తున్నట్టుగా అన్నాడు మావయ్య. మా ఎదుట గల రాతి గోడ మీద వ్యాఖ్యానిస్తున్నాడు.
“ఇది నైస్ (
gneiss) జాతి రాయి. ఇదో మైకా షిస్ట్. దీన్ని బట్టి మనం సంక్రమణ దశని దరిజేరుతున్నాం
అని అర్థమవుతోంది.. దీని తరువాత…”
ఏంటి మా ప్రొఫెసరు
అనేది? చుట్టూ ఉన్న రాతి లక్షణాల బట్టి మా నుండు ఉపరితలం ఇంకా ఎంత ఎత్తున వుందో అంచనా
వేస్తున్నాడా? ఎలా కుదుర్తుంది? ఈయన వద్ద బారోమీటర్ కూడా లేదు. ఇది వట్టి ఊహాగానం తప్ప
మరేం లేదు.
పైకి పోతున్న
ఉష్ణోగ్రత ఇంకా ఇంకా పెరుగుతోంది. ఒళ్ళు ఉడికిపోతోంది. కొలిమి నోట్ళోకి ఉరకబోతున్న
కరిగిన లోహం లా వుంది మా పరిస్థితి.
“ఏంటిది మావయ్యా?
మనం ఏ రాతి కొలిమి లోకైనా ప్రవేశించబోతున్నామా?”
“లేదు లేదు. కచ్చితంగా లేదు, అది అసంభవం,” ధీమాగా అన్నాడు
మావయ్య.
“మరి ఇదేంటి
ఇంత వేడిగా వుంది.”
అడుగున వున్న
నీట్లోకి ఓ సారి వేలు ముంచితే చుర్రు మంది.
“నీళ్లు ఉడికిపోతున్నాయి,”
గట్టిగా అరిచాను.
మావయ్య విసుక్కుంటూ
నోరు ముయ్యమన్నట్టుగా వారించాడు.
ఇక నాకున్న ఆఖరి
ఆశ కూడా మాయమైపోయింది. మనసంతా నిస్పృహ ఆవరించింది. ఎంత నిగ్రహించుకున్నా భయం ఆగడం లేదు.
పెరుగుతున్న ఉష్ణోగ్రత… కుతకుతలాడుతున్న నీరు… ఇక ఇంతే సంగతులు. మేం ఎక్కడున్నామో?
ఏమై పోతున్నామో? ఎటు పోతున్నామో?
వెంటనే ఆ పక్కనే
వున్న దిక్సూచి కేసి చూశాను. అది మా కన్నా ముందే చచ్చిపోయింది!
(నలభై రెండవ
అధ్యాయం సమాప్తం)
0 comments