అధ్యాయం 7
అణువిన్యాసం
వర్గాల సిద్ధాంతం
ప్రాతిపదికలు
(radicals) మూలాంశాలుగా కర్బన రసాయన అణువులు
నిర్మితమవుతాయి అన్న భావన బెర్జీలియస్ కి చాలా అర్థవంతంగా కనిపించింది. అకర్బన అణువులు
ఎలాగైతే ప్రత్యేక అణువుల చేత నిర్మితమవుతాయో, కర్బన అణువులు ఈ ప్రాతిపదికల చేత నిర్మితమవుతాయి
అని భావించాడు. ఎలాగైతే పరమాణువులు అవిభాజ్యంగా, సమగ్రంగా ఉంటాయో, అదే విధంగా ప్రాతిపదికలు
కూడా అవిభాజ్యమై సమగ్రంగా ఉంటాయని అనుకున్నాడు.
అకర్బన అణువులో
గాని, కర్బన అణువులో గాని వివిధ పరమాణువులని కలిపి వుంచే శక్తి విద్యుత్ శక్తి అని
బెర్జీలియస్ భావించాడు. (ఆ భావనే తదనంతరం నిజం అయ్యింది). అలాంటప్పుడు ప్రతీ అణువు
లోను కొన్ని ధనావేశాలు, కొన్ని ఋణావేశాలు ఉండి తీరాలి. ఎందుకంటే భిన్న ఆవేశాల మధ్యనే ఆకర్షణ ఉంటుంది.
సరళమైన అకర్బన
రసాయనాల విషయంలో (ఉదాహరణకి సోడియమ్ క్లోరైడ్) ఈ ధన, ఋణ అనే భావన వాస్తవాలతో చక్కగా
సరిపోతోంది. ఈ సూత్రాన్ని కర్బన రసాయనాలకి వర్తింపజేయటం కోసం ప్రాతిపదికలలో ఉన్నవి
కేవలం హైడ్రోజన్, ఆక్సిజన్ పరమాణువులు మాత్రమే నని అనుకున్నాడు. అందులో కార్బన్ కి
ఋణావేశం ఉంటే, హైడ్రోజన్ కి ధనావేశం ఉంటుంది. ఆ విధంగా ఆలోచిస్తూ బింజాయిల్ ప్రాతిపదికలో
(C7H5O) ఆక్సిజన్ ఉండదని అనుకున్నాడు. అలా పొరబడటం వల్ల ఆ ప్రాతిపదిక
మీద చేసిన అధ్యయనాలలో దోషాలు తలెత్తాయి. బెర్జీలియస్ మరో విషయాన్ని కూడా ఊహించాడు.
ఒక ధనాంశం స్థానంలో ఓ ఋణాంశాన్ని ప్రవేశపెట్టడం సాధ్యం కాదని అనుకున్నాడు. ఎందుకంటే
అలా చేస్తే ఆ రసాయనం యొక్క లక్షణాలలో సమూలమైన మార్పులు వస్తాయి.
కాని ఈ ఆఖరు
భావనలో అతడు పొరబడ్డట్టు త్వరలోనే తెలిసింది. ద్యుమా ఎప్పుడూ బెర్జీలియస్ నే గట్టిగా
సమర్ధించేవాడు. కాని ద్యుమా శిష్యులలో ఒకడైన అగస్త్ లొరోన్ (1807-1853) అన్నవాడు
1836 ఈథైల్ ఆల్కహాల్ (ethyl alcohol) అణువులో హైడ్రోజన్ లకి బదులు క్లోరిన్ పరమాణువులని
ప్రతిక్షేపించి చూపించాడు. ఆ ప్రయోగం బెర్జీలియస్ భావాలకి గొడ్డలి పెట్టు అయ్యింది.
ఎందుకంటే క్లోరిన్ కి ఋణావేశం వుందని, హైడ్రోజన్ కి ధనావేశం ఉందని తెలిసిన విషయమే.
కాని ఒక దాని స్థానంలో మరొక దాన్ని ప్రతిక్షేపించినా సమ్మేళనం యొక్క లక్షణాలలో పెద్దగా
మార్పు రాలేదు.
పైగా ఈ క్రోరినీకృత
సమ్మేళనంలో క్లోరిన్ నేరుగా కార్బన్ కి అతుక్కోవాలి. కాని రెండిటికీ వున్నది ఋణావేశమే
అయితే అది ఎలా సాధ్యం? ఋణావేశాలు ఒక దాన్నొకటి వికర్షించుకోవాలిగా? (అంతెందుకు? అసలు క్లోరిన్ అణువులో రెండు క్లోరిన్ పరమాణువులు
ఎలా కలిసి వుంటాయి? మరో శతాబ్ద కాలం దాకా ఈ సమస్యకి సమాధానం దొరకలేదు.)
వయసు పైబడ్డ
బెర్జీలియస్ కి చాదస్తం కూడా కాస్త హెచ్చు కావడంతో తన భావాలలోని దోషాలని సులభంగా ఒప్పుకోలేక
పోయాడు. లొరోన్ ప్రచురించిన నివేదిక గురించి వినగానే దాని మీద దుమ్మెత్తి పోశాడు.
1839 లో ద్యుమా స్వయంగా అసెటిక్ ఆసిడ్లోని మూడు హైడ్రోజన్ స్థానాలలో క్లోరిన్ లని ప్రతిక్షేపించాడు.
కాని పెద్దాయన బెర్జీలియస్ కి ఎదురు చెప్పలేక తన సొంత ఆవిష్కరణలని పక్కబెట్టడమే కాకుండా,
లొరోన్ కనుక్కున్న సత్యాలని త్ర్రోసిపుచ్చాడు.
బెర్జీలియస్ |
ఈ వ్యతిరేకత
చూసిన లొరోన్ మాత్రం చెక్కుచెదరలేదు. బెర్జీలియస్ మొండిగా నమ్మినట్టుగా ప్రాతిపదికలు
(radicals) అవిభాజ్యమైనవి కావని నిరూపించడానికి
మరిన్ని ఆధారాలు సేకరిస్తూ పోయాడు. అంతేకాక ధన, ఋణావేశాల విషయంలో బెర్జీలియస్ నమ్మకాలు
తప్పని లొరోన్ కి అనిపించింది. లొరోన్ ప్రదర్శించిన ఈ ధిక్కారాన్ని బెర్జీలియస్ సహించలేకపోయాడు.
ప్రముఖ ప్రయోగశాలల్లో లొరోన్ కి ప్రవేశం దక్కకుండా చేశాడు. తన భావాలకి విరుద్ధంగా ఆధారాలు పోగవుతున్నా కేవలం
రంగంలో పెద్ద వాడు కనుక బతికినంత కాలం ఈ విషయంలో మాత్రం బెర్జీలియస్ మాటే చెల్లుతూ వచ్చింది. కాని 1848 లో బెర్జీలియస్ మరణంతో పాటు అతడి సిద్ధాంతం కూడా
భూస్థాపితం అయిపోయింది. అదే సమయంలో లొరోన్ సిద్ధాంతం కొత్త ఊపిరి పోసుకుంది.
(ఇంకా వుంది)
0 comments