సరూపకాలు
(isomers) – ప్రాతిపదికలు (radicals)
పద్దెనిమిదవ
శతాబ్దంలో జరిగిన రసాయన శాస్త్ర పురోగతి కారణంగా ఎన్నో సరళమైన అకర్బన రసాయన సమ్మేళనాల
లక్షణాలని పరమాణు పరంగా వివరించడానికి సాధ్యమయ్యింది. ప్రతీ అణువులోను ఏఏ పరమాణువులు,
ఎన్నెన్ని ఉన్నాయో తెలిస్తే చాలు అన్నట్టు అయ్యింది. ఆక్సిజన్ అణువును O2 అని, హైడ్రోజన్ క్లోరైడ్ ని HCl అని, అమోనియాని NH౩ అని, సోడియమ్ సల్ఫేట్ ని Na2S04
ఇలా వ్యక్తం చెయ్యడానికి వీలయ్యింది.
ఆ విధంగా ఒక
అణువులో ఏఏ రకాల, ఎన్నెన్ని పరమాణువులు ఉంటాయో తెలిపే ఈ సూత్రాలని ‘ప్రయోగవేద్య సూత్రాలు’
(empirical formulas) అంటారు. (empirical అంటే
ప్రయోగం చేత తెలుసుకోదగ్గది అని అర్థం). పందొమ్మిదవ శాతాబ్దపు తొలి దశాబ్దాలలో ప్రతి
సమ్మేళనానికి ప్రత్యేకమైన, విలక్షణమైన ప్రయోగ వేద్య సూత్రం ఉంటుందని, ఏ రెండు సమ్మేళనాలకి
ఒకే ప్రయోగవేద్య సూత్రం ఉండదని అనుకోవడం ఎంతో సహజంగా అనిపించింది.
పెద్ద పెద్ద
అణువులు గల కర్బన రసాయనాల విషయంలో మొదటి నుంచి పెద్ద చిక్కే ఏర్పడింది. మార్ఫిన్ (morphine)
(ప్రోటీన్ల తో పోల్చితే ఇది చాలా సరళమైన కర్బన రసాయనం) యొక్క ప్రయోగవేద్య సూత్రం C17H19NO3.
పందిమ్మిదవ శతాబ్దపు తొలి దశల్లో లభ్యమైన పద్ధతుల సహాయంతో మార్ఫిన్ సూత్రం ఈ రెండిట్లో ఏది? C17H19NO3
లేక C16H20NO3
- అన్నది తేల్చుకోవడం చాలా కష్టమై ఉండేది. ఇంచుమించు అసంభవమై ఉండేది. అలాగే
మార్ఫిన్ కన్నా మరింత సరళమైన ప్రయోగవేద్య సూత్రం గల ఎసెటిక్ ఆసిడ్ (acetic acid) ప్రయోగవేద్య
సూత్రం C2H4O2.
పందొమ్మిదవ శతాబ్దపు తొలి సగభాగంలో ఈ సమ్మేళనం విషయంలో పెద్ద వివాదం తలెత్తింది. అందుచేత
కర్బన రసాయనాల అణువిన్యాసాల విషయంలో ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా ప్రయోగవేద్య సూత్రాలతో
ప్రారంభించడం కాకుండా మరో దారి కనిపించలేదు.
1780 లలో లెవోషియే కర్బన సమ్మేళనాలలో కార్బన్, హైడ్రోజన్
యొక్క పాళ్లు తెలుసుకోవటం కోసం ఆ సమ్మేళనాలని
మండించి అలా పుట్టిన కార్బన్ డయాక్సయిడ్ ని, నీటిని కొలిచేవాడు. అతడి ఫలితాలలో నిర్దుష్టత
కొరవడింది. పందొమ్మిదవ శతాబ్దపు తొలి దశల్లో
పై ఫలితానికి మెరుగులు దిద్దిబడ్డాయి.
ఆ మెరుగులు దిద్దినవారు ఫ్రాన్స్ కి చెందిన గే-లుసాక్ (కలిసే ఘనపరిమాణాల నియమాన్ని
కనుక్కున్న వాడు) మరియు అతడి సహోద్యోగి లూయీ జాక్ తెనార్ (1777-1857) లు. శోధించ గోరిన కర్బన రసాయనాన్ని వాళ్లు పొటాషియమ్
క్లోరేట్ వంటి ఆక్సీకరణ పదార్థంతో కలిపారు. ఆ మిశ్రమాన్ని వేడి చేయగా ఆక్సిజన్ పుట్టింది.
కర్బన రసాయనంతో ఆక్సిజన్ బాగా కలియడంతో శ్రీఘ్రమైన, సంపూర్ణమైన జ్వలనం సంభవించింది.
అలా జ్వలనం నుండి పుట్టిన కార్బన్ డయాక్సయిడ్ ని, నీటిని సేకరించి, కొలవటం ద్వార మూల
రసాయనంలో హైడ్రోజన్, కార్బన్ ల సాపేక్ష పాళ్లు ఎంతో గే-లుసాక్, తెనార్ లు తెలుసుకోగలిగారు.
ఇప్పుడు డాల్టన్ సిద్ధాంతం కూడా ఉండనే వుంది కనుక ఆ పాళ్లని పరమాణు పరంగా కూడా వ్యక్తం
చెయ్యటానికి వీలయ్యింది.
ఎన్నో కర్బన
రసాయనాలలో కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ లు మాత్రమే ఉంటాయి. కార్బన్, హైడ్రోజన్ లని
ముందుగా అంచనా వేస్తే, ఇక మిగిలింది ఆక్సిజనే నని అనుకుంటే ఆ విలువల బట్టి ప్రయోగవేద్య
సూత్రాన్ని సులభంగా కనుక్కోవచ్చు. ఆ విధంగా 1811
కల్లా గే-లుసాక్ కొన్ని సరళమైన చక్కెర అణువుల ప్రయోగవేద్య సూత్రాలని అంచనా వేశాడు.
ఈ పద్ధతికి జర్మన్
రసాయన శాస్త్రవేత్త జస్టస్ ఫాన్ లీబిగ్ (1807-1873) మరింత మెరుగులు దిద్దాడు. 1831 కన్నా
ఈ లీబిగ్ ఎన్నో కర్బన సమ్మేళనాల ప్రయోగవేద్య
సూత్రాలని ఎంతో కచ్చితంగా అంచనా వేశాడు. 1833
లో జాన్ బాప్టిస్ట్ ఆంద్రే ద్యుమా (1800-1884) అనే ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త
పై పద్ధతిని కాస్త సవరించాడు. ఈ కొత్త పద్ధతి సహాయంతో జ్వలనం నుండి పుట్టిన నైట్రోజన్
ని కూడా సేకరించి కొలవటానికి వీలయ్యింది. ఈ విధంగా కర్బన రసాయనాలలో నైట్రోజన్ పాలుని
కూడా కొలవటానికి వీలయ్యింది.
పైన చెప్పుకున్న
పరిశోధనలన్నీ ‘కర్బన విశ్లేషణ’ లో తొలిమెట్లు అయ్యాయి. అలాంటి తొలి ప్రయత్నాలు చేసిన
పురోగాముల కృషి ఫలితంగా ప్రయోగవేద్య సూత్రం అంత ముఖ్యం కాదన్న ఓ అమూల్యమైన సత్యం బట్టబయలు
అయ్యింది. ఆ విజయం ఇలా సంభవించింది.
(ఇంకా వుంది)
Many known facts are appearing in new light through your writing. Keep up the good work.
Srinivas