ప్రాతిపదికల
అవగాహనలో విద్యుత్ శక్తులకి ప్రాధాన్యత నిచ్చే పద్ధతిని పక్కన పెట్టాడు లొరోన్. ప్రతీ
కర్బన అణువుకి ఒక కేంద్రాంశం (అది కేవలం ఒక పరమాణువు కావచ్చు) ఉంటుందని, ప్రాతిపదికలు అన్నీ ఆ కేంద్రాంశానికి అతుక్కుని
ఉంటాయని అతడు భావించాడు. అప్పుడు కర్బన రసాయనాలని కొన్ని కుటుంబాలుగా లేక వర్గాలుగా
వర్గీకరించడానికి వీలవుతుంది. దీన్నే వర్గాల సిద్ధాంతం (theory of types) అంటారు. ఒకే
వర్గానికి చెందిన అణువులు అన్నిట్లోను ఒకే రకమైన కేంద్రాంశం ఉంటుంది. ఒక ప్రత్యేక కోవకి
చెందిన ప్రాతిపదికలలో ఏవైనా ఆ కేంద్రాంశానికి అతుక్కోవచ్చు. ఇక ప్రాతిపదికలలో కూడా
ఎంతో వైవిధ్యానికి అవకాశం ఉంటుంది.
కొన్ని అణువర్గాలు అకర్బన రసాయనాల కోవకి కూడా చెందే
అవకాశం వుంది.
ఉదాహరణకి ఒక
నీటి అణువుని (H2O) కేంద్రంలో ఒక O పరమాణువు ఉన్నట్టుగాను, దానికి రెండు H పరమాణువులు
అతుక్కుని వున్నట్టుగాను ఊహించుకోవచ్చు. ఇప్పుడు
ఆ H పరమాణువు స్థానంలో ఎన్నో రకాల ప్రాతిపదికలని ప్రతిక్షేపించవచ్చు.
ఆ విధంగా ఒక సమ్మేళనాల వర్గం ఏర్పడుతుంది. ఆ వర్గంలో నీరు కూడా ఉంటుంది. మరి కొన్ని
అకర్బన రసాయనాలు కూడా ఈ వర్గంలో ఉండొచ్చు.
హైడ్రోజన్ స్థానంలో
ఒక మిథైల్ (CH3) సముదాయాన్నో (group), ఒక ఇథైల్ సముదాయాన్నో (C2H5)
ప్రతిక్షేపిస్తే అప్పుడు వరుసగా మిథైల్ ఆల్కహాల్ (CH3OH), ఇథైల్ ఆల్కహాల్
(C2H5OH) ఏర్పడతాయి.
అధిక సంఖ్యలో ఆల్కహాళ్లని ఈ విధంగా నిర్మించొచ్చు. నిజానికి ఆల్కహాళ్లలో ఎన్నో
సామాన్య లక్షణాలు ఉండటమే కాకుండా, ఆల్కహాళ్ల వర్గానికి నీటికి మధ్య ఎన్నో పోలికలు వున్నాయి.
మిథైల్ ఆల్కహాల్, ఇథైల్ ఆల్కహాల్ లాంటి సరళమైన ఆల్కహాళ్లనే తీసుకుంటే ఇవి నీటిలో ఏ
నిష్పత్తిలో నైనా కలిసిపోతాయి. సోడియమ్ లోహం కూడా నీటితో చర్య జరిపినట్టే ఆల్కహాళ్లతో
కూడా చర్య జరుపుతుంది. అయితే నీటితో పోల్చితే ఈ చర్య మరి కాస్త మంద గతిలో సాగుతుంది.
1850,
1852 ప్రాంతాల్లో ఇంగ్లీష్ రసాయన శాస్త్రవేత్త
అలెగ్జాండర్ విలియమ్ విలియమ్సన్ (1824-1904)
ఓ ఆసక్తికరమైన విషయాన్ని కనుక్కున్నాడు. ఈథర్ లు (ethers) అనబడే ఓ కొత్త కర్బన రసాయనాల కుటుంబాన్ని కూడా ఈ
“నీటి” వర్గాన్ని ఆధారం చేసుకుని నిర్మించవచ్చని అతడు నిరూపించాడు. అలా చెయ్యడానికి
నీటిలో ఉండే రెండు హైడ్రోజన్లని తొలగించి వాటి స్థానంలో కర్బన ప్రాతిపదికలని ప్రతిక్షేపించాలి.
రెండు హైడ్రోజన్ల స్థానంలో ఇథైల్ సముదాయాలని (C2H5) ప్రతిక్షేపిస్తే వచ్చేదే అప్పుడప్పుడే మత్తుమందుగా
వినియోగించబడుతున్న, అతి సామాన్యమైన ఈథర్ (C2H5OC2H5).
అంతకు మునుపు
1848 లో చార్లెస్ అడోల్ఫ్ వుర్జ్ అనే ఓ ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త
(1817-1884) ఓ ముఖ్యమైన జాతికి చెందిన కర్బన
రసాయనాలని అధ్యయనం చేశాడు. అమోనియాకి (NH3) సంబంధించిన ఈ కర్బన రసాయనాల
వర్గాన్ని అమీన్లు (amines) అంటారు. నైట్రోజన్ కేంద్రాంశంగా గల అణువులివి. అమ్మోనియాలో
నైట్రోజన్ కి మూడు హైడ్రోజన్లు అతుక్కుని వుంటాయి. అమీన్లలో ఈ హైడ్రోజన్ల స్థానంలో
కర్బన ప్రాతిపదికలు ప్రతిక్షేపించడం జరుగుతుంది.
వర్గాల సిద్ధాంతానికి
క్రమేపీ ప్రాముఖ్యత పెరిగింది. కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్న కర్బన రసాయనాలని
ఈ సిద్ధాంతం సహాయంతో ఒక క్రమంలో అమర్చటానికి వీలయ్యింది. ఫ్రీడ్రిక్ కొన్రాడ్ బైల్‍స్టయిన్
అనే రుస్సో-జర్మన్ రసాయన శాస్త్రవేత్త ఓ విస్తారమైన కర్బన రసాయనాల కోశాన్ని
1880 లో ప్రచురించాడు. లొరోన్ ప్రతిపాదించిన
వర్గాల సిద్ధాంతాన్ని ఉపయోగించి ఇతగాడు ఆ కర్బన రసాయనాలని ఒక తార్కికమైన క్రమంలో అమర్చాడు.
ఇన్ని సత్ఫలితాలని
ఇచ్చినా కూడా లొరోన్ రూపొందించిన వర్గాల సిద్ధాంతం అసంపూర్ణమని తేలింది. అది ప్రాతిపదికలని
(radicals) ముఖ్యాంశాలుగా తీసుకుంది. అణువిన్యాసానికి సంబంధించిన ప్రశ్నలని దాటేసిందే
గాని విపులంగా శోధించలేదు. ఆ ప్రశ్నకి సరైన సమాధానం రాబట్టాలంటే ముందసలు ప్రాతిపదికల
అణువిన్యాసాన్ని అర్థం చేసుకోవాలి.
(ఇంకా వుంది)
0 comments