1810 లో, (ఆ
తరువాత కూడా) గే-లుసాక్, తెనార్ లు కలిసి హైడ్రోజన్ సయనైడ్ (HCN) మీద పని చేస్తూ అదొక
ఆసిడ్ అని, అంతేకాక అందులో ఆక్సిజన్ లేదని నిరూపించారు. (ఇటువంటి సత్యాన్నే డేవీ హైడ్రోక్లోరిక్
ఆసిడ్ విషయంలో నిరూపించాడు. ఆ విధంగా ఆసిడ్లు అన్నిటిలోను ఆక్సిజన్ ఉంటుందని లెవోషియే
చాటిన నమ్మకం వమ్మయ్యింది.) ఈ ఆసిడ్ గురించి గే-లుసాక్, తెనార్ లు మరో విషయం కూడా కనుక్కున్నారు.
హైడ్రోజన్ సయనైడ్ లో వుండే CN సముదాయాన్ని
(దీన్నే సయనైడ్ సముదాయం (cyanide group) అంటారు)
ఒక సమ్మేళనం నుండి మరో సమ్మేళనానికి యథాతథంగా, కార్బన్ కి నైట్రోజన్ కి మధ్య
ఉండే బంధాలని తెంచకుండా, మార్చవచ్చని కనుక్కున్నారు. నిజానికి ఈ CN సముదయం ఒక అఖిలరాశిగా ప్రవర్తిస్తోందని, ఏకైక క్లోరిన్
పరమాణువు లాగానో, బ్రోమిన్ పరమాణువు లాగానో ప్రవర్తిస్తోందని తెలుసుకున్నారు. అందుకే
సోడియమ్ సయనైడ్ కి (NaCN), సోడియమ్ క్లోరైడ్ (NaCl) కి, అలాగే సోడియమ్ బ్రోమైడ్ (NaBr) కి మధ్య కొన్ని
సామాన్య లక్షణాలు * ఉన్నాయని తెలిసింది.
(* “కొన్ని సామాన్య
లక్షణాలు” అంటే కొన్ని మాత్రమే, అన్నీ ఒకేలా ఉన్నాయని మాత్రం ససేమిరా కాదు. ఉదాహరణకి
సోడియమ్ క్లోరైడ్ జీవితానికి ప్రధానమైన రసాయనం. సోడియమ్ బ్రోమైడ్ కి కాస్తంత విష ప్రభావం
ఉంటుంది. సోడియమ్ సయనైడ్ మహోగ్ర వేగంతో పని చేసే విషపదార్థం.)
ఆ విధంగా సమగ్రరాశిలా
ప్రవర్తిస్తూ, ఒక అణువు నుండి మరో అణువుకి యథాతథంగా మారగలిగే పరమాణు సముదాయాలని ప్రాతిపదిక
(radical) అంటారు. ఈ radical అన్న పథం లాటిన్ లో “వేరు” (root) అన్న అర్థం గల
పదం నుండి వచ్చింది. పరమాణువులు ఎప్పుడూ కొన్ని ప్రత్యేక సముదాయాలుగా ఏర్పడతాయని, ఎంత
సంక్లిష్టమైన అణువైనా అందులో కొన్ని ప్రత్యేక పరమాణు సముదాయాల చేతనే నిర్మించబడి వుంటుందని
ఊహించుకోడానికి వీలయ్యింది. Radical లు అనే
వేళ్ల లోంచి అణువు అనే వృక్షం పుట్టుకొచ్చిందని అనుకోసాగారు.
అయితే CN సముదాయం
చాలా సరళమైన సముదాయం. కాని అంతకన్నా చాలా సంక్లిష్టమైన మరో తార్కాణాన్ని వోలర్, లీబిగ్
లు కలిసి ఛేదించారు. బెంజాయిల్ సముదాయాన్ని
ఒక అణువు నుండి మరో అణువుకి సమగ్రంగా మార్చవచ్చని తెలుసుకున్నారు. బెంజాయిల్ సముదాయం
యొక్క ప్రయోగవేద్య సూత్రం C7H5O అని ఇప్పుడు మనకి తెలుసు.
ఈ పరిశోధనల చరిత్ర
బట్టి మనకి ఒక విషయం అర్థమవుతుంది. బృహత్ అణువుల నిర్మాణ రహస్యం అర్థం కావాలంటే వాటిలో
వుండే కొన్ని ప్రత్యేక పరమాణు సమూహాలు, అంటే ఈ ప్రాతిపదికల, నిర్మాణ రహస్యాలు తెలియాలి. అవి తెలిస్తే మరింత
సంక్లిష్టమైన అణువులని నిర్మించే రహస్యాలు పట్టుబడతాయి అని ఊహించసాగారు. రసాయన శాస్త్ర
సమాజాలలో ఓ కొత్త ఆశాభావం చిగురించింది.
(ఇంకా వుంది)
0 comments