వోలర్, కోల్బ్,
బెర్తెలో మొదలైన వారు సంయోజించిన కర్బన రసాయనాలు కాస్త సరళమైన పదార్థాలు. జీవలోకానికి
ప్రత్యేకమైన మరింత సంక్లిష్టమైన పదార్థాలెన్నో వున్నాయి. పిండి పదార్థం
(starch), కొవ్వు (fat), ప్రోటీన్లు మొదలైనవి అలాంటి రసాయనాలకి తార్కాణాలు.
వాటిని శోధించడం మరింత కష్టం. వాటి మౌలిక అంశాల విశ్లేషణ మరింత జటిలం. అప్పుడప్పుడే
అంకురిస్తున్న కర్బన రసాయన శాస్త్రానికి ఈ పదార్థాలు దుస్తరమైన సవాళ్లుగా దాపురించాయి.
అయితే ఈ సంక్లిష్టమైన
కర్బన రసాయనాలని కూడా సజల ఆసిడ్ లతో గాని, సజల బేస్ లతో గాని కలిపి వేడి చేస్తే అవి
మరింత సరళమైన ‘పునాది రాళ్లు’గా విడిపోతాయని ఆ రోజుల్లో తెలిసిన విషయమే. గాట్లీబ్ సిగిస్ముండ్
కిర్షాఫ్ (1764-1833) అనే రష్యన్ రసాయన శాస్త్రవేత్త ఈ విషయంలో అగ్రగామి. 1812 లో
ఇతడు పిండి పదార్థాన్ని (ఆసిడ్ తో కలిపి వేడి చేసి) దాన్ని ఒక ప్రత్యేక చక్కెరగా మార్చగలిగాడు. ఆ చక్కెరకే తదనంతరం గ్లూకోస్ అని పేరు పెట్టారు.
1820 లో ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త హెన్రీ బ్రాకొనో
కూడా ప్రోటీన్ జెలటిన్ ని అదే విధంగా సంస్కారం చేశాడు. అప్పుడు గ్లైసిన్ అనే సమ్మేళనం
ఉత్పన్నం అయ్యింది. ఇది నైట్రోజన్ కలిగిన ఒక కర్బన రసాయన ఆసిడ్. ఈ రకమైన ఆసిడ్ల జాతికి
తదనంతరం బెర్జీలియస్ ఉమ్మడిగా అమినో ఆసిడ్లు అని పేరు పెట్టాడు. ఇరవై వివిధ అమినో ఆసిడ్లలో
ఈ గ్లైసన్ మొదటిది అని తరువాత తెలిసింది. పందొమ్మిదవ శతాబ్దంలో ఈ అమినో ఆసిడ్లు అన్నిటినీ ప్రకృతి సహజంగా లభ్యమయ్యే ప్రోటీన్ల నుండి సంయోజించ
గలిగారు.
పిండి పదార్థం
లోను, ప్రోటీన్ల లో కూడా పెద్ద పెద్ద అణువులు ఉంటాయి. పిండి పదార్థంలో గ్లూకోస్ అంశాల
పొడవాటి మాలికలు ఉంటాయి. అలాగే ప్రోటీన్లలో అమినో ఆసిడ్ల మాలికలు ఉంటాయి. ప్రయోగ శాలలో
అలాంటి మాలికలని సంయోజించడంలో పందొమ్మిదవ శతాబ్దపు రసాయన శాస్త్రవేత్తలు పెద్దగా పురోగమించలేకపోయారు.
కాని కొవ్వు విషయంలో పరిస్థితి వేరేగా వుంది.
మిచెల్ యూజీన్
చెవెరూల్ (1786-1889) అనే ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త తన సుదీర్ఘమైన వృత్తి జీవనంలో
అధిక భాగం కొవ్వు పదార్థాల పరిశోధనకే కేటాయించాడు. 1809 లో అతడు సబ్బుని (కొవ్వు పదార్థాన్ని ఆల్కలీతో వేడి
చేసి సబ్బు తయారు చేస్తారు) ఆసిడ్ తో సంస్కారం చేసి మనం ఇప్పుడు ఫాటీ ఆసిడ్లని
(fatty acids) అని పిలిచే పదార్థాలని సంయోజించగలిగాడు.
కొవ్వుని సబ్బుగా మార్చినప్పుడు అందులోంచి గ్లిసరాల్ తొలగించబడుతుందని కూడా తరువాత
అతడు కనుక్కున్నాడు.
గ్లిసరాల్ కాస్త
సరళమైన అణువే. అందులో మూడు స్థానాల వద్ద అదనపు పరమాణు బృందాలు అతుక్కోడానికి వీలు ఉంటుంది.
1840 ల కల్లా ఒక విషయం స్పష్టమయ్యింది. పిండి
పదార్థం లోను, ప్రోటీన్ల లోను ఉండే మౌలిక అంశాలు అధిక సంఖ్యలో ఉండొచ్చుగాని, కొవ్వు
పదార్థాలలో మాత్రం కేవలం నాలుగు అంటే నాలుగే అంశాలు – గ్లిసరాల్ మరియు మూడు ఫాటీ ఆసిడ్లు
- ఉంటాయని తెలుసుకున్నారు.
ఇక్కడే బెర్తెలొ
రంగప్రవేశం చేశాడు. 1854 లో అతడు గ్లిసరాల్
ని స్టియరిక్ ఆసిడ్ తో సంస్కారం చేశాడు. ఈ ఆసిడ్ కొవ్వు పదార్థాలలో దొరికే ఓ సర్వసామాన్యమైన
ఆసిడ్. అలా చెయ్యటం వల్ల ఒక గ్లిసరాల్ అంశం, మూడు స్టియరిక్ ఆసిడ్ అంశాలతో కలిసిన ఓ
అణువు ఉత్పన్నం అయ్యింది. దాని పేరు ట్రై స్టియరిన్. సహజ కొవ్వు నుండి పుట్టే ట్రై
స్టియరిన్ కి దీనికి తేడా లేదని తెలుసుకున్నారు. అప్పటి వరకు సంయోజించ పడ్డ సహజ పదార్థాలు అన్నిట్లోకి ఇది అత్యంత సంక్లిష్టమైనది
అని చెప్పుకోవచ్చు.
ఆ తరువాత బెర్తెలొ
మరింత కఠినమైన కార్యాని తలపెట్టాడు. స్టియరిక్ ఆసిడ్ కి బదులుగా ఇతడు వేరే ఆసిడ్లని
తీసుకున్నాడు. ఇవి సహజ కొవ్వు పదార్థాల నుండి తీసుకున్నవి కాకపోయినా అలాంటి ఆసిడ్లని
పోలి వున్నాయి. ఈ కొత్త ఆసిడ్లని గ్లిసరాల్ తో కలిపి వేడి చేస్తే మామూలు కొవ్వు పదార్థాలని
పోలిన పదార్థాలు ఉత్పన్నం అయ్యాయి. కాని ఇవి ప్రకృతిలో లభ్యమయ్యే కొవ్వు పదార్థాల లాగా
లేవు.
(ఇంకా
వుంది)
0 comments