ఇక గత్యంతరం
లేక తక్కిన సబ్జెక్ట్ ల మీద కూడా ఇష్టం లేకపోయినా ధ్యాస పెట్టసాగాడు. లెక్కల నుండి
ఆ కాస్తంత సమయం కూడా దూరంగా ఉండడం అతడికి రంపపు కోతగా ఉండేది. దానికి తోడు పారితోషకం
రద్దు కావడంతో జరిగిన అవమానం. ఆ పరిస్థితిని ఎంతో కాలం భరించలేకపోయాడు. ఇక ఉండలేక
1905 ఆగస్టులో ఎవరికీ చెప్పకుండా ఇంటి నుండి పారిపోయాడు. ఎక్కడి వెళ్లాలో తెలీదు. ఈ
నరకం నుండి దూరంగా ఎక్కడికైనా పారిపోవాలి. హౌరా వెళ్లే రైలెక్కి విశాఖపట్టణానికి పారిపోయాడు.
అక్కడ ఏం చేశాడో, ఎక్కడ వున్నాడో మొదలైన వివరాలు పెద్దగా లేవు. ఇంట్లో తల్లిదండ్రులు
బెంబేలెత్తిపోయారు. తండ్రి చెన్నై, తిరుచినాపల్లి నగరాలకి వెళ్లి ఇంచుమించు ఇంటింటికీ
వెళ్లి కొడుకు కోసం గాలించాడట. మొత్తానికి ఎలాగైతేనేం సెప్టెంబర్ కల్లా పుత్రరత్నాన్ని ఇంటికి తిరిగి
తీసుకొచ్చారు.
తొమ్మిదేళ్ల
వయసులో ఇలాంటిదే మరో సంఘటన జరిగింది. లెక్కల పరీక్షలో తనకి 45 కి
42 మార్కులు వస్తే తన తోటి విద్యార్థి
అయిన చిన్నారి సారంగపాణి అయ్యంగార్ కి 43 వచ్చాయట.
లెక్కల్లో ఎప్పుడూ తనదే అగ్రస్థానం కావాలన్న పంతం గల రామానుజన్ ఈ పరిణామాన్ని సహించలేకపోయాడు.
తన అవస్థ చూసి జాలి పడ్డ సారంగపాణి అయ్యంగారు ‘పోనీలే! మిగతా సబ్జెక్ట్ లలో నా కన్నా
ఎక్కువే వచ్చాయిగా?’ అని ఊరడించబోయాడు. అయినా ఒప్పుకోక ఏడ్చుకుంటూ ఇంటికి పరుగెత్తి
పోయి తల్లి ఒడిలో తల దాచుకున్నాడట బాల రామానుజన్.
హై స్కూల్ లో
చదువుకునే రోజుల్లో మరో సంఘటన జరిగింది. త్రికోణమితిలో sin(x), cos(x) మొదలైన ప్రమేయాలని లంబ కోణ త్రిభుజంలోని భుజాల నిష్పత్తులుగా
నిర్వచిస్తారు. కాని లంబకోణ త్రిభుజాలతో అసలు సంబంధమే లేకుండా కూడా వీటిని నిర్వచించవచ్చని
రామానుజన్ స్వయంగా కనుక్కున్నాడు. అంత చిన్న వయసులో అంత లోతైన రహస్యాన్ని కనుక్కున్నందుకు
మురిసిపోయాడు. కాని తరువాత తెలిసింది ఏంటంటే
స్విట్జర్లండ్ కి చెందిన లియొనార్డ్ ఆయిలర్ (Leonhard Euler) అనే పేరుమోసిన గణితవేత్త ఆ సంగతిని 150 ఏళ్ళ క్రితమే కనిపెట్టాడు. అది తెలుసుకున్న రామానుజన్
సిగ్గుతో క్రుంగిపోయాడు. ఆ విషయం మీద తను రాసుకున్న పత్రాలన్నీ ఎవరూ చూడకుండా అటక ఎక్కించేశాడు.
ఈ సంఘటలన్నిటిలో రామానుజన్ యొక్క సున్నితమైన మనస్తత్వం
కనిపిస్తుంది. ఎవరు ఏ చిన్న మాటన్నా తట్టుకోలేని స్వభావం. కాస్తంత విమర్శను కూడా భరించలేని
తత్వం. ఎందరో మేధావులలో ఇలాంటి స్వభావం కనిపిస్తుంది. ఈ సందర్భంలో ముఖ్యంగా మనకి స్ఫురించే
ఉదాహరణ ఐజాక్ న్యూటన్. వైజ్ఞానిక రంగంలో ఓ
శాస్త్రవేత్త నూతన భావాలని ప్రతిపాదించినప్పుడు
తోటి శాస్త్రవేత్తలు వాటిని విమర్శించడం, వ్యతిరేకించడం కద్దు. అంత మాత్రం చేత తోటి
శాస్త్రవేత్తల మీద అలిగి, శత్రుత్వాన్ని పెంచుకోవడం విపరీతధోరణి అవుతుంది. న్యూటకి,
లీబ్నిజ్ కి మధ్య పదే పదే జరిగిన సంవాదాలతో
న్యూటన్ బాగా విసిగిపోయాడు. ఒక దశలో శాస్త్రవేత్తల సమాజం నుండి దూరంగా ఏకాంతవాసంలో
మునిగిపోయాడు న్యూటన్.
అయితే రామానుజన్
విషయంలో అవతలి వారు తన గురించి ఏమనుకుంటున్నారు అన్న విషయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం,
అవతలి వారు ఏమైనా అంటే సులభంగా నొచ్చుకోవడం మొదలైనవన్నీ కేవలం సాంఘిక రంగానికే పరిమితం.
గణిత రంగంలో మాత్రం ‘ఊరంతటిదీ ఒక దారైతే…’ అన్నట్టే ఉండేవాడు. సమస్య పాతదే అయినా తనకంటూ
ఓ కొత్త మార్గాన్ని ఏర్పరచుకుని ఆ దారిలో పురోగమించి ఆశ్యర్యకరమైన ఫలితాలు సాధించేవాడు.
ఈ రంగంలో మాత్రం అన్యులు ఏర్పాటు చేసిన బాటలో నడవాలని అనుకునేవాడు కాడు.
కుంభకోణంలో చదువు
పూర్తయ్యాక 1906 లో రామానుజన్ చెన్నై లో పచ్చయ్యప్పార్ కాలేజిలో
చేరాడు. కాలేజిలో చేరిన తొలిరోజుల్లోనే రామానుజన్ పరిస్థితిలో సత్పరిమాణాలు కనిపించాయి.
కాలేజిలో తనకి పరిచయమైన ఓ లెక్కల టీచరు తన
నోట్సు పుస్తకాలు చూపించాడు. అవి చూసి అదిరిపోయిన లెక్కల టీచరు వాటిని కాలేజి ప్రిన్సిపాలు
కి చూపించాడు. అవి చూసిన ప్రిన్సిపాలు రామానుజన్ ప్రతిభ గుర్తించి వెంటనే పాక్షిక పారితోషకం
మంజూరు చేశాడు.
అదే కాలేజిలో
ఎన్. రామానుజాచారియర్ అనే మరో లెక్కల టీచర్
తో కూడా రామనుజన్ పరిచయం, సాన్నిహిత్యం పెరిగింది. రామానుజన్ సత్తా మీద ఈయనకి
బాగా గురి కుదిరింది. క్లాసులో కొన్ని సార్లు ఈయన బోర్డు మీద చాంతాడంత లెక్కలు చేసేవాడు.
రామానుజన్ లేచి నించుని అదే లెక్కని రెండు మూడు మెట్లలో ఎలా చెయ్యాలో చెప్పేవాడు. కొద్దిగా
చెముడు ఉన్న టీచరు కాస్త ముందుకి వంగి, చెవి క్లాసుకి ఒప్పజెప్పి, “ఏవంటావ్ రామానుజన్?”
అని అడిగేవాడు. సముద్రాన్ని లంఘించిన పవనకుమారుడిలా అంత పొడవాటి లెక్కని మూడు అంగల్లో
దాటే రామానుజన్ సత్తా చూసి తోటి విద్యార్థులు నోరెళ్లబెట్టేవారు.
(ఇంకా వుంది)
0 comments