ఒక యోగి ధ్యానముద్రలో మునిగిపోయినట్టు ఒళ్ళో ఓ పెద్ద
పలక పెట్టుకుని, బాసీపట్టు వేసుకుని ఇంటి వరండాలో కూర్చుని తన గణితసాధనలో నిమగ్నమైపోయేవాడు.
ఏవేవో గణిత సంకేతాలు, చిహ్నాలు, అంకెలు, సమీకరణాలు, అసమీకరణాలు ఆ పలక నిండా కిక్కిరిసిపోయేవి.
ఆ పలక నాలుగు మూలల మధ్య సంఖ్యా శాస్త్రపు నలుమూలలని తడిమేవాడు. అందరికీ తెలిసిన సమస్యతో
మొదలైనా ఎవరికీ తెలీని ఏవో విచిత్ర మార్గాల వెంట ముందుకు సాగి వాటిని వినూత్న రీతుల్లో
పరిష్కరించేవాడు. అలాంటి ప్రయాసలో ఏకంగా కొత్త కొత్త గణిత విభాగాలే సృజించబడేవి. ఈ
గణిత ధ్యానంలో గంటలు తెలీకుండా గడిచిపోయేవి. ఇక పరసరాల మీద ధ్యాసే ఉండేది కాదు. ఒక్కొక్క
సారి ఇంట్లో తోచకపోతే గుళ్లో మంటపంలో కూర్చుని గణిత సాధన సాగించేవాడు.
పలక మీద ఒలకబోసిన
ప్రతిభకి ఆయుర్దాయం తక్కువని గుర్తించాడో ఏమో ఒక దశలో పలక పక్కన బెట్టి నోట్సు పుస్తకాలలో రాత మొదలెట్టాడు.
ఆ నోట్సులే ప్రస్తుతం ‘రామానుజన్ నోట్ బుక్స్’
గా, ఓ గొప్ప వరప్రసాదంగా మనకి సంక్రమించాయి. ఈ వ్యాసంగం 1907 దరిదాపుల్లో
పచ్చయ్యప్పార్ కాలేజిని వొదిలిపెట్టిన కొద్దికాలానికి మొదలయ్యింది. వాటిలో మొట్టమొదటి
నోట్సు పుస్తకం లో రెండొందల పేజీలు ఉన్నాయి. పేజీ పేజీ లోను అతి జ్యామితిక శ్రేణులు
(hypergeometric series), అవిచ్ఛిన్న భిన్నాలు (continued fractions), singular moduli మొదలైన అధునాతన గణిత శాస్త్ర విశేషాల మీద కొత్త
కొత్త ఫలితాలు, సిద్ధాంతాలు నింపబడి వున్నాయి. “ఏదో చిత్రమైన ఆకుపచ్చ సిరా” తో రాయబడింది
ఆ నోట్సు అని ఎవరో అన్నారు.
అయితే ఈ మొట్టమొదటి
నోట్సు పుస్తకంలో విషయాలు సామాన్యుల విషయం పక్కన పెడితే, పండితులకే మింగుడుపడకుండా
ఉన్నాయని అనిపించి ఆ తరువాత ఆ మొదటి నోట్సుని పలు విభాగాలుగా, అధ్యాయాలుగా విభజించి
ప్రతీ విభాగం మీద విపులమైన వ్యాఖ్యానం చేస్తూ మరింత సులభంగా అర్థమయ్యేలా రాశాడు రామానుజన్.
ప్రతీ అధ్యాయంలోను సరళమైన సిద్ధాంతాలతో మొదలుపెట్టి క్రమంగా మరింత జటిలమైన సిద్ధాంతాలని
పేర్కొంటూ, సిద్ధాంతాలని అంకెలతో సూచిస్తూ, ఆ అంకెలని విషయసూచికలో పేర్కొంటూ, తొలి
రచనలని సరళీకరించాడు.
తొలి దశలలో పేజీకి
కుడి పక్కన మాత్రమే రాస్తూ ఎడమ పక్క ఖాళీగా వొదిలేసేవాడు. అదనపు వ్యాఖ్యానికి సందర్భాన్ని
బట్టి ఎడమ పక్కని వాడుకునేవాడు. కాని త్వరలోనే ఆ నియమానికి తిలోదకాలు వొదిలేశాడు. ఇరు
పక్కలా గణిత సంకేతాలు నిండిపోసాగాయి. అదీ చాలనట్టు కొన్ని సార్లు పేజీ అంచులలో కూడా
గణిత చిహ్నాలని దట్టించసాగాడు. ఎడమ నుండి కుడికి రాసే సాంప్రదాయాన్ని గాలికి వొదిలేశాడు.
పైనుండి కిందకి, కింది నుండి పైకి ఇలా ఆ పేజీలలో గణితం కట్టలు తెంచుకుని ప్రవహించింది. ప్రశాంత గణిత గంగా ప్రవాహం చెలియలికట్టని ఉల్లంఘించి
పొలాలని ముంచెత్తింది.
ఊరికే మౌనంగా
వరండాలో స్తంభానికి ఆనుకుని కూర్చున్న వేళ మనసులో మెరుపులా ఏదో ఆలోచన వస్తుంది. వెంటనే
తన నోట్సు పుస్తకం తెచ్చుకుని లోనుండీ తన్నుకొస్తున్న గణితసంపదని ఆదరాబాదరాగా అందులో పూరిస్తాడు. అలాంటి పరిస్థితుల్లో
సృజన చేస్తున్నప్పుడు పూర్తిగా ప్రణాళికా బద్ధంగా
పుస్తక రచన చెయ్యడానికి వీలుపడదు. ఓ పాఠ్యపుస్తక రచనకి పూనుకున్న లెక్కల పండితుడికి
మల్లె ముందే అధ్యాయాల వారీగా తను రాయదలచుకున్న విషయాలని నీటుగా క్రోడీకరించుకుని సిద్ధాంతాలని,
ఉదాహరణలని, సమస్యలని వరుసక్రమంలో పేర్చే అవకాశం రామానుజన్ విషయంలో తక్కువ. అది నాలుగు రోజా మొక్కలతో, రెండు చేమంతి మొక్కలతో,
ఓ మల్లె పందిరితో ఇంపుగా తీర్చిదిద్దిన పెరటి తోట కాదు. శాఖోపశాఖలుగా విచ్చలవిడిగా
పెరిగిన అపారమైన వృక్ష ఫల పుష్ప సంపత్తితో కిటకిటలాడే గణిత నందనవనమది.
(ఇంకా వుంది)
అది నాలుగు రోజా మొక్కలతో, రెండు చేమంతి మొక్కలతో, ఓ మల్లె పందిరితో ఇంపుగా తీర్చిదిద్దిన పెరటి తోట కాదు. శాఖోపశాఖలుగా విచ్చలవిడిగా పెరిగిన అపారమైన వృక్ష ఫల పుష్ప సంపత్తితో కిటకిటలాడే గణిత నందనవనమది.
చాలా బాగుంటుంది మీ వర్ణణ గురువుగారూ!...
మీ అనువాద పుస్తకాలను వీలుంటే ,దయచేసి పంపుతారా గురూజీ!?.
మా తమ్ముడు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు.అతనికి శాస్త్ర విజ్ఞానము పైన ఆసక్తి మెండు.పిల్లలకు అర్థమయ్యే విధంగా బోధించడానికి చాలా తపన పడుతుంటాడు.నన్ను సైన్సు సులభంగా అర్థమయ్యే పుస్తకాలను గూర్చి అడిగితే మీరు వ్రాసిన రచనలు బాగా అర్థం అవుతాయని చెప్పాను.మీరు అవునంటే ఆతని విలాసాన్ని పంపుతాను.