పచ్చయ్యప్పార్
కాలేజిలోనే సింగారవేలు ముదలియార్ అనే ఓ సీనియర్ లెక్కల ప్రొఫెసరు ఉండేవారు. ఈయన ప్రఖ్యాత
గణిత పత్రికలలో అచ్చయ్యే సమస్యలు తెచ్చి రామానుజన్ కి చూపించి, వాటి పరిష్కారాలు కనుక్కోమని
ప్రోత్సహించేవారు. కొన్ని సార్లు లెక్క తెగకపోతే ఆ లెక్కని తెచ్చి శిష్యుడు గురువుకి
చూపించేవాడు. శిష్యుడికి రాని లెక్క గురువుకి కూడా మింగుడు పడేది కాదు.
క్రమంగా పచ్చయ్యప్పార్
కాలేజిలో కూడా రామానుజన్ యొక్క గణిత మేధస్సుకి గుర్తింపు పెరిగింది. అయితే కుంభకోణంలో
అనుభవానికి ఇక్కడ అనుభవానికి ఒక విధంగా పెద్దగా తేడా లేకపోయింది. ప్రభుత్వకాలేజిలో
కూడా గణితంలో ఓ వెలుగు వెలిగినా ఇంగ్లీష్ లో వెనుకబడడం వల్ల సమస్యలు తలెత్తాయి. ఈ కొత్త
కాలేజిలో ఇంగ్లీష్ సమస్య కాలేదు గాని ఇంగ్లీష్ కి బదులు ‘జీవక్రియా శాస్త్రం’
(physiology) రామానుజన్ పాలిటి గుదిబండ అయి
కూర్చుంది.
శుద్ధ శాకాహారి
అయిన రామానుజన్ కి జంతు శరీరాల అంగాంగ నిర్మాణం గురించి తెలుసుకోవడం రోత పుట్టించేది.
పోనీ ఊరికే సైద్ధాంతికంగా ముక్కునబట్టి ఆ సమాచారం అంతా పరీక్షల్లో ఒలకబోసి, అయింది
అనిపించడానికి లేదు. జంతు కళేబరాల మీద ప్రయోగాలు చేసి, పరిచ్ఛేదాలు చేసి తెలిసిన పరిజ్ఞానాన్ని
ప్రదర్శించాలి. ఆ పరిచ్ఛేదాలు ఎలా చెయ్యోలో పాఠ్యపుస్తకం సవివరంగా వర్ణించేది.
“అప్పుడే ప్రాణము
పోయి, ఇంకా చర్మము వొలవని ఓ కుందేటి కళేబరాన్ని ముందుగా సమకూర్చుకోవలెను. శవమును బోర్డు మీద వెల్లకిలా పడుకోబెట్టవలెను. నాలుగు కాళ్లను మేకులతో బోర్డుకి కొట్టి శవమును
కదలకుండా స్థిరపరచవలెను. ఇప్పుడు ఓ చిన్న పదునైన కత్తిని, ఓ కత్తెరను తీసుకుని అతి
సున్నితముగా…”
ఇలాంటి వర్ణనలు
చదువుతున్న రామానుజన్ కి ఒంటి మీద తేళ్లు జెర్రులు పాకుతున్నట్టు ఉండేది.
గణితంలో అంత
లోతైన పరిజ్ఞానం వున్నా తక్కిన వైజ్ఞానిక విభాగాలతో పెద్దగా పరిచయంగాని, వాటి మీద ఆసక్తి
గాని లేకపోవడం ఒక సమస్య అయితే, మాంసాహారాన్ని నిషేధించే సాంప్రదాయం మరో సమస్య. పైగా శరీరం యొక్క అంతరంగ నిర్మాణం గురించి
గతంలో యోగ సాహిత్యంలో కొన్ని విషయాలు చదివి వున్నాడు. మానవ శరీరంలో కొన్ని ‘నాడు’లు
ఉంటాయని, ఆ నాడులు చైతన్య కేంద్రాలైన కొన్ని ‘చక్రాల’ని కలుపుతాయని విన్నాడు. అన్నిటికన్నా
అడుగున ఉన్న చక్రంలో కుండలిని అన్న పేరు గల ఓ శక్తి నిద్రాణ స్థితిలో ఉంటుందని, యోగ
సిద్ధి కలిగినప్పుడు ఆ శక్తి సర్పంలా జరజర పాకుతూ నాడుల ద్వారా పైకి పోతుందని – ఇలా
గతంలో యోగ సాహిత్యంలో తను చదివిన ఏవేవో విషయాలు తన మనసు మెదులుతున్నాయి. ఇక్కడ గురువులు
చెప్పే శరీర నిర్మాణానికి గతంలో తను చదువుకున్న యోగ సాహిత్యానికి ఎక్కడా పొంతన కుదరడం
లేదు. ఆధునిక నాడీ విజ్ఞానానికి (neuroscience), యోగ సాహిత్యంలో చెప్పే నాడీవిజ్ఞానాన్కి
ఎక్కడా సంబంధం లేదని అతడికి తెలీదు. ఓ సారి జీవశాస్త్రానికి చెందిన ప్రయోగశాలలో ఓ ప్రొఫెసరు
కప్ప కళేబరాన్ని పరిచ్ఛేదించి అందులోని అవయవాలని ప్రదర్శిస్తున్నాడు. ‘మరి అందులో ఓ
పాము ఉండాలే, ఏదీ?’ అని అమాయకంగా అడిగాడట రామానుజన్.
మొత్తం మీద ఈ
అనుభవాల వల్ల రామానుజన్ కి జీవక్రియా శాస్త్రం మీద ముందే ఉన్న ఏవగింపు భావం కాస్తా
గాఢమైన జుగుప్సగా మారిపోయింది. అందుకేనేమో,
ఒక సారి జీర్ణమండలం మీద పరీక్ష రాయాల్సి వచ్చినప్పుడు, పరీక్షా పత్రంలో కేవలం నాలుగు
మాటలు మాత్రం రాసి బయటిక్కొచ్చాడట – “జీర్ణమండలం మీద అధ్యయనం నాకు జీర్ణం కాలేదనడానికి
ఇది నిదర్శనం.”
ఆ విధంగా లెక్కల్లో
నూటికి నూరు కన్నా ఎక్కువ వచ్చినా జీవక్రియా శాస్త్రంలో పట్టుమని పది శాతం కూడా రాలేదు.
మిగతా సబ్జెక్ట్ లలో కూడా మార్కులు ఆకాశాన్నంటకపోయినా గౌరవప్రదంగానే ఉన్నాయి. జీవక్రియా
శాస్త్రంలో తప్పడం వల్ల 1906 లో ఎఫ్. ఏ. పరీక్ష
లో తప్పాడు. మరుసటేడు కూడా పరీక్ష రాశాడు. మళ్లీ తప్పాడు.
కుంభకోణంలో జరిగిన
పరాభవమే మళ్లీ జరిగింది. లెక్కల్లో రామానుజన్ ప్రతిభని కాలేజి నిస్సందేహంగా గుర్తించింది.
పట్టం మాత్రం ఇవ్వనని మొరాయించింది.
పారితోషకం రద్దు
కావడం, పరీక్షల్లో తప్పడం, పట్టా చేజారిపోవడం – వీటి వల్ల రామనుజన్ జీవితం దుర్భరం
అయిపోయింది. కొడుకు చదువు తండ్రికి తలకి మించిన భారం అయిపోయింది. చీరల అంగడిలో గుమాస్తాగా
పని చేసే తండ్రికి నెలకి ఇరవై రూపాయలకి మించి
వచ్చేవి కావు. ఉన్న ఇంట్లో ఒక వాటా అద్దెకి ఇచ్చేవారు. దాంతో మరో పదో పరకో వచ్చేవి.
తల్లి గుళ్ళో పాటలు పాడి మరో నాలుగు డబ్బులు తెచ్చేది. ఈ ఆదాయంతో ఇల్లు గడవడం కష్టమయ్యేది.
దారిద్ర్య రేఖకి అతి దగ్గరగా జీవితం భారంగా సాగేది.
రామానుజన్ ఆర్థిక
పరిస్థితిని కాలేజిలో తన మిత్రులు గమనించి అడపాదపా సహాయం చేసేవారు. ఒకసారి కాలేజికి
వెళ్ళడానికి ‘ట్రామ్’ ఎక్కబోతుంటే గాలికి టోపీ ఎగిరిపోయింది. రామానుజన్ కి సంస్కృతం
చెప్పే లెక్చరరుకి తన క్లాసులో పిల్లలు తమ పిలకలు కనిపించకుండా టోపీ పెట్టుకు రావాలని
ఓ నియమం పెట్టాడు. టోపీ లేకుండా క్లాసుకు వచ్చిన రామానుజన్ ని పిలిచి వెంటనే బజారుకి
వెళ్లి టోపీ కొనుక్కు రమ్మన్నాడు. టోపీ కొనుక్కోవడానికి నాలుగు అణాలు కూడా లేవని క్షమాపణ
కోరాడు రామానుజన్. తన దుస్థితిని గుర్తించిన తోటి విద్యార్థులు సహాయం చేసి గండం గట్టెక్కించారు.
కాలీజి చదువు
అచ్చి రాక కుంభకోణానికి తిరిగొచ్చిన రామానుజన్
కి గడ్డు కాలం తీరలేదు. ఆకలిబాధ శ్రుతి మించితే కొన్ని సార్లు పొరుగుననే ఉన్న ఓ అవ్వ
పిలిచి ఇంత బువ్వ పెట్టేది. అప్పూడప్పుడు ఎస్.
ఎమ్. సుబ్రమణియన్ అనే స్నేహితుడు ఇంటికి ఆహ్వానించి ప్రేమగా రెండు దోసెలో, ఇడ్లీలో
తినిపించేవాడు. ఎదిగిన కొడుకు ఇంట్లో కూర్చుని తినడం భావ్యం కాదని రామానుజన్ నాలుగు
డబ్బులు సంపాదించాలని సంకల్పించాడు. విశ్వనాథ శాస్త్రి అనే పిల్లవాడికి నెలకి ఏడు రూపాయల
వేతనానికి ట్యూషన్ చెప్పడానికి ఒప్పుకున్నాడు. ఊరికి అవతలి చివర ఉన్న విశ్వనాథుడి ఇంటికి
వెళ్లి ఆల్జీబ్రా, జ్యామెట్రీ, త్రికోణమితి మొదలైన అంశాల మీద పాఠం చెప్పేవాడు.
ఈ బోధన కాస్త
విడ్డూరంగా ఉండేది. ఆ పాఠంలో పుస్తకం నుండి తీసుకున్నది తక్కువ, పుస్తకంలో లేనిది ఎక్కువగా
ఉండేది. ఏదైనా సమస్య ఎలా చెయ్యాలో విశ్వనాథుడికి అర్థం కాకపోతే, మర్నాడు మరో కొత్త
పద్ధతి చెప్పేవాడు గురువు. అది మర్చి పోతే ఆ మర్నాడు మరో పద్ధతి. ఇలా నానాటికి కొత్త
కొత్త పధ్ధతులతో నిత్య నూతనంగా సాగేది బోధన. కొన్ని సార్లు లెక్కల పాఠం కాస్తా తత్వ
చింతనలోకి దిగేది. “చూడడానికి, అర్థం చేసుకోడానికి అసలు ఎవరూ లేని తొలి దశలలో విశ్వం
ఎలా ఉండేది?” అని అడిగేవాడు. పాఠంతో సంబంధం లేకుండా సాగే ఈ వ్యవహారం విశ్వనాథ శాస్త్రికి
స్ఫూర్తి దాయకంగానే ఉండేది కాని మరి కొందరు శిష్యులకి నచ్చేది కాదు. “ఏంటో ఎప్పుడు
చూసినా, అనంతరాశుల గురించి అత్యల్ప రాశుల గురించి మాట్లాడేవాడు. ఈ పాఠానికి నా పరీక్షకి
మధ్య లంకె కనిపించలేదు. అందుకే మానేశాను,” అన్నాడు మరో ట్యూషన్ శిష్యుడు.
దాంతో కథ మళ్ళీ
మొదటికొచ్చింది. పారితోషకం పోయింది. పట్టం పోయింది. పట్టు మని నాలుగు రూపాయలు సంపాదించే అవకాశాన్నిచ్చిన
ట్యూషన్లు కూడా అందిరాకుండా పోయాయి.
ఇక రోజంతా ఏ
పనీ ఉండదు. మిగతావన్నీ చేజారిపోయినా ఇప్పుడు చేతుల నిండా తీరిక వుంది. ఆ తీరికని సద్వినియోగం
చేసుకోవాలనుకున్నాడు.
గణిత ప్రపంచంలోకి
ఏకాంత సాహస యాత్ర మీద బయల్దేరాడు.
(ఇంకా వుంది)
0 comments