అధ్యాయం 8
ఆస్తవ్యస్తంగా
మూలకాలు
పందొమ్మిదవ శాతాబ్దానికి
చెందిన కర్బన రసాయన చరిత్రకి, అకర్బన రసాయన చరిత్రకి మధ్య లోతైన పోలికలు ఉన్నాయి. ఆ
శతాబ్దపు తొలి దశలలో కర్బన రసాయనాల సంఖ్య పెరుగుతూ వచ్చింది. అలాగే మూలకాల సంఖ్య కూడా
పెరుగుతూ వచ్చింది. ఆ శతబ్దంలో ఐదవ, ఏడవ దశకాల మధ్య కాలంలో కేకులే అందించిన సూత్రాల
పుణ్యమా అని కర్బన రసాయనాలని ఒక క్రమంలో ఏర్పాటు చెయ్యడానికి వీలయ్యింది. అలాగే మూలకాలని
కూడా ఒక క్రమంలో ఇమడ్చడానికి వీలయ్యింది. ఈ పరిణామాలకి కారణభూతమైన సంఘటనలలో ఓ అతిముఖ్య
సంఘటన రసాయన శాస్త్రవేత్తలు ఏర్పటు చేసుకున్న ఓ ప్రముఖ అంతర్జాతీయ సమావేశం.
ఆ కథ గురించి
చెప్పుకోబోయే ముందు శతాబ్దపు ఆరంభంలో ఉండే అల్లకల్లోల పరిస్థితితో మొదలుపెడదాం.
ప్రాచీనులకి
తెలిసిన తొమ్మిది మూలకాల గురించి, మధ్యయుగపు పరుసవేదులకి తెలిసిన నాలుగు మూలకాల గురించి
ఈ పుస్తకం ఒకటవ భాగంలో నాలుగవ అధ్యాయంలో చెప్పుకున్నాం. వాయురూపంలో ఉండే మూలకాలైన నైట్రోజన్,
హైడ్రోజన్, ఆక్సిజన్, క్లోరిన్ లు పద్దెనిమిదవ శతాబ్దంలోనే కనుగొనబడ్డాయి. అలాగే లోహాలైన
కోబాల్ట్, ప్లాటినమ్, నికెల్, మాంగనీస్, టంగ్‍స్టన్, మాలిబ్డినమ్, యురేనియమ్, టైటేనియమ్,
క్రోమియమ్ లని కూడా ఆ శతాబ్దంలోనే కనుక్కున్నారు.
పందొమ్మిదవ శతాబ్దపు
తొలి దశకంలోనే పద్నాలుగు కొత్త మూలకాలు అంతవరకు తెలిసిన మూలకాల పట్టికకు తోడయ్యాయి. ఈ పుస్తకంలో (మొదటి
భాగంతో కలుపుకుని) పేర్కొన్న రసాయన శాస్త్రవేత్తలనే తీసుకుంటే విద్యుత్ విశ్లేషణా పద్ధతితో డేవీ ఆరు మూలకాలని
శుద్ధి చేశాడు. గే-లుసాక్ మరియు థెనార్ లు బోరాన్ ని (boron) శుద్ధి చేశారు. వొలాస్టన్
పలాడియమ్ ని (palladium), రోడియమ్ ని
(rhodium) శుద్ధి చేశాడు. బెర్జీలియస్ సీరియమ్ (cerium) ని కనుక్కున్నాడు.
అలాగే బ్రిటిష్
రసాయన శాస్త్రవేత్త స్మిత్సన్ టెనంట్
(1761-1815) (వొలాస్టన్ ఇతడి వద్దనే అనుచరుడిగా పని చేశాడు) ఆస్మియమ్ (osmium) ని,
ఇరిడియమ్ (iridium) ని కనుక్కున్నాడు. చార్లెస్ హాచెట్ (1765-1847) అనే మరో బ్రిటిష్
శాస్త్రవేత్త కొలంబియమ్ (columbium) ని శుద్ధి
చేశాడు. దీన్నే ఇప్పుడు సాధికారికంగా నియోబియమ్ (niobium) అంటున్నారు. ఆండర్స్ గస్టాఫ్
ఎక్బర్గ్ (1767-1813) అనే స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త టాంటలమ్ ని కనుక్కున్నాడు.
తదుపరి దశకాలలో
వచ్చిన ఫలితాలు అంత ఘనంగా లేకపోయినా మూలకాల సంఖ్య మాత్రం పెరుగుతూనే వుంది. బెర్జీలియస్
మరి నాలుగు మూలకాలు కనుక్కున్నాడు. అవి – సిలీనియమ్ (selenium), సిలికాన్ (silicon),
జిర్కోనియమ్ (zirconium), థోరియమ్ (thorium).
1797 లో లూయీ నికొలాస్ వాక్వెలిన్ బెరీలియమ్ (beryllium) ని కనుక్కున్నాడు.
1830 కల్లా యాభై ఐదు విభిన్న మూలకాలు కనుక్కోబడ్డాయి.
ఇన్ని మూలకాలని అధ్యయనం చేసి వాటి లక్షణాలని ఏకరువు పెట్టడం రసాయన శాస్త్రవేత్తలకి
తలకి మించిన భారం అయ్యింది. మూలకాల లక్షణాలలో గొప్ప వైవిధ్యం కనిపించింది. వాటి లక్షణాలలో
ఒక అమరిక, క్రమం లోపించసాగింది. అసలు అన్ని మూలకాలు ఎందుకు ఉన్నాయి? కనుక్కోవలసినవి
ఇంకెన్ని వున్నాయి? పదా? వందా? వెయ్యా? అనంతమా?
తెలిసిన మూలకాలలో
ఒక క్రమాన్ని వెతకడం సహజమే. ఆ క్రమం ఏమిటో తెలిస్తే అప్పుడు అన్ని మూలకాలు ఎందుకు ఉన్నాయో
అర్థమవుతుందేమో? అప్పుడు వాటి లక్షణాలలో అంత వైవిధ్యం ఎందుకు వుందో అర్థం అవుతుందేమో?
(ఇంకా వుంది)
0 comments