గుర్తు తెలియని అనారోగ్యం
అనారోగ్యానికి కారణం మొదట్లో
గాస్ట్రిక్ అల్సర్ అనుకున్నారు వైద్యులు. ఒక దశలో అందుకు శస్త్ర చికిత్స కూడా అవసరం
అనుకున్నారు.
అనారోగ్యానికి కారణం కాన్సర్
కావచ్చని మరో డాక్టర్ అభిప్రాయపడ్డాడు. ఇండియాలో ఉన్నప్పుడు ఒక సారి రామానుజన్ కి హైడ్రోసీల్
ఆపరేషను జరిగింది. ఆ ఆపరేషన్ జరిగినప్పుడు నిజానికి అందులో ఉన్న ట్యూమర్ తొలగించబడిందని, అందులో మిగిలిన కొన్ని కాన్సర్
కణాలు ఇప్పుడు శరీరంలో ఇతర అంగాలకి పాకాయి అన్నాడు.
లెడ్ పాయిజనింగ్ కూడా ఒక
కారణం అని సూచించబడింది. రామనుజన్ టిన్నులలో భద్రపరచబడ్డ కూరగాయలు తెప్పించుకుని తినేవాడు.
ఆ కూరగాయలని ఆ టిన్నులలోనే ఉంచి నేరుగా పొయ్యి మీద పెట్టి ఉడికించేవాడు వంటవాడు. అలాంటి
ప్రక్రియ వల్ల టిన్నులకి పైన సోల్డరింగ్ చెయ్యబడ్డ సీసం కరిగి కూరగాయలలోకి ప్రవేశించి
ఉండొచ్చు.
ఇలా రామానుజన్ అనారోగ్యం
విషయంలో ఎన్నో సిద్ధాంతాలు ప్రతిపాదించబడ్డాయి. చివరికి అతడి సమస్య టీ.బీ. అన్న ఉద్దేశంతో
టీబీ కి సంబంధించిన చికిత్స చేశారు. రామానుజన్ కి టీబీ సోకడానికి కారణాలలో ఒకటి విటమిన్
డి లోపం అన్నారు. సూర్యరశ్మి సహాయంతో శరీరం విటమిన్ డి తయారు చేసుకుంటుంది. బాగా ఉత్తరంగా
ఆర్కిటిక్ వృత్తానికి దగ్గరగా ఉండే కేంబ్రిడ్జ్ ప్రాంతంలో ఎక్కువ సమయం మబ్బేసి వుంటుంది.
అది చాలనట్టు రామానుజన్ ఎక్కువగా బయటికి వెళ్లేవాడు కాడు. తన గదిలోనే ఉంటూ రాత్రిళ్ళు
పని చేసుకుంటూ, పగలు నిద్రపోతూ రోజులు గడిపేవాడు. అలా సూర్యరశ్మి ఎక్కువగా సోకకుండా
సాగిన జీవన విధానం కూడా టీబీ సోకడంలో దొహదం చేసి వుండొచ్చు.
1913 లో ఇంగ్లండ్ వచ్చిన రామానుజన్ మొదట్లో రెండేళ్లలో
ఇండియాకి తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నాడు. పారితోషకం మరో రెండేళ్ళకి పొడిగింపబడినందున
మరింత కాలం ఇంగ్లండ్ లోనే ఉండిపోయాడు. ఈ మధ్యలో ప్రపంచ యుద్ధం మొదలయ్యింది. జర్మన్
సబ్మరిన్ లు (యూ-బోట్ లు) సముద్రాలలో గస్తీ కాసి బ్రిటిష్ ఓడలని నడి సముద్రంలో ముంచేస్తున్నాయన్న
భయం వల్ల రామానుజన్ ఇండియా యాత్రని వాయిదా వేశాడు. ఇంతలో 1917 లో అనారోగ్యం వచ్చి పడింది.
రామానుజన్ కి టీబీ సోకిందని
డాక్టర్లు నిర్ణయించిన మొదట్లో తనని మెండిప్ హిల్స్ సానటోరియం అనే ఆసుపత్రిలో చేర్చారు.
అక్కడి నుండి త్వరలోనే మాట్లాక్ హౌస్ సానటోరియం అనే చోట చేర్చారు. మాట్లాక్ హౌస్ లో
తనకి ఇచ్చిన సౌకర్యాలు రామానుజన్ ని ససేమిరా నచ్చలేదు. గదిలో విపరీతంగా చలిగా ఉండేది.
చలి కాచుకోడానికి గదిలో మంట పెట్టుకునే అవకాశం ఉండేది కాదు. ఉహుహూ అని వణుకుతూ ఓ మూల
కూర్చునేవాడు. దీనికి కారణం ఆసుపత్రి అధికారుల నిర్లక్ష్యమో, నిర్దాక్షిణ్యమో కాదు.
ఆ రోజుల్లో టీబీకి చికిత్సగా రోగిని తగినంత చలిలో ఉంచాలని ఓ నమ్మకం ఉండేది. దాని వల్ల
రోగం నయమయ్యిందో, మరింత వికటించిందో తెలీని పరిస్థితి నెలకొంది.
తదనంతరం రామానుజన్ ని లండన్
నడిబొడ్డులో ఉన్న ఓ చిన్న ఆసుపత్రికి మర్చారు. ఫిట్జ్ రాయ్ హౌస్ అనే ఈ ఆసుపత్రిలో ఎంతో
మంది నిపుణులు వచ్చి చూశారు. రామానుజన్ అనారోగ్యానికి కారణం ఏమిటో కచ్చితంగా తెలీకుండా
వుంది. తీవ్రంగా జ్వరం వచ్చి తొందరగా తగ్గిపోయేది. పొట్టలో తీవ్రమైన నొప్పి పుట్టేది
కాని దానికి కారణం ఏమిటో తెలిసేది కాదు.
ఇంచుమించు ఈ కాలంలోనే హార్డీ
పడ్డ ప్రయాసల వల్ల రామానుజన్ కి ‘ఫెలో ఆఫ్
రాయల్ సొసయిటీ’ గౌరవం దక్కింది. బ్రిటన్ లోనే
కాక అంతర్జాతీయంగా కూడా అతి గొప్ప వైజ్ఞానిక సదస్సు అయిన ‘రాయల్ సొసయిటీ’లో సభ్యత్వం
పొందడం నిజంగా గొప్ప విజయమే.
1918 లో యుద్ధం ముగిసింది.
రామానుజన్ ఆరోగ్యంలో పెద్దగా మార్పులేదు. యుద్ధం
ముగిశాక రామానుజన్ ని ఫిట్జ్ రాయ్ హౌస్ నుండి కోలినెట్ హౌస్ అనే ఆసుపత్రికి తరలించారు.
మాట్లాక్ హౌస్ లో ఉన్నప్పుడు ఎక్కువగా అతిథులు వచ్చేవారు కారు. కనుక ఒంటరితనాన్ని అనుభవించేవాడు.
కాని కోలినెట్ హౌస్ లో పరిస్థితులు వేరు. హార్డీ తరచు వచ్చి చూసిపోతుండేవాడు.
ఒకసారి అలాగే హార్డీ లండన్
నుండి టాక్సీలో రామానుజన్ ని చూడడానికి వచ్చాడు. ఆ టాక్సీ నంబరు 1729 అని గమనించాడు హార్డీ. ఆసుపత్రిలో మంచం మీద నిస్తేజంగా
పడి వున్న రామానుజన్ ని చూసి నీరుగారిపోయాడు. ఇక ఏం మాట్లాడాలో తెలీక వచ్చిన టాక్సీ
నెంబరు చెప్పి, ఆ సంఖ్య అంత మంచి సంఖ్య లాగా అనిపించలేదన్నాడు. అదేదో దుశ్శకునం కాకూడడని
ఆశిస్తున్నా నన్నాడు.
అందుకు రామానుజన్ నీరసంగా
నవ్వి, “లేదు హార్డీ. అది చాలా ఆసక్తికరమైన సంఖ్య. రెండు ఘన సంఖ్యల కూడికగా రెండు విభిన్న
రీతులుగా వ్యక్తం చెయ్యదగ్గ అతి చిన్న సంఖ్య అది,” అన్నాడు. హార్డీ నిశ్చేష్టుడయ్యాడు.
శరీరం తీవ్రమైన అస్వస్థతకి
గురైనా రామానుజన్ బుద్ధి యొక్క పదునులో మాత్రం ఏ మార్పూ లేదు. 1729 అన్న సంఖ్య మాట వినిపించగానే, ఆ సంఖ్యా లోకపు సామ్రాట్టు
మనసులో ఆ సంఖ్య పుట్టు పూర్వోత్తరాలన్ని మెదిలి వుంటాయి. ఈ విధంగా రెండు ఘన సంఖ్యల
కూడికగా రెండు రకాలుగా వ్యకం చెయ్యొచ్చని వెంటనే గుర్తించాడు.
1729 = 103 +
93 = 123 + 13.
(ఇంకా వుంది)
శ్రీనివాస్ గారూ,
ఈ టపా శీర్షిక సరిగా రాలేదు. "1729 = 103 + 93 = 123 + 13." అని రావటం బాగుండదు. 1729 = 10^3 + 9^3 = 12^3 + 1^3 అని కాని క్యూబ్ అన్న పదం వాడి కాని సరిచేయండి. లేకుంటే చదివే వారికి చాలా తికమకగా ఉంటుంది.
అవును నిజమే. అశ్రద్ధగా కట్ పేస్ట్ చెయ్యడం వల్ల చూసుకోలేదు. క్షమించాలి!
మరి ఇప్పుడయినా కరెక్ట్ చేస్తే బాగుంటుంది కదా చక్రవర్తి గారూ?