కాని రెండవ ప్రపంచ
యుద్ధ నేపథ్యంలో పెచ్చరిల్లిపోతున్న అంటువ్యాధులని అరికట్టే అవసరం ఏర్పడటంతో ఈ సమస్య
మీద మళ్లీ కొత్తగా ధ్వజం ఎత్తారు. ఆస్‍ట్రియన్-ఇంగ్లీష్ పెథాలజిస్ట్ అయిన హవర్డ్ వాల్టర్
ఫ్లోరీ (1898-1968) మరియు జర్మన్-ఇంగ్లీష్ బయోకెమిస్ట్ అయిన ఎర్న్‍స్ట్ బోరిస్ చెయిన్
(1906-1979) ల నేతృత్వంలో జరిగిన పరిశోధనా ప్రయత్నంలో పెన్సిలిన్ ని శుద్ధి చేసి, దాని
అణువిన్యాసాన్ని భేదించడం జరిగింది. అదే మొట్టమొదటి ఆంటీబయాటిక్ (anti-biotic) గా పరిణమించింది.
(ఆంటీబయాటిక్ అంటే జీవ ప్రతికూల పదార్థం, అంటే క్రిమిజీవనానికి ప్రతికూలమైన పదార్థం
అని అర్థం). పెన్సిలిన్ యొక్క వైద్య ప్రయోజనాల పట్ల అవగాహన వేగంగా వ్యాపించింది. 1945 కల్లా
నెలకి అరటన్ను చొప్పున పెన్సిలిన్ ఉత్పత్తి ఉధృతంగా పుంజుకుంది.
1958 లో పెన్సిలిన్ తయారీ విషయంలో రసాయన శాస్త్రవేత్తలు
కొత్త సంగతులు కనుక్కున్నారు. బూజుపట్టే ప్రక్రియని మధ్యలోనే నిలిపేసి, అలా ఏర్పడ్డ
పెన్సిలిన్ అణువు యొక్క కేంద్రాంశాన్ని మాత్రమే తీసుకుని, ఆ కేంద్రాంశానికి సహజంగా
జతకాని కొన్ని కర్బన రసాయన సముదాయాలని జత చేయాలి. అలా సంయోజించబడ్డ పెన్సిలిన్ రూపాంతరాలకి
పెన్సిలిన్ కన్నా శక్తివంతమైన క్రిమిసంహారక లక్షణాలు ఉంటాయని తెలిసింది. 1940,
1950 లలో ఈ పద్ధతి ద్వార స్ట్రెప్టోమైసిన్, టెట్రాసైకిలిన్ లు మొదలైన ఇతర ఆంటీబయాటిక్
లని రూపొందించడం జరిగింది.
సంక్లిష్టమైన
కర్బన రసాయనాలని ఏదో విధంగా సంయోజిస్తే సరిపోదు. ఆ సంయోజక ప్రక్రియలో వివిధ దశలలో ఉత్పన్నమయ్యే
సమ్మేళనాలని కచ్చితంగా విశ్లేషించి వాటి లక్షణాలని తెలుసుకోవాలి. వాటి అణువిన్యాసాన్ని
నిర్ణయించాలి. కాని ఎన్నో సందర్భాలలో అలా ఉత్పన్నమైన పదార్థం ఎంత స్వల్ప మోతాదులో ఉండేదంటే
దాన్ని కచ్చితంగా విశ్లేషించడం ఇంచుమించు అసంభవం అయిపోయేది.
ఇలా ఉండగా ఆస్ట్రియన్
రసాయన శాస్త్రవేత్త ఫ్రిట్జ్ ప్రెగెల్ (1869-1930) విశ్లేషణకి వాడే పరికరాలని విజయవంతంగా
కుదించగలిగాడు. ఎంతో సునిశితమైన త్రాసు, అతి సూక్ష్మమైన గాజు ఉపకరణాలు మొదలైనవి రూపొందించాడు.
ఇలాంటి ఉపకరణాల సహాయంతో 1913 కల్లా సూక్ష్మవిశ్లేషణ (microanalysis) అనే కొత్త సాంప్రదాయం
బాగా కుదురుకుంది. గతంలో విశ్లేషించడానికి సాధ్యపడని చిన్న చిన్న మోతాదులని కూడా దీని
సహాయంతో కచ్చితంగా విశ్లేషించడానికి వీలయ్యింది.
సాంప్రదాయక రసాయనిక
విశ్లేషణా విధానాలలో భాగంగా ఒక చర్యలో వాడబడ్డ పదార్థం యొక్క ఘనపరిమాణాన్ని కొలవడం
జరుగుతుంది. దీన్నే ఘనపరిమాణాత్మక విశ్లేషణ (volumetric analysis) అంటారు. లేదా ఆ చర్యలో
పుట్టే ఉత్పత్తుల భారాన్ని కొలవడం జరుగుతుంది. దీన్నే భారమాన విశ్లేషణ (gravimetric
analysis) అంటారు. ఇరవయ్యవ శతాబ్దం పురోగమిస్తుంటే రసాయన విశ్లేషణ కూడా కొత్త పుంతలు
తొక్కింది. కాంతి శోషణ, విద్యుత్ వాహకత మొదలైన ఇతర లక్షణాల కొలమానం మొదలైన అధునాతన
ప్రక్రియలు కూడా రసాయన విశ్లేషణలో భాగాలు అయ్యాయి.
(ఇంకా వుంది)
0 comments