తన
హెలికల్ నమూనా న్యూక్లీక్ ఆసిడ్లకి కూడా వర్తిస్తుందని సూచించాడు పాలింగ్. ఈ విషయాన్ని పరీక్షించేందుకు గాని న్యూజీలాండ్-బ్రిటిష్ భౌతిక శాస్త్రవేత్త మారిస్ హ్యూహ్ ఫ్రెడెరిక్ విల్కిన్స్ (1916-2004) 1950 లలో ఓ ప్రయోగం చేశాడు. న్యూక్లీక్ ఆసిడ్లని
ఎక్స్-రే డాఫ్రాక్షన్ పద్ధతితో శోధించాడు. పాలింగ్ సూచనని పరీక్షించడంలో ఈ ప్రయోగం తొలి మెట్టు అయ్యింది. అయితే డైఫ్రాక్షన్ ఫలితాలని అన్వయించడంలో మరో చిక్కు వచ్చిపడిందని బ్రిటిష్ భౌతిక శాస్త్రవేత్త ఫ్రాన్సిస్ హారీ కాంప్టన్ క్రిక్ (1916-2004) మరియు అమెరికన్ రసాయన శాస్త్రవేత్త జేమ్స్ డువీ వాట్సన్ (1928-) లు కనుక్కున్నారు. ఒక్కొక్క న్యూక్లీక్ ఆసిడ్ అణువు జంట హెలిక్స్ రూపంలో ఏర్పాటై వుండాలని వాళ్లు కనుక్కున్నారు. ఆ జంట హెలిక్స్ లో రెండు అణు మాలికలు ఒక దాన్నొకటి అల్లుకుని ఉంటాయని వాళ్లు ప్రతిపాదించారు. 1953 లో ప్రతిపాదించబడి, వాట్సన్-క్రిక్ నమూనాగా పేరు పొందిన ఈ నమూనా జన్యు శాస్త్రపు అవగాహనలో ఓ ఘనవిజయంగా చెప్పుకోబడింది.
జేమ్స్
వాట్సన్ / ఫ్రాన్సిస్ క్రిక్
మందుపాతర
ఈ
బృహద్ అణువులు కూడా రసాయన శాస్త్రవేత్త యొక్క సంయోజక ప్రయత్నాలకి గురి కాకపోలేదు. జర్మన్-స్విస్ రసాయన శాస్త్రవేత్త క్రిస్టియన్ ఫ్రిడెరిక్ షోన్ బెయిన్ (1799-1868) అనుకోకుండా చేసిన ఓ ప్రయోగం ఈ దిశలో మొదటి మెట్టు అయ్యింది. ఈ షోన్‌బెయిన్ అంతకు ముందే ఆక్సిజన్ కి రూపాంతరమైన ఓజోన్ ని కనుక్కుని రసాయన శాస్త్రంలో పేరు పొందాడు.
1845 లో ఇంట్లో ఏదో ప్రయోగం చేస్తూ పొరపాట్న నైట్రిక్ ఆసిడ్, సల్ఫ్యూరిక్ ఆసిడ్లు కలిసిన మిశ్రమాన్ని కింద పారబోసి, దాన్ని ఆ తొందరలో తన భార్య కొంగుతో తుడిచాడట. తుడిచాక ఆ కొంగుని పొయ్యి మీద కాస్త ఎత్తున ఆరబెట్టాడట. కాని చిత్రం ఏంటంటే ఆ బట్ట పూర్తిగా ఆరిపోగానే ఠక్కున మటుమాయం అయిపోయింది. నామరూపాలు లేకుండా గాల్లో కలిసిపోయింది! అసలేం జరిగిందంటే బట్ట లో వుండే సెల్యులోస్ (cellulose) నైట్రో సెల్యులోస్ (nitrocellulose) గా మారిపోయింది. నైట్రిక్ ఆసిడ్ నుండి వచ్చిన నైట్రో సముదాయాలు ఆక్సిజన్ మూలాలుగా పని చేశాయి. కనుక సెల్యులోస్ ని వెచ్చజేయగానే అది ఆక్సీకృతం చెంది పూర్తిగా గాల్లో కలిసిపోయింది.
అలా
అనుకోకుండా ఏర్పడ్డ సమ్మేళనం యొక్క లక్షణాలని షోన్బెయిన్ త్వరలోనే గుర్తించాడు. ఆ రోజుల్లో తుపాకుల్లోను, ఫిరంగుల్లోను వాడే మందుపాతర పేలినప్పుడు నల్లనిపొగ వచ్చేది. దాంతో తుపాకులు ప్రయోగించే సిపాయిల ముఖాలు మసిబారేవి! ఫిరంగుల మీద, తుపాకుల మీద దట్టమైన మసి పొర ఏర్పడేది. నల్లని పొగ దట్టంగా వ్యాపించడం వల్ల యుద్ధభూమి మీద కన్నుకానని పరిస్థితి ఏర్పడేది. ఈ కొత్త నైట్రోసెల్యులోస్ పదార్థాన్ని “పొగలేని మందుపాతర”గా వాడుకోవచ్చని
గుర్తించాడు
షోన్బెయిన్. తూటాలకి ఇంధనంగా పని చేసే సామర్థ్యం వుందన్న గుర్తింపుతో దీనికి ‘గన్ కాటన్’ (guncotton) అన్న
పేరు కూడా వచ్చింది.
సేనల
కోసం గన్కాటన్ ఉత్పత్తి చేసే ప్రయత్నాలు మొదట్లో విఫలం అయ్యాయి. ఎందుకంటే తరచు అగ్నిప్రమాదాలు జరిగి ఆ పరిశ్రమలు బూడిద అయ్యేవి. చివరికి 1891 లో బ్రిటిష్ శాస్త్రవేత్త దీవార్, మరియు బ్రిటిష్ రసాయన శాస్త్రవేత్త ఫ్రెడెరిక్ ఆగస్టస్ ఏబెల్ (1827-1902) గన్కాటన్ కలిసిన ఓ సురక్షితమైన మిశ్రమాన్ని తయారు చెయ్యగలిగారు. ఆ మిశ్రమాన్ని పొడవాటి నాళాలుగా (cords) సాగదీయడానికి వీలయ్యింది కనుక దానికి cordite అని
పేరు వచ్చింది. ఈ కార్డయిట్ పుణ్యమా అని ఇరవయ్యవ శతాబ్దానికి చెందిన సిపాయిలు ఒక పక్క దారుణ మారుణ కాండలో తాము నాశనం అవుతున్నా, తమ ప్రత్యర్థిని తుదముట్టిస్తున్నా, ఎదుట దృశ్యాన్ని మాత్రం స్పష్టంగా చూడగలిగే భాగ్యానికి నోచుకున్నారు. గుడ్డిలో మెల్ల అంటే ఇదేనేమో!
కార్డయిట్
లో ఒక ముఖ్యాంశం నైట్రోగ్లిసరిన్. దీన్ని 1847 లో ఇటాలియన్ రసాయన శాస్త్రవేత్త ఆసియానో సోబ్రెరో (1812-1888) 1847 లో కనిపెట్టాడు. ఇది దారుణమైన విస్ఫోటక లక్షణాలు గల పదార్థం. దాని వినియోగంలో అనుక్షణం ప్రమాదం పొంచి వుండేది. కనుక యుద్ధ ప్రయోజనాల కోసం వాడినప్పుడు ఎంతో అప్రమత్తంగా ఉండాల్సి వచ్చేది. యుద్ధ ప్రయోజనాల కోసం కాకపోయినా, శాంతయుత ప్రయోజనాల కోసం, అంటే కొండలు తవ్వి రోడ్లు వెయ్యడం, భూమిలో గోతులు తవ్వడం మొదలైన ప్రయత్నాల లో కూడా ప్రమాదకరంగా ఉండేది. నిర్లక్ష్యంగా వాడితే ఇట్టే ప్రాణాలు పోయేవి.
(ఇంకా వుంది)
0 comments