తన
కృషిని కొనసాగిస్తూ కారొథర్స్ మరిన్ని పాలిమర్ల మీద పని చేశాడు. కొన్ని ప్రత్యేక డై అమీన్లని, డై కార్బాక్సిలిక్ ఆసిడ్ల అణువులని పాలిమరీకరించి సన్నని తీగలు తయారు చేశాడు. ఈ పద్ధతిలో
పెప్టయిడ్
బంధాలతో ఏర్పడ్డ పట్టు దారాలలోని ప్రోటీన్ లని పోలిన అణుమాలికలు
ఏర్పడ్డాయి.
ఇలా ఏర్పడ్డ సంయోజిత తీగలని మరింతగా సాగదీస్తే ఏర్పడేదే నైలాన్ (nylon). చిన్న వయసులోనే కన్నుమూసిన కారొథర్స్ తన జీవితపు చివరి రోజుల్లో ఈ నైలాన్ ని రూపొందించాడు. కాని అంతలోనే రెండవ ప్రపంచ యుద్ధం మొదలయ్యింది. యుద్ధం అనంతరమే నైలాన్ ప్రాచుర్యం పెరిగింది. ఎన్నో సందర్భాలలో పట్టుకి బదులు నైలాన్ వినియోగం ఆరంభం అయ్యింది.
తొలి
దశల్లో ఈ
సంయోజిత
పాలిమర్లని ఓ ప్రత్యేకమైన ప్రణాళిక ఏమీ లేకుండా ‘ప్రయత్నించి చూడు’ అనే పద్ధతిలో రూపొందించేవారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఈ బృహత్ అణువుల విన్యాసం గురించి గాని, వాటి చర్యల గురించి గాని లోతైన అవగాహన ఉండేది కాదు. పాలిమర్ల అణువిన్యాసంలో లోతైన అధ్యయనాలు చేసిన వారిలో ఒక పురోగామి జర్మన్ రసాయన శాస్త్రవేత్త హర్మన్ స్టౌడింగర్ (1881-1965). ఇతడి కృషి వల్ల సంయోజిత పాలిమర్ల బలహీతనలు కొన్ని బయట పడ్డాయి. మోనోమర్లు ఇష్టం వచ్చినట్టుగా కలిసిన అణుమాలికలలో అణువిన్యాసంలో క్రమం కొరవడవచ్చు. మాలికలో అణు సముదాయాలు ఒక చోట ఒక దిశలోను, మరో చోట మరో దిశలో ఇలా అస్తవ్యస్తంగా ఏర్పాటై వుండే అవకాశం వుంది. ఇలాంటి అస్తవ్యస్త పరిస్థితి వల్ల చివర ఏర్పడే పదార్థం బలహీనంగా ఉండొచ్చు. ఎందుకంటే అందులోని అణుమాలికలు పొందిగ్గా సర్దుకోలేదు. కొన్ని సార్లు ఒక ప్రత్యేక దిశలో విస్తరించిన మాలికల లోంచి శాఖలు పుట్టి పక్కలకి విస్తరించవచ్చు.
దీని
వల్ల పరిస్థితి మరింత విషమిస్తుంది.
1953 లో జర్మన్ రసాయన శాస్త్రవేత్త కార్ల్ త్సీగ్లర్ (1898-1973) ఒక ప్రత్యేక resin (చెట్టు జిగురు) తో పని చెయ్యడం ప్రారంభించాడు. దానికి అలుమినమ్, టైటానియమ్, లిథియమ్ మొదలైన పరమాణువులని జతచేర్చితే అదొక ఉత్ప్రేరకంలా (catalyst) పని చేస్తుందని తెలిసింది. ఈ ఉత్ప్రేరకాల ప్రభావం వల్ల మోనోమర్లు తీరుగా కలిసి, శాఖలు ఏర్పడని చక్కని క్రమం గల పాలిమర్లుగా ఏర్పడతాయని తెలుసుకున్నారు.
ఇలాంటి
పరిశోధనలే ఇటాలియన్ శాస్త్రవేత్త జిలియో నాటా (1903-1979) కూడా చేశాడు. పాలిమర్ మాలిక పొడవునా క్రమద్ధంగా అమరిన పరమాణు సముదాయాలు ఉన్న సమ్మేళనాలు తయారు చేశాడు. ఇలాంటి పరిశోధనల వల్ల పాలిమర్ల రూపకల్పన ఎంత కచ్చితంగా, శాస్త్రీయంగా తయారయ్యింది అంటే, కొలతలు ఇచ్చి మనకి నచ్చినట్టు బట్టలు కుట్టించుకున్నట్టు, మనం కోరుకున్న లక్షణాలు గల పాలిమర్ ని ముందే నిర్వచించి, నిర్ణయించి, రూపొందించుకునే
అవకాశం
ఏర్పడింది. ఆ విధంగా ఎన్నో కొత్త కొత్త ప్లాస్టిక్ లని, ఫిల్మ్ లని, తీగలని తయారు చెయ్యడానికి వీలయ్యింది.
ఈ
కొత్త కర్బన సంయోజిత పదార్థాలని తయారు చెయ్యడానికి వాడే అతి ముఖ్యమైన ముడిపదార్థాలలో ఒకటి పెట్రోలియమ్. ఇది మనిషికి అనాదిగా సుపరిచితమైన పదార్థం. కాని అది అధిక మొత్తాలలో కావాలంటే అది భూగర్భంలో మాత్రమే దొరుకుతుంది. కనుక ఆ ద్రవాన్ని సువిస్తారమైన భూగర్భ వనరులని వెలికి తీసే సాంకేతిక సాధనాలు రూపొందించ బడినంత వరకు ఎదురు చూడాల్సి వచ్చింది. 1859 లో అమెరికన్ ఆవిష్కర్త ఎడ్విన్ లారెంటిన్ డ్రేక్ (1819-1880) మొట్టమొదటి సారిగా ఓ డ్రిల్ పరికరంతో భూగర్భంలోకి తవ్వకం మొదలెట్టాడు. ఓ శతాబ్దం తిరిగే లోగా పెట్రోలియమ్ మానవ సమాజంలో ఓ ముఖ్యస్థానాన్ని ఆక్రమించిన విషయం అందరికీ తెలిసినదే. వాహనాలలో, విమానాలలో ఇంధనంగా, శీతల ప్రాంతాలలో ఇళ్లు వెచ్చజేయడానికి ఉష్ణమూలంగా, ఇలా శతకోటి ప్రయోజనాలతో అత్యంత విలువైన పదార్థంగా పరిణమించింది.
పెట్రోల్
వాహనాల వినియోగం తరువాత బొగ్గు గురించి మనుషులు మర్చిపోతున్నారు గాని, కర్బన రసాయనాల ముడిసరుకులలో బొగ్గు కూడా ముఖ్యమైనదే. పందొమ్మిదవ, ఇరవయ్యవ శతాబ్దాల సంధికాలంలో రష్యన్ రసాయన శాస్త్రవేత్త వ్లాడిమిర్ నికొలాయెవిచ్ ఇపటెయెఫ్ (1867-1952) పెట్రోల్ లోను, తారు లోను ఉండే సంక్లిష్టమైన హైడ్రోకార్బన్ సమ్మేళనాలు అధిక ఉష్ణోగ్రతల వద్ద ఎలా ప్రవర్తిస్తాయో పరిశోధించసాగాడు. ఈ పరిశోధనలని జర్మన్ రసాయన శాస్త్రవేత్త ఫ్రెడెరిక్ కార్ల్ రడోల్ఫ్ బెర్జియస్ (1884-1949) మరింత ముందుకు తీసుకెళ్లాడు. 1912 లో ఇతడు భారమైన చమురుని, బొగ్గుని హైడ్రోజన్ తో చర్య జరిపి పెట్రోల్ తయారు చెయ్యడానికి విధానాలు కనిపెట్టాడు.
విపరీతమైన
వినియోగం వల్ల నేడు భూమిలోని శిలాజ ఇంధనాలు (fossil fuels) వేగంగా తరిగిపోతున్నాయి. ఒక సారి హరించుకుపోతే వీటిని మళ్లీ పునర్నవీకరించే అవకాశం వుండదు. ఈ వినియోగం ఇలాగే సాగితే ఆ వనరులు పూర్తిగా ఖాళీ అయ్యే రోజులు ఎంతో దూరంలో లేవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇరవయ్యవ శతాబ్దం అంతా ఎలాగో నెట్టుకు వచ్చేసినా, ఈ ఇరవయ్యొకటవ శతాబ్దంలో చమురు విషయంలో ఏర్పడ్డ సంకట స్థితి పట్ల కాస్త అప్రమత్తంగా ఉండాలి.
(ఇంకా వుంది)
0 comments