శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in other Indian Languages. Please Click here.

గౌస్ బాల్యం

Posted by శ్రీనివాస చక్రవర్తి Monday, March 22, 2010

పూవు పుట్టగనే అన్నట్టు మూడేళ్ల నాటి నుంచే గౌస్ తన ప్రతాపాన్ని చూపించసాగాడు. ఒక సారి గౌస్ తండ్రి తన వద్ద పని చేసే కూలి వాళ్లకి నెలసరి జీతాలు అందజేస్తూ లెక్క చూస్తున్నాడు. అంతలో అక్కడే నించుని ఈ వ్యవహారాన్ని శ్రద్ధగా చూస్తున్న చిన్నారి గౌస్ ఉన్నట్టుండి, “ఈ విలువ తప్పు, అసలు విలువ ఇలా ఉండాలి,” అంటూ సవరణ సూచించాడు. తండ్రి ముందు ఆశ్చర్యపోయినా తరువాత లెక్కంతా సరిచూసి కొడుకు చెప్పింది నిజమేనని గుర్తించాడు.

అప్పటికే ఆ చిన్నోడు తల్లిదండ్రుల నుండి, తనకన్నా కాస్త పెద్ద నేస్తాల నుండి అక్షరాల ఉచ్ఛారణ తెలుసుకుని చదవడం ఎలాగో నేర్చుకున్నాడు. కాని లెక్కల గురించి, అంకెల గురించి ఎవరూ నేర్పలేదు. అవి సొంతంగా నేర్చుకున్నవి. “ఊసులు రాకముందే లెక్కలు నేర్చుకున్నా”నని గౌస్ తన చిన్నతనం గురించి నవ్వుతూ చెప్పుకునేవాడట!

ఏడేళ్ల వయసులో గౌస్ ని మొట్టమొదటి సారి బళ్లో చేర్పించారు. అదో పాతకాలపు బడి. బట్నర్ అనే ఓ మొరటోడు ఆ బడిని నడిపించేవాడు. వాడికి పిల్లలకి, పశువులకి మధ్య పెద్దగా తేడా తెలీదు. పిల్లలు వాళ్ల పేర్లు కూడా మర్చిపోయేలా గొడ్లని బాదినట్టు బాదేవాడని చెప్పుకునేవారు. ఎప్పుడు సెలవలు వస్తాయా, ఎప్పుడు ఇంటికి పోదామా అని పిల్లలు కాచుకు కుర్చునేవారు. ఇలాంటి బళ్లో పాపం పసివాడైన గౌస్ ని చేర్పించారు.

మొదటి రెండేళ్లూ ప్రత్యేకించి ఏమీ జరగలేదు. గౌస్ పదవ ఏట అంకగణితం (arithmetic) మొదలయ్యింది. తన ’బాల నియంత్రణ పథకం’ లో భాగంగా బట్నర్ పిల్లలకి ఏవో బండ లెక్కలు ఇచ్చి చెయ్యమనేవాడు. అలాగైనా పిల్లలు అల్లరి చెయ్యకుండా అడ్డవైన లెక్కలతోనూ కుస్తీ పడుతూ నిశ్శబ్దంగా కూర్చుంటారని అతడి ఆలోచన. ఒకసారి అలాగే పిల్లలని ఈ కింది కూడిక చెయ్యమన్నాడు:
81297 + 81495 + 81693 + …+ 100899

పై వరుసలో ప్రతీ సంఖ్యకి, దాని తదుపరి సంఖ్యకి మధ్య భేదం 198. వరుసలో మొత్తం 100 సంఖ్యలు ఉన్నాయి.
బట్నర్ అలాంటి లెక్కలు ఇచ్చినప్పుడు లెక్క అందరి కన్నా ముందు పూర్తిచేసిన పిల్లవాడు, సమాధానం పలక మీద రాసి, ఆ పలకని తెచ్చి టీచరు బల్ల మీద ఉంచాలి. ఆ తరువాత లెక్క పూర్తి చేసిన పిల్లవాడు తన పలకని తెచ్చి మొదటి పలక మీద ఉంచాలి. ఇలా వరుసగా పిల్లలు తమ పలకలు తెచ్చి బల్ల మీద పెడతారు.

టీచరు లెక్క చెప్పడం పూర్తి చేసి నిముషం కూడా కాకముందే గౌస్ సమాధానాన్ని పలక మీద రాసి “ఇదుగో” అంటూ తెచ్చి బల్ల మీద పెట్టాడు. క్లాసులో అందరికన్నా చిన్నవాడైన గౌస్ అందరికన్నా మొద్దు అయ్యుంటాడన్న అపోహలో ఉన్న బట్నర్ ఓసారి గౌస్ కేసి వ్యంగ్యంగా చూసి నవ్వాడు. తరువాత ఓ గంట సేపు ఆ లెక్కతో కుస్తీ పట్టిన తక్కిన పిల్లలు తమకి వచ్చిన సమాధానాలు తమ పలకల మీద రాసి తెచ్చి టీచరు బల్ల మీద పెట్టారు. అందరి సమాధానాలు తప్పే, ఒక్క గౌస్ సమాధానం తప్ప. అది చూసిన టీచర్ ముఖం వెలవెలబోయింది!

ఆ నాటి నుండి బట్నర్ తక్కిన పిల్లలతో ఎలా ప్రవర్తించినా గౌస్ పట్ల మాత్రం కాస్తంత మానవత్వాన్ని ప్రదర్శించడం మొదలెట్టాడు. ఓ సారి అలాగే ఎంతో మురిపెంగా తనకి తెల్సిన అత్యంత కఠినమైన అంకగణితం పుస్తకం ఒకటి తన సొంత డబ్బుతో కొనుక్కొచ్చి గౌస్ కి తెచ్చి బహుకరించాడు. గౌస్ ఒక సారి దాని పేజీలు వేగంగా తిరగేసి పక్కన బెట్టాడు. అది చూసి అవాక్కయిన టీచరు “కుర్రాడు నన్ను మించిపోయాడు. ఇక నేను కొత్తగా చెప్పేదేవుందీ,” అంటూ నీరుగారిపోయాడు.

ఆ విధంగా బట్నర్ నుండి గౌస్ పెద్దగా నేర్చుకున్నది ఏమీ లేకపోయినా బట్లర్ వద్ద పని చేసే యోహాన్ బార్టెల్స్ అనే కుర్రాడితో సావాసం గౌస్ కి అంతో ఇంతో మేలు చేసింది. పదిహేడేళ్ల బార్టెల్స్ కి పదేళ్ల గౌస్ కి మధ్య స్నేహం క్రమంగా బలపడసాగింది. ఇద్దరూ కలిసి చదువుకునేవారు. తమ ఆల్జీబ్రా టెక్స్ట్ బుక్ లోంచి కఠినమైన లెక్కలు ఎంచుకుని వాటిని పరిష్కరించి ఆనందించేవారు.

ఆ కాలంలోనే గౌస్ ద్విపద సిద్ధాంతం (binomial theorem) అంటే మోజు పడ్డాడు.

(సశేషం...)
2 comments

 1. Anonymous Says:
 2. There is one interesting book "Measuring the World" translated from German into English- which is an historical account of Gauss lives - his experiments on various aspects- his tours round the world etc., This is written by author Daniel Kehlmann and a quite a good book like the one of feynmann - 'you are surely joking mr. feynmann'

  cheers
  zilebi
  http://www.varudhini.tk

   
 3. Thank you for the info. Will try to look up this book.

   

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts

Follow by Email