సూర్యుణ్ణి, తారలని ఆధారంగా చేసుకుని కొన్ని జాతుల పక్షులు ఎలా వలసపోతాయో కొన్ని పోస్ట్ లలో చూశాం. వేల మైళ్ళ దూరాలలో ఉన్న గమ్యాలని ఈ ఆకాశపు కొండగుర్తుల సహాయంతో ఎలా కొలవగలుగుతున్నాయో చూశాం. కాని దూరాలని కొలవడం అంటే ఖండాలని, మహానదులని కొలవడమే కానక్కర్లేదు. గూటికి దరిదాపుల్లో ఎక్కడెక్కడ ఆహారవనరులు ఉన్నాయో, ఎక్కడెక్కడ ప్రమాదాలు పొంచి ఉన్నాయో తెలుసుకోగలుగుతే, ఆ సమాచారాన్ని తోటి జీవాలని అందించగలిగితే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
చుట్టుపక్కల పూదోటలని పర్యవేక్షించి వచ్చే తేనెటీగలు, తాము తెలుసుకున్న ’రస’వత్తర సంగతులన్నీ తోటి తేటి మిత్రులకి, నానా రకాల నాట్య పదఘట్టనలతో, ఝంకారపు ’జానపదాల’తో వ్యక్తం చేస్తాయట. తేనెటీగ హొయళ్ళలో, హావభావాలలో దాగి వున్న రహస్య సందేశాల గురించి మొట్టమొదట తెలుసుకున్న కార్ల్ ఫాన్ ఫ్రిష్ అనే జర్మన్ శాస్త్రవేత్త తన అదృష్టానికి తానే మురిసిపోయాడు. అంత అపురూపమైన రహస్యాన్ని ప్రకృతి తల్లి తనకి తెలియజేసినందుకు శాస్త్రవేత్తగా తన బతుకు తరించింది అనుకున్నాడు. ఆ విషయం గురించే "1944 వేసవిలో చేసిన కొన్ని అత్యంత సామాన్య ప్రయోగాలు ఊహించని, మహదానందకరమైన ఫలితాలని అందించాయి" అని చెప్పుకున్నాడు.
తేటి నాట్య వేదిక
తేనెతుట్టలో ఓ ప్రత్యేక ప్రాంతమే తేనెటీగ నాట్య వేదిక అవుతుంది. ఆ వేదిక సామాన్యంగా తుట్ట యొక్క ముఖద్వారానికి దగ్గరిగా ఉంటుంది. బయట చలిగా ఉంటే ఆట తుట్ట లోపలి పొరల్లోకి మార్చబడుతుంది. ఆట మరీ వివరంగా ఉంటే తుట్ట బయటికి పొర్లిపోతుంది! సామాన్యంగా తుట్టలు నిటారుగా వేలాడుతుంటాయి కనుక నాట్య వేదిక కూడా సామాన్యంగా నిలువు తలంలో ఉంటుంది. తుట్ట మీద పైకి కిందకి కదులుతూ విషయం వ్యక్తం చెయ్యాలన్నమాట! (ఇటీవలి కాలంలో టీవీలో చూపించే నాట్య పోటీల్లో ’ప్రాప్’ ల మీద చేసే ప్రమాదకరమైన నాట్యంలా!) బయట వెచ్చగా ఉంటే మాత్రం సామాన్య మానవుల్లాగానే అవి కూడా చదునైన తలం మీదే నాట్యం చేస్తాయి. ఈ రెండూ కాక కొన్ని సార్లు వాలుతలం మీద కూడా నాట్యం చెయ్యాల్సి వస్తుంది. తుట్టకి అడుగుభాగానికి దగ్గరగా దాని ఉపరితలం వంపు తిరిగి ఉన్న చోట చేసే నాట్యం ఈ కోవకి చెందినది. అయినా రంగస్థలం ఎలా ఒరిగి ఉంది అన్నది తేటిలోకపు రసజ్ఞులు పెద్దగా పట్టించుకోరు. వారి దృష్టంతా (తేనె వనరుల ఆనవాళ్లు వ్యక్తం చేసే) నర్తకి హావభావాల మీదే!
అలా సిద్ధమైన రంగస్థలం మీద తేనెటీగ రెండు రకాల నృత్యాలు చేస్తుంది.
1) వృత్త నృత్యం: ఇది తుట్టకి దగ్గరలోనే ఆహారవనరు కనిపిస్తే చేసే ఓ అత్యంత సరళమైన నృత్యం. ఇందులో పెద్దగా సమాచారం ఉండదు. ’చెంతనే ఆహారం ఉందహో’ అంటూ చాటే శుభవార్త లాంటిది ఇది. ఇందులో తేనెటీగ తుట్టలోని ఒక "బద్దీ" (తుట్ట నిండా ఉండే చిన్న చిన్న గుంతలు) చుట్టూ ఒక చిన్న చక్కరు కొడుతుంది. అలా ఒకటి రెండు సార్లు చక్కర్లు కొట్టాక, వ్యతిరేక దిశలో చక్కర్లు కొట్టడం ఆరంభిస్తుంది. ఈ నాట్య విన్యాసం కొన్ని సెకన్ల నుండి కొన్ని నిముషాల పాటు సాగుతుంది. ఈ విన్యాసం అంతా కళ్లార చూసిన కొన్ని తోటి జీవాలు విషయం అర్థమై ఆ ఆహారం కోసం వెదుక్కుంటూ బయలుదేరుతాయి.
2) తోకాడించే నృత్యం: ఈ రెండవ రకం నృత్యం మరింత సంక్లిష్టమైనది. ఆహార వనరులు బాగా దూరంలో ఉన్నప్పుడు తేనెటీగ ఈ రకమైన నృత్యాన్ని ప్రదర్శిస్తుంది. ఈ రకమైన నృత్యంతో 100 m నుండి 15 km వరకు కూడా దూరాలని వ్యక్తం చెయ్యగలవు. తేనెటీగ శరీర పరిమాణంతో పోల్చితే ఇవి అపారమైన దూరాలు అని గుర్తుంచుకోవాలి. గమ్యం దూరం అవుతున్న కొద్ది తేనెటీగలు వృత్త నృత్యం వదిలి ఈ తోకాడించే నృత్యానికి మారిపోతాయి.
ఆపిస్ మెలిఫేరా (Apis Melliphera) అనే జాతి తేనెటీగ నృత్యం ఈ విధంగా ఉంటుంది. ముందు సూటిగా కాస్త దూరం "నాట్య వేదిక" మీద పరిగెడుతుంది. వెంటనే వెనక్కు తిరిగి అర్థవృతాకారపు బాటలో బయల్దేరిన చోటికి వస్తుంది. మళ్లీ నేరుగా పరిగెడుతుంది. మళ్లీ వెనక్కు తిరిగి ఈ సారి అవతలి పక్కగా అర్థవృత్తాకారంలో వెనక్కు వస్తుంది. సూటిగా పరిగెత్తే సమయంలో తోక వేగంగా ఆడిస్తుంది. మొత్తం మీద ఈ నృత్యం చేస్తున్నప్పుడు దాని బాట 8 ఆకారంలో ఉంటుంది.
నృత్యంలో దూరానికి సంబంధించిన సమాచారం ఎలా దాగి వుంది?
గమ్యం యొక్క దూరం పెరుగుతున్నప్పుడు 8 ఆకారపు బాట వెయ్యడానికి పట్టే సమయం పెరుగుతుంటుంది. ఉదాహరణకి 100 m దూరాన్ని సూచించడానికి 15 సెకనుల్లో 10 చక్కర్లు వేయొచ్చు. అదే 3 km దూరం సూచించడానికి అదే సమయంలో (15 సెకనులు) 3 చక్కర్లు మాత్రమే వేయొచ్చు.
నృత్యంలో దిశకి సంబంధించిన సమాచారం ఎలా దాగి వుంది?
నాట్యవేదిక నేలకి సమాంతరంగా ఉంటే తేనెటీగ పని చాలా సులభం అవుతుంది. ఆహారం ఏ దిశలో ఉంది అన్నది 8 ఆకారపు బాటలో సరళ రేఖలా ఉన్న భాగం యొక్క దిశ సూచిస్తుంది. కాని నాట్యవేదిక నిలువుగా ఉంటేనే కొంచెం ఇబ్బంది. నిలువు తలంలో సూచించబడ్డ దిశని అడ్డుతలానికి వర్తింపజేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడే తేనెటీగ వాడే పద్ధతి మహా మహా జ్యామితికారులే ముక్కున వేలేసుకునేట్టు చేస్తుంది. ఈ సారి 8 ఆకారపు బాటలో సరళరేఖలా ఉన్న భాగం యొక్క దిశకి, గురుత్వ క్షేత్రపు నిలువు రేఖకి మధ్య కోణాన్ని తీసుకోవాలి. ఆ కోణం, ఆహారం ఉన్న దిశకి, సూర్యరశ్మి పడుతున్న దిశకి మధ్య కోణంతో సమానం! ఆ విధంగా తేనెటీగ కూడా ఒక విధమైన "సూర్యదిక్సూచి" ని వాడుకుంటోంది అన్నమాట!
References:
1. Vincent Marteka, Bionics, Lippincot, 1965.
2. http://www.polarization.com/bees/bees.html
0 comments