ఆర్కిమిడీస్, న్యూటన్, గౌస్ – వీరు ముగ్గురూ పాశ్చాత్య గణితలోకంలో త్రిమూర్తులు అని చెప్పుకుంటారు. ముగ్గురిలో ఎవరు గొప్ప అన్న ప్రశ్న అడగరానిది. ముగ్గురూ ఎవరికి వారే సాటి. శుద్ధ (pure), ప్రయోజనాత్మక (applied) గణితరంగాల్లో సంచలనం సృష్టించిన మహామహులు వీళ్లు. ఆర్కిమిడీస్ ప్రయోజనాత్మక గణితం కన్నా శుద్ధ గణితాన్నే ఎక్కువగా ఆరాధించాడు. కవి ఛందస్సుని వాడినట్టు, న్యూటన్ గణిత భాషతో ప్రకృతి గతులని అధ్బుతంగా వర్ణించి, శుద్ధ గణితానికి ఓ కొత్త అర్థాన్ని, సార్థకతని సాధించాడు. శుద్ధ, ప్రయోజనాత్మక గణితాలు రెండూ రెండు కళ్లని, రెండిటినీ సమానంగా వాడిన అసమాన గణితవేత్త గౌస్. అందుకే గణితలోకపు రారాజని పేరు తెచ్చుకున్నాడు.
గౌస్ రాచరికం గణిత లోకానికే పరిమితం. వాస్తవంలో పుట్టింది ఓ పేద కుటుంబంలో. ఏప్రిల్ 30, 1777 లో జర్మనీలో బ్రన్స్విక్ లో పుట్టాడు. తండ్రి ఓ నిరుపేద తోటమాలి. నిజాయితీగా, నిక్కచ్చిగా ఉండే మనిషి. అలాగే చాలా మొరటు వాడు కూడా. కనుక గౌస్ బాల్యం అంత సాఫీగా సాగలేదనే చెప్పాలి. చదువంటే వల్లమాలిన ప్రేమ ఉన్న కొడుకు గౌస్ మనసు మార్చి, ఎలాగైనా తనలాగే ఓ తోటమాలిగా తీర్చిదిద్దాలని విశ్వప్రయత్నం చేశాడు. కాని గౌస్ అదృష్టం వల్ల ఆ దౌర్భాగ్యం తప్పింది. మరి తండ్రి పరిస్థితి అలా ఉంటే గౌస్ లోని సహజ గణిత ప్రతిభ ఎక్కణ్ణుంచి వచ్చింది? అన్న ప్రశ్న పుట్టక మానదు.
అది తండ్రి వైపు నుండి రాలేదు. తల్లి వైపు నుండి వచ్చింది. మేనమామ ఫ్రీడ్రిక్ వృత్తి రీత్యా నేతగాడు. కాని స్వతహాగా చాలా తెలివైనవాడు. డమాస్క్ లు అనబడే ఒకరకం వస్త్రాల నేతలో నిపుణుడు. అది మామూలు నేత కాదు. రంగు దారాలతో చెప్పే కవితం. కలంకారీతో చెప్పే గణితం. మేనమామ ప్రాభవంలో ఆ విధంగా ఆకృతులలోని అందాన్ని అర్థం చేసుకున్నాడు గౌస్. గణితంలో అతడు నేర్చిన మొదటి పాఠం అదే.
గౌస్ తల్లి డోరొతీ పదుదైన ధీశక్తి, ధృఢమైన వ్యక్తిత్వం గల వనిత. కొడుకు గౌస్ చాలా గొప్ప వాడు అవుతాడన్న నమ్మకం ఆమెలో “పుత్రుడు పుట్టినప్పుడె” కలిగింది. ఆ నమ్మకం తొంభై ఏడేళ్ల వయసులో కన్ను మూసిన నాటికి తగినన్ని ఆధారాలతో పూర్తిగా రూఢి అయ్యింది. కూలి నాలి చేసుకుని తనలా దర్జాగా బతకమని ఒక పక్క తండ్రి వేధిస్తుంటే, డోరొతీ గట్టిగా అడ్డుపడేది. ’నీకంటే చదువు సంధ్య లేకపాయె! ఆణ్ణయినా చదువుకోనీయయ్యా!” అంటూ భర్తని ధైర్యంగా ఎదిరించి చీవాట్లు పెట్టేది.
కొడుకు గురించి ఎప్పుడూ ఏవో కలలు కనేది. ఆ కలలని సాకారం చేసి తన నమ్మకాన్ని నిలబెడతాడని ఆశ పడేది. అప్పుడప్పుడు ఆ నమ్మకం కాస్తంత సడలేదో ఏమో! ప్రముఖులు ఎవరైనా తారసపడితే కొడుకుని వారికి చూపించి వీడేవైనా ప్రయోజకుడు అవుతాడో లేదో చెప్పమనేది. అలాగే ఒకసారి గౌస్ కి పందొమ్మిదేళ్ల వయసులో అప్పటికే మేటి గణితవేత్తగా పేరు పొందిన వొల్ఫ్ గాంగ్ బోల్యాయ్ ని తన కొడుకు ఏమవుతాడని అడిగింది. “యూరప్ లో కెల్లా గొప్ప గణితవేత్త!” అన్న బోల్యాయ్ సమాధానానికి ఆ తల్లి కళ్లలో నీళ్లు నిండాయి.
ఆ విధంగా అడుగడుగునా కుడుకుని కాపు కాస్తూ వచ్చిందా తల్లి. గణితంలో ఎంత ఎత్తుకి వెళ్లినా, ఎంత కీర్తి గడించినా అవేవీ పట్టని గౌస్ కి తన తల్లే ప్రపంచం. చివరి ఇరవై ఎళ్లూ కొడుకు పంచనే జీవించింది. ఆఖరు నాలుగేళ్లూ కనుచూపు పూర్తిగా నశించింది. ఆ సమయంలో గౌస్ తల్లిని కంటికి రెప్పలా చూసుకున్నాడు. చివరికి ఏప్రిల్ 19, 1839 లో కొడుకు చేతిలో కన్నుమూసింది. తన కన్న కలలన్నీ సాకారం చేసిన కన్న కొడుకు ఒడిలో హాయిగా కన్ను మూసింది.
(సశేషం...)
(గౌస్ బాల్యం గురించి తదుపరి పోస్ట్ లో...)
0 comments