శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

లాంచ్ పాడ్ నిర్మాణం

Posted by V Srinivasa Chakravarthy Sunday, August 12, 2012

కొత్త రాకెట్ కి ‘ఔక్’ (AUK) అని ఓ చిత్రమైన పేరు కూడా పెడతారు. ‘ఔక్’ అంటే పెద్దగా ఎగరలేని ఓ పక్షి పేరు. నలుపు తెలుపు రంగులతో ఇవి చూడడానికి కొంచెం పెంగ్విన్ పక్షుల్లా ఉంటాయి. బాగా ఈదగలవు.


(వికి)
తాము చేసిన రాకెట్ ఆ మాత్రం ఎగిరితే చాలని రాజీ పడినట్టున్నారు కుర్రాళ్లు!



వత్తి అంటించగానే రాకెట్ చివ్వున పైకి లేస్తుంది. కాని సంబరం క్షణకాలమే! పైకి లేచిన రాకెట్ మనసు మార్చుకుని పక్కకి తిరిగి ఊరి మీద విరుచుకు పడుతుంది. మీదకి దూసుకొస్తున్న రాకెట్ ని చూసిన జనం చెంగు చెంగున గెంతి ప్రాణాలు కాపాడుకుంటుంటారు. అలా ఊరంతా జడిపించిన ఆ రాకెట్ చివరికి పోయి పోయి హోమర్ తండ్రి ఆఫీసు కిటికీ అద్దాలని ఛేదించుకుంటూ ఆ తండ్రి పాదాల చెంత వాలుతుంది!



హోమర్ తండ్రి దర్శనం చేసుకోడానికి పాపం ఆ రాకెట్ ఓ దుర్ముహూర్తాన్నే ఎంచుకుంది. ఆ సమయంలో బొగ్గు గనిలో పరిస్థితులు సంకటంగా ఉంటాయి. గని నుండి వచ్చే ఉత్పత్తులు తగ్గిపోతున్నాయని పై అధికారులు గని మూతవేసే పరిస్థితి వస్తోందని ఆ సమయంలో మిస్టర్ హికమ్ తో చర్చిస్తుంటారు. అలాంటి తరుణంలో ఈ హవాయి చువాయి గదిలోకి దూసుకు రావడం చూసి ఆయనకి చిర్రెత్తుతుంది. పైగా ఆ పని చేసింది స్వయంగా తన పుత్ర రత్నమే అని తెలియగానే అందరి ముందు కొడుకుని దులిపేస్తాడు. తనకి చెప్పకుండా దొంగతనంగా తన ఫాక్టరీలో టెక్నీషియన్ల సహాయం తీసుకుని వెల్డింగ్ చెయ్యించుకున్నందుకు “దొంగ” అని కూడా తిడతాడు. “మళ్లీ కంపెనీ పరిసరాల్లో ఈ ‘చెత్త’ తో కనిపిస్తే ఊరుకునేదే లేదు” అని గట్టిగా మందలిస్తాడు.

జరిగిన అవమానం భరించలేక హోమర్ ఇంటి కెళ్ళి వాళ్ల అమ్మతో ఫిర్యాదు చేస్తాడు. “అందరి ముందు దొంగ అని తిట్టాడమ్మా!” అంటూ శోకాలు పెడతాడు. “అసలైనా ఆ గని ఆయనకి ఏం ఇచ్చిందని? ఊపిరితిత్తుల్లో ఇంత పెద్ద నల్లని మచ్చ తప్ప,” అంటూ నిష్టూరంగా మాట్లాడతాడు. అప్పుడే ఇంట్ళోకి వస్తున్న తండ్రికి ఈ మాటలు విని ఒళ్ళు మండిపోతుంది. పిల్లలు సేకరించిన ‘రాకెట్ సరంజామా’ అంతా తీసి బయటపడేస్తాడు.

ఈ విషయం హోమర్ నేస్తాలకి తెలుస్తుంది. ముగ్గురూ నీరుగారి పోతారు. వీళ్లు రాకెట్ ప్రయోగాలు చేస్తున్నారని తెలియగానే బడిలో చిన్న సంచలనం బయల్దేరుతుంది. ప్రయోగం విజయవంతం అయితే జాతీయ స్థాయిలో ‘science fair’ లో పాల్గొనచ్చని మిస్ రైలీ అని ఓ టీచరు ప్రోత్సహిస్తుంది. ఈవిడకి ఈ పిల్లలు అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా హోమర్ పెద్దయ్యాక మంచి ప్రయోజకుడు అవుతాడని ఆమెకి గట్టి నమ్మకం. ఈ ఆశలు, అవకాశాలు గంగపాలు అయినందుకు పిల్లలు నలుగురూ డీలా పడిపోతారు.

పల్లెకి దూరంగా అడవిలో ఈ విషయం గురించి మాట్లాడుకుంటూ నలుగురూ తచ్చాడుతుంటారు. ఇంతలో హోమర్ కి ఓ ఆలోచన వస్తుంది. తన తండ్రి అసలు రాకెట్ తో ప్రయోగాలు చేసుకోమన్లేదు. కంపెనీ పరిసరాలలో చెయ్యొద్దన్నాడు అంతే. కనుక కంపెనీ సరిహద్దుల బయట ఎక్కడైనా మళ్లీ ప్రయోగాలు కొనసాగిద్దాం అంటాడు. తక్కిన ముగ్గురూ ముందు ఒప్పుకోరు. కంపెనీ పరిసరాలకి అవతలికి అంటే గ్రామం నుండి ఎనిమిది మైళ్ళు నడవాలి. జరిగే పని కాదంటారు.

అప్పుడు హోమర్ అంటాడు – “చూడండి! ఈ ఊళ్లో పుట్టిన దౌర్భాగ్యానికి మనందరి జీవితాలు ఆ బొగ్గు గనిలోనే తెల్లారబోతున్నాయి. లేక లేక ఓ మంచి అవకాశం దొరికింది. జాతీయ స్థాయిలో సైన్స్ ఫెయిర్ పోటీలో నెగ్గితే మనకి స్కాలర్షిప్ లు వస్తాయి. పై చదువులకి మంచి విశ్వవిద్యాలయాకి వెళ్ళొచ్చు. ఈ అవకాశం వొదులుకుంటే ఓ చీకటి కూపమే గతి. కొంచెం దూరదృష్టితో ఆలోచించండి. ఈ అవకాశం వొదులుకోవద్దు. ఇది తప్ప మనకి వేరే దారి లేదు.”

ముగ్గురు పిల్లలూ ఒప్పుకుంటారు. గ్రామానికి ఎనిమిది మైళ్ళ దూరంలో ‘స్నేక్ రూట్’ (Snakeroot) అనే ప్రదేశానికి వెళ్ళి చూస్తారు. అక్కడో విశాలమైన మైదానం కనిపిస్తుంది. ఆ ప్రాంతం అంతా పూర్తిగా నిర్జనంగా ఉంటుంది. నలుగురికీ ఆ ప్రాంతం బాగా నచ్చుతుంది. అక్కడో ‘లాంచ్ పాడ్’ నిర్మించాలని నిశ్చయించుకుంటారు.



రాకెట్ కి వత్తి అంటించాక ఊరంగా వెళ్లి దాక్కోవడానికి ఓ బంకర్ లాంటిది నిర్మించాలని అనుకుంటారు. అందుకు కావలసిన సరంజామా కోసం దండుకునే కార్యక్రమంలో పడతారు. గ్రామస్థులు తలా ఒక రకంగా సహాపడతారు. కలప, మేకులు, రేకులు ఇలా ఎంతో సరంజామా ఉచితంగా అందుతుంది.



కాని బంకర్ కి పునాది వెయ్యడానికి కొంచెం సిమెంట్ కావాలి. హోమర్ తండ్రి ఫాక్టరీలో చాలా సిమెంట్ ఉంటుంది. తిడతాడని తెలిసినా గత్యంతరం లేక వెళ్ళి కొంచెం సిమెంట్ కావాలని తండ్రిని అడుగుతాడు –

“ఇంకా మీరు రాకెట్లతో ఆ పిచ్చి పిచ్చి ప్రయోగాలు మానలేదు అన్నమాట!” తండ్రి కాస్త కోపంగా అడుగుతాడు.

“కంపెనీ పరిసరాల్లో వద్దన్నారు అంతే. స్నేక్ రూట్ మీ కంపెనీకి చెందదుగా?”

“అంటే ఎనిమిది మైళ్ళు నడిచి వెళ్తారన్నమాట?”

“అవును నాన్నా,” తలవంచుకుని అంటాడు హోమర్.

“నాకు తెలియక అడుగాను హోమర్. ఒక్క విషయం చెప్పు. ఆ వెర్నర్ వాన్ బ్రౌన్, అతడి జర్మను పటాలం అంతా అక్కడ ఏం పొడిచేస్తున్నారంటావ్? నన్నడిగితే ఈ రాకెట్ల గోల అంతా ఓ పెద్ద ‘స్టంట్’ తప్ప మరింకేమీ లేదంటాను.”

“అంతరిక్ష పోటీలో రష్యన్ల కన్నా ముందు ఉండడం మీకు వట్టి ‘స్టంట్’ లాగా కనిపిస్తోందా నాన్నా?”

“కాక మరింకేంటి? కొత్తలో ఏదో సంబరం. నాలుగు రోజులు పోతే ముచ్చట తీరిపోతుంది. అప్పుడు ఆ మొత్తం జర్మన్ ముఠాని ఇంటికి పంపించేస్తారు. అప్పుడు అంతా ఈ పిచ్చి వేషాలు మానేసి అసలు సిసలైన ఉద్యోగాలు వెతుక్కోవాలి.”

“అంటే బొగ్గుగనిలో అనా మీ ఉద్దేశం?”

“ఇదుగో చూడు హోమర్! మనం తీసే బొగ్గు వల్ల స్టీలు ఉత్పత్తి సాధ్యం అవుతుంది. స్టీలు ఉత్పత్తి పడిపోతే అసలు దేశమే పడిపోతుంది. నీ బుర్రలో ఓ బఠాణీ అంత మెదడు ఉన్నా ఈ విషయం అర్థం అవుతుంది అనుకుంటాను. వెళ్ళవతలకి,” అని కసురుతాడు. హోమర్ కోపంగా వెళ్ళిపోబోతుంటే వెనక్కి పిలిచి తండ్రి అంటాడు – “ ఈ మధ్య ఇక్కడ ఓ చిన్న రోడ్డు వేశారు. కొంచెం సిమెంట్ మిగిలి ఉండాలి. వర్షంలో కొద్దిగా తడిసి ఉండోచ్చు. నీకేమైనా పనికొస్తుందంటే తెప్పిస్తాను,” అంటాడు.

“థాంక్స్ నాన్నా” అని కృతజ్ఞతలు చెప్పుకుని బయటికి నడుస్తాడు హోమర్. బయటి వాళ్ల మాటెలా వున్నా ఈ విషయంలో తన తండ్రి కాస్తంత ప్రోత్సహించినా చాలు తనకి కొండంత బలం వచ్చినట్టు ఉంటుంది.

లాంచ్ పాడ్ నిర్మాణానికి కావలసిన సరంజామా ఇప్పుడు అమరింది. ఇక లాంచ్ చెయ్యడమే తరువాయి.

(ఇంకా వుంది)





















1 Responses to లాంచ్ పాడ్ నిర్మాణం

  1. శివ Says:
  2. ఆ బాగుంది.తరువాత ఏమైంది.

     

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts