కాని ఈ సారి రాకెట్ దారి తప్పకుండా సూటిగా బాణంలా నింగి లోకి దూసుకుపోతుంది.
హోమర్ నేస్తాల సంతోషానికి హద్దుల్లేవు.
రాకెట్ లాంచ్ విజయవంతం అయిన వార్త ఊరంతా పొక్కుతుంది. ఆ వార్త బళ్లో కూడా సంచలనం సృష్టిస్తుంది.
ఒక్కసారిగా సైన్స్ ఫెయిర్ లో నెగ్గే అవకాశాలు పెరుగుతాయి. వాళ్ల సైన్స్ టీచరు మిస్ రైలీ బాగా ప్రోత్సహిస్తుంది. ‘ఎట్టి పరిస్థితుల్లో పోటీ చెయ్యడం మాత్రం మానుకోకండి. మీరు జాతీయ స్థాయిలో విజయం సాధిస్తే మీ జూనియర్లతో మీ గురించి గొప్పగా చెప్పుకుంటాను’ అంటుంది.
పిల్లలు నలుగురూ సైన్స్ పోటీకి సన్నాహాలు మొదలుపెడతారు.
ఆ రోజు హోమర్ పుట్టినరోజు. హోమర్ అమ్మ ఆ రోజు తను స్వయంగా కుట్టిన స్వెటర్ ఒకటి కొడుక్కి బహుమతిగా ఇస్తుంది. అంతకన్నా అపురూపమైన మరో బహుమతి కూడా అందుతుంది. తన లాంచ్ విజయవంతం అయిన సందర్భంలో వెర్నర్ ఫాన్ బ్రౌన్ నుండి అభినందనలు తెలుపుతూ ఉత్తరం వస్తుంది. అందులో ఫాన్ బ్రౌన్ పుట్టిన రోజు శుభాకాంక్షలు కూడా తెలుపుతాడు. హోమర్ సంతోషం ఆకాశాన్నంటుతుంది.
అలాంటి తరుణంలో హోమర్ తండ్రి గదిలోకి వస్తాడు. హోమర్ సైన్స్ పోటీలో పాల్గొంటున్న విషయం గురించి తల్లి తన భర్తతో చెప్తుంది. మొదట్నించీ ఈ రాకెట్ల పొడ గిట్టని తండ్రి వ్యతిరేకంగా మాట్లాడతాడు. తండ్రి కొడుకుల మధ్య మాట మాట పెరుగుతుంది.
హోమర్ కోపంగా ఇంట్లోంచి వెళ్ళిపోతాడు.
వెళ్ళి మిస్ రైలీతో తన గోడు చెప్పుకుంటాడు. మిస్ రైలీ పుట్టిన రోజు బహుమానంగా ‘క్షిపణుల భౌతిక శాస్త్రం’ (missile physics) మీద ఓ పెద్ద పుస్తకం ఇస్తుంది. ఇది తను చదువుతున్న తరగతి కన్నా చాలా పై స్థాయికి చెందిన పుస్తకం అని, కాని ముందు ముందు ఈ స్థాయిలో పరిజ్ఞానం అవసరం అని చెప్తుంది.
మిస్ రైలీ ఈ నలుగురు పిల్లలని ప్రోత్సహిస్తున్న తీరు ఆ బడి హెడ్ మాస్టరు కి నచ్చదు.
‘ఎవడో నూటికొకడికి ఫుట్ బాల్ స్కాలర్షిప్ వస్తుంది. ఆ అదృష్టవంతుడు పై చదువులకి పొరుగూరికి వెళ్తాడు. తక్కిన వాళ్లందరి బతుకులు బొగ్గు గని లోనే తెల్లారబోతాయి.’ ఇదీ హెడ్ మాస్టరు సిద్ధాంతం. కనుక ‘పిల్లల మనసులో అనవసరమైన ఆశలు కలిగించొద్దు’ అని మిస్ రైలీ ని మందలిస్తాడు. మిస్ రైలీ వ్యతిరేకిస్తుంది. ‘వాళ్ళు ఈ మురికి కూపం లోంచి బయటపడడానికి ఓ టీచరుగా ఏదో ఒకటి చెయ్యకపోతే అసలు నాకు పిచ్చెక్కేలా వుంది’ అంటుంది.
ఇలా ఉండగా హోమర్ ఇంట్లో పరిస్థితులు మారతాయి. హోమర్ అన్న జిమ్ కి ఫుట్ బాల్ స్కాలర్షిప్ రాగా, పై చదువులకి పొరుగూరు వెళ్తాడు.
ఇలా ఉండగా హోమర్ నేస్తాలు మరో లాంచ్ కి సిద్ధం అవుతారు. ఈ సారి రాకెట్ విఫలం కాదన్న నమ్మకంతో ఊళ్లో వారిని లాంచ్ కి ఆహ్వానిస్తారు. హోమర్ తన తండ్రిని లాంచ్ రమ్మని పిలుస్తాడు.
‘తీరికలేదు …’ అని నసుగుతాడు తండ్రి.
‘అదే అన్నయ్య ఫుట్ బాల్ ఆడితే చూడడానికి తీరిక ఉంటుందేం?’ అంటూ నిష్టూరంగా మాట్లాడి వెళ్ళిపోతాడు హోమర్.
ఇంతలో గనిలో ఏదో ప్రమాదం జరిగిందని ఫోన్ వస్తే ఆదరాబాదరాగా వెళ్లిపోతాడు హోమర్ తండ్రి.
లాంచ్ చాలా ఘనంగా జరుగుతుంది. ఊరు ఊరంతా కదిలి వస్తుంది లాంచ్ ని చూడడానికి. కుర్రాళ్ల ప్రతిష్ట పెరిగిపోతుంది. ఆడపిల్లలు అభిమానులు అవుతారు! రాకెట్ ఎదురులేకుండా నీలాకాశంలోకి దూసుకుపోతుంది.
ఆ సంఘటన గురించి రాయడానికి ఓ స్థానిక పత్రికా విలేఖరి కూడా వస్తాడు.
మర్నాడు ఆ ముచ్చట అంతా దినపత్రికలో వస్తుంది. హోమర్ తరగతిలో ఓ చక్కని చుక్క ఆ దినపత్రిక ప్రతి ఒకటి తెచ్చి హోమర్ ని దాని మీద ఆటోగ్రాఫ్ చెయ్యమంటుంది.
ఇంతలో బళ్లోకి ఒక్కసారిగా కొంతమంది పోలీసులు ప్రత్యక్షమవుతారు. ‘ఇక్కడ హోమర్ అంటే ఎవరు?’ గద్దిస్తాడు పోలీస్ ఆఫీసర్.
హోమర్ కి, అతడి స్నేహితులకి బేడీలు వేసి బర బర లాక్కుపోతారు పోలీసులు.
(ఇంకా వుంది)
Image credits: http://www.mercury-rockets.com/Model_Rocket_Gallery.html
0 comments