ఇదేదో బొగ్గు గనిలా వుంది.
“ఇదేదో బొగ్గు గని!” అరిచాను.
“నిర్మానుష్యమైన బొగ్గు గని,” అన్నాడు మామయ్య.
“ఎవరూ లేరని ఎలా తెలుసు?” అన్నాను.
“నాకు తెలుసు,” అన్నాడు మామయ్య ధృవంగా. బొగ్గు స్తరాలని దొలుస్తూ పోతున్న ఈ సొరంగం మానవనిర్మితం కాదని నాకు నిశ్చయంగా తెలుసు. దీన్ని చేసింది మానవ హస్తమైనా, ప్రకృతి హస్తమైనా ఇప్పుడది మనకి అంత ముఖ్యం కాదు. భోజనం వేళ అయ్యింది. రా భోజనం చేద్దాం.”
హన్స్ భోజనం తయారు చేశాడు. నాకు పెద్దగా ఆకలి వెయ్యలేదు. నా వంతుగా అందిన కాసిని నీటి బొట్లతో గొంతు తడుపుకున్నాను. సగం నిండిన ఫ్లాస్క్ తో ముగ్గురు మనుషుల దాహం తీరాల్సి వుంది.
భోజనం పూర్తి కాగానే మా ఇద్దరు నేస్తాలు రగ్గులు కప్పుకుని హాయిగా ఆదమరచి నిద్రపోయారు. బాగా అలసిపోయినట్టున్నారు. నాకు నిద్రపట్టలేదు. ఉదయం వరకు ఒక్కొక్క గంట లెక్కెడుతూ ఉండిపోయాను.
మర్నాడు శనివారం తెల్లారే ఆరు గంటలకే బయల్దేరాం. ఇరవై నిముషాలు నడవగానే ఓ విశాలమైన ప్రదేశం లోకి ప్రవేశించాం. ఈ గని తవ్వింది మనిషి కాదని తెలుస్తోంది. ఇంత లోతులో చూరు కూలిపోకుండా ఎత్తిపట్టడం అంత సులభం కాదు. ఏదో అద్భుత హస్తం ఎత్తి పట్టుకున్నట్టు మా నెత్తిన చూరు నిలిచింది.
మేం ఉన్న గుహలాంటి ప్రాంతం యొక్క వెడల్పు నూరు అడుగులు, ఎత్తు నూట యాభై అడుగులు ఉంటుందేమో. భూగర్భంలో పుట్టిన ఏదో సంక్షోభం వల్ల బ్రహ్మాండమైన శిలా పదార్థం పెల్లగించబడినట్టు వుంది. అడుగు నుండి తన్నుకొచ్చిన ఏదో శక్తి వల్ల ఓ పెద్ద గొయ్యి ఏర్పడింది. ఆ గోతిలోకి మొట్టమొదటి సారిగా ముగ్గురు మానవమాత్రులు రంగప్రవేశం చేస్తున్నారు.
ఈ కళావిహీనమైన చీకటి గోడల మీద కార్బనీఫెరస్ కాలానికి చెందిన చరిత్ర మొత్తం విపులంగా చెక్కినట్టు కనిపిస్తోంది. ఆ కాలానికి చెందిన వివిధ దశలన్నిటినీ భౌగోళిక శాస్త్రవేత్త ఇక్కడ గుర్తించిగలిగి వుండేవాడేమో. బొగ్గు పొరలకి మధ్య ఇసుక రాతి స్తరాలు, సంఘటితమైన బంకమట్టి పొరలు కనిపిస్తున్నాయి. పైనున్న పొరల భారానికి ఈ స్తరాలు నలిగిపోతున్నట్టు ఉన్నాయి.
భూమి మీద రెండవ దశకి కొంచెం ముందు ఉన్న పరిస్థితులలో సువిస్తారమైన జీవ సంపద ఉండేది. వాతావరణంలో ఉష్ణోగ్రత, తేమ అధికంగా ఉండడం అలాంటి జీవన వృద్ధికి దొహదం చేసింది. వాయుమండలం అంతా ఆవిరిమయం కావడంతో వాతావరణంలోకి సూర్య కిరణాల ప్రవేశం కష్టం అయ్యేది.
మరి సూర్యకిరణాల చొరబడక పోతే వాతావరణం ఎలా వేడెక్కినట్టు? అంటే ఆ వేడి అంతా సూర్యుడు కాని మరేదో ఉష్ణమూలం నుండి వచ్చి ఉంటుంది అనుకోవాలి. ఆ వేడికి వాతావరణం నిరంతరం అట్టుడికినట్టు ఉడికిపోతూ ఉండేదేమో. ఇక పగలు, రాత్రి అనే చక్రిక పరిణామానికి పెద్దగా ప్రాముఖ్యత ఉండేది కాదేమో. ఋతువులు కూడా లేకపొవచ్చు. ధ్రువాల నుండి భూమధ్య రేఖ వరకు సమంగా విస్తరించిన ఒక విధమైన ఉష్ణమయమైన వాతావరణం. ధరావ్యాప్తమైన తీవ్ర తాపం. మరి ఆ వేడి అంతా ఎక్కణ్ణుంచి వచ్చినట్టు? భూగర్భం లోంచా?
ప్రొఫెసర్ లీడెన్ బ్రాక్ సిద్ధాంతాలని పక్కన బెడితే, ఆ కాలంలో పుడమి గుండెల్లో ఓ మహోగ్ర తాపం దాగి వుండేది. భూమి పైపొరలలో ఆఖరు పొర వరకు ఆ తాపపు ప్రతాపం యొక్క ఆనవాళ్లు కనిపిస్తూ ఉండేవి. సూర్య రశ్మి నుండి శక్తిని తీసుకునే ఒడుపు తెలీని ఆ కాలపు మొక్కలు పూల, పరిమళాల సౌభాగ్యానికి నోచుకోలేదు. కాని వాటి వేళ్లు మాత్రం కాలే నేలలోకి లోతుగా చొచ్చుకుపోయి, అక్కడి నుండి శక్తిని జుర్రుకునే కౌశలాన్ని అలవరచుకున్నాయి.
ఆ కాలంలో చెట్లు ఇంచుమించు లేవనే చెప్పాలి. పత్రయుత మొక్కలే* ఉండేవి. రకరకాల గడ్డి ఏపుగా పెరిగేది. ప్రస్తుతం వినష్టమైన, అరుదుగా కనిపించే ఎన్నో చిట్టి పొట్టి మొక్కల జాతులు ఆ కాలంలో పుష్కలంగా పెరిగేవి.
(*పత్రయుత మొక్కలు (herbaceous plants): చెప్పుకోదగ్గ కాండం లేకుండా నేలబారుగా పెరిగే మొక్కలు. బంగాళదుంప, కారట్ మొదలైనవి ఈ కోవకి చెందిన మొక్కలే.)
ఆ కాలంలో ఉండే అపారమైన వృక్షసంపదే ఇప్పుడు మా చుట్టూ కనిపించే బొగ్గుకి మూలం. అయితే భూమి యొక్క పైపొర భూగర్భంలో ఉండే ద్రవ్యశక్తుల ప్రభావానికి లొంగిపోయింది. ఆ విధంగా ఏర్పడ్డవే ఈ చీలికలు, అగాధాలు. నీటి అడుక్కి మునిగిపోయిన మొక్కల అవశేషాలు అంచలంచెలుగా అపారమైన జీవపదార్థ రాశిగా ఏర్పడ్డాయి.
తదనంతరం ప్రకృతి యొక్క రసాయన చర్యలు ఆరంభం అయ్యాయి. సముద్రపు అట్టడుగున పోగైన వృక్షపదార్థం అంతా ముందు పీట్ బొగ్గుగా మారింది. అలా ఏర్పడ్డ వాయువుల వల్ల, ఆ వాయువల చర్యల నుండి పుట్టిన ఉష్ణం వల్ల, ఆ పదార్థం కుళ్లి, తగు చర్యల వల్ల ఖనిజరూపాన్ని దాల్చింది.
ఆ విధంగా భూగర్భంలో ఈ బృహత్తరమైన బొగ్గు క్షేత్రాలు ఏర్పడ్డాయి. అయితే ఈ గనులు కూడా అక్షయమేమీ కాదు. ఈ వనరులని మనం ప్రస్తుతం వినియోగించే వేగంలో వినియోగిస్తూ పోతే, పారిశ్రామిక ప్రపంచం ఏవైనా కొత్త శక్తి వనరులని కనుక్కుంటే తప్ప, మరో మూడు శతాబ్దాలలో ఈ ఇంధనం అంతా హరించుకుపోతుంది. (*)
(*ఈ పుస్తకం 1864 లో వెలువడింది అన్న సంగతి గమనించాలి. - అనువాదకుడు)
భూమిలో ఈ ప్రాంతాలలో నిక్షిప్తమై వున్న ఖనిజ సంపద గురించి ఆలోచిస్తూంటే ఈ ఆలోచనలన్నీ నా మనసులో మెదిలాయి. ఇంత లోతుల్లో ఉండే గనులని మనుషులు ఎప్పటికీ కనుక్కోలేరని అనుకుంటాను. ఇంత లోతు నుండి బొగ్గు పైకి తీయడానికి చెప్పలేనంత ఖర్చు అవుతుంది. అయినా భూమి ఉపరితలానికి దగ్గరిగా అంత సులభంగా బొగ్గు దొరుకుతున్నప్పుడు ఇంత లోతు నుండి బొగ్గు తియ్యాల్సిన అవసరం ఏవుంది?
అలాగే మేం నడుస్తూ ముందుకు సాగిపోయాం. చుట్టూ కనిపించే భౌగోళిక విశేషాలు చూస్తూ మైమరచి పోవడం చేత నాకు ఎంత దూరం వచ్చామో కచ్చితంగా తెలియకుండా వుంది. ఇందాక లావా ప్రాంతంలో ఉష్ణోగ్రత ఎంతుందో ఇక్కడ కూడా అంతే వుంది. అంతలో ఉన్నట్టుండి ఏవో హైడ్రోకార్బన్ వాయువుల వాసనకి నా ముక్కుపుటాలు అదిరాయి.
ఈ వాయువు ఓ ప్రమాదకరమైన వాయువు అని త్వరలోనే అర్థమయ్యింది. గనులలో పని చేసేవారు దీన్ని minedamp అంటారు. ఈ వాయువు వల్ల గనుల్లో అగ్నిప్రమాదాలు, విస్ఫోటాలు సంభవిస్తుంటాయి.
అదృష్టవశాత్తు మేం వాడుతున్న దీపం మామూలు నూనె దీపం కాదు. ఇది రమ్ కోర్ఫ్ రూపొందించిన అద్భుతమైన దీపం. అలా కాకుండా మేం గాని దివిటీలతో వచ్చి వుంటే ఇక ఇంతే సంగతులు!
బొగ్గు గని ద్వారా మా ప్రయాణం రాత్రి వరకు సాగింది. మా బాట నేలకి సమాంతరంగా ఉండడం మామయ్యకి ససేమిరా నచ్చలేదు. మా ఎదుట ఏముందో ఇరవై గజాలకి మించి కనిపించదు. కనుక అసలు ఈ సొరంగ మార్గం ఎంత పొడవు ఉందో అంచనా వెయ్యడం కష్టమయ్యింది. ఈ దారికి అంతే లేదేమో అనుకున్నాను ఒక తరుణంలో. అంతలో సరిగ్గా ఆరు గంటలకి ఓ గోడ మా దారికి అడ్డుగా నిలిచింది. ఇక కుడి, ఎడమ పక్కలకి గాని, పైకి గాని, కిందకి గాని దారి లేదు.
“చివరి దాకా వచ్చేశాం అన్నమాట,” మామయ్య అన్నాడు తాపీగా. “ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. సాక్నుస్సేం సూచించిన మార్గం ఇది కాదు. కనుక వెనక్కి తిరిగి వెళ్లాల్సిందే. ఈ రాత్రికి ఇక్కడే విశ్రమించి రేపు పొద్దున్నే మళ్లీ బయల్దేరుదాం. మూడు రోజులు ప్రయాణిస్తే మళ్లీ దారి రెండుగా చీలిన చోటికి చేరుకుంటాం.”
“అవును నిజమే. రేపు ఉదయానికి ఒంట్లో ఏవైనా ఓపిక మిగిలి వుంటే,” కాస్త వ్యంగ్యంగా అన్నాను.
“ఏం? ఓపిక కేమయ్యింది పాపం?” మామయ్య కాస్త చిరాగ్గా అన్నాడు.
“ఎందుకంటే రేపటికి ఇక నీరు ఒక బొట్టు కూడా మిగలదు కనుక.”
“నీరు లేకపోతేనేం, ధైర్యం ఉంటే చాలదూ?” మామయ్య కటువుగా అన్నాడు.
ఆయనకి సమాధానం చెప్పడానికి నాకు ధైర్యం చాలలేదు.
(ఇరవయ్యవ అధ్యాయం సమాప్తం)
http://www.mammothgardens.com/inksters/2008-11-Nov/November08.html
0 comments