అధ్యాయం 25
ఎంత దూరం? ఇంకెంత దూరం?
మర్నాడు తెల్లారే లేచి పరుగు పెట్టాల్సిన పని లేదని తెలియడం
వల్ల కాస్త ఆలస్యంగా లేచాను. మనిషికి తెలిసిన అత్యంత లోతైన ప్రాంతంలో ఉన్నా ఈ పరిసరాలలో
ఏదో కొత్త అందం కనిపిస్తోంది. పైగా ఈ గుహాంతర వాసానికి ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నాను.
ఇక సూర్య, చంద్ర, తారల గురించి చెట్లు చేమల గురించి, ఇళ్ళ గురించి ఊళ్ల గురించి ఆలోచించడం
మానేశాను. భూమి ఉపరితలం మీద జీవించే మానవమాత్రుల తాపత్రయాలేవీ ఇప్పుడు నా మనసుని తాకడం
లేదు.
మేం వున్న సొరంగం ఓ విశాలమైన చీకటి మందిరం. దాని గ్రానైట్
నేల మీద మా అంతర్వాహిని ప్రవహిస్తోంది. దాని జన్య స్థానం నుండి బాగా దూరానికి వచ్చేయడంతో
నీరు వేడి తగ్గి కేవలం గోరువెచ్చగా ఉండడంతో ఆ నీళ్ళు కడుపారా తాగాం.
పొద్దున్న
టిఫిన్ చేశాక ప్రొఫెసరు కొన్ని గంటలు కేటాయించి ఏవో లెక్కలు చేసుకోవడానికి కూర్చున్నాడు.
“మనం
ఎక్కడున్నామో కచ్చితంగా నిర్ధారించడానికి లెక్కలు వేస్తాను. ఇంటికి తిరిగి వచ్చాక మన
మొత్తం యాత్రా మార్గాన్ని చిత్రిస్తూ ఓ మ్యాపు గియ్యాలని వుంది. ఆ మ్యాప్య్ గోళం మీద
కాదు గోళం యొక్క పరిచ్ఛేదం మీద చిత్రించబడుతుంది. అందులో మన యాత్రా మార్గం అంతా ప్రదర్శించబడుతుంది”
అన్నాడు మామయ్య.
“అవునా
మావయ్యా? కాని అలా చేయడానికి మీ పరిశీలనలు
తగినంత నిర్దుష్టంగా ఉన్నాయని నమ్మకం ఏంటి?” అడిగాను.
“నాకా
విషయంలో పూర్తి నమ్మకం వుంది. ప్రతీ చోట కోణాలని, వాలు ని కొలుస్తూ వచ్చాను. దోషం వచ్చే
ప్రసక్తే లేదు. ప్రస్తుతం ఎక్కడున్నామబ్బా? దిక్సూచిని పైకి తీసి ఎటు చూపిస్తోందో ఓ
సారి రాసుకో.”
“దక్షిణ
తూర్పు దిశకి, తూర్పుకి మధ్య.”
ప్రొఫెసరు
హడావుడిగా ఏవో లెక్కలు వేసి “బయల్దేరిన చోటి నుండి ఎనభై ఐదు కోసుల దూరం వచ్చాం” అన్నాడు.
“అంటే
అట్లాంటిక్ సముద్రం కింద వున్నాం అన్నమాట.”
“నిస్సందేహంగా.”
“బహుశ
ఈ క్షణం పైన సముద్రపు ఉపరితం మీద ఏ తుఫానో సముద్ర జలాలని అతలాకుతలం చేస్తూ ఉందేమో?”
“కావచ్చు.”
“తిమింగలాలు
తమ తోకల కొరడాలతో సముద్రపు నేల మీద చెళ్లు మనిపిస్తున్నాయేమో?”
“కావచ్చు
గాని ఏక్సెల్. ఆ సంఘటనలేవీ మనం అసలు పట్టించుకోనక్కర్లేదు. మనం మళ్ళీ మన లెక్కలు ఓ సారి పరిశీలిద్దాం. ఇక్కడ మనం స్నెఫెల్
పర్వతానికి దక్షిణ-తూర్పు దిశలో ఎనభై ఐదు కోసుల దూరంలో వున్నాం. అంటే పదహారు కోసుల
లోతులో వున్నామని నా అంచనా.”
“పదహారు
కోసులా?” అరిచినంత పని చేశాను.
“సందేహమే
లేదు.”
“అంటే
విజ్ఞాన శాస్త్రం ప్రకారం భూమి పైపొర అయిన క్రస్ట్ యొక్క సరిహద్దులు ఇక్కడితో ఆగిపోతాయనుకుంటా?”
“కాదనలేను.”
“మరి
భూమి లోతుకి పోతున్న కొద్ది ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది కనుక, ఉష్ణోగ్రత 2732 F ఉండాలే?”
“సరిగ్గా
చెప్పావు అల్లుడూ?”
“ఆ
వేడికి ఈ కఠిన శిల అంతా కరిగి ప్రవహిస్తూ ఉండాలే?”
“మరి
అలా జరగడం లేదు కనుక ఈ వాస్తవాలు కొన్ని సిద్ధాంతాలని మట్టి కరిపిస్తున్నాయన్నమాట.”
“నాకు
నమ్మశక్యం కావడం లేదు.”
“ఇంతకీ
థర్మామీటరు ఎవంటోంది?”
“82
F అని చూపిస్తోంది.”
“అంటే
పండితులు పప్పులో కాలేశారన్న మాట. వారి సిద్ధాంతాలకి వాస్తవానికి మధ్య 2705 F వారడి
వుంది. లోతుకి ఉష్ణోగ్రతకి మధ్య రేఖీయమైన సంబంధం వుందన్న భావన సరైనది కాదు. హంఫ్రీ
డేవీ చెప్పిందే నిజం. ఆయన మార్గంలో నేను నడవం కూడా సరైనదే. అంతేనంటావా?”
“ఏవనాలో
పాలుపోవడం లేదు.”
నిజానికి
ఆ క్షణం ఎన్నో మాటలు అనాలని అనిపించింది. నోటి దాకా వచ్చాయి గాని నోరు పెగలలేదు. డేవీ
సిద్ధాంతాన్ని నేను అంతగా నమ్మను. కేంద్రంలో అపారమైన ఉష్ణం ఉందన్న సిద్దాంతమే నాకు
సబబు అనిపిస్తుంది.
కాని
ఇప్పుడు కొత్త వాదనల గురించి ఆలోచించకుండా మా ప్రస్తుత పరిస్థితిని ఓ సారి పునరావలోకనం
చేసుకుంటూ అన్నాను.
“మీ
లెక్కలన్నీ నిజమని అనుకుంటే వాటి ఆధారంగా ఓ కచ్చితమైన నిర్ణయానికి రావచ్చని అనిపిస్తోంది.”
“అదేంటో
చెప్పు.”
“ఐస్లాండ్
లాటిట్యూడ్ వద్ద, అంటే సరిగ్గా మనం వున్న చోట, భూమి యొక్క వ్యాసార్థం 1583 కోసులు.
అంటే ఉజ్జాయింపుగా 1600 కోసులని, లేదా 4800 మైళ్ళని అనుకుందాం. 1600 కోసుల లోతులో ప్రస్తుతానికి
పదహారు కోసుల లోతుకి వచ్చాం.”
“అంతే కదా మరి.”
“అంత లోతుకి రావడానికి నేలకి సమాంతరంగా 85 కోసులు ప్రయాణించాల్సి
వచ్చింది.”
“కచ్చితంగా అంతే.”
“అందుకు ఇరవై రోజులు పట్టింది.”
“అవును.”
“పదహారు కోసులు అంటే భూమి వ్యాసార్థంలో నూరో వంతు. ఈ లెక్కన
భూమి కేంద్రం చేరడానికి రెండు వేల రోజులు, అంటే ఐదున్నర ఏళ్లు పడుతుంది.”
(ఇంకా వుంది)
మీ బ్లాగ్ రెగ్యులర్గా చదువుతానండి. చాలా బాగుంటుంది.
ఒకేచోట...మన తెలుగు బ్లాగర్లూ, పాఠకులూ~
ఈ మధ్యనే ఈ ఫేస్బుక్ గ్రూపుని ప్రారంభించాo. దీనిలో మీబ్లాగుని పరిచయంచేసే ఉద్దేశ్యంతో మీ లింక్ గ్రూపులో ఇచ్చాను.
మీ బ్లాగు లో పొస్ట్ కోసం రోజూ ఎదురు చూస్తూ ఉంటాను అండి...నిజంగా మంచి బ్లాగు... ముఖ్యంగా పాతాళానికి ప్రయాణం కోసం ఇతే రోజూ ఎదురు చూస్తూ ఉంటాను...
ఇంత మంచి బ్లాగును అందించినందుకు Thanks andi
కిషోర్ గారు, నాగ్ గారు,
మీ లాంటి వారి అభినందనలు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తాయి. ధన్యవాదాలు.
సర్! ఒక అసందర్బపు ప్రశ్న .. లార్జ్ హాడ్రన్ కొలైడర్ వలన భూమికి ఏం ప్రమాదం లేదంటారా?