వైరస్ వల్ల కలిగే వ్యాధులు అంటువ్యాధుల (infectious diseases) కోవలోకి వస్తాయి. అందుకే ఇవి సులభంగా వ్యాపించి కొన్ని సార్లు ప్రపంచ వ్యాప్తంగా ఎనలేని ప్రాణనష్టానికి కారణం కాగలవు. అలా ప్రపంచ వ్యాప్తంగా వ్యాధి వ్యాపించే పరిణామాన్ని pandemic అంటారు. అయితే అంటువ్యాధులన్నీ వైరస్ ల వల్లనే కలగనక్కర్లేదు. బాక్టీరియా, వైరస్, ఫంగస్ (శిలీంధ్రం), ప్రోటోజువా, బహుళ కణ పరాన్నజీవులు (multicellular parasites) మొదలైన ఎన్నో హానికర జీవాల వల్ల అంటువ్యాధులు కలగొచ్చు. ఇవి కాకుండా ప్రయాన్ (prion) అనబడే దోషాలుగల ప్రోటీన్ సందోహాల వల్ల కూడా ఒక ప్రత్యేక కోవకి చెందిన అంటువ్యాధులు కలగొచ్చు.
మానవ చరిత్రలో పెద్ద మొత్తంలో ప్రాణనష్టం కలిగించిన రెండు ప్రాచీన మహమ్మారి వైరల్ వ్యాధులు – ఇన్ఫ్లూయిన్జా (influenza) మరియు మశూచి (smallpox). ఇక ఇటీవలి కాలంలో పాండిమిక్ స్థాయికి పెచ్చరిల్లిన రెండు వైరల్ వ్యాధులు – HIV (AIDS) మరియు H1N1 వ్యాధులు. ఈ వ్యాధుల స్వరూపం ఏమిటో, వాటి వల్ల కలిగే భీభత్సం ఎలాంటిదో తెలుసుకుందాం.
ఇన్ఫ్లూయిన్జా
వైరస్ ల వల్ల కలిగే అంటువ్యాధుల్లో ఇన్ఫ్లూయిన్జా (influenza) ముఖ్యమైనది. దీన్నే మరింత సంక్షిప్తంగా ఫ్లూ (flu) అంటారు. ఫ్లూ వైరస్ లు మనుషులకే కాక పందులకి, పక్షులకి, దోమలకి, సాల్మన్ చేపలకి, సముద్రపు పేలకి (sea lice) ఇలా ఎన్నో రకాల జీవజాతులకి సోకుతాయి. సాధారణంగా ప్రత్యేక వైరస్ లు కొన్ని ప్రత్యేక జీవజాతులనే అటకాయించగలవు. కాని వైరస్ లకి మారే గుణం వుంటుంది. ఆ మార్పు వైరస్ లలో ఉండే జన్యువులలో కలిగే ఉత్పరివర్తనల (mutations) మీద ఆధారపడుతుంది. (ఈ విషయాలని ముందు ముందు విపులంగా చర్చించుకుందాం.) ఈ ఉత్పరివర్తనవల్ల ఏర్పడ్డ వైరస్ రూపాంతరాలు మనుషులకి కూడా సోకే లక్షణాన్ని సంతరించుకున్నాయి. ఒక్క మనిషికి సోకిందంటే, ఇక మనిషి నుండి మనిషికి పాకుతూ క్రమంగా మానవ సమాజాలలో వ్యాపించగలదు.
వైరస్ లు జంతువుల నుండి మనుషులకి సోకడం అనేది మానవ చరిత్రలో ఇటీవలి కాలంలో జరిగిన ఓ పరిణామం అని చెప్పుకోవచ్చు. సుమారు 10,000 ఏళ్ళ క్రితం మనిషి సేద్యం గురించి తెలుసుకున్నాడు. పొలాలలో తనకి సహాయపడేందుకు గాను అడవి జంతువులని చేరదీసి పెంచుకోవడం మొదలెట్టాడు. ఆ విధంగా మనిషికి, జంతువుకి సాన్నిహిత్యం మొదలయ్యింది. ఆ విధంగా జంతువులకి మాత్రమే సోకే వైరస్ లు మానవ సమాజంలోకి ప్రవేశించడం మొదలెట్టాయి.
ఫ్లూ వల్ల బాధపడే మనిషికి తీవ్రంగా ‘పడిశం’ చేస్తుంది. ఆ స్థితిలో దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు లోనున్న వైరస్ గాల్లోకి వెలువడి సులభంగా వ్యాపించగలదు. జనాభా సాంద్రత ఎక్కువగా ఉన్న చోట్ల మరింత సులభంగా వ్యాపించగలదు. అందుకే ఈ వ్యాప్తిని అదుపుచెయ్యడానికి, అరికట్టడానికి ముఖానికి గుడ్డ కట్టుకోవడం మొదలైన జాగ్రత్తలు తీసుకుంటారు. మనిషిలోని రోగనిరోధక మండలం (immune system) ఈ వైరస్ ని ఒకటి రెండు వారాలలో సులభంగా నియంత్రించగలదు. కాని వృద్ధులకి, పిల్లలకి దీని వల్ల ప్రమాదం కాస్త హెచ్చుగా ఉంటుంది. వేయి కొక్కరు ఈ వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది.
కాని అది నేటి మాట. పరిశుభ్రతా ప్రమాణాలు తగు స్థాయిలో ఉన్న చోట, వైరస్ వ్యాప్తిని అదుపుచెయ్యడానికి తగ్గ జాగ్రత్తలు తీసుకున్న పక్షంలో పరిస్థితి వేరు. కాని ఇవేమీ తెలీయని రోజుల్లో ఈ మహమ్మారి వ్యాధి కోట్ల ప్రాణాలని పొట్టనపెట్టుకుంది. 1918 – 1920 ప్రాంతాల్లో ఈ వైరస్ విచ్చలవిడిగా వ్యాపించడం వల్ల జరిగిన ప్రాణ నష్టం ఐదు నుండి పది కోట్ల వరకు ఉంటుందని అంచనా. దురదృష్ట వశాత్తు ఈ వైరస్ ఉపద్రవం సరిగ్గా మొదటి ప్రపంచ యుద్ధం ముగియగానే యూరప్ మీద విరుచుకుపడింది. ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు వొదిలిన సిపాయిల సంఖ్య కన్నా వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఇంచుమించు రెండు రెట్లు ఉంటుంది. యూ.ఎస్.ఏ. లో మొదలైన ఆ వైరస్ వ్యాధి వేగంగా యూరప్ కి, ఆసియాకి వ్యాపించింది. అక్కడితో ఆగక ఉత్తరాన ఉండే ఎస్కిమో జాతుల వరకు, పశ్చిమాన ఎక్కడో మారుమూల పసిఫిక్ మహాసముద్రం నడిమధ్యలోని దీవుల మీద జీవించే జాతుల వరకు కూడా ఆ వైరస్ విషప్రభావం విస్తరించింది. అలా ఆ వ్యాధి ప్రపంచం అంతా వ్యాపించినా దానికి కొన్ని కారణాల వల్ల ‘స్పానిష్ ఫ్లూ’ అని పేరొచ్చింది. స్పెయిన్ దేశంలో ఆ రోజుల్లో సెన్సార్ నిబంధనలు కాస్త బలహీనంగా ఉండేవి. కనుక వ్యాధి యొక్క వ్యాప్తికి సంబంధించిన వార్తలు ఆ దేశంలో సులభంగా పొక్కేవి. అది ఎంత వరకు వెళ్ళిందంటే ఆ వ్యాధి అసలు స్పెయిన్లోనే పుట్టిందని ప్రచారం కూడా జరిగింది.
జనాభా యొక్క అనియంత్రిత వృద్ధిని అరికట్టడంలో వ్యాధులకి గణనీయమైన పాత్ర పాత్ర ఉంటుందని ఏనాడో 1798 లో ఊహించాడు థామస్ మాల్థస్ అనే ఓ బ్రిటిష్ ఆర్థిక శాస్త్రవేత్త. మాల్థస్ కాలంలో మానవాళి యొక్క పురోగతి గురించి రెండు రకాల దృక్పథాలు చలామణిలో ఉండేవి. అజ్ఞానం, అనారోగ్యం, పేదరికం మొదలైన ప్రతిబంధకాలని తెంచుకుని మానవ సమాజం క్రమంగా, సమిష్టిగా ఎదుగుతుందని, భూమి స్వర్గతుల్యమవుతుందని నమ్మే దృక్పథం మొదటిది. పరిపూర్ణ సమసమాజం గురించి వాదించే విలియం గాడ్విన్ మొదలైన వారు ఈ రకమైన దృక్పథాన్ని స్వీకరించారు.
మాల్థస్ వాదం ఇందుకు విరుద్ధంగా ఉండేది. పరిమిత సహజ వనరులు, యుద్ధాలు, మహమ్మారి వ్యాధులు, ఇవన్నీ చాలనట్టు కేవలం మనుషులలో స్వతస్సిద్ధంగా ఉండే దౌష్ట్యం – ఇవన్నీ మానవ జనాభా యొక్క విశృంఖల వృద్ధిని అరికడతాయని మాల్థస్ వాదించేవాడు. మాల్థస్ ఊహించినట్టుగానే మానవ జనాభా వృద్ధిని నియంత్రించగల సత్తాగల వ్యాధుల్లో ఈ ఫ్లూ ఒకటని కచ్చితంగా చెప్పుకోవచ్చు.
ఫ్లూ లాగానే మరో ప్రాచీన వైరల్ వ్యాధి smallpox. Smallpox ని జయించే ప్రయత్నాలే వైరల్ వ్యాధుల మీద మొట్టమొదటి విజయాలకి చిహ్నాలు.
(ఇంకా వుంది)
References:
1. Christopher Lloyd, What evolved on earth… in brief, Bloomsbury, 2009.
2. http://en.wikipedia.org/wiki/Influenza
3. http://en.wikipedia.org/wiki/Infectious_disease
మాల్థస్ వాదమే క్రమంగా నిజమవుతుందేమో, వైరస్ ల గురించి మంచి సమాచారం..
10వ తరగతి ఎలక్ట్రానిక్స్ బేసిక్స్ ఒకసారి వివరించండి,సార్,వీలైతే..వాహక పట్టి, సంయోజక పట్టిల గురించి కొంచెం విపులంగా,...
పదవతరగతిలో ఎలక్ట్రానిక్స్ ఉందని ఇంతవరకు తెలీదు! పుస్తకం తెచ్చుకుని చూసి రాయడానికి ప్రయత్నిస్తాను.
Is Papaya leaf a cure for Dengue fever?!! Any comments?
http://www.indianexpress.com/news/papaya-leaf-juice-helps-fight-dengue-fever/1022585
I couldnt find any concrete, authentic technical document on papaya leaf juice as a cure to dengue. Newpaper articles cannot be taken as scientific source material.