మానవుడు – అతడి
ప్రతీకలు (Man and his symbols)
కార్ల్ యుంగ్
(Carl Jung)
ఈ బ్లాగ్ లో
ఇంతవరకు మనస్తత్వ శాస్త్రానికి సంబంధించిన పోస్ట్ లు వెయ్యలేదు. ఆధునిక మనస్తత్వ శాస్త్రం
అనగానే సిగ్మండ్ ఫ్రాయిడ్, కార్ల్ యుంగ్ మొదలైన మహామహులు గుర్తొస్తారు. ఈ మధ్యన కార్ల్
యుంగ్ రాసిన Man and his symbols అనే పుస్తకం
దొరికింది. ఇది నిజానికి యుంగ్ మరి కొందరు నిపుణులతో కలిసి రాసిన పుస్తకం. ఇందులో మొదటి
అధ్యాయం Approaching the Unconscious అనే అధ్యాయం
చాలా ఆసక్తి కరంగా అనిపించింది.
వివిధ మానవ సంస్కృతులలో
ఎలా విలక్షణమైన ప్రతీకలు వాడబడుతూ వచ్చాయో చెప్తూ ఎంతో విభిన్నమైన సంస్కృతులలో కూడా
కొన్ని సామాన్య ప్రతీకలు వాడబడడం ఆశ్చకరంగా ఉంటుందని సూచిస్తాడు. దేశ కాలాలలో ఎంతో
ఎడం ఉన్న మానవ సంస్కృతులకి చెందిన ప్రతీకలలో ఏకత్వం ఉండడానికి కారణాలు మన ‘అచేతన’
(unconscious) లో ఉన్నాయన్న చిత్రమైన భావన యుంగ్ యొక్క చింతనకి మూలస్తంభం లాంటిది అని
చెప్పుకోవచ్చు.
మన మనసుని సచేతన
మనసు (conscious mind), అచేతన మనసు (unconscious mind) అని రెండు విభాగాలుగా విభజించవచ్చు.
ఇంద్రియాల ద్వార, ఆలోచన ద్వార తెలుసుకునే దంతా మన సచేతన మనస్సులో జరుగుతోంది. మన సచేతన
మనస్సుకి ‘అడుగున’ లేక ‘వెనుక’ గుప్తంగా ఉన్న మనో విభాగమే అచేతన మనస్సు. (అచేతన మనస్సు
అనే బదులు దాన్ని క్లుప్తంగా అచేతన (unconscious) అని పిలుస్తారు). దాన్ని మనం ప్రత్యక్షంగా
అనుభవించలేం. కాని దాని రహస్య ప్రభావాన్ని మనం సచేతన మనస్సులో అనుభవిస్తాము.
చిన్న ఉదాహరణ.
ఏదో సమావేశంలో లోతుగా మునిగిపోయి వుంటాము. ఏదో ముఖ్యమైన అంశం మీద చర్చ బాగా వేడిగా
కొన్ని గంటల తరబడి సాగింది. చర్చ ముగిశాక ఒక్కసారిగా నాలుక పిడచకట్టుకు పోయినట్టు అనిపిస్తుంది.
బాగా దాహం వేస్తుంది. అయితే ఎప్పట్నుంచో దాహం వేస్తూ ఉండోచ్చు. చర్చలో పడి దాన్ని మనం
పట్టించుకోలేదు. చర్చ పూర్తయ్యాక గాని అంతవరకు ‘అచేతనంగా’ ఉండిపోయిన ‘దాహం వేస్తోంది’
అన్న విషయం ‘సచేతన మనస్సు’లోకి ప్రవేశించలేదు.
అలాగే కొందరంటే
మనకు ఎందుకో ఇష్టం ఉంటుంది. ఎందుకో చెప్పలేం. మరి కొందరంటే మనకి అస్సలు పడదు. అందుకు కారణం ఏంటో తెలీకపోవచ్చు.
అంటే ఆ కారణం మన సచేతన మనస్సుకి తెలీదు. అసలు ‘కారణం’ అచేతన లో ఉంటుంది. కాని అచేతనకి భాష రాదు. కనుక కారణం ఏంటో
బాహటంగా, భాషని వాడి చెప్పలేం. ఈ విధంగా మనకి సచేతన మనసులో జరిగే వ్యవహారాల మీద (అంటే
మన ఆలోచనలు, నమ్మకాలు, అభిప్రాయాలు…) అచేతన మనస్సు యొక్క ప్రభావం రహస్యంగా వున్నా,
ప్రబలంగా ఉంటుంది.
అచేతనకి భాష
రాకపోయినా కొన్ని ప్రత్యేక ప్రతీకలు అనే మాధ్యమాన్ని వాడుకుంటూ అచేతనకి మనతో సంభాషిస్తుంది,
మనకి సంజ్ఞలు చేస్తుంది అంటాడు కార్ల్ యుంగ్. అచేతన యొక్క ఈ ‘పరిభాష’ ని అర్థం చేసుకుంటే
మనం మన జీవితాలని మరింత సమర్థవంతంగా జీవించొచ్చు అంటాడు. మన అచేతనలో ఏముందో తెలుసుకోగలిగితే
మన గురించి మనకి మరింత లోతైన అవగాహన ఏర్పడుతుంది అంటాడు.
కార్ల్ యుంగ్
చింతనలో ఈ అచేతన గురించిన ప్రస్తావన, వర్ణన చాలా ఆసక్తికరంగా ఉంటుంది. పైన చెప్పుకున్న
అధ్యాయం ‘అచేతన’ గురించి అతడి పరిశోధనల సారాంశాన్ని అందజేస్తుంది.
ఆ అధ్యాయం యొక్క
సంక్షిప్తానువాదం కొన్ని పోస్ట్ లలో ఓ సీరియల్ గా వెయ్యాలని ఉద్దేశం.
ఆదివారం 23
ఇంతకీ మేం ఇప్పుడు
ఎక్కడున్నాం? మా పడవ శరవేగంతో ఎటో దూసుకుపోతోంది.
రాత్రి భయంకరంగా
ఉంది. తుఫాను తగ్గుముఖం పట్టే సూచనలేం కనిపించలేదు. తుఫాను హోరుకి చెవులు చిల్లులు
పడుతున్నాయి. చెవుల నుండి రక్తం కారుతోంది. అలాంటి పరిస్థితుల్లో సంభాషణ అసంభవం.
అలుపు లేని మెరుపులు
మరింత తీక్షణమైన తేజంతో చెలరేగిపోతున్నాయి. తెలుపు, నీలి రంగుల గజిబిజి కాంతి రేఖలతో
నింగి, నీరు అలంకరించబడ్డాయి. ఆ కాంతి రేఖలు కింది నీటి మీద పడి, మళ్లీ పైకి తుళ్ళి,
పైనున్న కరకు రాతి చూరుని తాకుతున్నాయి. ఆ ధాటికి పైనున్న ఎత్తైన రాతి చూరు నెత్తిన
పడుతుందేమో నని భయంగా వుంది! కొని మెరుపు తీగలు అగ్నిగోళాల్లా రాశీకృతమై బాంబుల్లా
పేలిపోతున్నాయి. ఆ శబ్ద, కాంతుల దారుణ దాడికి ఇంద్రియాల పటుత్వం సన్నగిల్లుతున్నట్టు
అనిపిస్తోంది. శబ్దం మరీ ఇంత తీవ్రంగా ఉన్నప్పుడు
చెవులు ఒక శబ్దానికి మరో శబ్దానికి మధ్య తేడా పోల్చుకోగల విచక్షణ కోల్పోతాయేమో!
లోకంలో వున్న మందుపాతర అంతా ఒక్కసారిగా పేలినా ఇంత శబ్దం పుట్టదని అనిపించింది.
మేం ఎటుపోతున్నాం?
మావయ్య పడవ లో బోర్లా పడుకుని వున్నాడు.
సోమవారం, ఆగస్టు
24
ఈ వాతావరణంలో
మార్పు రాదా?
నేను, మావయ్య
సొమ్మసిల్లిపోయి వున్నాం కాని, హన్స్ మాత్రం ఎప్పట్లాగే చెక్కుచెదర కుండా వున్నాడు.
దక్షిణ-తూర్పు
దిశగా పడవ తరలిపోతోంది. ఏక్సెల్ దీవిని విడిచిపెట్టిన దగ్గర్నుండి రెండొందల కోసులు
ప్రయాణించాం.
మధ్యాహ్నం కల్లా
తుఫాను భీభత్సం ద్విగుణీకృతం అయ్యింది. పడవ మీద ఉన్న వస్తువులని గట్టిగా పట్టుకుని
అందరం బోర్లా పడి వున్నాం. అలలు అల్లంత ఎత్తుకి లేచి పడుతున్నాయి.
మూడు రోజుల పాటు
అలా మాట మంతి లేకుండా మ్రాన్పడి పడి వున్నాం. ఏవైనా అనాలని నోరు విప్పినా గొంత పెగలదు.
పెగిలినా అవతలి వాడి చెవికి దగ్గరగా జరిగినా ఏమీ వినిపించదు.
మావయ్య నాకు
దగ్గరగా జరిగి ఒక్క మాట మాత్రం అనగలిగాడు – “దారి తప్పినట్టున్నాం. నాకేం అర్థం కావడం
లేదు.”
అందుకు బదులుగా
నేనీ పదాలు రాశాను – “తెరచాప కిందకి దించుదాం.”
మావయ్య ఒప్పుకుంటున్నట్టుగా
తలాడించాడు.
అలా ఊపిన తల
కాస్త పైకెత్తాడో లేదో అల్లంత దూరం నుండి ఓ అగ్నిగోళం కెరటాల మీద దూసుకొస్తూ పిడుగులా
మా పడవ మీద పడింది. ఆ దెబ్బకి తెరచాపని కట్టిన
గుంజ అల్లంత దూరంలో ఎగిరిపడింది.
ఒక్క క్షణం మాకు
ఏవయ్యిందో అర్థం కాలేదు. భయంతో ముఖాలు పాలిపోయాయి.
తెలుపు నీలం
రంగులు కలగలసిన ఆ అగ్నిగోళం పడవ లో నెమ్మదిగా అటు ఇటు దొర్లుతోంది. దాని చిత్రం ఏంటంటే
అది దాని అక్షం మీద బ్రహ్మాండమైన వేగంతో పరిభ్రమిస్తోంది.
(ఇంకా వుంది)
దట్టమైన ఆవిరి
ఒక్కసారిగా ఘనీభవించి నీరయ్యింది. ఆవిరి నీరు కాగా ఏర్పడ్డ శూన్యాన్ని పూరించే ప్రయత్నంలో
వాతావరణంలో భయంకరమైన వాయుగుండాలు ఏర్పడ్డాయి. మేం ఉన్న బృహత్తరమైన గుహలో మూలమూలలా వ్యాపిస్తూ విజృంభిస్తున్నాయా
వాయుగుండాలు. చీకటి మరింత చిక్కన అవుతోంది. ఆ పరిసరాలని వర్ణిస్తూ రెండు వాక్యాలు రాయడానికి
నాకు గగనం అయ్యింది. అంతలో ఏదో అల తాకిడికి పడవ ఒక్కసారిగా పక్కకి ఒరిగిగింది. ఆ దెబ్బకి
హన్స్ వశం తప్పి కింద పడ్డాడు. ఎప్పుడూ తల ఒగ్గని మావయ్య కూడా విధి లేక సాష్టాంగపడిపోయాడు!
నా పరిస్థితి కూడా అంత భిన్నంగా ఏమీ లేదు. ఎలాగో కష్టపడి పాకి మావయ్య దగ్గరగా జరిగాను.
మావయ్య బలంగా ఓ తాడు పట్టుకున్నాడు. అంత భీభత్సంలో కూడా ఆయన ముఖంలో ఏదో సంతృప్తి చూసి
ఆశ్చర్యపోయాను.
హన్స్ కదలకుండా
అలాగే పడి వున్నాడు. అతడి పొడవాటి కేశాలు తుఫాను గాలికి అల్లలాడుతున్నాయి. ఆ కురుల
కొసల నుండీ ఏవో చిత్రమైన కాంతులు చిమ్ముతున్నాయి. ఆ కాంతుల మేలిమి ముసుగు మాటున అతడి
ముఖం చిత్రంగా వెలిగిపోతోంది.
ఇన్ని జరుగుతున్నా
తెరచాప కట్టిన గుంజ మాత్రం స్థిరంగానే వుంది. గాలి ధాటికి తెరచాప ఏ క్షణానైనా పగిలిపోడానికి
సిద్ధంగా వున్న బుడగ లాగా పొంగింది. కెరటాల మీద జారుతూ పడవ జోరుగా ముందుకి కదులుతోంది.
“తెరచాప, తెరచాప!”
అని అరిచాను. దాన్ని దించితే క్షేమం అన్నట్టుగా.
“వద్దు” మావయ్య
సమాధానం మునుపట్లాగే ధీమాగా వచ్చింది.
“నెజ్!” అన్నాడు
హన్స్ కూడా తల అడ్డుగా ఊపుతూ.
వర్షం ధాటి అంతకంతకు
పెరుగుతోంది. అది వర్షం అనే కన్నా జలపాతం అంటే సబబేమో. ఆ జలపాతాన్ని ఛేదించుకుంటూ మా
పడవ దిక్చక్రం దిశగా దూసుకుపోతోంది. కిందికి దిగి వస్తున్న వర్షామేఘం మధ్యలోనే చిత్రంగా
చీలిపోతోంది. కింద సముద్రం సలసల మరుగుతోంది. పై నుండి దిగి వస్తున్న రసాయన శక్తుల ప్రభావం
వల్ల నింగికి నీటికి మధ్య విద్యుదగ్నుల భీకర లాస్యం చెలరేగిపోతోంది. అలా పుట్టిన ఉరుములతో
ఆ లోకం దద్దరిల్లిపోతోంది. ఘర్షిస్తున్న నల్లని
మేఘాలు ఒక దాని మీద ఒకటి కాంతి శరాలు విసురుకుంటూ భీకరంగా పోరాడుకుంటున్నాయి. చుట్టూ
ముసురుకున్న సాంద్రమైన ఆవిరి ఏదో చిత్రమైన కాంతితో భాసిస్తోంది. ఆ వర్షంలో నీటి బొట్లతో
పాటు పెద్ద పెద్ద వడగళ్లు కూడా పడుతున్నాయి. మా ఇనుప పనిముట్ల మీద వడగళ్లు పడ్డప్పుడు
అవి తాకిన చోటి నుండి వెలుగు ఊరుతోంది. పర్వతాలలా ఉప్పొంగుతున్న సముద్ర జలాలు అగ్నిపర్వతాలలా
నిప్పులు కక్కుతున్నాయి. ఆ సలిలపర్వత శిఖరాగ్రాల మీద కాంతుల పింఛాలు నాట్యం చేస్తున్నాయి.
ఎటు చూసినా దర్శనమిచ్చే ఆ విపరీతమైన వెలుగుని చూడలేక కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ఆగని
ఉరుముల ఢమరుక నాదానికి చెవులు హోరెత్తిపోతున్నాయి. తెరచాప కట్టిన గుంజ గడ్డిపరకలా వంగిపోతోంది.
(ఈ సందర్భంలో
నేను రాసుకున్న వార్త కాస్త అవిస్పష్టంగా వుంది. ఆ ఉద్విగ్న భరిత, అర్థచేతన స్థితిలో
ఏం రాశానో నాకే తెలీదు. ఏదో క్లుప్తంగా, సగం సగంగా రాసుకున్నాను. అవిస్పష్టంగా ఉన్న
నా వర్ణన బట్టి అప్పటి పరిస్థితి ఎంత గందరగోళంగా వుందో అర్థమవుతుంది అనుకుంటాను.)
అధ్యాయం -
35
విద్యుత్ తుఫాను
శుక్రవారం, ఆగస్టు 21
మర్నాటికి ఆ
అద్భుతమైన గీసర్ కనుమరుగయ్యింది. గాలి జోరు పెరిగింది. గాలి వాటుకి మా తెప్ప ఏక్సెల్
దీవి నుండి దూరమయ్యింది. మేం వున్న దూరంలో ఆ ఘోష సద్దుమణిగింది.
వాతావరణం (అసలు
ఆ పదాన్ని ఈ సందర్భంలో వాడొచ్చో లేదో కూడా తెలీదు) తొందర్లోనే మారే సూచన్లు కనిపిస్తున్నాయి.
వాతావరణం అంతా దట్టమైన ఆవిర్లు కమ్ముకుని వున్నాయి. ఉప్పునీరు ఆవిరి కాగా పుట్టిన ఆ
ఆవిర్లలో విద్యుదావేశం దట్టంగా వ్యాపించి వుంది. మబ్బులు ఇంకా ఇంకా కిందికి వంగి కాలవర్ణాన్ని
సంతరించుకున్నాయి. తటిల్లతల తళుకులు దట్టమైన
ఆ ఆవిరి తెరలని ఛేదించలేకున్నాయి. ఆ నల్లని నీరు, ఆ మసక మసక వెలుతురు – ఆ ప్రాంతం
అంతా ఏదో చెప్పరాని ప్రళయతాండవం కోసం కట్టిన వేదికలా భయంకరంగా వుంది.
మహోగ్రమైన వాతావరణ
మార్పులు ఆసన్నమైనప్పుడు భూమి మీద ఎన్నో జీవాలలో లాగానే నా మనసులో కూడా ఎదో కల్లోలం
మొదలయ్యింది. వంపులు తిరిగిన క్యుములస్ మబ్బులు భారంగా, భయంకరంగా కనిపిస్తున్నాయి.
పెనుతుఫాను ఆసన్నమైనప్పుడు గాలిలో వుండే గాంభీర్యం వాటిలో కనిపిస్తోంది. గాలి భారంగా
వుంది. సంద్రం నిబ్బరంగా వుంది.
దూరం నుంచి మబ్బులు
అల్లకల్లోలంగా వున్న నేపథ్యం మీద అద్దిన పెద్ద పెద్ద దూదేకుల్లా వున్నాయి. సంఖ్యలో
తక్కువగానే వున్నా పరిమాణంలో మాత్రం చాలా పెద్దగా వున్నాయి. బరువుకి నెమ్మదిగా దిక్చక్రం
మీదుగా వాలుతాయి. కాని ఇంతలో ఏదో తెమ్మెర తాకిడికి కాస్త పైకి లేస్తాయి. ఆ తెలిమంచు
సముద్రం మీద మెత్తని పరుపులా వ్యాపించింది. ఆ పానుపు మీద విద్యుల్లతా కాంతులు లాస్యం
చేస్తున్నాయి.
వాతావరణం అంతా
విద్యుదావేశంతో నిండిపోయింది. ఒంటి మీద రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. ఆ సమయంలో నన్ను
గాని నా పక్కన ఉన్న వాళ్ళు తాకితే పెద్ద షాక్ తగులుతుందని అనిపించింది.
ఉదయం పది గంటలకి
తుఫాను సూచనలు మరింత తీవ్రం అయ్యాయి. గాలి మరింత ఉధృతం అయ్యింది. పైన వేళ్లాడుతున్న
విశాలమైన మేఘజాలం భయంకర పెనుతుఫానులకి ఆలవాలం.
అశుభం పకలడం
మంచిది కాదని పెద్దలు అంటారుగాని ఈ సమయంలో అనకుండా ఉండలేకపోతున్నా,
“వాతావరణం దారుణంగా
వుంది.”
ప్రొఫెసర్ మావయ్యలో
ఉలుకు పలుకు లేదు. ఆయన వదనం గంభీరంగా వుంది. ఎదుట అనవధికంగా వ్యాపించి వున్న వారిధి
కేసి నిశితంగా చూస్తున్నాడు. ఏమనుకున్నాడో ఏమో కాని బయటికి మాత్రం ఓ సారి నిట్టూర్చాడు.
“భయంకరమైన తుఫాను
ముంచుకొచ్చేలా వుంది,” అన్నాను దిక్చక్రం కేసి చూపిస్తూ. “ఆ నల్లని మబ్బులని చూడబోతే
సముద్రాన్ని కబళించేలా వున్నాయి.”
నలుదిశలా గాఢమైన
నిశ్శబ్దం అలముకుంది. గాలుల ప్రళయఘోష ఒక్కసారిగా ఎందుకో సద్దుమణిగింది. ఒక్క క్షణం
ప్రకృతి శ్వాస నిలిచిపోయినట్టుగా అనిపించింది. తెరచాప కట్టిన దుంగ పై కొసన ఉన్న వాడి
అయిన లోహపు మొన చుట్టూ పేరుకున్న విద్యుదావేశాల వల్ల దాని నుండి సెయింట్ ఎల్మో కాంతులు
ఎగజిమ్ముతున్నాయి. తెరచాపలో ఒక్క చలనం కూడా లేదు. ఒక్క అల కూడా లేని నిశ్చల జలాలలో
చుక్కాని చలనం లేకుండా పడి వుంది. ముందుకు కదిలే ఉద్దేశం లేనప్పుడు తెరచాప దించడం ఉత్తమం
అనిపిస్తుంది. లెకుంటే తెరచాప పైకెత్తి వుంటే తుఫాను తాకిన మరుక్షణం పడవ తలక్రిందులు
అవుతుంది.
“తెరచాప దించేయడం
మంచిది. లేకుంటే అపాయం,” అరిచాను.
“వద్దు, వద్దు.
అలాగే వున్నీ,” తిరిగి అరిచాడు మావయ్య. “గాలి వీస్తే వీయనీ. పడవ ఏ బండకో కొట్టుకుని
ముక్కలైనా ఫరవాలేదు. ఇవాళ ఎలాగోలా తీరాన్ని చూడాల్సిందే.”
ఆయన నోట్లోంచి
ఆ మాటలు వెలువడ్డాయో లేదో, దక్షిణ ఆకాశంలో ఏదో విచిత్ర పరిమాణం ఆరంభమయ్యింది.
(ఇంకా వుంది)
ఇంత కాలం మమ్మల్ని
హడలగొట్టిన నీటిధారకి దగ్గరపడుతున్న కొద్ది దాని పరిమాణం మా కళ్ల ముందే ఇంతింతై ఎదగసాగింది.
ఆ చిట్టి దీవి నిజంగానే ఓ పెద్ద క్రిటేషియన్ జాతి జలచరంలా వుంది. దాని ఎత్తు కెరటాల
మీద ఓ ఇరవై గజాలు ఉంటుందేమో. ఆ దీవి మీద ‘గీసర్’ విభ్రాంతి కలిగించే విధంగా అంతెత్తుకి
ఎగసి పడుతోంది. అసలు ‘గీసర్’ అనే పదానికి అర్థం ‘రౌద్రం’ అట. అడపదపా పెద్ద పెద్ద విస్ఫోటాలు
వినిపిస్తున్నాయి. అప్పుడప్పుడు ఓ పెద్ద నీటి వెల్లువ ఉఫ్ఫని పెద్ద విస్ఫోటంతో దీవి
లోంచి ఆవిర్లు కక్కుకుంటూ ఎగజిమ్మి ఇంచుమించు మబ్బులని తాకేటంత ఎత్తుకి ఎగసిపడుతోంది.
రాతిలో దాగి వున్న అగ్ని శక్తే ఈ నీటి ధారలకి ఇంధనంగా పని చేస్తోంది. మధ్య మధ్యలో విద్యుల్లతా కాంతుల తళుకులు ఆ నీటి
ధారలకి అలంకారాలు అందిస్తున్నాయి. ఆ విద్యుత్ కాంతుల వక్రీభవనం వల్ల కాబోలు కిందికి పడుతున్న తుషార బిందువులు
కోటివన్నెలతో మెరిసిపోతూ ఆ విచిత్ర లోకానికి ఏదో
అలౌకికసౌందర్యాన్ని ఆపాదిస్తున్నాయి.
“రండి. పడవ దిగుదాం,”
అన్నాడు ప్రొఫెసరు.
“కాని ఆ నీటి
ధారకి కాస్త దూరంగా ఉండాలి. దాని దెబ్బకి మన తెప్ప ఒక్క క్షణంలో మునిగిపోతుంది.”
హన్స్ మా తెప్పని
ఎప్పట్లాగే ఒడుపుగా నడిపిస్తూ దీవి అంచుకి తీసుకొచ్చాడు.
పడవ నుంచి ఓ
రాయి మీదకి గెంతాను. మేం నడుస్తున్న రాయి సిలికాన్, సున్నపురాయి కలిసిన కంకర రాయి.
మా కాళ్ల కింద నేల కంపిస్తోంది, బాయిలర్ లా కుతకుతలాడుతోంది. మరుగుతున్న నీటిలో ఓ ధర్మామీటరు
ముంచి ఉష్ణోగ్రత కొలిచాను. ఉష్ణోగ్రత 325 డిగ్రీలకి పైగా వుంది. అంటే నీటి మరుగుస్థానం
కన్నా చాలా హెచ్చు. అంటే అడుగున భుగభుగ మండే ఏదో సహజ కొలిమి లోంచి ఈ నీరు ఎగజిమ్ముతోంది
అన్నమాట. ఆ విషయం మరి ప్రొఫెసర్ లీడెన్ బ్రాక్ సిద్ధాంతాలకి పూర్తిగా విరుద్ధంగా వుంది.
ఆ విషయం బయటికి వెళ్లగక్కకుండా ఉండలేకపోయాను.
“అలాగా? కాని
నేను చెప్పిందానికి అది విరుద్ధం ఎలా అవుతుంది?” ఎదురు ప్రశ్న వేశాడు మావయ్య.
“అబ్బే! ఏం లేదులే
మావయ్యా. ఊరికే అన్నా.” ఎలాగో మాట దాటేశాను. మావయ్య కొండ లాంటి మొండి వైఖరి నాకు కొత్తేం
కాదు.
ఒక్క విషయం మాత్రం
గట్టిగా చెప్పగలను. ఇంతవరకు మా విచిత్ర యాత్రలో మమ్మల్ని అదృష్టం వెన్నంటే వుంది. ఇంతవకు
మేం ఎదుర్కున్న ఉష్ణోగ్రతా పరిస్థితులు చాలా సుముఖంగా వున్నాయనే చెప్పాలి. కాని ఇక
ముందు కేంద్రంలోని ఉష్ణోగ్రత ఎంత ఎక్కువ అవబోతోందంటే, దాన్ని కొలవడానికి మా వద్ద ఉన్న
థర్మామీటర్లు సరిపోవు.
“అదేంటో చూద్దాం
పద,” అంటూ ప్రొఫెసరు అల్లుడికి బయల్దేరమని సైగ చేశాడు. (పోతూ పోతూ ఎంతో ఉదార బుద్ధి
గల మావయ్య ఆ దీవికి అల్లుడి పేరు పెట్టడం మాత్రం మర్చిపోలేదు.)
కొన్ని నిమిషాల
పాటు ఆ గీసర్ గురించే ఆలోచిస్తూ ఉండిపోయాను. నీటి ధారలోని ధాటి ఎప్పుడూ ఒక్కలా లేదన్న
విషయం గమనించాను. ఒకసారి ధార చాలా పైకి లేస్తుంది. మరో సారి కాస్తంత ఎత్తు లేచి కింద
పడిపోతుంది. దానికి కారణం కింద భూగర్భ జలాశయంలో ఉన్న ఆవిరి యొక్క పీడనంలోని హెచ్చుతగ్గులే
నని అర్థం చేసుకున్నాను.
ఎట్టకేలకు దీవికి
వీడ్కోలు చెప్పి దాని దక్షిణ తీరం వద్ద చిట్టిపొట్టి రాళ్ల చుట్టూ ఒడుపుగా ముందుకి
సాగిపోయాం. మేం దీవి మీద సంచరిస్తున్న సమయంలో హన్స్ తన చుక్కానికి మరమ్మత్తులు చేసుకున్నాడు.
ఇంతవరకు మేం
ప్రయాణించిన దూరం కొలిచి నా యాత్రాపత్రికలో రాసుకున్నాను. గ్రౌబెన్ రేవుని వదలిన దగ్గర్నుండి
రెండొందల డెబ్బై కోసుల దూరం సముద్రం మీద ప్రయాణించాము. అలాగే ఐస్లాండ్ వదిలిన దగ్గర్నుండి
ఇంగ్లండ్ కి అడుగున ప్రయాణిస్తూ ఆరొందల ఇరవై కోసుల దూరం వచ్చేశాం.
(ముప్పై నాలుగవ
అధ్యాయం సమాప్తం)
postlink