శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in other Indian Languages. Please Click here.

వీడు పిల్లాడా ప్రశ్నల పుట్టా?

Posted by శ్రీనివాస చక్రవర్తి Tuesday, October 14, 2014

అయితే రామానుజన్ తల్లి కోమలతమ్మాళ్ తీరు వేరు. ఈమె మంచి సంస్కారం, లోకజ్ఞానం ఉన్న వనిత. ఆమె వంశంలో ఎంతో మంది సంస్కృత పండితులు ఉండేవారట. ఈమె తండ్రి నారాయణ అయ్యంగారు ఈరోడ్ నగరంలో కోర్టులో అమీనుగా పని చేసేవాడు. వారిది సాంప్రదాయనిబద్ధమైన కుటుంబం. కోమలతమ్మాళ్ తల్లికి, అంటే రామానుజన్ అమ్మమ్మకి దైవభక్తి మెండు. భక్తి పారవశ్యంలో ఆమె కొన్ని సార్లు సమాధి స్థితిలోకి వెళ్లేదట. అలాంటి సన్నివేశాల్లో ఆమెపై దేవతలు  పూని ఆమె ద్వారా పలికేవారని చెప్పుకుంటారు. ఈ రకమైన దైవచింతన కోమలతమ్మాళ్ తన తల్లి నుండి నేర్చుకుంది. ఆమె ఇంట్లో సామూహిక భజనలు, పూజలు నిర్వహించేది. గుళ్లో సంకీర్తన చేసేది. నమ్మక్కల్ కి చెందిన నామగిరి అనే దేవత వీరికి కులదైవం. ఆ దేవత పేరే నిరంతరం జపించేది కోమలతమ్మాళ్.

1887  సెప్టెంబర్ నాటికి కోమలతమ్మాళ్ ఏడు నెలల గర్భవతి. కానుపు కోసం ఈరోడ్ లో ఉన్న పుట్టింటికి వెళ్లింది. డిసెంబర్  22  నాడు ఓ చక్కని మగబిడ్డ పుట్టాడు.  పుట్టిన పదకొండవ రోజు పసివాడికి శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ అని నామకరణం చేశారు. పదకొండవ శతాబ్దానికి చెందిన వైష్ణవ గురువు అయిన 

రామానుజాచార్యుడికి ఈ బిడ్డకి జాతకచక్రంలో కొన్ని పోలికలు ఉండడంతో బిడ్డకి ఆయన పేరు పెట్టారని అంటారు.
ఓ ఏడాది పాటు ఈరోడ్ లో నే వుండి తల్లి, కొడుకులు కుంభకోణానికి తిరిగి వెళ్లిపోయారు. రామానుజన్ కి రెండేళ్ల వయసులో మశూచి (smallpox) సోకింది. గృహవైద్యం తెలిసిన కోమలతమ్మ పసివాణ్ణి వేపాకులు పరిచిన మంచం మీద పడుకోబెట్టింది. పసుపునీటిలో కొన్ని వేపాకులు ముంచి పసివాడి శరీరం మీద పుండ్లు ఉన్న చోట నెమ్మదిగా అద్దింది. త్వరలోనే జ్వరం తగ్గి పసివాడు కోలుకున్నాడు. అయితే మశూచి సోకిన మచ్చలు మాత్రం శాశ్వతంగా ఉండిపోయాయి.

రామానుజన్ తరువాత కోమలతమ్మకి ఇద్దరు మగపిల్లలు, ఓ ఆడపిల్ల పుట్టి చిన్నతనంలోనే చనిపోయారు. రామానుజన్ కి పదేళ్ళ వయసులో పుట్టిన లక్ష్మీ నరసింహన్, పదిహేడేళ్ల వయసప్పుడు పుట్టిన శేషన్ లు మాత్రం దక్కారు. కనుక రమానుజన్ మొదటి పదేళ్లు ఏకైక సంతానం లాగానే గారాబంగా పెరిగాడు. ఇంట్లో తను ఆడిందే ఆట అన్నట్టు ఉండేది. పిల్లాడు ఎంతైనా కాస్త విడ్డూరం అనుకునేవారు ఇరుగుపొరుగు వాళ్లు. చిన్నమాటకే మనస్తాపం చెంది అలిగి కూర్చునేవాడు. తనకి రావలసింది వచ్చిందాకా మొండికేసి రప్పించుకునేవాడు. తన అలక వ్యక్తం చెయ్యడానికి ఒక్కొక్కసారి ఇంట్లోని బిందెలు, చెంబులు అన్నీ తీసి ఇంటి నిండా నీటుగా పేర్చేవాడట!

రామానుజన్ మొదటి మూడేళ్లలోను పెద్దగా మాటలు రాకపోవడంతో కోమలతమ్మ కంగారు పడింది. అక్షరాభ్యాసం చేయిస్తే గుణం కనిపించొచ్చు అని ఎవరో సలహా ఇస్తే అలాగే చేశారు. త్వరలోనే పిల్లవాడు తమిళ భాషలోని 216  అక్షరాలు కుదురుగా రాయడం నేర్చుకున్నాడు.

1892, అక్టోబర్ 1 నాడు, విజయదశమి రోజు ఐదేళ్ళ రామానుజన్ ని బళ్లో చేర్పించారు. అయితే ఈ బడి అనుభవం రామానుజన్ కి పెద్దగా రుచించలేదు. తనకి నచ్చింది చెయ్యడం తప్ప మరొకరు చెప్పింది చెయ్యడం మంకుపట్టు గల రామానుజన్ కి అంతగా గిట్టేది కాడు. పోనీ బడికి వెళ్లినా చిత్రవిచిత్రమైన ప్రశ్నలు వేసి గురువుగార్ని గాభరా పెట్టేవాడట. మొదటి మానవుడు ఎప్పుడు పుట్టాడు? మబ్బులు ఎంత దూరంలో ఉంటాయి?.. బడికి వెళ్లి మాస్టార్ని వేధించడం కన్న పిల్లవాడు ఇంట్లో ఉండడమే తల్లిదండ్రులు మేలనుకున్నారో ఏమో. కొడుకుని ఎక్కువగా బయటికి పోనిచ్చేవారు కారు. ఆటపాటల మీద కూడా పిల్లవాడికి పెద్దగా ఇష్టం ఉండేది కాదు. తోటి పిల్లలు ఆడుకోడానికి వస్తే వాళ్ళతో కిటికీ లోంచి మాట్లాడి పంపేసేవాడు.

పదేళ్ళకి ప్రాథమిక విద్య పూర్తయ్యాక రామానుజన్ ని ‘టౌన్ హై’ అనే ఇంగ్లీష్ మీడియమ్ బళ్లో వేశారు. ఎత్తైన తెల్లని భవనాలతో, చుట్టూ పచ్చని వేప గుబుళ్లతో, జన సందోహానికి దూరంగా ప్రశాంతంగా ఉంటుంది టౌన్ హై పాఠశాల. పొడవాటి అంగీలతో, తెల్లని పంచలతో, తలపాగలతో హుందాగా కనిపించే ఆచార్యులు  అంటే పిల్లలకి ఎనలేని గౌరవం. రామానుజన్ అక్కడ చదువుకునే రోజుల్లో ఆ బడికి కృష్ణస్వామి అయ్యంగారు అనే హెడ్ మాస్టరు ఉండేవాడు. ఈయన అంటే బళ్లో అందరికీ వట్టి గౌరవమే కాక, బోలెడంత భయం కూడా. క్లాసులు జరిగే సమయంలో తన పొడవాటి చేతి కర్ర తాటించుకుంటూ వరండాలో గస్తీ తిరిగేవాడు. బుద్ధి పుడితే ఏదో ఒక తరగతిలోకి ప్రవేశించి, జరుగుతున్న పాఠం ఆపి, తనే పాఠం చెప్పేవాడు.


హై స్కూల్ దశలోనే గణితంలో రామానుజన్ ప్రతిభ వ్యక్తం కాసాగింది. తోటి విద్యర్థులు లెక్కల్లో సమస్యలు ఉంటే రామానుజన్ ని ఆశ్రయించేవారు. తోటి పిల్లలకి సహాయపడడంతో ఆగక, వ్యవహారం టీచర్ని ఎదిరించడం వరకు వెళ్లింది. ఒక సారి లెక్కల టీచరు “ఏ సంఖ్యనైనా దాంతో దాన్నే భాగిస్తే ఫలితం 1 వస్తుంది,” అన్నడట. ఆ సూత్రం సున్నాకి కూడా వర్తిస్తుందా? అని నిలదీశాడట రామానుజన్.

2 comments

  1. Anonymous Says:
  2. Excellent work please continue

     
  3. thank you anonymous garu!

     

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts

Follow by Email