ఆ ఊరి పేరు కుంభకోణం. రామానుజన్ పుట్టిన
నాటికి అతని తల్లిదండ్రులు ఆ ఊళ్లోనే ఉండేవారు.
ఈ ఊరు తమిళనాడులో
తంజావూరు జిల్లాలో ఉంది. చెన్నై కి 273 కిమీల
దూరంలో ఉంది. తమిళనాడు తీర్థ ప్రదేశాలకి పెట్టింది పేరు. అలాంటి తీర్థాలలో ఓ ముఖ్యమైన
తీర్థనగరం కుంభకోణం. ఆ ఊరి పేరు వెనుక ఓ పురాణ కథ ఉంది. కుంభ కోణం అంటే కుండకి వుండే
కొమ్ము లేదా ముక్కు. అయితే ఇది సామాన్యమైన కుండ కాదు, బ్రహ్మదేవుడి కుండ! ప్రళయం వచ్చినప్పుడు
ఆ కుండ ప్రళయ జలాలలో కొట్టుకుపోయి ఈ ఊరి వద్దకి కొట్టుకు వచ్చిందట. కుండలోని అమృతం
ఈ ఊళ్ళో ఉండే అసంఖ్యాకమైన కోవెల కొలనులలోకి ప్రవహించిందట. ఈ ప్రసిద్ధమైన సంఘటనకి జ్ఞాపకార్థం పన్నెండేళ్లకి
ఒకసారి ఈ ఊళ్లో ఇప్పటికీ ‘మహామఖం’ అనే ఉత్సహం జరుపుకుంటారు. పండుగ సమయంలో ఆ చిన్న ఊళ్లోకి
కొన్ని లక్షల మంది తీర్థప్రజలు విచ్చేస్తారు. ఆ ఊళ్లోని ప్రతీ ఆలయంలోను వేలుపు దర్శనం
చేసుకుని, ఎదురుగా ఉండే తటాకంలో మునక వేసి, జన్మ ధన్యమయ్యిందనుకుని తృప్తి పడతారు.
కుంభకోణంలోని ఆలయాలు, సరస్సులు, తీర్థప్రజలు, ధార్మిక జీవన విధానం, సాంప్రదాయనిబద్ధమైన
వాతావరణం – ఇవన్నీ ఎదుగుతున్న రామానుజుడి మనస్తత్వం మీద గాఢమైన ముద్ర వేశాయని నిస్సందేహంగా
చెప్పొచ్చు.
కుంభకోణానికి
పవిత్రతని ఆపాదించేవి కేవలం కోవెల కొలనులే కాదు. అంతకన్నా పెద్ద జలాశయం ఒకటి వుంది.
అదే ‘దక్షిణ గంగ’గా పేరు పొందిన కావేరీ నది. ఈ నది వెనకా ఓ కథ వుంది. కావేర ముని అనే
ఓ ముని బ్రహ్మదేవుడి కూతుళ్ళలో ఒక బాలికని దత్తత తీసుకుని గారాబంగా పెంచుకున్నాడట.
తండ్రి మీద ప్రేమతో ఆ కన్య నదిగా మారి ఆ ప్రాంతాన్ని శోభాయమానం చేసిందట. కావేరీ జలాల
దోసిట్లో కుంభకోణం నగరం శోభిల్లుతుంటుంది. పశ్చిమాన ఐదొందల మైళ్ల దూరంలో, కర్ణాటక ప్రాంతంలో,
కూర్గ్ పర్వతాలలో జన్మించిన ఈ నది ఎన్నో ఆనకట్టలు
దాటుకుంటూ కుంభకోణం నగరం పక్క నుండి ప్రవహిస్తుంది. మరో పక్క కావేరికి ఉపనది అయిన అరసలర్
నది ప్రవహిస్తుంది.
కావేరి కృప వల్ల
తంజావూరు జిల్లా సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉంటుంది. ఈ నదీ జలాల వల్ల సాగునీటి కోసం వర్షపు నీటి మీద ఆధారపడే
అవసరం అంతగా ఉండదు. 1877 లో వరసగా రెండేళ్లు
వర్షాలు సరిగ్గా పడక దక్షిణ భారతంలో కరువు విలయ తాండవం చేసింది. వేల సంఖ్యలో ప్రాణ
నష్టం జరిగింది. కాని తంజావూరు జిల్లా లో మాత్రం కరువు యొక్క దుష్పలితాలు కనిపించకపోగా
ఇరుగుపొరుగు జిల్లాలలో ధాన్యపు ధరలు ఆకాశాన్ని అంటటం వల్ల తంజావూరు జిల్లాకి బోలెడంత ఆదాయం లభించింది.
సహజమైన సస్యసంపత్తి
గల ప్రాంతం కావడంతో ఊరి ప్రజలు నిరంతరం ఆహార ఉత్పత్తి కోసం తలమునకలు కావలసిన పని లేకుండా
పోయింది. ఆ కారణం చేత వృత్తి విద్యలకి, కులవృత్తికి మంచి పోషణ లభించింది. పంటపనులకే
పరిమితం కాకుండా మానవ జీవన స్రవంతి మరెన్నో దిశలలో ప్రవహించింది. అందుకే ఊరు చిన్నదే
అయినా ఆ ఊళ్లో గ్రామీణ సంస్కృతికి బదులు చక్కని
పట్టణ సంస్కృతి నెలకొంది. ఆ రోజుల్లో కుంభకోణానికి చెందిన లోహపు విగ్రహాలకి
ప్రపంచ ప్రసిద్ధి ఉండేది. రాగి, వెండి, ఇత్తడి లోహాలతో చేసిన వేలుపుల విగ్రహాలకి యూరప్
విపణి ప్రపంచంలో మంచి గిరాకి ఉండేది.
లోహవిగ్రహాలే
కాకుండా కుంభకోణానికి ప్రత్యేకమైన విషయం మరొకటి వుంది. కుంభకోణానికే కాదు, మొత్తం తంజావూరు
ప్రాంతానికే ప్రత్యేకమైన విషయం పట్టు చీరలు. మిరుమిట్లు గొలిపే రంగులతో, వెండి బంగరు
జరీ అంచులతో, వాటి మీద కన్ను పడగానే సొంతం చేసుకోవాలని అనుకోని ఇంతి లేదంటే అతిశయోక్తి
కాదు.
రామానుజన్ తండ్రి
శ్రీనివాస అయ్యాంగారు ఓ చీరల అంగడిలో గుమాస్తాగా పని చేసేవాడు. ఆయన తండ్రి కుప్పుస్వామి
అయ్యంగార్ ది కూడా అదే ఉద్యోగం. కనుక ఇది ఒక విధంగా వారికి వంశపారంపర్యంగా వచ్చిన వృత్తి.
అంగడిలో జమాఖర్చులు చూసుకోవడం, అవసరమైతే చుట్టుపక్కల గ్రామాలకి వెళ్ళి అక్కడ బాకీలు
వసూలు చెయ్యడం మొదలైనవి ఆయన దైనిక కర్యక్రమాలు. చీరలలో వాడే బట్ట యొక్క నాణ్యత తెలుసుకోవడంలో
ఈయనకి మంచి నైపుణ్యం ఉండేదట. ఇదే తన యజమానికి తనలో బాగా నచ్చిన విషయం. ఇలాంటి గుమాస్తా ఉద్యోగాలు చేసేవారిలో కొంత మంది
ఏళ్ళ తరబడి మరొకరి మోచేతి నీరు తాగడం ఇష్టం లేక సొంతంగా వ్యాపారం పెట్టుకునే సందర్భాలు
ఎన్నో ఉన్నాయి. కాని శ్రీనివాస అయ్యంగారుది ఉన్నదాంతో సరిపెట్టుకునే తత్వం. అందుకే
సొంత వ్యాపారాల జోలికి పోకుండా చీకు చింతా లేని సాఫీ జీవనాన్ని ఎంచుకున్నాడు. రోజు
ఉదయానే ఎనిమిది గంటలకి సారంగ పాణి సన్నిధి వీధిలో ఉండే తన ఇంటి నుండి బయల్దేరి అంగడికి
చేరుకోవడం. రోజంతా పద్దులు చూసుకోవడం. సాయంకాలం కాగానే టంచనుగా ఇంటికి చేరుకోవడం. ఇలాంటి
యాంత్రికమైన దినచర్యతో సరిపెట్టుకున్నాడు.
సాంప్రదాయక భారతీయ
కుటుంబాలలో తండ్రికి, పిల్లలకి మధ్య చనువు తక్కువ, దూరం ఎక్కువ. చేరదీసినా, చెవి మెలిపెట్టినా తల్లి చెయ్యాల్సిందే.
తండ్రి ఇంట్లోకి వస్తే పిల్లలు భయం భయంగా తప్పుకుని తిరగాల్సిందే. రామానుజన్ తండ్రి
అలాంటి ఛండశాసనుడు కాకపోయినా, ఆయన ఇంట్లో ఉన్నా లేనట్టే ఉండేవాడు. ఉద్యోగం చేసి జీతం
ఇంటికి తేవడంతో ఆయన భాద్యత తీరి పోయింది అన్నట్టు ఉండేది. కనుక రామానుజన్ మీద ఆయన ప్రభావం
తక్కువ అంటారు రామానుజన్ జీవితాన్ని పరిశీలించిన పండితులు.
(ఇంకా వుంది)
very nice article
చాలా బాగా వ్రాస్తున్నారు...ఇలాగే కొనసాగించండి..