ఈ కొత్త పద్ధతిని
బాగా సమర్ధించిన వారిలో అలెగ్జాండర్ మికాయ్లోవిచ్ బట్లెరోవ్ (1828-1886) కూడా వున్నాడు.
1860 లలో ఇతడు ఈ కొత్త నిర్మాణ సూత్రాల సహాయంతో
సరూపకాల (isomers) ఉనికిని వివరించడానికి
ప్రయత్నించాడు. ఉదాహరణకి ఇథైల్ ఆల్కహాల్, డైమిథైల్ ఈథర్ లనే తీసుకుందాం. వీటి రెండిటి
ప్రయోగవేద్య సూత్రం ఒక్కటే – C2H6O. ఈ రెండు సమ్మేళనాల నిర్మాణ
సూత్రాలు ఇలా వుంటాయి.
పైన కనిపిస్తున్నట్టు
పరమాణువుల అమరికలో మార్పు వల్ల పూర్తిగా భిన్న లక్షణాలు గల సమ్మేళనాలు ఏర్పడుతున్నాయంటే
ఆశ్చర్యం లేదు. ఇథైల్ ఆల్కహాల్ విషయంలో అయితే ఆరు హైడ్రోజన్ పరమాణువులలో ఒకటి ఆక్సిజన్
కి అతుక్కుని వుంటుంది. అలా కాకుండా డైమిథైల్ ఈథర్ విషయంలో అయితే ఆ ఆరు కార్బన్ పరమాణువులకి
అతుక్కుని వుంటాయి. అయితే ఆక్సిజన్ పరమాణువు కార్బన్ పరమాణువు కన్నా హైడ్రోజన్ పరమాణువుని మరి కాస్త బలహీనంగా పట్టుకుంటుంది. కనుక
ఇథైల్ ఆల్కహాల్ కి సోడియమ్ లోహాన్ని కలిపినప్పుడు అది అందులో ఆరో వంతు హైడ్రోజన్ ని
స్థానభ్రంశం చేస్తుంది. కాని సోడియమ్ ని డైమిథైల్ ఈథర్ కి కలిపినప్పుడు అది హైడ్రోజన్
ని స్థానభ్రంశం చెయ్యదు. కనుక రసాయన చర్యలు నిర్మాణ సూత్రాల రూపురేఖలని సూచిస్తాయి.
అదే విధంగా నిర్మాణ సూత్రాలు రసాయన చర్యలని అర్థం చేసుకోవటానికి పనికొస్తాయి.
బట్లరోవ్ ఒక
ప్రత్యేకమైన సరూపకతని (isomerism) అధ్యయనం చేశాడు. దాన్నే tautomerism అంటారు. దీంట్లో కొన్ని పదార్థాలు ఎప్పుడూ రెండు
సమ్మేళనాల మిశ్రమాలలా కనిపిస్తాయి. ఆ పదార్థం లోంచి ఒక సమ్మేళనాన్ని శుధ్ధి చేసి వెలికి
తీస్తే ఆ పదార్థం పాక్షికంగానైనా రెండవ సమ్మేళనంగా మారిపోతుంది. ఇలాంటి ప్రవర్తనకి
కారణాన్ని బట్లరోవ్ ఇలా వివరించాడు. ఆక్సిజన్ తో అతుక్కున్న హైడ్రోజన్ ఆ బంధాన్ని తెంపుకుని
పక్కనే ఉన్న కార్బన్ తో బంధాన్ని ఏర్పరచుకోవడమే (ఆ మార్పు వ్యతిరేక దిశలోకూడా జరగొచ్చు)
ఇందుకు కారణం అని బట్లరోవ్ నిరూపించాడు.
నిర్మాణ సూత్రాలు
చలమాణిలోకి వచ్చిన తొలి రోజుల్లో ఒక అణువుకి మాత్రం నిర్మాణ సూత్రం కనుక్కోవటం కొంచెం
కష్టమయ్యింది. ఆ అణువు బెంజీన్ అనే హైడ్రోకార్బన్. దాని ప్రయోగవేద్య సూత్రం C6H6.
ఏ నిర్మాణ సూత్రాన్ని సూచించినా అది అందులోని వివిధ పరమాణువుల సంయోజకతల విలువలని తృప్తిపరచలేక
పోవడం జరిగింది. పైగా ఆ అణువు యొక్క అసాధారణమైన స్థిరత్వాన్ని కూడా వివరించడానికి కష్టమయ్యింది.
మొట్టమొదట్లో ఈ అణువుకి సూచించబడ్డ నిర్మాణ సూత్రాలు కొన్ని అస్థిరమైన ఇతర అణువులని
పోలి వున్నాయి.
ఈ సారి కూడా
కేకులే ఆదుకున్నాడు. కేకులే స్వయంగా చెప్పుకున్న ఒక కథనం ప్రకారం 1865 లో ఒకసారి అతడు ఓ బస్సులో ప్రయాణిస్తూ తూగు వచ్చి నిద్రలోకి జారుకున్నాడు.
ఆ నిద్రలో కొన్ని పరమాణువులు వేగంగా కదులుతూ నాట్యాలు చేస్తున్నట్టు ఓ స్వప్న దృశ్యం
కనిపించింది. ఉన్నట్లుండి ఆ పరమాణువులు ఓ గొలుసుకట్టుగా ఏర్పడగా, ఆ గొలుసు యొక్క తోక
దాని తలకి అతుక్కుంది. అలా ఏర్పడ్డ పరమాణు వలయం గిర్రున తిరుగుతూ కనిపించింది.
(ఇంకా వుంది)
0 comments