రామానుజన్ ఇంట్లో
ఇద్దరు కుర్రాళ్ళు అద్దెకి ఉంటూ దగ్గర్లోనే ఉన్న ప్రభుత్వ కళాశాలలో చదువుకునేవారు.
లెక్కలలో రామానుజన్ ప్రతిభ చూసి వారికి తెలిసిన గణిత విషయాలు రామానుజన్ తో పంచుకుంటూ
ఉండేవారు. వారి ద్వారా కళాశాల నుండి ఉన్నత స్థాయి గణిత పుస్తకాలు తెప్పించుకుని చదువుకునేవాడు
రామానుజన్. అలాంటి పుస్తకాలలో ఒకటి బ్రిటిష్ రచయిత ఎస్. ఎల్. లోనీ (S.L. Loney) రాసిన
‘Trigonometry’ (త్రికోణమితి) పుస్తకం. పదమూడో ఏటకే ఈ పుస్తకాన్ని పూర్తిగా అవపోసన
పట్టాడు రామానుజన్.
త్రికోణమితి
లో ప్రమేయాలని (sin(x), cos(x) మొ॥) రామానుజన్ నేర్చుకున్న తీరు కూడా ప్రత్యేకంగా ఉంటుంది.
హై స్కూల్ స్థాయిలో త్రికోణమితి ప్రమేయాలని లంబకోణ త్రిభుజం యొక్క భుజాల మధ్య నిష్పత్తులుగా
నేర్చుకుంటారు. కాని రామానుజన్ వాటిని అనంత శ్రేణుల (infinite series) రూపంలో నేర్చుకునేవాడు. p, e
మొదలైన ‘అతీత’ (transcendental) సంఖ్యలని
ఎన్ని దశాంశ స్థానాల వరకైనా గడగడా ఒప్పజెప్పగలిగేవాడు.
పద్నాలుగవ
ఏటికే రామానుజన్ ప్రతిభకి బడిలో తగిన గుర్తింపు వచ్చింది. తోటి విద్యార్థులకి గణితంలో
సమస్యలు వస్తే తమ గురువులని అడగడానికి బదులు రామానుజన్ ని అడిగేవారు. రామానుజన్ ప్రతిభని
చూసి అతణ్ణి తోటి విద్యార్థులే కాక గురువులు కూడా గౌరవించేవారు. బళ్లో చదువుకున్న రోజుల్లో
ప్రతీ ఏడూ ఎన్నో రకాల పతకాలు, బహుమతులు అందుకుంటూ వచ్చాడు. 1904 లో కె. రంగనాథ రావ్
గణిత బహుమానాన్ని అందుకున్నాడు. ఆ సభలో హెడ్ మాస్టర్ కృష్ణస్వామి అయ్యరు, ‘రామనుజన్
ని నూటికి నూరు మార్కులు ఇచ్చినా సరిపోదు,’
అంటూ ప్రశంసిస్తూ మాట్లాడాడు. రామానుజన్ ప్రతిభని కొలవడానికి సామాన్యమైన కొలబద్దలు
సరిపోవు మరి.
బడి చదువులు పూర్తయ్యాయి. కుంభకోణంలోనే మరో మూల వున్న ప్రభుత్వ కళాశాలలో ఇక
చేరాల్సి వుంది. ఆ తరువాత ఉద్యోగం, వివాహం మొదలైన ఘట్టాలు రానున్నాయి. ఉద్యోగం కోసం
చదువు, డబ్బు కోసం ఉద్యోగం అనే ధోరణిలో ముందుకుపోయే ఏ సామాన్య యువకుడి విషయంలోనైనా ఆలోచనలు ఇలాగే ఉంటాయి.
కాని రామానుజన్ సామాన్య యువకుడు కాడు. సామాన్యుల నుండి అతణ్ణి వేరు చేసేది కేవలం అతడి
గణిత ప్రతిభ కాదు. అతడి గణిత ప్రతిభకి ఆధారంగా ఉంటూ ఆ ప్రతిభని పోషించి, పుష్పించేలా
చేసిన ఓ గాఢమైన తత్వం అతడి వ్యక్తిత్వంలో ఉంది. రామానుజన్ లోని గణితవేత్తని అర్థం చేసుకోవాలంటే
ముందు అతడి లోని ఈ నిగూఢ తత్వాన్ని అర్థం చేసుకోవాలి.
నమక్కళ్ దేవత
మన దేశంలో అధ్యాత్మికతకి,
హేతువాదానికి మధ్య తరచు ఘర్షణ జరుగుతుంటుంది. కంటికి కనిపించని, మాటకి అందని ఓ నిగూఢమైన
తత్వం గురించి మాట్లాడుతుంది అధ్యాత్మికత. దాన్ని దైవం, ఆత్మ, బ్రహ్మం మొదలుకొని ఎన్నో
పేర్లతో సూచిస్తుంది. ఆ తత్వాన్ని తెలుసుకోవడమే జీవితం యొక్క లక్ష్యం అంటుంది. దాన్ని తెలుసుకోవడం కోసం
ఓ ప్రత్యేకమైన దైవోన్ముఖమైన జీవన విధానాన్ని నేర్పుతుంది. దైవం అనే నిగూఢ తత్వం సామాన్య
అనుభవంలో భాగం కాదు కనుక దాని మీద నమ్మకం అనేది అధ్యాత్మిక జీవన విధానానికి పునాది
అవుతుంది. కాని చూపుకి, చేతికి అందేది తప్ప
మరి దేన్నీ నమ్మనంటుంది హేతువాదం. అనుభవంలో భాగం అయిన దాన్ని తప్ప మరి దేన్నీ ఒప్పుకోదు.
ఆధారాలు లేనిదే దేనినీ సమ్మతించదు. కనుక ‘నమ్మకం’ అన్న మాటకి హేతువాదంలో స్థానం లేదు.
ఈ విధమైన శుద్ధ వస్తుగత దృష్టి హేతువాదానికే కాక ఆధునిక విజ్ఞానానికి కూడా మూలాధారం
అవుతుంది. మూలాలలో ఇంత విభేదం ఉండడంతో సైన్స్ ని, అధ్యాత్మికతని భిన్న ధృవాలుగా పరిగణించడం
జరుగుతుంది.
కనుక శాస్త్రవేత్త
అయినవాడు అధ్యాత్మికత జోలికి పోకుండా ఉండాలని శాస్త్రీయ రంగంలో ఓ అలిఖిత శాసనం వుంది.
శాస్త్రవేత్తల విషయంలో గాఢమైన ధార్మిక జీవన విధానం, చింతన ఒక విధమైన వెనుకబాటుతనంగా
పరిగణించబడుతూ ఉంటుంది. కాని రామానుజన్ విషయంలో ఈ రెండు ధృవాలు సునాయాసంగా కలిసిపోవడం
ఆశ్చర్యం కలిగిస్తుంది. ముఖ్యంగా పాశ్చాత్య పండితులకి రామానుజన్ నైజంలో అదొక అర్థం
కాని విషయంగా ఉండిపోతుంది. సాంప్రదాయాన్ని తుచ తప్పకుండా పాటించే రామానుజన్, నిరంతరం
దైవ నామస్మరణ చేస్తూ నిరాడంబరంగా ఓ ఆశ్రమవాసిలా జీవించే రామానుజన్, అంత గొప్ప గణిత
మేధావి కావడం వారికి విడ్డూరంగా తోచుతుంది. రామానుజన్ విషయంలో అధ్యాత్మిక, విజ్ఞానం అనే రెండూ
ధృవాలు ఇంపుగా ఇమిడిపోవడమే కాక, అతడు అవలంబించిన దైవోన్ముఖమైన జీవన విధానం గణిత రంగంలో
అతడి ప్రగతికి, ప్రతిభకి ఆధారం కావడం అబ్బురపాటు కలిగిస్తుంది.
కుంభకోణంలో రామానుజన్
పెరిగిన ఇల్లు సారంగపాణి సన్నిధి వీధిలో వుంది. ఆ వీధిలోనే ప్రఖ్యాత సారంగపాణి ఆలయం
వుంది. ఇంట్లో ఏ పండుగ వచ్చినా, ఏ ముఖ్యమైన సంఘటన జరిగినా ఇంటిల్లిపాది వచ్చి సారంగపాణి
ఆలయంలో పూజలు జరిపించాల్సిందే. ఇంటి బయటికి రాగానే అంత ఎత్తున ఆలయ గోపురం కనిపిస్తుంది.
రామానుజన్ బాల్యం అంతా ఒక విధంగా ఆ ఆలయపు చల్లని నీడలో గడిచింది. బుద్ధి పుట్టినప్పుడు
ఒంటరిగా వెళ్ళి గుళ్ళో కూర్చునేవాడు. ఏ మండపంలోనో ఓ స్తంభానికి ఆనుకుని తన నోట్సు పుస్తకంలో
గజిబిజిగా ఏవేవో లెక్కలు రాసుకునేవాడు. నోట్సులో ఖాళీ లేకపోతే ఓ సుద్ద తీసుకుని మండపం
నేలని గణిత ప్రతీకల రంగేళితో అలంకరించేవాడు.
>>శాస్త్రవేత్త అయినవాడు అధ్యాత్మికత జోలికి పోకుండా ఉండాలని శాస్త్రీయ రంగంలో ఓ అలిఖిత శాసనం వుంది.
ఈ శాసనాన్ని మనదేశంలో ఎంతమంది శాస్త్రవేత్తలు పాటిస్తూ ఉండవచ్చు? ఇస్రో శాస్త్రవేత్తలు కూడా అప్పుడప్పుడూ తిరుమలను, శ్రీహరికోట పక్కనే ఉన్న చెంగాళమ్మ దేవస్థానాన్ని తరచూ సందర్శస్తుంటారని విన్నాను.