శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

కాంతీయ సాదృశ్యం (optical isomerism)

Posted by V Srinivasa Chakravarthy Saturday, October 11, 2014
అంతవరకు వివిధ కర్బన రసాయనాల నిర్మాణ సూత్రాలు ఎప్పుడూ కార్బన్ యొక్క గొలుసుల రూపంలోనే వుండేవి. కాని ఇప్పుడు కేకులే మొట్టమొదటి సారిగా కేకులే కార్బన్ అణువులు వలయాలుగా ఏర్పడతాయని కూడా గుర్తించాడు. ఆ ప్రకారంగా అతడు బెంజీన్ కి ఈ కింది నిర్మాణ సూత్రాన్ని ప్రతిపాదించాడు.



బెంజీన్

ఈ వివరణ త్వరలోనే సమ్మతించబడింది. ఇలాంటి విజయాలతో నిర్మాణ సూత్రం అనే భావనకి మద్దతు పెరుగుతూ వచ్చింది.
(కాని బెంజీన్ లో ముడు ద్విబంధాలు ఉండటం వల్ల కొన్ని సమస్యలు తలెత్తాయి. సామాన్యంగా ద్విబంధాలు ఉండే రసాయనాలు కొన్ని చర్యలలో పాల్గొంటాయి. కాని బెంజీన్ సామాన్యంగా అలాంటి చర్యలలో పాల్గొనదు. తదనంతరం ఓ ముప్పావు శతాబ్ద కాలం తరువాతే ఇలా మామూలు ద్విబంధాల లాగా ప్రవర్తించని ఈ ప్రత్యేక ద్విబంధాల రహస్యం వివరించబడింది.)




కాంతీయ సాదృశ్యం (optical isomerism)
కేకులే సూచించిన నిర్మాణ సూత్రాలు ఎంత ప్రయోజకంగా అనిపించినా, ఒక ప్రత్యేకమైన, సూక్ష్మమైన సాదృశ్యాన్ని మాత్రం అవి వివరించలేకపోయాయి. ఆ సాదృశ్యం కాంతికి సంబంధించినది. దాని గురించి క్లుప్తంగా ప్రస్తావిద్దాం.

థామస్ యంగ్ (1773-1821) ఓ అసామాన్యుడైన బ్రిటిష్ శాస్త్రవేత్త.  అతడు కన్ను  పని తీరుని అర్థం చేసుకున్న మొట్టమొదటి శాస్త్రవేత్త. 1801  లో ఇతగాడు ఓ చక్కని ప్రయోగం చేసి కాంతి చిన్న చిన్న తరంగాలుగా ప్రవర్తిస్తుందని నిరూపించాడు. తరువాత  1814  లో అగస్టిన్ జాన్ ఫ్రెనెల్ (1788-1827) అనే ఫ్రెంచ్ శాస్త్రవేత్త కాంతి తరంగాలు ‘తిర్యక్ తరంగాలు’ (transverse waves) అనే ఓ ప్రత్యేక కోవకి చెందిన తరంగాలని నిరూపించాడు. ఇలాంటి తరంగాలు తరంగం కదిలే దిశకి లంబ దిశలో కంపిస్తాయి. ఇలాంటి తరంగాలని ఊహించుకోవాలంటే నీటి తరంగాలని గమనించవచ్చు. నిశ్చలమైన నీటిలో ఓ చిన్న రాయి పడేస్తే ఆ పడేసిన బిందువు నుండి ఓ తరంగం పుట్టి అన్ని దిశలలోను వ్యాపిస్తుంది. అలాంటి నీటి మీద చిన్న కాగితపు ముక్కలు పడేస్తే తరంగం నీటి ఉపరితలం మీద కదులుతున్నా, కాగితం ముక్కలు మాత్రం వున్న చోటే పైకి కిందకి కదలడం కనిపిస్తుంది.








థామస్ యంగ్

అయితే కాంతి తరంగాలు దేని “ఉపరితలానికి” పరిమితం కావు. కాబట్టి అవి “పైకి, కిందకి” కదలవు. అవి కుడి/ఎడమ, పైకి/కిందకి ఇలా అన్ని దిశలలోను కదులుతాయి. కాంతి కదులుతున్న దిశకి లంబంగా అనంతకోటి దిశలలో కాంతి తరంగం కంపించగలదు. ఒక కాంతి పుంజంలో కొన్ని కాంతి తరంగాలు ఒక దిశలోను, మరి కొన్ని కాంతి తరంగాలు మరొక దిశలోను – ఇలా నానా దిశలలోను కదులుతాయి. ఒక ప్రత్యేకమైన దిశలో మాత్రమే కదులుతాయని నియమం ఏమీ లేదు.

అలాంటి కాంతి పుంజాన్ని మాత్రం కొన్ని రకాల స్ఫటికాల (crystals) లోంచి పోనిస్తే ఆ స్ఫటికాలలో ఉండే క్రమబద్ధమైన పరమాణు అమరిక మూలంగా, కాంతి తరంగాలు ఒక ప్రత్యేకమైన తలం లో మాత్రమే కంపిస్తాయి. (నిలువు కటకటాల లోంచి దూరి మనిషి తప్పించుకున్నట్టు) ఆ తలంలో మాత్రమే కొన్ని పరమాణు వరుసల మధ్య నుండి దూరి కాంతి తరంగం స్ఫటిక లోంచి బయటపడగలదు.



అలా ఒక తలంలో మాత్రమే కంపించే కాంతిని ధృవీకృత కాంతి (polarized light) అంటారు. ఎతియెన్ లూయీ మాలస్ (1775-1812) అనే ఫ్రెంచ్ శాస్త్రవేత్త 1808  లో ఈ పేరు పెట్టాడు.  అప్పటికి ఇంకా కాంతి తరంగ సిద్ధాంతాన్ని వైజ్ఞానిక సమాజాలు పూర్తిగా సమ్మతించలేదు. అందుచేత కాంతిలో ఉత్తర, దక్షిణ ధృవాలు ఉండే రేణువులు ఉంటాయని, ధృవీకృత కాంతిలో ఆ రేణువుల దృవాలన్నీ ఒకే దిశలో తిరిగి ఉండేలా అమరుతాయని మాలస్ ఊహించుకున్నాడు. ఈ సిద్ధాంతం త్వరలోనే విస్మరించబడింది. కాని ఆ పేరు మాత్రం మిగిలింది.

2 comments

  1. Anonymous Says:
  2. అసంగతమైనా ఒక చిన్న విషయం.

    మేముకూడా 'కెకూలే' అనే అనేవాళ్లం. మా intermediate కెమిస్ట్రీ సారు ongoleని 'ఒంగోలే' అని పలకం కదా, అలానే kekuleని 'కెకూలే' అని పలకకూడదు. 'కెకూల్' అని పలకాలని చెప్పారు. కానీ ఆయన అసలుపేరు Kekulé అని french classలో అర్ధమయ్యక నవ్వుకున్నాం.

     
  3. కథ బావుంది! అయినా ఇంగ్లీష్ స్పెలింగ్ లో లాజిక్ ఏవుంటుంది? సరైన ఉచ్ఛారణ గుర్తుపెట్టుకోవాలంతే!!!

     

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts