ఒక పక్క గణితంలో నానాటికి కొత్త ఎత్తులు చేరుతూనే జీవన విధానంలో మాత్రం శ్రోత్రియ బ్రాహ్మణ విధానాన్ని
అనుసరించి జీవించాడు. నెత్తిన చిన్న పిలక ఉండేది. ఎప్పుడూ శాకాహారమే తీసుకునేవాడు. సారంగపాణి ఆలయానికే కాక కుంభకోణంలో ఉండే ఎన్నో ఇతర
ఆలయాలకి కూడా తరచు వెళ్లేవాడు. దక్షిణ భారతంలో ఉండే ముఖ్యమైన తీర్థ స్థానాలని సందర్శించేవాడు.
కుంభకోణానికి నాలుగు మైళ్ళ దూరంలో, తిరునాగేశ్వరం అనే ఊళ్లో, ఉప్పిలియప్పన్ కోవెలలో
దేవతని సందర్శించి అక్కడ ఏటేటా క్రమం తప్పకుండా
ఆషాఢ మాసంలో, పౌర్ణమి నాడు తన జంధ్యాన్ని మార్చుకునేవాడు.
గణిత
అధ్యయనాలతో పాటు వేదోపనిషత్తుల అధ్యయనం కూడా తన చదువులో భాగం అయ్యింది. ఆ ప్రాచీన గ్రంథాల
నుండి సునాయాసంగా శ్లోకాలు వల్లించేవాడట. ఒకసారి ఓ మిత్రుడితో పాటు కుంభకోణానికి ఆరు
మైళ్ల దూరంలో ఉన్న ఓ విష్ణువు కోవెలకి అక్కడ ఉత్సవాలు చూద్దామని వెళ్ళాడు. పండు వెన్నెల
కాంతులు దారి చూపిస్తుంటే స్నేహితులు ఇద్దరూ నడుస్తూ పోయారు. దారి పొడవునా రామానుజన్
వేదాల నుండి, శాస్త్రాల నుండి శ్లోకాలు వల్లిస్తూ వాటి మీద అద్భుతంగా వ్యాఖ్యానించాడట.
రామానుజన్ కుటుంబానికి
కులదేవత పేరు నమక్కళ్. కుంభకోణానికి సుమారు నూరు మైళ్ల దూరంలో, నామగిరి అనే ఊళ్లో ఈ
దేవత కోవెల వుంది. తల్లి కోమలతమ్మకి ఈ దేవతం అంటే గాఢమైన నమ్మకం. ఎప్పుడూ నమక్కళ్ పేరునే
జపిస్తూ ఉండేది. పెళ్ళై కొన్ని ఏళ్ళయినా సంతానం కలగక పోయేసరికి రామానుజన్ తల్లిదండ్రులు
నమక్కళ్ దేవతని సంతానం కోసం ప్రార్థించారు. రామానుజన్ అమ్మమ్మ పేరు రంగమ్మాళ్. ఈమె
కూడా నమక్కళ్ భక్తురాలే. ఈమె ధ్యానస్థితిలో ఉన్నప్పుడు నమక్కళ్ దేవత ఆవహించి ఆమె ద్వారా
మాట్లాడేదని చెప్పుకుంటారు. ఈ విధంగా ఒక సారి వీళ్ల బంధువులలో ఒకరి మీద హత్యాయత్నం
గురించి చెప్పి జాగ్రత్త పడమని నమక్కళ్ దేవత హెచ్చరించిందట. అలాగే మరో సన్నివేశంలో
రంగమ్మాళ్ కూతురి కొడుకు నోటి వెంట ముందు ముందు దేవత పలుకుతుందని కూడా చాటిందట.
ఈ కథలన్నీ రామానుజన్
విన్నాడు. తల్లి ప్రభావం వల్ల ఈ దేవత పట్ల
రామానుజన్ కి క్రమంగా భక్తిభావం పెరిగింది. నిరంతరం నమక్కళ్ దేవత నామమే తన నాలుక మీద
నాట్యం చేసేది. ఏ సమస్య వచ్చినా మనసులో ఆ దేవతకి విన్నవిం చుకుని, మనసులో స్ఫురించిన
ఆదేశం మీదట నడచుకోవడం దైనిక జీవితంలో అలవాటు అయిపోయింది. తన గణిత కౌశలం ఆ దేవత ఇచ్చిన
వరం అని చెప్పుకునేవాడు.
(ఇంకా వుంది)
0 comments