విషయాన్ని విపులీకరించకుండా,
వివరణ లేకుండా, అన్నిటికన్నా ముఖ్యంగా తగిన నిరూపణ లేకుండా సిద్ధాంతం తరువాత సిద్ధాంతాన్ని గుప్పించిన ఆ వ్యాసాన్ని చదివి అర్థం చేసుకోవడానికి
ఆ పత్రిక యొక్క సంపాదకుడికి గగనమయ్యింది. వ్యాసంలో ఎన్నో సవరణలు సూచిస్తూ తిప్పి కొట్టాడు.
అలా ఆ వ్యాసం సంపాదకుడికి రచయితకి మధ్య రెండు మూడు పర్యాయాలు ప్రయాణాలు చేసింది. బెర్నూలీ
సంఖ్యల లక్షణాలు నేపథ్యంగా తల ఈ పత్రంలో రామానుజన్ ఎన్నో విలక్షణమైన గణిత విభాగాల మధ్య
చిత్రమైన సంబంధాలు ఎత్తి చూపాడు. అయితే నిరూపణలు ఇవ్వకపోవడం వల్ల, ఇచ్చినా పూర్తిగా
నిర్దుష్టంగా ఇవ్వకపోవడం వల్ల తదనంతరం ఇతర గణితవేత్తలు ఆ సిద్ధాంతాలని విశ్లేషించి
వాటిలోని సత్యాన్ని నిరూపించవలసి వచ్చింది. కాని ఆశ్చర్యం ఏంటంటే ఇంచుమించు ప్రతీ సారీ
రామానుజన్ ప్రతిపాదించిన విషయం నిజమేనని తరువాత తేలుతుంది. కాని అది ‘ఇంచుమించు’ మాత్రమే.
కొన్ని అరుదైన సందర్భాలలో తను ఊహించింది తప్పని తేలింది. ఉదాహరణకి పైన పేర్కొన్న పత్రంలో
-
Bn
భిన్న సంఖ్య అయినప్పుడు, Bn /n అనే భిన్నంలో లవానికి, హారానికి సామాన్య
గుణకాలు లేనప్పుడు, లవం తప్పనిసరిగా ప్రధాన
సంఖ్య అవుతుంది.
అన్న లక్షణాన్ని ప్రతిపాదించాడు.ఈ
విషయం తప్పని తరువాత తెలిసింది. ఉదాహరణకి B20/20 = 174611 అవుతుంది.
ఇది ప్రధాన సంఖ్య కాదు. ఎందుకంటే 174611 = 283 X 617 అవుతుంది.
ఇలా అరుదుగా పొరబాట్లు జరిగినా రామానుజన్ నోట్సు పుస్తకాలలో చిత్రవిచిత్రమైన సైద్ధాంతిక
నిధులు ఉన్నాయి. నిరూపణ లేని ఆ సిద్ధాంతాలని తదనంతరం ఎంతో మంది గణిత పండితులు శ్రమించి నిరూపించి,
వాటిలో సత్యాన్ని నిర్ధారణ చేసుకుని ఆశ్చర్యపోయారు. ఇంత కఠినమైన సిద్ధాంతాలని ఏ నిరూపణా
లేకుండా రామానుజన్ ఎలా ఊహించాడు?
రామచంద్ర రావు దాతృత్వం మీద
అలా ఓ ఏడాది గడిచింది. ఆ ఏడాదిలో ఎన్నో సార్లు భారతీయ గణిత సదస్సు ప్రచురించిన పత్రికలో
తను కనిపెట్టిన చిన్న చితక సమస్యలు ప్రచురిస్తూ వచ్చాడు. ఆ తరువాత ఓ శ్రేయోభిలాషి చేసిన
సిఫారసు వల్ల మద్రాస్ అకౌంటంట్ జనరల్ కార్యాలయంలో ఓ చిన్న ఉద్యోగం దొరికింది. నెలకి
ఇరవై రూపాయలు జీతం. కాని ఆ ఉద్యోగంలో కొన్ని వారాలు మాత్రమే పని చేశాడు.
తరువాత మద్రాస్ పోర్ట్ ట్రస్ట్
లో ఓ గుమాస్తా ఉద్యోగం ఉందంటే దానికి దరఖాస్తు పెట్టుకున్నాడు. ఆ ఉత్తరంతో పాటు ప్రెసిడెన్సీ
కాలేజికి చెందిన ఇ.డబల్యూ. మిడిల్ మాస్ట్ అనే లెక్కల ప్రొఫెసర్ ఇచ్చిన సిఫారసు పత్రం
కూడా జోడించాడు. “గణితలో అసమాన ప్రతిభ గల యువకుడు” అంటూ ఆ ఉత్తరంలో రామానుజన్ ని పొగిడాడా
బ్రిటిష్ ప్రొఫెసరు.
రామానుజన్ కి ఆ ఉద్యోగం సులభంగానే
దొరికింది. అకౌంట్స్ విభాగంలో గుమాస్తాగా నెలకి ముప్పై రూపాయల జీతంతో మార్చ్ 1, 1912, నాడు రామనుజన్ కొత్త ఉద్యోగంలో చేరాడు.
పెళ్ళయిందన్న మాటే గాని జానకి తన భర్తని పెద్దగా చూసిందే లేదు. రాజేంద్రంలోనే పుట్టింట్లో
ఉంటూ అప్పుడప్పుడు కుంభకోణంలో అత్తగారి ఇంటికి వెళ్ళి వస్తుండేది. భర్తకి ఎప్పుడు సరైన
ఉద్యోగం వస్తుందా, తనని కాపురానికి రమ్మని ఎప్పుడు పిలుస్తాడా అని ఆత్రంగా ఎదురుచూసేది.
ఇప్పుడు పోర్ట్ ట్రస్ట్ లో ఉద్యోగం వచ్చింది
కనుక రామానుజన్ భార్యని, తల్లిదండ్రులని రప్పించుకున్నాడు.
జానకి తన భర్త దినచర్యని
ఆశ్చర్యంగా గమనించేది. ఉదయం ఉద్యోగానికి బయల్దేరే ముందు లెక్కలు చేసుకునేవాడు. సాయంత్రం
ఇంటికి వచ్చాక మళ్లీ లెక్కలు చేసుకునేవాడు. రాత్రి తెల్లార్లూ కూర్చుని లెక్కలు చేసుకుని
ఒకొక్కసారి తెల్లవారు జామున కునుకు తీసి, ఓ రెండు మూడు గంటలు నిద్రపోయి, లేచి ఉద్యోగానికి
వెళ్ళేవాడు. ఆఫీసులో పని చాలా సులభంగా ఉండేది. అధునాతన గణితాన్ని తిరగరాయగల సత్తా గలవాడికి
కూడికలు, తీసివేతలు ఓ లెక్క కాదు. వేగంగా తనకిచ్చిన పని పూర్తి చేసిన తీరిక వేళల్లో
అక్కడ కూడా లెక్కలు చేసుకునేవాడు.
పోర్ట్ ట్రస్ట్ లో కూడా రామానుజన్
గణిత ప్రతిభ గురించి నలుగురికీ తెలిసింది. అయితే అతడి గణితాన్ని అర్థం చేసుకుని దాని
మూల్యం తెలుసుకునే వారు లేకపోయారు. తనకి కావలసిన సలహా గాని, సహాయం గాని ఇవ్వగల వారు
దేశంలో లేరని, పాశ్చాత్యులని సంప్రదించి చూడమని కొందరు శ్రేయోభిలాషులు సలహా ఇచ్చారు.
అలాంటి వారిలో ఒకరు పచ్చయ్యప్పా కాలేజికి చెందిన లెక్కల ప్రొఫెసరు, సింగార వేలు ముదలియార్.
(ఇంకా వుంది)
ఈ టపా పున్ర్ముద్రణ అనుకుంటాను.
క్షమించాలి. నిజమే. చూసుకోలేదు. తరువాతి టపా వెంటనే పోస్ట్ చేస్తున్నాను.
Thank you, I have gone through the new post and enjoyed it thoroughly.