బ్లాగర్లకి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!
ఈ రోజు నుండి న్యూటన్ జీవితం మీద ఓ కొత్త సీరియల్ ప్రారంభం...
ఐసాక్ న్యూటన్ - జీవితం, కృషి
1. సరళ యంత్రాలు - సౌరగడియారాలు
న్యూటన్ పుట్టిన కాలంలో ప్రపంచంలో ఎన్నో సంచలనాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. న్యూటన్ కి పూర్వం సుమారు ఓ సహస్రాబ్ద కాలం (5వ శతాబ్దం నుండి 15 వ శతాబ్దం వరకు) విస్తరించిన మధ్యయుగాలలో విజ్ఞానం పెద్దగా పుంజుకోలేదు. వైజ్ఞానిక సమస్యలు అన్నిటికీ మతమే తముడుకోకుండా సమాధానాలు చెప్పేసేది. కాని 17 వ శతాబ్దంలో ఆధునిక యుగం ఆరంభం అయ్యింది. ఇటలీకి చెందిన భౌతిక శాస్త్రవేత్త, గణితవేత్త అయిన గెలీలియో గెలీలీ ప్రయోగం చేసి శాస్త్ర సమస్యలని ఎలా తేల్చుకోవాలో నేర్పించాడు. అలాగే ఫ్రాన్స్ కి చెందిన రెనే దేకార్త్ అనే తాత్వికుడు సునిశితమైన తర్కంతో, కచ్చితమైన వాదనా వైఖరితో, నిస్సందేహమైన వైజ్ఞానిక ఫలితాలని ఎలా సాధించాలో చూపించాడు. ఇలాంటి మహామహుల కృషి వల్ల ఆధునిక ‘వైజ్ఞానిక విప్లవం’ సంభవించింది. అలాంటి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని రంగప్రవేశం చేశాడు ఐసాక్ న్యూటన్.
ఐసాక్ న్యూటన్ 1642 లో, డిసెంబర్ 25 న అంటే క్రిస్మస్ నాడు, ఇంగ్లండ్ లో లింకన్ షైర్ జిల్లాలోని, వూల్స్ థార్ప్ అనే చిన్న గ్రామంలో జన్మించాడు. న్యూటన్ పుట్టడానికి మూడు నెలల ముందే అతడి తండ్రి మరణించాడు. ఆస్తిపరుడైన భూస్వామి అయిన ఆ తండ్రి పేరు కూడా ఐసాక్ న్యూటనే.
పుట్టినప్పుడు చాలా బలహీనమైన పసికందుగా పుట్టాడు ఐసాక్ న్యూటన్. అంత బలహీనంగా ఉన్న బిడ్డని చూసి బిడ్డ ఒక రోజుకి మించి బతకడు అని పెదవి విరిచారు మంత్రసానులు. కాని వాళ్లు అనుకున్నదానికి విరుద్ధంగా ఆ బిడ్డ బతకడమే కాక పెద్దయ్యాక ఆధునిక విజ్ఞానానికి ప్రాణప్రతిష్ఠ చేశాడు. చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకున్న తల్లి హన్నా జీవితం దుర్భరం అయిపోయింది. పసివాడైన ఐసాక్ ని పెంచడమే కాక, భర్తకి చెందిన విస్తారమైన భూముల వ్యవహారాలని చూసుకునే బాధ్యత ఇప్పుడు ఆ తల్లి నెత్తిన పడింది. ఐసాక్ కి మూడేళ్ల వయసులో హన్నా మళ్లీ పెళ్ళి చేసుకుంది. ఆమె తీసుకున్న ఆ నిర్ణయం యొక్క ప్రభావం ఐసాక్ మీద చిరకాలం ఉండిపోయింది.
హన్నా వివాహం చేసుకున్న రెండవ భర్త పేరు బార్నబాస్ స్మిత్. ఇతడు ఓ డబ్బున్న మతాధికారి. వయసులో ఇతడికీ, హన్నాకి ముప్పై ఏళ్ల అంతరం ఉంది. సవతి కొడుకు తన జీవితంలోకి ప్రవేశించడం బార్నబాస్ కి ఇష్టం లేకపోయింది. పెళ్లి చేసుకోదలిస్తే కొడుకుని విడిచిపెట్టి కాపురానికి రమ్మని బార్నబాస్ షరతు పెట్టాడు. ఐసాక్ ని తన తల్లిదండ్రులకి అప్పజెప్పి దగ్గర్లోనే ఉన్న మరో గ్రామంలో బార్నబాస్ తో కాపురానికి వెళ్లిపోయింది హన్నా.
హన్నా తల్లిదండ్రులు వూల్స్ థార్ప్ లో న్యూటన్ కుటుంబం ఉండే ఇంట్లో ఉంటూ ఐసాక్ ని చూసుకునేవారు. తాత, అమ్మమ్మ ఎంత గారాబంగా పెంచినా తల్లిలేని లోటు పిల్లవాడి జీవితంలో స్పష్టంగా కనిపించేది. క్రమంగా ఒంటరితనానికి అలవాటు పడడం నేర్చుకున్నాడు.
బార్నబాస్, హన్నా లకి ముగ్గురు పిల్లలు పుట్టారు. ఇద్దరు కూతుళ్ళు, ఒక కొడుకు. వాళ్లు – మేరీ, బెంజమిన్, హన్నా. ఒక కూతురికి తల్లి పేరే పెట్టారు. అప్పుడప్పుడు పొరుగు ఊళ్లో ఉన్న వాళ్ల ఇంటికి వెళ్లి ఐసాక్ తల్లి దర్శనం చేసుకుని వస్తుండేవాడు.
చిన్నప్పుడే తల్లి దూరం కావడం, తల్లి దగ్గర్లోనే వున్నా ఆమె చల్లని నీడలో జీవించే భాగ్యం లేకపోవడం – ఇవన్నీ ఆ పిల్లవాడి సున్నితమైన మనసు మీద గాఢమైన ముద్రవేశాయి. చిన్నతనం అలాంటి చేదు అనుభవాలతో నిండిపోవడం వల్ల ఎవరినీ సులభంగా నమ్మని తత్వం గల వాడుగా ఎదిగాడు ఐసాక్. ఎక్కువగా ఒంటరిగా ఉండడానికే ఇష్టపడేవాడు. అవతలి వారికి తెలీకుండా గుట్టుగా తన సొంత వ్యవహారాలు నడిపించుకునేవాడు. తనని ఎవరైనా చిన్న మాట అన్నా సహించేవాడు కాడు. తనకి ఎవరైనా చిన్న ద్రోహం చేసినా క్షమించేవాడు కాడు. ఈ రకమైన తత్వం వల్ల తన జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నాడు ఐసాక్ న్యూటన్.
(ఇంకా వుంది)
Good info.Waiting for the next parts.
సార్.. మంచి ప్రయత్నం... ఎలాగో సీరియల్ గా చెబుదాము అనుకుంటున్నారు కనుక, ప్రతీ భాగం హేడ్డింగులో సీరియల్ నంబరు పెట్టండి. అప్పుడు ఎప్పుడైన కొన్ని భాగాలు మిస్సయినా మళ్ళీ వెతుక్కుని చదువుకోవడానికి వీలుగాఉంటుంది.