1907 లో స్వీడ్ బర్గ్ అనుచరుడైన ఆర్నె విల్హెల్మ్ కౌరిన్ టిసేలియస్ (1902-1971) అనే మరో స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త బృహత్ అణువులని వేరు చెయ్యడానికి మరిన్ని మెరుగైన విధానాలు రూపొందించాడు. ఈ బృహత్ అణువుల మీద విద్యుదావేశాల విస్తరణ మీద ఆధారపడ్డ విధానాలివి. ఎలెక్ట్రోఫోరెసిస్ (electrophoresis) అనే ప్రక్రియ మీద ఆధారపడ్డ ఈ విధానాలు ప్రోటీన్లని వేరు చెయ్యడంలో, శుద్ధి చెయ్యడంలో ప్రధాన పాత్ర పోషించాయి.
ఎలెక్ట్రో
ఫోరెసిస్
ఆ
విధంగా పైన చెప్పుకున్న భౌతిక విధానాల సహాయంతో ఆ బృహత్ అణువుల సమగ్ర నిర్మాణం పట్ల కొంత అవగాహన కలిగినా, వాటి అణువిన్యాసంలోని వివరాలని తెలుసుకోడానికి రసాయన శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. వారి ధ్యాసంతా ప్రధానంగా ప్రోటీన్ల మీదే కేంద్రీకృతమయ్యింది.
పిండిపదార్థం
(starch), చెక్కలో
ఉండే సెల్యులోస్ మొదలైన పదార్థాలలో ఉండే బృహత్ అణువులు ఒక విధంగా కాస్త సరళమైన అణువులు. వాటిలో ఒకే మూలాంశం పదే పదే ఆవృత్తమవుతూ ఉంటుంది. కాని ప్రోటీన్ అణువుల తీరు వేరు. వాటిలో సుమారు ఇరవై విభిన్న మూలాంశాలు, పునాది రాళ్లు ఉంటాయి. అవన్నీ అమినో ఆసిడ్లు అనబడే కుటుంబానికి చెందిన అణువులు. ఆ కారణం చేతనే ప్రోటీన్లు జీవ పదార్థంలో ఉండే బ్రహ్మాండమైన వైవిధ్యానికి కారణభూతాలు అయ్యాయి. ఆ కారణం చేతనే ప్రోటీన్ అణువుల లక్షణాలని నిర్ణయించే ప్రయత్నం మరింత జటిలం అయ్యింది.
పందొమ్మిదవ
శతాబ్దపు చివరి దశలో చక్కెర అణువుల అణువిన్యాసాన్ని ఛేదించిన ఎమిల్ ఫిషర్ ప్రోటీన్ అణువుల మీద ధ్యాస మళ్లించాడు. అమినో ఆసిడ్ల మాలిక రూపంలో ఉండే ప్రోటీన్ అణువులో, ఒక అమినో ఆసిడ్ లోని అమీన్ భాగం, పొరుగున ఉన్న అమినో ఆసిడ్ కి చెందిన ఆసిడ్ భాగంతో పెప్టైడ్ బంధంతో ముడివడి ఉంటుంది అని ఫిషర్ నిరూపించాడు. 1907 లో ఒక ప్రయోగంలో ఆ విధంగా అనేక (కచ్చితంగా చెప్పాలంటే పద్దెనిమిది) అమినో ఆసిడ్లని ఒక గొలుసుకట్టుగా ఉత్పన్నం చేసి చూపించాడు. అలా పుట్టిన అణువుకి ప్రొటీన్లకి ఉండే కొన్ని మౌలిక లక్షణాలు ఉన్నాయని నిరూపించాడు.
కాని
ప్రకృతిలో దొరికే ప్రోటీన్లలో, ఆ బహుళ పెప్టయిడ్ మాలికలో (polypeptide chain), అమినో ఆసిడ్లు ఏ వరుసక్రమంలో ఉన్నాయో తేల్చుకోడానికి మరో అర్థ శతాబ్దం ఆగాల్సి వచ్చింది. దానికి మరో కొత్త విధానం అవసరమయ్యింది.
ఆ
కొత్త విధానం దిశగా తొలి అడుగులు వేసినవాడు రష్యన్ వృక్షశాస్త్రవేత్త మిఖాయిల్ సెమెనోవిచ్ స్వెట్ (1872-1919). ఇతడు ఇంచుమించు ఒకే రంగు గల వివిధ వృక్ష అద్దకాల ద్రావకాలని తీసుకున్నాడు. ఆ ద్రావకాలని అలూమినమ్ ఆక్సయిడ్ పొడి దట్టించిన వివిధ నాళాల ద్వార ఇంకనిచ్చాడు. ద్రావకాల లోని వివిధ మిశ్రమాలు నాళంలోని పొడి రేణువులతో వివిధ బలాల వద్ద అతుక్కున్నాయి. మిశ్రమం నాళంలోని పొడి ద్వార కిందకి ఇంకుతున్న కొద్ది అందులోని వివిధ అంశాలు నాళంలో వివిధ ఎత్తుల వద్ద
వేరుపడడం
కనిపించింది. ఆ కారణం చేత నాళంలో వివిధ ఎత్తుల వద్ద
వివిధ
రంగుల చారలు కనిపించాయి. 1906 లో స్వెట్ ఈ కొత్త విధానానికి సంబంధించిన వివరాలని ప్రచురించాడు. దానికి క్రొమటోగ్రఫీ (chromatography) అని పేరు పెట్టాడు. క్రొమటోగ్రఫీ అంటే ‘రంగుల రచన.’
క్రొమటోగ్రఫీ
ఊరు
పేరు లేని ఆ రష్యన్ వ్యాసాన్ని మొదట్లో ఎవరూ పట్టించుకోలేదు. కాని 1920 లలో విస్టాటర్, మరియు అతడి శిష్య బృందంలో ఒకడైన ఆస్ట్రియన్-జర్మన్ రసాయనశాస్త్రవేత్త రిచర్డ్ కూన్ (1900-1967) ఈ విధానాన్ని కొత్తగా వైజ్ఞానిక లోకానికి పరిచయం చేశారు. 1944 లో ఈ విధానానికి ఆర్చర్ జాన్ పోర్టర్ మార్టిన్ (1910-2002) మరియు రిచర్డ్ లారెన్స్ మిలింగ్టన్ సింజ్ (1914-1994) అనబడే ఇద్దరు ఇంగ్లీష్ రసాయన శాస్త్రవేత్తలు
మరిన్ని
మెరుగులు దిద్దారు. పొడి దట్టించిన నాళానికి బదులు వాళ్లు ద్రవాన్ని పీల్చుకునే ఫిల్టర్ కాగితాన్ని వాడారు.
మిశ్రమం
ఫిల్టర్ కాగితం మీదుగా పాకి దశల వారీగా వేరు పడింది. ఈ పద్ధతికి కాగితపు క్రొమటోగ్రఫీ అని పేరు వచ్చింది.
(ఇంకా వుంది)
0 comments