శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

 వైకింగ్ సూక్ష్మజీవశాస్త్ర ప్రయోగాలని మృత్తికల సహాయంతో వివరించగలము అన్న విషయం తేలిన తరువాత మరో జీవరహస్యం కూడా ఛేదించబడుతోంది. వైకింగ్ కర్బన రసాయన ప్రయోగం బట్టి మార్స్ మీద  కర్బన రసాయనపు ఛాయలు కూడా లేవని తెలుస్తోంది. మార్స్ మీద జీవం ఉంటే శవాలన్నీ ఎక్కడున్నాయ్ఒక్క కర్బన రసాయన అణువు కూడా దొరకలేదు. ప్రోటీన్లని, న్యూక్లీక్ ఆసిడ్లని నిర్మించడానికి కావలసిన పునాది రాళ్లు లేవు. సరళమైన హైడ్రోకార్బన్ అణువులు లేవు. భూమి మీద జీవపదార్థంలో ఉండే అంశాలేవీ లేవు. అయితే ఇక్కడ కర్బన రసాయన ప్రయోగాలకి, సూక్ష్మజీవశాస్త్ర ప్రయోగాలకి మధ్య వైరుధ్యం వుందని కాదు. ఎందుకంటే వైకింగ్ కి చెందిన సూక్ష్మజీవశాస్త్ర ప్రయోగాలు వైకింగ్ లోని రసాయన ప్రయోగాల కన్నా వెయ్యి రెట్లు మరింత సునిశితమైనవి (ఒక కార్బన్ అణువు చొప్పున తీసుకుంటే). ప్రయోగాలు మార్స్ మట్టిలో సంయోజించబడే కర్బన రసాయన పదార్థాన్ని సూచిస్తున్నాయి. కాని ఇక్కడ మనకి పెద్దగా వెసులుబాటు లేదు. భూమి మీద మట్టిలో ఒకప్పుడు జీవించి గతించిన జీవరాశుల అవశేషాలు కుప్పలుతెప్పలుగా దొరుకుతాయి. కాని మార్స్ మట్టిలో చందమామ మీద కన్నా తక్కువ కర్బన రసాయనాలు ఉన్నాయి. మార్స్ మీద ఒకప్పుడు జీవం ఉండేదని అనుకుంటే, నాటి కళేబరాలన్నీ రసాయనికంగా బాగా సక్రియంగా ఉండే మార్స్ ఉపరితలం వాటిని నాశనం చేసి ఉండాలి (హైడ్రోజెన్ పెరాక్సయిడ్ ఉన్న సీసాలో చిక్కుకున్న క్రిమిలా). ఇక మరొక అవకాశం వుంది. మార్స్ మీద జీవక్రియలలో భూమి మీద జరిగినట్టు కర్బన రసాయనాల పాత్ర పెద్దగా ఉండదని అనుకోవాలి.

కాని చివరిగా మిగిలిన మరొక్క అవకాశం ఆకర్షణీయంగా తోచుతోంది. నేను నూటికి నూరు పాళ్లౌ కర్బన రసాయన పక్షపాతిని. విశ్వమంతా కార్బన్ పుష్కలంగా వ్యాపించింది. దాంతో సంక్లిష్టమైన అణువులు తయారుచేయొచ్చు. అది జీవానికి అవసరం. నేను జల పక్షపాతిని కూడా. కర్బన రసాయనాలు  పని చెయ్యడానికి నీరు చక్కని ద్రావణిగా (solvent) పని చేస్తుంది. గొప్ప విస్తృతి గల ఉష్ణోగ్రతల వద్ద నీరు ద్రవరూపంలో మిగులుతుంది. కాని ఒక్కొక్క సారి అనిపిస్తుంది. పదార్థపట్ల నా అపేక్షకి కారణం అసలు నేనే పదార్థాలమయం కావడమా అనిపిస్తుంది. మనలో కార్బన్, నీరు పుష్కలంగా ఉండడానికి కారణం భూమి మీద జీవం పుట్టిన సమయంలో ఇక్కడ నీరు, కార్బన్ పుష్కలంగా ఉండడమేనా? మార్స్ వంటి ఇతర ప్రపంచాలలో జీవపదార్థం పూర్తిగా భిన్నంగా ఉండగలదా?

కార్ల్ సాగన్ అనబడే నేను నీరు, కాల్షియమ్, కర్బన రసాయనాల మిశ్రమాన్ని. మీరు కూడా ఇంచుమించు అవే అణువులతో కూడుకుని, మరో పేరు కలిగిన, మిశ్రమం. కాని మనలో ఉన్నది అంతేనా? మనం అణువులం తప్ప మరేమీ కామా? అలాంటి భావన మానవతని కించపరుస్తున్నట్టుగా కొంతమంది భావిస్తారు. మనవంటి ప్రతిభావంతమైన, సంక్లిష్టమైన అణుయంత్రాల నిర్మాణం విశ్వంలో సాధ్యమవుతోంది అన్న విషయం నాకైతే ఎంతో విస్మయం కలిగిస్తుంది.

 

కాని జీవపదార్థపు సారం అందులో ఉండే అణువుల మిశ్రమం మాత్రమే కాదు. అణువుల యొక్క కూర్పులోనే అసలు రహస్యం వుంది. మానవ శరీరంలో ఉండే మొత్తం రసాయనాల ఖరీదు తొంభై ఏడు సెంట్లు అనో, పది డాలర్లనో లెక్క కట్టి చెప్తూ ఉంటారు. మన శరీరం ఖరీదు అంత తక్కువా అని ఆలోచిస్తే బాధ కలుగుతుంది. మనుషులని వారి కనీస అంశాల స్థాయికి దించి వెలకడితే మరి ఇలాగే ఉంటుంది. మనలో ఇంచుమించు మొత్తం నీరే ఉంటుంది. దాని వెల ఇంచుమించు సున్నాయే. కార్బన్ విలువ బొగ్గు ఖరీదు బట్టి వెలకట్టారు. మన ఎముకలలో ఉండే కాల్షియమ్ విలువ సున్నాన్ని బట్టి వెలకట్టారు; మన ప్రోటీన్లలో ఉండే నైట్రోజెన్ ని గాలిని బట్టి వెలకట్టారు; మన రక్తంలో ఉండే ఇనుముని తుప్పుపట్టిన మేకుల బట్టి వెలకట్టారు. మనకి అంత ఆత్రుతగా ఉంటే మనలో ఉండే పదార్థాలన్నీ తీసుకుని, పెద్ద గంగాళంలో పోసి, కలియబెట్టి ఏం జరుగుతుందో చూడచ్చు. తీరిక ఉన్నంత సేపు తిప్పుతూ ఉండొచ్చు. కాని ఎంతసేపు చేసినా ఏమీ జరగదు. ఏవైనా జరుగుతుందని అసలు ఎలా అనుకుంటాం?

మానవశరీరంలో ఉండే రసాయనిక అంశాలని అంగళ్లో కునుక్కుని, వాటిని తగిన విధంగా కూర్చడానికి అయ్యే ఖర్చు ఎంతో హారోల్డ్ మోరోవిట్జ్ లెక్క వేశాడు. దాని అంచనా పది మిలియన్ల డాలర్ల వరకు పోతుంది. ఇందాకటి అంచనా కన్నా ఇది మరి కాస్త బావుంది. కాని సారి కూడా రసాయనాలన్నీ కలిపితే పాత్ర లోంచి మనిషి పుట్టుకురాడు. అది ప్రస్తుతం మన శక్తిసామర్థ్యాలకి అందని విషయం. స్థాయికి చేరుకోడానికి ఇంకా ఎంతో దూరం వుంది. అదృష్టవశాత్తు అంతకన్నా తక్కువ ఖర్చుతో అంతకన్నా విశ్వసనీయంగా మనుషులని తయారు చేసే పద్ధతులు వేరే వున్నాయి.

ఎన్నో ఇతర ప్రపంచాల లోని జీవరూపాలలో మనలో ఉండే పరమాణువులే ఉంటాయని నా నమ్మకం. అంతేకాక ప్రోటీన్లున్యూక్లీ ఆసిడ్లు వంటి మూల అణువులు కూడా మనలో లాగానే వారిలో కూడా ఉంటాయనిపిస్తుంది. అయితే అవే అణువులు నవ్య, అపరిచిత రీతుల్లో అక్కడి జీవరాశుల్లో కూర్చబడి ఉంటాయేమో. ఉదాహరణకి దట్టమైన వాతావరణాలలో తేలుతూ బతికే జీవరాశులలో ఉండే పరమాణువులు మనలో లాగానే ఉండొచ్చు. కాని వాటిలో ఎముకలు ఉండవు కనుక పెద్దగా కాల్షియమ్ ఉండకపోవచ్చు. బహుశ మరికొన్ని సందర్భాలలో నీటికి బదులు మరేదైనా ద్రవం ద్రావణంగా వాడబడుతూ ఉండొచ్చు. నీటికి  బదులు  హైడ్రోఫ్లోరిక్ ఆసిడ్ కూడా సరిపోతుంది గాని విశ్వంలో ఫ్లోరిన్ కాస్త అరుదు. మనలో ఉండే లాంటి అణువుల మీద హైడ్రోఫ్లోరిక్ ఆసిడ్ విధ్వంసాత్మక ప్రభావాన్ని చూపిస్తుంది. కాని పారఫిన్ మైనాల వంటి ఇతర కర్బన రసాయనాలతో అది చక్కగా జట్టు కడుతుంది. ఇక ద్రవరూపంలో ఉండే అమోనియా ద్రావణిగా మరింత సమర్థవంతంగా పని చేస్తుంది. ఎందుకంటే విశ్వంలో అమోనియా పుష్కలంగా దొరుకుతుంది. అయితే అది భూమి కన్నా, మార్స్ కన్నా మరింత చల్లని ప్రదేశాలలోనే ద్రవరూపంలో దొరుకుతుంది. వీనస్ మీద నీరు ఎలాగైతే ఆవిరి రూపంలో ఉంటుందో, భూమి మీద అమోనియా అలాగే వాయువు రూపంలో ఉంటుంది. ఇక ద్రావణి అనేదే లేని జీవరాశులు కూడా ఉంటాయేమో. కేవలం ఘనపదార్థంతో నిర్మించబడ్డ శరీరాలలో విద్యుత్ సంకేతాలు అటూ ఇటూ పరుగులు పెడుతుంటాయేమో.

కాని భావనలు, వాదనలు అన్నీ వైకింగ్ లాండర్ ప్రయోగాలు మార్స్ మీద  జీవం ఉనికి సూచిస్తున్నాయన్న నమ్మకానికి ఊపిరి పోయడం లేదు. తగినంతగా కార్బన్, నీరు కలిగిన, భూమిని పోలిన ప్రపంచంలో, జీవం అంటూ ఉంటే అది కర్బన రసాయనాల మీదే ఆధారపడి ఉండాలి. కర్బన రసాయన ప్రయోగాలే కాక, సూక్ష్మజీవశాస్త్ర ప్రయోగాలు కూడా ఒకటే చెప్తున్నాయి. మార్స్ మీద 1970 నాటి  క్రైసే, యుటోపియా ప్రాంతాలలోని సన్నని మన్నులో జీవం లేదని అవి ఏకకంఠంతో చెప్తున్నాయి. బహుశా అక్కడి బండల అడుగున కొన్ని మిల్లీమీటర్ల లోతుకి పోతే పరిస్థితి వేరుగా ఉంటుందేమో (అంటార్కిటికాలో ఎండులోయలలో పరిస్థితిలా). మరేదైనా గ్రహం మీద, మరేదైనా యుగంలో పరిస్థితులు మరింత ఆశాజనకంగా ఉండేవేమో. మేం చూసిన చోట, చూసినప్పుడు మాత్రం అలా లేవు.

మార్స్ మీద వైకింగ్ చేసిన అన్వేషణ అంతరిక్ష పర్యటనా చరిత్రలోనే ఒక చారిత్రాత్మక ఘట్టం. ఇతర ప్రపంచాల మీద జీవం ఎలా ఉంటుంది అన్న ప్రశ్నని లోతుగా శోధించిన తొలి యత్నం. మరో గ్రహం మీద ఒక అంతరిక్ష నౌక కొన్ని గంటల పాటు పని చేసిన సందర్భాలలో అదే మొదటిది. (వైకింగ్ 1 కొన్నేళ్ల పాటు పని చేసింది.) మరో ప్రపంచానికి చెందిన భౌగోళిక శాస్త్రం, భూకంప శాస్త్రం, ఖనిజ శాస్త్రం, వాతావరణ శాస్త్రం మొదలుకొని మరో అరడజను శాస్త్రాలకి సంబంధించి ఎంతో విలువైన సమాచారం అందించిందా మిషన్. ఇంత అద్భుతమైన పురోగతికి తదుపరి మెట్టుగా ఇంకా ఏం చెయ్యాలి? మార్స్ మీద వాలడమే కాక అక్కడి నుండి పెద్ద ఎత్తున మట్టిని సేకరించి, భూమికి తిరిగి తేగల మానవరహిత మిషన్లు పంపాలని కొంతమంది శాస్త్రవేత్తలు సూచించారు. అలా భూమికి తెచ్చిన మట్టిని భూమి మీద ఉండే పెద్ద పెద్ద, అధునాతన ప్రయోగశాలల్లో విస్తృతంగా పరిక్షించొచ్చు. ప్రస్తుతం మనం మార్స్ కి పంపిస్తున్న సూక్ష్మీకరించబడ్డ ప్రయోగశాలల ద్వార అంత పెద్ద ఎత్తున ప్రయోగాలు చెయ్యలేమని వారి వాదన. అలా తెచ్చిన మట్టితో రసాయన విశ్లేషణే కాక, ఖనిజ విశ్లేషణ కూడా చెయ్యొచ్చు. రాళ్లని బద్దలు కొట్టి వాటి లోపల దాగిన సూక్ష్మజీవుల కోసం శోధించొచ్చు. కర్బన రసాయన ధర్మాలని, జీవరాశుల ఉనికిని నిర్ధారించేందుకు గాని వందలాది ప్రయోగాలు సావకాశంగా చేసుకోవచ్చు. ఇవి కాకుండా మైక్రోస్కోప్ లలో రకరకాల పరిస్థితులలో వాటిని పరిశీలించొచ్చు. విష్నియాక్ రూపొందించిన మూల్యాంకన పద్ధతిని కూడా వినియోగించొచ్చు. అలాంటి మిషన్ కాస్త వ్యయప్రయాసలతో కూడినదే అయినా, అది మన ప్రస్తుత సాంకేతిక సామర్థ్యానికి అందని విషయమేం కాదు.

(ఇంకా వుంది)

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts