
http://www.andhrabhoomi.net/intelligent/munchu-991
ఇటీవలి కాలంలో 2012 సంవత్సరం ఓ ప్రత్యేకతని సంతరించుకుంది. ప్రాచీన మాయన్ కాలెండరు ప్రకారం వచ్చే ఏడాది లోకం అంతమైపోతుంది అన్న వదంతి కొంతకాలంగా ప్రచారంలో ఉంది. ఆ యుగాంతానికి రకరకాల కారణాలు ప్రతిపాదించబడ్డాయి. భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటాలు, ఉల్కాపాతాలు, ధృవాలు తారుమారు కావడాలు – ఒకటా రెండా, బోలెడు భీభత్సమైన కారణాలు. ఇవి కాకుండా మంచు వల్ల మానవ జాతి నాశనం కానుంది అన్న విచిత్రమైన భావన ఇంచుమించు ఓ శతాబ్దం క్రితం ప్రతిపాదించబడింది.
దాన్ని ఊహించినవాడు హ్యూ ఔచిన్ క్లాస్ బ్రౌన్ (1879 – 1975). అతడో ఎలక్ట్రికల్ ఇంజినీరు. 1900 లో అమెరికాలోని ప్రఖ్యాత కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పట్టం పుచ్చుకున్నాడు. 1911 ప్రాంతాల్లో అతడికి ఓ వింతైన వార్త కంటపడింది. ఘనీభవించిన ఆర్కిటిక్ సముద్రంలో జరిగిన తవ్వకాల్లో మామొత్ అనే రకం భారీ (ఏనుగుని పోలిన) జంతువు కళేబరం బయటపడింది. తవ్వకాల్లో జంతువు అస్తికలు, శిలాజాలు బయటపడడం కొత్త కాదు. కాని మాంసంతో పాటు చెక్కుచెదరకుండా దొరకడం కొంచెం ఆశ్చర్యం. అయితే మంచులో చిక్కుకుని ఉంది కనుక మాసం కుళ్ళకుండా ఉండిపోయిందని సర్దిపెట్టుకోవచ్చు. కాని మరింత విచిత్రమైన విషయం మరొకటి ఉంది. ఆ రకం జంతువు సామాన్యంగా ధృవప్రాంతాల వద్ద కనిపించదు. అది ఉష్ణమండల ప్రాంతాల్లో సంచరించే జంతువు. మరి ఆర్కిటిక్ వద్దకి ఎలా వచ్చింది? మరో విశేషం ఏంటంటే అది సహజ పరిస్థితుల్లో మరణించినట్టు లేదు. ఏదో హఠాత్పరిణామంలో ప్రాణాలు కోల్పోయినట్టు కనిపించింది. “అది మేస్తున్న బటర్కప్ పువ్వులు ఇంకా దాని దవడల్లో చిక్కుకుని ఉన్నాయి,” అని రాస్తాడు హ్యూ బ్రౌన్ దాన్ని వర్ణిస్తూ. తదనంతరం జరిగిన తవ్వకాల్లో అలాంటి ఆనవాళ్లు మరిన్ని కనిపించాయి. ఉష్ణమండలానికి చెందిన జంతువులు ధృవప్రాంతాల్లో తవ్వకాల్లో బయటపడడం ఎన్నో సందర్భాల్లో జరిగింది. ఇలాంటి వార్తలు చూసిన హ్యూ బ్రౌన్ దానికి కారణాల గురించి లోతుగా ఆలోచించసాగాడు.
ఆ రోజుల్లో అతడికి అందుబాటులో ఉన్న శాస్త్రసమాచారాన్ని బట్టి, శాస్త్రసాధనాల బట్టి కొన్ని అధ్యయనాలు జరిపి ఒక నిర్ణయానికి వచ్చాడు. భూమి ధృవాలు ఎప్పుడూ ఒకే స్థానంలో ఉండవు. కాలానుగతంగా వాటిలో మార్పులు వస్తుంటాయి. అయితే భూమి ధృవాలలో మార్పు ఉంటుందన్నది అనాదిగా తెలిసినదే. భూమి అక్షంలో చిన్న చలనం ఉంటుందని, అది 26,000 ఏళ్లకి ఒక సారి ఒక పూర్తి చుట్టు చుడుతుందని, ప్రాచీన భారతీయులకి కూడా తెలుసును అనడానికి దాఖలాలు ఉన్నాయి. అయితే హ్యూ బ్రౌన్ చెప్పే చలనం వేరు. ఇతడు చెప్పే చలనం కాస్తో కూస్తో కాదు. భూమి మొత్తం ఒక పక్కకి ఒరిగిపోయేలా జరిగే గణనీయమైన చలనం. ఇంచుమించు తొంభై డిగ్రీలకి పక్కకి ఒరిగే ఉపద్రవాత్మకమైన ‘ధృవభ్రంశం (pole shift)’. ఈ ధృవ భ్రంశం జరగడానికి కారణాలని ఈ విధంగా సిద్ధాంతీకరించాడు హ్యూ బ్రౌన్.
భూమి ధృవాలు విశాలమైన మంచు ప్రాంతాలు. ప్రస్తుత స్థితిలో మన అంటార్కిటికానే తీసుకుంటే అది దట్టమైన మంచుతో కప్పబడి ఉంటుంది. దాని తీరానికి సమీపంలో మంచు కేవలం కొన్ని వేల అడుగుల మందమే ఉన్నా, దక్షిణ ధృవం దగ్గర్లో మంచు మందం రెండు మైళ్ల వరకు ఉంటుంది. కొన్ని ప్రత్యేక స్థానాల్లో ఆ మందం మూడు మైళ్ల వరకు కూడా ఉండొచ్చు. ఈ మొత్తం మంచు యొక్క భారం 19 క్వాడ్రిలియన్ (ఒకటి పక్కన 15 సున్నాలు) టన్నులు ఉంటుందని అంచనా. అంత పెద్ద బరువు భూమి ధృవాల వద్ద ఉండడం కొంత వరకు భూమి యొక్క ఆత్మభ్రమణానికి స్థిరత్వాన్ని, ధృతిని ఇస్తుందన్నది భౌతికశాస్త్రవేత్తలకి తెలిసినదే. కాని ఆ బరువు మరీ ఎక్కువైతే స్థిరత్వం దెబ్బతిని ఒక దశలో భూమి పక్కకి ఒరిగే ప్రమాదం ఉందంటాడు హ్యూ బ్రౌన్. గతంలో అలాంటి పరిణామం వల్ల భూమి అక్షంలో మళ్లీ మళ్లీ గణనీయమైన మార్పులు వచ్చాయని, అందుకే ఉష్ణమండలానికి చెందిన ప్రాంతాలు తదనంతరం ధృవప్రాంతాలు కావడం జరిగిందని, ఈ పరిణామాలు 8,000 ఏళ్లకి ఒకసారి జరుగుతాయని ఊహించాడు హ్యూ బ్రౌన్. ఇక రాబోయే ధృవ భ్రంశం అతి దగ్గరలోనే జరుగనుందని సంచలనం సృష్టించాడు. ఎలాగైనా అంటార్కిటికా లో మంచు భారం విపరీతంగా పెరగకుండా, అణుబాంబులని ప్రయోగించి అక్కడి మంచుని చెదరగొట్టాలని అందరినీ బెదరగొట్టాడు. అతడి రచనల వల్ల ఈ ధృవభ్రంశం అన్న భావనకి కొంత ప్రచారం లభించినా, అతడి సూచనలని అమలు జరిపే ప్రయత్నాలేవీ జరగలేదు.
హ్యూ బ్రౌన్ తరువాత మరి కొందరు శాస్త్రవేత్తలు ఆ దిశలో ఆలోచించడం మొదలెట్టారు. గతంలో ధృవ భ్రంశం జరిగింది అన్న విషయంలో చాలా మంది ఏకీభవిస్తున్నా, దాన్ని కలుగజేసిన భౌతిక కారణాల విషయంలో ఎన్నో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ వచ్చారు. ముఖ్యంగా హ్యూ బ్రౌన్ అంచనాలలో ఎన్నో దోషాలు ఉన్నాయని, ధృవాలు తారుమారు అయ్యేటంత మేరకు అంటార్కిటికాలో మంచు పేరుకోవడం అసంభవం అని కొందరు వాదించారు. పైగా అది ధరాతాపనం (global warming) గురించి పెద్దగా అవగాహన లేని రోజులు. ధరాతాపనం వల్ల ధృవాల వద్ద హిమం కరుగుతోందే గాని పెరగడం లేదు. కనుక ధృవాలు బరువెక్కి హ్యూ బ్రౌన్ చెప్పిన తీరులో ప్రమాదం కలగకపోయినా, ధృవాలు కరిగి సముద్ర మట్టం పెరిగి, తీర ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశాలు మాత్రం లేకపోలేదు.
అయితే హ్యూ బ్రౌన్ చెప్పే భౌతిక విధానాలు కాకుండా ధృవ భ్రంశం జరగడానికి మరో అవకాశం కూడా ఉందన్న వారు ఉన్నారు. ఈ మరో రకం ధృవ చలనాన్ని ‘నిజమైన ధృవ సంచారం’ (true pole wander) అంటారు. ఇందులో భూమి అక్షం మారదు. భూమిలో ఘన రూపంలో ఉన్న పైపొరలు (క్రస్ట్ మరియు మాంటిల్), ద్రవ రూపంలో అడుగున ఉన్న ఇనుప ‘కోర్’ మీదుగా జారుతాయి. అలాంటి పరిణామం వల్ల భూమి రూపురేఖలే మారిపోతాయి.
విషయాన్ని ఎటూ తేల్చకుండా శాస్త్రవేత్తల శశభిషలు ఈ విధంగా ఒక పక్క కొనసాగుతుంటే, మరో పక్క సామాన్యుల మనసులో కొంత కలవరం బయల్దేరిందనే చెప్పాలి. మరో పక్క ‘2012’ లాంటి సినిమాలు ఈ ఆందోళనకి ఆజ్యం పోస్తున్నాయి. అసలు ఈ ధృవ భ్రంశం అంటూ జరిగితే ఎంత కాలంలో జరుగుతుంది అన్న ప్రశ్న ఈ విషయం గురించి ఆలోచించే వారందరినీ ఇబ్బంది పెడుతోంది. అతి వేగంగా కొద్ది రోజుల్లో జరిగిపోతుందా, లేక వేల లక్షల ఏళ్లు పడుతుందా? అమెరికన్ “సైకిక్” ఎడ్గర్ సెయిస్ లా కేవలం “ధ్యాన పద్ధతి” లో భవిష్యత్తుని చూసిన వాళ్లుగాని, లేక సాంప్రదాయబద్ధమైన శాస్త్రవేత్తలు కాని వాళ్లు గాని, ఈ పరిణామం చాలా వేగంగా, ఉపద్రవాత్మకంగా జరగొచ్చు అంటూ జనాన్ని కొంచెం బెదరగొట్టినా, ఆధునికులైన శాస్త్రవేత్తలు ఎవరూ అలాంటి ఉపద్రవాత్మక పరిణామాలని ఊహించడం లేదు. ఉదాహరణకి ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఆడమ్ మలూఫ్ అనే భౌగోళిక శాస్త్రవేత్త “గతంలో ధృవాల స్థానాలు మారినా ఈ పరిణామాలు ఓ మనిషి జీవిత కాలంలో జరిగేవి కావు. కొన్ని లక్షల సంవత్సరాల పాటు క్రమంగా జరిగే మార్పులివి” అంటాడు. హమ్మయ్య, బతికించాడు!

1. ఇంట్లో ‘పవర్ ఫాక్టర్ ఆప్టిమైజర్’ ని ఇన్స్టాల్ చేసుకోండి. దీని వల్ల మోటార్ల పనికి అయ్యే ఖర్చు తగ్గుతుంది. వాటి ఆయుర్దాయం కూడా పెరుగుతుంది.
2. ఉతికిన బట్టలని డ్రయర్ లో కాక ఎండలో ఆరేయండి.
3. చల్లనీటిలో బట్టలు ఉతకండి. నీరు పిండిన బట్టలని ఆరుబయట ఆరేయండి. బయట ఎండగా ఉన్నా బట్టలని డ్రయర్ లో ఎండబెట్టకండి.
4. స్నానానికి వీలైనంతవరకు చన్నీళ్ళే వాడండి. ఆ విధంగా శక్తి, నీరు రెండూ ఆదా అవుతాయి.
5. ఇన్కాండెసెంట్ బల్బులని తొలగించి ‘కాంపాక్ట్ ఫ్లోరెసెంట్ లైట్ (CFL) బల్బ్’లని గాని, ‘లైట్ ఎమిటింగ్ డయోడ్ల’ని (LEDs) గాని వాడండి. ఒక్క ఇన్కాండెసెంట్ బల్బుని మార్చితే దాని జీవిత కాలంలో 150 పౌన్ల కార్బన్ ఆదా అవుతుంది. ఈ కొత్త రకం బల్బులు, ఇన్కాండెసెంట్ బల్బుల కన్నా 8-15 రెట్లు ఎక్కువ కాలం మన్నుతాయి, కనుక మొత్తం జీవితకాలంలో సుమారు Rs. 1500 ఆదా చేస్తాయి. అయితే CFL రకం బల్బులలో కాస్తంత పాదరసం ఉంటుంది. కనుక వాటిని పారేసేటప్పుడు ‘ప్రమాదకర వ్యర్థం’గా జమకట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి. LED లు కూడా చాలా సమర్థవంతంగా పని చేస్తాయి. ఇన్కాండెసెంట్ లైట్లకి మల్లె ఇవి కూడా మెత్తని తెల్లని కాంతిని వెలువరిస్తాయి. వాటిలో పాదరసం ఉండదు గాని అవి CFL బల్బుల కన్నా ఆరు రెట్లు ఎక్కువ కాలం మన్నుతాయి. దీని వల్ల విద్యుత్ చార్జీలు తగ్గుతాయి.
6. మైక్రోవేవ్ పరికరాలని మరింతగా వాడాలి. మామూలు గ్యాస్ పొయ్యిల కన్నా, ఓవెన్ ల కన్నా మైక్రోవేవ్ పొయ్యిలు మరింత తక్కువ శక్తిని వాడుతాయి. ముఖ్యంగా నీరు వేడి చేసినప్పుడు శక్తి ఆదా గణనీయంగా కనిపిస్తుంది.
7. ఇంట్లో లైట్ల అవసరం లేకపోతే అది కాసేపే అయినా కూడా లైట్లు ఆపేయండి.
8. నెలకి ఒకసారి అయినా ఏ.సీ. లలో ఫిల్టర్లని శుభ్రం చెయ్యండి, లేదా మార్చేయండి.
9. ఫ్రిడ్జిలో ఉష్ణోగ్రతని 36-38 డిగ్రీల వద్ద, లోపల ఫ్రీజర్ లో ఉష్ణోగ్రతని 0-5 డిగ్రీల వద్ద సెట్ చెయ్యండి. ఫ్రిడ్జ్ లో గాలి పరిమాణం అతి తక్కువగా ఉండేలా, నిండుగా వస్తువులని సర్దండి.
10. పళ్లు తోముకుంటున్నప్పుడు కొళాయి కట్టేయండి. దీని వల్ల నెలకి 25 గాలన్ల నీరు ఆదా అవుతుంది.
11. టాయిలెట్ లో వాడే ట్యాంకులో నీటి మోతాదు తగ్గించుకోండి. టాయిలెట్ టాంకులో నీరు నింపిన లీటర్ బాటిల్ పెడితే నెలకి 300 గాలన్ల నీరు ఆదా అవుతుంది.
12. స్నానానికి ప్రవాహం తక్కువగా ఉండే షవర్లని వాడండి. అలాగే కొళాయిలో ఎయిరేటర్లు (faucet aerators) వాడి నీరు ఆదా చెయ్యండి.
13. ఎండాకాలానికి, చలికాలానికి మధ్య ఇంట్లో వాడే సీలింగ్ ఫాన్ల రెక్కలని తిరగతిప్పండి.
14. వాడేసిన ఫర్నీచర్ కొనుక్కోండి. ఇవి కొత్త ఫర్నీచర్ కన్నా చవకగా ఉంటాయి. (పురతన ఫర్నీచర్ (antique furniture) ఇందుకు మినహాయింపు). పాత ఫర్నీచర్ ని పారేయకుండా వాడడం వల్ల వ్యర్థాలు తక్కువ అవుతాయి.
15. కాగితపు నాప్కిన్ల కన్నా బట్ట నాప్కిన్లు వాడండి. ఆ బట్టని శుభ్రం చెయ్యడానికి నీరు అవసరమైనా ఈ పద్ధతే మేలు.
16. ఇల్లు వదిలి వెళ్లేటప్పుడు ఎలక్ట్రానిక్ ఉపకరణాలని కేవలం ఆఫ్ చెయ్యడమే కాక ప్లగ్గు తీసేయండి. ఆఫ్ చేయబడి ఉన్న స్థితిలో కూడా ఈ పరికరాలు కొంత శక్తిని వాడుతాయి. సామాన్యంగా ఇళ్లలో 10% శక్తి వినియోగం ఈ విధంగా జరుగుతుంది.
17. ఒకే సారి ఎన్నో పరికరాల ప్లగ్గు తీసే సౌకర్యం కావాలంటే ‘సర్జ్ ప్రొటెక్టర్’ వాడండి.
18. వాడుకలో లేనప్పుడు కంప్యూటర్ని షట్ డవున్ చెయ్యండి.
19. పర్యావరణానికి మేలు చేసే కార్యక్రమాలని చేపట్టమని మీ స్థానిక అధికారులని ప్రోత్సహించండి.
20. శక్తిని సద్వినియోగం చేసే పద్ధతుల గురించి మీ స్నేహితులతో, ఇరుగుపపొరుగు వారితో, సహోద్యోగులతో పంచుకోండి.
21. అంగడికి వెళ్లినప్పుడు బట్టసంచీలని తీసుకెళ్లండి, ప్లాస్టిక్ సంచీలు, కాగితం సంచీలు వాడకండి.
22. సహజ పదార్థాల నుండి చేసిన ఉత్పత్తులని వాడండి.
23. దూరాల నుండి రవాణా చెయ్యబడ్డ సరుకుల కన్నా స్థానికంగా చెయ్యబడ్డ సరుకులనే వాడడానికి ప్రయత్నించండి
24. కాపీ చేసి, ప్రింట్ చేసే అవసరాలని తగ్గించుకోండి. తప్పనిసరిగా అవసరమైన పరిస్థితుల్లో కాగితానికి రెండు పక్కలా వాడండి.
25. కవర్లు, ఫోల్డర్లు, క్లిప్పులు మొదలైన వస్తువులని ఒకసారి వాడి పారేయకుండా పదే పదే వాడడానికి ప్రయత్నించండి.
Reference:
Deepika Prasad, Understanding Carbon Footprint, ‘Hasiru Hejje,’ Mysore Amateur Naturalists, Mysore.
(ఇక్కడ అల్ గోర్ వ్యక్తిగత జీవన కథనం కొంచెం ఉంటుంది. ఒక ప్రమాదంలో అకాలంగా గోర్ తన కుమారుణ్ణి కోల్పోతాడు. దాంతో..)
నా ప్రపంచం తలక్రిందులయ్యింది.
అంతా శూన్యంగా అనిపించింది.
నా జీవితమంతా పూర్తిగా మారిపోయింది.
ఇక ఈ భూమి మీద జీవితం ఎలా గడపాలి?
ఎంతో ఆలోచించాను.
చాలా లోతుగా ఆలోచించాను.
అంటార్కిటికా వెళ్లాను.
దక్షిణ ధృవానికి, ఉత్తర ధృవానికి, అమేజాన్ కి వెళ్ళాను.
ముందు అంతగా అర్థం కాని విషయాన్ని
శాస్త్రవేత్తల నుండీ నేర్చుకోడానికి
ఎన్నో ప్రాంతాలు తిరిగాను.
నాకెంతో విలువైన విషయం నా చేజారిపోతుందేమో నన్న ఆలోచన.
అంతకు ముందు లేని ఓ కొత్త శక్తి,
నాలో ప్రవేశించింది.
కాని ఒక్కసారి అనిపించాక,
దాన్ని పోగొట్టుకుంటామేమో అని అనిపించాక
ఇప్పుడు మనకి సొంతం అయ్యింది
రేపు మన పిల్లలకి దక్కదేమో నని భయం వేసింది.
వాతావరణ ఉష్ణోగ్రతకి చెందిన కొలతలివి
సివిల్ వార్ నాటి నుండి తీసుకున్నవి.
ఒక్క ఏడాదిలో చూస్తే తగ్గుతున్నట్టు కనిపించొచ్చు
కాని మొత్తం మీద ఒరవడి చాలా స్పష్టంగా కనిపిస్తోంది.
ఇటీవలి కాలంలో ఆ ఒరవడి మరింత తీవ్రతరం అవుతోంది.
ఈ మొత్తం వాతావరణ రికార్డులో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు అయిన
పది సంవత్సరాలని తీసుకుంటే
అవన్నీ ఈ గత 14 ఏళ్లలోనే వచ్చాయి.
అత్యధిక ఉష్ణోగ్రత 2005 లో నమోదు అయ్యింది.
ఎండ కెరటాల (heat waves) గురించి తరచు వింటున్నాం
ఇలాంటివి ఇంకా పరిపాటిగా వస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.
కొన్నేళ్ళ క్రితం యూరప్ లో ఓ పెద్ద ఎండ కెరటం వచ్చింది.
అది 35,000 మంది ప్రాణాలు తీసుకుంది.
జనం దృష్టి అప్పటికి ఇండియా మీద పళ్ళేదు.
కాని అదే ఏడాది అక్కడి ఉష్ణోగ్రత 122 డిగ్రీల ఫారిన్హీట్ ని చేరుకుంది.
గత వేసవిలో పశ్చిమ అమెరికాలో ఎన్నో నగరాలలో అధిక ఉష్ణోగ్రతల విషయంలో
రికార్డులు బద్దలయాయి.
ఎన్నో సందర్భాలలో వరుసగా కొన్ని రోజులపాటు ఉష్ణోగ్రత 100 డిగ్రీలు దాటింది.
పశ్చిమంలో రెండు వందల నగరాలు, ఊళ్లు పాత రికార్డులన్నీ భేదించాయి.
తూర్పులో కూడా ఎన్నో నగరాలలో అదే జరిగింది.
న్యూ ఆర్లియన్స్ లో కూడా అదే జరిగింది.
కనుక ప్రపంచం అంతటా ఉష్ణోగ్రత పెరుగుతోంది.
సముద్రాలలో కూడా...
సముద్రాల ఉష్ణోగ్రతలోని మారుదలకి ఓ సహజ విస్తృతి ఉంది
అందుకని "అదంతా ఎప్పుడూ ఉండేదేలే!" అంటారేమో.
"కిందకీ మీదకీ పోతుంటుంది. అదేం పట్టించుకోకండి" అంటారేమో.
గత 60 ఏళ్లలో ఆశించిన మారుదల ఇలా ఉంటుంది.
కాని ధరాతాపనంలో నిపుణులైన శాస్త్రవేత్తలు
కొందరు కంప్యూటర్ నమూనాలని ఉపయోగించి
ఉష్ణోగ్రత ఇంతలా పెరుగుతుందని ఎప్పుడో చెప్పారు.
ఇప్పుడు నేను చూపించేది ఇటీవలే విడుదలైన
సముద్ర ఉష్ణోగ్రతా వివరాలు. సముద్రాలు వేడెక్కితే దాని వల్ల
మరింత తీవ్రమైన తుఫానులు వస్తాయి.
గత కొన్నేళ్ళలో ఎన్నో పెద్ద హరికేన్లు చూశాం మనం.
వాటిలో హరికేన్ జీనీ, ఫ్రాన్సిస్, ఇవాన్ లు కూడా ఉన్నాయి.
అదే సంవత్సరం వరుసగా ఎన్నో పెద్ద హరికేన్లు వచ్చాయి.
టోర్నాడోల విషయంలో కూడా అమెరికాలో
రికార్డులు బద్దలయ్యాయి.
మన వార్తా పత్రికల్లో జపాన్ ప్రస్తావన అంతగా రాలేదు.
కాని టైఫూన్ లలో వాళ్ళు కూడా గత రికార్డులు బద్దలు కొట్టారు.
గత రికార్డు ఏడు అయితే 2004 లో వచ్చిన పదింటి సమాచారం చూడండి.
సైన్సు పుస్తకాలన్నీ తిరగరాయాలి ఎందుకంటే వాటిలో దక్షిణ అట్లాంటిక్ సముద్రంలో హరికేన్లు రావు, రాలేవని ఉంటుంది.
కాని అదే సంవత్సరం బ్రెజిల్ మీద మొట్టమొదటిది దెబ్బ కొట్టింది.
2005 లోని వేసవి గురించి పుస్తకాలు పుస్తకాలుగా రాసుకోవచ్చు.
మొదటిది యుకటాన్ ని భీభత్సం చేసిన ఎమిలీ.
తరువాత హరికేన్ డెనిస్ వచ్చి చాలా విధ్వంసం చేసింది.
పెట్రోల్ పరిశ్రమ దెబ్బ తింది.
ప్రపంచంలో అతి పెద్ద ఆయిల్ ప్లాట్ఫార్మ్ డెనిస్ దెబ్బకి ఎలా అయ్యిందో చూడండి (చిత్రం).
ఆ తరువాత కట్రినా వచ్చింది.
అది ఫ్లోరిడా మీదకి వచ్చినప్పుడు ఒకటవ స్థాయి హరికేన్ అన్నది గుర్తుంచుకోవాలి.
అందులో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు.
బిలియన్ల డాలర్ల నష్టం జరిగింది.
అప్పుడేం జరిగింది?
న్యూ ఆర్లియన్స్ మీదకి రాకముందు అది వెచ్చని జలాల మీదుగా వెళ్లింది
నీటి ఉష్ణోగ్రత పెరుగుతున్న కొలది, గాలి వేగం పెరుగుంది.
దాంతో తేమ కూడా పెరుగుతుంది.
ఆ విధంగా ఫ్లోరిడా మీద హరికేన్ కట్రీనా ఏర్పడింది.
అలా వెచ్చని జలాల మీదుగా గల్ఫ మీదకు వచ్చినప్పుడు
శక్తి పుంజుకుని ఇంకా ఇంకా బలవత్తరమవుతుంది.
ఆ హరికేన్ కంటిని చూడండి. (చిత్రం)
పర్యవసానాలు దారుణంగా ఉన్నాయని వేరే చెప్పనక్కర్లేదు.
వర్ణించడానికి మాటల్లేవు.
వార్తలు వింటుంటే గుండె తరుక్కుపోతుంది.
"నేలమాళిగాలో దాక్కున్నాను. ఇంకీ బాధ భరించలేను," అన్నారు కొందరు.
"పీకల్దాకా నీరు. ఇక నా వల్లకాదు."
ఇక్కడ మనం మాట్లాడుకుంటుంటే అవన్నీ జరుగుతున్నాయక్కడ.
17 వీధి కాలువ సమస్య యొక్క ప్రాముఖ్యత
గురించి అందరికీ తెలియజేశాం.
"దీని సంగతి కొంచెం చూడండి" అని అర్థించాం.
"ఏం చేస్తారో మాకు తెలీదు. ఎలాగైనా దీన్ని
పరిష్కరించండి," అన్నాం.
ఇది అమెరికాకి కొత్త సమస్య.
కాని అసలు అలాంటిది ఇక్కడ ఎలా సాధ్యం?
హరికేన్లు ఇంకా ఇంకా ఉధృతం అవుతాయని హెచ్చరికలు వచ్చాయి.
ఈ హరికేన్ వచ్చిందంటే కట్టలకి గండి పడుతుందని అది రావడానికి కొన్ని రోజుల ముందే
హెచ్చరికలు వచ్చాయి.
బోలెడంత విధ్వంసం జరుగుతుంది అన్నారు.
అలాగే జరిగింది.
ప్రపంచంలో మేటి శాస్త్రవేత్తలంతా చెప్తున్నప్పుడు
ఒక దేశపు ప్రజగా మనమంతా ఎలా స్పందిస్తామన్నది
మనమే నిర్ణయించుకోవాలి.
(సశేషం...)
ఇక్కడ మనకో సందేశం వినిపిస్తోంది.
ఓ విశ్వవ్యాప్తమైన సందేశం.
ఈ కరిగే మంచు మనకెన్నో కథలు చెప్తోంది.
నా స్నేహితురాలు లానీ థాంసన్ మంచు గడ్డలని తవ్వుతుంది.
లోతుగా తవ్వి తవ్విన మంచుగడ్డలని పైకి తెచ్చి
చూసి వాటిని పరీక్షిస్తారు.
మంచు పడినప్పుడు అందులో వాతావరణం చిన్న బుడగలుగా చిక్కుకుంటుంది.
వాటిని కోసి, కొలిచి ఆ మంచు పడ్డ ఏట వాతావరణంలో CO2 ఎంతుందో
కొలవచ్చు.
అంతకన్నా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆక్సిజన్ యొక్క వివిధ ఐసోటోప్ లని
కూడా కొలవచ్చు. అదో కచ్చితమైన ధర్మామీటర్ లా పని చేస్తుంది.
మంచు పడ్డ ఏడాది ఉష్ణోగ్రత ఎంతో చెప్తుంది.
నేను అంటార్కిటికా కి వెళ్లినప్పుడు
ఇలాంటి మంచు తునకలని ఎన్నో చూశాను.
దాన్ని ఒకాయన చూసి "యుఎస్ కాంగ్రెస్ క్లీన్ ఎయిర్ బిల్లు పాస్ చేసింది సరిగ్గా ఇక్కడే" అన్నాడు.
నేను నమ్మలేకపోయాను. కాని తేడా స్పష్టంగా కంటికి కనిపిస్తుంది. ఆ బిల్లు అమలు జరిగిన కొన్నేళ్ళలోనే
తేడా స్పష్టంగా కనిపించింది.
ఏటేటా తేడాలు కొలుస్తూ పోవచ్చు. చెట్టు వలయాలు చూసి చెట్టు వయసు చెప్పటం లాంటిదే ఇదీను.
ప్రతీ ఏడు కరిగి మళ్లీ గడ్డ కట్టిన పొరని చూడొచ్చు.
పర్వత హిమానీనదాలలో ఈ విధంగా వెయ్యేళ్లు గతంలోకి తొంగి చూడొచ్చు.
దాన్ని ఉష్ణోగ్రత కొలిచే థర్మామీటర్ లా వాడుకోవచ్చు.
నీలం అంటే చల్లదనం, ఎరుపు అంటే వేడి.
దీన్ని చూపించడానికి రెండు కారణాలు.
మొదటిది - నమ్మకం లేని వాళ్లు కొన్నిసార్లు అంటూంటారు
"ఆ(! ఇదంతా చక్రికంగా జరిగే వ్యవహారమేలే"
మధ్య యుగంలో కూడా ఒక దశలో ఉష్ణోగ్రత పెరిగింది.
అవును నిజమే. అదుగో అది ఇక్కడ కనిపిస్తుంది.
అలాగే మరి రెండు.
కాని ప్రస్తుతం జరుగుతున్న దాంతో పోల్చితే
అసలు పోలికే లేదు.
వెయ్యేళ్లు గతంలో ఉష్ణోగ్రతలని పరిశీలిస్తే,
అలాగే వెయ్యేళ్లు గతంలో CO2 ని పరిశీలిస్తే
రెండూ ఎంత చక్కగా సరిపోతాయో చూడండి.
(గత నాలుగు లక్షల ఏళ్ల కాలంలో CO2, ఉష్ణోగ్రత కలిసి ఎలా మారుతున్నాయో ఈ గ్రాఫ్ లో చూడొచ్చు)
http://www.daviesand.com/Choices/Precautionary_Planning/New_Data/
ఇప్పుడు పర్వత హిమానీనదాల్లో వెయ్యేళ్ళ CO2 ని చూద్దాం.
దీన్ని అలా ఉంచితే అంటార్కిటికా లో గతంలో 650,000 ఏళ్ల వరకు కూడా పోవచ్చు.
మరో విశేషం ఏంటంటే వైజ్ఞానిక సమాజానికి బయట ఈ చిత్రాన్ని ప్రదర్శించడం ఇదే మొదటిసారి.
ఇది వర్తమానం, అది క్రిందటి హిమయుగం. గతంలోకి తొంగి చూద్దాం.
రెండు హిమయుగాల మధ్య వచ్చిన తాపయుగం అది.
అది రెండో హిమయుగం. అదుగో మూడో హిమ యుగం.
నాలుగోది, ఐదవది, ఆరవది. అదుగో ఏడవది.
ఇప్పుడో ముఖ్య విషయం చెప్పుకోవాలి.
ఇంత కాలంలోను అంటే 650,000 ఏళ్ళలోను CO2 స్థాయి ఎప్పుడూ మిలియన్లో 300 భాగాలు మించలేదు.
ఇప్పుడు ఉష్ణోగ్రత కూడా కొలుస్తున్నారని ఇందాక చెప్పాను.
మన భూమి మీద ఉష్ణోగ్రత అలా ఉండేది.
ఇక్కడ కొట్టొచ్చినట్టు కనిపించే విషయం ఒకటుంది.
దాన్ని ఇలా చెప్తాను.
ఇప్పుడు మా ఆరోక్లాసు క్లాస్ మేటు ఆఫ్రికా, దక్షిణ అమెరికా తీరాల గురించి మాట్లాడిన వాడు
వచ్చి "అవి అసలు ఎప్పుడైనా కలిసి ఉండేవా?" అనడిగినప్పుడు
మా టీచరు "ఇంతకన్నా వెర్రి ఆలోచన నేనెక్కడా విన్లేదు"
అన్నాడనుకోండి. కాని మరి నిజంగానే అవి కలిసి ఉండేవి.
అయితే వాటి మధ్య సంబంధం చాలా క్లిష్టంగా ఉంటుంది.
కాని అంత కన్నా ప్రగాఢమైన సంబంధం ఒకటుంది.
మిగతా అన్నిటికన్నా లోతైన సంబంధం.
CO2 పెరుగిన ప్రతీ సారి ఉష్ణోగ్రత పెరుగుతుంది.
ఎందుకంటే CO2 సూర్యతాపాన్ని బంధిస్తుంది.
అమెరికా దేశంలో ఆధునిక మహానగరాలు ఉన్న ప్రాంతాల్లో క్లీవ్లాండ్, డెట్రాయిట్, న్యూ యార్క్ మొదలైన ఉత్తర ప్రాంతపు ఊళ్లలో
ప్రశాంత వాతావరణం ఉన్న రోజుకి నెత్తిన మైలు మందంలో మంచు ఉండడానికి మధ్య తేడా ఉంది.
ఈ కింది విషయాన్ని గమనిస్తున్నప్పుడు అది గుర్తుంచుకోండి.
కార్బన్ డయాక్సయిడ్ మిలియన్ లో 300 భాగాలు ఎప్పుడూ దాటకపోగా
ప్రస్తుతం దాని విలువ ఇక్కడ ఉంది. గత విలువల కన్నా చాలా చాలా ఎక్కువ.
సమాచారం ఉన్నంత వరకు మనకి ఇదే కనిపిస్తోంది
ఒక్కసారి ఈ విషయం ఎంత ముఖ్యమైనదో చెప్తాను.
ఇక్కడి సిబ్బంది ఈ పరికరం ఎలా వాడాలో
ఇందాక నేర్పించారు.
నేను ఏ అఘాయిత్యమూ చెయ్యకపోతే...
(చిత్రంలో ఈ సన్నివేశంలో తెర మీద గ్రాఫు ’వర్తమానం’లో చాలా పైకి పోతుంది. అంత పైనున్న విలువలని చూపించడానికి ఒక చిన్న ’లిఫ్ట్’ లాంటి పరికరాన్ని వాడతాడు గోర్. దాని గురించే ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. - అనువాదకుడు).
ఇదుగో ఇక్కడ ఉంది.
ప్రకృతి సహజమైన లయకి ఇది ఎంత ఎత్తున ఉందో చూడండి.
దానికి కారణం మనం.
సోదర సోదరీ మణులారా,
వచ్చే 50 ఏళ్లలో నిజానికి 50 ఏళ్ళ లోపే అది ఇంకా పైకి పోతుంది.
ఇక్కడున్న పిల్లల్లో కొందరు నా వయసుకి వచ్చినప్పుడు 50 ఏళ్ల లోపు అది ఎక్కడికి వస్తుందో చూడండి.
చార్టు నుండి బయటకి పొడుచుకొచ్చే గ్రాఫులంటే సరిగ్గా ఇవే.
50 ఏళ్లలో అక్కడికి చేరుకుంటుంది.
ఈ పరిశీలనలో భాగం అయిన ఏ సంఖ్యలో గాని, తేదీలో గాని ఏ విధమైన వివాదమూ లేదు.
నమ్మకం లేని వాళ్లు ఇవన్నీ చూసి "ఇప్పుడు కొంపలేం అంటుకుపోయాయ్?" అంటారు.
"ఇప్పుడేం కొంపలు అంటుకుపోయాయని?"
సరే అయితే మళ్లీ ఉష్ణోగ్రత పక్కకి వస్తే
చల్ల దనం వైపు ఇక్కడికి వచ్చినప్పుడు నెత్తి మీద మైలు ఎత్తు మంచు ఉంటే
తాపం వైపు అంత పెరిగినప్పుడు ఎలా ఉంటుందో?
చివరికి చూస్తే ఇది రాజకీయ సమస్య కాదు.
నైతిక సమస్య కూడా కాదు.
కాని ఈ సమాచారాన్ని అలా వక్రపరిస్తే మాత్రం అది ఘోరమైన పాపమే అవుతుంది.
మన ప్రజాస్వామ్య పద్ధతి అంటే, స్వయంపాలన అంటే , నాకు గొప్ప గౌరవం.
గట్టి నమ్మకం ఉండేది
ఈ విషయం వినగానే కాంగ్రెస్ స్పందించి సమూలమైన మార్పులు వచ్చేలా
గట్టి చర్యలు తీసుకుంటుంది అనుకునేవాణ్ణి.
వాళ్ళు కూడా నాలాగే అదిరిపోతారనుకున్నాను. కాని అలా జరగలేదు.
అవి విజయాలు కాని విజయాలు
పరాజయాలు కాని పరాజయాలు.
ఆ చిన్న మొదటి మెట్టు యొక్క ప్రాముఖ్యతని పెంచటానికి పనికొచ్చాయి.
ఓ ఘోర పరాజయం యొక్క ప్రాముఖ్యతని ప్రస్ఫుటం చేశాయి.
(సశేషం...)

కాని నాలో ఓ ప్రశ్న మిగిలిపోయింది.
ప్రతి ఏటా అది (CO2) ఒకసారి పైకి కిందకి ఎందుకు పోతుంది?
దానికి సమాధానంగా ఆయన ఇలా అన్నాడు.
భూమి మీద భూభాగాన్ని ఓసారి గమనిస్తే భూమధ్య రేఖకి దిగువగా ఎక్కువ భూమి లేదు.
భూమధ్యరేఖకి ఉత్తరంలోనే ఎక్కువ ఉంది.
కనుక వృక్ష సంపద కూడా ఎక్కువ భూమధ్యరేఖకి పైనే ఉంది.
కనుక వసంతంలోను, ఎండా కాలంలోను ఉత్తర భూగోళం
సూర్యుడి వైపుకి వొరిగి నప్పుడు
ఆకులు పొడుచుకొచ్చి కార్బన్ డయాక్సయిడ్ ని లోనికి పీల్చుకుంటాయి.
కనుక వాతావరణంలో ఆ వాయువు మోతాదు తగ్గుతుంది.
కాని శరత్తులోను, చలికాలంలోను ఉత్తర భూగోళం
సూర్యుడి నుండి దూరంగా ఒరిగినప్పుడు ఆకులు రాలి కార్బన్ డయాక్సయిడ్ ని బయటికి వదిలేస్తాయి.
అలా వొదిలిన వాయువంతా తిరిగి వాతావరణంలోకి చేరుతుంది.
ఆ విధంగా భూమి మొత్తం ఏడాది కొకసారి శ్వాస తీసుకున్నట్టు అవుతుంది.
1958 లో కార్బన్ డయాక్సయిడ్ ని కొలవడం మొదలేట్టాం.
ఇదుగో చూడండి. 60 లలో ఆయన మాకీ చిత్రాన్ని చూపించినప్పుడు
అది పెరుగుతోందని అప్పటికే స్పష్టమయ్యింది.
ఆయనంటే నాకు గౌరవం. ఆయన నుండి ఎంతో నేర్చుకున్నాను.
1970 లలో కాంగ్రెస్ లో చేరినప్పుడు
ధరాతాపనం మీద మొట్టమొదటి సమావేశాలని
నేనే ఏర్పాటు చేశాను.
మా ప్రొఫెసర్ ని వాటిలో సాక్షిగా పాల్గొనమన్నాను.
ఆ సమావేశాలకి గొప్ప ప్రభావం ఉంటుందని అనుకున్నాను.
వెంటనే చర్యలు మొదలెడతాం అనుకున్నాను. కాని అనుకున్నట్టు జరగలేదు.
ఆ సమావేశాలు కొనసాగాయి. 1984 లో సెనేట్ లో చేరినప్పుడు
సమస్యని మరింత లోతుగా శోధించాను.
ఎన్నో వైజ్ఞానిక సమావేశాలలో పాల్గొన్నాను.
దాని మీద ఒక పుస్తకం రాశాను.
1988 లో రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేశాను.
అలాగైనా ఆ సమస్యకి ప్రాచుర్యం తేవాలని నా ఉద్దేశం.
1992 లో వైట్ హౌస్ లో ప్రవేశించాను.
కార్బన్ సిస్తుకి రూపాంతరాన్ని అమలుజరిపాం.
అలాంటివే మరి కొన్ని చర్యలు కూడా తీసుకున్నాం.
1997 లో క్యోటోకి వెళ్లి వివాదాస్పదమైన ఆ ఒప్పందాన్ని అమెరికా లోనైనా
అమలు జరపాలని అనుకున్నాను.
2000 లో నా ప్రత్యర్థి కార్బన్ డయాక్సయిడ్ ని నియంత్రిస్తానని ప్రమాణం చేశాడు గాని దానికి కట్టుబడలేదు.
కనుక ఇదంతా చూస్తున్నప్పుడు ఎన్నో ఏళ్ళుగా మళ్లీ మళ్ళీ ఒకే ధోరణి కనిపిస్తోంది.
అదలా పెరుగుతూనే ఉంది. ఎడతెరిపిలేకుండా...
వాస్తవ ప్రపంచంలో ఇప్పుడు దాని ప్రభావం కనిపిస్తోంది.
30 ఏళ్ల క్రితం ఇది కిలిమంజారో పర్వతం. ఇటీవలి కాలంలో దాని స్వరూపం.
ఈ మధ్యనే ఓ మిత్రుడు కిలిమంజారో ని చూసొచ్చాడు.
కొన్ని నెలల క్రితం అతడు తీసిన ఫోటో ఇది.
లానీ థాంసన్ అనే మరో నేస్తం హిమానీనదాలని (glaciers)
అధ్యయనం చేస్తున్నాడు.
(http://researchnews.osu.edu/archive/scndkili.htm)
ఒకప్పుడు మహాహిమానీ నదం అనుకున్న దాని నుండి
మిగిలిన ఆఖరు వెండి తళుకులు తెచ్చి చూపించాడు లానీ.
మరో దశాబ్దం తిరిగేలోపు కిలిమాంజారో మీద ఇక మంచు ఉండదు.
హిమానీనద జాతీయ వనంలో ఇది ఇప్పటికే జరుగుతోంది.
1998 లో నా ఇద్దరు కూతుళ్లని తీసుకుని నేనీ కొండ ఎక్కాను.
15 ఏళ్లలో ఒకప్పుడు హిమానీనదం అయ్యింది, ఇలా మారిపోతుంది.
ఏటా కొలంబియా హిమానీనదంలో వచ్చే మార్పులు చూడండి.
ప్రతీ ఏడూ క్రమంగా వెనక్కు జరిగిపోతోంది.
చూస్తే బాధ అనిపిస్తుంది ఎందుకంటే హిమానీనదాలు చాలా అందంగా ఉంటాయి.
వాటిని చూద్దాం అని వెళ్లిన వాళ్లకి నానాటికి కనిపిస్తున్నది ఇదీ.
హిమాలయలలో ఓ ప్రత్యేక సమస్య ఉంది.
ప్రపంచంలో 40 % మనుషులు నదుల నుండి, నీటి బుగ్గల నుండి త్రాగేనీటిని పొందుతారు.
వాటిలో సగానికి పైగా మంచు కరిగిన నీటి చేతనే పోషించబడతాయి.
ఇక వచ్చే అర్థ శతాబ్దంలో భూమి మీద ఆ 40 % మంది హిమానీనదాలు కరగడం వల్ల తీవ్రమైన నీటి కొరతని
ఎదుర్కుంటారు.
ఇటలీలోని ఇటాలియన్ ఆల్ప్స్. నేడు అదే పరిస్థితి.
స్విట్జర్ లాండ్ నుండి వచ్చిన ఓ పాత పోస్ట్ కార్డ్.
ఆల్ప్స్ లో ఎక్కడ చూసినా అదే కథ.
దక్షిణ అమెరికాలో కూడా అదే కథ.
ఇది పెరూ... 15 ఏళ్ళ క్రితం. నేడు అదే హిమానీనదం.
20 ఏళ్ళ క్రితం ఇది అర్జెంటీనా. అదే హిమానీనదం నేడు.
దక్షిణ అమెరికా కొమ్ము వద్ద ఉండే పటగోనియా డెబ్బై ఏళ్ల క్రితం.
ఈ విశాల మంచు ప్రాంతం అంతా ఇప్పుడు లేదు.
ఇక్కడ మనకో సందేశం వినిపిస్తోంది.
ఓ విశ్వవ్యాప్తమైన సందేశం.
(సశేషం...)
కాని అవి నిజానికి అవి కదులుతాయని మనకి తెలుసు.
అవి ఒకదాన్నుండి ఒకటి దూరంగా జరుగుతాయి. నిజానికి ఒక సమయంలో అవి ఒకదాంతో ఒకటి సరిగ్గా అతికిపోయేవి. కాని ఆ తప్పుడు భావనతోనే వచ్చింది చిక్కు. జీవితంలో అనుభవం చెప్పే పాఠం ఒకటుంది. మనకు సమస్యలు వచ్చేది తెలీని విషయాల వల్ల కాదు. తెలుసునని నమ్మే విషయాల వల్ల.
అలాంటి తప్పుడు నమ్మకమే ఇక్కడ కూడా ఒకటి ఉంది.
ధరాతాపనం విషయంలో కూడా చాలా మంది, అసలలాంటిది లేదని
మనస్పూర్తిగా నమ్ముతారు. ఆ నమ్మకం తీరు ఇలా ఉంటుంది. భూమి చాలా పెద్దది. కనుక భూమి యొక్క పర్యావరణానికి
మనం శాశ్వత హాని చెయ్యడం అనేది జరగని పని. ఆ విషయం గతంలో నిజం కావచ్చు కాని నేడు కాదు.
నేడు అది నిజం కాకపోవడానికి కారణం భూమి యొక్క పర్యావరణంలో చాలా సున్నితమైన ప్రాంతం వాతావరణం కావడమే.
ఎందుకంటే అది చాలా సన్నని పొర. నా మిత్రుడు కార్ల్ సాగన్ అంటూ ఉండేవాడు - పైన వార్నిష్ పూత వేసిన
ఓ పెద్ద గోళాన్ని తీసుకుంటే గోళం యొక్క మందానికి వార్నిష్ మందం ఎంతో భూమి వాతావరణపు మందం కూడా
భూమితో పోల్చితే అంతే. అది కూడా చాలా సన్నగా ఉంటుంది.
అందులోని అంశాలని మనం మార్చగలం. కనుక మనం ధరాతాపనం గురించి వివరంగా చెప్పుకోవాలి.
ఈ విషయం గురించి ఎక్కువగా చర్చించబోవటం లేదు. ఇవి మీకు తెలిసిన విషయాలే.
సూర్య తేజం కాంతి తరంగాలుగా ప్రసారం అవుతుంది. ఆ తరంగాలు భూమిని వేడెక్కిస్తాయి.
భూమి చేత గ్రహించబడి భూమిని వేడెక్కించిన కిరణాలలో కొన్ని పరావర్తనం చెంది తిరిగి అంతరిక్షంలోకి
పరారుణ క్రిరణాలుగా (infrared radiation) ప్రసారం అవుతాయి. అలా బయటికి పోతున్న కిరణాలలో కొన్ని
వాతావరణపు పొరలో చిక్కుకుపోయి వాతావరణంలోనే ఉండిపోతాయి. ఇది ఒక రకంగా మంచిదే. ఎందుకంటే ఇందువల్ల భూమి ఉష్ణోగ్రత
కొన్ని మితుల మధ్య క్రమబద్ధీకరించబడుతుంది. ఇంచుమించు స్థిరంగా జీవనానికి అనుగుణంగా ఉంచుతుంది.
కాని చిక్కేంటంటే ఈ సన్నని వాతావరణపు పొర అందులో చేరుతున్న ధరాతాపన కాలుష్యం వల్ల
మరింత దట్టం అవుతోంది. అలా వాతావరణం దట్టం అవుతున్న కొలది బయటికి పోవాల్సిన పరారుణ కాంతి మరింతగా చిక్కు పడిపోతోంది.
ఆ విధంగా వాతావరణం నానాటికీ వేడెక్కిపోతోంది. అదే ధరాతాపనం. సాంప్రదాయక వివరణ అలా ఉంటుందన్నమాట.
కాని దానికి అసలు వివరణ ఏంటో నేను చెప్తాను.
మీ ఐస్క్రీం అంతా ఎక్కడికిపోయిందని మీరు ఆశ్చర్యపోతున్నారేమో. చూడండమ్మా, దానికి కారణం విదేశీయులు కారు. దానికి కారణం ధరాతాపనం.
ఇప్పుడు మిస్టర్ సూర్యకిరణ్ గార్ని కలుద్దాం. ఈయన గారు సూర్యుడి నుండి భూమిని సందర్శిస్తున్నారు.
"హలో, భూమీ! నీ జీవితంలో కాంతులు నింపటానికే వచ్చా! ఇక వస్తా, వెళ్లొస్తా."
"అంత తొందరొద్దు సూర్యకిరణ్ గారూ. మేమంతా హరిత గృహ వాయువులం. ఎక్కడికెళతారు లేండి. ఉండిపోండి."
"ఓరి దేవుడోయ్ ఈ ఎండనిభరించటం ఇక నా వల్ల కాదు!"
త్వరలోనే భూమి మొత్తం కిరణాలతో నిండిపోయింది.
వాటి అవశేషాలు వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి.
ఈ హరితగృహ వాయువులని వొదిలించుకునేదెలా?
అదృష్టవశాత్తు మన అతితెలివి రాజకీయనాయకులు ధరాతాపనానికి విరుగుడుగా ఓ చవకబారు మార్గాన్ని కనిపెట్టారు.
2063 నుండి అప్పుడప్పుడు సముద్రంలో ఓ పెద్ద ఐసుముక్కని పడేస్తూ ఉంటే చాలట.
మీ డాడీ రోకూ డ్రింక్ లో వేసుకునే ఐసుముక్క లాంటిది అన్నమాట.
కాని హరితగృహ వాయువులు అలా పెరుగుతూనే ఉన్నాయి.
పోగా పోగా ఇంకా ఎక్కువ ఐసు కావాల్సి వస్తుంది.
ఆ విధంగా సమస్యకి శాశ్వత పరిష్కారం జరుగుతుందని ఆలోచన!
కాని...
నిజంగా ఆవిధంగా శాశ్వత పరిష్కారం దొరుకుతుందా?
ఈ చిత్రాన్ని చూశాకే ఈ సమస్య మీదకి నా దృష్టి మళ్లింది.
నేను కాలేజి స్టూడెంట్ గా ఈ చిత్రాన్ని చూశాను.
మాకు రోజర్ రెవెల్ అనే ప్రొఫెసర్ ఉండేవారు.
పృథ్వీ వాతావరణంలో కార్బన్ డయాక్సయిడ్ ని కొలవమని
సూచించిన మొదటి వ్యక్తి అతడు. కథ ఎటు పోతోందో ఆయన గుర్తించాడు.
మొదటి పేజీలు తిరగేయగానే, ప్రప్రథమ సమాచారాన్ని చూడగానే
దాని అంతరార్థమేమిటో, భవిష్యత్తు ఏమిటో ఆయన పట్టేశాడు.
1957 లో వాళ్లు ఒక ప్రయోగం చేశారు. చార్లెస్ డేవిడ్ కీలింగ్ ని నియమించారు.
ఇలాంటి కొలతలు చాలా కచ్చితంగా, నిర్దుష్టంగా తీసుకోవడంలో కీలింగ్ గొప్ప నిపుణుడు.
రోజూ ఆ వాతావరణ బెలూన్ లని పంపించడం మొదలెట్టారు. పసిఫిక్ సముద్రం మధ్యలో నుంచి పంపించారు.
అది జనావాసానికి దూరంగా ఉన్న ప్రాంతమని.
ఈయన ముక్కుకి సూటిగా పోయే మనిషి. కచ్చితమైన సమాచారాన్ని తప్ప మరేదీ నమ్మడు.
అవి నాకు మరపురాని రోజులు. ఎంతో మంది యువతలాగే నాకు కూడా
కొత్త, పాత భావాల మధ్య సంఘర్షణతో కలలో కూడా ఊహించని ఊహలతో
పరిచయం ఏర్పడింది.
ఒక సారి మాకు క్లాసులో చూపించాడు. కొన్నేళ్లలోనే తీసుకున్న కొలతల వివరాలు చూపించాడు.
నాకైతే దిమ్మదిరిగి పోయింది. ఆయన కూడా అదిరిపోయాడు.
దాని అంతరార్థం ఏమిటో క్లాసులో అందరికీ స్పష్టం చేశాడు.
అందరం ఆ పాఠాన్ని మనసుకి పట్టించుకున్నాం.
ఎన్నో పర్యవసానాలు, మానవజాతిలో వచ్చే ముఖ్య మార్పులు
ఇప్పుడు పృథ్వీ వాతావరణంలో కళ్లకి కట్టినట్టు కనిపించాయి.
సకాలంలో చర్యలు తీసుకోకపోతే ఆ ఒరవడి భవిష్యత్తులో ఎటు పోతుందో చూపించాడు.
అంతా స్పష్టంగా బోధపడింది.
మొదటి ఏడు, ఎనిమిది, తొమ్మిది ఏళ్ళలోనే ఆ ఒరవడి ఎలా మారుతుందో కనిపిస్తోంది.
కాని నాలో ఓ ప్రశ్న మిగిలిపోయింది.
(సశేషం...)
ప్రస్తుత సమాజంలో, మీడియాలో పర్యావరణాన్ని గురించి, ధరాతాపనం (global warming) గురించి చాలా చర్చ జరుగుతోంది.
ఈ అంశం మీద అమెరికాకి చెందిన మాజీ ఉపరాష్ట్రపతి ఆల్ గోర్ "An Inconvenient Truth" అనే పేరుతొ ఒక చక్కని డాక్యుమెంటరీ రూపొందించాడు.
ప్రస్తుతం వాతావరణంలో కనిపిస్తున్న సంచలనాత్మక మార్పులన్నీ ఎప్పుడూ ఉండే ఆటుపోట్లే నని చాలా మంది ధరాతాపనాన్ని మొదట్లో కొట్టిపారేశారు. అసలు అలాంటిది ఉందని కూడా ఒప్పుకునేవారు కారు. కాని ధరాతాపనం అనేది మనకి నచ్చినా నచ్చకపోయినా ఒక స్థిర వాస్తవమని, అందులో మానవుడి పాత్ర ఎంతో ఉందని సామాన్యులకి అర్థమయ్యే తీరులో చక్కగా వర్ణిస్తాడు గోర్. ఆ చిత్రంలోని వ్యాఖ్యానానికి ఇది సచిత్ర అనువాదం.
---
నచ్చని నిజం
అంతరిక్షం లోంచి భూమిని తీసిన చిత్రాలలో ఇది మనం చూసిన మొట్టమొదటి చిత్రం.
1968 లో క్రిస్మస్ నాడు తీసిన చిత్రం.
అపోలో 8 మిషన్ లో తీసిని చిత్రం.
ప్రశాంత వాతావరణపు పొరల మధ్య భూమి ఒదిగిపోయింది.
కాని ఆ వాతావరణపు సన్నని పైపొరని కాలుష్యంతో నింపుతున్నాం.
(సోదర సోదరీమణులారా, ఇప్పుడు మిస్టర్ ఆల్ గోర్ ప్రసంగిస్తారు.)
నా పేరు ఆల్ గోర్.
అమెరికా దేశానికి ఒకప్పుడు నన్ను భావి రాష్ట్రపతిగా చెప్పుకునేవారు. (ప్రేక్షకులలో నవ్వు)
అది నాకేం అంత గమ్మత్తుగా అనిపించటంలేదు.
ఈ కథని నేను చాలా కాలంగా చెప్పాలని చూస్తున్నాను. కాని ఈ సందేశాన్ని అందించడంలో విఫలం అయ్యానని అనిపిస్తుంది.
రాజకీయాలలో ఎంతో కాలం సేవలు అందించాను. ఆ సేవలకి గర్వపడుతున్నాను.
మీరు నమ్మకపోవచ్చు గాని ఇది నిజంగా ఓ జాతీయ ఉపద్రవం. ఇది చాలా చాలా పెద్ద ఉపద్రవం.
మరిప్పుడు ఏం చెయ్యాలి? ప్రస్తుతం రాజకీయాల్లో మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇరు పక్షాలలోను ఉన్నారు. కాని ఈ సమస్యకి దూరంగా ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళీ సమస్యని ఒప్పుకుంటే, గుర్తిస్తే పెద్ద పెద్ద మార్పులు చెయ్యాల్సిన నైతిక బాధ్యత వాళ్ల నెత్తిన పడుతుంది.
ఈ దేశపు చరిత్రలోనే అతిపెద్ద ఉపద్రవం ఇది.
చందమామ మీద ఎక్కడ వాలాలో వెతుకుతుంటే
రేడియో సంబంధాలు తెగిపోయాయి
చంద్రుడి మీద చీకటి వైపుకి వెళ్ళారు.
కాసేపు ఏమయ్యిందో తెలీని ఉత్కంఠ.
రేడియో సంబంధాలు మళ్లీ ఏర్పడ్డాయి.
అప్పుడు పైకి చూశారు.
ఈ ఫోటో తీశారు. వసుధోదయం గా దీనికి పేరు వచ్చింది.
ఆ ఒక్క చిత్రం మానవ చైతన్యం మీద చెరగని ముద్ర వేసింది.
సంచలనాత్మక మార్పులు కలుగజేసింది.
అది తీసిన పద్దెనిమిది నెలల్లో ఆధునిక పర్యావరణ ఉద్యమం మొదలయ్యింది.
ఈ తదుపరి చిత్రం ఆఖరు అపోలో మిషన్ లో తీసింది. అపోలో పదిహేడు. దీన్ని 1972 లో డెసెంబర్ 11 నాడు తీశారు.
బహుశ చరిత్రలో ఇన్ని సార్లు ముద్రించబడ్డ ఫోటో మరేదీ లేదేమో.
అంతరిక్షం నుండి భూమిని తీసిన ఫోటోల్లో సూర్యుడు వ్యోమనౌకకి సరిగ్గా వెనక్కి ఉండగా తీసిన ఫోటో ఇదొక్కటేనేమో.
కోటి కాంతులతో భూమి ప్రకాశిస్తోంది ఇందులో.
నేను ఇప్పుడు చూపించబోయే ఫోటో మీరు ఎప్పుడూ చూసి ఉండరు.
గెలీలియో అనే వ్యోమనౌక నుండి తీసిన ఫోటో. సౌరమండలం మీద అన్వేషణలో బయలుదేరింది ఈ నౌక.
భూమి నుండి దూరం అవుతున్న సమయంలో అది దాని కెమేరాలని వెనక్కి తిప్పింది.
ఆగాగి తీస్తూ ఒక పూర్తి రోజు కాలం భూమిని ఫోటోలు తీసింది. 24 సెకనుల కాలంలో దాన్ని కుదిస్తున్నాం.
ఎంత అందంగా ఉంది కదూ?
ఒకరకంగా ఇదో అద్భుతమైన చిత్రం. నా మిత్రుడు టామ్ వాన్ సాంత్ దీన్ని తయారుచేశాడు. మూడు వేల సాటిలైట్ చిత్రాలని మూడేళ్ళ పాటూ సేకరించి వాటిని డిజిటల్ గా కలిపి కుట్టాడు. మబ్బులు క్రమ్మని దృశ్యాలని మాత్రమే తీసుకున్నాడు. భూమి మీద ప్రతీ అంగుళం కనిపించేలా
భూభాగాలన్నీ కచ్చితంగా కనిపించేలా అవన్నీ కలిపి ఒక్క సారి ప్రదర్శిస్తే అదో కళాఖండం అవుతుంది.
ఇది ఎందుకు చూపిస్తునానంటే... మీకొక కథ చెప్పాలి. నాకు చదువు చెప్పిన ఇద్దరు టిచర్ల గురించి చెప్పాలి.
వాళ్లలో ఒకరంటే నాకంత ఇష్టం లేదు. రెండో వ్యక్తి నాకు ఆరాధ్య దైవం.
నాకు బళ్లో జ్యాగ్రఫీ చెప్పిన టీచరు బోర్డుకి అడ్డుగా వేలాడే ఓ పెద్ద ప్రపంచ పటం చూపిస్తూ పాఠం చెప్పేది.
ఆరోక్లాసు లో ఓ సారి నా క్లాస్ మేట్ ఒకడు చెయ్యి పైకెత్తి దక్షిణ అమెరికా తూర్పు తీర రేఖని చూపిస్తూ ఆఫ్రికా పశ్చిమ తీరంతో దాన్ని పోల్చుతూ
"ఈ రెండూ ఎప్పుడైనా కలిసి ఉండేవా?" అని అడిగాడు.
అప్పుడా టీచర్ అంది. "ఎప్పుడూ లేవు. అయినా అంత బుద్ధితక్కువ మాట నేను ఎక్కడా విన్లేదు" అంది.
ఆ కుర్రాడు తరువాత మత్తుమందుకి బానిస అయ్యాడు. జీవితంలో ఓడిపోయాడు.
ఆ టీచరు సైన్స్ అడ్వయిసర్ గా ప్రస్తుత అధికారవర్గంలో నియమించబడింది. కాని ఆ టీచర్ కేవలం ఆ రోజుల్లోవైజ్ఞానిక అధికార వర్గం యొక్క పాఠాలనే వల్లె వేసింది. ఖండాలు అంతంత పెద్దవి కనుక కదలవు అనుకుంది.
కాని అవి నిజానికి అవి కదులుతాయని మనకి తెలుసు.
(సశేషం...)



