ఈ కృషిలో [సిరీపీడ్ ల మీద గ్రంథ రచన] నేను ఎనిమిదేళ్లు గడిపినా అందులో అనారోగ్యం వల్ల రెండేళ్లు పోయాయి. ఆ విషయం నేను నా డైరీలో రాసుకున్నాను. ఆ కారణం చేత 1848 లో నేను హైడ్రోపతిక్ చికిత్స కోసం మాల్వర్న్ లో కొంత కాలం గడిపాను. ఆ చికిత్స నాకు ఎంతో ఉపశమనాన్ని ఇచ్చింది. అక్కణ్నుంచి ఇంటికి తిరిగి రాగానే మళ్లీ పని మొదలెట్టాను. ఆ రోజుల్లో నా ఆరోగ్యం ఎంత దీనంగా ఉండేదంటే 1848 లో నవంబర్ 13 నాడు నా తండ్రి చనిపోయినప్పుడు అంత్యక్రియలు జరిపించడానికి కూడా నాకు వీలుపడలేదు.
సిరీపీడ్ ల మీద నేను చేసిన కృషి గణనీయమైనదని చెప్పాలి. కొన్ని కొత్త, విశేషమైన రూపాలని కనుక్కోవడమే కాక, వివిధ జీవాలలో అంగాలలోని సారూప్యాన్ని ఎత్తి చూపాను. వివిధ అంగాలు ఒకదాన్నొకటి అతుక్కునేలా చేసే జిగురు యంత్రాంగాన్ని గుర్తించాను. అయితే ఆ జిగురు గ్రంథుల (cement glands) విషయంలో మాత్రం ఘోరంగా పొరబడ్డాను. అంతేకాక [సిరీపీడ్ లకి చెందిన] కొన్ని ఉపజాతులలో (genera) అతి చిన్న మగ జీవాలు ఉభయలింగ జీవాల (hermaphrodite) ల మీద పడి పరాన్నభుక్కులుగా (parasites) బతకడం గుర్తించాను. ఈ రెండవ ఆవిష్కరణకి సంబంధించిన ఆధారాలు తదనంతరం దొరికాయి. కాని మొదట్లో మాత్రం ఆ వృత్తాంతం అంతా కేవలం నా అభూత కల్పన అని ఓ జర్మన్ రచయిత కొట్టిపారేశాడు. సిరీపీడ్ లు గొప్ప వైవిధ్యం గల జీవ జాతి. వాటిని వర్గీకరించడం అంత సులభం కాదు. Origin of Species లో ప్రకృతి నిబద్ధ వర్గీకరణ సూత్రాలని చర్చించే ప్రయత్నంలో సిరీపీడ్ ల మీద కృషి ఎంతో ఉపకరించింది. అయితే ఆ అంశం మీద అంత కాలాన్ని వెచ్చించడం అవసరమా అని తరువాత అనిపించింది. [దీని గురించి మరింత సమాచారం కావాలంటే ఈ లింక్ చూడండి. http://darwin-online.org.uk/EditorialIntroductions/Richmond_cirripedia.html - అనువాదకుడు.]
1854 సెప్టెంబర్ నుండి నేను సృష్టించిన అపారమైన వ్రాత ప్రతులని క్రమబద్ధీకరించే ప్రయత్నంలో మునిగిపోయాను. జీవజాతుల రూపాంతరీకరణకి సంబంధించి ఎన్నో పరిశీలనలు, ప్రయోగాలు చెయ్యడంలో మునిగిపోయాను. బీగిల్ యాత్రలలో పాంపియన్ శిలా నిర్మాణాలలో (Pampaen formations) పెద్ద పెద్ద శిలాజాలని చూశాను. ప్రస్తుతం మనం చూసే ఆర్మడిలోలకి ఉండే కవచం లాంటి పైతొడుడు వుందీ శిలాజాలలో. దక్షిణ అమెరికా ఖండం మీద దక్షిణంగా ప్రయాణిస్తుంటే లక్షణాలలో పోలికలు గల జంతువులు వరుసగా ఒకదాని స్థానంలో ఒకటి క్రమబద్ధంగా రావడం నాకు విస్మయం కలిగించింది. గలపాగోస్ ద్వీపకల్పం మీద జంతువులకి, దక్షిణ అమెరికా మీద కనిపించే జంతువుల లక్షణాలకి మధ్య సాన్నిహిత్యం నాకు ఆశ్చర్యం కలిగించింది. అంతే కాక ఆ ద్వీపకల్పంలో వివిధ దీవుల మీద కనిపించే జంతువుల మధ్య కనిపించే సూక్ష్మమైన వైవిధ్యం కూడా అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే ఆ దీవులలో ఏదీ కూడా భౌగోళిక దృష్టితో చూస్తే అంత పురాతనమైనది కాదు.
ఇలాంటి వాస్తవాలు (ఇలాంటివే మరెన్నో ఇతర వాస్తవాలు) చూస్తుంటే ఒక్కటే నిర్ణయానికి రాగలం అనిపిస్తోంది. జీవజాతులు క్రమంగా పరిణతి చెందుతూ వస్తున్నాయి. మొదటినించీ కూడా ఈ విషయం నా మనసుని ఆకట్టుకుంది. ఇక్కడ మనకు మరో విషయం కూడా ప్రస్ఫుటం అవుతుంది. పరిసరాల ప్రభావం గాని, ప్రాణుల సంకల్పబలం గాని (ముఖ్యంగా మొక్కల విషయంలో) జీవకోటి దాని పరిసరాలకి అనుగుణంగా పరిణమించిన అసంఖ్యాకమైన సందర్భాలకి కారణాలు కాలేవు. చెట్టునెక్కగల వడ్రంగి పిట్ట, సులభంగా గాలి మీద సవారీ చేసేందుకు వీలుగా పింఛాలు మొలిచిన విత్తనం – మొదలైన వన్నీ అలాంటి అనుగుణ్యమైన పరిణతికి తర్కాణాలు. అలాంటి అనుగుణ్యమైన పరిణామం నాకు కనిపించిన ప్రతీ సారి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇది ఎలా జరిగిందో వివరించకుండా ఏదో బాహ్య శక్తి జీవజాతులని మలచిందని, మార్చిందని పరోక్షంగా వివరించాలని చేసే ప్రయత్నాలన్నీ నాకు అర్థరహితంగా అనిపిస్తాయి.
ఇంగ్లండ్ కి తిరిగొచ్చిన తరువాత భౌగోళిక శాస్త్రంలో లయల్ నడిచిన బాటలోనే నడవాలని బయల్దేరాను. సహజ పరిస్థితులకి చెందినవి, మనిషి పెంపకంలో పెరిగినవి అయిన జంతువులని, మొక్కలని పరిశీలించి వాటిలో కనిపించే నానా రకాల వైవిధ్యానికి సంబంధించిన వివరాలన్నీ సేకరించడం మొదలెట్టాను. ఆ విధంగా జీవజాతుల పరిణామ క్రమం మీద కొంత అవగాహన ఏర్పడుతుందని ఆశ. జులై 1837 లో నా మొట్టమొదటి నోట్సు పుస్తకాన్ని తెరిచాను. బేకన్ బోధించిన సూత్రాల అనుసారం పని చేస్తూ, ఏ విధమైన సైద్ధాంతిక పూర్వభావాలు లేకుండా భారీ ఎత్తున వాస్తవాలు సేకరిస్తూ పోయాను. ముఖ్యంగా మనిషి పెంపకంలో ఎదిగిన జీవాల గురించి ఎన్నో విషయాలు సేకరించాను. తోటమాలులతో, జంతువులని పెంచేవారితో సంభాషించాను, ఉత్తరాలు రాసి జవాబులు సేకరించాను. విస్తృతంగా చదివాను. ఈ ప్రయత్నంలో నేను చదివి సంక్షిప్త రూపంలో రాసుకున్న పుస్తకాలు, పత్రికలు అన్నీ చూస్తే నేను పడ్డ శ్రమకి నాకే ఆశ్చర్యం కలుగుతుంది. జంతువులలో, మొక్కలలో ఉన్నత జాతుల సృష్టిలోని రహస్యం ఎంపిక అన్న విషయం నాకు త్వరలోనే అర్థమయ్యింది. కాని సహజ పరిస్థితుల్లో ఎదిగే జంతువుల విషయంలో ఆ ఎంపిక ఎలా జరుగుతుంది అన్న విషయం మాత్రం నాకు ఎంతో కాలం అవగతం కాలేదు.
(ఇంకా వుంది)
లండన్లో ఉండే రోజుల్లో ఎన్నో వైజ్ఞానిక సదస్సుల సమావేశాలకి హాజరు అవుతూ ఉండేవాణ్ణి. భౌగోళిక సదస్సుకి సెక్రటరీగా కూడా పని చేశాను. కాని అనారోగ్య కారణాల వల్ల తరచు ఈ సమావేశాలకి హాజరు కావడం వీలపడలేదు. కనుక నేను, నా భార్య లండన్ వదిలి పల్లె ప్రాంతాలకి తరలిపోయాం. మళ్లీ ఎప్పుడూ అలాంటి నిర్ణయం తీసుకున్నందుకు చింతించలేదు.
సర్రీ తదితర ప్రాంతాల్లో ఇంటి కోసం చాలా గాలించాం. కాని ప్రయోజనం లేకపోయింది. చాలా గాలించిన తరువాత చివరికి ఒక ఇల్లు కనిపించింది. అది నచ్చి కొనుక్కున్నాం. అక్కడి పరిసరాల ప్రశాంతత, గ్రామీణ సంస్కృతి మాకు బాగా నచ్చింది. కాని మా ఇంటికి రావడానికి వాహనాల మీద రావడానికి వీలుపడదని కంచరగాడిద (mule) మిదెక్కి రావాలని ఆ జర్మన్ పత్రికా విలేఖరి రాసిన మాట మాత్రం వట్టి అతిశయోక్తే! ఈ కొత్త ఇల్లు మా పిల్లల రాకపోకలకి కూడా చాలా సౌకర్యంగా వుంది.
ఉద్యోగవిరమణ తరువాత ఇంత సుఖమయ జీవనం చాలా తక్కువ మందికి దొరుకుతుందేమో. అప్పుడప్పుడు బంధువుల ఇళ్ళకి వెళ్లి వస్తాం. లేదంటే సముద్ర తీరానికి వెళ్ళి ప్రశాంత ఘడియలు గడుపుతాం. ఇక్కడ దిగిన తొలి రోజుల్లో కొన్ని సార్లు మళ్ళీ సమాజంలోకి వెళ్లాలని చూశాం. ఇంటికి కూడా కొన్ని సార్లు అతిథులని ఆహ్వానించాం. కాని ఆ విందులు, సందడి మొదలైనవి నా ఆరోగ్యానికి సరిపడలేదు. వొంట్లో తీవ్రమైన వణుకు పుట్టేది, వాంతులు అయ్యేవి. ఆ తరువాత కొన్నేళ్ల వరకు ఈ విందులకి, వినోదాలకి తిలోదకాలు వొదిలేశాను. ఆ కారణం చేతనే వైజ్ఞానిక సమాజాలకి చెందిన వ్యక్తులని కూడా ఎక్కువగా కలుసుకోడానికి వీలుపడలేదు.
నా జీవితమంతా నాకు అత్యంత ప్రీతిపాత్రమైన వ్యాపకం వైజ్ఞానిక కృషి. ఒంట్లో ఏ అస్వస్థత ఉన్నా, అసౌకర్యం కలిగినా వైజ్ఞానిక పరిశోధన ఇచ్చే ఉత్సాహం వల్ల, ఉద్వేగం వల్ల అన్నీ మరచిపోతాను. కనుక నా శేష జీవితం అంతా నేను చేసిందల్లా పుస్తకాలు రాయడమే. ఆ పుస్తకాలు ఎలా ఆవిర్భవించాయో ఆ విశేషాలు మీతో కాస్త పంచుకుంటాను.
నేను రాసిన పుస్తకాలు
1844 తొలి దశాలలో బీగిల్ యాత్రలో నేను సందర్శించిన అగ్నిపర్వత దీవుల మీద నేను చేసిన పరిశీలనలన్నీ పొందుపరుస్తూ ఓ పుస్తకం రాశాను. 1845 లో ఎంతో ప్రయాస పడి నా ‘పరిశోధనా పత్రిక’ (Journal of Researches) ని సరిదిద్ది దాని కొత్త సంపుటాన్ని ప్రచురించాను. ఫిట్జ్-రాయ్ తో పాటు చేసిన కృషిలో భాగంగా తొలుత 1839 లో ప్రచురించిన మూల ప్రతికి ఇది మెరుగైన రూపం. నా ప్రప్రథమ సాహితీ సృష్టిగా ఈ పుస్తకం సాధించిన విజయాలని తలచుకుంటే సంతోషంగాను, గర్వంగాను ఉంటుంది. ఈ నాటికీ ఈ పుస్తకం ఇంగ్లండ్ లోను, అమెరికా లోను ముమ్మరంగా అమ్ముడు పోతుంది. ఇటీవలే ఈ పుస్తకం జర్మన్ భాషలో రెండో సారి అనువదించబడింది. దీన్ని ఫ్రెంచ్ తదితర భాషలలోకి కూడా అనువదించారు.
ఒక యాత్రాపుస్తకం యొక్క, అదీ వైజ్ఞానిక యాత్రా పుస్తకం యొక్క, పలుకుబడి దాని ప్రథమ ముద్రణ జరిగిన ఇన్నేళ్లకి కూడా సజీవంగా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇంగ్లండ్ లో ఈ పుస్తకం యొక్క రెండవ ముద్రణలో పదివేల ప్రతులు అమ్ముడు పోయాయట. 1846 లో నేను రాసిన ‘దక్షిణ అమెరికాలో భౌగోళిక పరిశీలనలు’ ప్రచురించబడింది. భౌగోళిక శాస్త్రం మీద నేను రాసిన మూడు పుస్తకాలకి మొత్తం నాలుగున్నర ఏళ్ల కఠోర శ్రమ అవసరం అయ్యింది. [వాటిలో ‘పగడపు దీవుల’ మీద రాసిన పుస్తకం కూడా ఉంది.] ఈ విషయం గురించి నా చిన్ని డైరీలో ఇలా రాసుకున్నాను – “ఇంగ్లండ్ కి తిరిగొచ్చి ఇప్పటికి పదేళ్లు అవుతోంది. నా అనారోగ్యం వల్ల ఎంత సమయం వృధా అయ్యిందో అనిపించింది.” ఈ మూడు పుస్తకాల గురించి పెద్దగా చెప్పడానికి ఏమీ లేదు. ఆ పుస్తకాలు ఇటీవలే మరొక్కసారి ముద్రణ వచ్చాయని మాత్రం చెప్పగలను.
అక్టోబర్ 1846 లో ‘సిరీపీడియా’ (Cirripedia) (పైన చిత్రం) మీద పని మొదలెట్టాను. చిలీ దేశపు తీరం మీద సంచరిస్తున్నప్పుడు ఓ చిత్రమైన సిరీపీడ్ (పీతని పోలిన ఓ జలజీవం) ని చూశాను. ఇవి కోంచొలేపాస్ (Concholepas) (ఆలుచిప్ప లాంటి ఓ జీవం) యొక్క గవ్వలలోకి దూరి బతుకుతాయి. అంతవరకు నేను చూసిన సిరీపీడ్ లకి వీటికి మధ్య చాల తేడా వుంది. అందుకే వీటిని వర్గీకరించడానికి ఓ ప్రత్యేక ఉపజాతిని నిర్వచించవలసి వచ్చింది. ఇటీవలి కాలంలో ఈ సిరీపీడ్ లాంటి జీవజాతే ఒకటి పోర్చుగల్ దేశపు తీరం మీద కనిపించిందట. నేను కొత్తగా కనుక్కున్న జీవం యొక్క అంతరంగ నిర్మాణాన్ని అర్థం చేసుకోడానికి ఈ జీవం యొక్క ఎన్నో సామాన్య రూపాలని తెచ్చి పరిచ్ఛేదించి చూశాను. ఆ విధంగా క్రమంగా ఈ జీవజాతుల మొత్తం కుటుంబాన్ని పరిశోధించడానికి వీలయ్యింది. అప్పట్నుంచి ఓ ఎనిమిదేళ్ళు ఈ సమస్య మీదే ఎడతెగకుండా పని చేశాను. చివరికి ఆ పరిశోధనల ఆధారంగా రెండు పెద్ద పుస్తకాలు ప్రచురించాను. వాటిలో ఈ జీవజాతికి చెందిన సజీవ రూపాలన్నిటినీ వర్ణించాను. వాటిలో వినష్ట రూపాలని కాస్త చిన్న పుస్తకాలుగా కూడా ప్రచురించాను. సర్ ఇ. లిటన్ బుల్వర్ రాసిన ఓ నవలలో ప్రొఫెసర్ లాంగ్ అనే పాత్రని పరిచయం చేస్తాడు. ఈ ప్రొఫెసరు limpet (నత్త లాంటి ఓ జంతువు) మీద రెండు భారీ పుస్తకాలు రాస్తాడు. అది చదివినప్పుడు రచయిత నన్ను చూసి ఆ పాత్రని సృష్టించాడా అనిపించింది.
(సిరీపీడియా చిత్రం - http://en.wikipedia.org/wiki/Barnacle)
(ఇంక వుంది)
మకాలే జ్ఞాపకశక్తి ఎంత కచ్చితంగా, ఎంత సంపూర్ణంగా ఉంటుందో ఋజువు చెయ్యడానికి లార్డ్ స్టాన్ హోప్ ఒక వృత్తాంతం చెప్పారు. లార్డ్ స్టాన్ హోప్ ఇంట్లో ఎంతో మంది చారిత్రకులు సమావేశం అవుతుండేవారు. కొన్ని కొన్ని అంశాలు చర్చిస్తూ కొన్ని సందర్భాలలో మకాలే తో విభేదించేవారు. సందేహం వచ్చినప్పుడు ఎవరిది నిజమే తేల్చుకోడానికి పుస్తకాలు తిరగేసేవారు. కాని లార్డ్ స్టాన్ హోప్ గమనించింది ఏంటంటే క్రమంగా ఆ పద్ధతి మారిపోయింది. చారిత్రకులు పుస్తకాలు చూడడం అనవసరం అని అర్థం చేసుకున్నారు. ఎందుకంటే మకాలే చెప్పిందే ప్రతీ సారి నిజమయ్యింది.
మరో సారి కూడా లార్డ్ స్టాన్ హోప్ ఇంట్లో జరిగిన ఓ సమావేశానికి వెళ్లాను. ఎంతో మంది చారిత్రకులు, సాహితీకారులు వచ్చారు. అక్కడే మోట్లీ (Motley)ని, గ్రోట్ (Grote) ని కలుసుకున్నాను. భోజనం తరువాత చీవెనింగ్ పార్క్ లో మోట్లీ తో పాటు ఓ గంట సేపు షికారుకి వెళ్లాను. ఆయన నిరాడంబరత, కల్ల కపటం లేని ప్రవర్తన నాకు బాగా నచ్చాయి.
చాలా కాలం క్రితం చారిత్రకుడు ‘ఎర్ల్’ యొక్క తండ్రితో కలిసి భోజనం చేశాను. ఆయన ఓ విచిత్రమైన మనిషి. కాని బాగా నచ్చాడు. ముక్కుకు సూటిగా, స్నేహపూర్వకంగా మాట్లాడే స్వభావం ఆయనది. చామన ఛాయగా ఉంటాడు. ప్రస్ఫుటమైన ముఖ కవళికలు ఉంటాయి. నేను చూసిన రోజు గోధుమ రంగు బట్టలు వేసుకున్నాడు. ఇతరులకి నమ్మశక్యం కాని విషయాలని కూడా అమాయకంగా నమ్మే మనిషి. ఓ రోజు నాతో అన్నాడు – “ఇదుగో చూడు, నువ్వు ఈ భౌగోళిక శాస్త్రం, జంతు శాస్త్రం మొదలైన పనికిమాలిన కాలయాపన అంతా పక్కన పెట్టి తంత్రవిద్య లోకి దిగరాదూ?” ఆ పక్కనే వున్న లార్డ్ మహోన్ ఆ మాటలు విని అదిరిపోయాడు. సౌందర్యరాశి అయిన ఆయన సతీమణికి కూడా ఆ మాటలు వినోదం కలిగించినట్టు ఉన్నాయి.
ఇక చివరగా కార్లైల్ (Carlyle, పై చిత్రం) గురించి చెప్తాను. మా తమ్ముడి ఇంట్లో ఎన్నో సార్లు ఈయన్ని కలుసుకున్నాను. రెండు, మూడు సార్లు ఆయన మా ఇంటికి కూడా వచ్చారు. ఆయన మాటల్లో మంచి పదును ఉంటుంది, ఆసక్తికరంగా ఉంటాయి. కాని ఆయన రచనలలో లాగానే ఒకే అంశం మీద ఆగకుండా మాట్లాడుతూనే ఉంటాడు. మా తమ్ముడి ఇంట్లో ఓసారి ఓ తమాషా విందు జరిగింది. ఆ విందుకి చాలా మంది ప్రముఖులు వచ్చారు. వారిలో బాబేజ్, లయల్ లు కూడా వున్నారు. ఇద్దరికీ మాట్లాడడం అంటే ఇష్టమే. కాని కార్లైల్ మాత్రం నిశ్శబ్దం వల్ల జరిగే మేలు గురించి ఏకధాటిగా మాట్లాడుతూ మరెవ్వరికీ మాట్లాడే అవకాశం లేకుండా చేశాడు. భోజనం తరువాత బాబేజ్ (మనసులోనే తిట్టుకుంటూ) నిశ్శబ్దం మీద అంత పెద్ద ఉపన్యాసం ఇచ్చినందుకు కార్లైల్ కి సభాముఖంగా కృతజ్ఞతలు తెలిపాడు.
కార్లైల్ అందరినీ చిన్నచూపు చూసేవాడు. ఓసారి మా ఇంటికి వచ్చినప్పుడు ఆయన గ్రోట్ రాసిన “చరిత్ర” గురించి మాట్లాడుతూ అది “ ‘కుళ్ళిన మురికి గుంట, అందులో అధ్యాత్మిక సారం అనేది లేనే లేదు” అన్నాడు. ఆయన రాసిన ‘జ్ఞాపకాలు’ (reminiscences) పుస్తకం అచ్చయిన దాక ఆయన పరిహాసం అంతా విందుల్లో వినోదం కలిగించే సాధనాలు అనుకున్నానే గాని, ఇప్పుడు నాకు సందేహం కలుగుతోంది. ఆయన ఔదార్యం నిజమే అయినా దాని మీద నల్లని అసూయ చారలు ఉన్నట్టు అనిపిస్తుంది. మనుషుల స్వభావాలని సునిశితంగా, సజీవంగా చిత్రించే ఆయన అసమాన శక్తి మాకలే ప్రతిభ కన్నా గొప్పదని ఎవరూ సందేహించలేరు. కాని ఆ చిత్రాలు సత్యమైనవా కావా అన్నదే ఇక్కడ ప్రశ్న.
కాని మనుషుల మనసుల్లో కొన్ని మౌలిక నైతిక సత్యాలు ముద్రపడేలా చెయ్యడంలో ఆయన శక్తి అమోఘం. కాని అదే విధంగా బానిసత్వం మీద ఆయన అభిప్రాయాలు వింటే అసహ్యం కలుగుతుంది. ఆయన దృష్టిలో బలవంతుడు చేసిందే సరైనది. ఆయన తృణీకరించిన వైజ్ఞానిక విభాగాలని పక్కన పెట్టినా కూడా, ఆయనది సంకుచిత మనస్తత్వం అని చెప్పొచ్చు. అలాంటి వాణ్ణి పట్టుకుని శాస్త్రపురోగతి సాధించడానికి తగ్గ అర్హత గల వాడని కింగ్ స్లీ (Kingsley) పొగడడం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. వెవెల్ (Whewell) లాంటి గణితవేత్త కాంతి మీద గోథే (Goethe) వ్యక్తం చేసిన భావాలని వెలకట్టగలడు అంటే వెక్కిరింతగా నవ్వాడాయన. హిమానీనదాలు (glaciers) అసలు కదులుతాయా లేదా, కదిలితే వేగంగా కదులుతాయా, నెమ్మదిగా కదులుతాయా మొదలైనవన్నీ పనికిమాలిన తాపత్రయాలని హేళన చేసేవాడు. వైజ్ఞానిక పరిశోధనకి ఇంతగా అనర్హమైన మనసు గల మనిషిని ఇంతవరకు నేను ఎక్కడా చూళ్లేదు.
(ఇంకా వుంది)
అతడిలో ఎంతో ఔదార్యం లేకపోలేదు. బాగా వయసు పైబడ్డాక, ఆరోగ్యం బాగా క్షీణించాక, ఇక ఏ పనీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు కూడా రోజూ ఓ ముసలి పనివాడి ఇంటికి వెళ్లి తనకి ఏదో ఒక పుస్తకం చదివి వినిపించేవాడట. (ఆ పనివాడికి ఆర్థిక సహాయం కూడా చేసేవాడు.) ఇలాంటి ఔదార్యం ముందు ఆయనలో ఏదైనా వైజ్ఞానిక ప్రలోభం గాని, అసూయ గాని ఉన్నా పెద్దగా కనిపించవు.
మరి కొందరు ప్రముఖులతో కూడా పరిచయం ఉండేది. వారిని కొన్ని సందర్భాలలో కలుసుకున్నాను. అయితే వారి గురించి అంతగా చెప్పవలసింది ఏమీ లేదు. సర్ జాన్ హెర్షెల్ అంటే నాకు అపారమైన గౌరవం ఉండేది. ఒకసారి కేప్ ఆఫ్ గుడ్ హోప్ లో ఆయన ఇంటికి భోజనానికి వెళ్ళాను. తరువాత లండన్ లో కూడా ఓ సారి ఆయన ఇంటికి వెళ్లాను. మరి కొన్ని సందర్భాలలో కూడా ఆయన్ని కలుసుకోవడం జరిగింది. పెద్దగా మాట్లాడేవారు కాదు గాని ఆయన మాట్లాడే ప్రతీ మాట ఎంతో అర్థవంతంగా ఉంటుంది.
ఒకసారి సర్ ముర్చిసన్ ఇంటికి ఉదయానే ఫలహారానికి వెళ్లాను. హంబోల్ట్ నన్ను చూడగోరుతున్నాడంటే వెళ్ళాను. హంబోల్ట్ అంతటి వాడు నన్ను చూడాలని అనుకోవడం నాకు గొప్ప మన్ననలా అనిపించింది. కాని తీరా ఆయన్ని కలుసుకున్నాక కొంచెం నిరాశ చెందాననే చెప్పాలి. బహుశ ఆయన గురించి నేను చాలా గొప్పగా ఊహించుకున్నానేమో. మా సంభాషణలో నాకు ప్రత్యేకించి ఏమీ గుర్తు లేదు. ఆయన చాలా హుషారుగా, చాలా సేపు మాట్లాడడం మాత్రం గుర్తుంది.
ఇలా అంటే నాకు మరో విషయం గుర్తొస్తోంది. హెన్స్లే వెడ్జ్ వుడ్ ఇంట్లో ఒకసారి బకుల్ (Buckle) ని కలుసుకున్నాను.
ఇతగాడు విషయసేకరణ కోసం ఓ ప్రత్యేక పద్ధతి కనిపెట్టాడు. తను చదివిన పుస్తకాలనీ కొనుక్కుంటాడు. ఏవైనా ఆసక్తికర మైన విషయలు చదివితే అవన్నీ ఓ విషయసూచిక రూపంలో వేరేగా రాసుకుంటాడు. ఏ పుస్తకంలో ఎక్కడ ఏ విషయం వుందో ఆ విషయసూచిక చెప్తుంది. అతడికి అద్భుతమైన జ్ఞాపక శక్తి వుంది. తను చదివిన విషయాలు ఏ పుస్తకంలో, ఎక్కడ ఉంటాయో అన్నీ గుర్తుంటాయి. ఈ పద్ధతి వల్ల ఎలాంటి అంశం మీదనైనా అద్భుతమైన సంఖ్యలో పరిచయ గ్రంథాలని పేర్కొనగలిగేవాడు. ఆయన రాసిన ‘మానవ నాగరికతా చరిత్ర’ అన్న పుస్తకంలో ఇలాంటి పరిచయ గ్రంథాలు ఎన్నో పేర్కొనబడ్డాయి. ఈ పుస్తకం అత్యంత ఆసక్తికరంగా అనిపించి రెండు సార్లు చదివాను. అయితే ఆ పుస్తకంలో అతడు చేసిన ప్రతిపాదనలకి ఎంత విలువ ఉందో నాకు సందేహమే. బకుల్ మంచి మాటకారి. అతడు చెప్పిందంతా నోరు మెదపకుండా విన్నాను. అయినా అసలు నాకు నోరు విప్పే అవకాశం ఇస్తేగా? ఇంతలో శ్రీమతి ఫారర్ గానం మొదలుపెట్టింది. అది వినాలని నేను అక్కణ్ణుంచి వెళ్లిపోయాను. అప్పుడు బకుల్ పక్కకి తిరిగి ఓ మిత్రుడితో అన్నాట్ట – “డార్విన్ సంభాషణల కన్నా అతడి పుస్తకాలే బావుంటాయ్!”
(ఇంకా వుంది)
లండన్ లో ఉండే తొలి రోజుల్లో సమాజంలోకి వెళ్ళడానికి కావలసినంత ఓపిక ఉండేది. ఆ రోజుల్లో ఎంతో మంది వైజ్ఞానిక మహామహులని కలుసుకున్నాను. ఇతర రంగాలలో కూడా ఎంతో ఎత్తుకు వెళ్ళినవారిని కూడా కలుసుకున్నాను. వారి గురించి నా అభిప్రాయాలని మరో సందర్భంలో వివరిస్తాను.
నా వివాహానికి ముందు తరువాత కూడా లయల్ ని ఎక్కువగా కలుసుకునేవాణ్ణి. ఆయనకి గొప్ప మానసిక స్పష్టత ఉంది. ఏ విషయంతోనైనా తలపడేటప్పుడు తొందరపడకుండా, జాగ్రత్తగా వ్యవహరిస్తారు. సత్యాపనం చేసేటప్పుడు చాలా కచ్చితంగా ఉంటుంది. ఆయన చింతనలో ఎంతో స్వచ్ఛందత కూడా ఉంది. భౌగోళిక శాస్త్రంలో నేను ఏదైనా చిన్న మాట అంటే దాని నిజానిజాలు పూర్తిగా తేల్చేదాకా ఊరుకునే వారు కాదు. అలాంటి విశ్లేషణతో కొన్ని సార్లు ఆ విషయాన్ని నాకు మునుపు అర్థమైనదాని కన్నా మరింత స్పష్టంగా అర్థమయ్యేలా చేస్తారు. నా ప్రతిపాదనకి సవాలక్ష అభ్యంతరాలు లేవదీససేవారు. వాటన్నిటికీ సమాధానాలు చెప్పాక కూడా నా మొదటి ప్రతిపాదన ఇంకా అగమ్యగోచరంగా కనిపించేది. అతడిలో మరో గొప్ప లక్షణం వైజ్ఞానిక రంగంలో తన తోటి నిపుణుల సృజన పట్ల సద్భావన కలిగి ఉండడం.
బీగిల్ యాత్ర నుండి తిరిగి వచ్చాక ఓ సారి ఆయనతో పగడపు దీవుల మీద నా అభిప్రాయాల గురించి చెప్పాను. ఈ అంశంలో నా అభిప్రాయాలకి ఆయన అభిప్రాయాలకి మధ్య చుక్కెదురు అన్న విషయం నాకు తెలుసు. అయినా కూడా నా మాటల మీద ఆయన చూపించిన ఆసక్తి చూసి ఆశ్చర్యం వేసింది, ప్రోత్సాహకరంగా అనిపించింది. వైజ్ఞానిక విషయాలంటే ఆయనకి గాఢమైన అపేక్ష. అంతేకాక మానవజాతి యొక్క ప్రగతి పట్ల లోతైన ఆకాంక్ష ఉండేది. ఆయనది చాలా మృదుల స్వభావం. మతపరమైన భావాలలో ఆయనది చాలా విశాలమైన దృక్పథం. అవతలి వారి భావాలకి పూర్తి స్వేచ్ఛనిచ్చేవారు. కాని వ్యక్తిగతంగా మాత్రం ఆయన అస్తికులే. ఆయన ఆలోచనలలో, దృక్పథాలలో ఎంతో నిజాయితీ ఉండేది. అందుకేనేమే మనిషి పూర్వ జీవుల నుండి పరిణామం చేత అవతరించాడు అన్న భావన (Theory of Descent) ని తదనంతరం ఒప్పుకున్నారు. లామార్క్ సిద్ధాంతాలకి వ్యతిరేకంగా మాట్లాడడం వల్ల ఆయన కీర్తి ప్రతిష్ఠలు మరింత పెరిగాయి. పైగా ఇవన్నీ ఆయన వయసు పైబడ్డ తరువాత చెయ్యడం ఆశ్చర్యం. ఎన్నో ఏళ్ల క్రితం నేను ఓ సారి పాతకాలపు భౌగోళిక శాస్త్రవేత్తలు కొత్త భావాలని వ్యతిరేకించే విధానం చూసి విసిగిపోయి ఆయనతో ఇలా అన్నానట – “ప్రతీ శాస్త్రవేత్త కచ్చితంగా అరవై ఏళ్లు నిండగానే చచ్చిపోతే ఎంత బావుంటుంది! ఎందుకంటే ఆ తరువాత ఎలాగూ వాళ్లు కొత్త సిద్ధాంతాలని వ్యతిరేకిస్తూనే ఉంటారు.” నేను అలా అన్న సంగతి లయల్ నాకు ఓ సారి గుర్తు చేశారు. కాని (కొత్త భావాలని వ్యతిరేకించే అలవాటు లేని) ఆయన మాత్రం కొంత కాలం బతకితే బావుంటుందనే అనుకునేవారు.
భౌగోళిక శాస్త్రం మరే ఇతర శాస్త్రవేత్త కన్నా లయల్ కి ఎంతో ఋణపడి వుంది. బీగిల్ యాత్ర మీద నేను బయలుదేరబోయే ముందు అపార ప్రతిభాశాలి అయిన హెన్స్లో నన్ను పిలిచి ఓ సలహా ఇచ్చాడు. అప్పుడే అచ్చయిన చార్ల్స్ లయల్ రాసిన ‘భౌగోళిక శాస్త్రంలో మూల సూత్రాలు’ (Principles of Geology) అనే పుస్తకంలో మొదటి భాగం చదవమన్నాడు. కాని ఎందరో ఇతర భౌగోళిక శాస్త్రవేత్తల లాగానే ‘ఉపద్రవాల పరంపర’ (series of cataclysms) సిద్ధాంతాన్ని నమ్మిన హెన్స్లో ఆ పుస్తకంలోని భావాలని నన్ను నమ్మొద్దు అన్నాడు. కాని ప్రస్తుతం ‘భౌగోళిక శాస్త్రంలో మూల సూత్రాలు’ పుస్తకం గురించి అందరూ ఎంత గొప్పగా మాట్లాడుతున్నారో! నేను సందర్శించిన మొట్టమొదటి ప్రదేశం, సెయింట్ జాగో (ఇది కేప్ ద వర్దీ ద్వీపమాలికలో ఓ ద్వీపం) లో నేను చేసిన భౌగోళిక పరిశోధనల నాకు కచ్చితంగా ఓ విషయం మాత్రం తెలిసింది. తక్కిన ఏ ఇతర భౌగోళిక శాస్త్రవేత్త భావాల కన్నా లయల్ సిద్ధాంతాలు ఎంతో ఉన్నతమైనవి అని బలమైన నమ్మకం కలిగింది.
లయల్ రచనల యొక్క ప్రభావం ఫ్రాన్స్ లోను, ఇంగ్లండ్ లోను విజ్ఞానం పురోగమించిన తీరులోని తేడా బట్టి తెలుస్తుంది. (ఫ్రాన్స్ కి చెందిన) ఎలీ ద బోమోంత్ యొక్క భావాలు ఇప్పుడు మూలన పడ్డాయంటే ఆ ఘనత అంతే లయల్ కే చెందుతుంది. ఈ ఎలీ ద బోమోంత్ కొన్ని ‘ఎత్తైన బిలాలు’ (Craters of Elevation) అని, ‘రేఖాకారంలో ఉన్న ఎత్తైన ప్రాంతాలు’ (Lines of Elevation) అని ఏవేవో విపరీతమైన ప్రతిపాదనలు చేశాడు. (ఆ భావాలని ఓ సారి భౌగోళిక సదస్సులో సెడ్జ్ విక్ ఆకాశానికి ఎత్తేయడం కూడా గుర్తుంది.) లయల్ ప్రభావం వల్ల అవన్నీ ఇప్పుడు మట్టిగొట్టుకుపోయాయి.
(ఇంకా వుంది)
“జనవరి 29, 1839 లో వివాహం, గోవర్ వీధిలో నివాసం” దగ్గర్నుండి “సెప్టెంబర్ 14, 1842 లో లండన్ విడిచి డౌన్ నగరంలో స్థిరపడడం” వరకు
(సుఖసంతోషాలతో కూడిన తన వైవాహిక జీవనం గురించి, పిల్లల గురించి కొంత ముచ్చటించిన తరువాత డార్విన్ ఇలా అంటాడు - )
లండన్ లో జీవించిన మూడేళ్ల ఎనిమిది నెలల కాలంలో పెద్దగా వైజ్ఞానిక విషయాల జోలికి పోలేదు. అయితే ఎప్పటిలాగానే కష్టపడి పనిచేసేవాణ్ణి. దీనికి కారణం ఆ దశలో తరచు ఆరోగ్యం దెబ్బ తినడమే. ఒక సారి దీర్ఘకాలం మంచాన పడ్డాను. ఓపిక ఉన్న సమయాలలో ‘పగడపు దీవులు’ మీద నేను తలపెట్టిన పుస్తకం మీద పని చేస్తూ ఉండేవాణ్ణి. పెళ్ళికి ముందు ఆరంభించిన ఈ పుస్తక రచన మే 6, 1842 నాటికి పూర్తయ్యింది. పుస్తకం చిన్నదే గాని దీన్ని పూర్తి చెయ్యడానికి ఇరవై నెలల కఠోర శ్రమ అవసరం అయ్యింది. ఈ పుస్తక రచన కోసం పసిఫిక్ దీవుల మీద ఉన్న ప్రతీ పుస్తకాన్ని చదవవలసి వచ్చింది. పైగా ఎన్నో మ్యాపులని కూడా సంప్రదించవలసి వచ్చింది. అందుకే రాయడానికి అంత కాలం పట్టింది. వైజ్ఞానిక సమాజాల నుండి ఆ పుస్తకం ఎన్నో మన్ననలు అందుకుంది. అందులో ప్రతిపాదించబడ్డ సిద్ధాంతం ఇప్పుడు లోకసమ్మతం అయ్యిందని అనుకుంటాను.
నేను రాసిన కృతులలో ఇంతగా తార్కిక అనుమానాత్మక (deductive) పద్ధతిలో రాసిన కృతి మరొకటి లేదేమో. దక్షిణ అమెరికా పశ్చిమ తీరం మీద ఉన్న కాలంలో ఈ సిద్ధాంతం మొత్తాన్ని ఊహించాను. అప్పటికి ఇంకా ప్రత్యక్షంగా కొరల్ దీవులని ఎప్పుడూ చూడలేదు. తదనంతరం వాస్తవ దీవులని క్షుణ్ణంగా పరిశీలించి నా అభిప్రాయాలు సరైనవో కాదో నిర్ధారించవలసి వచ్చింది. ఇక్కడ ఒక విషయాన్ని పేర్కొనాలి. అప్పటికి రెండేళ్ళుగా దక్షిణ అమెరికా తీరానికి చెందిన కొన్ని విశేషాల గురించి అధ్యయనాలు చేస్తూ వచ్చాను. తీరరేఖ మీద అక్కడక్కడ ఉద్ధతి (elevation) కనిపిస్తుంది. అలాగే వికోషీకరణ (తరుగుదల, denudation) కనిపిస్తుంది, అవక్షేపాల (sediments) ఏర్పాటు కనిపిస్తుంది. ఇవన్నీ చూశాక అవక్షేపాలు పదే పదే ఏర్పడడం వల్ల నేల ఎలా పైకి లేస్తుందో మనసులో ఊహించుకోసాగాను. ఆ విధంగా అవరోధక పగడపు దీవుల (barrier reefs) యొక్క, atoll (మధ్యలో నీరు చుట్టూ సన్నని గట్టు కల పగడపు దీవి) యొక్క ఆవిర్భావాన్ని వర్ణించే సిద్ధాంతం నాలో ఊపిరి పోసుకుంది.
పసిఫిక్ మహాసముద్రంలో అటాఫూ ఎటాల్ (వికీ)
పగడపు దీవుల మీద అధ్యయనాలు కాకుండా, లండన్ లో జీవించిన రోజుల్లో మరి కొన్ని అంశాల మీద కూడా భౌగోళిక సదస్సు ముందు పరిశోధనా పత్రాలు చదివాను. వాటిలో మచ్చుకి – దక్షిణ అమెరికా కి చెందిన అనియత మహాశిలలు (erratic boulders) గురించి, భూకంపాలు, వానపాముల చర్యల చేత వదులు మట్టి ఏర్పాటు, మొదలైనవి.
‘బీగిల్ యాత్రలో బయటపడ్డ జంతుశాస్త్ర విశేషాలు’ అన్న గ్రంథ రచన యొక్క పర్యవేక్షణ కూడా కొనసాగించాను. ఇవన్నీ ఒక పక్క ఇలా సాగుతుండగా ‘జీవజాతుల ఆవిర్భావం’ (origin of the species) కి కావలసిన విషయసేకరణ మాత్రం ఎప్పుడూ ఆపలేదు. అనారోగ్యం వల్ల మరి ఇంకేమీ చెయ్యలేని పరిస్థితిలో ఈ పనికి పూనుకునేవాణ్ణి.
1842 వేసవిలో ఆరోగ్యం కాస్త కుదుట పడింది. ఉత్తర వేల్స్ ప్రాంతంలో కొద్దిగా పర్యటించాను. ఆ ప్రాంతానికి చెందిన పెద్ద లోయలని ఒకప్పుడు నింపిన పాత హిమానీ నదాల యొక్క పర్యవసానాలని పరిశీలించడం ఆ యాత్ర యొక్క లక్ష్యం. నా పరిశీలనలని సంక్షిప్త రూపంలో ఫిలసాఫికల్ మాగజైన్ (’Philosophical Magazine,’ 1842) లో ప్రచురించాను. ఈ యాత్ర నాకెంతో ఉత్సాహకరంగా అనిపించింది. కొండలెక్కడానికి, ఎంతో దూరాలు నడవడానికి కావలసిన ఓపిక ఉండడం అదే ఆఖరు సారి అనుకుంటా. భౌగోళిక పరిశోధనలో అలాంటి ప్రయాస అవసరం మరి.
(ఇంకా వుంది)
గత రెండేళ్ల మూడు నెలల కాలం నా జీవితం అత్యంత ప్రయాసతో కూడుకున్న దశ అని చెప్పగలను. ఆ దశలో అస్వస్థత వల్ల కొంత సమయాన్ని పోగొట్టుకున్నాను. ష్రూస్ బరీ, మాయర్, కేంబ్రిడ్జ్, లండన్ నగరాలలో కొంత కాలం మారి మారి జీవించాక చివరికి డిసెంబర్ 13 నాడు లండన్ లో స్థిరపడ్డాను. నేను సేకరించిన సామగ్రి అంతా అక్కడ హెన్స్లో రక్షణలో భద్రంగా వుంది. అక్కడ మూడు నెలలు మకాం పెట్టాను. నేను సేకరించిన రాళ్లని, ఖనిజాలని ప్రొ. మిల్లర్ చేత పరీక్ష చేయించాను.
నా యాత్రా పత్రికకి మెరుగులు దిద్దే ప్రయత్నం మొదలెట్టాను. ఇదంత పెద్ద సమస్య కాలేదు. ఎందుకంటే మూల ప్రతి ఎంతో శ్రధ్ధగా రాయబడింది. నేను చేయవలసింది అల్లా నా వైజ్ఞానిక ఆవిష్కరణలలో ఆసక్తికరమైన అంశాలని మరింత సంక్షిప్తరూపంలో ప్రకటించడమే. చిలీ దేశపు తీర రేఖ యొక్క ఉన్నతి గురించి నేను చేసిన పరిశీలనలకి సంబంధించిన, లయల్ సూచన ప్రకారం, భౌగోళిక సంఘానికి పంపాను. ఆ విశేషాలు Proceedings of Geological Society పత్రికలో (పేజీలు 446-449) 1838 లో అచ్చయ్యాయి.
1837 లో మార్చి 7 నాడు నేను లండన్ లో గ్రేట్ మార్ల్ బరో వీధికి మకాం మార్చాను. అక్కడే రెండేళ్లు, అంటే నా వివాహం అయినంత వరకు నివసించాను. ఈ రెండేళ్లలో నా యాత్రా పత్రిక పూర్తి చేశాను. భౌగోళిక సదస్సులో ఎన్నో సిద్ధాంత వ్యాసాలు చదివాను. ‘Geological Observations’ అనే పత్రికకి పంపడానికి ఓ సువిస్తారమైన వ్యాసాన్ని కూడా సిద్ధం చేశాను. బీగిల్ యాత్రలో కనుగొనబడ్డ జంతు శాస్త్ర విశేషాలు అన్న పుస్తకాన్ని ప్రచురణ కోసం సిద్ధం చేశాను. హులై 1 నాడు Origin of the Species అన్న గ్రంథ రచనకి పూనుకుని ఆ సందర్భంలో నా మొట్టమొదటి నోట్ బుక్ ని తెరిచాను. ఈ పుస్తక రచన గురించి ఎంతో కాలంగా ఆలోచిస్తున్నాను. మరో ఇరవై ఏళ్ల పాటు ఆ పుస్తక రచన సాగింది.
ఈ రెండేళ్లలో నేను కొంచెం సామాజిక కార్యక్రమాలలో కూడా పాల్గొనడం మొదలెట్టాను. ఆ కాలంలోనే చార్లెస్ లయల్ ని పలుమార్లు కలుసుకున్నాను. ఈయనలో ఓ మంచి లక్షణం ఇతరలు భావాల పట్ల ఇతడు కనబరిచే సద్భావన. నేను ఇంగ్లండ్ కి తిరిగొచ్చాక పగడపు దీవుల గురించి నా అభిప్రాయం గురించి ఆయనకి వివరించినప్పుడు ఆయన చూపించిన ఆసక్తి చూసి నాకు ఆశ్చర్యం తో పాటు ఎంతో సంతోషం కలిగింది. ఆయన మాటలు ఎంతో ప్రోత్సాహకరంగా అనిపించాయి. నా మీద ఎంతో ప్రభావం చూపించాయి. ఈ కాలంలోనే రాబర్ట్ బ్రౌన్ ని కూడా ఎన్నో సార్లు కలుసుకున్నాను. ఎన్నోసార్లు ఆదివారాలు ఉదయానే ఆయన ఇంటికి కాఫీకి అని వెళ్లేవాణ్ణి. ఆ సంభాషణలలో ఆయన పంచుకునే వైజ్ఞానిక అనుభవాల, నిశిత శాస్త్ర భావాల, పరిశీలనల విందుని ఆత్రంగా ఆరగించేవాణ్ణి. అయితే ఆయన మాటలు ఎప్పుడూ వైజ్ఞానిక సూక్ష్మాలకి సంబంధించినవై వుండేవి. ప్రగాఢ మైన మౌలికమైన విజ్ఞానిక సమస్యల మీద ఆయనెప్పుడూ వ్యాఖ్యానించేవాడు కాదు.
ఈ కాలంలోనే ఎన్నో సార్లు విశ్రాంతి కోసమని ఇరుగు పొరుగు ప్రాంతాలకి చిన్న చిన్న విహార యాత్రలు చేశాను. ఆ యాత్రలలో కాస్త సుదూరమైనది ‘Parallel roads of Glen Roy’ అనే ప్రాంతానికి (కింద చిత్రం) చేసిన యాత్ర. ఆ వివరాలన్నీ Philosophical Transactions అనే పత్రికలో ప్రచురించాను (1839, pages 39-82). అయితే ఈ పత్రం అంత గొప్పగా లేదని చెప్పడానికి సిగ్గు పడుతున్నాను. దక్షిణ అమెరికాలో తీర రేఖ యొక్క ఉన్నతి గురించి నేను చేసిన పరిశీలనల ప్రభావం నా మీద బలంగా వుంది. కాని ఈ సమస్య గురించి తదనంతరం అగాస్సీస్ తన ‘హిమానీనదం-సరస్సు’ సిద్ధాంతాన్ని (glacier-lake theory) ప్రతిపాదించాడు. ఆ దశలో నాకు తెలిసినంత వరకు మరో సిద్ధాంతం నిజం కావడానికి వీలు లేకపోయింది. కనుక సముద్రం యొక్క చర్య వల్ల ఆ ప్రాంతం అలా రూపుదేలింది అని నేను సిద్ధాంతీకరించాను. ఈ పొరబాటు నాకు ఓ మంచి పాఠం నేర్పింది. వైజ్ఞానిక రంగంలో ఎప్పుడూ ‘మినహాయింపు సిద్ధాంతం’ ని (మరో కారణం ఉండడానికి వీలు లేదు కనుక ఇదే సరైన కారణం కావాలి అనే వాదనా వైఖరి) నమ్మకూడదని అర్థమయ్యింది.
రోజంతా పరిశోధనలో మునిగి పనిచెయ్యడం కష్టం కనుక ఈ దశలో ఎన్నో రంగాలకి సంబంధించిన పుస్తకాలు చదివాను. కొన్ని తాత్విక గ్రంథాలు కూడా చదివాను. కాని అలాంటి పుస్తకాలు నాకు సరిపడవని అర్థమయ్యింది. ఈ దశలోనే వర్డ్స్ వర్త్, కోలెరిడ్జ్ కవుల కవిత్వం అంటే అపేక్ష పెరిగింది. ఆ కాలంలోనే (వర్డ్స్ వర్త్ రాసిన) ‘Excursion’ అనే కావ్యాన్ని సాంతం రెండు సార్లు చదివాను. అంతకు ముందు మిల్టన్ రాసిన ‘Paradise Lost’ కావ్యం నాకు అత్యంత ప్రియమైన కావ్యంగా ఉండేది. బీగిల్ యాత్రలో నేను ఒకే పుస్తకాన్ని తీసుకెళ్లడానికి వీలైనప్పుడు ఎప్పుడూ ఆ పుస్తకాన్నే తీసుకెళ్ళేవాణ్ణి.
(ఇంకా వుంది)
నా యాత్రానుభవాన్ని ఓ సారి సింహావలోకనం చేసుకుంటే సైన్స్ పట్ల నా ప్రేమ తక్కిన అన్ని అపేక్షలని క్రమంగా మించిపోయింది అనే చెప్పుకోవాలి. మొదటి రెండేళ్లు నేనే స్వయంగా తుపాకీతో వేటాడి నానా రకాల పక్షులని, జంతువులని వేటాడి నా అధ్యయనాల కోసం సేకరించాను. కాని పోగా పోగా ఆ భాద్యతని నా అనుచరుడికి అప్పజెప్పాను. ఎందుకంటే వేట నా పనికి అడ్డుతగులుతోంది అనిపించింది. ముఖ్యంగా నేను సందర్శించే ప్రాంతపు భౌగోళిక పరిసరాలని పరిశీలించే ప్రయత్నానికి ఇది అడ్డుతగులుతోంది. వేటలోని ఉత్సాహం, ఉద్వేగాల కన్నా పరిశీలనలోను, తర్కించడం లోను ఉన్న ఆనందం, ఆహ్లాదం మరింత గొప్పవి అనిపించింది. ఈ యాత్ర వల్ల నా మస్తత్వం చాలా మారింది అన్న విషయం, యాత్ర తరువాత మా నాన్నగారు నన్ను చూసినప్పుడు అన్న మాటలతో తేటతెల్లం అవుతోంది. మా నాన్నగారిది నిశిత దృష్టి. ఏదీ సులభంగా ఒప్పుకోరు. పైగా శిరోశాస్త్రం (phrenology) మీద నమ్మకం లేదాయనకి. యాత్ర నుండి తిరిగొచ్చిన నన్ను మొట్టమొదట చూడగానే మా అక్కల కేసి చూసి ఇలా అన్నారు – “అరె! వీడి శిరస్సు ఆకారం బాగా మారిందే!”
తిరిగి యాత్ర కథకి వస్తాను. సెప్టెంబర్ 11 (1831) లో ఒకసారి ఫిట్జ్-రాయ్ తో కలిసి ‘ప్లిమత్’ లో ఉన్న బీగిల్ ఓడని సందర్శించాను. అక్కణ్ణుంచి ష్రూస్ బెరీ కి వెళ్లి నాన్నగారికి, అక్కలకి వీడ్కోలు చెప్పి వచ్చాను. అక్టోబర్ 24 కి మకాం ప్లిమత్ కి మార్చేశాను. డిసెంబర్ 27 వరకు, అంటే బీగిల్ ఓడ బయల్దేరిన వరకు, అక్కడే వున్నాను. అంతకు ముందు రెండు సార్లు బయల్దేరే ప్రయత్నం చేశాను. కాని బలమైన ఎదురు గాలుల వల్ల పురోగమనం కష్టం కావడం వల్ల తిరిగి వెనక్కి రావలసి వచ్చింది. రెండు నెలలు ప్లిమత్ లో గడిపిన జీవితం దుర్భరంగా అనిపించింది. స్నేహితులని, కుటుంబీకులని విడిచిపెట్టి అంత కాలం ఉండాల్సి రావడం నాకు ససేమిరా నచ్చలేదు. వాతావరణం కూడా చాలా పరిదీనంగా తోచింది. ఇది చాలనట్టు అప్పుడప్పుడు గుండెదడ, గుండెనొప్పి వంటివి కలిగేవి. కాస్తో కూస్తో వైద్య పరిజ్ఞానం ఉన్నవాణ్ణి కనుక నాకు ఏదో గుండెజబ్బు ఉండే ఉంటుందని అనిపించింది. వైద్యుడు నన్ను పరీక్షిస్తే యాత్రకి సిద్ధం లేనంటాడని అనిపించింది. కాని ఏదేమైనా సాహసించి యాత్ర మీద ముందుకి సాగాలని మాత్రం చాలా పట్టుదలగా ఉంది.
యాత్రలో జరిగిన సంఘటనల గురించి ఇక్కడ పెద్దగా ప్రస్తావించబోవడం లేదు. ఆ విషయాలన్నీ మరో చోట (పుస్తకంగా అచ్చయిన నా యాత్రాపత్రికలో) విపులంగా చర్చించాను. ఉష్ణమండల ప్రాంతాలని చెందిన అటవీవైభవం ఇప్పటికీ కళ్ళకి కట్టినట్టు కనిపిస్తోంది. పటగోనియా లోని విశాల ఎడారి భూములు, టెరా డెల్ ఫ్యూగో లో పచ్చని అడవులతో (పై చిత్రం) కప్పబడ్డ పర్వతాలు నా మనసులో గాఢమైన ముద్ర వేశాయి. పుట్టిన గడ్డపై దిగంబరంగా సంచరించే ఆటవికులని చూసిన సన్నివేశాలని కూడా ఎప్పటికీ మర్చిపోలేను. మానవ ఛాయలైనా లేని నిర్జన భూములని గుర్రాల మీద, పడవల మీడ సందర్శించిన అనుభూతులు చెరగని తీపిగురుతులు. ఆ ప్రయాణాలలో ఎంతో కొంత అసౌకర్యం, అపాయం పొంచి వున్నా ఆ సమయంలో, ఆ ఉత్సాహంలో అదంత ప్రధానంగా తోచలేదు. ఈ యాత్ర వల్ల పరిష్కరించబడ్డ వైజ్ఞానిక సమస్యలని తలచుకుంటే సంతృప్తిగా ఉంటుంది. ఉదాహరణకి పగడపు దీవుల సమస్య. సెయింట్ హెలెనా మొదలైన దీవుల భౌగోళిక విశేషాలని అర్థంచేసుకోవడంలో సాధించిన పురోగతి. అలాగే గలపాగోస్ ద్వీపమాలికలో వివిధ ద్వీపాలకి చెందిన వృక్ష పశు పక్ష్యాదుల మధ్య సంబంధాలని అర్థం చేసుకోగలగడం. అంతేకాక దక్షిణ అమెరికాకి చెందిన జీవాలకి వీటికి మధ్య సంబంధాలని తెలుసుకోగలగడం. వీటన్నిటి గురించి కూడా ఇక్కడ ప్రస్తావించడం లేదు.
శాస్త్ర శోధనలో ఉండే ఆనందం, సువిస్తారమైన ప్రకృతి శాస్త్ర భాండారానికి మరి కొన్ని కొత్త సత్యాలు జోడించాలనే తపన - ఈ రెండూ యాత్రలో నేను విపరీతంగా శ్రమించడానికి కారణం అయ్యాయి. అంతే కాక వైజ్ఞానిక సమాజంలో ఓ సముచిత స్థానాన్ని ఆక్రమించాలన్న ఆకాంక్ష కూడా నా ప్రయాసకి ప్రోద్బలం ఇచ్చింది. మరి తోటి శాస్త్రవేత్తలతో పోల్చితే ఆ ఆకాంక్ష నాలో మరింత గాఢంగా ఉందో లేదో నాకై నేను చెప్పుకోలేను.
సెయింట్ లాగో దీవి యొక్క భౌగోళిక విశేషాలు కొట్టొచ్చినట్టు కనిపించినా, అంత సంక్లిష్టంగా ఏమీ లేవు. ఈ ప్రాంతంలో సముద్ర గర్భంలో నేల మీద ఒకప్పుడు లావా స్రవంతి ప్రవహించింది. ఆ కారణం చేత ఈ మొత్తం దీవి పైకెత్త బడింది. కాని తెల్లని శిలారేఖ ఒకటి నాకో కొత్త విషయాన్ని వ్యక్తం చేసింది. అగ్నిబిలాల చుట్టుపక్కల తదనంతరం నేల కిందకి దిగింది. అప్పట్నుంచి అగ్నిబిలాలు సక్రియంగా మారగా లావా లోపలి నుండి పైకి తన్నుకురావడం మొదలయ్యింది. అప్పుడే నాకు మొట్టమొదటి సారి ఓ ఆలోచన తట్టింది. నేను సందర్శించిన దేశాల భౌగోళిక లక్షణాల గురించి ఓ పుస్తకం రాస్తే బావుంటుందని అనిపించింది. అసలు ఆ ఆలోచనే నాలో ఎంతో ఉత్సాహం కలిగించింది. ఆ ఆలోచన వచ్చిన సుఘడియ నాకు ఇప్పటికీ గుర్తు. ఆ సమయంలో ఓ చిన్న లావా చెరియ కింద నేను విశ్రమిస్తున్నాను. సూర్యతాపానికి పరిసరాలన్నీ రగిలిపోతున్నాయి. దాపునే ఏవో చిత్రమైన ఎడారి మొక్కలు కనిపిస్తున్నాయి. నా పాదాల మీదుగా ప్రవహించే సెలయేటిలో సజీవమైన పగడాలు కనిపిస్తున్నాయి.
ఆ తరువాత యాత్రలో ఒకసారి ఫిట్జ్-రాయ్ నన్నో సారి పిలిచి నా యాత్రాపత్రిక చదివి వినిపించమన్నాడు. నేను చదివింది ఆయనకి నచ్చినట్టుంది. తప్పకుండా ప్రచురించమని ప్రోత్సహించాడు. నేను రాయదలచుకున్న పుస్తకాలలో అది రెండో పుస్తకం అయ్యింది.
(ఇంకా వుంది)
బీగిల్ యాత్రతో నా జీవితం ఓ ముఖ్యమైన మలుపు తిరిగిందని చెప్పాలి. నా వృత్తి జీవనం మొత్తానికి అది పునాది అయ్యింది. చాలా చిన్న సంఘటనలు ఆ మలుపు తిరగడంలో కీలక పాత్ర పోషించాలి. మొదటిది మా మామయ్య పూనుకుని ముప్పై మైళ్లు ప్రయాణించి మా నాన్నగారితో మాట్లాడాలని నిశ్చయించుకోవడం. ఇక రెండవ విషయం నా ముక్కు ఆకారంతో వచ్చిన చిక్కు. అంతవరకు విశ్వవిద్యాలయాలలో దొరకని అసలు శిక్షణ ఈ యాత్రతో నాకు దొరికిందని అనిపించింది. ఈ యాత్ర వల్ల ఎంతో మనోవికాసం కలిగింది. ప్రకృతి శాస్త్రంలో ఎన్నో శాఖలలో నాకు పరిచయం ఏర్పడింది. నా పరిశీలనా శక్తి కూడా మరింత నిశితం అయ్యింది.
నేను సందర్శిన ప్రాంతాలకి చెందిన భౌగోళిక లక్షణాలని అధ్యయనం చెయ్యడం కూడా ఒక నియమంలా పెట్టుకున్నాను. ఇలాంటి ప్రయత్నంలో తర్కం ఎంతో ముఖ్యం అవుతుంది. ఓ కొత్త ప్రాంతాన్ని మొదట చూసినప్పుడు చెల్లచెదురుగా ఉన్న రాళ్ళు రప్పలు చూస్తే ఏమీ అర్థం కాదు. కాని నెమ్మదిగా అక్కడి రాళ్ల లక్షణాలు, రాళ్లలోని స్తరాల అమరిక, అందులోని శిలాజాల స్థానాలు మొదలైనవి అన్నీ గమనించి, దాన్ని బట్టి ఇతర ప్రాంతాలలో ఎలాంటి రాళ్లు ఉంటాయో నిర్ణయించే ప్రయత్నం చేస్తే ఆ మొత్తం జిల్లా యొక్క భౌగోళిక లక్షణాల గురించిన అవగాహన ఏర్పడుతుంది. లయల్ రాసిన ‘Principles of Geology’ (భౌగోళిక శాస్త్రం యొక్క మూలసూత్రాలు) పుస్తకంలో మొదటి భాగం నాతో కూడా తెచ్చుకున్నాను. దాన్ని చాలా శ్రద్ధగా చదివాను. ఆ పుస్తకం నాకు ఎంతో ఉపయోగపడింది. నేను పరిశీలించిన మొట్టమొదటి ప్రాంతాన్ని, కేప్ వర్దే దీవులలోని సెయింట్ జాగో అనే ఆ ప్రాంతాన్ని చూసినప్పుడు, భౌగోళిక విషయాలని అధ్యయనం చెయ్యడంలో లయల్ పద్ధతి నాకు తెలిసిన ఇతర రచయితలు అందరికన్నా ఎంత గొప్పదో అర్థమయ్యింది.
ఈ యాత్రలో నా మరో వ్యాపకం నానా రకాల జంతుజాతులని, సేకరించడం. ఇక ముఖ్యంగా జలచరాలు అయితే వాటిని వర్ణించడమే కాక పరిచ్ఛేదించడం కూడా చేసేవాణ్ణి. కాని బొమ్మలు వేయడంలో గొప్ప ప్రతిభ లేకపోవడం వల్లను, శరీర నిర్మాణం గురించి తగినంత పరిజ్ఞానం లేకపోవడం వల్లను, ఆ విధంగా నేను రాసుకున వ్రాతప్రతులలో అధిక శాతం నిరుపయోగం అయిపోయాయి. ఆ విధంగా ఎంతో సమయం వృధా అయ్యింది. కాని క్రస్టేషియన్ జాతి (పీతలు, రొయ్యలు మొదలైన జలచరాల జాతి) మీద చేసిన అధ్యయనాల వల్ల మాత్రం ఎంతో నేర్చుకోగలిగాను. అలా నేర్చుకున్న పరిజ్ఞానం తదనంతరం క్రస్టేషియన్లలో ఉపజాతి అయిన సిరిపీడియాల మీద నేను చేసిన పుస్తక రచనలో పనికొచ్చింది.
రోజులో ఏదో సమయంలో వీలు చూసుకుని డైరీ రాసుకునే వాణ్ణి. నేను చూసినది అంతా విపులంగా రాసుకునేవాణ్ణి. ఇది చాలా మంచి అలవాటు. నేను రాసుకున్న దాంట్లో కొంత భాగం ఉత్తరాల రూపంలో ఇంటికి చేరింది. వీలు దొరికినప్పు డల్లా ఈ రచనలలో భాగాలు ఇంగ్లండ్ కి పంపడం జరిగింది.
ఈ యాత్రలోనే నాకు విసుగు వేసట లేకుండా శ్రమించడం, ఏ పని చేపట్టినా ఏకాగ్రచిత్తంతో పూర్తిగా ఆ సమస్య మీదే పని చెయ్యడం అలవడింది. నేను చదివిన విషయాలని, ఆలోచించిన విషయాలని బాహ్య ప్రపంచంలో ఎప్పటికప్పుడు పరీక్షించి తేల్చుకునే ప్రక్రియ అలవాటు అయ్యింది. ఈ అలవాటు యాత్ర జరిగిన ఐదేళ్లూ నిరాఘాటంగా కొనసాగింది. వైజ్ఞానిక రంగంలో నేను ఏదైనా సాధించగలిగితే అది కేవలం ఈ ఒక్క అలవాటు వల్లనే సాధ్యమయ్యిందని చెప్పగలను.
(ఇంకా వుంది)
కాపెల్ క్యూరిగ్ వద్ద హెన్స్లోని విడిచిపెట్టి నేను వేరేగా ముందుకు సాగిపోయాను. దిక్సూచిని, మాప్ ని ఆధారంగా చేసుకుని సరళరేఖలో కొండలు దాటుకుంటూ బార్మౌత్ దిశగా సాగిపోయాను. నేను ఎంచుకున్న దిశలో ఏదైనా దారి కనిపిస్తే ఆ దారి మీదుగా ప్రయాణించాను గాని, లేకుంటే ఎక్కువగా కొండల మీదుగానే ప్రయాణిస్తూ పోయాను. ఈ రకమైన యాత్రా పద్ధతి నాకు బాగా నచ్చింది. దారిలో ఎన్నో అద్భుతాలు చూస్తూ ఆనందంగా ముందుకు సాగిపోయాను. బార్మౌత్ లో కొందరు కేంబ్రిడ్జ్ నేస్తాలని కలుసుకున్నాను. అందరం ష్రూస్ బరీ కి, మాయర్ కి వెళ్ళి సరదాగా షూటింగ్ చేశాం. తాత్కాలికంగా నా పరిశోధనల గురించి మర్చిపోయాను. చాలా కాలంగా నేస్తాలతో కలిసి షూటింగ్ కార్యక్రమాలలో పాల్గొనే అవకాశాన్ని వదులుకోదలచుకోలేదు.
‘బీగిల్ యాత్ర – డిసెంబర్ 27, 1831 నుండి అక్టోబర్ 2, 1836 దాకా
ఉత్తర వేల్స్ లో జరిపిన భౌగోళిక యాత్ర నుండి తిరిగి వచ్చిన తరువాత ఇంటికి రాగేనే హెన్సో రాసిన ఉత్తరం ఒకటి నాకోసం ఎదురు చూస్తోంది. ‘బీగిల్’ యాత్రలో ప్రకృతి శాస్త్రవేత్త గా రావాలనుకునే కుర్రవాడు ఎవడైనా ఉంటే రావచ్చని, అతడిని తన సొంత కాబిన్ లో ఇంత చోటు ఇచ్చేందుకు కాప్టెన్ ఫిట్జ్ రాయ్ ఒప్పుకుంటున్నాడని ఆ ఉత్తరంలో సమాచారం. నేనైతే ఆ అవకాశానికి ఎగిరి గంతేశాను. ఇక నాన్నగారి అనుమతి తీసుకోవాలి. నాన్నగారికి ఈ విషయం చెప్పగానే మండిపడ్డారు. “బుద్ధున్నవాడు ఎవడైనా ఇలాంటి యాత్రకి ఒప్పుకుంటే నేనూ ఒప్పుకుంటాను,” అన్నారు. ఇక చేసేదిలేక ఆ రోజే అవకాశాన్ని తిరస్కరిస్తూ ఉత్తరం రాశాను. మర్నాడు మాయర్ కి వెళ్లాను సెప్టెంబర్ 1 కి సన్నాహాలు చేసుకోవాలని. అక్కడ ఒక రోజు నేను షూటింగ్ లో మునిగి వున్న సమయంలో మా మామయ్య (జోసయ్యా వెడ్జ్ వుడ్) నన్ను పిలిపించాడు. కావలిస్తే నాతో పాటు ష్రూస్బరీ కి వచ్చి నాన్నగారితో మాట్లాడుతానని, ఇంత గొప్ప అవకాశం వదులుకోవడం మంచిది కాదని అన్నాడు. నాన్నగారికి మామయ్య అంటే చాలా గౌరవం. అంతకన్నా వివేకవంతుడు లోకంలో లేడని ఆయన నమ్మకం. మామయ్య చెప్పగానే మరుమాట్లాడకుండా ఒప్పుకున్నారు. కేంబ్రిడ్జ్ లో ఉండే రోజుల్లో నేను కాస్త ఉదారంగానే ఖర్చుపెట్టేవాణ్ణి. ఈ యాత్రలో మాత్రం అలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్తపడతానని నాన్నగారితో ఇలా అన్నాను, “బీగిల్ యాత్రలో నాకు ఇచ్చిన డబ్బు కన్నా ఎక్కువ ఖర్చుపెట్టడానికి నేనేమైనా తెలివి తక్కువ వాడినా ఏంటి?” అది విని నాన్నగారు చిరునవ్వు నవ్వుతూ “నువు తెలివితక్కువ వాడివి కావనే అందరూ అంటారులే!” అని ఊరుకున్నారు.
మర్నాడే కేంబ్రిడ్జ్ కి వెళ్లి హెన్స్లో ని కలుసుకున్నాను. అక్కణ్ణుంచి లండన్ కి వెళ్లి ఫిట్జ్ రాయ్ ని కలుసుకున్నాను. ఈ ఫిట్జ్ రాయ్ నన్ను చూసీ చూడగానే, ముఖ్యంగా నా ముక్కుని చూడగానే, కుదరదు పొమ్మనే ప్రమాదం ఉందని ఇంతకు ముందే విన్నాను. ఈ ఫిట్జ్ రాయ్ గారు లవాటర్ కి ఏకలవ్య శిష్యుడట! ముఖ కవళికల బట్టి మనిషి తత్వాన్ని తెలుసుకోవచ్చని ఇతడు గాఢంగా నమ్ముతాడు. బీగల్ యాత్ర మీద రావడానికి కావలసిన తెగువ, సత్తువ, ధృఢనిశ్చయం ఇలాంటి ముక్కు ఉన్నవాడికి ఉంటాయా అని అతడి సందేహం. నా ముక్కు అతణ్ణి తప్పుదారి పట్టించిందని తరువాత అతడు గ్రహించి ఉంటాడని అనుకుంటాను.
ఈ ఫిట్జ్ రాయ్ ఎంతైనా చెప్పుకోదగ్గ మనిషి. ఇతనిలో ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి. కర్తవ్యనిర్వహణలో అంకిత భావంతో పనిచేస్తాడు. మహా దైర్యవంతుడు. పొరపాటుని సులభంగా క్షమిస్తాడు. విసుగు వేసట లేకుండా పనిచేస్తాడు.
తన కింద పని చేసేవారికి మంచి స్నేహితుడిలా నడచుకుంటాడు. తన సహాయం ఎవరికైన అవసరం అని తెలిస్తే, ఆ సహాయానికి వాళ్ళు అర్హులు అని తెలిస్తే, ఆ సహాయాన్ని అందించడంలో ఎంత దూరం అయినా వెళ్తాడు. చూడడానికి చాలా హుందాగా పెద్దమనిషి తరహాగా ఉంటాడు. ఈ విషయంలో మాత్రం తన మామయ్య అయిన లార్డ్ కాజిల్ రే పోలికలే వచ్చాయని తదనంతరం ‘రియో’ లో ఓ మినిస్టరు చెప్పాడు. అంతేకాక మహారాజు చార్లెస్ – 2 కి, ఇతనికి గాఢమైన పోలికలు ఉండడం చూసి ఆశ్చర్యపోయాను. డా॥ వాలిచ్ ఓ సారి తను సేకరించిన మహారాజు చార్లెస్ ఫోటోలు తెచ్చి చూపించాడు. వాటిలో ఒక ఫోటోకి ఫిట్జ్ రాయ్ మధ్య ఎంతో పోలిక వుంది.
కాని ఫిట్జ్ రాయ్ లో దుర్గుణం వుంది. అతడు మహా ముక్కోపి. అది ఉదయానే తారస్థాయిలో ఉంటుంది. తన డేగచూపుతో ఓడ మొత్తం ఓ సారి పర్యవేక్షిస్తాడు. ఎక్కడ ఏ చిన్న తేడా వచ్చినా ఇక దండకం అందుకుంటాడు. కాని నా అదృష్టం బావుండి నాతో మాత్రం చాలా మర్యాదగా ఉండేవాడు. ఏదేమైనా ఈ మనిషితో సన్నిహితంగా జీవించడం తమాషా కాదు. కాని పాపం మరి నాకు తప్పింది కాదు. ఇద్దరం ఒకే కాబిన్ లో జీవించాలి మరి!
మా ఇద్దరి మధ్య ఎన్నో సార్లు వాగ్వివాదాలు రేగాయి. ఉదాహరణకి ఓ సారి బ్రెజిల్ లో బహ్తా ప్రాంతంలో ప్రయాణిస్తుండగా ఓ సారి బానిస పద్ధతిని సమర్ధిస్తూ, పొగుడుతూ మాట్లాడాడు. నాకు ఆ పద్ధతి అంటేనే అసహ్యం. ఓ గొప్ప ‘బానిసల యజమాని’ గురించి చెప్పుకొచ్చాడు. ఆ యజమాని వద్ద ఎంతో మంది బానిసలు ఊడిగం చేస్తుంటారట. ఓ రోజు ఆ యజమాని తన బానిసలు అందరినీ పిలిచి ‘మీరంతా నా వద్ద సంతోషంగా ఉన్నారా, లేక వెళ్లిపోవాలని అనుకుంటున్నారా?’ అని అడిగాడట. యజమాని సమక్షంలో అలా అడిగితే వాళ్ళు అలా కాక మరోలా ఎందుకు సమాధానం చెప్తారని అడిగాను. నా సమాధానికి అతడికి ఒళ్ళుమండిపోయింది. తన అభిప్రాయాన్ని నేను గౌరవించలేదు కనుక ఇద్దరం ఇక కలిసి ఉండడం వీలుపడదన్నాడు. ఓడ నుండి బయటికి గెంటేస్తాడని భయపడ్డాను. ఒక లెఫ్టెనెంట్ ని పిలిచి నన్ను చెడామడా తిట్టమన్నాడు. ఓడలో కింది ఉద్యోగులు కొందరు నా పరిస్థితి చూసి జాలిపడ్డారు. నన్ను వాళ్లతో పాటు వాళ్ల కాబిన్ లో ఉండమని ఆహ్వానించారు. వాళ్ల ఔదార్యం చూసి నా మనసు తేలికపడింది. కాని కొన్ని గంటల తరువాత ఫిట్జ్ రాయ్ చల్లబడ్డాడు. మనిషిని పంపించి క్షమాపణ కోరుతున్నట్టుగా కబురు పెట్టాడు. నేను ఎప్పట్లాగే తన కాబిన్ లోనే ఉండొచ్చని అనుమతి ఇచ్చాడు.
(ఇంకా వుంది)
నా వేసవి సెలవలు కుమ్మరి పురుగుల సేకరణలో, పుస్తక పఠనంలో, చిన్న చిన్న యాత్రలలో గడచిపోయాయి. ఇక శరత్తు మొత్తం షూటింగ్ తోనే సరిపోయింది. మొత్తం మీద కేంబ్రిడ్జ్ లో నేను గడిపిన మూడేళ్లూ చాలా ఆనందంగా గడచిపోయాయి. ఆ రోజుల్లో మంచి ఆరోగ్యం ఉండేది, మనసెప్పుడూ సంతోషంగా ఉండేది.
నేను కెంబ్రిడ్జ్ కి క్రిస్మస్ సమయంలో చేరటం వల్ల నా ఫైనలు పరీక్ష అయ్యాక కూడా అదనంగా రెండు టర్ములు (1831 లో) ఉండాల్సి వచ్చింది. ఆ రోజుల్లోనే హెన్స్లో నన్ను భౌగోళిక శాస్త్రం చదవమని ప్రోత్సహించారు. ష్రాఫ్షైర్ కి తిరిగి వచ్చిన తరువాత ష్రూస్ బరీ చుట్టు పక్కల ప్రాంతాలకి సంబంధించిన మాపుని అధ్యయనం చేసి దానికి రంగులు కూడా వేశాను. ఆగస్టు నెల మొదట్లో ప్రొఫెసర్ సెడ్జ్ విక్ ఉత్తర వేల్స్ లోని పురాతన రాళ్లని సమీక్షించడానికి ఆ ప్రాంతాన్ని సందర్శించాలని అనుకున్నారు. ఆయనతో బాటు నన్ను తీసుకొపొమ్మని హెన్స్లో ఆయనకి సూచించారు. (ఈ యాత్ర గురించి చెప్పే ముందు సెడ్జ్ విక్ గురించి మా నాన్నగారు చెప్పిన ఒక కథ చెప్పాలి. వాళ్లంతా ఒక రోజు వాళ్లు ఉండే హోటల్ నుండి బయలుదేరి ఓ రెండు మూడు మైళ్లు నడిచారట. అంతలో సెడ్జ్ విక్ ఉన్నట్టుండి తిరిగి వెనక్కి వెళ్లాలన్నాట్ట! ఉన్నట్టుంది ఏమయ్యిందని తక్కినవాళ్ళు అడిగితే ఆయన చెప్పిన కారణం ఇది. హోటల్ నుండీ వస్తూ పని మనిషికి ఇవ్వమని వెయిటర్ కి ఆరు పెన్స్ ఇచ్చారట ఆయన. "ఆ దొంగ వెధవ" ఇస్తాడో లేదో అని ఆయనకి ఉన్నట్టుండి ఎందుకో సందేహం వచ్చిందట! 'వాడి మీద ఎందుకండీ లేనిపోని అనుమానం?' అని ఆయన వెనక్కి మళ్లకుండా ఒప్పించడానికి తక్కిన వాళ్లకి గగనం అయ్యిందట.) కనుక ఆయన వచ్చి ఒక రాత్రి మా ఇంట్లో బస చేశారు.
ఆడమ్ సెడ్జ్ విక్ - (వికీ)
ఆ సాయంకాలం ఆయనతో జరిపిన సంభాషణ నా మనసు మీద గాఢమైన ముద్ర వేసింది. ష్రూస్ బరీ కి సమీపంలో ఒక చోట ఓ కంకర రాళ్ళ గుంతని పరిశీలిస్తుంటే, అక్కడ ఉష్ణమండలానికి చెందిన వోల్యూట్ అనే ఓ జలచరానికి చెందిన గవ్వ ఒకటి అరిగిపోయిన స్థితిలో దొరికింది అని ఓ పనివాడు నాతో అన్నాడు. అలాంటి గవ్వలని సామాన్యంగా పొగగొట్టాల లోపలి భాగాల్లో పొదుగుతూ ఊంటారు. ఆ గవ్వని అమ్మటానికి ఒప్పుకోలేదు.
అంత అపురూఫంగా చూసుకుంటున్నాడు కనుక నిజంగానే ఆ గవ్వ అతడీకి ఆ గుంతలో దొరి ఉంటుంది అనిపించింది. ఆ విషయమే ఉత్సాహంగా వెళ్లి సెడ్జివిక్ కి చెప్పాను. ఆ గవ్వని ఎవరో ఆ గుంతలోకి విసిరేసి ఉంటారని, అది ఆ గుంతకి చెందింది కాదని అన్నాడు సెడ్జివిక్. అది మొదట్నుంచీ అక్కడే ఉన్న వస్తువైతే ఆ వాస్తవం భౌగోళిక శాస్త్రానికి గొడ్డలి పెట్టు అవుతుంది అన్నాడు. మిడ్లాండ్ ప్రాంతాలలో భూమి పైపొరలలో ఉండే అవక్షేపాల గురించి అంతవరకు మనకి తెల్సిన పరిజ్ఞానాన్ని తిరగరాయాల్సి వస్తుంది అన్నాడు. ఈ కంకర రాతి పొరలు హిమానీనద యుగానికి చెందినవి. కాలాంతరంలో వాటి మధ్య విరిగిపోయిన ఆర్కిటిక్ ప్రాంతపు గవ్వలు కనిపించాయి. కాని ఉష్ణమండలానికి చెందిన గవ్వ ఇక్కడ ఇంగ్లండ్ లో మధ్య ప్రాంతపు ఉపరితల భూమిలో కనిపించడం నాకు చాలా ఉత్సాహాన్ని కలిగించింది. అందుకే ఆ విషయాన్ని సెడ్జివిక్ కొట్టిపారేయడం ఎంతో నిరూత్సాహాన్ని కలిగించింది. అంతకు ముందు ఎన్నో వైజ్ఞానిక పుస్తకాలు చదివినా కూడా, ఆ రోజు నాకో విషయం స్పష్టంగా అర్థమయ్యింది. విజ్ఞానం అంటే ఏవో పరస్పర సంబంధం లేని వివరాలని సేకరించడం కాదు, ఆ వివరాల మాటున ఉన్న సామాన్య నియమాలని పొడచూడడం. ఈ పాఠం ఎప్పుడూ మర్చిపోలేదు.
మర్నాడు ఉదయం మేమంతా లాంగోలెన్, కాన్వే, బాంగొర్, కాపెల్ క్యూరిక్ మొదలైన ప్రాంతాల సందర్శనానికి బయలుదేరాం. ఒక ప్రాంతం యొక్క భౌగోళిక లక్షణాలని ఎలా తెలుసుకోవాలో ఈ యాత్రలో తెలిసింది. సెడ్జివిక్ తరచుగా నన్ను తనతో కాకుండా వేరేగా వెళ్లమంటూ ఉండేవారు. నేను చూసిన ప్రదేశాల నుండి రాళ్ళు తెచ్చి వాటిలోని స్తరాలని మ్యాపులుగా చిత్రించ మనేవారు. నా మేలు కోరే అలా చేశారని అనిపించింది. అయినా ఆయనకి సహచరుడిగా పనిచేసేటంత ప్రతిభ, పరిజ్ఞానం అప్పటికి లేవు నాకు. ఎంతో ప్రస్ఫుటంగా కనిపించే విషయాలని కూడా ఎన్నో సార్లు గుర్తించలేక పోయేవాణ్ణి. కువం ఇడ్వాల్ లో ఎన్నో గంటలు గడిపాం. అక్కడి రాళ్ళని ఎంతో జాగ్రత్తగా పరీక్షించాం. వాటిలో ఏవైనా శిలాజాలు కనిపిస్తాయేమో నని సెడ్జివిక్ ఆశ. కాని అద్భుతమైన హిమానీనద యుగానికి సంబంధించిన ఆనవాళ్ళేవీ ఆ ప్రాంతాల్లో మాకు కనిపించలేదు. గీతలు పడ్డ రాళ్లు, దొంతర్లుగా ఏర్పడ్డ బండలు, హిమానీనద అవక్షేపాలు మొదలైనవేవీ కనిపించలేదు. అయినా కూడా ఈ లక్షణాలు ఎంత ప్రస్ఫుటంగా ఉన్నాయంటే ఎన్నో ఏళ్ల తరువాత ఈ విషయాల గురించి 'ఫిలసాఫికల్ మాగజైన్ లో రాస్తూ, మంటల్లో బూడిద అయిన ఇంటిని చూసినప్పుడు ఆ ఇంటికి ఏం జరిగిందో ఎంత స్ఫష్టంగా తెలుస్తుందో, ఈ లోయ కూడా అక్కడి భౌగోళిక చరిత్ర గురించి అంత స్పష్టంగా తెలుపుతుంది అని వ్రాశాను.
(ఇంకా వుంది)
ఆయన [హెన్స్లో] మంచితనానికి, దయాగుణానికి హద్దుల్లేవని అనిపిస్తుంది. పేద వారి జీవితాలని మెరుగుపరచడానికి ఆయన రూపొందించిన పధకాలే దానికి తార్కాణం. ఆయన సావాసం నాకు ఎనలేని మేలు చేసింది. ఇలా అంటే నాకూ చిన్న సన్నివేశం గుర్తొస్తోంది. అవతలి వారి మనసుని గాయపరచకుండా నడుచుకునే ఆయన సున్నిత స్వభావానికి ఇది తార్కాణం. ఒకసారి ఓ చిత్తడి నేల మీద పుప్పొడి రేణువులని పరీక్షిస్తుంటే, వాటిలోంచి సన్నని నాళాలు పొడుచుకు రావటం చూశాను. నాకు ఆశ్చర్యం వేసి వెంటనే ఆయనకి చెప్దాం అని పరుగెత్తాను. ఆయన స్థానంలో మరే ఇతర వృక్ష శాస్త్రం ప్రొఫెసరు ఉన్నా అలాంటి కబురు చెప్పడానికి వచ్చిన నన్ను చూసి పకాలు మని నవ్వేవాడే. నేను చూసిన విషయం నిజంగానే చాలా ఆసక్తికరంగా ఉందని ఒప్పుకుని, దాని గురించి వివరంగా వివరించి, చివరికి అది కొత్త విషయమేమీ కాదని, బాగా తెలిసిన విషయమే నని నాకు సున్నితంగా బోధపరిచారు. ఆయన చెప్పిన విధానం వల్ల కాబోలు నేనేమీ చిన్నబుచ్చుకోలేదు. పైగా అలాంటి ప్రత్యేకమైన విషయం గురించి తెలుసుకున్నందుకు సంతోషించాను. అయితే మళ్లీ ఇంకెప్పుడూ అలా తొందర పడి కనుక్కున్న విషయాలని వెంటనే అందరికీ చాటకూడదు అని నిర్ణయించకున్నాను.
డా||వెవెల్ తరచుగా హెన్స్లో ఇంటికి వస్తూ ఊండేవారు. ఎన్నో సార్లు ఆయన, నేను రాత్రిళ్లు కలిసి ఇంటికి వెళ్లడం జరిగింది. నేను చూసిన వారిలో సర్ మాకింటోష్ తరువాత అంతటి మాటకారి ఇతడే. ఎన్నో లోతైన అంశాల మీద గొప్పగా ప్రసంగించ గలడు. ప్రకృతి చరిత్ర మీద ఎన్నో అమూల్యమైన వ్యాసాలు వ్రాసిన లియొనార్డ్ జెనిన్స్ కూడా ఎన్నో సార్లు హెన్స్లో గారి ఇంట్లో బస చెయ్యడం జరిగింది. ఫెన్స్ సరిహద్దుల వద్ద ఉన్న ఆయన ఇంటికి ఎన్నో సార్లు వెళ్లాను. ఆయనతో ప్రకృతి చరిత్ర గురించి చర్చించే అవకాశం ఎన్నో సార్లు దొరికింది. హెన్స్లో స్నేహితులైన మరి కొందరు ప్రముఖులు, విజ్ఞానంతో సంబంధం లేని వారు, మరి కొందరితో కూడా పరిచయం కలిగింది. వారిలో ఒకడు సర్ అలెగ్సాండర్ రాంసే కి సోదరుడు. స్కాట్లాండ్ కి చెందిన ఇతడు జీసస్ కాలేజిలో లెక్చరర్ గా పని చేసేవాడు. అలాగే హియర్ఫోర్డ్ లో డీన్ గా పని చేసిన మిస్టర్ డాస్ తో కూడా పరిచయం అయ్యింది. పేదల చదువులో ఈయన సాధించిన విజయాల కారణంగా ఈయనకి పేరొచ్చింది. హిన్స్లో గారి ఈ మిత్ర బృందం అంతా కలిసి ఎన్నో సార్లు ఆ చుట్టుపక్కల ప్రాంతాలకి విహార యాత్రలకి వెళ్లేవారు. నేను ఎన్నో సార్లు ఆ యాత్రల్లో పాలు పంచుకున్నాను. ఆ యాత్రలు ఎంతో విజ్ఞాన దాయకంగా ఉండేవి.
ఆ రోజులని గుర్తు తెచ్చుకుంటుంటే అనిపిస్తుంది. నా ఈడు కుర్రాళ్లలో లేని ఏదో ప్రత్యేకత నాలో వారికి కనిపించి ఉంటుంది. లేకపోతే విద్యా విషయాలలో అంత ఎత్తుకి చేరుకున్న వారంతా, ఓనమాలు కూడా సరిగ్గా రాని నన్ను వాళ్ల బృందంలోకి ఎందుకు రానిస్తారు? నాకుగా నాకు అలాంటి ప్రత్యేకత ఏమీ నాలో కనిపించదు. కాని నాతో కలిసి ఆడుకునే నా స్నేహితుడు టర్నర్ అన్న మాటలు గుర్తొస్తున్నాయి. కుమ్మరి పురుగులతో నేను చేసిన పరిశోధనలు చూసిన టర్నర్ ఏదో ఒకరోజు నేను "ఫెలో ఆఫ్ రాయల్ సొసయిటీ" అవుతాను అన్నాడు. నాకైతే అది అసంభవం అనిపించింది అప్పుడు.
కేంబ్రిడ్జ్ లో గడిపిన ఆఖరు సంవత్సరంలో హంబోల్ట్ రాసిన "వ్యక్తిగత ప్రసంగం" (Personal narrative ) పుస్తకాన్ని చాలా ఆసక్తిగా చదివాను. ఇది కాకుండా సర్ జె. హెర్షెల్ రాసిన "ప్రకృతి తత్వ అధ్యయనాలకి పరిచయం" (An introduction to the study of natural philosophy ) పుస్తకం కూడా చదివాను. అది చదివాక జీవితంలో ఏదో ఒక చక్కని వైజ్ఞానిక సత్యాన్ని కనుక్కుని ప్రకృతి విద్యా దేవతకి చిరుకానుకగా సమర్పించుకోవాలన్న తపన నాలో బయలుదేరింది. ఏ రెండు పుస్తకాలు చేసినంతగా మరే ఇతర పుస్తకాలు నన్ను ప్రభావితం చెయ్యలేదు అనిపించింది. హంబోల్ట్ రచనలలో టెనెరిఫ్ Teneriffe) గురించిన సుదీర్ఘ వర్ణనలు కొన్ని వేరేగా రాసుకుని హెన్స్లో బృందంతో యాత్రలకి వెళ్ళినప్పుడు ఒకసారి తీసుకెళ్ళాను. అంతకు ముందు ఒకసారి యాత్రకి వచ్చినప్పుడు టెనెరిఫ్ వైభవం గురించి హెన్స్లో, రాంసే, డాస్ తదితరులతో తెగ చెప్పాను. దాంతో వాళ్లు ఈ సారి టెనెరిఫ్ కి వెళ్లడానికి ఒప్పుకున్నారు. కాని ఏదో ఊరికే నన్ను మెప్పించడానికి ఒప్పుకున్నారు అనిపించింది. కాని నాకు మాత్రం ఎలాగైనా అక్కడికి వెళ్లాలని పట్టుదలగా ఉండేది. ఒకసారి లండన్లో నౌకా యాత్రలకి సంబంధించిన సమాచారాన్ని సేకరించడానికి ఓ ఓడల వ్యాపారి గురించి సమాచారం సేకరించాను కూడా. కాని "బీగిల్" యాత్రతో ఈ పధకాలన్నీ నీట కలిసిపోయాయి.
(ఇంకా వుంది)
కుమ్మర పురుగు సేకరణలో మంచి నైపుణ్యం సంపాదించాను. రెండు కొత్త పద్ధతులు కూడా కనిపెట్టాను. పాత చెట్ల మీద పేరుకునే నాచు అంతా గోకి పెద్ద సంచీలోకి ఎక్కించడానికి ఓ పనివాణ్ణి పెట్టుకున్నాను. అలాగే బురద నేలల నుండె కట్టెలు తెచ్చే పడవల్లో అడుగున పేరుకునే నాచుని కూడా సేకరించే వాణ్ణి. ఆ విధంగా ఎన్నో అమూల్యమైన కుమ్మర పురుగు జాతులని సేకరించ గలిగాను. 'స్టెఫెన్స్ వారి బ్రిటిష్ కీటకాల చిత్రాలు’ అనే పుస్తకంలో సేకరణ - సి. డార్విణ్ అన్న పదాలని మొట్టమొదటి సారి చూసినప్పుడు నాలో గలిగినంత ఆనందం, ప్రపంచంలో ఏ కవీ తన కవితలని మొట్టమొదటి సారి అచ్చు రూపంలో చూసుకుని అనుభవించి ఉండడు. కీటక శాస్త్రంతో నాకు పరిచయం చేసినవాడు మా బావ డబల్యు. డార్విన్ ఫాక్స్. చాలా తెలివైన వాడు, మంచివాడు. ఇతగాడు క్రైస్ట్ కాలేజిలో ఉన్న రోజుల్లో మా ఇద్దరి మధ్య బాగా సఖ్యత పెరిగింది. ఈ సేకరణ వ్యవహారం బాగా అలవాటు అయ్యాక ట్రినిటీ కాలేజి కి చెందిన ఆల్బర్ట్ వే తో కలిసి వెళ్తుండేవాణ్ణి. ఆ ఆల్బర్ట్ వే తరువాత పురావస్తు పరిశోధకుడిగా మంచి పేరు పొందాడు. ఆ తరువాత హెచ్. థాంసన్ తో కూడా కొంత కాలం వెళ్ళాను. ఈ థాంసన్ తరువాత రైల్వేలకి చైర్మన్ గాను, పార్లమెంట్ సభ్యుడిగాను పని చేశాడు. కనుక కుమ్మరి పురుగు విషయంలో నా అభిరుచి భవిష్యత్తులో నేను పొందబోయే ఎన్నో విజయాలకి తొలిమెట్టు అయ్యింది.
కేంబ్రిడ్జ్ లో నేను సేకరించిన కుమ్మర పురుగులు నా మనసులో ఎంత గాఢమైన ముద్ర వేశాయో తలచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. ముఖ్యంగా నా పంట బాగా పండిన కొన్ని ప్రత్యేక స్థలాలు, ముసలి చెట్లు, చెరువుగట్లు నాకు ఇంకా గుర్తు. ప్రత్యేకించి ‘పనాజియస్ క్రక్స్ – మేజర్’ జాతి పురుగు దొరకడం ఆ రోజుల్లో అపురూపంగా ఉండేది. ఒకసారి దారికి అడ్డుగా ఉరుకుతున్న ఓ కుమ్మర పురుగుని చటుక్కున అందుకుని చూశాను. మొదట పి. క్రక్స్-మేజర్ కి, దీనికి పోలిక ఉన్నట్టు కనిపించింది. కాని జాగ్రత్తగా గమనిస్తే అది పి. క్వాడ్రీ పంక్టాటస్ జాతి పురుగు అని తెలిసింది. రెండూ సన్నిహిత జాతులే. ఆకారంలో కొంత పోలిక ఉంది. ఆ రోజుల్లో ‘లిసినస్’ జాతి పురుగుని ఎప్పుడూ సజీవంగా పట్టుకోలేదు. తేడా తెలీని వాళ్ళు దాన్ని చూసి నల్లని కరాబిడస్ కుమ్మరి పురుగు అనుకుని పొరబడతారు. కాని మా ఇంటికి దగ్గర్లోనే మా పుత్రరత్నాలు ఓ పరుగుని పట్టుకున్నారు. అది నాకు తెలీని కొత్త జాతి అని చూడగానే గుర్తించాను. కాని గత ఇరవై ఏళ్లుగా బ్రిటిష్ కుమ్మర పురుగుని చూసి ఎరగను అంటే నమ్మండి!
నా వృత్తి జీవితం మీద గాఢమైన ముద్ర వేసిన ఓ ప్రభావం గురించి ఇంకా చెప్పలేదు. ఇది ప్రొఫెసర్ హెన్స్లో తో పరిచయం. కేంబ్రిడ్జ్ కి వచ్చే ముందు విజ్ఞానంలో ఆయనకి తెలీని రంగం అంటూ లేదని ఆయన గురించి మా అన్నయ్య చెప్పగా విన్నాను. కనుక ఆయన అంటే ఎంతో గౌరవం ఉండేది. ఆయన వారానికి ఒకసారి బహిరంగ సమావేశాలు ఏర్పాటు చేసేవారు. ఈ సమావేశాలకి విద్యార్థులే కాక, విశ్వవిద్యాలయంలో సైన్స్ విభాగానికి చెందిన ఇతర సహోద్యోగులు కూడా కొందరు వచ్చేవారు. ఒకసారి మా బావ ఫాక్స్ ద్వారా ఈ సమావేశాలకి ఆహ్వానం దొరికింది. అప్పట్నుంచి క్రమం తప్పకుండా వెళ్లే వాణ్ణి. త్వరలోనే హెన్స్లో తో పరిచయం పెరిగింది. కేంబ్రిడ్జ్ లో ఉండే కాలంలో రెండవ దశలో ఆయనతో పాటు ఎన్నో సార్లు షికార్లకి వెళ్తూ ఉండేవాణ్ణి. దాంతో 'హెన్స్లో తో చెట్టాపట్టాలు వేసుకుని షికారు కెళ్లే పెద్దమనిషి’ అన్న బిరుదు కూడా దక్కింది. సాయంత్రాలు ఎన్నో సందర్భాలలో వాళ్ల ఇంటికి భోజనానికి రమ్మనేవారు. వృక్ష శాస్త్రంలో, కీటక శాస్త్రంలో, రసాయన శాస్త్రంలో, ఖనిజ శాస్త్రంలో, భౌగోళిక శాస్త్రంలో ఆయన ప్రతిభ అపారం. దీర్ఘ కాలం ఎంతో క్షుణ్ణంగా, కూలంకషంగా చేసిన పరిశోధనల ఆధారంగా లోతైన నిర్ణయాలకి రావడంలో ఆయన ఘనుడు. ఆయన అంచనాలు చాలా కచ్చితంగా ఉండేవి. ఆయన ఆలోచనా ధోరణి చాలా సమంజసంగా ఉండేది. ఇంత పాండిత్యం ఉన్నా ఆయనని మహామేధావి అనలేమని అనిపిస్తుంది. ఆయనలో గాఢమైన దైవచింతన ఉండేది. ఇక మతం విషయంలో ఎంత ఛాందసుడు అంటే “Thirty-nine articles”*లో ఒక్క పదాన్ని మార్చినా తన మనసు విలవిలలాడి పోతుందని నాతో ఒకసారి చెప్పుకున్నాడు. కాని గొప్ప నీతిపరుడు. కోపం అంటే తెలీని శాంతస్వభావుడు. మంచి, మర్యాదలతో అవతలి వాళ్లని సులభంగా ఆకట్టుకునే స్వభావం ఆయనది. అలాంటి మనిషి కూడా ఎక్కడైనా అన్యాయం జరుగుతుంటే ఎంత వేగంగా స్పందించగలడో, ఎంత తీవ్రమైన చర్య తీసుకోగలడో చూసి ఆశ్చర్యపోయాను.
(*Thirty-nine articles అనేవి Church of England యొక్క మత సిద్ధాంతాలని నిర్వచించే మూల సూత్రాలు. – అనువాదకుడు.)
ఒక సారి ఆయన, నేను కేంబ్రిడ్జ్ వీధుల్లో నడుస్తుండగా ఓ దారుణమైన దృశ్యం కంట బడింది. అలాంటి దృశ్యాలు సామాన్యంగా ఏ ఫ్రెంచ్ విప్లవం కాలంలోనో కనిపించేవేమో. చిల్లర దొంగతనాలు చేసే ఇద్దరు దొంగల్ని పోలీసులు పట్టుకుని జైలుకి తరలిస్తున్నారు. అంతలో చుట్టూ ఉన్న జనం వాళ్ళని కానిస్టేబుల్ చేతినుండి విడిపించి, వాళ్ల కాళ్లు పట్టుకుని బురద నేల మీద ఈడుస్తూ పోయారు. వాళ్ల ఒళ్ళంతా బురదే. జనం కాళ్లతో తన్నటం వల్లనో, రోడ్డు మీద ఈడ్వటం వల్లనో మరి ఆ దొంగల తలల నుండీ రక్తం కారుతోంది. బలిష్టమైన శరీరాలు గల ఇద్దరూ శవాల్లా కనిపించారు. వాళ్ల చుట్టూ జనం ఎంతలా క్రమ్ముకున్నారంటే పాపం వారి దుస్థితిని చూడడానికి కూడా సాధ్యం కాలేదు. ఆ దారుణ దృశ్యాన్ని చూసిన హెన్లో ముఖం మీద రౌద్రం తాండవం చేసింది. ఒక మనిషి ముఖంలో అంత కోపం నేనెక్కడా చూళ్లేదు. జనం లోకి చొచ్చుకు పోవటానికి ఏన్నో సార్లు ప్రయత్నించారు. కాని వీలుపడలేదు. తను వెంటనే మేయర్ ఇంటికి బయలుదేరుతూ, నన్ను వెళ్ళి మరి కొందరు పోలీసులని వెంటపెట్టుకు రమ్మని పంపించారు. తరువాత ఏం జరిగిందో సరిగ్గా గుర్తులేదు గాని చివరికి ఆ ఇద్దరు దొంగలని ప్రాణాలతో రక్షించి జైల్లో పెట్టడం జరిగింది.
(ఇంకా వుంది)
విశ్వవిద్యాలయంలో ఎన్నో రంగాల్లో బహిరంగ ఉపన్యాసాలు ఉండేవి. కాని అప్పటికే ఎడిన్ బర్గ్ లో ఉపన్యాసాలు అంటే రోత పుట్టడం వల్ల, అత్యంత ఆసక్తికరమైన షెడ్జ్విక్ ఉపన్యాసాలకి కూడా హాజరు కాలేదు. ఆ ఉపన్యాసాలే విని ఉంటే భౌగోళిక శాస్త్రవేత్త అయ్యుండే వాణ్ణి. కాని హెన్స్లో వృక్ష శాస్త్రం మీద ఇచ్చిన ఉపన్యాసాలకి వెళ్లాను. ఆ ఉపన్యాసాలలోని అద్భుతమైన స్పష్టత, అందమైన చిత్రాలు నన్ను ఆకట్టుకున్నాయి.
అయితే నేను వృక్ష శాస్త్రం చదువుకోలేదు. హెన్స్లో తన విజ్ఞాన యాత్రలలో తనతో బాటు తన శిష్యులని, విశ్వవిద్యాలయంలో చదివిన సహోద్యోగులని తీసుకు వెళ్లేవాడు. బగ్గీల మీద గాని, నదిలో పడవల మీద గాని, కాలి నడకన గాని దూర ప్రాంతాలకి వెళ్లేవాడు. అక్కడ కనిపించే అరుదైన మొక్కల గురించి, జంతువుల గురించి ఉపన్యసించే వాడు. ఈ యాత్రలు మహా స్ఫూర్తి దాయకంగా ఉండేవి.
కేంబ్రిడ్జ్ లో నేను గడిపిన కాలంలో కొన్ని మంచి పరిణామాలు జరిగినా, మొత్తం మీద అక్కడ సమయం వృధా అయ్యిందనే చెప్పాలి. షూటింగ్, వేట, గుర్రపు స్వారీ మొదలైన క్రీడా కలాపాల మీదకి మనసు మళ్లింది. దాంతో పాటు కొన్ని అవాంచిత స్నేహాలు కూడా ఏర్పడ్డాయి. సాయంత్రాలు అందరం కలిసి భోజనం చేసేవాళ్లం. వచ్చే వాళ్లందరూ మంచి కుటుంబాల వాళ్లే అయినా, ఆ విందులలో మద్యపానం కొంచెం మితిమీరేది. పేకాట, పాట వాటికి తోడయ్యేది. న్యాయంగా ఐతే అలాంటి కాలయాపనకి సిగ్గుపడాల్సిందే. అయినా అప్పుడప్పుడు అందరితో సరదాగా కడిపిన ఆ ఘడియలని తలచుకుంటూ ఉంటాను. నాకు వేరే రకం స్నేహితులు కూడా ఉండేవారు. విట్నీ [గౌరవనీయులైన సి. విట్నీ, సహజ తత్వం లో రీడర్, డర్హం విశ్వవిద్యాలయం] తో చాలా సన్నిహితంగా ఉండేవాణ్ణి. ఇద్దరం కలిసి ఎంతో దూరాలు షికార్లకి వెళ్తూ ఉండేవాళ్ళం. చిత్రకళ పట్ల, చెక్కడాల పట్ల నాలో అభిరుచి కలిగించింది ఆయనే. తరువాత కొన్ని మంచి చిత్రాలు కొనుక్కున్నాను కూడా. తరచు ఫిట్జ్ విలియం చిత్రకళా ప్రదర్శనశాలకి వెళ్తూ ఉండేవాణ్ణి. అక్కడి చిత్రాల గురించి ప్రదర్శనశాల అధికారితో కూడా చర్చించడం గుర్తు. సర్ జోషువా రేనాల్డ్స్ రాసిన పుస్తకం కూడా ఆసక్తిగా చదివాను. చిన్నప్పట్నుంచి లేకపోయినా, నాలో చిత్రకళ పట్ల ఈ కొత్త అభిరుచి ఎన్నో ఏళ్ల పాటు నిలిచింది. లండన్ లో జాతీయ ప్రదర్శన శాల లోని చిత్రాలు కూడా ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి. ముఖ్యంగా సెబాస్టియన్ దెల్ ప్లోంబో చిత్రాలు చూసి పరవశించిపోయాను.
క్రీడల నుండి మనసు మెల్లగా సంగీతం మీదకి మళ్లింది. సంగీతాన్ని నాకు పరిచయం చేసిన వాడు నా మిత్రుడు హెర్బర్ట్ (జాన్ మారిస్ హెర్బర్ట్, తాలూకా జడ్జి). ఇలాంటి నేస్తాలతో సావాసం వల్ల సంగీతం పట్ల కూడా గాఢమైన అభిరుచి కలిగింది. కింగ్స్ కాలేజి చాపెల్ లో జాతీయ సంగీతం వాయించే సమయంలో, ఆ గీతం వినాలని ఆ దారి వెంబడి షికారుకి వెళ్తుండేవాణ్ణి. అది వింటుంటే కొన్ని సార్లు ఒళ్లు పులకరించేది. సంగీతం పట్ల అనురక్తి తెచ్చిపెట్టుకున్నది మాత్రం కాదు. కొన్ని సార్లు కింగ్స్ కాలేజ్ లో పాడే కుర్రాళ్లకి డబ్బిచ్చి నా గదికి వచ్చి పాడమని బతిమాలుతూ ఉండేవాణ్ణి. అయితే సంగీతాన్ని ఓ పామరుడిలా విని ఆనందించడమే గాని, దాని లోతుపాతులు వివేచించగల పాండిత్యం అబ్బలేదు. పాటలో అపశృతులు పట్టుకోలేకపోయేవాణ్ణి. పాట విని రాగం తీయడం నా వల్ల అయ్యేది కాదు. మరి అలాంటి నేను సంగీతాన్ని ఎలా ఆస్వాదించగలిగే వాణ్ణో నాకే అంతుబట్టేది కాదు.
పాటలని అర్థం చేసుకోలేని నా పాట్ల గురించి నా మిత్రులకి త్వరలోనే తెలిసిపోయింది. కనుక సంగీతంలో నాకే గమ్మత్తయిన పరీక్ష పెట్టి ఆనందించేవారు. తెలిసిన పాటకి తాళం మార్చి, మామూలుగా కన్నా వేగంగానో, నెమ్మదిగానో వాయించి పాటని గుర్తుపట్టమనేవారు.
God save the king పాటని అలా వాయించినప్పుడూ మాత్రం పెద్ద చిక్కే వచ్చి పడేది. నాలాంటి దౌర్బల్యమే ఉన్న మరో పెద్ద పెద్దమనిషి కూడా ఉండేవాడు. ఆశ్చర్యం ఏంటంటే అతగాడికి కొంచెం వేణువు వాయించడం కూడా వచ్చు. మా సంగీత పరీక్షలో ఒకసారి ఇతగాణ్ణి ఓడించాను కూడా.
కేంబ్రిడ్జ్ లో ఉన్న కాలంలో ఇన్ని వ్యాపకాలు ఉన్నా కుమ్మర పురుగుల (beatles) సేకరణ ఇచ్చిన ఆనందం మరేదీ ఇవ్వలేదు. ఊరికే సేకరించడంలో ఉన్న ఆనందం కోసం సేకరించేవాణ్ణి. వాటిని పరిచ్ఛేదించేవాణ్ణి కాడు. వాటి రూపురేఖలని పరిశీలించి, పుస్తకాల్లో ఇచ్చిన వివరణలతో సరిపోతున్నాయో లేదో కూడా చూసేవాణ్ణి కాను. ఈ విషయంలో ఒకసారి ఏం జరిగిందో చెప్తాను. ఓ రోజు ఓ చెట్టు బెరడును పెల్లగిస్తూ ఉంటే రెండు అరుదైన కుమ్మర పురుగులు కనిపించాయి. రెండిట్నీ గబుక్కున చెరో చేత్తో అందుకున్నాను. అంతలో మరో కుమ్మర పురుగు కనిపించింది. ఇది కూడా కొత్తరకమైనదే. దాన్ని వొదులుకోవాలని అనిపించలేదు. వెంటనే ఏం చెయ్యాలో తెలీక కుడి చేతిలో ఉన్న కుమ్మర పురుగుని చటుక్కున నోట్లో పెట్టుకున్నాను. అది నా నోట్లో ఏదో చేదైన ద్రవాన్ని కక్కింది! ఇక భరించలేక నోట్లోని పురుగుని ఉమ్మేశాను. ఇంతలో ఆ కొత్త, మూడో పురుగు కూడా తుర్రుమంది!
(ఇంకా వుంది)
రెండేళ్లు నేను ఎడింబర్గ్ లో గడిపాక మా నాన్నగార్కి ఒక విషయం తెలిసింది. మరి మా అక్కలు చెప్తే విన్నారో, లేక తనకే అనిపించిందో తెలీదు గాని నాకు డాక్టరు కావడం ఇష్టం లేదని గుర్తించారు. పోని చర్చ్ లో క్లర్జీ కావచ్చు కదా అని సూచించారు. ఊరికే క్రీడా కలాపాలతో జీవితం అంతా గడిపేస్తానేమో నని ఆయన భయం. ఆలోచించుకోవడానికి వ్యవధి కావాలని అడిగాను. ఇంగ్లండ్ చర్చిల నియమావళికి తట్టుకోగలనో లేదో నన్న భయం ఒక పక్క ఉన్నా, చిన్న పల్లెటూరి చర్చిలో క్లర్జీగా ఉండడం బాగానే ఉంటుందని అనిపించింది. కనుక "Pearson on the Creed" (మత ధర్మం గురించి పియర్సన్) పుస్తకం తో బాటు, మత సాంప్రదాయం గురించి తదితర పుస్తకాలు కూడా చదివాను. ఆ రోజుల్లో బైబిల్ చెప్పింది అంతా అక్షరాల నిజమని నమ్మేవాణ్ణి. కనుక మత ధర్మానికి అందరూ కట్టుబడి ఉండాలనే అభిప్రాయమే ఉండేది.
కనుక మత ఛాందస వాదులు నా మీద ఈ రోజుల్లో ధ్వజం ఎత్తడం చూస్తుంటే, నేనేనా ఒకప్పుడు క్లర్జీ అవుదాం అనుకున్నది అని నాకే ఆశ్చర్యం వేస్తుంది. కేంబ్రిడ్జ్ లో చదువు ముగించి, ప్రకృతి పరిశోధన మీద "బీగిల్" ఓడ మీద అడుగుపెట్టిన నాడే మత దీక్ష పుచ్చుకోవాలన్న నా సంకల్పం, మా నాన్నగారి అభీష్టం రేండూ భూస్థాపితం అయిపోయాయి. అయితే మతాధికారికి కావలసిన ఒక్క లక్షణం మాత్రం నాలో ఉంది. కొన్నేళ్ల క్రితం జర్మన్ మనస్తత్వ శాస్త్ర సమాజానికి చెందిన అధికారులు నా ఫోటో ఒకటి పంపమంటూ ఉత్తరం రాశారు. ఆ అరువాత ఆ సమాజం యొక్క సమావేశానికి చెందిన వ్యవహార పత్రిక (proceedings) కాపీ ఒకటి నాకు అందింది. ఆ పత్రికలో అచ్చయిన నా ఫోటోలో నా తల ఆకృతి గురించి ఆ సమాజంలో కొంత చర్చ జరిగిందట. ఉబికి వస్తున్న నా నుదుటిని బట్టి నాలో పది మంది మతాధికారులని కలబోసినంత సత్తా ఉందని ఎవరో అన్నార్ట!
ఇక ఎలాగూ మతాధికారి కావాలని అనుకున్నారు గనుక, విశ్వవిద్యాలయానికి వెళ్లి పట్టా పుచ్చుకోవాలని నిర్ణయించుకున్నాను. కాని బడి చదువులు ముగిశాక సాంప్రదాయక గ్రంథాలేవీ తెరిచిన పాపాన పోలేదు. పైగా ఈ రెండేళ్ల వారడిలో, ముందు నేర్చుకున్న ఆ నాలుగు ముక్కలు కూడా మర్చిపోయాను. గ్రీకు అక్షరాలు కూడా ఇప్పుడు సరిగ్గా గుర్తులేవు. కనుక సెమిస్టర్ మొదలయ్యే సమయానికి , అంటే అక్టోబర్ లో, కేంబ్రిడ్జ్ లో చేరలేదు. ష్రూ బరీ లోనే ప్రైవేటుగా కొంత కాలం చదువుకున్నాను. తరువాత, అంటే క్రిస్టమస్ సెలవల తరువాత 1828 సంవత్సరాది తరువాత కేంబ్రిడ్జ్ లో చేరాను. త్వరలోనే వెనకటి రోజుల్లో బళ్ళీ చదువుకునే రోజుల్లో ఉండే భాషా సామర్థ్యాన్ని తిరిగి సాధించాను. హోమర్ రచనలు, గ్రీకులో రాసిన టెస్టమెంట్ మొదలైన పుస్తకాలు సులభంగా సమకాలీన ఇంగ్లీష్ భాషలో తర్జుమా చెయ్యగలిగేవాణ్ణి.
ఇక చదువు విషయానికి వచ్చేసరికి కేంబ్రిడ్జ్ లో గడిపిన మూడేళ్లూ వృథా అయ్యాయనే చెప్పాలి. ఏడినబర్గ్ లో బళ్లో జరిగిందే ఇక్కడా జరిగింది. 1828 వేసవిలో ఓ ప్రైవేటు మాస్టరు (వట్టి మొద్దు మనిషి) దగ్గర లెక్కలు నేర్చుకోవడం మొదలెట్టాను. ఆ చదువు మందకొడిగానే సాగింది. బీజగణితం పుస్తకంలో అన్నీ గజిబిజి చిహ్నాలే కనిపించి రోత పుట్టేది. కాని ఇప్పుడు ఆలోచిస్తే నా పద్ధతి తప్పని అనిపిస్తుంది. గణిత శాస్త్రానికి పునాది రాళ్లలాంటి ఆ భావ బీజాలని జీర్ణం చేసుకోకుండా నేను పెద్ద పొరబాటే చేశాను. ఎందుకంటే గణిత భావాలతో ప్రకృతిని మరింత లోతుగా అర్థం చేసుకోవచ్చని తరువాత తెలుసుకున్నాను. కనుక ఆ రంగంలో బొటాబొటి మార్కులతోనే పాసు అయ్యుంటాను. ఇక సాంప్రదాయ చదువులకి వచ్చేసరికి తప్పనిసరిగా హాజరు కావలసిన క్లాసులకి మాత్రం వెళ్లేవాణ్ణి. రెండవ ఏడు “Little-Go” పరీక్ష పాసు కావుడానికి ఒకటి, రెండు నెలలు చదవాల్సి వచ్చింది. ఇక బీ.ఏ. చివరి సంవత్సరం కనుక ఫైనలు పరీక్ష కోసం కొంచెం శ్రద్ధగా చదువుదాం అనుకున్నాను. బీ.ఏ. పరీక్ష పాసు కావడానికి ప్రొఫెసర్ పార్లే రాసిన "క్రైస్తవ మతానికి ఆధారాలు" , "నీతి శాస్త్రం" పుస్తకాలు చదవాలి. ఈ రెండు పుస్తకాలు బాగా చదివాను అనుకుంటా. ముఖ్యంగా "క్రైస్తవ మతానికి ఆధారాలు" పుస్తకం సాంతం అక్షరం పొల్లుపోకుండా రాయగలిగే వాణ్ణి. ఈ పుస్తకంలో తర్కం చదువుతుంటే యూక్లిడ్ జ్యామితి చదువుతున్న ఉత్సాహంగా ఉండేది. ఆ పుస్తకాలని పరీక్షల కోసం బట్టీ వేయకుండా, లోతుగా క్షుణ్ణంగా చదవడం నా మానసిక వికాసానికి ఎంతో ఉపకరించింది. పార్లీ రచనలలోని పూర్వసిద్ధాంతాల (premises) గురించి నేను పట్టీంచుకోలేదు. వాటిని సందేహించలేదు. నాకు అన్నిటికన్నా నచ్చింది అందులోని సుదీర్ఘమైన వాదనా క్రమం. సంవత్సరాంతం పరీక్షల్లో పార్లీ మీద పరీక్షలోను, యూక్లిడ్ మీద పరీక్షలోను బాగా రాయడం వల్ల, సాంప్రదాయక అధ్యయనాల లో కూడా నిలదొక్కుకోవడం వల్ల, 'హానర్సు స్థాయికి చేరకపోయినా, ఆ స్థాయి కన్నా కింద నుండే బడుగు వర్గం వారిలో ఉన్నత స్థానాన్నే పొందాను. సరిగ్గా జ్ఞాపకం లేదు గాని వాళ్లలో నా స్థానం ఐదో, పదో, పన్నెండో ఉన్నట్టు గుర్తు.
(ఇంకా వుంది)
ఎడింబర్గ్ లో రెండవ సంవత్సరం భౌగోళిక శాస్త్రం మీద, జంతు శాస్త్రం మీద ఉపన్యాసాలు విన్నాను. ఆ ఉపన్యాసాలు నాకు నిస్సారంగా అనిపించాయి. ఆ ఉపన్యాసాల వల్ల నేను నేర్చుకుంది ఒక్కటే. ఇక జన్మలో మళ్లీ భౌగోళిక శాస్త్రం మీద పుస్తకం ముట్టుకోకూడదని నిశ్చయించుకున్నాను. అయితే ఆ రంగం గురించి అప్పటికే నా మనసులో ఒక విధమైన తాత్వికమైన అవగాహన ఏర్పడింది. అప్పటికి రెండు, మూడేళ్ల క్రితమే ష్రాఫ్ షైర్ కి చెందిన కాటన్ అనే ఓ పెద్దాయన, రాళ్ల గురించి బాగా తెలిసిన ఆయన, ష్రూస్ బరీ కి దగ్గర్లో ఉన్న ఓ విచిత్రమైన పెద్దరాయి గురించి చెప్పాడు. కంబర్లాండ్, స్కాట్లాండ్ వరకు గాలించినా అలాంటి రాయి కనిపించదని అనేవాడు. అసలా ఆ రాయి అక్కడికి ఎలా వచ్చిందో ఎవరైనా చెప్పగలిగే లోపు యుగాంతం వచ్చేస్తుందని ధీమాగా చెప్పేవాడు. ఈ కథ నా మనసులో గాఢంగా ముద్ర పడిపోయింది. ఆ కథ గురించి ఎన్నో సార్లు ఆలోచించేవాణ్ణి. తరువాత ఒక సారి హిమశకలాలు (iceberg)లు ఇలాంటి బండలని ఒక చోటి నుండి మరో చోటికి ఎలా రవాణా చేస్తాయో చదివి, భౌగోళిక శాస్త్రం ఎంత అర్థవంతమైన, అందమైన శాస్త్రమో తెలుసుకుని అబ్బురపడ్డాను.
కాని ఇటీవలి కాలంలో, అంటే నాకు అరవై ఏడు ఏళ్ల వయసులో, అదే ప్రొఫెసర్ ఓ ఉపన్యాసం ఇవ్వగా విన్నాను. సాలిస్బరీ క్రెయిగ్స్ లో ఇచ్చిన ఆ ఉపన్యాసంలో ‘డైక్’ ల గురించి మాట్లాడాడు. ఆ డైక్ లకి అమిగ్డలాయిడ్ రాతి (గట్టిపడ్డ లావాలో గాలి బుడగలు చిక్కుకున్న రాయి) అంచులు ఉన్నాయి, లావా గట్టిపడగా మరింత కఠినంగా మారిన (indurated) స్తరాలు ఇరుపక్కలా ఉన్నాయి. నలుదిశలా అగ్నిపర్వత శిలలు (volcanic rocks) ఉన్నాయి. అలాంటి రాతిని పట్టుకుని అది పైనుండి దిగివచ్చి చీలికల్లో (fissures) కూరుకున్న అవక్షేపక (sediment) పదార్థం వల్ల ఏర్పడ్డ రాయి అంటాడే?! పైగా అంటాడూ… “ఇలాంటి రాయి భూగర్భంలోంచి కరిగిన దశలో పైకి తన్నుకొచ్చిన పదార్థం వల్ల ఏర్పడింది అని కొందరు అపోహపడుతుంటారు, పాపం!” అని విషయం సరిగ్గా తెలిసిన వారిని ఎత్తిపొడుస్తాడు.* ఇలాంటి ఉపన్యాసాలు విన్నప్పుడే భౌగోళిక శాస్త్రం జోలికి పోకూడదన్న నా సంకల్పం బలపడుతుంది.
(* చిన్న మాట – ఈ వాక్యం మూలంలో మొదట చదివినప్పుడు ఏమీ అర్థం కాలేదు. డా. రవికాంత్ అని ఐసర్ (కొల్కతా) లో పనిచేసే ఓ జియాలజిస్ట్ ని అడిగి సందేహనివారణ చేసుకున్నాక కొంచెం అర్థమయ్యింది. మూలంలోని వాక్యం ఇక్కడ ఇస్తున్నాను. బ్లాగర్లలో జియాలజీ గురించి పరిచయం ఉన్నవారికి దీని గురించి బాగా తెలియొచ్చు.
“Equally striking is the fact that I, though now only sixty-seven years old, heard the Professor, in a field lecture at Salisbury Craigs, discoursing on a trapdyke, with amygdaloidal margins and the strata indurated on each side, with volcanic rocks all around us, say that it was a fissure filled with sediment from above, adding with a sneer that there were men who maintained that it had been injected from beneath in a molten condition.”
- అనువాదకుడు)
ఈ ఉపన్యాసాలకి వెళ్లే రోజుల్లోనే మ్యూజియం క్యురేటర్ తో పరిచయం ఏర్పడింది. ఈ మక్ గిలివ్రే తదనంతరం స్కాట్లండ్ పక్షుల మీద ఓ అద్భుతమైన పుస్తకం రాశాడు. ఇతడితో ప్రకృతి చరిత్ర గురించి ఎన్నో ఆసక్తికరమైన చర్చలు జరిపాను. ఈయన నాకు కొన్ని అరుదైన గవ్వలు ఇచ్చాడు. ఆ రోజుల్లో నేను, మరీ అంత ఇదిగా కాకపోయినా, సముద్రపు గవ్వలు సేకరించేవాణ్ణి.
ఈ రెండేళ్లూ వేసం కాలం సెలవలు విలాసాలలోనే గడచిపోయాయి. అయితే ఎప్పుడూ చేతిలో ఏదో ఒక పుస్తకం ఉండేది. దాన్ని ఆసక్తిగా చదువుతూ ఉండేవాణ్ణి. 1826 లో నేను మరిద్దరు స్నేహితులతో ఉత్తర వేల్స్ ప్రాంతం అంతా కాలినడకన ప్రయాణం చేశాం. సగటున రోజుకి ముప్పై మైళ్ల దాకా నడిచేవాళ్లం. అప్పుడే ఒక రోజు స్నోడన్ కొండ కూడా ఎక్కాం. మరో సారి ఉత్తర వేల్స్ అంతా మా చెల్లెలి తో పాటు గుర్రం మీద యాత్ర చేశాం. మాతో పాటు ఒక పని వాడు బట్టలు మోస్తూ కూడా వచ్చాడు. ఇక శరత్ ఋతువు అంతా షూటింగ్ ఆటల్లోనే గడచిపోయింది. వుడ్ హౌస్ లో ష్రీ ఓవెన్ గారి ఇల్లు, అలాగే మాయర్ లో మా జోస్ మావయ్య ఇల్లు ఈ ఆటలకి నెలవు అయ్యాయి. షూటింగ్ అంటే నాకు ఎంత పిచ్చి ఉండేదంటే రాత్రి పడుకునే ముందు షూటీంగ్ బూట్లు నా తల పక్కనే పెట్టుకుని పడుకునే వాణ్ణి. ఉదయం లేవగానే ఒక్క క్షణం కూడా ఆలస్యం కాకుండా ఆ బూట్లు వేసుకుని, తుపాకీ పట్టుకుని పరుగెత్తేవాణ్ణి.
ఆ కాలంలో కొట్టిన ప్రతీ పిట్ట గురించి వివరంగా నా డైరీలో రాసుకున్నాను. ఒక రోజు వుడ్ హౌస్ లో ఓవెన్ పరివారంలో పెద్ద కొడుకైన కాప్టెన్ ఓవెన్, అతడి బావ మేజర్ హిల్ (ఇతడే తదనంతరం లార్డ్ బెర్విక్ అయ్యాడు) షూటింగ్ చేస్తున్నారు. వాళ్లు అంటే నాకు చాలా ఇష్టం. అయితే ఆ రోజు మాత్రం ఇద్దరూ నన్ను భలే బోల్తా కొట్టించారు. నేనో పిట్టని కొట్టిన ప్రతీ సందర్భంలోను ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు అప్పుడే వాళ్ల తుపాకిలో తూటా ఎక్కిస్తున్నట్టు నటిస్తూ, " ఆ పిట్ట నువ్వు కొట్టింది కాడు, నేనూ అదే సమయంలో కాల్చాను," అనడం మొదలెట్టారు. ఆటని చూడ్డానికి వచ్చిన మధ్యవర్తి కూడా వాళ్లనే సమర్ధించసాగాడు. అలా కొన్ని గంటల తరువాత చేసిన మోసం ఏమిటో చల్లగా చెప్పారు. నేను చాలా పిట్టలే కొట్టాను. కొట్టిన ప్రతీసారి నా చొక్కా కి తగిలించుకున్న ఒక దారంలో ఒక ముడి వేస్తూ వచ్చాను. కాని నా నేస్తాల మోసం వల్ల ఆ లెక్కలన్నీ గల్లంతు అయ్యాయి.
షూటింగ్ అంటే నాకు తెగ ఇష్టం ఉండేది! ఇలాంటి వ్యాపకం అంటే ఇష్టం ఉండడం గురించి మనసులో ఏదో మూల కొంచెం అపరాధ భావం ఉండేదేమో. షూటింగ్ బుద్ధి కుశలతకి, ఏకాగ్రతకి మంచి పరీక్ష అని నాకు నేనే సంజాయిషీ చెప్పుకునేవాణ్ణి. జంతువులని వేటాడాలంటే ఎంతో నైపుణ్యం కావాలి.
1826 లో శరత్తులో ఒక సారి మాయర్ కి వెళ్లినప్పుడు అక్కడ సర్ జె. మాకింటాష్ తో పరిచయం ఏర్పడింది. ఆయన గొప్ప మాటకారి. అలాంటి మాటకారిని నేను మరెక్కడా చూడలేదు. ఒక సారి ఎవరితోనో నా గురించి "ఆ కుర్రవాడిలో ఏదో ప్రత్యేకత ఉంది," అన్నాట్ట. బహుశ ఆయన అన్న ప్రతీ మాటని చెవులు రిక్కించి వింటాను గనుక అలా అని వుంటాడు. చరిత్ర, రాజకీయం, నైతికత మొదలుగా ఆయన మాట్లాడిన అంశాల గురించి అంత వరకు నాకు అసలేమీ తెలీదు. ప్రముఖుల పొగడ్త వల్ల కొంచెం గర్వం పెరిగే ప్రమాదం లేకపోలేదు. కాని యవ్వనంలో ఉన్న వ్యక్తి కి అలాంటి మెచ్చుకోలు మంచి చేస్తుందని, సన్మార్గంలో నడిచే స్ఫూర్తి నిస్తుందని అనిపిస్తుంది.
ఈ శరత్కాల షూటింగ్ విలాసాలని పక్కన పెట్టినా, మాయర్ లో నేను ఉన్న రోజులు చాలా సరదాగా గడిచిపోయాయి. ఏ బాదర బందీలు లేని జీవితం. పగలంతా షికార్లలో, స్వారీలలో సాగిపోయేది. ఇక సాయంత్రాలు ఆసక్తికరమైన సంవాదాలలో, సంభాషణలలో, కమ్మని సంగీతం జోడైన విందుల్లో, విలాసాలలో గడచిపోయేవి. ఇక వేసవిలో అయితే సాయంత్రాలు ఇంటిల్లిపాదీ పాత పోర్టికో మెట్ల మీద కూర్చునేవాళ్లం.
ఎదురుగా పూలతోట. అల్లంత దూరంలోని చెరువులో, ఏటికి అవతల గట్టున ఉన్న అడవి ప్రతిబింబం కనిపిస్తూ ఉంటుంది. ఉండుండి ఓ చేప నీటి బయటికి తలెత్తి ఆకాశం కేసి చూసి మళ్లీ బుడుంగున మునుగిపోతుంది. లేదా ఓ బాతు తన వెడల్పైన పాదాలతో నీళ్లు తోసుకుంటూ పరధ్యానంగా నీటి మీద విహరిస్తూ ఉంటుంది. మాయర్ లో గడిపిన ప్రశాంత సాయం సమయాలు నా మనసులో ఎంత గాఢమైన ముద్ర వేశాయో చెప్పలేను.
మా జోస్ మామయ్య అంటే నాకు చాలా ఇష్టం ఉండేది. ఆయన మితభాషి అయినా నాతో కొన్ని సార్లు మనసు విప్పి మాట్లాడేవారు. చాలా ముక్కుసూటి మనిషి. ఫలానా పద్ధతి సరైన పద్ధతి అని ఒకసారి ఆయనకి నమ్మకం కుదిరింది అంటే ఇక ప్రపంచంలో ఏ శక్తీ ఆయన మార్గాన్ని మళ్లించలేదు. ఇప్పుడు నాకు సరిగ్గా గుర్తులేదు గాని "హోరేస్ ప్రశంస" లో "nec vultus tyranni etc." మొదలైన వర్ణన ఆయనకి చక్కగా సరిపోతుందని ఎన్నో సార్లు అనుకున్నాను. (Justum et tenacem propositi virum Non civium ardor prava jubentium Non vultus instantis tyranni Mente quatit solida.)
(అధ్యాయం సమాప్తం)
ఈ ప్లైనియన్ సమాజాన్ని స్థాపించి పోషించింది ప్రొఫెసర్ జేంసన్ అని విన్నాను. దీని సభ్యులలో ఎక్కువగా విద్యార్థులే ఉండేవారు. వీళ్లంతా ప్రకృతి విజ్ఞానం మీద పత్రాలు చదువుకోడానికి, వాటిని చర్చించుకోడానికి విశ్వవిద్యాలయంలో ఓ నేలమాళిగ గదిలో సమావేశం అవుతూ ఉండేవారు. ఈ సమావేశాలని నేను క్రమం తప్పకుండా హాజరు అవుతూ ఉండేవాణ్ణి. వీటి వల్ల ప్రకృతి విజ్ఞానం మీద నా ఆసక్తి మరింత బలపడింది. ఈ ఉత్సాహంలో పాలు పంచుకునే పలువురు స్నేహితులు కూడా ఏర్పడ్డారు.
ఆ మనిషికి ముచ్చెమటలు పోస్తున్నాయి, పెదాలు తడారిపోతున్నాయి. కంఠం వణుకుతోంది. చివరికి ఎలాగో ధైర్యం తెచ్చుకుని, "అధ్యక్షా! ఇంతకీ నేను చెప్పదలచుకున్నది ఏంటో మర్చిపోయాను," అన్నాడు. కుర్రాడు పాపం భలే బెంబేలు పడ్డాడు. ఆ సంఘటనకి సభ్యులంతా అవాక్కయ్యారు. ఏం మాట్లాడాలో తెలీక అంతా మౌనంగా ఉండిపోయారు. మా చిన్నారి సమాజంలో మేం చదివిన పత్రాలు ఎక్కడా అచ్చయ్యేవి కావు. కనుక నేను చదివిన పత్రాలు అచ్చులో చూసుకోవాలని సరదా నాకు తీరనేలేదు. అయితే డా గ్రాంట్ ఫ్లస్ట్రా మీద రాసిన గ్రంథంలో నా బుల్లి ఆవిష్కరణ గురించి ప్రస్తావించారని విన్నాను.
రాయల్ వైద్య సమాజంలో కూడా నేను సభ్యుడిగా ఉండేవాణ్ణి. ఆ సమావేశాలని కూడా క్రమం తప్పకుండా హాజరు అవుతూ వచ్చాను. అయితే అక్కడ చర్చాంశాలు మరీ ఎక్కువగా వైద్య రంగానికి సంబంధించినవి కావడంతో మెల్లగా వాటి మీద నా ఉత్సాహం తగ్గింది. పైగా ఆ సమావేశాలలో బోలెడంత చెత్త మాట్లాడుతూ ఉండేవారు. అయితే కొందరు మంచి వక్తలు కూడా ఉండేవారు. నన్నడిగితే వాళ్లందరిలోకి శ్రేష్ఠుడు సర్ జే. కే-షటిల్వవర్త్. డా గ్రాంట్ నన్ను అప్పుడప్పుడు వెర్నెరియన్ సమాజపు సమావేశాలకి కూడా తీసుకు వెళ్లేవారు. ఇక్కడ జీవ చరిత్ర గురించిన పత్రాలు చదివి, చర్చించేవారు. ఆ పత్రాలని తరువాత "ట్రాన్సాక్షన్స్" లో ప్రచురితం అయ్యేవి. ఆ సమావేశాలలోనే ఉత్తర అమెరికా కి చెందిన పక్షుల అలవాట్ల గురించి ఆడుబాన్ మంచి ఆసక్తికరమైన ఉపన్యాసాలు ఇవ్వగా విన్నాను. అయితే ఆ ఉపన్యాసాలలో అతగాడు వాటర్టన్ యొక్క పరిశోధనలని అన్యాయంగా విమర్శించడం కూడా విన్నాను. మరో విషయం ఏంటంటే ఎడినబర్గ్ లో నాకు తెలిసిన ఓ నల్లవాడు ఉండేవాడు. ఈ పెద్ద మనిషి వాటర్టన్ తో బాటు తన యాత్రలలో కూడా వెళ్లేవాడు. చచ్చిన పక్షులని పూరించి, బొమ్మలు చేసి పొట్టపోసుకునేవాడు. ఆ బొమ్మలు మాత్రం అద్భుతంగా ఉండేవి. కొద్ది పాటి ఫీసు పుచ్చుకుని ఆ కళలన్నీ నాక్కూడా నేర్పించేవాడు. ఇతనితో ఎన్నో సార్లు కూర్చుని కాలక్షేపం చేసేవాణ్ణి. చాలా మంచి వాడు, తెలివైన వాడు.
లియొయార్డ్ హార్నర్ ఒకసారి నన్ను ఎడింబర్గ్ లో రాయల సొసయిటీ సమావేశానికి నన్ను తీసుకెళ్లాడు. ఆ రోజు సభకి అధ్యక్షుడిగా సర్ వాల్టర్ స్కాట్ ఆ పదవిని స్వీకరిస్తూ అంత ప్రముఖ స్థానానికి తాను తగను అంటూ మాట్లాడాడు. ఆయన్ని, ఆ దృశ్యాన్ని సంభ్రమాశ్చర్యాలతో చుస్తూ ఉండిపోయాను. యవ్వన దశలో ఇలా ఈ సమాజానికి, అలాగే రాయల్ వైద్య సమాజానికి హాజరు కావడం వల్ల, ఎన్నో ఏళ్ల తరువాత ఈ రెండు సమాజాలకి గౌరవ సభ్యుడిగా ఎన్నిక కావడం, నేను పొందిన మరే ఇతర గౌరవం కన్నా కూడా మిన్నగా భావిస్తాను. ఆ రోజు అలాంటి గౌరవం నాకు నా జీవితంలో ఎప్పుడో లభిస్తుందని ఎవరైనా చెప్తే ససేమిరా నమ్మేవాణ్ణి కాను. నేను ఇంగ్లాండ్ కి రాజు నవుతానని అనడం ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో ఇదే అంతే.
(ఇంకా వుంది)
ఎడింబర్గ్ లో బోధన అంతా ఉపన్యాసాల మీదుగానే జరిగేది. ఒక్క ప్రొఫెసర్ హోప్ రసాయన శాస్త్రంలో చేప్పే ఉపన్యాసాలు తప్ప తక్కిన వాళ్ల ఉపన్యాసాలు మహా బోరుగా ఉండేవి. స్వాధ్యాయంతో పోల్చితే ఉపన్యాసాల వల్ల లాభాల కన్నా నష్టాలే ఎక్కువ అని నా అభిప్రాయం. చలికాలంలో ఉదయం ఎనిమిది గంటలకి "ఔషధ గుణ బోధిని" (మెటీరియా మెడికా) మీద డాక్టర్ డంకన్ ఇచ్చే ఉపన్యాసాలని తలచుకుంటేనే భయం వేస్తుంది. అలాగే డాక్టర్ --- దేహనిర్మాణ శాస్త్రం మీద ఇచ్చే ఉపన్యాసాలు ఆయన లాగే కళావిహీనంగా ఉండేవి. ఆ విధంగా శవ పరిచ్ఛేదాల పట్ల జుగుప్స బలపడటం నా జీవితంలో ఒక గొప్ప దురదృష్టం అని భావిస్తాను. కాని ఎలాగో ఆ జుగుప్సని దిగమింగుకుని పరిచ్ఛేదాల పట్ల శ్రద్ధ చూబించి ఉంటే బావుండేది. ఆ కౌశలం భవిష్యత్తులో నా పరిశోధనలలో ఎంతో ఉపకరించేది. దీనికి తోడు నాలో బొమ్మలు వేసే సామర్థ్యం కూడా కొంచెం బలహీనంగానే ఉండేది. ఆసుపత్రిలో కూడా క్లినికల్ వార్డులలో క్రమం తప్పకుండా హాజరు అవుతూ ఉండేవాణ్ణి. అక్కడ కొన్ని కొన్ని కేసులు నన్ను చాలా కదిలించేవి. కొన్ని అయితే ఇప్పటికీ స్పష్టంగా గుర్తున్నాయి. కేసులు నచ్చలేదని హాజరు కావడంలో మాత్రం క్రమం తప్పలేదు. వైద్య రంగంలో ఈ అంశం మీద నాకు మరింత బలమైన ఆసక్తి ఎందుకు కలగలేదో నాకు ఇప్పటికీ అర్థం కాదు.
కేంబ్రిడ్జ్ నుండి బయట పడటానికి ముందు, ఒక వేసవిలో ష్రూస్ బరీకి చెందిన పేద రోగులకి, ముఖ్యంగా స్త్రీలకి, పిల్లలకి, చికిత్స చేయటం మొదలెట్టాను. నేను చూసిన కేసులు, రోగ లక్షణాలు అన్నీ వివరంగా రాసి, మా నాన్నగారికి చదివి వినిపించేవాణ్ణి. అది విని ఆయన కొన్ని మర్పులు చేర్పులు సూచించేవారు. ఏం చికిత్స చెయ్యాలో, ఏం మందులు ఇవ్వాలో చెప్పేవారు. ఒక దశలో అయితే నా సంరక్షణలో ఓ డజను రోగుల దాకా ఉండేవారు. క్రమంగా వైద్యం పట్ల నా ఆసక్తి పెరిగింది. మనుషుల స్వభావాన్ని కచ్చితంగా అంచనా వెయ్యటంలో దిట్ట అయిన మా నాన్నగారు ఒక రోజు నేను వైద్యుణ్ణి కావాలాని ఆయనే తేల్చిచెప్పేశారు. నేను వైద్య వృత్తిలో బాగా పైకి వస్తానట. ఆ మాటకి అర్థం నా వద్దకి చికిత్స కొసం బోలెడు మంది రోగులు వస్తారన్నమాట! వైద్యుడిలో ముఖ్య లక్షణం రోగి ఆత్మవిశ్వాసాన్ని పెంచగలగడం. నాలో ఏం చూసి ఆయన అలా అనుకున్నారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఎడింబర్గ్ ఆసుపత్రిలో రెండు సందర్భాలలో ఆపరేషన్ థియేటర్ లో శస్త్ర చికిత్స జరుగుతుంటే హాజరు అయ్యాను. ఆ రెండు ఆపరేషన్లు చాలా దారుణంగా చేసినవే. రెండిట్లో ఒకటి ఓ పసి వాడి మీద చేసినవి. కాని అది పూర్తి అయ్యే లోపే అక్కణ్ణుంచి పారిపోయాను. మళ్లీ ఎప్పుడు ఆపరేషన్ థియేటర్ ముఖం చూడలేదు. ఆపరేషన్ థియేటర్ దిక్కుగా నా దారి మళ్లించగల శక్తి ఈ భూమి మీద లేదని అనిపించింది. అవి ఇంకా క్లోరోఫారం వాడుకలో లేని రోజులు. ఆ రెండు కేసులు ఓ ఏడాది పాటు నా మనసులో రేపిన కల్లోలం ఇంతా అంతా కాదు.
విశ్వవిద్యాలయంలో మా అన్నయ్య ఒక ఏడాది కాలం మాత్రమే ఉన్నాడు. కనుక మరుసటేడు నేను ఒక్కణ్ణీ అయిపోయాను. దీని వల్ల కొన్ని లాభాలు లేకపోలేదు. ప్రకృతి విజ్ఞాన శాస్త్రం అంటే మక్కువ ఉన్న ఎంతో మంది యువకులతో పరిచయం ఏర్పడింది. వారిలో ఒకడు ఐన్స్ వర్త్. ఇతగాడు తదనంతరం తన అసీరియా యాత్రలని పుస్తక రూపంలో ప్రచురించాడు. ఇతడు వెర్నెర్ సాంప్రదాయానికి చెందిన భౌగోళిక శాస్త్రవేత్త కూడా. పలు రంగాల్లో ఇతడికి ప్రవేశం ఉంది. అలా పరిచయం అయిన మరొక డాక్టర్ కోల్డ్ స్ట్రీం. ఇతడి తీరు వేరు. ఎప్పుడూ హుందాగా, మర్యాదగా ఉంటాడు. దైవభక్తి మెండు. మృదువైన మనస్తత్వం గలవాడు. తదనంతరం జంతు శాస్త్రం మీద మంచి వ్యాసాలు ప్రచురించాడు. ఇక మూడవ వ్యక్తి పేరు హార్డీ. ఇతగాడు మంచి వృక్షశాస్త్రవేత్త అయ్యుండేవాడు. కాని ఇండియాలో ఉండే రోజుల్లో తొందరగానే మరణించాడు. చివరిగా డాక్టర్ గ్రాంట్. ఇతడు నాకు ఎన్నో ఏళ్లు సీనియర్. అసలు నాకు ఎలా పరిచయం అయ్యాడో గుర్తులేదు.
జంతు శాస్త్రంలో ఇతడు కొన్ని బ్రహ్మాండమైన వ్యాసాలు ప్రచురించాడు. కాని లండన్లో యూనివర్సిటీ కాలేజ్ లో ప్రొఫెసర్ గా చేరిన తరువాత కొత్తగా ఏ పరిశోధనలూ చెయ్యలేదు. అలా ఎందుకు జరిగిందో ఇప్పతికీ నాకు అర్థం కాదు. పైకి చూడడానికి కాస్త జడంగా కనిపిస్తాడు గాని ఆ పై పొరకి అడుగున విజ్ఞానం పట్ల అపారమైన ఉత్సాహం ఉన్నవాడు. అతడు ఒకరోజు ఇద్దరం కలిసి నడిచి వెల్తుంటే, లామార్క్ గురించి, అతడి పరిణామ సిద్ధాంతం గురించి ఉత్సాహంగా సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చాడు. అతడు చెప్పిన విషయాలని ఆశ్చర్యంగా వింటూ ఉండిపోయాను. కాని ఆ మాటలకి నా మనసు మీద ఏ ప్రభావమూ లేదని అనిపించింది. నేను అంతకు ముందు మా తాతగారు రాసిన "జూనోమియా" (జంతువుల నామకరణం) అన్న పుస్తకాన్ని చదివాను. అందులో కూడా ఇలాంటి భావాలే వ్యక్తం చెయ్యబడ్డాయి. ఆ భవాలకి కూడా నా మనసుమీద ఏ ప్రభావమూ ఉన్నట్టు అనిపించలేదు. నా జీవితంలో తొలి దశల్లో అలాంటి భావాలని విని ఉండటం వల్ల, అవి కీర్తింపబడటం విని ఉండటం వల్ల, తదనంతరం నేను రాసిన "జీవ జాతుల ఆవిర్భావం" (Origin of Species) అన్న పుస్తకంలో ఆ భావాలనే సమర్ధించడం జరిగిందేమో ననిపిస్తుంది. ఆ రోజుల్లో జూనోమియా అంటే నాకు గొప్ప ఆరాధన ఉండేది. కాని ఓ పది పదిహేను ఏళ్ల వారడి తరువాత మళ్లీ ఆ పుస్తకం చదివినప్పుడు చాలా నిరాశ చెందాను. అందులో వాస్తవాల కన్నా ఊహాగానం పాలు ఎక్కువగా ఉన్నట్టు అనిపించింది.
(ఇంకా వుంది)
నేను బళ్లో చదువుకునే తొలి దశల్లో ఒక అబ్బాయి వద్ద "ప్రపంచంలో వింతలు" అన్న పుస్తకం చూశాను. ఆ పుస్తకం ఎన్నో సార్లు చదివాను. అందులో పేర్కొనబడ్డ కొన్ని విషయాలు నిజం కావని నా తోటి పిల్లలతో వాదించడం కూడా బాగా గుర్తు. ఆ పుస్తకం చదివాకే ప్రపంచంలో సుదూర ప్రాంతాలకి ప్రయాణించాలన్న ఆశ నాలో చిగురించింది. ఆ ఆశే బీగిల్ ఓడలో నేను చేసిన మహాయాత్రగా సాకారం చెందింది. బడిలో చివరి దశలలో షూటింగ్ అంటే చాలా మక్కువ ఏర్పడింది. తుపాకీతో పిట్టలు కొట్టడంలో నేను చూబించిన అంకిత భావం ప్రపంచం మరెవరూ ఏ రంగంలోనూ ప్రదర్శించి ఉండరేమో. మొట్ట మొదటి సారి ఓ పక్షిని కొట్టినప్పుడు ఆ ఉద్వేగంతో నా చేతులు ఎంత వణికాయి అంటే, తుపాకిలో మళ్లీ తూటా ఎక్కించడం కూడా కష్టమయ్యింది. ఈ వ్యాపకం చాలా కాలం ఉంది. కొంత కాలానికి తుపాకి ప్రయోగం లో మంచి గురి వచ్చింది.
షూటింగ్ లో మరో ఆట కూడా ఆడేవాళ్లం. ఒక స్నేహితుణ్ణి పిలిచి వెలిగించిన కొవ్వొత్తుని పట్టుకుని గాల్లో మెల్లగా అటుఇటూ ఊపమనేవాణ్ణి. బులెట్ మీద ఒక తొడుగు వేసి దీపాన్ని కొట్టాలి. గురి సరిగ్గా ఉందంటే బుల్లెట్ పేలినప్పుడు పుట్టిన గాలి విస్ఫోటానికి దీపం ఆరిపోతుంది. అయితే ఆ పేలుడు జరిగినప్పుడు ఠాప్ అని కొరడా దెబ్బలా పెద్ద చప్పుడు అయ్యేది. ఈ విషయం గురించి మా కాలేజిలో ఓ టీచరు ఇలా అన్నాడు. "ఈ డార్విన్ భలే చిత్రమైన మనిషిలా ఉన్నాడు. రోజూ తన గదిలో గుర్ర కొరడా పట్టుకుని ఊరికే ఝళిపిస్తూ ఉంటాడు. తన గది పక్క నుండి వెళ్తుంటే ఎప్పుడూ చప్పుళ్లు వినిపిస్తుంటాయి."
బళ్లో ఎంతో మంది మంచి స్నేహితులు ఉండేవాళ్లు. ఆ రోజుల్లో అందరితో చాలా అభిమానంగా ఉండేవాణ్ణి కాబోలు.
ఇక విజ్ఞానం విషయానికి వస్తే ఖనిజాలని సేకరించడం కొనసాగించాను గాని ఆ సేకరణ కొంచెం అవైజ్ఞానికంగా చేసేవాణ్ణి. ఏ కొత్త ఖనిజం కనిపించినా తెచ్చి దాచుకునేవాణ్ణి గాని వాటిని పెద్దగా వర్గీకరించే ప్రయత్నం చెయ్యలేదు. పురుగులని కూడా ఎంతో కొంత శ్రద్ధతో పరిశీలించే వాణ్ణేమో. నాకు పదేళ్లప్పుడు 1819లో వేల్స్ సముద్ర తీరం మీద ఉన్న ప్లాస్ ఎడ్వర్డ్స్ అనే చోట మూడు వారాలు గడిపాను. అక్కడ ఒకసారి నలుపు, సింధూరం రంగులు కలిసిన, hemiptera జాతికి చెందిన, ఓ పెద్ద పురుగు నన్ను బాగా ఆకర్షించింది. ఎన్నో మిడుతలు (జైగానియా జాతికి చెందినవి) కూడా కనిపించాయి.
ఇక ఆ నాటి నుండి చచ్చి పడి ఉన్న ప్రతీ పురుగునీ సేకరించడం ప్రారంభించాలని గట్టిగా సంకల్పించాను. ఎందుకంటే సేకరణ కొసం పురుగులని చంపటం తప్పని మా అక్క చెప్పింది. వైట్ రాసిన 'సెల్బోర్ణ్ అన్న పుస్తకం చదివాక పక్షుల దినచర్యని, అలవాట్లని పరిశీలించడం మీద మక్కువ పెరిగింది. నా పరిశీలనల ఆధారంగా కొంత నోట్సు కూడా తీసుకున్నాను. ఆ వ్యాపకం నాకు ఎంతగా నచ్చిందంటే పుట్టిన ప్రతీ మనిషి పక్షిశాస్త్రవేత్త ఎందుకు కాలేదబ్బా అని అమాయకంగా ఆలోచించేవాణ్ణి.
స్కూలు దశలో చివరి రోజుల్లో అనుకుంటా మా అన్నయ్య మా ఇంటి పెరట్లో ఉండే పనిముట్ల గదిలో ఒక భాగాన్ని ఒక చక్కని రసాయన ప్రయోగశాలగా తీర్చిదిద్దాడు. రసాయన ప్రయోగాలకి కావలసిన నానా రకాల సరంజామా అందులో ఏర్పాటు చేశాడు. రకరకాల వాయువులు, ఇతర సంయోగాలు అందులో తయారుచేసేవాడు. అప్పట్నుంచి రసాయన శాస్త్రం మీద రాసిన ఎన్నో పుస్తకాలు (ఉదాహరణకి హెన్రీ, మరియు పార్క్స్ రాసిన "కెమికల్ కటెచిసం" (రసాయన బోధిని) మొదలైనవి) తెచ్చి శ్రద్ధగా చదివాను.
ఈ శాస్త్రం నాకు ఎందుకో బాగా నచ్చింది. అర్థ రాత్రి దాటాక కూడా ఆ ప్రయోగశాలలో ఏవో ప్రయోగాలు చేస్తూ ఉండిపోయేవాళ్లం. స్కూల్లో నేను చదివిన చదువుకి ఇది పరాకాష్ట అనుకోవాలి. ఎందుకంటే బడిలో నేను సైద్ధాంతికంగా తెలుసుకున్న దాన్ని ఇక్కడ ప్రయోగాత్మకంగా అర్థం చేసుకో గలుగుతున్నాను. మేము రసాయన ప్రయోగాలు చేస్తున్నామన్న వార్త ఎలాగో స్కూలంతా పొక్కింది. అది చాలా అపురూపమైన విషయం కాబోలు. అందుకు గుర్తుగా నాకు "గ్యాస్" అని పేరు కూడా పెట్టారు. అంతే కాదు. స్కూలు హెడ్ మాస్టరు డాక్టర్ బట్లర్ ఒక సారి అలాంటి పనికి మాలిన పనులు చేస్తున్నందుకు అందరి ముందూ చీవాట్లు పెట్టారు. నేను వట్టి "పోకో క్యురాంటే" నని కూడా అన్యాయంగా తిట్టాడు!
ఆ మాటకి అర్థం నాకు తెలీదనుకోండి. కాని అదేదో పెద్ద తిట్టులా అనిపించింది అప్పుడు.
బడిలో నేను పెద్దగా వెలగపెడుతున్నది ఏమీ లేదని గుర్తించి కాబోలు, మా నాన్నగారు మామూలుగా కన్నా ముందే నన్ను బళ్లోంచి బయటకి తిసి, మా అన్నతో బాటు ఎడింబర్గ్ విశ్వవిద్యాలయంలో పడేశారు (అక్టోబర్, 1825 లో). అక్కడ ఓ రెండేళ్లు గడిపాను. మా అన్నయ్య వైద్య విద్య పూర్తి చేసే సమయానికి (తనకి వైద్యుడిగా పనిచేసే ఉద్దేశం ఉందని అనుకోను) నా వైద్య శిక్షణ ఆరంభం అయ్యింది. ఈ దశ తరువాత కొన్ని చిన్న చిన్న సంఘటనల వల్ల, మాకు వారసత్వంగా బోలెదంత ఆస్తి రాబోతుందని అర్థమయ్యింది. అలా దక్కిన పిత్రార్జితంతో జీవితం సాఫీగా వెళ్లిపోతుందన్న ధైర్యం వచ్చింది. కాని ఇలా ఐశ్వర్యవంతుణ్ణి అవుతానని మాత్రం నేను ఎప్పుడూ అనుకోలేదు. ఏదేమైనా ఉచితంగా ఆస్తి వస్తుందన్న నమ్మకం, వైద్యం చదువుకి సరిపోయేటంతగా కష్టపడకుండా అడ్డుపడింది.
(ఇంకా వుంది)
చిన్నప్పట్నుంచి కూడా నాకు సున్నితమైన, ఉదారమైన స్వభవం ఉండేదట. ఆ లక్షణం నాకు మా అక్క చెళ్లెళ్ల నుండి, వాళ్ల శిక్షణ వల్ల వచ్చి ఉంటుందని అనుకుంటాను. ఇది స్వతహాగా నాలో ఉండే లక్షణం అయ్యుండదు. నాకు పక్షి గుడ్లు సేకరించడం అంటే చాలా ఇష్టం ఉండేది. అయితే ఎప్పుడు తీసినా గూడు లోంచి ఒక్క గుడ్డే తీసేవాణ్ణి. అయితే ఒక్క సారి మాత్రం గూడులో ఉన్న గుడ్లన్నీ తీసేసాను. ఆ గుడ్ల విలువ దృష్టిలో పెట్టుకుని కాదు, ఏదో దుడుకుతనం వల్ల అలా చేశానని అనిపిస్తుంది.
ఎర వేసి చేపలు పట్టటం అంటే నాకు చాలా ఇష్టం ఉండేదట. ఏటి గట్టునో, నదీ తీరం లోనో గంటల తరబడి ఎర కోసం వచ్చే చేప కోసం ఓపిగ్గా ఎదురు చూస్తూ కూర్చునేవాణ్ణట. మాయర్ మామయ్య ఇంట్లో ఒకసారి ఎవరో ఉప్పు, నీరు కలిపి పురుగులని చంపొచ్చని చెప్పారు. అప్పట్నుంచి సజీవంగా ఉండే పురుగుల్ని ఎప్పుడూ ఎరగా వాడలేదు. అప్పట్నుంచి ఎరకి చిక్కే చేపల సంఖ్య కూడా తగ్గింది అనుకోండి. అది వేరే విషయం.
ఆ బడికి వెళ్లే రోజుల్లోనే ననుకుంటా, ఒకసారి నేను క్రూరంగా ప్రవర్తించాను. ఓ చిన్న కుక్కపిల్లని కొట్టాను. దాని కన్నా నేను బలవంతుణ్ణని దాని మీద నా ప్రతాపం చూపించుకోవడానికి కొట్టి ఉంటాను. అయితే దెబ్బలు మరీ అంత గట్టిగా తగిలి ఉండవు. ఎందుకంటే అది కుయ్యో మొర్రో అనలేదు. కాని ఈ సంఘటన నా మనసులో గాఢంగా ముద్ర పడిపోయింది. ఎందుకంటే ఈ ఘోరకృత్యం ఎక్కడ జరిగిందో కూడా నాకు బాగా గుర్తుంది. సహజంగా నాకు కుక్కలు అంటే చాలా ఇష్టం ఉండడంతో ఈ జ్ఞాపకం మోయరాని భారం అయ్యింది. ఈ విషయాన్ని కుక్కలు కూడా పసిగట్టినట్టు ఉన్నాయి. అవును మరి, యజమానుల పట్ల వాటికి ఉండే ప్రేమని తుంచి వెయ్యడంలో నేను ఘటికుణ్ణి కదా?!
మిస్టర్ కేస్ బడిలో ఉన్న ఆ ఏడాదిలో నాకు మరొక్క సంఘటన మాత్రం స్పష్టంగా గుర్తుంది. చనిపోయిన ఒక సిపాయికి ఆఖరు సంస్కారాలు చేసిన సంఘటన అది. ఆ సిపాయి వేసుకున్న బూట్లు, వాడిన తుపాకి ఓ గుర్రానికి తగిలించి తెచ్చారు. అతడి సమాధి వద్ద అతడి గౌరవార్థం తుపాకులు పేల్చారు. ఆ దృశ్యం నన్ను బాగా కదిలించి నాలో ఏ మూలో ఉన్న కవిని మేల్కొలిపింది.
1818 వేసవిలో ష్రూ బరీ లోనే ఉన్న డాక్టర్ బట్లర్ గారి బళ్లో నన్ను చేర్పించారు. 1825 దాకా, అంటే నాకు పదహారు వచ్చిందాక, ఓ ఏడేళ్ల పాటు అక్కడే నా చదువు సాగింది. ఇది రెసిడెన్షియల్ బడి కనుక అక్కడే ఉండేవాణ్ణి. ధైర్యంగా, స్వతంత్రంగా వికాసం చెందడానికి ఇదొక మంచి అవకాశం అనిపించింది. కాని బడికి ఇంటికి మధ్య పట్టుమని మైలు దూరం కూడా ఉండక పోవడంతో తోచినప్పుడల్లా ఇంటికి పరుగెత్తి పోతూ ఉండేవాణ్ణి. అందుచేత ఇంట్లో మా వాళ్ల ప్రేమాభిమానాలకి ఎప్పుడూ దూరం అయినట్టు పెద్దగా అనిపించలేదు. స్కూలు దశలో, తొలి రోజుల్లో వేళ మించిపోకుండా ఉండడానికి వేగంగా పరుగెత్తాల్సి వచ్చేది. పరుగు పందేలు అలవాటు ఉన్నవాణ్ణి కనుక సమయానికి గమ్యం చేరే వాణ్ణి. కాని చేరలేనేమో అని అనుమానం వచ్చినప్పు దేవుణ్ణి ప్రార్థించేవాణ్ణి. అప్పటుంచి నా విజయాలకి కారణం నా పరుగు వేగం కదని, అనుగ్రహమే నని గుర్తుంది.
నాకు బాగా చిన్నప్పట్నుంచి కూడా ఏకాంతంగా షికార్లకి వెళ్ళే అలవాటు ఉండేదని మా నాన్నగారు, అక్క అంటూ ఉంటారు. అలా నడిచే సమయంలో ఏం ఆలోచించేవాణ్ణో మరి నాకైతే గుర్తు లేదు. అయితే పరధ్యానంగా నడిచే వాణ్ణేమో, ఓ సారి బడికి వెళ్లే దారిలో ఓ ఎత్తైన ఫుట్పాత్ మీద నడి వెళ్తుంటే కాలు జారి పుట్పాత్ అవతలి అంచు మీంచి కింద పడ్డాను. ఏడు, ఎనిమిది అడుగుల ఎత్తు నుంచి పడ్డానేమో. కాని ఆ పడుతున్న కాస్తంత సమయంలో నా మనసు లోంచి ఎన్ని ఆలోచనలు ప్రవహించాయో చెప్పలేను. ఒక్కొక్క ఆలోచనకి కొంత నిర్ణీత సమయం పడుతుందని బోధించే జివశాస్త్రవేత్తలు అంటుంటారు. కాని మరి నా అనుభవం వాళ్లు చెప్పేదానికి విరుద్ధంగా ఉన్నట్టు అనిపించింది.
నా మానసిక వికాసానికి డా బట్లర్ గారి బడి కన్నా చేటు కలిగించేది మరేదీ లేదు. పూర్తిగా సాంప్రదాయ బద్ధమైన, ఛాందసమైన విషయాలు తప్ప మరేమీ నేర్పరు. మహా అయితే కాస్తంత ప్రాచీన భౌగోళిక శాస్త్రం, కొంచెం చరిత్ర నేర్పుతారేమో అంతే. స్కూలు నుండి నేను నేర్చుకున్న చదువు ఓ పెద్ద సున్నా అని చెప్పొచ్చు. నా జీవితంలో కొత్త భాషలు నేర్చుకునే ప్రతిభ పెద్దగా లేదని అనిపించింది. పద్య రచనలో కొంత శిక్షణ ఉన్నా అది కూడా సరిగ్గా చెయ్యలేక పోయేవాణ్ణి. నాకు బోలెడు మంది నేస్తాలు ఉండేవాళ్లు. అందరం కలిసి ఎన్నో పాత కవితలు సేకరించే వాళ్ళం. ఈ కవితల్లో వాక్యాలని వేరు చేసి, కొత్త విన్యాసాలలో కూర్చి, ఏ అంశం మీద కావలిస్తే ఆ అంశం మీద కవిత్వం చెప్పగలిగే వాళ్లం. ముందు రోజు నేర్చుకున్న పాఠాన్ని బట్టీ పట్టమని బళ్లో బలవంతం చేసేవాళ్లు. ఇది మాత్రం నేను సునాయాసంగా చేసేవాణ్ణి. ఉదయం చర్చికి వెళ్లే సమయంలో, వర్జిల్, హోమర్ వంటి మహాకవుల కావ్యాల నుండి నలభై, యాభై పంక్తుల దాకా నేర్చేసుకునేవాణ్ణి. కాని ఇది బొత్తిగా పనికిమాలిన కసరత్తని తరువాత అనిపించింది. ఎందుకంటే నలభై ఎనిమిది గంటలు తిరిగేలోగా ఆ పద్యాలు మర్చిపోయేవాణ్ణి. చదువులో బద్ధక పడే వాణ్ణి కాదు. ఒక్క కవితలు అల్లమంటేనే కొంచెం ఇబ్బంది గాని, శాస్త్రీయ సాహిత్యాన్ని మాత్రం ఎంతో శ్రద్ధగా చదివేవాణ్ణి. ఈ శాస్త్రీయ అధ్యయనాలలో హొరేస్ కవి రాసిన కృతులు చదివి చాలా ఆనందించేవాణ్ణి.
మామూలుగా అందరు పిల్లలకి బడిని విడిచి పెట్టే సమయానికి ఎంత వయసు ఉంటుందో, నా వయసు కూడా అంతే ఉండేదట. మా గురువులే కాక, మా నాన్నగారు కూడా చదువులలో నా సామర్థ్యం సర్వసాధారణంగా ఉండేదని తలచేవారు. బుద్ధికుశలతలో కూడా నేను సగటు పిల్లల కన్నా ఓ మెట్టు కిందనే ఉండేవాణ్ణట. ఒక సారి మా నాన్నగారు నాతో కోపంగా, "వేటాడటం, కుక్కలతో ఆడటం, ఎలకలు పట్టుకోవడం - నీ ధ్యాస అంతా ఎప్పుడూ వీటి మీదే. నువ్వసలు మన వంశానికే చేటు," అన్నారు. ఆ మాటలు నా మనసులో గుచ్చుకున్నాయి. స్వతహాగా మా నాన్నగారు చాలా మంచివారు. నా మనసులో ఆయన పట్ల ప్రేమానురాగాలు తప్ప మరేమీ లేదు. కాని ఆయన ఎందుకో బాగా కోపంలో ఉన్నప్పుడు అన్న మాటలవి అనిపించింది.
బళ్లో చదువుకునే దశలో నా వ్యక్తిత్వంలో మంచి భవిష్యత్తును సూచించే లక్షణాలు అంటూ ఏవైనా ఉన్నాయంటే అవి ఇవి. నాకు గొప్ప వైవిధ్యం గల అభిరుచులు ఉండేవి. ఏదైనా నచ్చిందంటే దాని మీద అపారమైన శ్రద్ధ చూబించేవాణ్ణి. అది ఎంత సంక్లిష్టమైనది అయినా ఎలాగో కష్టపడి దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి ఆనందించేవాణ్ణి. నాకు ఒక ప్రైవేటు మాస్టరు యూక్లిడ్ జ్యామితి బోధించేవాడు. జ్యామితిలో ఉండే కచ్చితమైన నిరూపణలు నాకు బాగా నచ్చేవి. మా మామయ్య ఒకాయన బారోమీటర్ కి సంబంధించిన భైతిక సూత్రాలని వివరించడం నాకు బాగా గుర్తు. విజ్ఞానంతో సంబంధం లేని మరెన్నో అభిరుచులు కూడా ఉండేవి. నాకు పుస్తకాలు చదవడం ఇష్టం ఉండేది. బళ్లో లావుపాటి గోడలలో ఏ కిటికీ లోనో కూర్చుని షేక్స్పియర్ నాటకాలు చదువుతూ గంటల తరబడి కాలక్షేపం చేసేవాణ్ణి. ఇవి గాక ఎన్నో కవితలు కూడా చదివాను. ఉదాహరణకి థామ్సన్ రాసిన "ఋతువులు" కవిత చదివాను. ఇటీవలే అచ్చయిన బైరన్, స్కాట్ ల కవితలు కూడా చదివాను. ఇది ఇంత ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నాను అంటే తరువాత నా జివితంలో కవిత్వాన్ని ఆస్వాదించే శక్తిని పూర్తిగా కోల్పోయానని చెప్పటానికి చింతిస్తున్నాను.
(ఇంకా వుంది)







.jpg)






