Showing posts with label మానవుడు-ప్రతీకలు. Show all posts
Showing posts with label మానవుడు-ప్రతీకలు. Show all posts
అలాగే మరో సందర్భంలో ఓ ఫిలాసఫీ
ప్రొఫెసరు నాతో కాన్సర్ పట్ల తనకి వుండే ఫోబియా గురించి చెప్పుకొచ్చాడు. అప్పటికే అతడు
ఎన్నో ఎక్స్-రే లు తీయించుకున్నాడు. కాని ఎందులోను కాన్సర్ ఆనవాళ్లు కనిపించలేదు. అయినా
కూడా తనకి ఏదో హానికరమైన ట్యూమర్ వుందని అతడు భయపడుతుంటాడు. “ఏమీ లేదని తెలుసు. కానీ
ఏవైనా వుంటే?” అని అడుగుతాడు. ఈ ఆలోచన ఎక్కణ్ణుంచి వచ్చింది? ఇది సచేతనమైన యోచన లోనుండి
పుట్టుకొచ్చిన భయం కాదు. ఆ సంశయం అతడి మానసాన్ని ఒక్కసారిగా క్రమ్ముకుంటుంది. దాని
సమ్మోహక శక్తి మీద అతడి బొత్తిగా నిగ్రహం లేకుండా పోతోంది.
ఈ విధంగా తన సమస్యని ఒక నాగరికుడు
అంత సులభంగా వెలిబుచ్చడు. ఓ అనాగరికుడు అయితే తన సమస్యలకి కారణం ఏదో దయ్యం తనని వేధించడమే
నని మరింత సులభంగా ఒప్పుకుంటాడు. దెయ్యాలు అనేవి ఉంటాయని, వాటికి ఏదో దుష్టప్రభావం
వుంటుందనే భావన ఓ అనాగరిక సంస్కృతిలో సమ్మతమే కావచ్చు. కాని ఒక ఆధునికుడికి తన సమస్యలు
కేవలం మనోజన్యాలు అని ఒప్పుకోవడం మరింత కష్టం అవుతుంది. ఈ విధంగా చిత్తంలో లోతుగా నాటుకుపోయి,
సులభంగా మార్చరాని, వొదిలించుకోలేని భావననే obsession అంటారు. ఇది చాలా ప్రాచీనమైన
మానసిక పరిణామం. ఆనాడు, ఈనాడు అది ఒక్క రీతిలోనే వుంది. దానికి కారణం ఏమిటి అని అన్వయించే
ప్రయత్నంలోనే అప్పటికి ఇప్పటికి తేడా వుంది.
ఆధునికులకి, అనాగరికులకి మధ్య
ఈ రకంగా ఎన్నో పోలికలు గుర్తించవచ్చు. మానవ చిత్తంలో ప్రతీకలని పుట్టించే ప్రవృత్తిని
అర్థం చేసుకోడానికి ఈ రకమైన తులనాత్మక పరిశీలన అవసరం. ఎందుకంటే ఎన్నో కలలలో మనకి ఎదురయ్యే
ప్రతీకలకి ప్రాచీన భావనలతోను, గాధలతోను, ఆచారాలతోను సంబంధం వుంటుంది. ఈ స్వప్న చిత్రాలనే
మన చిత్తంలో మిగిలిన “ప్రాచీన అవశేషాలు” అంటాడు ఫ్రాయిడ్. అతి సుదూరమైన గతానికి చెందినవై
మనలో మిగిలిన చైతన్యాంశాలు అన్నమాట. అచేతనని కేవలం చేతన యొక్క పొడిగింపు గానో, లేక
కాస్త దృశ్యాత్మకంగా చెప్పాలంటే సచేతన మానసంలో పుట్టే చెత్త అంతా తనలో పోగు చేసుకునే
ఓ చెత్తడబ్బా లాగానో (ఫ్రాయిడ్ లాంటి) కొంతమంది నిపుణులు పరిగణిస్తూ వుంటారు.
ఈ అంశాన్ని మరింత లోతుగా పరిశోధించిన
మీదట అచేతనని ఈ విధంగా పరిగణించడం పొరబాటని అనిపించింది. అచేతన నుండి ఉద్భవించే ఈ రకమైన
ప్రతీకలు, చిత్రాలు విశ్వజనీనాలు అని తెలిసింది. స్వాప్నికుడి చదువుకున్న వాడైనా, నిరక్షరాస్యుడైనా,
తెలివైన వాడైనా వట్టి మొద్దు అయినా అచేతనా చిత్రాలు మాత్రం ఒక్కటేనని గుర్తించాను.
ఆ చిత్రాలు కేవలం అర్థం లేని ‘అవశేషాలు’ కావు. ఇప్పటికీ వాటికి ఒక ప్రాముఖ్యత వుంది.
డా॥ హెండెర్సన్ గారు చెప్పినట్టు వాటి చారిత్రాత్మక లక్షణం దృష్ట్యా వాటికి ఆ విధమైన
ప్రాముఖ్యత అబ్బుతుంది. మన ఆలోచనలని మనం సచేతనంగా వ్యక్తం చేసే తీరుకి, లేక అచేతనంగా
చిత్రాలతోను, పలు వన్నెలతోను వ్యక్తం చేసే తీరుకి మధ్య ఈ చిత్రాలు వంతెనలా పని చేస్తాయి.
సచేతన ప్రపంచానికి అచేతన లోకానికి మధ్య ఈ “చారిత్రాత్మక” సంబంధాలు లంకెలు.
మన సచేతన మానసంలో జాగృత స్థితిలో
పుట్టే ఆలోచనలకి, స్వప్న స్థితిలో లభ్యమయ్యే
ఈ చిత్ర సంపదకి మధ్య తేడా గురించి అంతకు ముందు చర్చించాను. ఆ తేడాకి మరో కారణం ఇప్పుడు
మనకి కనిపిస్తోంది. మన నాగరిక జీవనంలో మనం వాడే ఎన్నో భావాలు శక్తివిహీనం అయిపోయాయి,
పేలవంగా మారిపోయాయి. వాటికి మనం స్పందించడం మానేశాం. వాటిని మాటల్లో అలవాటుగా వాడుతాం.
అవతలి వాళ్ళు వాటి గురించి ప్రస్తావించినప్పుడు పరిపాటిగా స్పందిస్తాం. కాని అవి మన
చిత్తం మీద గాఢమైన ముద్ర వెయ్యవు. మన నడత మీద వాటికి పెద్దగా ప్రభావం వుండదు. మన మనోభావాలని,
నడతని మార్చాలంటే మరింకేదో కావాలి. అదే ఈ “స్వప్న భాష.” కలల ప్రతీకలలో ఎంతో చైత్య శక్తి
దాగి వుంటుందంటే వాటిని పట్టించుకోకుండా వుండలేం.
(ఇంకా వుంది)
ఆఫ్రికా అడువుల్లో జీవించే ఓ
అటవికుణ్ణే ఉదాహరణగా తీసుకుందాం. ఇతగాడు ఓ నిశాచర ప్రాణిని పగటి పూట తిరగడం చూస్తాడు.
ఆ సందర్భంలో తను చూస్తున్నది ఓ జంతువు అనుకోడు. ఓ ఆటవిక వైద్యుడే ఆ రూపంలో వచ్చాడని
తలపోస్తాడు. లేదా అదొక వృక్షాత్మ అనుకుంటాడు. లేదా తమ జాతికి చెందిన ఎవడో పూర్వీకుడు
ఆ రూపంలో వచ్చాడని అనుకుంటాడు. ఆటవికుడి జీవితంలో చెట్టుకి ఎంతో ముఖ్యమైన పాత్ర వుంటుంది.
దానినే తన ఆత్మగా భావిస్తాడు. దాని ద్వార తన వాక్కు వ్యక్తం అవుతుందని అనుకుంటాడు.
ఆ చెట్టుతో తన జీవితం ముడిపడి వుందని నమ్ముతాడు. దక్షిణ అమెరికాకి చెందిన కొందరు ఇండియన్లు
తాము ఎర్ర అరారా (Red Arara) చిలుకలమని నమ్ముతారు. అయితే వాళ్లకి రెక్కలు, ఈకలు, కూసు
ముక్కులు లేవని వాళ్లకి తెలియకపోలేదు. బుద్ధి జన్యమైన ఆధునిక ప్రపంచంలో లాగా ఆ ఆటవికుల
ప్రపంచంలో ఇది “నేను” అది “నేను కానిది” అనే కచ్చితమైన సరిహద్దులు ఉండవు మరి.
మనస్తత్వ శాస్త్రవేత్తలు చెప్పే
ఆత్మగతమైన తాదాత్మ్యం లేదా, చైత్యపరమైన భాగస్వామ్యం అనే మాటలకి మన ఆధునిక జీవితంలో
అర్థం లేకుండా పోయింది. కాని ఈ రకమైన అచేతన అనుబంధాల సందోహమే ఆటవికుడి ప్రపంచానికి
ఓ కొత్త వన్నె తెస్తుంది. ఆ లక్షణాన్ని మనం ఎంతగా కోల్పోయామంటే అది మనకి ఎక్కడైనా తారసపడ్డా
దానిని గుర్తుపట్టలేము. మనలో ఎప్పుడూ అవి ఉపరితలానికి అడుగునే మసలుతూ వుంటాయి. ఎప్పుడైనా
అవి ఆ సరిహద్దు దాటుకుని పైకి తేలితే ఏదో పొరపాటు జరిగిందని అనుకుంటాం, అవీ నిజమేనని,
వాటికీ ఓ అర్థం, అస్తిత్వం ఉందని ఒప్పుకోం.
బాగా చదువుకున్న వాళ్లు, తెలివైన
వాళ్లు ఎంతో మంది నన్ను సంప్రదిస్తూ వుంటారు. వారికి కలిగే ఏవో విచిత్రమైన కలలు, ఊహలు,
ఆంతరిక దర్శనాలు వాళ్లని కలవరపెడుతున్నాయని చెప్తుంటారు. మనస్థితిమతం గల వారికి అలాంటి
కలలు, ఆలోచనలు రావని, అలాంటి దృశ్యాలు చూసే వారికి తప్పకుండా మతి తప్పి ఉండాలని వాళ్లు
బెంబేలు పడుతూ వుంటారు. ఇజికీల్ (Ezekiel)
కి కనిపించిన దృశ్యాలు కేవలం ఏదో మానసిక ఋగ్మతకి ఫలితాలని అన్నాడు అలాగే ఓ సారి
నన్ను సందర్శించిన ఓ మతపండితుడు. అలాగే మోసెస్ మొదలైన ప్రవక్తలకి వినిపించిన “వాణి” కేవలం ఓ విభ్రాంతి అంటాడు. అలాంటప్పుడు అలాంటి
అనుభూతి తనకి “అప్రయత్నం”గా కలిగితే అదిరిపోడూ మరి! మనం నిర్మించుకున్ని ఈ తార్కిక,
సహైతుక ప్రపంచానికి మనం ఎంతగా అలవాటు పడిపోయామంటే మన సామాన్య లౌకిక అవగాహనకి అందని
దంతా అసంభవం అని కొట్టిపారేస్తాం. ఇలాంటి విపరీతమైన, విచిత్రమైన అనుభూతి కలిగిన ఆటవికుడు
తన మనస్థిమితాన్ని సందేహించడు. ఆత్మలు, దేవతలు మొదలైన అంశాలతో ఆ వైపరీత్యాన్ని వివరించుకోడానికి
ప్రయత్నిస్తాడు.
మన భావావేశాలు కూడా ఈ కోవకి
చెందినవే. మన సువిస్తారమైన ఆధునిక నాగరికతలో వేళ్లూని వున్న విపత్తుల ముందు ఆటవికులు
భయపడే ‘దెయ్యాలు,’ ‘భూతాలు’ మొదలైనవి ఏ మూలకీ రావు. ఆధునిక నాగరికుడి మనోభావాన్ని తలచుకుంటే
ఓ సారి నన్ను సంప్రదించడానికి వచ్చిన ఓ psychotic
రోగి జ్ఞాపకం వస్తాడు. ఆ రోగి స్వయంగా ఓ డాక్టరు కూడా. ఓ సారి ఉదాయానే నన్ను
చూడడానికి వచ్చిన అతగాణ్ణి ‘ఎలా వున్నారు?’ అని పలకరించాను. అతగాడు తన కొచ్చిన ఓ చిత్రమైన
కల గురించి ఏకరువు పెట్టుకొచ్చాడు. ఆ కలలో అతడు మెర్క్యురిక్ క్లోరైడ్ అనే క్రిమి నాశనిని
స్వర్గం అంతా చల్లి దాంతో స్వర్గాన్ని క్రిమిరహితంగా మార్చేస్తున్నాడట! అలా ఎంతో సేపు
స్వర్గాన్ని పరిశుద్ధం చేశాక చూసుకుంటే స్వర్గంలో దేవుడు కనిపించకుండా పోయాడట! ఇది
న్యూరోసిస్ యొక్క లక్షణం లాగా కనిపిస్తోంది. ఈ సందర్భంలో “దైవభీతి” కి బదులుగా ఏదో
anxiety neurosis కనిపిస్తోంది. భావావేశం ఒకటే.
దాని లక్ష్యం మారిందంతే.
(బ్రిటన్ కి చెందిన శిల్పి జేకబ్
ఎప్స్టయిన్ రూపొందించిన ఓ శిల్పం. ఆటవికుడు దెయ్యాలని, భూతాలని ఊహించుకుంటే ఆధునికుడు
ఈ మరభూతాలని ఊహించుకుంటున్నాడు.)
(ఇంకా వుంది)
మనకి రోజూ సంభవించే సంఘటనలకి
సంబంధించిన అచేతన అంశాలకి మన దైనిక జీవితం మీద పెద్దగా ప్రభావం వున్నట్టు కనిపించదు.
కాని స్వప్న విశ్లేషణ ద్వార అచేతనాంశాలని అర్థం చేసుకోడానికి ప్రయత్నించే మనస్తత్వ
శాస్త్రవేత్తకి అవి చాలా ముఖ్యం అవుతాయి. ఎందుకంటే మన సచేతన ఆలోచనల యొక్క వేళ్లు అక్కడే
వున్నాయి. అందుకే సర్వసామాన్యమైన వస్తువులు, భావాలు కూడా కలలో కనిపించినప్పుడు ఒక్కొక్కసారి
అత్యంత శక్తివంతమైన అంతరార్థాన్ని తెలియజేస్తాయి. అది మూసిన గది కావచ్చు, అందుకోలేని
రైలుబండి కావచ్చు. గొప్ప ఉద్విగ్న భరిత స్థితిలో అలాంటి కల నుండి మనం మేలుకోవడం జరుగుతుంది.
కలలలో కనిపించే చిత్రాలు ఎన్నో
సార్లు మెలకువలో ఆ చిత్రాలకి, భావనలకి సంబంధించిన బాహ్య ప్రపంచపు దృశ్యాల కన్నా మరింత
సజీవంగా ఉంటాయి. దానికి కారణం స్వప్న చిత్రాలు బాహ్య ప్రపంచ వస్తువుల యొక్క అచేతన అంతరార్థాన్ని
సూచిస్తున్నాయి. మన సచేతన చింతన లన్నీ వివేచన, హేతువు అనే నిర్బంధాల మధ్య రూపుదేలుతాయి.
అలాంటి నిర్బధం వల్ల అవి జీవరహిత మవుతాయి. వాటిలోని ఆత్మగతమైన అంశం తొలగిపోవడం వల్ల
వాటిలో వుండే కళ కాంతి తొలగిపోతుంది.
ఈ సందర్భంలో నాకు వచ్చిన ఓ కల
గుర్తొస్తోంది. ఆ కలలో ఎవరో నా వెనకగా వచ్చి నా వీపు మీద ఎక్కడానికి ప్రయత్నిస్తున్నాడు.
ఆ మనిషి గురించి నాకు ఏమీ తెలీదు. ఒక్కటి తప్ప. నేను ఎప్పుడో అలవోకగా అన్న ఓ మాటని
తీసుకుని దాన్ని వక్రపరిచాడు. ఎవరో అజ్ఞాత వ్యక్తి నా వీపు మీద ఎక్కడానికి ప్రయత్నించడంలో
అంతరార్థం ఏంటో మొదట అర్థం కాలేదు. నా వృత్తి జీవనంలో నేను అన్నదాన్ని ఎవరో తీసుకుని
దాన్ని వక్రపరచడం ఎన్ని సార్లు చూశానంటే ఇక దాన్ని గురించి పట్టించుకోవడం మానేశాను.
ఆ తరువాత ఒక సందర్భంలో ఆ కలకి
అర్థం ఏంటో ఉన్నట్లుండి మనసులో స్ఫురించింది. ఆస్ట్రియాకి చెందిన ఓ నానుడి వుంది.
“వచ్చి కావాలంటే నా వీపు మీద ఎక్కు.” దానికి అర్థం “నువ్వు నా గురించి ఏం అన్నా నేను
పట్టించుకోను సుమా!” ఇలాంటి నానుడే ఒకటి అమెరికాలో కూడా వాడుతారు – “పోయి ఏట్లో దూకు.”
పైన చెప్పుకున్న కల ప్రతీకాత్మకమైనది.
ఎందుకంటే అది విషయాన్ని పరోక్షంగా ఒక ఉపమానం సహాయంతో వ్యక్తం చేస్తోంది. కల మనకి చెప్పదలచుకున్న
విషయానికి కావాలని “ముసుగు” వేసి మనకి వ్యక్తం
చెయ్యడం లేదు. కల యొక్క వైఖరే అంత, దాని తత్వమే అంత. దాని పరిభాషని అర్థం చేసుకోవడం
మనకే చాతకావడం లేదు. మన ఆధునిక జీవనంలో, నాగరిక సంస్కృతి ప్రభావం వల్ల మనం వ్యక్తం
చెయ్యగోరే విషయాన్ని ఎప్పుడూ వీలైనంత సహేతుకంగా,
తార్కికంగా వ్యక్తం చెయ్యడానికి ప్రయత్నిస్తాము. తద్వార అందులోంచి అచేతనపు పైపూతని తొలగిస్తాము. అలాంటి పైపూత వేయడం ఆదిమానవుడి
స్వభావం. ప్రతీ బాహ్య ప్రపంచ వస్తువు వెనుక వుండే అద్భుత, ఆత్మగత సారాన్ని మనం మన అచేతన
లోకి అణగదొక్కేశాం. కాని కిరాతుల మనస్తత్వంలో ఈ లక్షణాలు, ఈ సారం ఇంకా సజీవంగా ఉన్నాయి.
అందుకే వాళ్లు మొక్కలకి, జంతువులకి, రాళ్లకి కూడా ఏవో అద్భుత, విచిత్ర శక్తులని ఆపాదిస్తారు.
(ఇంకా వుంది)
మన సచేతనమైన అనుభూతులకి ఏ రకమైన
అచేతనమైన వన్నెలని ఆపాదిస్తాం అనేది వ్యక్తి నుండి వ్యక్తి మారుతూ వుంటుంది. ఒక సామాన్య,
అమూర్త భావన మనకి తారసపడినప్పుడు దానికి మన వ్యక్తిగత మనస్సు ఒక నేపథ్యాన్ని, సందర్భాన్ని
అందిస్తుంది. కనుక మన ప్రత్యేక, వ్యకిగత ధోరణిలో దాన్ని మనం అర్థం చేసుకుంటాం, వినియోగించుకుంటాం.
“దేశం”, “డబ్బు,” “సమాజం”, “ఆరోగ్యం” మొదలైన సామాన్య పదాలని విన్నప్పుడు ఆ పదాలు నాకెలా
అర్థం అవుతాయో, అవతలి వారికి కూడా ఇంచుమించు అలాగే అర్థం అవుతాయని నేను అనుకుంటాను.
ఇక్కడ “ఇంచుమించు” అన్న పదానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఒకే సాంస్కృతిక నేపథ్యం గల వారిని
ఇద్దరిని తీసుకుంటే వారికి కూడా ఒకే పదం రెండు రకాలుగా అర్థం కావచ్చు. ఇక బాగా వైవిధ్యంతో
కూడా సామాజిక, రాజకీయ, మత, మానసిక అనుభవరాశి గల వ్యక్తుల విషయంలో అయితే ఆ రకమైన అర్థభేదం
చాలా తీవ్రంగా ఉంటుంది.
('Time is a river without banks' by March Chagall. అచేతనలో ఉండే అంశాల గందరగోళ పరిస్థితిని తలపిస్తుంది ఈ చిత్రం.)
భావనకి, పదానికి మధ్య పెద్దగా
వ్యత్యాసం లేకపోతే ఇలా వ్యక్తికి వ్యక్తికి మధ్య అవగాహనలో పెద్దగా తేడా వుండదు. కాని
భావనని బోధపరచడానికి కచ్చితమైన నిర్వచనం, విపులమైన వివరణ అవసరమైన పక్షంలో అవగాహన భేదం
విపరీతంగా ఉంటుంది. ఆ భేదం మానసికమైన, బుద్ధిగతమైన అవగాహనలోనే కాదు, అంతకన్నా ముఖ్యంగా
పదానికి సంబంధించిన హార్దిక అనుభూతిలో తేడా వుంటుంది. ఆ తేడాలు ఎక్కువగా అచేతనంగా,
ఉపచేతనంగా వుంటాయి కనుక బయటికి వ్యక్తం కావు.
అవగాహనలో అలాంటి భేదాలకి పెద్దగా
ప్రాముఖ్యత లేదని, దైనిక అవసరాలకి వాటికి సంబంధం లేదని కొందరు అనుకోవచ్చు. కాని వాస్తవంలో
ఎంత కచ్చితమైన సచేతన అంశాల విషయంలో అయిన వాటి చుట్టూ అనిశ్చితమైన అచేతన ఛాయ అలముకుని
వుంటుంది. ఒక విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నప్పుడు,
దానికి మనం స్పందిస్తున్నప్పుడు మనలో ఓ ఆంతరిక, ఆత్మగత సంఘటన జరుగుతోంది. కనుక ఆ సంఘటనలో
నిగూఢంగా, మర్మంగా ఉండే అంశం తప్పకుండా వుంటుంది. అంకెల లాంటి సర్వసామాన్యమైన భావనని
తీసుకున్నా కూడా అవి కేవలం లెక్కించడానికి పనికొచ్చే సాధనలే అనుకుంటే పొరబాటు. అంకెలలో
అధ్యాత్మికమైన అంతరార్థం వుంటుంది. పైథాగరస్
వంటి వారి ప్రకారం అంకెలు దివ్యమైనవి కూడా! కాని మనం దైనందిన జీవితంలో అంకెలని వాడేటప్పుడు
ఇవన్నీ మన అనుభవంలోకి రావు.
కనుక మన సచేతన మానసంలో ఉండే
ప్రతీ భావనకి, అచేతనమైన, ఆత్మగతమైన అనుబంధిత అంశాలేవో వుంటాయి. తీవ్రతలోను, ప్రగాఢతలోను
ఆ అనుబంధిత అంశాల్లో ఎంతో వైవిధ్యం వుంటుంది. ఆ భావన మన పూర్ణ వ్యక్తికి, జీవితానికి
ఎంతో ముఖ్యం అయినట్లయితే, మన అచేతనలో ఆ భావన యొక్క అనుభంధిత మరింత బలవత్తరంగా వుంటుంది.
ఆ భావానికి సంబంధించిన ఇతర భావాలు, భావజాలాలు మన అచేతనలో ముందే వున్న పక్షంలో కూడా
ఆ భావనకి సంబంధించిన అచేతన అంశం బలవత్తరం అవుతుంది. ఆ కారణం చేత ఆ భావన యొక్క “సామాన్య” అంశం పలచన అవుతుంది.
ఆ భావన మన అచేతన లోకి ఇంకా ఇంకా లోతుగా చొచ్చుకు పోతున్న కొద్ది దాని లక్షణం గణనీయంగా
మారిపోతుంది.
(ఇంకా వుంది)
సచేతన విషయాలు అచేతనలోకి ప్రవేశించి
మాయమైపోయినట్లే, అచేతన లోనుండి మునుపు ఎన్నడూ సచేతనం కాని కొత్త విషయాలు పైకొచ్చి సచేతన
లోకి ప్రవేశించవచ్చు. కొన్ని సార్లు చిత్తం అంచున ఏదో సంగతి తారాడుతున్నట్టు అనిపిస్తుంది.
మరి కాస్తలో ఏదొ విషయం స్ఫురిస్తుంది అన్న అనుభూతి కలుగుతుంది. ఇలాంటి అనుభవాల బట్టి
మనకి అర్థమయ్యేది ఏంటంటే అచేతన కేవలం గత స్మృతుల భాండాగారం మాత్రమే కాదు. నూతన ఆత్మగత
పరిస్థితుల, భావనల బీజాలు అందులో సంపూర్ణంగా ఉంటాయి. ఈ సత్యాన్ని అర్థం చేసుకున్న నాడు
నేను నా సొంత పంథాలో మనస్తత్వ శాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. నిజంగానే
ఎప్పుడో మర్చిపోయిన పాత జ్ఞాపకాలే కాక, పూర్తిగా కొత్తవి, సృజనాత్మకమైనవి అయిన భావాలు
కూడా అచేతన లోంచి పెల్లుబుకగలవు. పంకిలంలో పుట్టి పైకి తేలిన పంకజంలా అవి ఆ చీకటి లోతుల్లో
నుండి ఆవిర్భవిస్తాయి.
నిత్య జీవితంలో ఈ సత్యాన్ని
ఎన్నో సార్లు గుర్తిస్తాము. ఏదో సంకటం ఎదురవుతుంది, ఏదో నిర్ణయం తీసుకోవలసి వస్తుంది.
అనుకోని రీతిలో వాటికి పరిష్కారాలు ఉత్పన్నమవుతాయి. ఎంతో మంది కళాకారులు, తత్వవేత్తలు,
శాస్త్రవేత్తల జీవితాలలో ఎన్నో గొప్ప ఆలోచనలు, ప్రేరణలు అచేతన లోంచి పుట్టుకు రావడం
మనం చూస్తాము. అచేతనలో దాగి వున్న భావబీజాలని, జ్ఞాన గనులని ఆవిష్కరించి తత్వశాస్త్రంలో, సాహిత్యంలో, కళలో,
సంగీతంలో, విజ్ఞాన శాస్త్రంలో వాటిని అభివ్యక్తం
చెయ్యగలిగే సామర్థ్యాన్నే మేధస్సు అంటాము.
ఇలాంటీ పరిణామానికి ఓ చక్కని
నిదర్శనం మనకి విజ్ఞాన శాస్త్ర చరిత్రలో కనిపిస్తుంది. ఉదాహరణకి ఫ్రెంచ్ గణితవేత్త
ప్వాంకరే మరియు రసాయనవేత్త కేకులే ల విషయంలో ఎన్నో వైజ్ఞానిక ఆవిష్కరణలు హఠాత్తుగా “అంతఃప్రకాశనాల”
రూపంలో వారి చిత్తంలో మెరిశాయని ఆ శాస్త్రవేత్తలే చెప్పుకున్నారు. ఫ్రెంచ్ తాత్వికుడు
దే కార్త్ కి కూడా ఒక విధమైన “అధ్యాత్మిక” అనుభూతి కలిగిందని అంటారు. “సకల శాస్త్రాలని
కలిపే క్రమం” మెరుపులా తన చిత్తంలో మెరిసిందట. బ్రిటిష్ రచయిత రాబర్ట్ లూయీ స్టీవెన్
సన్ ఎన్నో ఏళ్ళ పాటు మనిషిలోని ఈ “ద్వంద్వాత్మ యొక్క తత్వాన్ని ఎత్తి చూపే” కథ కోసం గాలించగా, ఒక రాత్రి హఠాత్తుగా కలలో డాక్టర్ జెకిల్ అండ్ మిస్టర్ హైడ్ కథ చిత్తంలో
సాక్షాత్కరించిందట.
అలాంటి సమాచారం అచేతన లోంచి
ఎలా ఆవిర్భవిస్తుందో, అది ఎలాంటి రూపాన్ని తీసుకుంటుందో అంతా తరువాత విపులంగా చర్చిస్తాను.
అంతర్యం లోంచి కొత్త సమాచారం పుట్టగలదన్న విషయం మనకి కలలలో కనిపించే ప్రతీకలని పరిశీలిస్తున్నప్పుడు
స్పష్టంగా కనిపిస్తుంది. కలలలో పైకి తేలే చిత్రాలు, భావాలు కేవలం జ్ఞాపకాలు కాలేవని
నా వృత్తి అనుభవంలో నాకు ఎన్నో సార్లు అవతమయ్యింది. మన చేతన యొక్క ప్రాకారాలు ఎన్నడూ
దాటని నిత్యనూతన భావాలెన్నో కలలలో తేటతెల్లమవుతాయి.
(ఇంకా వుంది)
ఎంతో మంది తమ సంకల్ప బలం గురించి
అతిగా ఊహించుకుంటారు. వాళ్లు నిర్ణయించింది, ఉద్దేశించింది తప్ప వారి మనసుల్లో మరింకేమీ
జరగదని, జరగలేదని నమ్ముతారు. కాని మన మనసులో సంకల్పపూర్వకమైన అంశాలు ఉన్నట్లే అసంకల్పిత
అంశాలు కూడా ఉంటాయని గుర్తుంచుకోవాలి. మొదటి రకం అంశాలు వ్యక్తి యొక్క అహంకారం నుండి
జనిస్తాయి. రెండవ రకం అంశాలు అహంకారం నుండి కాక “అవతలి వైపు” నుండీ జనిస్తాయి. ఆ “అవతలి
వైపే” ఇందాక మనం చెప్పుకున్న కథలో సెక్రటరీ తన ఆహ్వానాలు మర్చిపోయేలా చేస్తుంది.
మనం ఒకప్పుడు గుర్తించినవి,
అనుభూతి చెందినవి తదనంతరం మర్చిపోవడానికి ఎన్నో కారణాలు వున్నాయి. అలాగే వాటిని తిరిగి
జ్ఞాపకం తెచ్చుకోడానికి కూడా పలు మార్గాలు వున్నాయి. అలాంటి వాటిలో ఓ ఆసక్తికరమైన పద్ధతిని
“concealed recollection” (ప్రచ్ఛన్న పునఃస్మరణ). అంటే మన సంకల్పం లేకుండా, మన ఎరుక
లేకుండా ఏదో “గుర్తుకు” రావడం అన్నమాట. ఉదాహరణకి ఓ రచయిత ఓ ఆలోచనా స్రవంతిని వ్యక్తం
చేస్తూ రాసుకొస్తున్నాడు, లేదా ఏదో వ్యూహం ప్రకారం ఓ కథ రాస్తున్నాడు అనుకుందాం. కాని
ఉన్నట్లుండి ముందు నిర్ణయించిన మార్గానికి భిన్నంగా ఎటో వెళ్లిపోతాడు. బహుశ ఏదో కొత్త
ఆలోచన వచ్చి వుంటుంది. లేదో మరేదో చిత్రం మనసులో మెదిలి వుంటుంది. కథకి మరో కొత్త వ్యూహం
స్ఫురించి వుంటుంది. ఎలా కొత్త పంథా తొక్కడానికి కారణం ఏంటని అడిగితే చెప్పలేకపోతాడు.
ఆ మార్పుని అతడు గుర్తించలేకపోవచ్చు. తనకి తెలియకుండా, అప్రయత్నంగా తన చిత్తం లోంచి
ఈ కొత్త విషయాలన్నీ పుట్టుకు వచ్చి ఉండొచ్చు. కాని కొన్ని సందర్భాల్లో ఇలా కొత్త తరహాలో
రాసిన విషయం అంతా మరెవరో రచయిత రాసిన దానికి బాగా సన్నిహితంగా ఉందని నిరూపించడానికి
వీలు కావచ్చు. కాని ఆ రచయిత రచనలు ఇతగాడు ఎన్నడూ చదవలేదని అనవచ్చు.
ఇలాంటి పరిణామానికి ఉదాహరణ నాకు
నీట్షే రాసిన Thus spake Zarathustra అన్న పుస్తకంలో కనిపించింది. 1686 నాటి ఓ ఓడకి చెందిన యాత్రా పత్రికలో వర్ణించబడ్డ
ఓ వృత్తాంతం ఆ పుస్తకంలో మక్కీకి మక్కీగా రాయబడింది. 1835 లో (అంటే నీట్షే రాసిన దానికి అర్థ శతాబ్దం ముందు)
ప్రచురించబడ్డ ఓ పుస్తకంలో నేను అనుకోకుండా ఈ నౌకా వృత్తాంతం గురించి చదివాను. అదే వృత్తాంతం Thus space Zarathustra లో కనిపించినప్పుడు దాని ప్రత్యేకమైన శైలి చూసి
నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నీట్షే మామూలుగా రాసే శైలికి దీనికి చాలా తేడా వుంది.
ఆ పాత పుస్తకాన్ని నీట్షే తప్పకుండా చూసే వుంటాడని నా నమ్మకం. కాని ఆ పుస్తకం గురించి
ఎక్కడా ప్రత్యేకించి ప్రస్తావించలేదు. ఈ విషయం గురించి వాకబు చేస్తూ నీట్షే చెల్లెలికి
ఉత్తరం రాశాను. అప్పటికి ఆమె ఇంకా బతికే వుంది. వాళ్ల అన్నయ్యకి ఆ పుస్తకం గురించి
తెలుసని, అన్నయ్యకి 11 ఏళ్ల వయసులో అన్నా చెల్లెళ్లు
ఇద్దరూ కలిసి ఆ పుస్తకం చదవడం గుర్తని రాసింది. సందర్భం బట్టి చూస్తే ఇక్కడ నీట్షే
గ్రంథచౌర్యానికి పాల్పడ్డాడని అనుకోడానికి లేదు. అది చదివిన యాభై ఏళ్ల తరువాత ఆ విషయం
తన సచేతన స్మృతి నుండి జారిపోయి వుంటుందని అనిపిస్తోంది.
(Image credits: http://theamericanreader.com/nietzsche-apostle-the-emancipatory-potential-of-self-praise/)
ఈ రకమైన స్మరణంలో తెలీకుండానే
మునుపు విన్న, లేక చదివిన విషయాన్ని మళ్లీ గుర్తుకు తెచ్చుకోవడం జరుగుతుంది. ఉదాహరణకి
ఓ వాగ్గేయకారుడు తన చిన్నతనంలో ఓ జానపద గీతమో, పల్లెపదమే విని వుంటాడు. పెద్దయ్యాక
ఓ కఠినమైన బృంద వాద్యానికి సంగీతం కూర్చుతున్న సమయంలో ఆ పాత బాణీ పదే పదే తన చిత్తంలో
పైకి తేలుతున్న అనుభూతి కలుగవచ్చు. ఈ సందర్భంలో అచేతనకి చెందిన ఓ ఆలోచన, లేక చిత్రం
తిరిగి సచేతన లోకి ప్రవేశించింది.
ఇంతవరకు నేను వర్ణించింది మానవ
చిత్తానికి చెందిన ఈ అత్యంత సంక్లిష్టమైన విభాగం గురించిన కొన్ని ప్రాథమిక విషయాలు
మాత్రమే. ఈ వర్ణన బట్టి కలలలో మనకి కనిపించే ప్రతీకలు ఎక్కణ్ణుంచి పుట్టుకొస్తాయో కొంత
అవగాహన కలిగి వుంటుంది. ఈ అచేతన పదార్థంలో నానా రకాల తపనలు, ఆరాటాలు, ఉద్దేశాలు ఉండి
వుండొచ్చు. ఎన్నో రకాల అహైతుకమైనవి, సహైతుకమైనవి అయిన ఆలోచనలు, నిర్ణయాలు, నమ్మకాలు
ఉండొ వుండొచ్చు. ఈ ఆవేశాలు, ఆలోచనలు అన్నీ విశాలమైన అచేతనా సముద్రం యొక్క పాక్షిక,
తాత్కాలిక ప్రతినిధులు కావచ్చు.
ఒక రకంగా చెప్పాలంటే అలాంటి
సమాచారం అంతా అధికభాగం అచేతనం కావడానికి కారణం మన సచేతన చిత్తంలో వాటికి స్థలం లేకపోవడమే.
కొన్ని ఆలోచనల విషయంలో వాటి లోని భావావేశపు శక్తి అణగారిపోవడం వల్ల ఆ ఆలోచనలు అచేతనమై
పోయి వుండొచ్చు. ఆ ఆలోచనల మీద మనకి ఆసక్తి సన్నగిల్లడం వల్ల, అవి అముఖ్యం అనిపించడం
వల్ల, వాటి మీద ధ్యాస సన్నగిల్లడం వల్ల వాటిని మన కంటికి కనిపించకుండా అచేతనలోకి తోసేయడం
జరుగుతుంది.
ఈ విధంగా మర్చిపోవడం ఎంతో అవసరం.
అదే జరగకపోతే మనం అనుభూతి చెందిన ప్రతీ విషయం మన సచేతన మానసంలో అనుక్షణం మెదులుతూ వుంటుంది.
ఇక అటువంటప్పుడు అనవసర విషయాలతో మన చిత్తాలు కిక్కిరిసిపోతాయి, ఉక్కిరిబిక్కిరి అవుతాయి.
ఈ విషయం పట్ల ఈ రోజుల్లో ఎంత అవగాహన వుందంటే మనస్తత్వ శాస్త్రం ఏ మాత్రం తెలిసిన వారికైనా
ఇది నిజమని తెలుస్తుంది.
(ఇంకా వుంది)
ఈ సందర్భంలో నాకో సంఘటన గుర్తొస్తోంది.
ఆ సంఘటన గురించి నాకు చెప్పిన వ్యక్తి ఓ ప్రొఫెసరు. ఓ సారి ఇతడు తన శిష్యుడితో కలిసి
ఊరి బయట ఓ రోడ్డు మీద నడుస్తున్నాడు. అలా వెళ్తుంటే ఉన్నట్లుండి తన చిన్నప్పటి జ్ఞాపకాలు
వెల్లువలా తన్నుకొచ్చి తన మానసాన్ని క్రమ్ముకున్నాయి. వాళ్లు మాట్లాడుకుంటున్న మాటలకి
ఆ జ్ఞాపకాలకి ఏ సంబంధమూ లేదనిపించింది. వెంటనే వెనక్కి తిరిగి ఏ చోటి నుండి అయితే ఈ
జ్ఞాపకాలు మొదలయ్యాయో ఆ చోటి వరకు నడుద్దామని తన శిష్యుడికి సూచించాడు ఆ ప్రొఫెసరు.
అలా వెనక్కి వెళ్తుంటే ఒక చోట అడవి బాతుల వాసన తగిలింది. తన చిన్ననాటి జ్ఞాపకాలకి కారణం
ఈ వాసనే అని ప్రొఫెసరు కి వెంటనే అర్థమయ్యింది.
ఇతగాడు తన చిన్నతనంలో అడవి బాతులు
ఉండే పొలాల మధ్య పెరిగాడు. ఇప్పుడు మర్చిపోయినా ఆ వాసన తన చిత్తం మీద గాఢంగా ముద్రపడిపోయింది.
మొదట ఆ దారిన పోతున్నప్పుడు ఆ వాసనని అతడు ఉపచేతనంగా అనుభూతి చెందాడు. ఈ ఉపచేతన సంవేదత
అతడి చిన్ననాటి జ్ఞాపకాలని బయటికి రప్పించాయి. ఆ సమయంలో ధ్యాస మరెక్కడో వుంది కనుక
ఈ వాసనని ఉపచేతనంగా మాత్రమే గుర్తుపట్టడం జరిగింది. ఆ వాసనలో ధ్యాసని మరల్చి సచేతనలోకి
ప్రవేశించగలిగేంత శక్తి లేదు. అయినా ఆ కాస్త ప్రేరణ కూడా ఎప్పుడో “మర్చిపోయిన” జ్ఞాపకాలని
వెలికి రప్పించింది.
ఏ విధంగా అయితే మామూలు మనుషుల్లో
ఓ దృశ్యం, ఓ శబ్దం, ఓ వాసన పాత జ్ఞాపకాలని వెలిక తీయగల హేతువు అవుతుందో, న్యూరాటిక్
రోగులలో అలాంటి “సంజ్ఞ” ఓ ట్రిగ్గర్ లా పని చేసి న్యూరాటిక్ లక్షణాలు వ్యక్తమయ్యేలా
చేస్తుంది. ఉదాహరణగా మంచి ఆరోగ్యం కలిగి, తన ఆఫీసులో చక్కగా పని చేసుకుంటున్న ఓ అమ్మాయినే
తీసుకుందాం. మరుక్షణమే ఏ కారణమూ లేకుండా ఆమె విపరీతమైన తలనొప్పి బాధతో చతికిలబడిపోయిందని అనుకుందాం. మరి కొన్ని ఇతర న్యూరాటిక్ లక్షణాలు కూడా అందుకు
వ్యక్తమయ్యాయి. ఏం జరిగిందని శోధిస్తే విషయం అర్థమయ్యింది. ఆమెకి తెలియకుండానే ఎక్కడో
దూరంలో ఓ ఓడ కూత విందామె. ఆ శబ్దం ఎప్పుడో తన ప్రియుడితో తెగిపోయిన బంధాన్ని గుర్తుకు
తెచ్చింది. మర్చిపోవాలనుకున్న చేదు జ్ఞాపకాలని మళ్లీ వెలికి తెచ్చింది. ఆ బాధామయ జ్ఞాపకాలే
తలనొప్పి తదితర భౌతిక లక్షణాలుగా అభివ్యక్తం అయ్యాయి.
మామూలు విస్మృతి కాకుండా, బాధామయ
జ్ఞాపకాలని “మర్చిపోయే” ప్రత్యేక సందర్భాలెన్నిటినో ఫ్రాయిడ్ వర్ణించాడు. అహంకారం అడ్డొచ్చినప్పుడు
స్మృతి దానంతకదే ఓడిపోతుంది అంటాడు నీషే. మనం మర్చిపోయిన జ్ఞాపకాలు, ఉపచేతనంగా ఉంటూ
పిలిచినా పైకి రాని జ్ఞాపకాలు, అలా ఉపచేతనంగా ఉండడానికి ఒక కారణం వుంది. అవి బాధామయ
జ్ఞాపకాలు, సచేతన స్థితితో పొత్తు కుదరని జ్ఞాపకాలు. వీటినే మనస్తత్వ శాస్త్రవేత్తలు
‘అణగ దొక్కిన అంశాలు’ (repressed contents) అంటారు.
ఈ సందర్బంలో ఓ సెక్రటరీ కథని
ఉదాహరణగా తీసుకుందాం. ఈమెకి తన బాస్ యొక్క స్నేహితులలో ఒకరంటే అసూయ. సమావేశాలకి అందరికీ
ఆహ్వానాలు పంపేటప్పుడు ఈ స్త్రీని పిలవడం అలవాటుగా
మర్చిపోతుంది. అయితే ఆమె వాడే ఆహ్వానితుల జాబితాలో ఈ స్త్రీ పేరు ఉంటుంది. ఎందుకా పొరబాటు
చేశావు అని నిలదీస్తే “మర్చిపోయా”ననో, లేక “పరధ్యానంగా” ఉన్నాననో చెప్తుంది. ఇక్కడ
ఆమె అబద్ధం చెప్తోందని కాదు. నిజం ఏంటో తనకి తాను కూడా ఆమె ఒప్పుకోదు.
(ఇంకా వుంది)
కనుక అచేతనలో ఒక భాగంలో తాత్కాలికంగా
మరుగుపడ్డ ఆలోచనలు, అనుభూతులు, మనోచిత్రాలు దాగి వుంటాయి. అవి సచేతన నుండి కనుమరుగైనా
తెర చాటు నుండి సచేతన మీద ప్రభావం చూపుతుంటాయి. ఓ వ్యక్తి పరధ్యానంగా ఒక గది లోంచి
పక్క గదిలోకి వెళ్తాడు. తీరా ఆ గదికి వెళ్లేసరికి అక్కడికి ఎందుకు వచ్చాడో మర్చిపోతాడు.
నిద్రలో నడుస్తున్నట్టు చుట్టుపక్కన వస్తువులని తడుముకుంటాడు. తన లక్ష్యాన్ని మర్చిపోయాడు.
కాని అతడి అచేతనే అక్కడి వరకు అతణ్ణి తీసుకొచ్చింది. అంతలో లక్ష్యం జ్ఞాపకం వస్తుంది. అంటే అచేతనలో వున్నది సచేతనలోకి
పైకి తేలింది అన్నమాట.
ఓ న్యూరాటిక్ వ్యక్తి ప్రవర్తనని గమనిస్తే అతడు ఎన్నో పనులు సచేతనంగా, ఉద్దేశపూర్వకంగా
చేస్తున్నట్టు కనిపిస్తాడు. కాని తీరా వాటి గురించి అతణ్ణి అడిగితే వాటి పట్ల అతడు
అచేతనంగా ఉన్నట్లు తెలుస్తుంది. లేదా వాటి పట్ల అతడి ఎరుక మనం ఊహించిన దాని కన్నా చాలా
భిన్నంగా ఉన్నట్టు మనకి అర్థమవుతుంది. అతడు వింటాడు గాని వినిపించుకోడు. చూస్తాడు గాని
గుర్తించడు, గుడ్డిగా ఉండిపోతాడు. ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు. ఈ విషయాలు మనస్తత్వ శాస్త్రవేత్తలకి
సుపరిచితాలు. న్యూరాటిక్ వ్యక్తుల మనసుల్లోని అచేతన విషయాలు సచేతనంగా ఉన్నట్టు కనిపిస్తాయి.
అలాంటి వ్యక్తుల్లో ఆలోచన, భాష, చర్య సచేతనంగా ఉన్నాయో లేదో కచ్చితంగా చెప్పడం చాలా
కష్టం.
ఇలాంటి సందర్భాల బట్టే హిస్టీరియాతో
బాధపడుతున్న రోగులు చెప్పేదంతా అబద్ధం అని డాక్టర్లు కొట్టి పారేస్తుంటారు. నిజమే.
మనతో పోల్చితే వాళ్లు చెప్పే అసత్యాలు ఎక్కువే. అయితే వాటిని “అబద్ధాలు” అనడానికి వీల్లేదు.
ఎందుకంటే అవి పూర్తిగా సచేతనంగా అన్న విషయాలు కావు. వారి మనోస్థితి వల్ల వారి ప్రవర్తనలో
ఒక రకమైన అనిశ్చితి నెలకొంటుంది. ఎందుకంటే వారి అచేతన వారి సచేతన వ్యవహారాలలో కలుగజేసుకుని
అనూహ్యమైన విధంగా సచేతనని క్రమ్ముకుంటుంది. నిజానికి వారి స్పర్శానుభూతి లో కూడా ఈ
రకమైన ఆటుపోట్లు, అనూహ్యమైన మార్పులు కనిపించవచ్చు. హిస్టీరియా పేషెంట్ విషయంలో ఒక
సందర్భంలో చేతికి గుచ్చుకున్న సూది యొక్క స్పృహ కలగవచ్చు. కాని మరు క్షణం మళ్లీ గుచ్చితే
ఈ సారి సూది గుచ్చిన అనుభూతి కలగకుండా పోవచ్చు. అతడి ధ్యాస ఒక ప్రత్యేక బిందువు మీద
నిలపగలిగేలా చెయ్యగలిగితే తాత్కాలికంగా అతడి శరీరం మొత్తం మీద సంవేదన లేకుండా చెయ్యడం
సాధ్యమవుతుంది. అలా చెయ్యడం వల్ల ఏ గుప్త ఆందోళన వల్లనైతే అతడి సచేతనలో ఆ విధంగా చీకటి
క్రమ్ముకుంటోందో ఆ ఆందోళనని నయం చెయ్యవచ్చు, తొలగించవచ్చు. ఆ తరువాత ఇంద్రియాల సంవేదన
మునుపట్లా తిరిగొస్తుంది. కాని అంతవరకు మాత్రం అతడికి జరిగేదంతా అచేతనంగా మాత్రమే తెలుస్తుంటుంది.
ఈ వైఖరి అంతా నిపుణుడు పేషెంట్
ని హిప్నటైజ్ చేసినప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. పేషెంటు అచేతనంగా ఉన్నట్టు కనిపించినా
తనకి జరుగుతున్నదంతా వివరంగా తెలుసని తర్వాత నిర్ధారణ చేసుకోవచ్చు. సూదితో చేతి మీద
గుచ్చిన సంఘటన గాని, సచేతన ఆవరించబడ్డ స్థితిలో
డాక్టర్ అన్న మాటలు గాని - అన్నీ కచ్చితంగా
తరువాత పేషెంట్ కి జ్ఞాపకం వచ్చేలా చెయ్యొచ్చు. ఈ సందర్భంలో నాకో స్త్రీ పేషెంట్ సంగతి
గుర్తొస్తోంది. ఈ మహిళని పూర్తిగా అచేతనమైన స్థితిలో ఆసుపత్రిలో చేర్పించారు. మర్నాడు
తనకి స్పృహ వచ్చినప్పుడు తనెవరో తనకి గుర్తుంది గాని, తను ఎక్కడుందో, అక్కడికి ఎలా
వచ్చిందో, ఎందుకొచ్చిందో, అసలు ఆ రోజు తేదీ ఏంటో ఏమీ గుర్తులేదు. తరువాత తనని హిప్నటైజ్
చేస్తే తనకి అనారోగ్యం ఎలా కలిగిందో, ఆస్పత్రికి ఎలా వచ్చిందో, ఎవరు చేర్పించారో అన్నీ
చెప్పింది. ఆ వివరాలన్నీ నిజాలేనని వేరేగా నిర్ధారణ చేసుకోవచ్చు. ఆస్పత్రిలో కచ్చితంగా
ఎప్పుడు చేర్పించారో కూడా తనకి గుర్తుంది. ఆస్పత్రి లోకి వస్తున్నప్పుడు గోడ గడియారాన్ని
చూడడం ఆమెకి గుర్తు.
postlink








