Showing posts with label భౌతిక శాస్త్రం. Show all posts
Showing posts with label భౌతిక శాస్త్రం. Show all posts
నిశ్చలమైన నీటి
ఉపరితలం మీద ఒక రాయి పడేస్తే తరంగం ఎలా ఏర్పడుతుందో కిందటి సారి చూశాం. అలాంటి తరంగాన్ని
నీటి ఉపరితలం వద్ద, పక్క నుండి చూస్తే పడి
లేస్తున్న నీటి ఉపరితలం కనిపిస్తుంది. ఒక ప్రత్యేక తరుణంలో అలాంటి తరంగాన్ని ఫోటో తీస్తే,
అందులో కొన్ని చోట్ల నీటి మట్టం కిందికి, కొన్ని చోట్ల పైకి అలా మిట్టపల్లాలుగా కనిపిస్తుంది.
అలాంటి మిట్టపల్లాల వక్రాన్ని గణితపరంగా వ్యక్తం చేస్తారు.
గ్రహాలని మనం
పరిపూర్ణ గోళాలుగా ఊహించుకుంటాం. అవి నిజంగా పరిపూర్ణ గోళాలు కాకపోయినా గణితపరంగా అదొక
అనువైన ఉజ్జాయింపు అవుతుంది. అదే విధంగా తరంగం ఆకారాన్ని గణితపరంగా sin(q)
అనే ప్రత్యేక ప్రమేయంతో వ్యక్తం చేస్తారు. అది ఇలా వుంటుంది.
Y =sin(q) అనే ఈ ప్రమేయంలో q విలువ పెరుగుతుంటే y విలువ
పెరిగి తగ్గుతూ వుంటుంది. q =0 వద్ద y =0
అవుతుంది. q విలువ 90 డిగ్రీల వద్ద y విలువ 1 అవుతుంది.
అలాగే వరుసగా,
q =180, y = 0
q = 270, y = -1
q = 360, y = 0
అవుతుంది. q విలువ అలా అనంతంగా పెరుగుతుంటే ప్రతీ 360 డిగ్రీలకి
q
యొక్క విలువలు ఒకే విధంగా మళ్లీ మళ్లీ ఆవృత్తం అవుతుంటాయి. ఇలాంటి ప్రమేయాలని
ఆవర్తక ప్రమేయాలు (periodic functions) అంటారు.
ఆవర్తక ప్రమేయాలు
చక్రికంగా మారే రాశులని సూచిస్తాయి. చక్రికంగా మారే అత్యంత సామాన్యమైన ప్రక్రియకి ఉదాహరణని
తీసుకోవాలంటే ఒక చక్రం (లేదా వృత్తం) మీద సమ వేగంతో కదిలే బిందువుని తీసుకోవచ్చు. కింద
చిత్రంలో సూచించినట్టు O కేంద్రంగా
r వ్యాసార్థంగా గల వృత్తం మీద P అనే బిందువు కదులుతోంది. OP అనే రేఖ x-అక్షంతో q అనే కోణాన్ని ఏర్పరుస్తోంది. P నుండి x-అక్షం మీదకి లంబాన్ని గీస్తే అది x-అక్షాన్ని N వద్ద కలుస్తోంది.
PN విలువని h తో సూచిద్దాం.
అప్పుడు sin(q) ని ఈ విధంగా వ్యక్తం చెయ్యొచ్చు.
Sin(q) = h/r
Sin() ప్రమేయాన్ని తరంగానికి వర్తింపజేసినప్పుడు sin(q) బదులుగా
sin(x) అని వాడుతాం. ఇక్కడ x అనే రాశి నీటి ఉపరితలం మీద దూరాన్ని సూచిస్తుంది.
(అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. వాస్తవ తరంగాలు అన్నీ అచ్చం sin(x) మాదిరిగానే వుండవు. వాటిని ఉజ్జాయింపుగా మాత్రమే sin(x)
తో వ్యక్తం చేస్తారు. ఓ పరిపూర్ణమైన, ఆదర్శవంతమైన తరంగం sin(x) లాగా వుంటుంది అనుకోవాలి. )
తరంగంలో అత్యున్నత
స్థానాలని శృంగం అంటారు. అట్టడుగున వున్న స్థానాలని ద్రోణి అంటారు (చిత్రం).
ఇందాక నీటి తరంగం
ఒక ప్రత్యేక తరుణంలో చిత్రం ** లోని sin(x) ఆకారంలా ఉండొచ్చు. కాని కాసేపయ్యాక చూస్తే
ఆ తరంగ పక్కకి జరుగుతుంది. అలా తరంగం పక్కకి జరిగినప్పుడు, తరంగం యొక్క ఈ కొత్త స్థితిని
sin(x) బదులుగా sin(x - a) అనే ప్రయేయంతో వ్యక్తం
చెయ్యొచ్చు. Sin(x) మరియు sin(x-a) ప్రమేయాలని ఒకే గ్రాఫులో ప్రదర్శిస్తే ఇలా వుంటుంది.
పై గ్రాఫులో
నీలం రేఖని కుడి పక్కకి కదల్చగా ఏర్పడ్డదే
ఆకుపచ్చ రేఖ. రెండిటికీ మధ్య తేడా a
=45 డిగ్రీలు. ఇలా పక్కకి కదల్చడం కాకుండా
ఆకుపచ్చ రేఖని నీలం రేఖ నుండి పుట్టించడానికి
మరో విధానం కూడా వుంది.
ఇప్పుడు నీలం
రేఖలో ప్రతీ బిందువుని బాణాలతో సూచించినట్టుగా కిందకి గాని, పైకి గాని జరిపామని అనుకోండి.
అలా జరపడం వల్ల ఆకుపచ్చ రేఖ పుడుతోంది. అంటే
తరంగం మీది వివిధ బిందువులు కిందకి, పైకి కదులుతుంటే అందుకు ఫలితంగా తరంగం పక్కకి కదిలినట్టు
కనిపిస్తుంది అన్నమాట.
వాస్తవంలో ఈ
విషయాన్ని పరీక్షించుకోడానికి నీటి తరంగం మీద
ఓ చిన్న కాగితం ముక్కని వేసి చూడొచ్చు. తరంగం వేగంగా పక్కకి జరుగుతున్నా, కాగితం ముక్క
మాత్రం ఉన్న చోటే పైకి కిందకి కదులుతుంటుంది.
పైన చిత్రం లో చూపించిన ప్రక్రియ ఆధారంగా స్టేడియమ్
లలో ప్రేక్షకులు లయబద్ధంగా పైకి కిందకి లేస్తూ స్టేడియం అంతా వ్యాపించే ఓ ‘మానవ తరంగాన్ని’
సృష్టిస్తారు. అలాంటి ఓ తరంగాన్ని ఈ వీడియోలో చూడొచ్చు.
ఇలాంటి సరదా
ప్రయోగం క్లాసులో కూడా చేసుకోవచ్చు. క్లాసులో పిల్లలని ఒక పెద్ద వలయాకారంలో కూర్చోబెట్టాలి.
ముందుగా ఎవరో ఒక పిల్లవాణ్ణి లేచి కూర్చోమనాలి. కాస్త ఆలస్యంగా అతడి/ఆమె పక్క విద్యార్థిని
కూడా అలాగే లేచి కూర్చోమనాలి. ఇలా వరుసగా చేస్తూ పోతే విద్యార్థుల వలయంలో తరంగం పుడుతుంది.
(ఇంకా వుంది)
రాకెట్ వేగాన్ని నియంత్రించే
కారకాలు ఏమిటి?
రాకెట్ లోంచి బయటికి వచ్చే వాయువులు
ఎంత వేగంగా వస్తే రాకెట్ అంత వేగంగా ముందుకు దూసుకుపోతుంది. అంటే అలాంటి వాయువులని
ఉత్పన్నం చేసే ఇంధనాలని రాకెట్ లో వాడాలన్నమాట. హైడ్రోజెన్, ఆక్సిజన్ వాయువులని ఇంధనంగా
వాడినప్పుడు వాటి కలయిక వల్ల అత్యధిక వేగం
గల బహిష్కృత వాయువులు (exhaust gases) రాకెట్ లోంచి బయటికి వస్తాయి.
వాయు ఇంధనాలని వాడినా సంక్షిప్తం
ఉండేందుకు గాను వాటిని ద్రవ రూపంలో మోసుకుపోతారు. కాని హైడ్రోజెన్ తో వచ్చిన చిక్కేంటంటే
అది అత్యంత తేలికైన వాయువు కనుక ద్రవ రూపంలో కూడా అది ఎంతో ఘనపరిమాణాన్ని ఆక్రమిస్తుంది.
అంటే దాన్ని కలిగి వుండే టాంకులు మరీ పెద్దవై ఉండాలన్నమాట. హైడ్రోజెన్ తో మరో చిక్కేంటంటే
అది ద్రవ రూపంలో ఉండాలంటే దాన్ని -253 డిగ్రీల
సెంటిగ్రేడ్ కన్నా తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉంచాలి. వాయువులని అంత తక్కువ ఉష్ణోగ్రత వద్ద
ఉంచడానికి రాకెట్ లో ప్రత్యేక యంత్రాంగం కావలసి వస్తుంది. ఈ బాదరబందీలు లేకుండా ఉండాలంటే
హైడ్రజీన్ (hydrazine) మరియు నైట్రిక్ ఆసిడ్ ల మిశ్రమాన్ని వాడొచ్చు. ఈ ద్రవాలు నీటి
కన్నా బరువైనవి. కనుక వీటిని కాస్త చిన్న టాంకులలో ఉంచొచ్చు. వాటి వినియోగంలో కూడా ప్రత్యేక సమస్యలేవీ రావు.
ద్రవ ఇంధనాలు వాడే రాకెట్ ఇంజెన్లలో
కిరోసిన్, పెట్రోల్, టర్పెంటైన్, పరాఫిన్ మొదలైన పదార్థాలు వాడుతారు. వాటికి పర్ క్లోరిక్
ఆసిడ్, హైడ్రోజెన్ పెరాక్సయిడ్ మొదలైన ఆక్సిడెంట్లు కలుపుతారు.
ఇలాంటి రసాయనిక ఇంధనాల వల్ల
సుమారు 2.5 కిమీ/సెకను వేగం గల బహిష్కృత వాయువులు
పుడతాయి. అయితే ఈ వేగాన్ని ఇంకా పెంచాల్సిన అవసరం వుంది.
రాకెట్ వేగాన్ని మరింతగా పెంచడానికి
మరో చిట్కా వుంది. రాకెట్ లాంచ్ లో బూస్టర్
రాకెట్ (booster rocket) అనే అదనపు రాకెట్
దశని వాడుతారు. దీని ప్రోద్బలం వల్ల రాకెట్ ఒక నిర్ణీత ఎత్తు వరకు లేచి, ఒక నిర్ణీత
వేగాన్ని చేరుకున్న తరువాత బూస్టర్ రాకెట్ అసలు రాకెట్ నుండి వేరు పడి పారాచూట్ సహాయంతో
భూమిని చేరుకుంటుంది. ఇంధనం అంతా పూర్తిగా హరించుకుపోయిన ఖాళీ బూస్టర్ రాకెట్ ముఖ్య
రాకెట్ నుండి వేరు పడడం వల్ల ముఖ్య రాకెట్ బరువు తగ్గుతుంది. ముఖ్య రాకెట్ లో ఉన్న
ఇంధనం సహాయంతో అది మరింత అధిక వేగాలని చేరుకునే అవకాశం వుంది.
ఈ విధంగా పలు దశలు గల రాకెట్
ల రూపకల్పన ద్వారా రాకెట్ లో అత్యధిక వేగాలని సాధించడానికి వీలయ్యింది. ఇలా పలుదశలు
గల రాకెట్ ని సంకీర్ణ రాకెట్ (composite rocket) అంటారు (చిత్రం).
(Image: http://www.suntrek.org/solar-spacecraft/satellites-rockets/how-rockets-work.shtml)
అయితే రసాయనిక ఇంధనాలతో సాధించగల
వేగాలకి ఒక పరిమితి వుంది. అంత కన్నా అధిక వేగాలని సాధించేందుకు గాని పరమాణు శక్తి
(atomic energy) ని వాడాలనే ఆలోచన ఎప్పటి నుంచో
వుంది. కేంద్రక చర్యలలో అతి తక్కువ సమయాలలో అత్యధిక శక్తి వెలువడుతుంది. ఆ శక్తితో
ఓ ద్రవాన్ని వాయువుగా మార్చి, ఆ వాయువుని అత్యధిక ఉష్ణోగ్రతల వద్దకి చేరేలా వేడెక్కించడానికి
వీలవుతుంది. అలా వేడెక్కిన బహిష్కృత వాయువులు అత్యధిక వేగం వద్ద రాకెట్ లోంచి బయటికి
వస్తాయి. ఇలాంటి ఏర్పాటులో వాడే ద్రవాన్ని ‘ప్రొపెల్లంట్’ (propellant) అంటారు. ఆ చర్యకి
శక్తిని ప్రసాదించే కేంద్రక పదార్థాన్ని “ఇంధనం” అంటారు.
శక్తి మూలం వేరని తప్ప మిగతా
విషయాలలో సాంప్రదాయక రసాయనిక రాకెట్ కి, ఈ కొత్త కేంద్రక ఇంధనం మీద పని చేసే రాకెట్
కి మధ్య మౌలికమైన తేడా యేమీ లేదు. అయితే కేంద్రక ఇంధనాల వినియోగంలో కొన్ని సమస్యలు
తలెత్తుతాయి. కేంద్రక చర్య వల్ల పుట్టే అత్యధిక ఉష్ణోగ్రతల మీద, పీడనాల మీద పగ్గం వేసి
అదుపు చెయ్యడం అంత సులభం కాదు. మరో సమస్య ఏంటంటే కేంద్రక చర్యల నుండే పుట్టే రేడియోధార్మిక
వికిరణాల (radioactive radiations) వల్ల మానవులకి హాని కలిగే అవకాశం వుంది. అలాంటి
వికిరణాల నుండి రాకెట్ లో ప్రయాణించే వ్యక్తులకి హాని కలగకుండా ఉండాలంటే అందుకు ప్రత్యేక
ఏర్పాట్లు కావాలి. ఉదాహరణకి పరమాణు శక్తితో కార్లని నడిపించొచ్చునన్న భావన డెబ్బై ఏళ్లకి
పైగా వుంది. కాని అలాంటి వాహనంలో పరమాణు చర్యలు జరుగుతున్న మందిరానికి కార్లో కూర్చున్న
మనుషులకి మధ్య రక్షక కవచం లాగ పని చేసే సీసపు
గోడ ఉండాలి. ఆ గోడ బరువు 50 టన్నుల దాకా ఉండాల్సి
వస్తుందని లెక్క వేశారు. ఆ కారణం చేత పరమాణు శక్తి వినియోగం వల్ల అధిక శక్తులు లభ్యమైనా,
అది వాడే యంత్రం యొక్క బరువు అపారంగా పెరిగిపోతుంది. ఈ సమస్యల వల్ల రాకెట్ లో కూడా
పరమాణు శక్తిని వినియోగించే ప్రయత్నం మందగించిందనే చెప్పాలి. అలాంటి రాకెట్ లు ఇప్పటికి
కూడా ప్రయోగాత్మదశలోనే తప్ప వాస్తవ వినియోగంలో లేవు.
(ఇంకా వుంది)
అంతరిక్షం నుండి
భూమికి…
రోమర్ అంచనా
వేసిన కాంతి వేగం విలువకి ఖగోళ శాస్త్రవేత్తలు పెద్దగా స్పందించలేదు. దానికి కారణం
అంత పెద్ద వేగం గురించి వాళ్లు ఎప్పుడూ కని విని ఎరుగకపోవడమే. అంతేకాక గడియారం సహాయంతో
అంత కచ్చితంగా కాలాన్ని కొలవడం కూడా ఆ రోజుల్లో కాస్త విడ్డూరంగా అనిపించేది. ఈ కారణాల
చేత రోమర్ ఫలితాలని ఇంచుమించు పూర్తిగా విస్మరించబడినట్టే. ఓ డెబ్బై ఏళ్ల పాటు అంతా
ఆ విషయమే మర్చిపోయారు.
ఇంతలో శాస్త్రవేత్తల
ధ్యాస మరో ఖగోళ విశేషం మీదకి మళ్లింది. తారలు మన నుండి చాలా దూరంలో వున్నాయని ఎంతో
కాలంగా మనుషులు నమ్ముతూ వచ్చారు. కాని ఆ దూరం
ఎంత అన్నది విషయం మీద ఎవరికీ పెద్దగా అవగాహన ఉండేది కాదు. భూమి సూర్యుడి చుట్టూ ప్రదక్షిణ
చేస్తుంది కనుక భూమి బట్టి సూర్యుడి స్థానం గణనీయంగా మారుతూ ఉంటుంది. కాని తారలు బాగా
దూరంలో ఉంటాయి కనుక మన బట్టి వాటి స్థానంలో
పెద్దగా మార్పు ఉండదు.
సూర్యుడికి భూమి
ఒక వైపున ఉన్నప్పుడు, ఇక్కణ్ణుంచి ఓ సమీప తారని చూసినప్పుడు, ఓ సుదూర తారకి ఈ సమీప
తారకి మధ్య కోణీయ దూరం కొంత ఉండొచ్చు. భూమి సూర్యుడికి అవతలి వైపున ఉన్నప్పుడు (ఆర్నెల్ల
తరువాత) అక్కణ్ణుంచి చూసినప్పుడు, ఆ రెండు తారల మధ్య కోణీయ దూరం విలువ వేరుగా ఉండొచ్చు.
సూర్యుడికి ఇరు వైపుల నుండి ఓ సమీప తారని చూసినప్పుడు దాని దిశలో చెప్పుకోదగ్గ తేడా
ఉండొచ్చు. కాని అదే విధంగా సూర్యుడికి ఇరు వైపుల నుండి సుదూర తారని చూసినప్పుడు దాని
దిశలో పెద్దగా తేడా ఉండకపోవచ్చు (చిత్రం).
సుదూర తారల నేపథ్యం మీద సమీప తారల స్థానంలో వచ్చే
మార్పునే ‘దృష్టి విక్షేపం’ (parallax) అంటారు. ఈ దృష్టి విక్షేపం ఎలా పని చేస్తుందో
అర్థం చేసుకోడానికి ఓ చిన్న ప్రయోగం చెయ్యొచ్చు. మీ ముఖానికి ఎదురుగా, ఓ అడుగు దూరంలో
మీ బొటన వేలిని చిత్రంలో చూపించినట్టు పట్టుకోవాలి. ఇప్పుడు మీ ఎడమ కన్ను మూసుకుని,
కుడి కంటితో చూస్తూ మీ బొటన వేలి వెనుక ఏ వస్తువు ఉందో గుర్తుంచుకోవాలి. అది ఓ చెట్టో,
ఓ బల్లో, ఓ కుర్చీనో… ఇలా నేపథ్యంలో ఉన్న, బొటన వేలి వెనుకగ వున్న, వస్తువుని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కుడి కన్ను మూసుకుని, ఎడమ కంటితో చూస్తే
అదే విధంగా బొటన వేలి వెనుకగా ఉన్న వస్తువుని గుర్తించాలి. ఇప్పుడు కుడి, ఎడమ కళ్ళని
మార్చి మార్చి మూసుకుంటూ బొటన వేలి స్థానం ఎలా మారుతోందో గమనించాలి. చూసే కంటిని బట్టి
బొటన వేలి నేపథ్యం మారుతోందని ఈ ప్రయోగాన్ని బట్టి మనం గమనించగలం.
బొటన వేలి స్థానంలో
ఎంత తేడా వచ్చింది అన్న దాని బట్టి మీ ముఖం నుండి మీ బొటన వేలి దూరాన్ని అంచనా వెయ్యడానికి
వీలవుతుంది. అదే విధంగా భూమి సూర్యుడికి ఇరుపక్కల ఉన్న స్థితిలో సమీప తారని చూసినప్పుడు,
ఆ తార స్థానంలో (లేక దిశలో) వచ్చిన తేడా బట్టి భూమి నుండి ఆ తార దూరాన్ని అంచనా వెయ్యొచ్చు.
సైద్ధాంతికంగా
ఈ పద్ధతి బాగానే వుంది గాని వాస్తవంలో తారలు భూమి నుండి ఎంత దూరంలో వున్నాయంటే తారల
వల్ల మనకి కలిగే ‘దృష్టి విక్షేపం’ అతి స్వల్పంగా ఉంటుంది. 1700 ల నాటి దూరదర్శినులు మరీ మోటువి కనుక అంత చిన్న
విక్షేపాలని పసిగట్ట లేకపోయాయి. ఆ విషయం తెలీని శాస్త్రవేత్తలు తారల ‘దృష్టి విక్షేపపు’
విలువలని అదే పనిగా కొలుస్తూ పోయేవారు.
అలా దృష్టి విక్షేపాలని
కొలిచిన వారిలో బ్రిటన్ కి చెందిన జేమ్స్ బ్రాడ్లీ (1693-1762) ఒకడు. అతడి దూరదర్శిని తో ఓ తార యొక్క దృష్టి విక్షేపం
కొలవగలిగాడు.
అయితే తను కొలిచిన
దృష్టి విక్షేపాలు దోషపూరితమైనవి. భూమి ఒక దిశలో కదులుతున్నప్పుడు, తార యొక్క స్థానం
వ్యతిరేక దిశలో స్థానభ్రంశం చెందుతున్నట్టు కనిపించాలి. కాని బ్రాడ్లీ పరిశీలించిన
తార విషయంలో అలా జరగలేదు. తార తప్పుడు దిశలో కదిలినట్టు కనిపించింది. కనుక అదసలు ‘దృష్టి
విక్షేపమే’ కాదని తెలిసింది.
మరి అది దృష్టి
విక్షేపం కాకపోతే బ్రాడ్లీ చూసినదేమిటి?
(ఇంకా వుంది)
1.
మరి
కట్టెల పొయ్యిలో ఊదినప్పుడు మంట ఎందుకు పెరుగుతుంది?
పైన
కొవ్వొత్తి ఉదాహరణలో ఇంధనం వత్తి అనే ఇరుకు దారి వెంట మంటని చేరుకుంటోంది. అక్కడ, వత్తి
కొసలో, అంటే ఆ ఒక్క చిన్న బిందువు వద్ద, మంటని పక్కకి ఊదేస్తే ఇక మళ్లీ మంట పుట్టదు.
మంటని ఊదినప్పుడు వత్తి కొస కాస్త చల్లబడుతుంది. కనుక ఇక మళ్లీ మంట పుట్టదు.
కాని
కట్టెల పొయ్యిలో ఇంధనం ఒక్క బిందువు వద్ద లేదు. కట్టె ఉపరితలం మొత్తం ఇంధనానికి మూలం.
కనుక ఊదినప్పుడు జరిగేది మంటని పక్కకి తొలగించడం కాదు. ఎందుకంటే అన్ని కట్టెల మీద మంటని
ఒకే సారి తొలగించడం జరగదు.
ఊదినప్పుడు
ఏర్పడ్డ వాయు ప్రవాహంలో పీడనం (pressure) తగ్గుతుంది.
దీన్నే వెంచురీ ప్రభావం (Venturi effect) అంటారు. దీన్ని అర్థం చేసుకోడానికి ఈ చిన్న
ప్రయోగం చెయ్యొచ్చు.
రెండు
పొడవాటి కాగితపు బద్దలని వేలాడుతున్నట్టుగా పట్టుకుని (చిత్రం) వాటి మధ్య నుండి ఊదాలి.
మనం ఉదిన గాలికి రెండు కాగితాలు దూరం అవుతాయి అనుకుంటాం. కాని నిజానికి దగ్గరికి వస్తాయి.
కాగితాలకి ‘బయట’ వైపు ఉన్న గాలి పీడనం, ‘లోపలి’ వైపు పీడనం కన్నా ఎక్కువ కావడం వల్ల
గాలి లోపలికి తోసుకొస్తుంది. కాగితాలు దగ్గర అవుతాయి.
http://woodgears.ca/physics/venturi.html
కనుక
కట్టెపొయ్యిలోకి గాలి ఊదినప్పుడు, చుట్టూ ఉన్న గాలి పీడనం కాస్త ఎక్కువగా ఉండడం వల్ల
చుట్టుపక్కల గాలి లోపలికి చొచ్చుకొస్తుంది. దాని వల్ల మరింత ఆక్సిజన్ కట్టెలకి లభ్యం
అవుతుంది. మంట వృద్ధి చెందుతుంది.
కట్టె
పొయ్యిలో ఊదినప్పుడు మరొకటి కూడా జరుగుతుంది. మండే కట్టే వల్ల బూడిద పుడుతుంది. ఆ బూడిద
పొయ్యిలోనే పేరుకుంటూ ఉంటుంది. కట్టె మీద బూడిద పేరుకుని కట్టె లోపలి ఇంధనానికి, బయట
ఉన్న ఆక్సిజన్ కి మధ్య ఓ నిరోధకపు తెరలాగా (insulating layer) ఏర్పడి అడ్డుపడుతూ ఉంటుంది. దీన్నే మనం కాస్త కవితా ధోరణిలో “నివురు గప్పిన
నిప్పు” అంటూ వుంటాం!
కొవ్వొత్తిలో
ఈ బెడద వుండదు. మైనం మండగా ఏర్పడ్డ అంశాలన్నీ ఆవిరై ఆ చుట్టుపక్కల లేకుండా తొలగిపోతాయి.
కనుక ఇంధనం యొక్క ప్రవాహం నిరంతరాయంగా మంట వద్దకి చేరుతూ ఉంటుంది. (మీబోటి నా బోటి
వాళ్లెవరైనా గట్టిగా ఊదేసి రసాభాస చేస్తే తప్ప!!!)
కట్టెల
మీదకి ఊదినప్పుడు ఆ బూడిద పైపూత తొలగిపోతుంది. లోపల వున్న వేడెక్కిన కట్టెకి, పైనున్న
ఆక్సిజన్ తో సంపర్కం ఏర్పడుతుంది. వంట కొనసాగుతుంది…
(కొసమెరుపు:
కట్టెపొయ్యి
చిత్రాల కోసం గూగుల్ లో దేవుళ్లాడుతుంటే దేవుళ్ళా ఈ వెబ్ సైట్ తారసపడింది.
ఆయనెవరో
మన కట్టెపొయ్యిల గొప్పదనాన్ని వేనోళ్లకొనియాడుతున్నారు. కట్టెపొయ్యిల వల్ల ఎన్నో “క్రిమికీటకాలు”
దూరంగా తొలగిపోయని అంటున్నారు. అక్కడితో ఆగక అంత గొప్ప పొయ్యిలని మనకి వారసత్వంగా ఇచ్చిన
మన ప్రాచీన భారత సంస్కృతిని గణుతిస్తున్నారు. హైందవ సంస్కృతికి, ప్రాచీన భారత సంస్కృతికి
జయ్యంటున్నారు.
కట్టెపొయ్యిల
నుండి వచ్చే పొగ వల్ల వచ్చే ఆరోగ్యసమస్యల గురించి కొంత సమాచారం!!!
)
postlink










