శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.
Showing posts with label contact. Show all posts
Showing posts with label contact. Show all posts

అన్య ప్రజ్ఞతో ప్రథమ సమాగమం

Posted by V Srinivasa Chakravarthy Sunday, June 15, 2014 2 comments

ట్రాన్స్‍పోర్టర్ ని పై నుండి కింద పడేయగానే అందులో ప్రయాణిస్తున్న ఎల్లీకి తానో సొరంగంలో పడిపోయిన అనుభూతి కలుగుతుంది. ఆ సొరంగంలో తను జర్రున జారుతూ ప్రచండ వేగంతో కదులుతున్నట్టు అనిపిస్తుంది. మెలికలు తిరుగుతూ అంతరిక్షంలో విస్తరించి వున్న ఆ సొరంగం ఎటు పోతోందో, తనను ఎటు తీసుకుపోతోందో అర్థం కాదు. తనకు కలుగుతున్న అనుభూతులని తన మౌత్ పీస్ లో చెప్తూ రికార్డ్ చేసుకోడానికి ప్రయత్నిస్తుంది.


అలా ఎన్ని నిముషాలు, గంటలు ప్రయాణించిందో తెలియదు. ఉన్నట్టుండి ఒక చోట ఉక్కిరిబిక్కిరి చేసే ఆ చలనం ఆగిపోతుంది. తను ఎక్కడో అంతరిక్షంలో తేలుతున్నట్టు అనిపిస్తుంది. ఎదుట కనిపించిన దృశ్యానికి తనకి నోట మాటరాదు. ఆ అందాన్ని చూడడానికి రెండు కళ్లు చాలవు. ఎదుట ఓ ప్రకాశవంతమైన గెలాక్సీ! మామూలుగా టెలిస్కోప్ ల నుండి సుదూర గెలాక్సీలని పరిశీలించి వాటి ఆకారాలని అందంగా చిత్రీకరిస్తారు. కాని ఇక్కడ తను కళ్లార ఓ అద్భుతమైన ‘స్పైరల్ గెలాక్సీ’ ని చూడగలుగుతోంది. అలాంటి  అనుభూతి పొందిన మొదటి మనిషి తనే. ‘అబ్బ! ఇంత అందాన్ని వర్ణించడానికి నాకే గాని కవిత్వం వస్తే ఎంత బావుంటుంది!’  అనుకుంటుంది మనసులో. మరు క్షణం మళ్ళీ ఆ ఉధృతమైన చలనం మొదలవుతుంది. సొరంగంలో ఎటో కొట్టుకుపోవడం మొదలెడుతుంది.

మళ్ళీ ఓ సారి ప్రయాణం ఒక చోట ఆగుతుంది. కింద చూస్తే ఏదో గ్రహం యొక్క ఉపరితలం మీద బోలెడు సన్నని కాంతులు కనిపిస్తాయి. అదేదో నగరం కాబోలు అనుకుంటుంది. నాగరికతకి చిహ్నం… అలా అనుకునేంతలో మళ్ళీ ప్రయాణం కొనసాగుతుంది.

అలా ఎంతో సేపు ప్రచండ వేగంతో దిక్కు తెన్ను తెలియకుండా ఆ సొరంగంలో  ప్రయాణిస్తుంది. మళ్లీ ఉన్నట్లుండి ఒక చోట చలనం ఆగుతుంది. ఆ కుదుపుకి అంతవరకు నిద్రలో జోగుతున్న తను ఉలిక్కిపడి లేస్తుంది. ఆ క్షణం తను చీకటి ఆకాశంలో నిశ్చలంగా ఒక చోట నిలిచి వుంటుంది. కింద కొంత దూరంలో ఏదో గ్రహం యొక్క ఉపరితలం లాంటిది కనిపిస్తుంది. మెల్లగా ఏదో శక్తి తనని మోస్తున్నట్టు కిందకి దిగుతుంది లేదా దింపబడుతుంది.

అదో సముద్ర తీరంలా వుంటుంది. దూరంగా అంతా చీకటి గా వున్నా సముద్ర తీరం మాత్రం ఏదో చిత్రమైన కాంతితో ప్రకాశిస్తుంటుంది. ఆకాశంలో దూరంలో సన్నని కాంతితో ఇద్దరు సూర్యుళ్లు ప్రకాశిస్తుంటారు. నల్లని తెర మీద వజ్రాలు పొదిగినట్టు పైన తారలు తీక్షణమైన కాంతితో మెరిసిపోతుంటాయి. ఒక విధమైన అలౌకిక సౌందర్యం ఆ ప్రాంతం అంతటా పొటమరిస్తుంటుంది.

కాసేపు ఆ పరిసరాలని తేరిపార చూశాక ఎందుకో ఆ ప్రదేశం కాస్త అవాస్తవికంగా తోస్తుంది ఎల్లీ కి. చేయి చాచి చూస్తుంది. ఆ చేయి దేనికో తగిలి చుట్టూ ఉండే దృశ్యం రాయి విసిరిన నీట్లోని ప్రతిబింబం చెదిరిపోయినట్టుగా విచిత్రంగా చెదిరిపోవడం కనిపిస్తుంది. అప్పుడు అర్థమవుతుంది తనకి. తను చూస్తున్న పరిసరాలు యదార్థం కాదు. అదొక కృతక యదార్థం (virtual reality).

అంతలో అల్లంత దూరంలో తీరం మీద నడుచుకు వస్తూ ఓ ఆకారం కనిపిస్తుంది. ముందు అలుక్కుపోయినట్టుగా, మసక మసకగా వున్న ఆ ఆకారం దగ్గర అవుతున్న కొద్ది మరింత స్పష్టం అవుతూ వస్తుంది. ఆ ఆకారం దగ్గరికి వచ్చాక అదెవరో చూసి అదిరిపోతుంది! అది మరెవరో కాదు. తన తండ్రి! ఎప్పుడో తన చిన్న తనంలో చనిపోయిన తండ్రి!


వెంటనే ఏదో ఆలోచన వచ్చి ఆ వ్యక్తిని తాకి చూస్తుంది. ఇందాక పరిసరాల లాగానే ఆ ఆకారం కూడా చెదిరిపోవడం కనిపిస్తుంది. తన తండ్రి ని పోలిన ఆ ఆకారం కూడా నిజం కాదు!

ఎల్లీ మనసు నిండా కోటి ప్రశ్నలు వున్నాయి. ఏంటి ఇదంతా? అసలు ఎవరు మీరు?  ఆ సందేశం ఎందుకు పంపారు? మా చేత ఈ యాత్ర చెయ్యించడంలో మీ ఉద్దేశం ఏంటి?
ఆ తండ్రి లాంటి ఆకారం చెప్పుకొస్తుంది.

“మీ దగ్గర్నుండి సందేశం (జర్మన్ ఒలింపిక్స్ సందర్భంలో హిట్లర్ టీవీ ఉపన్యాసం) అందగానే మీ ఉన్కి గురించి తెలిసింది. మా ఉన్కిని తెలపడం కోసం దాన్ని రికార్డ్ చేసి తిరిగి మీకు పంపాము. దాంతో పాటు ఈ యాత్ర చెయ్యడానికి కావలసిన సమాచారం పంపాం.”
ఎల్లీ ఆ సొరంగాల గురించి అడుగుతుంది. “అవన్నీ మీరే నిర్మించారా?”
“లేదు. అవి ఎప్పట్నుంచో వున్నాయి. మేం వాటిని కనుక్కుని వాటిని వాడుకుంటూ వుంటాము.”
“ఈ పరిసరాలు, ఇవన్నీ కృతకం కదా. ఇవేవీ నిజం కావుగా?”
“అవును. నీతో సంభాషించడం కొసం, నీకు మరింత అనువుగా ఉండడం కొసం ఇలా చేశాం. ఈ తీరం, ఈ చెట్లు, నేను – ఇవేవీ నిజం కావు. ఇవన్నీ ఓ  కృతక యదార్థం లో మేం చేసిన సృజన మాత్రమే.”
“మరి మా నాన్నగారి గురించి మీ కెలా తెలుసు?”
“నువ్వు ట్రాన్స్‍పోర్టర్ లో ప్రయాణిస్తున్నప్పుడు నీ మెదడులోని స్మృతులని మేం డౌన్ లోడ్ చేసుకున్నాం. ఆ విధంగా నువ్వు మాట్లాడే భాష గురీంచి, నీ అయిన వాళ్ల గురించి, నువ్వు చిన్నప్పుడు పెరిగిన పరిసరాల గురించి తెలుసుకున్నాం. కనుక ఆ రీతిలో నీతో సంభాషణ జరపాలని నిశ్చయించాం. ఎందుకంటే మేం మేముగా నీ ముందుకు వస్తే నువ్వు ఇబ్బంది పడతావు. మా భాషలో నీతో మాట్లాడితే నువ్వు అర్థం చేసుకోలేవు. కనుక మరో గత్యంతరం కనిపించలేదు మాకు.”

ఎల్లీ కాసేపు ఏమీ మాట్లాడదు. జరుగుతున్న అనుభవాలని జీర్ణం చేసుకోడానికి తనకి కష్టంగా వుంది. పైగా ఇన్నేళ్ళ తరువాత తనకి అత్యంత ప్రియమైన తండ్రి ఇలా తనకి తారసపడడం… ఆ వ్యక్తి నిజం కాదని తెలిసినా, అదో యాంత్రికమైన కల్పన అని తెలిసినా, తనలో భావావేశం కట్టలు తెంచుకుంటుంది.

ఇంతలో ఆ తండ్రి లాంటి ఆకారం వీడ్కోలు చెప్తుంది. ఇక తిరుగు ప్రయాణానికి వేళయ్యింది అంటుంది.
కాని ఎల్లీ వెంటనే వెళ్లిపోవడానికి సిద్ధంగా లేదు. ఇంకా ఎన్నో సందేహాలు. వాటన్నిటికీ సమాధానాలు రాబట్టాలి. బోలెడంత కొత్త పరిజ్ఞానంతో తిరిగి వెళ్లాలి. తనని నమ్మి ఇంత వ్యయప్రయాసలతో కూడుకున్న యాత్ర మీద తనని పంపినందుకు మానవాళికి న్యాయం చెయ్యాలి.

“ప్రగతి ఎప్పుడూ చిన్న చిన్న అడుగులతోనే సాధ్యం అవుతుంది,” అంటుందా ఆకారం. “ఈ సారికి ఇంతకు మించి సాధ్యం  కాదు.”
“మళ్లీ ఎప్పుడు?” అడుగుతుంది ఎల్లీ.
“ఏమో చెప్పలేను,” అంటాడు చిరునవ్వు నవ్వుతూ ఆ వ్యక్తి వీడ్కోలు చెప్తాడు.
చుట్టూ పరిసరాలు క్రమంగా ఓ కలలాగా కరిగిపోవడం మొదలెడతాయి. తారలు ధూళిలా రాలి పడిపోతుంటాయి. గాలిలో ఊగుతున్న తాళ వృక్షాలు చీకట్లో నీశ్శబ్దంగా కరిగిపోతుంటాయి.
తిరుగు ప్రయాణం మొదలవుతుంది.
(ఇంకా వుంది)



ఓ విశ్వప్రయాణం మొదలయ్యింది

Posted by V Srinivasa Chakravarthy Thursday, June 12, 2014 0 comments

ఇంచుమించు ట్రిలియన్ డాలర్ల  పై చిలుకు వ్యయంతో నిర్మించబడుతున్న ట్రాన్స్‍పోర్టర్ ఓ మూఢుడి దుడుకు చేష్ట  మూలంగా కళ్ల ముందే అలా నీళ్లపాలు అవ్వడం చూసి కేప్ చుట్టూ బారులు తీరి వున్న ప్రేక్షక వర్గం నిర్ఘాంతపోతారు.

ఎన్నో ఎదురుదెబ్బలు రుచి చూసిన ఎల్లీ కూడా ఆ దెబ్బకి వెంటనే తేరుకోలేకపోతుంది. తను వెళ్లలేకపోయినా ఏదో విధంగా ప్రాజెక్ట్ విజయవంతమై, ఎవరో ఒకరు ఆ యాత్ర చేసి సుదూర గ్రహ వాసులని సంపర్కించి రాగలిగితే తనకి అంత కన్నా సంతోషకరమైన విషయం లేదు. కాని ఇప్పుడా ఆశలన్నీ నీటగలిశాయి.

అంతలో ఎస్. ఆర్. హాడెన్ మళ్లీ తనని సంపర్కిస్తాడు. విచారపడవలసిన పని లేదని, గుట్టుగా అదే యంత్రం యొక్క మరో నమూనాని జపాన్ లో హొకాయ్డో దీవి మీద నిర్మిస్తున్నారని చెప్తాడు. ఇంకా సంతోషకరమైన వార్త ఏంటంటే, దీని నిర్మాణంలో మీడియా జోక్యం వుండదు. అనవసరమైన రాజకీయ పితలాటకం వుండదు. ఎందుకంటే అందులే హాడెన్ పెట్టుబడి ఎంతో వుంది.

ఇక ట్రాన్స్‍పోర్టర్ లో ప్రయాణించబోయేది ఎవరో కాదు – హాడెన్ కి ఎంతో ప్రీతి పాత్రమైన, అతడి గౌరవాన్ని, విశ్వాసాన్ని మొదటి నుండి చూరగొన్న డా. ఎలియనోర్ ఏరోవే!

అది విన్న ఎల్లీ ఎగిరి గంతేస్తుంది.
ప్రయాణానికి సన్నాహాలు మొదలవుతాయి.  అందులో భాగంగా ఓ సయనైడ్ కాప్సూల్ అవసరమైతే వుంటుందని ఇస్తారు. మాన్యుయల్ లో వున్నది తప్ప మరే ఇతర జాగ్రత్తలూ తీసుకోవద్దని వాదిస్తుంది ఎల్లీ. ఆ మాన్యుయల్ మీద, తార నుండి వచ్చిన సందేశం మీద ఆమె నమ్మకం అలాంటిది!

గోళాకారంలో వుండే ట్రాన్స్‍పోర్టర్ మధ్యలో వున్న ఓ కుర్చీలో కూర్చుంటుంది ఎల్లీ. అందులో ఇంకేమీ వుండవు, కంట్రోల్ పానెళ్లు, మానిటర్లు, రంగురంగుల ఎల్. ఈ.డి…. ఇవేమీ వుండవు. హెల్మెట్ కి ఓ చిన్న కామ్ కార్డర్ తగిలించి వుంటుంది. అప్పట్నుంచి జరగబోయేదంతా రికార్డ్ చేసి తిరిగి వచ్చాక భూలోకానికి ప్రకటించాలనే ఉత్సాహంతో వుంది ఎల్లీ!

మూడు వలయాలలో కరెంటు స్థాయిని క్రమంగా పెంచుతూ పోతారు. వాటి నడి బొడ్డులో తీక్షణమైన విద్యుదయస్కాంత క్షేతం ఏర్పడుతుంది. ఆ ప్రదేశంలో ఉన్నట్లుండి ఓ చిన్నపాటి సూర్యుడు ప్రత్యక్షమైనట్టుగా ప్రచండమైన కాంతి ఉత్పన్నమవుతుంది.


లోపల కుర్చున్న ఎల్లీకి ట్రాన్స్‍పోర్టర్ దేహం అంతా కంపిస్తున్నట్టుగా తోస్తుంది. అంతే కాక దాని పదార్థంలో ఏవో చిత్రమైన మార్పులు రావడం కనిపిస్తుంది. వెండి రంగులో వున్న గోడలు కాస్త క్రమంగా పారదర్శకంగా అయిపోతున్న అనుభూతి కలుగుతుంది.

అనుకున్నట్టుగానే ట్రాన్స్‍పోర్టర్ ని పై నుండి ఆ వలయాల మధ్య పడేట్టుగా కింద పడేస్తారు.
ఆ క్షణం ఎల్లీకి కలిగిన అనుభూతి ఆమెని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది.

(ఇంకా వుంది)






ఓ పెద్ద  సభలో ట్రాన్స్‍పోర్టర్ లో ప్రయాణించగోరే పోటీదార్ల ఇంటర్‍వ్యూ జరుగుతుంది. శాస్త్రీయ విషయాల మీద ఎల్లీ అద్భుతంగా సమాధానాలు చెప్పే సభని మెప్పిస్తుంది. ఇక చివరిగా ఒక పెద్దాయన ఒక ప్రశ్న అడుగుతాడు –
“డాక్టర్ ఏరోవే! మీరు దైవాన్ని నమ్ముతారా?”

ఎల్లీకి ఒక్క క్షణం ఆ ప్రశ్న అర్థం కాదు.

“మీరు అధ్యాత్మికతని నమ్ముతారా?” ఈ ప్రశ్న వచ్చిన దిక్కులో చూసి ఉలిక్కి పడుతుంది ఎల్లీ. అది అడిగింది పామర్ జాస్. ఏంటి ఇతగాడి ఉద్దేశం?

 “నేను నైతిక జీవనాన్ని నమ్ముతాను. ఇక దైవం మాటకి వస్తే ఒక శాస్త్రవేత్తగా కచ్చితమైన ఆధారాలు ఉండే విషయాలని తప్ప వేరే విషయాల జోలికి పోను. అయినా ఇదొక వైజ్ఞానిక కార్యం. ఇందులో దేవుడి ప్రసక్తి ఎందుకు వస్తోందో అర్థం కావడం లేదు,” అంటుంది కాస్త విసుగ్గా.

“తప్పకుండా వస్తుంది. మీరు ఈ ప్రయాణంలో కేవలం ఓ శాస్త్రవేత్తగా వెళ్లడం లేదు. మొత్తం మానవ జాతికి ప్రతినిధిగా వెళ్తున్నారు. మనుషుల్లో తొంభై శాతం మంది ఏదో ఒక రకంగా దేవుడు అన్న భావనని సమ్మతిస్తారు. దేవుడే లేడని నమ్మే మీరు మమ్మల్ని అందరినీ వెర్రి వాళ్ల కింద జమకడుతున్నట్టే కదా? మరి మా ప్రతినిధిగా మీరు ఎలా వెళ్ళగలరు?”

అందుకు ఎల్లీ సమాధానం చెప్పలేక పోతుంది.  పోటీలో తను ఎంపిక కాదు. ఇంతలో డ్రమ్లిన్ వంతు వస్తుంది.
“ఈ ప్రయాణం చెయ్యడం ఈ దేశం, ఈ ప్రజలు నాకు ఇస్తున్న గొప్ప మన్ననగా భావిస్తున్నాను, ఈ అవకాశం దేవుడి ఆశీర్వాదంగా దీన్ని సవినయంగా స్వీకరిస్తున్నాను…”  ఈ తరహాలో ఏవో కమ్మని రాజకీయ వ్యాఖ్యానాలు చేస్తాడు. ఆ సమాధానాలు అందరికీ నచ్చుతాయి. డ్రమ్లిన్ ఎంపిక అవుతాడు.
దాంతో ఎల్లీ కాళ్ల కింద నేల చీలినట్టవుతుంది. రాజకీయం గెలిచింది, విజ్ఞానం ఓడిపోయింది. ఏ మాత్రం నమ్మకం లేకపోయినా కేవలం తాత్కాలిక లాభం కోసం ఏవో పొడి పొడి మాటలు మాట్లాడిన వాళ్లు ఎంపిక అయ్యారు. మనసులో నమ్మిన దాన్ని నిజాయితీగా చెప్పిన పాపానికి తాను ఓడిపోయింది.

ఎల్లీ కోపానికి మరో ముఖ్యమైన కారణం కూడా వుంది. తను అంతగా నమ్మిన పామర్ జాస్, తనని అర్థం చేసుకున్నాడని అనుకున్న పామర్ జాస్ కూడా సభలో అలా తనకి ప్రతికూలంగా మాట్లాడడం సహించలేకపోయింది. నమ్మిన స్నేహితుడు ఇలా ద్రోహం చేస్తాడని కలలో కూడా అనుకోలేదు. ఇక ఆ నాటి నుండీ తనకి, పామర్ కి మధ్య తెగతెంపులు అయిపోయినట్టే భావించింది.

‘ట్రాన్స్ పోర్టర్’ అని  వ్యవహరించబడే ఆ కొత్త నౌక నిర్మాణానికి అయ్యే ఖర్చు ఆకాశాన్నంటేలా వుంది. కనుక అమెరికా దేశంతో పాటు మరి కొన్ని దేశాలు ఆ భారాన్ని భరించి, ఉమ్మడిగా నౌకా నిర్మాణానికి పూనుకుంటారు.
ట్రాన్స్‍పోర్టర్ నిర్మాణం ఫ్లారిడాలో కేప్ కెనావెరల్ వద్ద జరుగుతుంటుంది.

ఆ ట్రాన్స్ పోర్టర్ యంత్రాంగంలో మూడు పెద్ద పెద్ద వలయాలు ఉంటాయి. వాటిలో అత్యధిక స్థాయిలో కరెంటు ప్రవహిస్తుంటుంది. అందువల్ల వాటి మధ్య తీవ్రమైన అయస్కాంత క్షేత్రం ఉత్పన్నం అవుతుంది. ఆ క్షేతం లోంచి పడేలా ట్రాన్స్‍పోర్టర్ ని  పై నుండి కింద పడేస్తారంతే! తార నుండి వచ్చిన సందేశంలో మరి సరిగ్గా అలాగే ఆదేశాలు వున్నాయి. అలా కిందకి వదిలేసిన ట్రాన్స్‍పోర్టర్ గతి ఏమవుతుందో – అది అంతరిక్షంలోకి దూసుకుపోతుందో, లేక ఊరికే ఏట్లో పడిపోతుందో… కచ్చితంగా ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. రకరకాల ఊహాగానాలు మాత్రం నడుస్తుంటాయి.


ఒక పక్క నిర్మాణం కొనసాగుతుండగా మీడియా ఈ వ్యవహారం గురించి హోరెత్తిస్తూ ఉంటుంది. ప్రజలలో  ఒక వర్గంలో, ముఖ్యంగా మత ఛాందస వాదులలో ఈ వ్యవహారం పట్ల క్రమంగా ప్రతికూలత పెరుగుతూ ఉంటుంది. తార నుండి వచ్చిన సందేశం ‘దేవుడి సందేశం’ అన్నట్టుగా ఆ వర్గం వారు ప్రచారం చేస్తుంటారు. కనుక ఆ సందేశం ప్రకారం నౌకని నిర్మించి దేవుడి వద్దకి వెళ్లే ప్రయత్నం మత విరుద్ధం అన్న అంశం మీద వీళ్లు నిరసన వ్యక్తం చేస్తుంటారు.

మతఛాందసులని పట్టించుకోకుండా ప్రభుత్వం నౌకా నిర్మాణం కొనసాగిస్తుంటుంది. అది నచ్చని మతఛాందస వాదం తీవ్రవాదానికి దిగుతుంది. ఆ వర్గంలో ఒకడు రహస్యంగా నిర్మాణదశలో వున్న నౌక లోకి ప్రవేశించి బాంబులతో దాన్ని పేల్చేస్తాడు. ఆ ప్రమాదంలో నౌకా నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న డ్రమ్లిన్ మరణిస్తాడు.

ఈ హఠాత్పరిమాణంతో ఎల్లీ ప్రపంచం పూర్తిగా తల క్రిందులవుతుంది.

(ఇంకా వుంది)

ప్లేటు ఫిరాయించిన డ్రమ్లిన్

Posted by V Srinivasa Chakravarthy Wednesday, June 4, 2014 0 comments


ఆ ఫాక్స్ పంపిన వాడు స్వయంగా ఎస్. ఆర్. హాడెన్. ఎల్లీ వెతుకుతున్న రహస్యం తన వద్ద వుందంటూ, వచ్చిన తనను కలుసుకోమంటాడు.

ఆ సమావేశం హాడెన్ యొక్క ప్రైవేట్ జెట్ లో జరుగుతుంది.

“ఎంతో కాలంగా నిన్ను కనిపెట్టుకుని వున్నాను,” చెప్పుకొస్తాడు హాడెన్. “నీ ప్రతిభ మీద నాకు నమ్మకం వుంది. నువ్వు ఎంతో ఎత్తుకు వెళ్తావని నాకు తెలుసు. కాస్త సహాయం అందిస్తే ఈ కోడ్ రహస్యం కూడా భేదించగలవని అనిపించింది.”

“కోడ్ ని మీరు భేదించారా?” నమ్మశక్యం కానట్టు అడుగుతుంది.

హాడెన్ చిరునవ్వు నవ్వి అవునన్నట్టు తల వూపుతాడు. “మనకి సందేశం పంపిన వాళ్లు మన కన్నా ఎన్నో వేల ఏళ్లు ముందున్న నాగరక జీవులు. వాళ్ళ ఆలోచనా విధానం కూడా మన కన్నా చాలా అధునాతనంగా వుండాలి. ఆ సందేశంలో పేజీలు వరుసక్రమంలో మన పుస్తకాల్లో లాగా లేవు. ఒక ఘనం (cube)  లో కొసల వద్ద మూడేసి ముఖాలు కలుస్తాయి. అదే విధంగా ఈ పేజేలు మూడేసి కలుస్తాయి. అప్పుడ ఒక పేజీలో వున్న సమాచారం దానికి ఆనుకుని వుండే పేజీలో పూర్తవుతుంది…”



హాడెన్ ఇచ్చిన సూచనల అనుసారం ఎల్లీ మొత్తం కోడ్ ని భేదిస్తుంది.  తార నుండి వచ్చిన  సందేశంలోని అంతరార్థం తెలుస్తుంది.

ఆ సందేశంలో ఏదో ఓ కొత్తరకం వ్యోమనౌక నిర్మాణానికి సంబంధించిన ఆదేశాలు వున్నాయి. అయితే ఆ నౌక ఎలా ప్రయాణిస్తుందో, దాన్ని శాసించే భౌతిక సూత్రాలేమిటో ఎవరికీ అర్థం కాదు. ఆ వివరాలు సందేశంలో లేవు.
సందేశం యొక్క ప్రాధాన్యతని గుర్తించిన డ్రమ్లిన్ అంత వరకు ఎల్లీని విమర్శించిన వాడు కాస్తా ఒక్క సారిగా ‘ప్లేటు ఫిరాయిస్తాడు.’ రహస్య సందేశాన్ని మొత్తం తనే ఛేదించినట్టు అందరితో చెప్పుకుంటాడు. అక్కణ్ణుంచి ప్రాజెక్ట్ కి తనే నేతగా వ్యవహరించడం మొదలెడతాడు. ఆ పరిణామానికి ఎల్లీకి ఒళ్లు మండినా, డ్రమ్లిన్ రాజకీయ బలం ముందు చేసేదేమీ లేక ఊరుకుంటుంది.


ట్రాన్స్‍పోర్టర్ లో ఎవరు ప్రయాణిస్తారు అన్న విషయం మీద ఎంపిక మొదలవుతుంది. పోటీలో పాల్గొన్న వారిలో కొందరు వ్యోమగాములు ఉంటారు. కాని ప్రయాణం ఎంత ప్రమాదంతో కూడుకున్నదో అర్థం చేసుకున్న పోటీదారులు ఒక్కొక్కరే పోటీ నుండి తప్పుకుంటారు.

డ్రమ్లిన్ కూడా ఆ పోటీలో పాల్గొనడంతో ఎల్లీకి, డ్రమ్లిన్ కి మధ్య పోటీ హోరా హోరిగా వుంటుంది. అయితే పోటీలో తను గెలుస్తానని ఎల్లీకి చిన్న ఆశ. ఎందుకంటే పోటీ పరీక్ష నిర్వహించే బోర్డులో తనకి చిరకాల స్నేహితుడొకడు వున్నాడు. అతడి పేరు పామర్ జాస్.

ఈ పామర్ జాస్  కూడా మతవర్గానికి చెందిన వాడే.  అయితే ఇతడిది మరీ ఛాందస వాదం కాకపోయినా ‘దైవం’ అనే తత్వం అనుభవానికి అందుతుందని ఇతడి నమ్మకం. సైన్స్ లో ప్రయోగం చేసి విషయాన్ని నిర్ధారించినట్టే స్వీయానుభవంలో దైవం అనే తత్వాన్ని తెలుసుకోవచ్చని ఇతడి వాదం. అదంతా జరగని పని కొట్టి పారేస్తుంది ఎల్లీ.  ఇతడికీ ఎల్లీకీ ఈ విషయం మీద అడపాదపా సంవాదాలు అవుతుంటాయి.



ఎల్లీ కనబరుస్తున్న ప్రతిభ, తెగువ ఇతడికి అబ్బురపాటు కలిగిస్తుంటాయి. ఒక సన్నివేశంలో వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణలో ఎల్లీ వ్యక్తిత్వం, గొప్పదనం అద్భుతంగా వ్యక్తం అవుతాయి.

“ప్రాణాపాయం వుందని తెలిసినా ఈ ప్రయాణానికి ఎందుకు సిద్ధపడుతున్నావు?” సూటిగా అడుగుతాడు పామర్ జాస్.


“చూడు పామర్! నాకు పుట్టి బుద్ధెరిగిన నాటి నుండి మన చుట్టూ కనిపించే ఈ ప్రకృతి, ఈ జీవితం, విశ్వం … వీటి గురించి ఇంతవరకు తెలియని రహస్యాలేవైనా తెలుసుకోవాలని ఎంతో తపించేదాన్ని. ఆ రహస్యంలో ఓ చిన్న అంశం… చాలా చిన్న అంశం… తెలుసుకునే అవకాశం ఇంత కాలం తరువాత దొరికింది. అంత గొప్ప బహుమతి కోసం ఒక ప్రాణం మూల్యం కూడా చెల్లించకపోతే ఎలా?” అంటుంది.

ఒక పక్క ఆమె ఆ ప్రయాణంలో బయల్దేరడం ఇష్టం లేకపోయినా, ఆమె మాటల్లోని లోతు, ఆవేశం, ధైర్యం చూసి విస్మయం చెందుతాడు పామర్ జాస్.


(ఇంకా వుంది)





నాకు బాగా నచ్చిన, ఒక దశలో బాగా ప్రభావితం చేసిన సైన్స్ ఫిక్షన్ సినిమాలలో ‘కాంటాక్ట్’ ఒకటి.
రచయిత, శాస్త్రవేత్త కార్ల్ సాగన్ రాసిన ‘కాంటాక్ట్’ నవల ఆధారంగా తీసిన సినిమా ఇది.

ప్రఖ్యాత ‘కాస్మాస్’ అనే టీవీ సీరియల్ కి కర్తగా  కార్ల్ సాగన్  పేరు చాలా మంది వినే వుంటారు. ‘Broca’s brain,’ ‘Dragons of the Eden’ మొదలైన గొప్ప పాపులర్ సైన్స్ పుస్తకాల రచయితగా కూడా చాలా మందికి సాగన్ పరిచయస్థుడే.

సైన్స్ భావాలని సమాజానికి అందజేసి, ప్రజలలో శాస్త్రీయ దృక్పథం పెంచే దిశగా చేసిన కృషి వల్ల సాగన్ పేరు నలుగురికీ తెలిసిన మాట నిజమే అయినా, కేవలం సైన్స్ ప్రచారకుడిగా మాత్రమే కాక కార్ల్ సాగన్ ఒక శాస్త్రవేత్తగా కూడా తనకంటూ ఒక సముచిత స్థానాన్ని సంపాదించాడు.

ఒక దశలో కార్నెల్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పని చేసిన సాగన్, Search for Extraterrestrial intelligence (SETI)  అనే ప్రాజెక్ట్ లో భాగస్వామ్యం వహించాడు. భూమి మీద కాకుండా విశ్వంలో ఇతర ప్రదేశాలలో ప్రజ్ఞగల జీవులు ఉంటారన్న నమ్మకం మీద ఆధారపడ్డ ఈ ప్రాజెక్ట్ లక్ష్యం అలాంటి జీవుల ఉన్కిని కనిపెట్టడమే. విశ్వంలో విపరీతమైన దూరాల మీదుగా జీవులు ఒకరికొకరు సందేశాలు పంపుకోడానికి రేడియో సంకేతాలు అనువైన మాధ్యమాలు అని నమ్మినవారిలో సాగన్ ఒకడు. ఆ నమ్మకం ఆధారంగా విశ్వంలో పలు మూలాల నుండి వచ్చే రేడియా సంకేతాలని పట్టుకుని, అందులో ప్రజ్ఞని వెల్లడి చేసే అంశాలు ఏవైనా వున్నాయో లేదో తెలుసుకునే ఉద్దేశంతో విశ్లేషించే  ప్రయత్నాలు ఎన్నో జరిగాయి. అయితే అలాంటి ప్రయత్నాల వల్ల కచ్చితమైన, ఫలితాలేవీ రాలేదు.

కాని అలాంటి ప్రయత్నమే ఫలిస్తే ఎలా వుంటుంది? అన్న అవకాశానికి మూర్తి రూపాన్నిస్తూ రాసిన నవల, తీసిన సినిమా కాంటాక్ట్.

కథానాయిక ప్రధాన పాత్రగా గల ఈ సినిమాలో ముఖ్య పాత్ర పేరు డాక్టర్ ఎలియనోర్ ఆరోవే (Dr. Eleanor Arroway). (క్లుప్తంగా ఎల్లీ అంటారు). మేటి హాలీవుడ్ తార జోడీ ఫోస్టర్ మరెవరూ ఈ పాత్ర పోషించలేరేమో నన్నంత గొప్పగా ఈ పాత్ర పోషించిందని నాకు అనిపించింది.

ఎల్లీ కి చిన్నప్పుడే తల్లి చనిపోతుంది. తండ్రి మళ్లీ పెళ్ళి చేసుకోకుండా కూతురే సర్వస్వం అన్నట్టుగా కూతుర్ని పెంచుతాడు. ముఖ్యంగా చిన్నప్పట్నుంచి కూతురిలో శాస్త్రీయ దృక్పథాన్ని జాగ్రత్తగా పోషిస్తాడు. చిన్నప్పుడు సరదాగా HAM Radio club  లో చేరుతుంది ఎల్లీ. అలా రేడియో సంకేతల్తో తనకి తొలి పరిచయం ఏర్పడుతుంది. అలాగే దూరదర్శినిలో ఖగోళాన్ని పరిశిలించే అలవాటు కూడా తండ్రి నుండే అబ్బుతుంది.

“చీకటి ఆకాశంలో ఇంపుగా మెరుస్తుంటుందని ఆ గ్రహానికి సౌందర్య దేవత వీనస్ పేరు పెట్టారు. కాని ఆ గ్రహం సల్ఫురిక్ ఆసిడ్ వర్షాలతో, నిప్పులు చెరిగే ఉష్ణోగ్రతతో పరమ భయంకరంగా ఉంటుందని విన్న మరుక్షణం నేను ఖగోళ శాస్త్రం అంటే ప్రేమలో పడిపోయాను,” అని  పెద్దయ్యాక ఒక సన్నివేశంలో తనకి అప్పుడే పరిచయం అయిన పామర్ జాస్ తో చెప్తుంది ఎల్లీ.

తన చిన్నతనంలో జరిగిన ఓ సన్నివేశం, తన వ్యక్తిత్వంలో లోతుగా నాటుకున్న శాస్త్రీయ దృక్పథానికి అద్దం పడుతుంది. ఒక రోజు గుండెపోటుతో తన తండ్రి ఉన్నట్లుండి చనిపోతాడు. అర్చకుడు వచ్చి చివరి కర్మలన్నీ చేస్తాడు. తల్లి దండ్రులు లేకుండా ఒంటరిగా మిగిలిపోయిన ఆ  పాపని చూసిన ఏమనాలో తెలీక ఓదార్పుగా   ఇలా అంటాడు – “భగవంతుడి లీలలు అన్నీ మనకి అర్థం కావు. కాని వాటిలో ఏదో మంచి వుందని అనుకుని ఊరుకోవాలంతే.”

అది విన్న ఆ పాపకి మండిపోతుంది. నిష్టూరంగా ఓ సారి అర్చకుడి కేసి చూసి, “నాన్నగారి (గుండెకి సంబంధించిన) మందులు కొన్ని కింద అంతస్థులో కూడా కొన్ని ఉండుంటే సకాలంలో వాటిని అందుకోగలిగి ఉండేదాన్ని,” అంటుంది... ఇంత మాత్రం దానికి దేవుడు, దెయ్యం అంటూ కంటికి కనిపించని విషయాల ప్రస్తావన అనవసరం అన్న ధోరణిలో!

పై చదువులు పూర్తి చేసిన ఎల్లీ  రేడియా ఖగోళ శాస్త్రవేత్త అవుతుంది. విశ్వం నుండి వచ్చే రేడియో సంకేతాలని విశ్లేషించడం ఈమె పని. కాల్టెక్ విశ్వవిద్యాలయం నుండి పీ.హెచ్.డి. పొందిన ఈమె పోర్టో రికోలోని ‘అరెసిబో  రేడియో దూరదర్శిని (Arecibo Radio Telescope) ని వాడుకుంటూ, SETI  ప్రాజెక్ట్ లో భాగంగా విశ్వసంకేతాల అధ్యయనం మొదలుపెడుతుంది.

ఎల్లీ అక్కడ పని చేసే రోజుల్లో ప్రొఫెసర్ డేవిడ్ డ్రమ్లిన్ ఆ పరిశోధనశాలని సందర్శిస్తాడు. ఇతగాడు అమెరికా అధ్యక్షుడికి ‘వైజ్ఞానిక సలహాదారు’గా ఉంటాడు. (ఇటీవల భారత రత్న అందుకున్న మన సి.ఎన్. ఆర్. రావు గారి తరహా అన్నమాట). ఈ డ్రమ్లిన్ కి SETI వంటి కార్యక్రమాల మీద పెద్దగా నమ్మకం లేదు. కనుక SETI  ప్రాజెక్ట్ కి మంజూరు అయిన సొమ్ముని రద్దు చేస్తాడు. “ఎందుకిలా చేశార?” అని ఆ పెద్దమనిషిని నిలదీస్తే, “చూడు ఎల్లీ! ఇలాంటి పనికిమాలిని ప్రాజెక్ట్ లు చెయ్యడం ఓ శాస్త్రవేత్తగా నీ భవిష్యత్తుకి మంచిది కాదు. నీ మంచికే చెప్తున్నాను,” అని ఏదో సర్ది చెప్పబోతాడు. “నా బతుకు, నా ఇష్టం. మధ్యన మీ కేంటి?” అని శివంగిలా విరుచుకుపడుతుంది. కాని నియంత లా పని చేసే డ్రమ్లిన్ తన నిర్ణయం మార్చుకోడు.

 మనసుకి నచ్చిన బాటలో జంకు గొంకు లేకుండా ముందుకి దూసుకుపోవడం తప్ప మరొకటి తెలీని ఎల్లీ, తన పరిశోధనకి కావలసిన ధన సహాయం కోసం ప్రైవేట్ సంస్థలని ఆశ్రయిస్తుంది.

(ఇంకా వుంది)



postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts