Showing posts with label చదువు. Show all posts
Showing posts with label చదువు. Show all posts
చదవడానికి సంసిద్ధత
పిల్లలకి చదవడం ఎలా నేర్పాలి అన్న విషయం మీద మహా మేధావులైన
మన విద్యావేత్తలు ఎన్నో వింత వింత సూచనలిస్తూ వచ్చారు. చదవడానికి పిల్లలని సిద్ధం చెయ్యాలంట.
కేవలం బొమ్మలున్న పుస్తకాలు చాలా చూపించాలంట. ఆ బొమ్మల గురించి పిల్లలని గుచ్చి, గుచ్చి
ప్రశ్నించాలంట. ఇంతకన్నా మతిలేని ఆలోచన నేనెక్కడా విన్లేదు!
ఓ మంచి సారూప్యాన్ని తీసుకుందాం. పిల్లలు అసలు మాట్లాడడం ఎలా
నేర్చుకుంటారు అన్న విషయం గురించి ఓ సారి ఆలోచిస్తే అది నిజంగా గొప్ప అద్భుతంలా తోస్తుంది.
తాము ‘బోధిస్తే’ తప్ప పిల్లలకి ఏమీ అర్థం కాదు అని అహంకరించే పెద్దలకి ఈ అద్భుతం ఓ
పెద్ద గుణపాఠం. తమ చుట్టూ పెద్దలు మాట్లాడుకుంటుంటే పిల్లలు విని నేర్చుకుంటారు. ముఖ్యంగా
ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే పెద్దలు మాట్లాడే దాంట్లో పిల్లలకి నేర్పాలి అన్న ఉద్దేశంతో
మాట్లాడేది చాలా తక్కువ. వాళ్లకి పరస్పరం మాట్లాడుకునే విషయాలు ఉంటాయి కనుక మాట్లాడుకుంటారు.
కనుక పెద్దల మాటల బట్టి పిల్లలకి అంతర్లీనంగా అర్థమయ్యేది ఏంటంటే భాష చాలా ముఖ్యమైనది.
మాటలతో చాలా ప్రయోజనాలు నెరవేరుతాయి. అవి విలువైనవి. మాటలు వాడి పెద్దలు పనులు జరిపించుకుంటారు.
మాటల ప్రాబల్యం, విలువ పిల్లలు చెప్పకుండా గ్రహిస్తారు. మాటలు అత్యంత అవసరమైనవి అన్న
విశ్వాసం వారిలో స్థిరపడుతుంది.
ఎంతో మంది పిల్లల లాగానే నేను కూడా చిన్నప్పుడు నాకు నేనే
చదవడం నేర్చుకున్నాను. నాకు జ్ఞాపకం ఉన్నంత మేరకు నాకు పెద్దగా ఎవరూ నేర్పలేదు. పైకి
చదవడం, చదివించడం వంటివి పెద్దగా ఎవరూ నేర్పలేదు. నేను కొంచెం పెద్దవాణ్ణయ్యాక మా బామ్మ
ఒకావిడ నాకు, మా చెల్లాయికి పుస్తకాలు చదివి వినిపించేది. కాని అప్పటికే నాకు చదవడం
బాగా వచ్చేసింది. హ్యూగో లాప్లింగ్ వ్రాసిన “డాక్టర్ డూ లిటిల్” పుస్తకాలు చదివేది
ఆవిడ. ఇద్దరం ఆవిడకి ఇరుపక్కలా సోఫాలో వెచ్చగా ఒదిగి కూర్చునే వాళ్ళం. పిల్లలకి నచ్చుతుందని
భ్రమ పడి ‘ముద్దు ముద్దు మాటలతో’ చదవడం వంటివి చెయ్యకుండా, ఎలాంటి ఆధిక్యతా భావం లేకుండా,
చాలా మామూలుగా, స్పష్టంగా, గంభీరంగా చదువుతూ పోయేది. అసలు అందుకే ఆ కథలు మాకు నచ్చేవేమో
ననిపిస్తుంది.
చదవడానికి నాకు స్ఫూర్తినిచ్చిన మరో విషయం ఏంటంటే ఆ రోజుల్లో
(అది చాలా చాలా క్రితం) పిల్లల పుస్తకాల్లో చాలా తక్కువ బొమ్మలు ఉండేవి. N.C.
Wyeth అని ఓ గొప్ప చిత్రకారుడు ఉండేవాడు. చాలా
బొమ్మలు అతను వేసేవాడు. రాజులు, రాణులు, సింహాలు, సముద్రపు దొంగలు - ఒక్కటేమిటి వందల కొద్దీ అద్భుతమైన బొమ్మలు. కాని
ఒక పుస్తకంలో కొద్దిపాటి బొమ్మలే ఉండేవి. కనుక ఆ బొమ్మల అర్థం తెలియాలంటే ఆ పుస్తకం
చదవడం తప్పనిసరి అని అర్థమయ్యింది. అందుకని చదవడం ఎలాగోలా నేర్చుకున్నాను.
చదవడానికి పిల్లలు సిద్ధం కావాలంటే అచ్చక్షరంతో గాఢమైన పరిచయం
ఏర్పడాలి. బొమ్మలతో కాదు, అచ్చక్షరంతో. ఎలాగైతే తమ చుట్టూ పెద్దలు మాట్లాడుకునే భాషా
ధ్వనులతో పిల్లల చెవులు నిండిపోతాయో కాస్త పెద్దయ్యాక వాళ్ల కళ్లకి ఇంపైన రంగురంగుల,
పెద్ద పెద్ద అక్షరాలతో విస్తృత సాన్నిహిత్యం ఏర్పడాలి. ఆ విధంగా ఆ అక్షరాలతో పరిచయం
పెరుగుతున్న కొలది ఆదిలో అర్థం లేని ఆకారాలుగా, వక్రాలుగా, వంకరలుగా కనిపించే అక్షరాలు,
క్రమంగా స్థిరరూపాలు సంతరించుకుని, అర్థవంతమైన భాషా ప్రతీకలుగా తమ మనసుల్లో రూపుదిద్దుకుంటాయి.
నా చిన్నప్పుడు ఓ సారి అలాగే ఓ సారి ఓ పుస్తకాన్ని తిరగేయగా, తిరగేయగా మెల్లగా ఇక్కడున్న
అక్షరాన్ని అక్కడ, అక్కడున్న పదాన్ని మరో చోట ఇలా పదాలని గుర్తుపట్టగలిగాను. ఇలా అక్షరాలని
పదాలని గుర్తుపట్టగలిగిన తరువాత క్రమంగా పదాల అర్థమేమిటో తెలుసుకోవాలన్న కుతూహలం కలుగుతుంది.
అంతకు ముందు కలగదు. ఉదాహరణకి మనం ఓ కొత్త భాష నేర్చుకుంటున్నాం అనుకుందాం. ముందు ఆ
భాషలోని సంభాషణల్లోని పదాలని గుర్తుపట్టగలిగిన తరువాత పదాలకి అర్థం ఇదీ అని ఎవరైనా
చెప్పగలిగితే బావుంటుంది. ముందే చెప్తే అసందర్భంగా ఉంటుంది.
పిల్లలు అచ్చక్షరానికి అలవాటు పడేలా చెయ్యాలంటే నాదో సలహా.
పెద్ద పెద్ద అక్షరాలు ఉండే దినపత్రిక ఏదైనా తీసుకోవాలి. పిల్లలు అక్షరాలని గుర్తుపట్టేటంత
పెద్దవిగా ఉండాలి అక్షరాలు. పైగా దినపత్రిక అంటే పెద్దవాళ్లు చదువుకునేది. అందులో విలువైన
సమాచారం వుంటుంది. ఏదో పిల్లలు ఆడుకునే సరదా పుస్తకం కాదు. కనుక పిల్లలకి నచ్చుతుంది.
దాంట్లోని కాగితాలు చించి గోడల మీద అంటించుకోవచ్చు. దినపత్రికే కనుక పిల్లలు పాడుచేసినా
ఫరవాలేదు.
ఈ ప్రాథమిక ఏర్పాట్ల కన్నా పిల్లలు మరో అడుగు ముందుకు వెళ్లాలి.
బళ్లోను, ఇంట్లోను కూడా పిల్లల దృశ్య ప్రపంచాన్ని అందమైన అచ్చక్షరంతో నింపాలి. పెద్దల
ప్రపంచానికి చెందిన నానా రకాల ముద్రిత సమాచారాలతో గోడలని అలంకరించాలి. టైం టేబిళ్లు,
మ్యాపులు, సినిమా టికెట్లు, వ్యాపార ప్రకటనలు, బ్యాంకు ఫారమ్ లు, రైల్వే రిజర్వేషను
పత్రాలు – ఇలా పెద్దల వ్యావహారిక ప్రపంచంలో ముఖ్య పాత్ర గల రకరకాల పత్రాలని గోడలకి
ఎక్కించాలి. పెద్దల లోకంలో చలామణి అవుతూ, ఎన్నో అద్భుత కార్యాలకి అనివార్యంగా ఉండే
సమాచారం ఇలా ఉంటుంది అని వాళ్ల కళ్లకి కట్టినట్టు
ఉండాలి. మనుషులు ఏం చేస్తుంటారు, ఏం చెయ్యగలరు అనేది తెలుసుకోవాలంటే సాంఘికశాస్త్రం
పుస్తకం కన్నా టెలిఫోన్ డైరెక్టరీలోని ఎల్లో పేజీలు మనకి ఎన్నో విషయాలు చెప్తాయి!
(Image: http://www.pressingletters.com/tag/the-arm-nyc/)
(ఇంకా వుంది)
పదాల పరిశీలన
లియొనార్డో బ్లూమ్ ఫీల్డ్, క్లారెన్స్ బర్న్ హార్డ్ అనే రచయితలు
Let us read (చదువుకుందాం రండి) అనే చక్కని పుస్తకం రాశారు. పిల్లలు తమంతకు తాము చదవడం
నేర్చుకునేట్టుగా రాయబడింది ఆ పుస్తకం. కాని దాని రచయితలు ఆ ఉద్దేశంతో ఆ పుస్తకాన్ని
రాయలేదు. ఆ పుస్తకాన్ని వాళ్ల తల్లిదండ్రులు చదివి పిల్లలకి చదవడం నేర్పిస్తారని వాళ్ల
ఉద్దేశం. కాని అలా చెయ్యడం అనవసరం అని, చెయ్యడం వల్ల ప్రయోజనం ఉండదని, మంచిది కాదని
నా ఉద్దేశం. పిల్లలు తమంతకి తాముగా, ఇతరుల పర్యవేక్షణ లేకుండా, అడిగినప్పుడు, అడిగినంత
మేరకు మాత్రమే, సహాయాన్ని అందుకుంటూ ముందుకి సాగినప్పుడు మాత్రమే మరింత మెరుగ్గా సంతోషంగా
చదవడం నేర్చుకుంటారు.
అయితే ఈ పుస్తకం వల్ల పిల్లలకి అంతో ఇంతో మేలు జరుగుతుందనే
అనుకుంటాను. పుస్తకంలో ఇంచుమించు ఓ అరవై పేజీలు పిల్లలకి చదువు ఎలా చెప్పాలి అన్న విషయం
మీద పెద్దలకి ఎన్నో అక్కర్లేని, అర్థం లేని సూచనలు ఉన్నాయి. అది తప్పితే ఈ పుస్తకంలో
ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి. ప్రతీ పేజీ లోను పేజీకి పై భాగంలో ఇంగ్లీషులో ఏకాక్షర
(monosyllabled) పదాలు ఉన్నాయి. ఉదాహరణకి –an శబ్దంతో ముగిసే పదాలు – can, Dan, fan, man,
Nan, pan, ran, tan, ban, an, van. ఆ తరువాత
ఆ పదాలని ఉపయోగిస్తూ చిన్న చిన్న వాక్యాలు ఉన్నాయి. తరువాత -at శబ్దంతో
ముగిసే పదాలు – bat, cat, fat, mat, Nat, pat, rat, sat, at, tat, vat. వీటితో కూడా
వాక్యాలు నిర్మించబడ్డాయి.
తరువాత పేజీలో –ad తో ముగిసే పదాలు. ఇక ఆ పై పేజీల్లో వరుసగా –ap,
-ag, -am, -ab, -at, -at, -ig, -in, -id, మొదలైన శబ్దాలతో అంతమయ్యే పదాలు. ఈ పదాలన్నీ
కావాలంటే మనమే ఆలోచించుకుని కూర్చుకోవచ్చు నిజమే. కాని అవన్నీ అలా ఎవరైనా అనువుగా వర్గీకరించి
ఒక చోట పెద్ద పెద్ద అక్షరాలతో స్పష్టంగా అచ్చు వేస్తే సౌకర్యంగా ఉంటుంది. ప్రతీ పేజీలోను
వచ్చిన నవీన పదాలతో కూర్చిన వాక్యాలు ఉంటాయి. అవి కాక అంతకు ముందు వచ్చిన పదాలు కూడా
ఉంటాయి. అయితే ఆ వాక్యాలు కమ్మని కథలు చెప్పకపోవచ్చు. కాని ఆ దశలో పిల్లలు పదల అర్థం
తెలుసుకోవడమే చాలా గొప్ప విషయం అంటారు రచయితలు. ఇది మటుకు చాలా నిజం. పదజాలం పెరుగుతున్న
కొద్ది వాక్యాలు పేరుకుని కథలుగా రూపొందుతాయి.
అలా మెల్లగా నూరో పేజీ దాకా వచ్చేసరికి (కొన్ని సార్లు ఇంకా ముందే) పిల్లలకి ‘చదువులోని మర్మం’ ఏమిటో పట్టుబడిపోతుంది.
ఆ అనుభవంతో పిల్లలు మెల్లగా వాళ్లంతకు వాళ్లే పత్రికల్లో హెడ్ లైన్లు, సైన్ బోర్డులు,
వ్యాపార ప్రకటనలు మొదలైనవి చదవడం మొదలెడతారు.
ఇలాంటి పుస్తకం ఒకటుంటే పిల్లలకి తిరగేయడానికి బాగుంటుంది.
నా మేనగోడలికి నాలుగేళ్లప్పుడు ఆ పుస్తకం ఒకటి తెచ్చి నా చెల్లెలి చేతిలో పెట్టాను.
దాంతో తన కూతురికి చదువు చెప్తుందని. కాని నా మేనగోడలి విషయంలో గాని, ఆ తర్వాత ఆమె
చిట్టి తమ్ముడి విషయంలో గాని చదువు చెప్పే
ప్రయత్నాలేవీ ఫలించలేదు. చదువు చెబుదామని ఎవరైనా ముందుకొస్తే మొండిగా నిరాకరించేవారు.
బాబోయ్ వద్దని పారిపోయేవారు. అందుచేత అదే పుస్తకాన్ని వాళ్ల అందుబాటులో పెట్టి వదిలేసి
వాళ్ళలో ‘ఈ పుస్తకం నాది’ అనే భావన కలిగేలా ప్రోత్సహించేవారు. ఆ తరువాత కొంత కాలానికి
వెళ్లి చూస్తే ఆ పుస్తకంలో మాసిన మరకలు కనిపించాయి. అవి ఆ పాప చేతి గుర్తులని అర్థమయ్యింది.
కొన్ని నెలల పాటు ఆ పుస్తకంలో పేజీలు బాగా తిరగేసి ఆ అక్షరాల ఆకారాలని పదే పదే మనసులో
నెమరు వేసుకుని వుంటుంది. ఆ అనుభవంతో తరువాత తదితర పుస్తకాలని కూడా తిరగేసి వుండొచ్చు.
చదివే విషయంలో ఆ తరువాత ఆ పాప ఏం ప్రయత్నాలు చేసిందో నేను చూళ్లేదు. ఎందుకంటే అలాంటప్పుడు
తన గదిలోకి వెళ్లి తలుపేసుకుని ఒక్కర్తీ ఏదో చదువుకునేది. మరీ అవసరమైతే ఎవరినైనా ఓ
రెండు ప్రశ్నలు అడిగేది. అలా తన గదిలో ఒక్కర్తీ ఏం చదివేదో ఓ రహస్యంగానే మిగిలిపోయింది.
ఎంతో మంది పిల్లలకి తమకంటూ అలాంటి పుస్తకం ఒకటి వుంటే హాయిగా
కూర్చుని తిరగెయ్యాలని ఉంటుందని నా నమ్మకం. చూడ్డానికి ఆ పుస్తకం ‘పిల్లల పుస్తకం’లా
ఉండదు. అందులో పెద్దగా బొమ్మలు కూడా లేవు. కేవలం నాలుగు పేజీల్లోనే బొమ్మలు ఉన్నాయి.
తక్కిన పేజీల్లో అన్నీ అక్షరాలే. అవీ చాలా పెద్ద అక్షరాలు. సులభంగా పిల్లల దృష్టికి
ఆనుతాయి. అలాగే పదాలు కూడా చిన్న చిన్న పదాలు. వాటి ఉచ్ఛారణ పిల్లలు సులభంగా పట్టుకోగలరు.
నా దగ్గరే కనుక చిన్న పిల్లలు ఉంటే తప్పకుండా ఈ పుస్తకం (ఇలాంటివే
మరెన్నో పుస్తకాలని కూడా) ఇస్తాను. దాన్ని వాళ్లు ఎలా చదువుతారో ఏం చేస్తారో
వాళ్లకే వదిలేస్తాను. నన్ను చదివి పెట్టమని అడిగితే చదువుతాను. లేదంటే ఊరుకుంటాను.
చదివేటప్పుడు మాత్రం వాక్యం క్రింద నా వేలు పోనిస్తూ మెల్లగా స్పష్టంగా చదువుతాను.
కాని మళ్లీ ఆలోచిస్తే ఆ కాస్త చొరవ కూడా పిల్లలు ‘శిక్షణ’ కిందే తీసుకుని అభ్యంతరం
చెప్తారని అనిపించింది. సహాయాన్ని కోరినంత మేరకు అందజేయడం. వద్దంటే దూరంగా ఉంటూ
వాళ్ల స్వయం శిక్షణా ప్రయత్నాలకి సాక్షిగా మిగలడమే మేలైన పద్ధతి అని నా అభిప్రాయం.
(ఇంకా వుంది)
ముప్పై
గంటల చదువు
పిల్లల్లో
స్వతహాగా చదవాలని బుద్ధి పుట్టాలంటే ఈ ‘సహాయం’ ఎంత కాలం అందివ్వాలని అడిగాను రాస్ముస్
ని. ఒక శాస్త్రవేత్తలా రాస్ముస్ తన ప్రయోగాల ఫలితాలని పదిలంగా నమోదు చేసుకుని క్రోడీకరించుకున్నాడు.
మొత్తం 30 గంటలకి పైగా ఏ పిల్లవాడూ తన వద్ద చదవలేదని రాస్ముస్
చెప్పాడు. సారెకు సగటున 20 నిముషాలు చొప్పున ఈ పఠనం కొన్ని నెలల పాటు సాగింది.
కొందరు అంత కన్నా తక్కువ సమయమే చదివారు. కొందరు అసలు ఎప్పుడూ చదవనేలేదు. ‘నై లిల్ స్కోల్’
లో చదివిన పిల్లలలో ఇంచుమించు అందరూ జిమ్నేషియమ్ (హై స్కూల్) కి వెళ్లారు. అక్కడ చదువు
చాలా కఠినంగా ఉంటుంది. అక్కడ కూడా ‘నై లిల్ స్కోల్’ పిల్లలు బాగా రాణించారు. అంటే ఎలా
చదివినా, ఎంత చదివినా స్వతహాగా ముందుకొచ్చి చదివారు కనుక అందరూ మంచి చదువరులుగానే వికాసం
చెందారు.
ముప్పై
గంటల చదువు… ఈ ముప్పై అన్న సంఖ్య నాకు మరో చోట కూడా ఎదురయ్యింది. ఓ సారి ఒహోయోలో క్లీవ్లాండ్
నగరంలో ఓ వయోజన విద్యా కార్యక్రమానికి సలహాదారుగా వెళ్లాను. విద్యార్థుల వయసు ముప్పైకి
యాభైకి మధ్య ఉంటుంది. చాలా పేద వారు. వారిలో సగం మంది నీగ్రో జాతి వారు. చాలా మంది
అపలేషియా పర్వత ప్రాంతం నుండో, దక్షిణ అమెరికా
నుండో క్లీవ్ లాండ్ కి వచ్చినవారు. మొత్తం మూడు వారాల పాటు మూడు దఫాలుగా క్లాసులు జరిగాయి.
మొదటి దఫాలో ప్రతీ రాత్రి రెండు గంటలు, వారానికి ఐదు రోజుల చొప్పున అంటే మూడు వారాలుగా
ముప్పై గంటల పాటు క్లాసులు జరిగాయి.
పాఠాలకి
‘కాలెబ్ గాటిన్యో’ రాసిన ‘Words in colors’ (రంగుల్లో పదాలు) అనే పుస్తకంలో చెప్పబడ్డ
అభ్యుదయ పద్ధతిని (కొంచెం అతితెలివి పద్ధతి అని ఇప్పుడు నాకు అనిపిస్తుంది) వాడడం జరిగింది.
సరిగ్గా వినియోగిస్తే ఈ పద్ధతి సత్ఫలితాలనే ఇస్తుంది. ఇందులో టీచరు పాత్ర ఎక్కువగా
ఉంటుంది. టీచరు గట్టివాడు కాకపోతే ప్రయోగం నీరుగారి పోతుంది. అసలు ఈ టీచర్లకి కూడా
కార్యక్రమానికి కొంచెం ముందే హడావుడిగా తర్ఫీదు ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమాల్లో
టీచర్ల పని తీరు గమనించాను. చాలా మంది టీచర్లు ఈ పద్ధతిని నిపుణంగానే వాడారు అనిపించింది.
ఒకరిద్దరు
చాలా బాగా వాడారు. కొందరు విఫలులయ్యారు. అలాగే విద్యార్థుల్లో, క్లాసుల్లో కూడా వైవిధ్యం
కనిపించింది. కొన్ని క్లాసుల్లో మంచి ఉత్సాహం కనిపించింది. విద్యార్థుల్లో కూడా పట్టుదల
ఉత్సాహం ఉన్నవారు చాలా మంది వున్నారు.
ఇక్కడ
నేర్చుకున్నది ఆ తరువాత విద్యార్థులకి ఎంత వరకు ఉపయోగపడింది అన్న విషయం మీద ఏవైనా అనుసంధాన
అధ్యయనాలు జరిగాయో లేదో నాకు తెలీదు. ఏదైతేనేం. ఈ ముప్పై గంటల పఠనాభ్యాసంతో ఆ విద్యార్థులు
తమకి కావలసిన నైపుణ్యాన్ని, తమకి కావలసినంత మేరకు సంపాదించారని ఆ కార్యక్రమాన్ని చూశాక
నాకు గట్టి నమ్మకం ఏర్పడింది.
ఆ
రోజుల్లోనే పాలో ఫ్రయర్ అనే బ్రెజీలియన్ విద్యావేత్త గురించి విన్నాను. ఇతడు సంఘసంస్కర్త
కూడా. ఇతడు బ్రెజిల్ లో నిరుపేద ప్రాంతాల్లోని పల్లెటూళ్లలో రైతులకి చదవడం, వ్రాయడం
నేర్పించేవాడు. ఆ తరువాత ఆ దేశపు మిలిటరీ ప్రభుత్వం అతగాణ్ణి దేశం నుండి తరిమేసింది.
అది వేరే విషయం. ఈయన బోధించిన విద్యావిధానం ప్రత్యేకంగా ఉంటుంది. కొంచెం ఇలాంటి విద్యావిధానమే
సిల్వియా ఏష్టన్ తన “బ్రహ్మచారిణి,” “ఉపాధ్యాయిని” అన్న పుస్తకాలలో వర్ణించింది. అయితే
పాలో రూపొందించిన విధానం సిల్వియా చెప్పిన దానికి మరింత అభ్యుదయ (రాజకీయంగా విప్లవాత్మకమైనది
కూడా) రూపం అనుకోవచ్చు. రైతులకి రాజకీయ పరిస్థితుల గురించి చెప్తూ, వాటికి, వాటి కారణంగా
తాము ఎదుర్కుంటున్న సమస్యలకి మధ్య సంబంధం గురించి విడమర్చి చెప్పేవాడు. మరి మిలిటరీకి
నచ్చనిది సరిగ్గా అదే! తన సంభాషణలో తరచు దొర్లే పదాలని చదవడం, రాయడం నేర్పించేవాడు.
ఆ పేద రైతులు తమంతకి తాము చదువుకుంటూ పోవడానికి కేవలం 30 గంటల తర్ఫీదు చాలని అతడు కూడా గమనించాడు.
ముప్పై
గంటలు. అంటే స్కూల్లో ఒక వారం. చదవడం అనే ప్రక్రియ యొక్క పరిమాణం.
(ఇంకా వుంది)
ఇవాళ ఉదయానే
మా పక్కింటి ఆవిడ ఏడో క్లాసు చదువుతున్న వాళ్ల పాపని స్కూల్ కి తీసుకెళ్తూ కనిపించింది.
“ఆదివారం కూడా స్కూలు వుందా?” అడిగాను.
“ఏదో పరీక్షట…”
అంటూ ఆ స్కూలు మీద దండకం అందుకుంది ఆవిడ.
అవును కదూ? మన
కడు విచిత్ర మైన విద్యావ్యవస్థలో పిల్లలని సంస్కరించాలంటే వాళ్లకి ముప్పూటలా పరీక్షలు
పెట్టాలి. కిండర్ గార్టెన్ నుండి ఐఐటి వరకు మనకి తెలిసింది అదొక్కటే! పాఠాలు చెప్పడం
– పరిక్షలు పెట్టడం, తప్పితే మళ్లీ పాఠాలు చెప్పడం… అంతకు మించి పెద్దగా ఏవైనా సాధ్యం
అవుతుందో లేదో నాక్కూడా చాలా కాలం వరకు తెలిసేది కాదు. కాని నేను యూ. ఎస్. లో పి.హెచ్.డి.
చదివే రోజుల్లో ఓ చిన్న పుస్తకం చేతిలో పడింది. చదువు విషయంలో అది నా ఆలోచనలని పూర్తిగా
మార్చేసింది. నా పాత ఆలోచనలకి నిప్పంటించేసింది. చదువు మీద నమ్మకం కలిగేలా చేసింది.
ప్రేమ పెరిగేలా చేసింది.
ఆ పుస్తకం పేరు
“Learning all the time.” ఆ టైటిల్ వినగానే
కొందరు కోచింగ్ సెంటర్ల వాళ్ళు “మరి మేం చేస్తున్నది కూడా అదే కదా?” అని ఉత్సాహపడే
ప్రమాదం వుంది. కాని ఇక్కడ రచయిత చెప్తుంది అలాంటి రంపపుకోత చదువు కాదు. సహజంగా శ్వాసలా,
హృదయస్పందనలా, ఓ ఆటలా, అప్రయత్నంగా సాగిపోయే చదువు. అంతర్యాన్ని పోషించి, వ్యక్తిని
తీర్చిదిద్దే చదువు. పుట్టుకకి అర్థం ఏంటో వెల్లడి చేసే చదువు. జీవితం మీద, ప్రపంచం
మీద పట్టును పెంచే చదువు.
Learning
all the time, పుస్తక రచయిత పేరు జాన్ హోల్ట్
(John Holt). ఇతడు అమెరికా కి చెందిన ఓ విద్యావేత్త.
హోల్ట్ యొక్క
వృత్తి జీవనం ఓ ఐదో క్లాసు టీచరుగా మొదలయ్యింది. పిల్లలు అంటే సహజంగా ఇష్టం వుండే హోల్ట్
పిల్లలకి యథాలాపంగా పాఠం చెప్పి ఇంటికి వెళ్లిపోకుండా, క్లాసులో పిల్లలు నేర్చుకునే
విధానాన్ని, వాళ్ల ప్రవర్తనని నిశితంగా పరిశీలించేవాడు. పిల్లలలో ఒక విషయం హోల్ట్ స్పష్టంగా
గమనించాడు. ఎంతటి తెలివైన పిల్లలైనా, ఎంత శ్రీమంతుల కుటుంబాల లోంచి వచ్చిన పిల్లలైనా,
క్లాసులో కాస్త భయంగా, బెరుగ్గా, ఒక విధమైన అభద్రతా భావంతో బాధపడుతున్నట్టు కనిపించేవారు.
క్లాసులో జరిగే తంతంతా ఒక విధంగా వారి మీద, వారి మనసుల మీద జరిగే దాడిలాగా భావిస్తూ,
దాని నుండి తమను తాము ఆత్మరక్షణ చేసుకునే ప్రయత్నంలో ఉన్నట్టు కనిపించారు.
హోల్ట్ గమనించిన
స్కూలు పిల్లలు అంటే కాస్త పెద్ద పిల్లలు ( సుమరు
10 ఏళ్ల వాళ్లు) ఇలా ఉంటే, మరీ చిన్న
పిల్లల (2-3 ఏళ్ల వారు) తీరు బాగా భిన్నంగా
ఉండడం హోల్ట్ గమనించాడు. పెద్ద పిల్లల్లో కనిపించే బెరుకుదనం, ఆత్మవిశ్వాస రాహిత్యం
మొదలైన లక్షణాలు పసిపిల్లల్లో కనిపించవు. బాగా పసి పిల్లలు సందేహాలు ఉంటే తముడుకోకుండా
ప్రశ్నలు అడిగి తెలుసుకుంటారు. ఏదైనా ఆసక్తి
కరంగా కనిపిస్తే (అది పురుగో పుట్రో అని చూడకుండా) జంకు గొంకు లేకుండా దాని వెంట పడి
దాన్ని పరిశీలించి, దాని గురించి తెలుసుకోవాలని చూస్తారు. విషయాల పట్ల ఇలాంటి సహజమైన
ఆసక్తి పెద్ద పిల్ల్లల్లో అణగారిపోయినట్టు కనిపించింది హోల్ట్ కి. ఈ పిల్లల్లో ఏం జరిగింది?
ఈ రకంగా ఆలోచిస్తున్న
హోల్ట్ కి ‘బిల్ హల్’ (Bill Hull) అనే మరో
టీచరు తారసపడ్డాడు. అతడికి కూడా విద్య, బోధన విషయంలో కొన్ని నూతన భావాలు ఉన్నాయి. ఇద్దరూ
కలిసి బళ్లో కొన్ని ప్రయోగాలు మొదలెట్టారు. ఆ ప్రయోగం ప్రకారం బిల్ క్లాసులో పిల్లలకి
పాఠం చెప్తుంటే హోల్ట్ ఒక మూల కూర్చుని పిల్లల స్పందనలని, ప్రవర్తనని పరిశీలిస్తుంటాడు.
ఈ పరిశీలనలే తదనంతరం రెండు గొప్ప పుస్తకాలుగా వెల్లివిరిశాయి.
“How
children fail”, “How children learn” అనే ఈ రెండు పుస్తకాలు 60 లలో అమెరికాలో విద్యారంగంలో చింతనలో విప్లవాత్మకమైన
మార్పులు తెచ్చాయి. బడులలో పిల్లలు అపజయం చెందడానికి కారణాలు శోధించిన హోల్ట్ ఓ విప్లవాత్మకమైన
ప్రకటన చేశాడు. స్కూళ్లు ఎంత కృషి చేసినా పిల్లలు
ఓడిపోతున్నారు అని స్కూళ్లు వాపోతుంటాయి. కాని పిల్లలు ఓడిపోడానికి కారణం అసలు స్కూళ్లే
నంటాడు హోల్ట్.
బడిలో పిల్లలు నేర్చుకోక పోవడానికి
ముఖ్య కారణం భయం. తప్పుడు సమాధానాలు చెప్తానేమో ననే భయం, అలా చెప్తే టీచరు, తోటి విద్యార్థులు
వెక్కిరిస్తారనే భయం, తను చాతకాని వాణ్ణేమో ననే భయం. అది సరిపోనట్టు బళ్ళు బలవంతం మీద
పిల్లల చేత అడ్డవైన విషయాలు రుద్దుతాయి. ఇష్టం లేని, ఆసక్తి లేని విషయాలు వాళ్లకి నేర్పించాలని
చూస్తాయి.
(He held that the primary reason children did not learn in schools was fear:
fear of getting the wrong answers, fear of being ridiculed by the teacher and
classmates, fear of not being good enough. He maintained that this was made
worse by children being forced to study things that they were not necessarily
interested in.) http://en.wikipedia.org/wiki/John_Holt_%28educator%29
స్కూళ్లు, పరీక్షలు,
టీచర్లు, హోం వర్కులు, ఫైన్లు, యూని ఫామ్లు – ఈ ‘బాధ’రబందీ లేవీ లేకుండా పిల్లలు ఇంట్లో
కూర్చుని హాయిగా, స్వేచ్ఛగా, తమని నచ్చిన విషయాలని చదువుకునే ఏర్పాటు గురించి ఆలోచించి
Homeschooling (ఇంటిపట్టున చదువు) పద్ధతికి
పునాదులు వేశాడు. ఈ భావాలని పోషించడానికి, వ్యాపింపజేయడానికి ‘Growing without
schooling’ అనే పత్రిక ప్రారంభించాడు హోల్ట్.
బడి చదువుల కన్నా
ఈ ఇంటిపట్టువు చదువు ఎలా మిన్న? అన్న ప్రశ్నకి సమాధానంగా హోల్ట్ ఇలా అంటాడు.
“బళ్లు బాలేవు
కనుక అందుకు ప్రతిక్రియగా ఇంటిపట్టున చదువు అవసరం అని నేను అనడం లేదు. చదువు అనేది
ఒక అన్వేషణ, ఒక పరిశీలన. మన చుట్టూ ఉండే ప్రపంచం యొక్క, మన పరిసరాల యొక్క పరిశీలన.
ఆ పరిశీలనకి ఇల్లే సరైన వేదిక, అనువైన ఆధారం. బళ్లు ఎంత గొప్పవైనా ఇల్లే మన జీవితానికి
శ్రేష్ఠమైన పునాది.”
హోల్ట్ భావాలని
మనం ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా విద్యావిధానం మీద అతడి పరిశీలనలు మనని ఆలోచించేలా
చేస్తాయి. ఈ రోజుల్లో మన దేశంలో విద్యాసంస్థల సంఖ్య అయితే పెరుగుతోంది గాని, వాటిలో
జరిగే తంతులో పెద్దగా మార్పేమీ రావడం లేదు. చదువులు ఊపిరి సలపనీయనంతగా యాంత్రికంగా
మారుతున్నాయి. దేశ భవిష్యత్తు, పురోగతి అనగానే మన ధ్యాస ‘ఆర్థిక వ్యవస్థ’ మీదకి మళ్లుతుంది
గాని, ఆ వ్యవస్థకి పునాదులు వ్యక్తులు కనుక, ఆ వ్యక్తులని తీర్చిదిద్దేది విద్య కనుక, సమాజం యొక్క భవితని నిర్ణయించడంలో విద్య అత్యంత
ముఖ్యమైన వ్యాపకం అవుతుంది. ఈ సత్యాన్ని మనం తరచు విస్మరిస్తుంటాం
అనిపిస్తుంది.
హోల్ట్ రాసిన
Learning all the time పుస్తకానికి అనువాదం
సీరియల్ రూపంలో మొదలుపెట్టాలని ఉద్దేశం.
postlink






