Showing posts with label పాతాళానికి ప్రయాణం. Show all posts
Showing posts with label పాతాళానికి ప్రయాణం. Show all posts
“అరె! పిల్లాడు,”
ఎగిరి గంతేస్తూ అరిచాను. “మరో మనిషి!”
చూడడానికి ఎవరో
పేద పిల్లాడిలా వున్నాడు. చింకి బట్టలు వేసుకున్నాడు. ముఖం కాస్త దీనంగా వుంది… మాలాగ.
మమ్మల్ని చూసి దొంగలు అనుకున్నాడో ఏమో. కాస్త భయపడుతున్నట్టు వున్నాడు.
అంతలో హన్స్
వేగంగా ముందుకి రెండు అడుగులేసి ఆ పిల్లవాణ్ణి రెక్క పట్టుకుని మావద్దకి లాక్కొచ్చాడు.
మావయ్య ఆ పిల్లవాడితో
అనునయిస్తున్నట్టుగా మాట్లాడుతూ శుద్ధమైన జర్మన్ లో ఇలా అడిగాడు –
“Was
heiszt diesen Berg, mein Knablein? Sage mir geschwind!"
(“ఈ కొండ పేరేంటి నేస్తం? తొందరగా చెప్పు.”)
పిల్లాడు
నోరు మెదపలేదు.
“అంటే
మనం వున్నది జర్మనీ కాదన్న మాట,” మావయ్య మాకేసి చూసి అన్నాడు.
ఈ
సారి మళ్ళీ అదే ప్రశ్న ఇంగ్లీష్ లో అడిగాడు. మళ్లీ అదే మౌనం.
“మూగవాడేమో
పాపం,” అన్నాడు ప్రొఫెసర్ పెదవి విరుస్తూ. ఆయన గార్కి బోలెడు భాషలు తెలుసని కాస్త ఇది
మరి. ఈ సారి పాపం ఫ్రెంచ్ లో అడిగి చూశాడు.
"Comment
appellet-on cette montagne, mon enfant?"
మళ్ళీ
అదే నిశ్శబ్దం.
“ఈ
సారి ఇటాలియన్ లో అడిగి చూద్దాం.” అంటూ ఇలా అడిగాడు,
“Dove
noi siamo?”
“కాస్త
చెప్పవూ? ఇప్పుడు మనం ఎక్కడున్నాం?” నేను కూడా ఆత్రంగా అడిగాను.
అయినా
సమాధానం లేదు.
“ఏరా? సమాధానం చెప్తవా లేదా?” ఈ సారి చెవి మెలిపెడుతూ ఇటాలియన్ లోనే మరో మాండలికంలో అడిగాడు మావయ్య,
“ఏరా? సమాధానం చెప్తవా లేదా?” ఈ సారి చెవి మెలిపెడుతూ ఇటాలియన్ లోనే మరో మాండలికంలో అడిగాడు మావయ్య,
"Come
si noma questa isola?"
“స్ట్రోంబోలీ!” ఈ సారి ఠక్కున
సమాధానం చెప్పాడు పాపం ఆ పల్లె పిల్లవాడు. మావయ్య తేరుకునేంతలో ఆయన చేతుల్లోంచి జారుకుని
అల్లంత దూరంలోని ఆలివ్ చెట్ల వెనుక దాక్కున్నాడు.
స్ట్రోంబోలీ!
మేం అసలు కల్లో కూడా ఊహించని విషయం. మేం ఇప్పుడు వున్నది మధ్యధరా సముద్రపు నడిబొడ్డులో.
ఎయోలియన్ ద్వీపమాలికలో ఇదొక దీవి అన్నమాట. ఈ ద్వీపమాలికకి ప్రాచీన కాలంలో స్ట్రాంగైల్
అని పేరు. (దీని ఆధునిక పేరు సాంటోరినీ ద్వీపమాలిక – అనువాదకుడు). గ్రీకు పురాణం ప్రకారం
ఎయోలస్ అనే వీరుడు ఇక్కడే గాలిని, తుఫానుని గొలుసులతో కట్టేసి, తరువాత బుద్ధి పుట్టినప్పుడు
వొదిలేశాడు. అదుగో, దూరాన తూర్పున కనిపిస్తున్న నీలి కొండలే కాలాబ్రియా కొండలు. ఇంకా
అల్లంత దూరాన మబ్బులకి మాటేస్తున్న బృహన్నగమే ఎట్నా.
“స్ట్రోంబోలీ!
స్ట్రోంబోలీ!” పలవరిస్తున్నట్టుగా నాలో నేనే అనుకున్నాను.
నాతో
పాటు మావయ్య, హన్స్ కూడా ఆ దివ్యనామాన్నే కాసేపు ఆనందంగా జపించారు.
మా
యాత్ర సమాప్తమయ్యింది. ఒక అగ్నిపర్వతం లోంచి భూగర్భం లోకి దూరి, ఆ స్నెఫెల్ పర్వతం
నుండి, ఆ మోడువారిన మంచు భూమి నుండి, ఇంచుమించు రెండు వేల మైళ్ల దూరంలో వున్న మరో జ్వాలాముఖి
నోట్లోంచి ఊడి పడ్డాం. ఎన్నో యాదృచ్ఛిక సంఘటనల ఫలితంగా భువి మీద వెలసిన ఈ దివసీమలో
వచ్చి పడ్డాం. మరణ తుల్యమైన ఆ భయంకర శీతల లోకం నుండి ఈ అతిసుందరమైన ఇటలీ దేశాన్ని చేరుకున్నాం!
ముగ్గురం
‘ఫల’హారం చేసి, చల్లని నీరు కడుపార తాగి త్వరగా స్ట్రోంబోలీ రేవు చేరుకున్నాం. ఇక్కడికి
మేం ఎందుకొచ్చాం, ఎలాగొచ్చాం మొదలైన రహస్యాలన్నీ ఎవరితోనూ పంచుకోదలచుకోలేదు. పడవ మునక
వల్ల ఇలా ఒడ్డుకు కొట్టుకొచ్చిన అభాగ్యులం అని పరిచయం చేసుకున్నాం.
దారి
పొడుగునా మావయ్య ఏదో సణుగుతూనే వున్నాడు. “మరి ఆ దిక్సూచి! ఏంటి మరి అలా చెప్పింది.
అదేమో ఉత్తరానికి చూపించింది. మనమేమో ఇలా దక్షిణానికి వచ్చి చేరాం…”
“నేనో
కారణం చెప్పనా,” కాస్త అసహనంగా అన్నాను. “దానికి జబ్బు చేసుంటుంది. ఇప్పుడదంతా ఎందుకు
మావయ్యా?”
“అదేంటి
ఆలాగంటావు? యోహానియమ్ లో ఆచార్య పీఠాన్ని అలంకరించిన నా బోటి వాడు ఓ మామూలు ఖగోళ రహస్యాన్ని
అర్థం చేసుకోలేకపోవడమా? ఎంత పరాభవం? ఎంత పరాభవం?”
చింకి
బట్టలతో, నడుం చుట్టూ ఓ వికారమైన బెల్టుతో, పక్షులు చూసి జడుసుకునే లాంటి ఆకారంతో,
ముక్కు కొస మీద ప్రమాదకంగా వేలాడే కళ్లద్దాలతో ప్రతిభ ఉట్టీపడే జర్మను ఖనిజశాస్త్ర
ప్రొఫెసర్ మా మావయ్యలో మళ్లీ మూర్తీభవించాడు.
ఓ గంట తరువాత ముగ్గురం సాన్ విన్సెంజో రేవుని చేరుకున్నాం.
హన్స్ కి రావలసిన పదమూడు వారాల జీతభత్యాలు
ముట్టాయి. ముగ్గురం ఘాటుగా కరచాలనాలు చేసుకున్నాం.
నాకైతే
ఇక ఏడుపు ఒక్కటే తక్కువ. మావయ్య గొంతు కూడా గాద్గదికమయ్యింది.
ఎప్పుడూ స్నెఫెల్ పర్వతంలా అస్మితంగా ఉండే ఆ వేటగాడి
ముఖంలో కూడా ఆ క్షణం ఓ చక్కని చిరునవ్వు ఉషోదయంలా వెల్లివిరిసింది.
(సమాప్తం)
(పాతాళానికి ప్రయాణం నవల నేటితో సమాప్తం)
పాతాళ లోకపు
చీకటి కూపాల్లో ఇంతకాలం కొట్టుమిట్టాడిన మేము ఇలాంటి దృశ్యం చూడడానికి కళ్ళు కాయలు
కాచి వున్నాము.
“ఎక్కడున్నాం
మనం? అసలెక్కడ ఇదంతా?” పరధ్యానంగా గొణుగుతున్నట్టుగా అడిగాను.
హన్స్ కేసి తిరిగి
చూశాను, ఏవంటాడా అని. నిర్లక్ష్యంగా కళ్ళు మూసుకుని పడుకుని వున్నాడు.
మావయ్య మాత్రం
ఆశ్చర్యంగా కళ్ళింత చేసుకుని పరిసరాలని చూస్తున్నాడు.
“ఈ పర్వతం పేరు
ఏవైనా కావచ్చు. కాని ఇక్కడ చాలా వేడిగా వుంది. పర్వతంలో విస్ఫోటాలు ఇంకా కొనసాగుతూనే
వున్నాయి. ఇంతా శ్రమ పడి అగ్నిపర్వతం లోంచి బయట పడ్డాక ఏ బెడ్డో నెత్తిన పడి పోవడంలో
అర్థం లేదు. కనుక వీలైనంత వేగంగా ఈ ప్రదేశం నుండి తప్పుకుంటే మంచిది. పైగా నాలుక పిడచకట్టుకు
పోతోంది. కడుపులో అగ్నిపర్వతాలు పేలుతున్నాయి,” మావయ్య తన తీర్మానం వెల్లడి చేశాడు.
చూడబోతే మావయ్య
ఇక్కడే కూర్చుని ఈ ప్రకృతి ఆస్వాదించే స్థితిలో లేడు. నేనైతే తిండి తిప్పలు లేకుండా
మరో రెండు గంటలైనా ఇక్కడే కూర్చుని ఈ దృశ్యాన్ని కన్నార్పకుండా చూసేయగలను. కాని ఏం
చేస్తాం? నలుగురితో నారాయణ…
మేం వున్న పర్వతం
వాలు అంత తక్కువేం లేదు. కిందకి దిగడానికి నానా తిప్పలూ పడ్డాం. కొన్ని చోట్ల బూడిద
దిబ్బల మీద జర్రున జారాం. మరి కొన్ని చోట్ల జ్వాలామయ సర్పాల్లా నెమ్మదిగా మాకు అల్లంత
దూరంలో పాకుతూ ముందుకు పోయే లావా సెలయేళ్లని ఒడుపుగా తప్పించుకుంటూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని
ముందుకి సాగిపోయాం. దారి పొడవునా మరి నేనైతా ఏవో తలా తోకా లేని ప్రశ్నలతో మా నేస్తాలు
ఇద్దరినీ తెగ వేధించానట. తరువాత తెలిసింది.
వాళ్ల దగ్గర్నుండి
తృప్తికరమైన సమాధానాలు రాకపోయే సరికి ఇక నేనే చెప్పేశాను.
“మనం వున్నది
ఆశియాలో. ఇండియా తీరం మీద వున్నాం. లేదా మలయా దీవుల మీద ఎక్కడో వుండి వుంటాం. అదీ గాక
పోతే పసిఫిక్ మహా సముద్రం నడిబొడ్డులో వుండే చిట్టి పొట్టి దీవుల మీద ఎక్కడైనా వున్నామేమో.”
నా ఊహలు అదుపు తప్పాయి. “మనం భూమి కేంద్రం
వరకు పోయి, అవతలి పక్క, అంటే అవతలి ధృవం వద్ద బయటికి వచ్చామనుకుంటా.”
“మరి దిక్సూచి
మాటేవిటి?” మావయ్య నింపాదిగా అడిగాడు.
“అవును కదూ!”
గుర్తు తెచ్చుకుంటూ అన్నాను. “దిక్సూచి ఏదో చెప్పింది నిజమే. దాని ప్రకారం మనం ఉత్తరంగా
వెళ్లాం.”
“మరి అది చెప్పింది
అబద్ధం అంటావా?” మావయ్య అడిగాడు.
“ససేమిరా కాదు.
పాపం అదెందుకు అబద్ధం చెప్తుందీ?”
“పోనీ ఇది ఉత్తర
ధృవం అంటావా?”
“ఇది ధృవం అని
మాత్రం అనను. దీనికి ధృవానికి ఉండాల్సిన లక్షణాలేవీ లేవు.”
ఎంత ఆలోచించినా
ఎక్కడున్నామో పట్టుపడడం లేదు. ఏం అనలేక ఇక నోరు మూసుకున్నాను.
మేం అలా నడుస్తూ
ముందుకి సాగిపోతుంటే ఒక చోట ఓ పచ్చని పరిసరాలలోకి ప్రవేశీంచాం. అందులోకి ప్రవేశించగానే
నా ఆకాలి, దాహం ఒకే సారి లోపలి నుండి తన్నుకొచ్చాయి. చుట్టూ ఆలివ్, దానిమ్మ, ద్రాక్ష
మొదలైన చెట్లు నోరూరిస్తున్నాయి. కోసుకోమని, దోచుకోమని ఆహ్వానిస్తున్నాయి. మేం అదే
చేశాం. ద్రాక్ష గుత్తుల్ని కోసుకుని మెత్తగా నోట్లోకి తోసుకుని ఆరగిస్తుంటే … పాతాళ
లోకం లోంచి సూటిగా స్వర్గ లోకం లోకి వచ్చినట్టు అనిపించింది! అల్లంత దూరంలో స్వచ్ఛమైన
నీరు నీట్లోంచి ఉబుకుతోంది. ఆత్రంగా వెళ్లి అక్కడ ముఖం, కాళ్లు, చేతులు కడుక్కున్నాం.
అలా మాకు చేతనైన
మేరకు ఏవో ఐహిక సుఖాలు అనుభవిస్తుంటే అంతలో ఆలివ్ చెట్ల మాటు నుండి ఓ చిన్న పిల్లవాడు
బయటికి వచ్చాడు.
అధ్యాయం 44
మధ్యధరా సముద్రపు
సుమధుర తీరంపై
నాకు మళ్లీ తెలివి
వచ్చేసరికి మా గైడు ఒక చేత్తో నా బెల్టు పట్టుకుని వున్నాడు. మరో చేత్తో మావయ్యని కాస్తున్నాడు.
నాకు తీవ్రమైన గాయాలేం తగల్లేదు గాని చర్మం బాగా చెక్కుకుపోయింది. చుట్టూ చూసుకుంటే
అగ్నిపర్వత బిలానికి కేవలం రెండు గజాల దూరంలో కొండ వాలు మీద పడి వున్నాను. కాస్త పక్కకి
జారి వుంటే మళ్లీ అగ్నిపర్వత బిలంలో పడి నామరూపాల్లేకుండా మాయపైపోయి వుండేవాణ్ణి.
“ఇంతకీ ఎక్కడ
పడ్డాం మనం?” మావయ్య చిరగ్గా అన్నాడు చుట్టూ చూస్తూ. ఆ చిరాకు ఎవరి మీద? దేని కోసం?
హాయిగా ఆ పాతాళంలో దేవుళ్ళాడక మళ్లీ ఈ భూమ్మీద పడ్డామేంటని కోపమా?
తెలీదన్నట్టు
తల అడ్డుగా ఊపాడు హన్స్.
“ఐస్లాండా?”
“నెజ్” అన్నాడు
హన్స్ నిశ్చయంగా. ఐస్లాండ్ మాత్రం కాదన్నమాట.
“ఏంటీ! ఐస్లాండ్
కాదా?” ఆశ్చర్యంగా అడిగాడు మావయ్య.
“హన్స్ పొరబడి
వుంటాడు,” నెమ్మదిగా పైకి లేచి దుమ్ము దులుపుకుంటూ అన్నాను.
మా అద్బుత, అలౌకిక
యాత్రకి ఇదో కొసమెరుపు. ఎక్కడో ఉత్తర ప్రపంచంలో, ఆకాశాన్నంటే హిమవన్నగాలచేత పరివేష్టితమైన
తెల్లని మంచు భూముల మీద ఎక్కడో పైకి తేలతాం అనుకున్నాను. కాని చర్మాన్ని కాల్చేసే వాడి
రవికిరణాల కింద వ్రేలిపోతూ ఇలా ఓ కొండ వాలు మీద దిగబడతాం అని కల్లో కూడా ఊహించలేదు.
చుట్టూ నిండి
వున్న కాంతికి కళ్లు బైర్లు క్రమ్ముతున్నాయి. ఆ వెలుగుకి అలవాటు పడి చుట్టూ ఏవుందో
అర్థం చేసుకోడానికి కొంత సమయం పట్టింది. నాకైతే మేం చేరుకున్నది కచ్చితంగా స్పిట్జ్‍బెర్గెన్
దీవేనని అనిపిస్తోంది.
నా ఆలోచనలని
చెదరగొడుతూ మావయ్య అన్నాడు –
“ఇది ఐస్లాండ్
లాగా అనిపించడం లేదు.”
“పోనీ ఇది యాన్
మాయెన్ దీవి అయ్యుంటుందా?” అడిగాన్నేను.
“అది కూడా కాదు,”
మావయ్య బదులిచ్చాడు. “ఇదసలు ఉత్తర ప్రాంతంలో వుండే కొండే కాదు. ఇక్కడ మంచు శిఖరాలు
లేవు. ఏయ్ ఏక్సెల్, అటు చూడు!”
మా నెత్తి మీద
ఐదొందల అడుగున పైన అగ్నిపర్వతం యొక్క నోటి అంచు కనిపిస్తోంది. అందులోంచి పది పదిహేను
నిముషాల కొకసారి అగ్నిధారలు ఎగసెగసి పడుతున్నాయి. అగ్నిపర్వతం నోట్లోంచి రగిలే లావా
ద్రవం అంత ఎత్తుకి ఎగజిమ్మబడుతోంది. కొండ వాలు మీదుగా అగ్నిద్రవపు సెలయేళ్లు ప్రవహిస్తున్నాయి.
కాని కొండ దిగువన అంతవరకు కనిపించని పచ్చని చెట్ల గుబుళ్ళు కనిపించాయి. ఆలివ్, అత్తిపండు,
ద్రాక్ష మొదలైన చెట్ల ఆనవాళ్లు స్పష్టంగా తెలుస్తున్నాయి.
ఇది ససేమిరా
ఆర్కిటిక్ మాత్రం కాదు.
ఈ పచ్చని పరిసరాల
కావల విశాల, వీనీల జలాశయమేదో కనిపించింది. కేవలం కొద్దిపాటి కోసుల మేరలో ఆ జలాశయం కొండని
కౌగిలిస్తోంది. కాస్త తూర్పు దిశగా చూస్తే ఓ ముద్దులొలికే చిన్నారి రేవు ఏదో కనిపిస్తోంది.
చిత్రమైన నిర్మాణం గల ఓడలేవో పడి లేచే కెరటాల
మీద అక్కడ ఊయలలాడుతున్నాయి. అల్లంత దూరంలో ఎన్నో చిట్టి చిట్టి ద్వీపాలు విశాలమైన నీలి
నీటి మైదానం మీద చుక్కల్లా మెరిసిపోతున్నాయి. కాస్త పశ్చిమంగా చూస్తే ఏవో సుదూర తీరాలు
నింగి నేల కలిసేచోట మసక వెలుగులో లీలగా గోచరిస్తున్నాయి. ఇంకా దూరాన వున్న మరో తీరం
మీద ఓ గంభీరమైన హిమవన్నగం మేఘమండలాన్ని ఛేదిస్తోంది. ఉత్తరంగా అనంతంగా విస్తరించిన
మహార్ణవం మీద మహోగ్ర భాను కిరణాలు పడగా నీటిపై
ఓ అద్భుత రశ్మి రహదారి ఏర్పడింది. ఆ దారిని
కోసుకుంటూ అప్పుడప్పుడు ఓ ఓడ తెల్లని రెపరెపలాడే తెరచాపల ప్రోద్బలానికి ఠీవిగా నీటి
దారుల వెంట ముందుకు సాగిపోతోంది.
పాతాళ లోకపు
చీకటి కూపాల్లో ఇంతకాలం కొట్టుమిట్టాడిన మేము ఇలాంటి దృశ్యం చూడడానికి కళ్ళు కాయలు
కాచి వున్నాము.
“అవును. సందేహమే
లేదు,” మావయ్య అన్నాడు తన కళ్ళద్దాల్లోంచి నన్ను అదో రకంగా చూస్తూ. భూమి ఉపరితలాన్ని
చేరుకోడానికి ఇంతకన్నా అనువైన మార్గమే కనిపించడం లేదు.”
మావయ్య మాటల
గురించి కాసేపు శ్రద్ధగా అలోచించాను. ఆలోచించి చూస్తే ఆయన చెప్పేది నిజమే ననిపిస్తోంది.
విప్లవాత్మకమైన, అవాస్తవికమైన ఉపాయాలు ఆయన బుర్రలో పుట్టడం ఇది మొదటి సారి కాదు. ఎందుకో
మరి ఈ సారి మాత్రం అయన చెప్పేది నిజం అవుతుందని అనిపిస్తొంది. వింటి నుండి బాణంలా అగ్నిపర్వతం
నడి బొడ్డు లోంచ మేము, మా తెప్ప ఆకాశంలోకి వెళ్ళగక్కబడబోతాం అన్నమాట!
కాలం గడుస్తున్న
కొద్ది మా ఆరోహణ కొనసాగుతూనే వుంది. మా చుట్టూ శబ్దాలు ఇంకా ఇంకా తీవ్రతరం అవుతున్నాయే
తప్ప సద్దుమణిగా సూచనలు కనిపించడం లేదు. మర్త్య ఘడియ అనుకున్నది మా జీవితాల్లోనే ఓ
అమృత ఘడియ కాబోతోందన్న ఆశాభావం మనసంతా అక్రమించుకుంది.
సలసల కాగే నీటి
కెరటం మా తెప్పని ఆగకుండా పైపైకి తీసుకుపోతోంది. ఏదో అగ్నిపర్వతం లోని సొరంగ మార్గంలో
మేము ఎలాగో చిక్కుకున్నాం. మమ్మల్ని అది వాంతి చేసుకునే శుభతరుణం కోసం బిక్కుబిక్కు
మంటూ ఎదురుచూస్తున్నాం.
కేప్ సాక్నుస్సేం
నుండీ కొన్ని వందల కోసులు ఉత్తరంగా కదిలి వచ్చినట్టు వున్నాం. మళ్ళీ ఐస్లాండ్ కిందకి
వచ్చామేమో మరి తెలీదు. హెక్లా మొదలుకొని ఏడు నగరాజాల్లో ఏది మమ్మల్ని వెళ్లగక్కనుందో
తెలియడం లేదు. మరి కాస్త పశ్చిమంగా మరో ఐదొందల కోసుల వ్యాసార్థంలో, అమెరికా ఖండం యొక్క ఉత్తర-తూర్పు కొసలో, ప్రస్తుత అక్షాంశానికి సమాంతరం
అక్షాంశంలో అంత తెలియని కొన్ని అగ్నిపర్వతాలు ఉన్నాయి. ఇక తూర్పు దిశగా చూస్తే
80 డిగ్రీల ఉత్తర అక్షాంశంలో ఎస్క్ అనబడే మరో
అగ్నిపర్వతం వుంది. యాన్ మాయెన్ దీవి మీద వున్న ఈ అగ్నిపర్వతం (ఆధునిక నార్వే లోని)
స్పిట్జ్‍బెర్గెన్ దీవికి ఎంతో దూరంలో లేదు.
ఆ అగ్నిపర్వతాలలో కొన్నిటి బిలాలు ఎంత విశాలంగ వుంటాయంటే, ఒక్క బుల్లి తెప్ప కాదు గదా,
ఇలాంటి తెప్పలు కుప్పలు తెప్పలుగా ఆ పర్వతాలు అవలీలగా వెళ్లగక్కగలవు!
పాతాళంలోంచి
భూలోకానికి మమ్మల్ని తీసుకుపోయే ఆ నిర్గమ ద్వారం ఇంతకీ ఏ అగ్నిపర్వతంలో వుందో తెలుసుకోవాలని
మాత్రం చాలా ఆత్రంగా వుంది.
ఉదయం అవుతున్న
కొద్ది మా ఆరోహణా వేగం మరింత పుంజుకుంది. వేడిమి కూడా తగ్గకపోగా మరింత హెచ్చయ్యింది.
మమ్మల్ని పైకి తోస్తున్న శక్తి ఎలాంటిదో నెమ్మదిగా అవగతం కాసాగింది. వాతావరణ పీడనానికి
కొన్ని వందల రెట్లు అధిక పీడనం ప్రచండ వేగంతో మమ్మల్ని పైకి నెట్టుకుపోతోంది.
పైకి పోతున్న
కొద్ది వికారమైన కాంతులు మా చుట్టూ గోడల మీద తారాడడం కనిపించింది. అక్కడక్కడ గోడల లోని
నోళ్ళు భుగభుగమని పొగలు కక్కుతున్నాయి. అగ్నికీలలు గంగవెర్రులెత్తి నాట్యం చేసున్నాయి.
“అమ్మో! చూడు
మావయ్యా!” భయంగా మంటల్ని మావయ్యకి చూపించాను.
“అదేం ఫరవాలేదులే,”
మావయ్య ఎపట్లాగే నింపాదిగా అన్నాడు. అవన్నీ గంధకిక ధూమాలు. అగ్నిపర్వతాలలో అతి సహజాలు.”
“కాని అవి మనని
పూర్తిగా కబళిస్తాయేమో.”
“అలాగేం చెయ్యవు.”
“ఉక్కిరిబిక్కిరై
ఊపిరాడక పోతామేమో.”
“అలాగేం కాదంటున్నానా!”
“అలా ఎలా చెప్పగలవు?”
“మనం ప్రయాణ్నిస్తున్న
సొరంగ మార్గం క్రమంగా విశాలమవుతోంది. కనుక పొగలు మనని ఉక్కిరిబిక్కిరి చెయ్యవు. అంతగా
అయితే సకాలంలో ఈ తెప్పని వొదిలేసి ఏ బిలం లోనో దూరి తలదాచుకుందాం.”
“కాని మరి ఈ
వేణ్ణీళ్ళ మాటేమిటి?”
“ఇక నీళ్ళు లేవు
ఏక్సెల్. కావాలంటే చూడు. మన కింద వున్నది ఇప్పుడు లావా చూర్ణం మాత్రమే. ఉపరితలం వద్దకి
మనని మోసుకుపోతున్నది అదే.”
మా తెప్పని మోసి
పట్టుకున్న చూర్ణం లాంటి పదార్థం ఏంటో గాని కుతకుతలాడుతోంది. ఉష్ణోగ్రత 150 వరకు ఉంటుందేమో. నాకైతే చర్మం కాలిపోతోంది. పైకి
వేగంగా కదులున్నాం గనుక సరిపోయింది గాని లేకుంటే
ఈ పాటికి ఉడికిపోయేవాళ్లం.
సుమారు ఉదయం 8 గంటలకి
తెప్ప కదలడం ఆగిపోయింది.
“ఏంటి? విస్ఫోటం
ఆగిపోయిందా?” ఆదుర్దాగా అడిగాను.
“అబ్బ! నువ్వు
ఊరికే కంగారు పడతావు ఏక్సెల్. ఈ నిశ్చల స్థితి ఎంతో సేపు ఉండదని అనిపిస్తోంది. ఇప్పటికి
ఐదు నిముషాలు గడిచాయి. మరో రెండు నిముషాల్లో మళ్లీ కదులుతాం చూడు.”
మావయ్య చెప్పినట్టే
కాసేపట్లో తెప్ప మళ్లీ దాని ఆరోహణ కొనసాగించింది. అలా గజిబిజి గతిలో మరో పది నిముషాలు
పైకి కదిలి మళ్లీ ఆగిపోయింది. అలా ఆగాగి కదిలే కార్యక్రమం ఎన్ని సార్లు జరిగిందో గుర్తులేదు.
అయితే కదిలిన
ప్రతీ సారి ఇంకా ఇంకా బలంగా మా తెప్ప పైకి నెట్టబడుతోంది. అలా జరిగిన ప్రతి సారి ఆ
దెబ్బకి నా గుండె ఆగినంత పనయ్యేది. ఇలాంటి సమయంలో ఆ ఆర్కిటిక్ అతిశీతల తలాల మీదనో హాయిగా
చేరగిలబడితే ఎంత బావుంటుందో? హిమావృతమైన తెల్లని తిన్నెలని ఊహించుకుంటూ ఎటో కలలలో తేలిపోయాను.
కాని ఇంతలో హన్స్ నన్ను జబ్బ పట్టుకుని పక్కకి ఈడ్చకపోయి వుంటే నా తల ఓ రాతి చూరుకి
తగిలి పగిలి వుండేది.
ఆ తరువాత కొన్నిగంటల
పాటు ఏం జరిగిందో అంతా గందరగోళంగా వుంది. ఆ సన్నివేశానికి చెందిన జ్ఞాపకాలన్నీ అస్తవ్యస్తంగా
వున్నాయి. ఎడతెగని విస్ఫోటాలతో మా పరిసరాలు అతలాకుతలం అవుతున్నాయి. చెవులు చిల్లులు
పడేలాంటి చప్పుళ్లతో నేపథ్యం మారుమ్రోగిపోతోంది. ఉవ్వెత్తున ఎగసిపడే అగ్నికీలలు సొరంగం
మొత్తాన్ని కబళిస్తున్నట్టున్నాయి.
ఏ శక్తి మా తెప్పని
ఆఖరి తాపు తన్నిందో తెలీదు గాని, తెప్పతో పాటు దాన్నే నమ్ముకున్న మేం ముగ్గరమూ ఫిరంగి
లోంచి దూసుకొచ్చే గుండులా ఆ అగ్నిపర్వత ముఖం లోంచి గాల్లోకి దూసుకుపోయాము.
(నలభై మూడవ అధ్యాయం సమాప్తం)
అధ్యాయం 43
అగ్నిపర్వతం
మమ్మల్ని విసిరేసింది
అవును. దిక్సూచి
ఇక పని చెయ్యనని మొరాయించింది. పిచ్చి పట్టి నట్టు అటు ఇటు దిక్కులు చూసింది గాని ఏది
ఎటో చెప్పలేకపోయింది.
ప్రస్తుతం చలామణిలో
వున్న భౌగోళిక సిద్ధాంతాల ప్రకారం భూమి మీద ఉండే ఖనిజ సంపద ఇప్పుడూ పూర్తి నిశ్చల స్థితిలో
వుండదు. దాని రసాయనిక కూర్పులో వచ్చే మార్పుల
వల్లనైతేనేమి, అందులోని అపారమైన ద్రవప్రవాహాల వల్లనైతేనేమి, తత్ఫలితంగా పుట్టే
తీవ్రమైన అయస్కాంత క్షేత్రాల వల్లనైతేనేమి ఖనిజ విస్తరణలో రకరకాల మార్పులు వస్తుంటాయి.
పైన జీవించే అమాయక మానవాళికి మాత్రం లోపల అంతా స్థిరంగా, స్తబ్దుగా వుందని అనిపిస్తుంది.
కాని ప్రస్తుత
స్థితిలో భూ గర్భంలో ఎంత అల్లకల్లోలంతో కూడిన వాతావరణం ఉంటుందో స్వానుభవంలో తెలుస్తోంది.
కోటి రధాలు ఒక్కసారిగా దూసుకొస్తుంటే భూమి దడదడలాడినట్టు, ఎడతెగని పర్జన్య గర్జనతో
దిక్కులు పిక్కటిల్లుతున్నట్టు మా పరిసరాలు చెవులు చిల్లులు పడే నినదాలతో మారుమోగిపోతున్నాయి.
మా దిక్సూచి
పాపం వెర్రెక్కి గిరికీలు కొడుతోంది. ఇక సందేహం లేదు. భూతలపు పైపొర ఇక ఛిన్నాభిన్నం
అవుతోంది. బలమైన బండలు బద్దలై భూమిని పెల్లగించుకుని పైకి తన్నుకొస్తాయి. పెద్ద పెద్ద
చీలికలు ఏర్పడి భూమి లోతుల్లో వుండే సలసల మరిగే పాషాణద్రవం పైకి వెళ్ళగక్కబడుతుంది.
ఇక మేమంతా ఈ పాతాళ ప్రళయంలో చిక్కుకుని భూస్థాపితం కావడం ఖాయం.
“మావయ్యా!” ఇక
ఆపుకోలేక బావురు మన్నాను. “అంతా అయిపోయింది మావయ్యా. ఇక ఆశ వదులుకున్నాను.”
“ఇప్పుడు ఉన్నట్టుండి
ఎందుకిలా డీలా పడిపోతున్నావు? ఇప్పుడేవయ్యిందని?” మావయ్య ఎప్పట్లాగే నింపాదిగా అడిగాడు.
“ఏవయ్యింది అంటావేంటి
మావయ్యా?అసలు చుట్టూ ఏం జరుగుతోందో చూస్తున్నావా? నీటి కుతకుతలు వినిపించటంలా? మంటల
భుగభుగలు వినిపించడంలా? భూకంపం రాబోతోంది, మావయ్యా. భూకంపం రాబోతోంది!” ఆవేశంగా అన్నాను.
మావయ మత్రం నిశ్చింతగా
తల అడ్డుగా ఊపాడు.
“భూకంపం వస్తోందంటావా?
నాకలా ఏమీ అనిపించడంలేదే!”
“నా కనిపిస్తోంది
మరి!”
“నువ్వు పొరబడ్డావు
అనుకుంటా.”
“మరైతే ఇదంతా
ఏంటి నీ ప్రకారం?”
“ఇదో విస్ఫోటం
ఏక్సెల్,” తాపీగా అన్నాడు మావయ్య.
“విస్ఫోటమా?”
అరిచినంత పని చేశాను. “అంటే మనం ఇప్పుడు అగ్నిపర్వతంలో వున్నామా? ఆ అగ్నిపర్వతం లోని
సొరంగం లోంచి పైకి తన్నుకొస్తున్నామా?”
“అవునని నా అభిప్రాయం.
అంతే కాదు. ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఇంతకన్నా సత్పరిమాణాన్ని ఆశించలేము.”
“ఇది సత్పరిమాణం
అంటావా?” నమ్మశక్యం కానట్టు అడిగాను.
“అవును. భూమి
ఉపరితలాన్ని వేగంగా చేరుకోడానికి ఇంత కన్నా మంచి మార్గాంతరం కనిపించడం లేదు నాకు.”
మంచి మార్గమా?
ఇక సందేహమే లేదు. మా మావయ్యకి నిజంగా పిచ్చే! కొండ పిండి కాబోతోంది, లావా వరదల్లె ప్రవహించబోతోంది,
ఆకాశమంతా మసిమయం కాబోతోంది. ఇక ఆ పాషాణ ప్రయణంలో మేం మిడుతల్లా మాడబోతున్నాం. ఇంత కన్నా
మంచి మార్గం కనిపించలేదట మా మావయ్యకి … చావటానికి!
“ఫొర్ ట్రేఫిగ్”
అన్నాడు హన్స్ ఉత్సాహంగా డచ్ లో.
“అద్భుతం,” బదులు
ఇచ్చాడు మావయ్య.
ఆ కాస్త పదార్థం
కడుపులో పడ్డాక మళ్లీ ప్రాణం లేచొచ్చింది. అంతవరకు మొద్దు బారిపోయినట్టు ఉన్న మనసులో
ఇప్పుడు ఏవో జ్ఞాపకాలు మెదుల్తున్నాయి. కోనిగ్స్‍స్ట్రాసే లో మా ఇంట్లో నా కోసం కలలుకంటున్న
నా బంగారు గ్రౌబెన్ తీపి గుర్తులు లోనుంచి తన్నుకొస్తున్నాయి. పాపం మార్థా ఎలా వుందో?
నేనిలా చివరి
ఘడియలు లెక్కెట్టుకుంటూ పరధ్యానంగా వుంటే మావయ్య మాత్రం ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ కనిపించాడు.
మా ప్రస్తుత పరిస్థితిని బేరీజు వేసుకుంటున్నాడు కాబోలి. మావయ్యలో ఇదే అత్యద్భుతమైన
లక్షణం. ఎంత విపరీత పరిస్థితుల్లో అయినా స్థిమితం కోల్పోకుండా తక్షణ కర్తవ్యం గురించే
ఆలోచిస్తాడు గాని తబ్బిబ్బు కాడు.
ఏదో సణుగుతున్నాడు.
ఆ సణుగుడులో కూడా అక్కడక్కడ ఏదో భౌగోళిక శాస్త్ర పరిభాష జాలువారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో
భౌగోళిక శాస్త్రం గురించి, పురావస్తు పరిశోధన గురించి ఆలోచించేవాణ్ణి ఏవంటారో తెలీదు
గాని ఆ వ్యక్తి ససేమిరా మనిషి కాడు!
“ఇది విస్ఫోటక
కంకర!” తేల్చి చెప్తున్నట్టుగా అన్నాడు మావయ్య. మా ఎదుట గల రాతి గోడ మీద వ్యాఖ్యానిస్తున్నాడు.
“ఇది నైస్ (
gneiss) జాతి రాయి. ఇదో మైకా షిస్ట్. దీన్ని బట్టి మనం సంక్రమణ దశని దరిజేరుతున్నాం
అని అర్థమవుతోంది.. దీని తరువాత…”
ఏంటి మా ప్రొఫెసరు
అనేది? చుట్టూ ఉన్న రాతి లక్షణాల బట్టి మా నుండు ఉపరితలం ఇంకా ఎంత ఎత్తున వుందో అంచనా
వేస్తున్నాడా? ఎలా కుదుర్తుంది? ఈయన వద్ద బారోమీటర్ కూడా లేదు. ఇది వట్టి ఊహాగానం తప్ప
మరేం లేదు.
పైకి పోతున్న
ఉష్ణోగ్రత ఇంకా ఇంకా పెరుగుతోంది. ఒళ్ళు ఉడికిపోతోంది. కొలిమి నోట్ళోకి ఉరకబోతున్న
కరిగిన లోహం లా వుంది మా పరిస్థితి.
“ఏంటిది మావయ్యా?
మనం ఏ రాతి కొలిమి లోకైనా ప్రవేశించబోతున్నామా?”
“లేదు లేదు. కచ్చితంగా లేదు, అది అసంభవం,” ధీమాగా అన్నాడు
మావయ్య.
“మరి ఇదేంటి
ఇంత వేడిగా వుంది.”
అడుగున వున్న
నీట్లోకి ఓ సారి వేలు ముంచితే చుర్రు మంది.
“నీళ్లు ఉడికిపోతున్నాయి,”
గట్టిగా అరిచాను.
మావయ్య విసుక్కుంటూ
నోరు ముయ్యమన్నట్టుగా వారించాడు.
ఇక నాకున్న ఆఖరి
ఆశ కూడా మాయమైపోయింది. మనసంతా నిస్పృహ ఆవరించింది. ఎంత నిగ్రహించుకున్నా భయం ఆగడం లేదు.
పెరుగుతున్న ఉష్ణోగ్రత… కుతకుతలాడుతున్న నీరు… ఇక ఇంతే సంగతులు. మేం ఎక్కడున్నామో?
ఏమై పోతున్నామో? ఎటు పోతున్నామో?
వెంటనే ఆ పక్కనే
వున్న దిక్సూచి కేసి చూశాను. అది మా కన్నా ముందే చచ్చిపోయింది!
(నలభై రెండవ
అధ్యాయం సమాప్తం)
“ఉంది. కాస్తంత
ఉప్పుడు మాంసం వుంది. దాంతో ముగ్గురం సరిపెట్టుకోవాలి.”
ఆ తరువాత ఎవరం
కాసేపు మాట్లాడలేదు. ఓ గంట గడిచింది.
కడుపులో ఆకలి
పేగులు తోడేస్తున్నట్టు వుంది. ఆ మిగిలిన కాస్తంత ఆహారాన్ని ముట్టుకోవడానికి ఎవరికీ మనసు రాలేదు.
మా వేగం క్రమంగా
పెరుగుతోంది. కొన్ని సార్లు గాలి ధాటికి ఊపిరి సలిపేది కాదు. చుట్టూ గాలి వేడెక్కుతున్నట్టు
అనిపిస్తోంది. ఉష్ణోగ్రత 100 ఫారెన్ హీట్ ఉంటుందేమో.
ఇలాంటి పరిణామానికి
కారణం ఏవై వుంటుందో? ఇంత వరకు మాకు కలిగిన అనుభవాల మేరకు డేవీ గారి, మా లీడెన్ బ్రాక్
మావయ్య గారి సిద్ధాంతాలు నిజమని తేలింది. మరిప్పుడు మా చుట్టూ ఉండే రాళ్ల ఉష్ణవాహక
శక్తి మహిమో, లేక విద్యుదయస్కాంత శక్తుల లాస్యమో ఏమో తెలీదు గాని మా పరిసరాలు నులి
వెచ్చగా మాత్రమే ఉండడంతో మేం బతికిపోయాం. కాని పృథ్వీ కేంద్రంలో మహోగ్రమైన ఉష్ణోగ్రత
ఉంటుందనే సిద్ధాంతం నిజమే అయితే మా ఈ తిరుగు ప్రయాణంలో నైనా అలాంటి అత్యుష్ణమైన ప్రాంతం
లోంచి పోవాలిగా?
సందేహ నివారణ
కోసం మావయ్య కేసి తిరిగాను.
“మునిగి పోవాల్సింది.
ముక్కలు అవ్వాల్సింది. మింగమెతుకు లేక ఎప్పుడో పోవాల్సింది. కాని ఎలాగో తప్పించుకున్నాం.
కాని ఇక ముందైనా మండి మసి కామని నమ్మకం ఏంటి?”
‘నాకు మాత్రం
ఏం తెలుసు?’ అన్నట్టు భుజాలు ఎగరేశాడు మావయ్య.
మరో గంట గడిచింది.
ఉష్ణోగ్రత మరి కాస్త పెరగడం తప్ప మరేమీ జరగలేదు.
“మనం అందరం కలిసి
ఒక నిర్ణయానికి రావాలి,” నెమ్మదిగా అన్నాడు మావయ్య.
“నిర్ణయమా? ఏంటది?”
“మన వద్ద మిగిలిన
ఆ కాస్త ఆహారాన్ని పొదుపుగా వాడుకుని, ఈ చివరి ఘడియల్లో జాగ్రత్తగా నెట్టుకురావాలి.”
“ఏంటి మావయ్యా
నువ్వనేది? ఈ కాస్త మాంసం తింటే మన ఆయుర్దాయం మరి రెండు గంటలు పెరుగుతుందేమో. ముందసలు
మనం బతికి బయటపడాలిగా.”
“అందులో ఏం సందేహం?”
“మనం బతికి బయటపడతామని
నీకు నమ్మకం వుందా?”
“నిశ్చయంగా వుంది.
గుండె కొట్టుకుంటున్నంత కాలం, దేహం నిలిచి వున్నంత కాలం, ఆత్మ లోన వెలుగారుతున్నంత
కాలం, ప్రాణం భయాన్ని దరిజేర నివ్వాల్సిన పని లేదు,” మావయ్య ధీమాగా అన్నాడు.
ఆ మాటల్లో వజ్రం
లాంటి సంకల్పబలం తొణికిసలాడింది. ఆ మాటలు అన్న మనిషి సామాన్యుడు కాడని అనిపించింది.
మావయ్య ఇంకా
ఇలా అన్నాడూ. “ఉన్న దాంతో ఎలాగో సరిపెట్టుకుందాం. ఆ కాస్త తింటే కాస్త ఓపిక వస్తుంది.
గాలి తీసిన తిత్తిల లాగా మిగిలిపోక, కాక జీవం వున్న వ్యక్తులం అవుతాం.”
ఉన్న కాస్త ఆహారాన్ని
ముగ్గురం పంచుకుని ఆత్రంగా తిన్నాం. ఇంతలో హన్స్ కి ఎలా దొరికిందో ఏమో హోలాండ్స్ జిన్
గల ఓ ఫ్లాస్క్ దొరికింది. ఆ మధుర పానీయంతో కృతజ్ఞతాపూర్వకంగా గొంతులు తడుపుకున్నాం.
(ఇంకా వుంది)
అధ్యాయం 42
పైపైకి ఇంకా
పైకి … చీకటి గుయ్యారం లోకి
రాత్రి పది అయ్యుంటుంది.
ఒళ్లు హూనం చేసి, బతుకుని అతలాకుతలం చేసిన అనుభవాల నుండి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాం.
వశం తప్పిన ఇంద్రియాలు నెమ్మదిగా వశపడుతున్నాయి. ముందుగా తెప్పరిల్లిన ఇంద్రియం – వినికిడి.
అంతవరకు మా చుట్టూ
మారుమ్రోగిపోయిన ప్రళయ భీకర ఘోష స్థానంలో ఇప్పుడు చిక్కని నిశ్శబ్దం నెలకొంది.
ఆ నిశ్శబ్దంలో
గుసగుసగా మావయ్య మాటలు వినిపించాయి.
“మనం పైకి పోతున్నాం.”
“ఏంటి నువ్వనేది?”
అర్థం కాక అరిచాను.
“అవును. పైకి
పోతున్నాం.”
చేయి చాచి గోడని
తాకబోయాను. వేళ్లు చెక్కుకుపోయి రక్తం కారుతున్న చేతిని వెనక్కి తీసుకున్నాను. ప్రచండ
వేగంతో మేం పైకి కదులుతున్నాం.
“టార్చ్ కావాలి.
టార్చ్ ఏది?” అరిచాడు మావయ్య.
పెద్దగా ఇబ్బంది
పడకుండా హన్స్ టార్చ్ వెలిగించాడు. దాని కాంతిలో మేం ఎక్కడున్నామో నెమ్మదిగా అర్థం
కాసాగింది.
“నేను అనుకున్నట్టే
అయ్యింది,” అన్నాడు ప్రొఫెసర్. “మనం ఉన్న సొరంగం వ్యాసం ఇరవై నాలుగు అడుగులు వుంటుందేమో.
నీరు సొరంగం అట్టడుగు స్థానానికి చేరుకుంది. ఇప్పుడు మళ్లీ పైకి లేస్తోంది.”
“ఎక్కడికి లేస్తోంది?”
“ఏమో చెప్పలేను.
కాని దేనికైనా సిద్ధంగా ఉండాలి. చూడబోతే మన ఆరోహణా వేగం సెకనుకి పద్నాలుగు అడుగులు
ఉంటుందేమో. అంటే గంటకి పది మైళ్లు!”
“ఇలా ఎంత సేపని
పైకి కదులుతాం? ఎప్పటికీ ఆగమా? ఈ సొరంగం పైన ఏవుందో? పైన గాలి మందిరం వుండి, నీరు పైపైకి
పోవడం వల్ల ఆ మందిరంలోని గాలి సంకోచించబడి, ఒత్తిడి విపరీతంగా పెరిగి, ఆ ఒత్తిడికి
మనం నుజ్జు నుజ్జు అయితే?”
“ఏక్సెల్” మవయ్య
అనునయిస్తున్నట్టుగా అన్నాడు. “మన పరిస్థితి అంత హర్షనీయంగా ఏమీ లేదని నాకూ తెలుసు.
అనుక్షణం మన ఆఖరి క్షణం కావచ్చు. అలాగే మనకి విముక్తి నిచ్చే అమృత క్షణాలు ఏ క్షణానైనా
రావచ్చు నని అనుకోవడంలో తప్పేమీ లేదు. కనుక మంచే జరుగుతుందని ఆశిస్తూ సిద్ధంగా వుందాం.”
“మరి ఇప్పుడేం
చేద్దాం?”
“తిందాం!”
“తినడమా?” సరిగ్గ
విన్నానో లేదో సందేహం కొద్దీ అడిగాను.
మావయ్య హన్స్
కేసి తిరిగి డేనిష్ లో ఏదో అన్నాడు. హన్స్ తల అడ్డంగా ఊపాడు.
“తినడానికి అస్సలేమీ
లేదా?” మావయ్య అరిచినంత పని చేశాడు.
(ఇంకా వుంది)
మేం బద్దలు కొట్టిన
బండకి అవతలి పక్క ఏదో అగాధం వుంది. ముందే చీలికలు పడి వున్న ప్రదేశంలో మేం పుట్టించిన
విస్ఫోటం వల్ల భూకంపం లాంటిది ఏర్పడింది. మూసి వున్న అగాధం తెరుచుకుంది. అందు లోకి
సముద్రం వెల్లువలా ప్రవహించింది. ఆ ప్రవాహంలో మేమిలా కొట్టుకుపోతున్నాం.
మా పతనానికి
అంతూ పొంతూ లేనట్టు వుంది. ఎక్స్ ప్రెస్ రైళ్ల కన్నా వేగంగా అందరం భూగర్భం లోతుల్లోకి దూసుకుపోతున్నాం.
కాని అలాంటి పరిస్థితి లో కూడా నా పక్కనే
ఓ చిన్న కాంతి కనిపించి మనసులో చిన్న ఆశ కలిగించింది. ఆ కాంతిలో హన్స్ ముఖం స్పష్టంగా
కనిపించింది. అలాంటి పరిస్థితిలో కూడా మా సాటిలేని వేటగాడు ఎలాగో ఓ విద్యుత్ దీపం వెలిగించాడు. ఆ వెలుగులో
మా పరిసరాలు చూచాయగా కనిపిస్తున్నాయి.
నేను అనుకున్నది నిజమే అయ్యింది. మేం పడుతున్నది
ఓ విశాలమైన సొరంగ మార్గం. అందుకే ఒక పక్క గోడ కనిపిస్తోంది గాని, అవతలి పక్క గోడ కనిపించడం
లేదు. ఓ విశాలమైన జలపాతంతో పాటు మేం జకూడా కింద పడుతున్నాం. అతి ఉధృతమైన అమెరికన్ నదీ
పాతాల కన్నా భయంకరంగా వుంది మేం వున్న జలపాతం. పాతాళపు గుండెల్లోకి గురి పెట్టి రువ్వబడ్డ
జల శరాల వర్షంలో చిక్కుకున్న అనుభూతి… మా పక్కనే వున్న కరకు గోడ మీద పొడుచుకొస్తున్న
రాళ్లు మా వెనుకగా ఎంత వేగంగా దూసుకుపోతున్నాయో, దాని బట్టి మేం ఎంత వేగంగా కదులుతున్నామో
అర్థమవుతుంది. గంటకి ముప్పై కోసుల దూరం ప్రయాణిస్తున్నామేమో అనిపించింది.
నేను, మావయ్య ఒకరి కేసి ఒకరం నీరసంగా చూసుకున్నాం.
అప్పటికే మా బుల్లి తెప్పలో కొంత భాగం విరిగి నీట్లో కొట్టుకుపోయింది. ఇక మిగతా భాగాన్ని
ముగ్గరం గట్టిగా పట్టుకున్నాం.
అలా కొన్ని గంటలు గడిచాయేమో. మా పరిస్థితి
మెరుగు కాకపోగా మరింత జటిలం అయ్యింది.
తెప్ప మీదకి ఎక్కించిన సరంజామాలో అప్పటికే
సగానికి సగం నీటి పాలయ్యింది. ఇక మిగతా సామగ్రినైనా కాస్త స్వాధీనపరుచుకుంటే మంచిది
అనిపించింది. కనుక చేతిలో వున్న లాంతరు సహాయంతో ఎంత వరకు మిగిలిందో చూద్దామని అనుకున్నాను.
మా పరికరాలలో గడియారం, దిక్సూచి మాత్రం మిగిలాయి. మేం తెచ్చుకున్న తాళ్ళు, నిచ్చెనలు
అన్నీ తడిసి ముద్దయి ఓ మూల కనిపిస్తున్నాయి. పలుగు, పార, గొడ్డలి మొదలైన వన్నీ ఎప్పుడో
జారిపోయాయి. ఇక సంభారాలు మరొక్క రోజుకి వస్తాయేమో!
తెప్ప మీద మిగిలిన సంభారాలు చూసి పిచ్చెక్కినట్టు అయ్యింది. ఇక ముగ్గురికీ ఈ పాతాళ బిలంలో దిక్కులేని ఆకలి చావు తప్పదా? అయినా నా పిచ్చి గాని, ఇలాంటి పరిస్థితుల్లో మరెన్నో చిత్ర విచిత్ర పద్ధతుల్లో ప్రాణాలు పోయే అవకాశం వున్నప్పుడు, ఆకలి చావే కలుగుతుందని నమ్మకం ఏంటి?
తెప్ప మీద మిగిలిన సంభారాలు చూసి పిచ్చెక్కినట్టు అయ్యింది. ఇక ముగ్గురికీ ఈ పాతాళ బిలంలో దిక్కులేని ఆకలి చావు తప్పదా? అయినా నా పిచ్చి గాని, ఇలాంటి పరిస్థితుల్లో మరెన్నో చిత్ర విచిత్ర పద్ధతుల్లో ప్రాణాలు పోయే అవకాశం వున్నప్పుడు, ఆకలి చావే కలుగుతుందని నమ్మకం ఏంటి?
ప్రాణం మీద తీపి అంటే ఇదే కాబోలు… అలాంటి
పరిస్థితిలో, అలాంటి పరిసరాల్లో కూడా ఓ చిన్న ఆశ చిగురించింది. ఎప్పటికైనా మళ్లీ ఈ
అగాధం లోంచి బయట పడతామా? మళ్ళీ ఎప్పటికైనా భూమి ఉపరితలాన్ని చేరుకోగలమా? పైన కొండలు,
మిట్టలు, సూర్యాస్తమయాలు మొదలైన అందాలన్నీ ఎప్పటికైనా కళ్లార చూడగలమా?
ఆ విషయమై మావయ్య ఉద్దేశం కనుక్కుందాం అనుకున్నాను.
కాని ఆ పరిస్థితిలో ఆయన్ని
ప్రశాంతంగా ఉండనివ్వడమే మేలని ఊరుకున్నాను.
ఇంతలో నా చేతిలోని
లాంతరు దీపం కాసేపు కొట్టుమిట్టాడి తుది శ్వాస వదిలింది. ఆ కాస్త కాంతి కూడా కరువు
అవ్వడంతో చుట్టూ చీకటి మరింత చిక్కన అయ్యింది. మా తెప్ప కదిలే వాలు పెరిగింది. వేగం
మరింత తీవ్రతరం అయ్యింది. మావయ్య, హన్స్ లు నా చెరో జబ్బ గట్టిగా పట్టుకున్నారు.
అలా మా పయనం
ఎంత సేపు సాగిందో గుర్తులేదు. దేన్నో బలంగా గుద్దుకున్నట్టు తెప్ప ఆగింది. తెప్పని
ఆపింది ఏదో కఠిన తలం కాదు. అదేదో జలాశయంలా వుంది. ఆ జలపాతం లోని నీరు ఈ పాతాళ జలాశయంలోకి
ప్రవహిస్తోంది.
నాకిక ఊపిరి
సలపడం లేదు! మునిగిపోతున్నాను!
కాని అంతలోనే
పైకి తేలాను. గుండెల నిండుగా ఊపిరి పీల్చుకున్నాను. మావయ్య, హన్స్ లు నన్ను వదలకుండా
గట్టిగా పట్టుకున్నారు. మా బుల్లి తెప్ప కూడా మమ్మల్ని వదలకుండా మోసుకుపోతోంది.
(నలభై ఒకటవ అధ్యాయం
సమాప్తం)
ఆ మర్నాడు అంటే
గురువారం, ఆగస్టు 27 వ తారీఖు, మా పాతాళ యాత్రలో
ఓ మరపురాని దినం. దాన్ని తలచుకున్నప్పుడల్లా గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఒళ్లు జలదరిస్తుంది.
ఆ క్షణం నుండి ఇక వివేచన, వివేకం, ప్రతిభ, నైపుణ్యం వంటి పదాలకి అర్థం లేకుండా పోయింది.
ఎందుకంటే ఆ క్షణం నుండి విధి చేతిలో ఆటబొమ్మలం. విధి అనే ప్రవాహంలో కొట్టుకుపోయే ఎండుటాకులం.
ఉదయం ఆరు గంటలకల్లా
లేచి, తయారై పన్లోకి దిగాం. మా దారికి అడ్డుగా వున్న బండని బద్దలుకొట్టే పన్లోకి దిగాం.
వత్తిని వెలిగించే
సువర్ణావకాశం నాకిమ్మని వేడుకున్నాను. వత్తిని వెలిగించగానే వేగంగా మా తెప్పనెక్కి
ఆ ప్రాంతం నుండి వీలైనంత దూరంగా జరిగిపోవాలని ఉద్దేశం. ఎందుకంటే ఆ విస్ఫోటంలో దారికి అడ్డుగా వున్న బండ మాత్రమే
బద్దలవుతుందన్న నమ్మకం ఏమీ లేదు.
వత్తి పది నిముషాల
పాటు కాలిన తరువాతే మందుపాతరకి నిప్పు అంటుకునేలా ఏర్పాటు చేశాం. తెప్పరిల్లి తప్పని
చేరుకోడానికి ఆ మాత్రం సమయం చాలు.
మావయ్య, హన్స్
అప్పటికే తెప్ప ఎక్కి కూర్చున్నారు. ఒక లాంతరు పట్టుకుని నేను వత్తిని సమీపించాను.
మావయ్య వాచీ
చేతిలో పట్టుకుని “రెడీయేనా?” అని అరిచాడు.
“ఆc!” అని బదులుగా అరిచాను.
వత్తిని అంటించి
అది చిటపటలాడుతుంటే నేను తెప్ప దిక్కుగా పరుగు అందుకున్నాను.
నేను ఎక్కగానే
తెప్ప కదిలింది. నూట ఇరవై అడుగుల దూరం నీట్లోకి ప్రవేశించింది.
“మరో ఐదు నిముషాలు,”
అన్నాడు మావయ్య.
“రెండు… ఒకటి…
పగిలిపో పాషాణమా!” గట్టిగా అరిచాడు మావయ్య.
ఆ క్షణం ఏం జరిగిందో
కాసేపు అర్థం కాలేదు. విస్ఫోటం జరిగిన చప్పుడు పెద్దగా వినిపించినట్టులేదు. పెద్ద పెద్ద
బండలతో కూర్చబడ్డ విశాలమైన గోడలా అంత ఎత్తున వున్న ఆ నిర్మాణం మా
కళ్ళ ఎదుట తెర తెగ పడ్డట్టు నేల జారింది. తీరం మీద నేల చీలి లోతు తెలియని ఓ నల్లని
మహాబిలం మా ఎదుట తెరుచుకుంది. సముద్రం ఒక్కసారిగా ఉవ్వెత్తున లేచి ఆ తెరుచుకున్న నేల
నోట్లోకి ప్రవహించసాగింది. ఆ నీటి చెరియకి అంచున ప్రమాదకరంగా వేలాడుతున్న మా బుల్లి
తెప్ప ఇక విధి లేకుండా నిస్సహాయంగా ఆ మహాబిలం లోకి దూసుకుపోసాగింది.
ముగ్గురం బల్లుల
లాగా ఆ తెప్ప మీద కింద అతుక్కుపోయాం. కళ్లు మూసి తెరిచే లోగా కన్ను మిన్ను కానరాని
అగాధంలో పడి ఎటో కొట్టుకుపోతున్నాం. మావయ్య ఏదో అడగాలని అరిచాను. కాని చెవులు చిల్లులు
పడే ఆ ప్రళయ భీకర ఘోషలో నా మాట నాకు వినిపించడమే కష్టంగా వుంది.
అలాంటి పరిస్థితుల్లో
కూడా నా మెదడులో ఆలోచనలు వేగంగా పరుగులు పెడుతున్నాయి. ఏం జరిగిందో మెరుపులా మనసులో
మెదిలింది.
ఆ క్షణం నన్ను
మా మావయ్య పూనినట్టు ఉన్నాడు. మనసు లోతుల్లోంచి తన్నుకొస్తున్న మాటల్ని గడగడా వెళ్లగక్కేశాను.
ఆ క్షణం గతాన్ని నా మనసు లోంచి పూర్తిగా తుడిచిపెట్టేశాను.
ఏ ప్రపంచపు లోతుల్లోనైతే మేమిలా తడుముకుంటూ, తొట్రుబడుతూ కొట్టుమిట్టాడుతున్నామో, ఆ
ప్రపంచం యొక్క ఉపరితలం మీద వుండే విషయాలు – నగరాలు, నగాలు, నదులు మొదలైన వేవీ ఆ క్షణం
గుర్తుకు రాలేదు. మనసంతా భవిష్యత్తు మీదే వుంది. మేం ఛేదించగోరుతున్న పాతాళరహస్యాల
మీదే వుంది. మా దారికి అడ్డుగా దాపురించిన ఈ మొండి బండ మీదే వుంది.
“ఈ గొడ్డళ్ళు
పట్టుకుని పన్లోకి దిగుదాం పద మరి,” అన్నాడు మావయ్య.
“గొడ్డళ్ళతో పనెలా అవుతుంది మావయ్యా,” తల అడ్డుగా ఊపుతూ అన్నాను.
“పోనీ పలుగులు
వాడితే.”
“అయినా కూడా
చాలా సేపు పడుతుంది.”
“మరైతే ఎలా?”
“ఏవుంది? మందు
పాతర వుందిగా? ఈ బండని పిండి చెయ్యొచ్చు.”
“అవును. మందు
పాతరకి లొంగనంత పెద్ద బండేం కాదు.”
“పద హన్స్! ఇది
నీకే సాధ్యం,” హన్స్ ని ఉత్తేజపరుస్తూ అన్నాడు మావయ్య.
అంతవరకు మా తెప్ప
వద్ద కావలి కాస్తున్న హన్స్ చేత్తో గునపంతో, కాస్త మందు పాతరతో మా వద్దకి వచ్చాడు.
బండ కింద ఓ లోతైన కన్నం చేసి అందులో మందు పాతర దట్టించాడు.
“ఇది చాలేమో
కదా?” అడిగాను.
“అవును చాలనుకుంటా,”
ఒప్పుకుంటూ అన్నాడు మావయ్య.
అర్థరాత్రి కల్లా
మా ఏర్పాట్లు పూర్తయ్యాయి. మందుపాతర లోంచి ఓ పొడవాటి వత్తి పైకి వచ్చేలా ఏర్పాటు అయ్యింది.
ఆ వత్తిని అంటిస్తే చాలు పని పూర్తవుతుంది.
“ఇక మిగతా పని
రేపు చేద్దాం,” అన్నాడు మావయ్య.
ఇక విధిలేక మరో
ఆరు గంటలు ఎదురు చూడడానికే సిద్ధపడ్డాను.
(ఇంకా వుంది)
(నలభయ్యవ అధ్యాయం
సమాప్తం)
“అవును ఏక్సెల్.
నువ్వు చెప్పింది నిజం. అంతా మన మంచికే. మన అదృష్టం బాగుండి నేలకి సమాంతరంగా సాగే ఆ
సముద్రాన్ని వొదిలిపెట్టాం. దాని కారణంగా మన గమ్యంతో సంబంధం లేకుండా ఇంతకాలం ఎటో ప్రయాణిస్తూ
వచ్చాం. కాని ఇప్పట్నించి కిందకి, ఇంకా ఇంకా కిందకి, చొచ్చుకుపోతాం. నీకు తెలుసా? భూమి
కేంద్రం నుండి ఇప్పుడు మనం కేవలం 1500 కోసుల
దూరంలో వున్నాం.”
“అంతేనా?” అరిచాన్నేను. “అదసలు ఒక విషయమే కాదు. పద అయితే బయల్దేరుదాం.”
మా మతిమాలిన
మాటలు ఇలా సాగుతుండగా ఇంతలో వేటగాడు ఎదురు పడ్డాడు. ప్రయాణానికి సన్నాహాలు పూర్తయ్యాయి.
మా సామగ్రి అంతా పడవ మీదకి ఎత్తించాం. తెర చాప ఎగిరింది. కేప్ సాక్నుస్సేం దిశగా పడవని
నడిపాడు హన్స్.
లోతు లేని నీటి
మీద ప్రయాణిస్తున్నప్పుడు గాలి ఎంత బలంగా వీస్తోంది అన్న విషయానికి పెద్దగా ప్రాముఖ్యత
ఉండదు. కొన్ని ప్రదేశాల్లో ఇనుపు మొనలు అమర్చిన కట్టెలతో పడవని ముందుకు తోయాల్సి వచ్చింది.
కొన్ని చోట్ల నీట్లో మునిగిన రాళ్లని తప్పించుకుంటూ ముందుకి సాగాల్సి వచ్చింది. అలా
ఓ మూడు గంటలు ప్రయాణించాక, మేం చేరుకోగోరిన ప్రదేశాన్ని చేరుకున్నాం. నేను తీరం మీదకి దూకాను.
మామయ్య, వేటగాడు కూడా వెంటే దిగారు. మా ముందున్న ప్రయాణాన్ని తలచుకుంటుంటే నా మనసంతా
ఉద్వేగంతో నిండిపోతోంది. మా బుల్లి పడవకి తిలోదకాలు వొదిలే సమయం వచ్చింది. తెప్పని
కాల్చేస్తే ఎలా ఉంటుందని మామయ్యని అడిగాను. కాని అందుకు మామయ్య ఒప్పుకోలేదు. తిరుగు
ప్రయాణం ఎలా వుంటుందో తెలియదుగా మరి!
“పోనీ కాస్త
తొందరగా కదులు.” నా తహతహని కప్పిపుచ్చుకోవడం కష్టంగా వుంది. “ఒక్క క్షణం కూడా వృధా
చెయ్యడానికి లేదు.”
“సరే, సరే. కాని
ముందు ఈ సొరంగం తీరు తెన్నులు ఒకసారి చూసుకోవాలి. మనకి నిచ్చెనలు అవసరం అవుతాయో లేదో
చూసుకోవాలి.”
పడవని తీరం మీదే
వొదిలేసి సొరంగం వైపు నడిచాం. మావయ్య రుమ్కోర్ఫ్ పరికరానికి (*) పని పెట్టాడు. గుహ
ముఖం మా నుండి ఇరవై గజాల దూరంలో వుంది.
(*ఇది ఒక రకమైన
‘portable lamp.’)
గుహ ద్వారం ఇంచుమించు
గుండ్రంగా వుంది. వ్యాసం ఐదు అడుగులు ఉండొచ్చు. కొండ లోతుల్లో సంభవించిన ఏదో విస్ఫోటం
వల్ల ఈ సొరంగం ఏర్పడినట్టుంది. ఆ విస్ఫోటపు పదార్థం గుహ గోడల మీద పూతలా ఏర్పడింది.
సొరంగం లోపలికి తీసుకుపోయే బాటలో పెద్దగా వాలు లేదు. కనుక సులభంగా లోపలికి ప్రవేశించాం.
కాని నాలుగు అడుగులు వేశామో లేదో మా బాటకి ఓ పెద్ద బండ అడ్డుపడింది.
“దరిద్రపు బండ!”
ఒళ్లుమండిపోయి తిట్టుకున్నాను.
దాని చుట్టు
పక్కల ఎక్కడైనా దాన్ని దాటి పోడానికి ఏవైనా సందు వుందేమోనని చూశాను. కాని ఫలితం లేకపోయింది.
దాటే మార్గం కనిపించలేదు.
నిస్పృహతో కింద
చతికిలబడ్డాను. మావయ్య నిస్సహాయంగా ఎప్పట్లాగే గుహలో ముందుకి వెనక్కి నడిచేస్తున్నాడు.
“ఈ బండ మనకే
దాపురించిందా? ఏం ఆ సాక్నుస్సేమ్ కి అడ్డుపడలేదా?” ఉక్రోషాన్ని అణుచుకుంటూ మావయ్యని
అడిగాను.
“అవున్నిజమే.
అతగాడికీ ఈ బండ అడ్డుపడి ఉండాలిగా?”
“లేదు” ఆలోచనగా అన్నాను. సాక్నుస్సేం దారికి ఈ బండ అడ్డుపడలేదు.
ఈ ప్రాంతాన్ని తరచు అతలాకుతలం చేసే ఏ అయస్కాంత తుఫాను ప్రభావం వల్లనో ఇది ఊడిపడి గుహ
ద్వారాన్ని మూసేసింది. కావాలంటే చూడు. గుహ
లోపలి కంకర గోడలలో ఏర్పడ్డ చీలికలు, పగుళ్ళు కాస్త అర్వాచీన కాలానికి చెందినట్టు
కనిపిస్తున్నాయి. ఎప్పుడో జరిగిన విస్ఫోటం వల్ల ఈ గుహ పైభాగంలోని రాళ్ళు విరిగి ఈ పెద్ద
బండ కింద పడింది. సాక్నుస్సేమ్ కి తారసపడని ఈ అవరోధాన్ని తొలగించలేకపోతే ఇక మన యాత్ర
ఇక్కడితో సమాప్తం అయినట్టే.”
(ఇంకా వుంది)
అధ్యాయం 40
పాతాళం దాకా
సొరంగ మార్గ నిర్మాణం
ఈ విచిత్ర యాత్రలో
ఆరంభం నుండి ఎన్నో అద్భుతాలు చూస్తూ రావడంతో ఇక నాలో ఆశ్చర్యపడే శక్తి పూర్తిగా నశించిపోయింది.
కాని నేను నిలుచున్న చోట రాతి మీద మూడు వందల ఏళ్ల క్రితం చెక్కబడ్డ అక్షరాలు చూసి దిగ్ర్భాంతి
చెందాను. ఆ ప్రాచీన ప్రఖ్యాత పరుసవేది పేరు ఇలా శిలాక్షరాలలో చూడడమే కాదు, ఆ అక్షరాలని
చెక్కిన ఉలి కూడా అక్కడే వుంది. ఎంత నమ్మశక్యం కాకుండా కనిపించినా ఆ ప్రాచీన యాత్రికుడు
ఈ ప్రాంతాలన్నీ సంచరించి వుంటాడని అనుకోవడంలో ఇక సందేహం లేదు.
నేనిలా నా ఆలోచనల్లో
మునిగిపోయి వుంటే ఇక్కడ మావయ్య ఏదో పారవశ్యంలో ఊగిపోతూ ఆర్నె సాక్నుస్సేం ని పొగుడుతూ
స్తుతి అందుకున్నాడు.
“ఓ మహా మేధావీ!
మానవ మాత్రులు నీ తరువాత భూమి పొరలలోంచి చొచ్చుకుపోయేందుకు గాను ఎన్నో చక్కని చిహ్నాలు
విడిచి వెళ్లావు. నీవు విడిచిన ఆనవాళ్లు మూడు శతాబ్దాల తరువాత కూడా ఈ చీకటి దారుల వెంట
మాకు దారు చూపిస్తున్నాయి. నీవు చూసిన అద్భుతాలని నీలోనే ఉంచుకోకుండా మాతో పంచుకున్నావు.
నీ చిహ్నాలని, నీ అడుగుజాడలని అనుసరిస్తూ భూమి కేంద్రం దాకా చొచ్చుకుపోడానికి వీలయ్యింది.
మార్గాంతంలో ఇక్కడ నీ స్వహస్తాలతో చెక్కిన నీ పేరులోని ప్రథమాక్షరాలు మాకు దర్శనమిచ్చాయి.
నేను కూడా నా పేరుని ఈ పాషాణపు పుట మీద చెక్కుతాను. నువ్వు కనుక్కున్న ఈ అమోఘమైన భూశిరానికి
నీ పేరే పెడతాను. దీన్ని నేటి నుండి ‘కేప్ సాక్నుస్సేం’ అని పిలుస్తాను.”
మావయ్య పలికిన
ఆ స్తుతి వాక్యాలు విన్నాక నాకు కూడా చెప్పలేని ఉత్సాహం కలిగింది. ఆ క్షణం అలసట మర్చిపోయాను.
మా యాత్రలో పొంచి వున్న ప్రమాదాల సంగతి మరచిపోయాను. తిరిగి ఇంటికి ఎలా వెళ్లాలనే చింత
మరచిపోయాను. మరొక మనిషి సాధించిన దాన్ని మనం కూడా సాధించగలం అనిపించింది.
“పద మావయ్యా.
ఇంకా ముందుకి వెళ్దాం,” మావయ్యని తొందర పెట్టాను.
మా ఎదుట అంతులేకుండా
విస్తరించి వున్న చీకటి సొరంగంలోకి దూడుకుగా దూసుకుపోబోతూ అన్నాను. స్వతహాగా దూకుడు
ఎక్కువైన మావయ్య ఈ సారి మాత్రం నెమ్మది, నెమ్మది అంటూ శాంతి వాక్యాలు పలికాడు.
“ముందు వెనక్కు
వెళ్లి హన్స్ ని చేరుకుందాం,” ఆదేశం ఇచ్చాడు
మావయ్య. “మన పడవని ఇక్కడి దాకా తెమ్మందాం.”
ఇష్టం లేకపోయినా
కాళ్లీడ్చుకుంటూ మావయ్య వెంట బయల్దేరాను.
“ఒకటి అడగనా
మావయ్యా? ఇంతవరకు మనకి పరిస్థితులు బాగా అనుకూలించాయి కదూ?” మావయ్యని అడిగాను.
“అవునంటావా ఏక్సెల్?”
“సందేహమే లేదు.
ఆ తుఫాను కూడా … అది నిండా నూరేళ్లు చల్లగా వర్ధిల్లాలి… పోయి పోయి మనని సరైన దారిలోనే
పడేసింది. తుఫానులో చిక్కుకోకపోతే ఇంకా చాలా
ముందుకి వెళ్ళిపోయుండేవాళ్లం. లీడెన్ బ్రాక్ సముద్రానికి దక్షిణ తీరానికి చేరి
వుంటే మన గతి ఏమై వుండేది? సాక్నుస్సేం పేరు కనిపించి వుండేది కాదు. ఇటు సముద్రం, అటు
రాళ్లు – మధ్యన బందీలుగా మిగిలిపోయేవాళ్లం.”
“నిజమే ఏక్సెల్.
దక్షిణానికి పోతున్నాం అనుకున్నాం గాని ఎలాగో మరి ఉత్తరానికి వచ్చి ఈ కేప్ సాక్నుస్సేం
ని చేరుకున్నాం. నిజమే. నాకిది ఓ అద్భుతంలా తోస్తోంది. దీన్ని ఎలా వివరించాలో అర్థం
కావడం లేదు.”
“కారణం ఏదైతేనేం
మావయ్యా? జరిగిందేదో జరిగింది. దాన్ని ఎలా
వాడుకోవాలో ఆలోచించాలి.”
“నిజమే కాని…”
“నా మనసులో ఒకే
ప్రశ్న దొలిచేస్తోంది. మనం ఇలా ఉత్తరంగా ముందుకి సాగిపోతే స్వీడెన్ వంటి ఉత్తర యూరప్
కి చెందిన దేశాల అడుగున ముందుకు సాగుతూ రష్యా, సైబీరియా మొదలైన ప్రాంతాల కిందుగా పోతామా,
లేక ఆఫ్రికా ఎడారుల అడుగున చొచ్చుకుపోతామా, లేక అట్లాంటిక్ సముద్రపు కెరటాల అడుగున
ముందుకి సాగిపోతామా… అదే తెలుసుకోవాలని వుంది.”
(ఇంకా వుంది)
జరిగిన దాని
గురించి తలచుకుంటూ ఉంటే నా మనసులో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏది నిజం? దేన్ని
నమ్మాలి? నా కళ్ళు చెప్పిన సాక్ష్యం తప్పనుకోవాలా? ఈ భూగర్భ కూపంలో మనషి జీవించడం అనేది
సాధ్యమేనా? ఈ పాతాళ కుహరాలలో మానవ జాతులు ఎలా జీవించగలవు? ఈ వైపరీత్యాన్ని ఎలా నమ్మడం?
బహుశ అది మానవాకారాన్ని
పోలిన ఏ వానరమో కావచ్చు. వెనకటి భౌగోళిక యుగాలకి చెందిన ప్రోటోపితికా, మెసోపితికా,
లేకపోతే శ్రీ లార్టెట్ గారు సన్సావ్ లో ఆ ఎముకల
గుహలో కనుక్కున్న ఏ మధ్యయుగపు వానరమో కావచ్చు. కాని ఈ జీవం పరిమాణంలో ఆధునిక పురాజీవశాస్త్రానికి
తెలిసిన జీవాలన్నిటినీ మించిపోయింది.
ఏదేమైనా ఆ కాంతులు
చిందే కారడవిని దాటి చాలా దూరం వచ్చేశాం. అయినా పరిగెడుతూనే వున్నాం. ఏ క్షణాన ఆ మహాకాయుడు
వెనక నుండీ వచ్చి మా మీద పడతాడోనన్న భయంతో పరిగెడుతున్నాం. అలా ముందుకి సాగిపోతూ అనుకోకుండా
మళ్లీ లీడెన్ బ్రాక్ సముద్ర తీరానికి వచ్చాం.
ఈ సారి మేం వచ్చిన
తీర భాగం ఇంతకు ముందు మేం చూసింది కాదని స్పష్టంగా చెప్పగలను. ఇంతకు ముందు మేం వచ్చిన
తీరంలో కొన్ని రాళ్ల సమూహాలు గ్రౌబెన్ రేవుని తలపించేవి. అనుకోకుండానే లీడెన్ బ్రాక్
సముద్రానికి ఉత్తర ప్రాంతానికి చేరుకున్నాం. ఎక్కడ చూసిన రాళ్ల సందుల్లోంచి జలధారలు
స్రవిస్తున్నాయి. కాని కాస్త ముందుకు వెళ్తే చిన్న చిన్న గుట్టలు కనిపిస్తున్నాయి.
మునుపు చూడని ఓ సెలయేరు. దాంతో మళ్ళీ సందేహంలో పడ్డాను.
నా సందేహం మావయ్యకి
వెలిబుచ్చాను. ఆయనకి కూడా కచ్చితంగా తెలియడం లేదు.
“మనం మొదటి మాత్రం
రాలేదని అనిపిస్తోంది,” అన్నాను. “తుఫాను మనల్ని
మరింత ముందుకి తీసుకుపోయింది. కాని ఈ తీరాన్ని అనుసరిస్తే మళ్లీ గ్రౌబెన్ రేవుని చేరుకోగలం.”
“అదే నిజమైతే
ఈ యాత్రలో ఇంకా ముందుకి సాగడం వల్ల ప్రయోజనం లేదు. కాని నువ్వు పొరబడ్డావేమో?” మావయ్య
ప్రశ్నించాడు.
“కచ్చితంగా చెప్పడం
కష్టం మావయ్యా. ఈ రాళ్లు మాత్రం ముందు చూసిన రాళ్ల లాగానే వున్నాయి. ఇంతకు ముందు హన్స్
మన తెప్పని నిర్మించింది ఈ గుట్టే అనుకుంటా. ఆ గుట్ట ఇది కాకపోయినా అది ఇక్కడే ఎక్కడో
వుండాలని అనిపిస్తోంది.”
“కాని ఇక్కడికి
ఇంతకు ముందు వచ్చి వుంటే మన కాలి గుర్తులు కనిపించాలిగా. కాని ఎక్కడా కనిపించడం లేదే?”
“నాక్కనిపించిందోచ్!”
ఉత్సాహం పట్టలేక అరిచాను. కింద పడి వున్న ఓ తుప్పు పట్టిన కత్తిని పైకి తీసి మావయ్యకి చూపించాను.
“అది నీదా?”
మావయ్య అడిగాడు.
“కాదు. నీ దనుకున్నానే!”
“లేదు, లేదు.
నా వద్ద ఇలాంటి కత్తి ఎప్పుడూ లేదు.”
“అదేంటి? చిత్రంగా
వుందే.”
“ఏం లేదు ఏక్సెల్.
ఐస్లాండ్ వాసులు ఇలాంటి కత్తులు వాడతారు. ఇది హన్స్ దే అయ్యుంటుంది.”
నేను లేదన్నట్టు
తల అడ్డుగా ఊపాను.
“ఇది ఎవడో ఆదిమానవుడి
ఆయుధం అయితే? ఇందాక మనం చూసిన పశువుల కాపరికి చెందిందే అయితే? ఇది మాత్రం నిశ్చయంగా
రాతి యుగానికి చెందింది కాదు. ఇనుప యుగానికి కూడా కాదు. ఎందుకంటే ఇది స్టీలు కత్తి.”
నా మాటలని మావయ్య
మధ్యలోనే ఆపేశాడు.
“ఆగు ఏక్సెల్.
కాస్త ఆలోచించు. ఈ కత్తి పదహారవ శతాబ్దానికి చెందింది. దీన్ని పోనియార్డ్ అంటారు. ఇది
స్పెయిన్ కి చెందింది. అది నీదీ కాదు, నాదీ కాదు, ఈ వేటగాడిదీ కాదు. దానికి పట్టిన
తుప్పు ఎంత దట్టంగా వుందో చూశావా? అంత దట్టంగా తుప్పు పట్టడానికి రోజులు, నెలలు కాదు.
శతాబ్దాలు పడుతుంది.”
ప్రొఫెసరు గారి
మనసులో ఊహకి పగ్గాలు పటపట మని తెగిపోవడం వినిపిస్తోంది.
“ఏక్సెల్ మనం
ఓ అద్భుతమైన ఆవిష్కరణ యొక్క ముఖ ద్వారాల వద్ద నిలిచి వున్నాం. ఒకటి నుండీ మూడు శతాబ్దాల
కాలం ఆ కత్తి ఇక్కడే పడి వుంది.”
“కాని అది ఒంటరిగా
రాలేదు. అది దానికదే ఇలా కొంకర్లు పోలేదు. మనకన్నా ముందే ఎవరో ఇక్కడికి వచ్చినట్టున్నారు.”
“అవును. ఎవరో
మనిషే వచ్చాడు.”
“ఎవరా మనిషి?”
“ఆ మనిషి ఎవరో
తన పేరుని ఆ కత్తి మీద చెక్కి వుంటాడు. భూమి కేంద్రానికి ప్రయాణించే బృహత్ యత్నం చేసి
ఆ యాత్రకి చిహ్నంగా ఏదో గుర్తు వదిలి వుంటాడు. ఈ ప్రాంతం అంతా గాలిద్దాం పద ఏక్సెల్.
ఏవైనా రహస్యాలు బయటపడతాయి.”
ఆ పరిసరాలన్నీ
శ్రద్ధగా గాలించాం. మా ఎదుట ఓ పెద్ద కోట గోడలా విస్తరించి వున్న ఆ రాతి గుట్టని శ్రద్ధగా
పరిశీలించాం.
అలా ముందుకు
సాగిపోతుంటే ఒక చోట గుట్టకి సముద్రానికి మధ్య దారి మరింత ఇరుకు అయ్యింది. అక్కడ సముద్రపు
కెరటాలు ఆ రాతి ప్రాకారపు పాదాలని తాకుతున్నాయి. అక్కడ బయటికి వికృతంగా పొడుచుకొస్తున్న
రెండు శిలల మధ్య ఓ సొరంగ మార్గం కనిపించింది.
అక్కడ ఓ కరకు
బండ మీద రెండు చిత్రమైన అక్షరాలు చిత్రించబడి కనిపించాయి. కాలప్రభావం చేత కాస్త అలుక్కుపోయినట్టు
వున్నాయి. ఎవరో పాతకాలపు బాటసారి పేరులోని మొదటి అక్షరాలవి. అవి రూనిక్ లిపిలో రాసి
వున్నాయి.
“ఏ. ఎస్.” అరిచాడు
మావయ్య. “ఆర్నే సాక్నుస్సేం. ఆర్నే సాక్నుస్సేం…”
(ముప్పై తొమ్మిదవ
అధ్యాయం సమాప్తం)
మన స్వప్న జీవనం గురించి ఇంతవరకు
అంతో ఇంతో లోతుగా శోధించాం. స్వప్నాలు ఎందుకు ముఖ్యం అంటే స్వప్నాలనే మట్టి లోంచి పుట్టే
మొలకలే మానవ ప్రతీకలు. కాని దురదృష్టవశాత్తు కలలని అర్థం చేసుకోవడం కష్టం. సచేతన మానసం
చెప్పే కథలకి కలలకి మధ్య ఎంతో తేడా వుంటుందని అంతకు ముందే చెప్పాను. నిజజీవితంలో మనం
ఏదైనా అనాలనుకున్నప్పుడు ఆచితూచి మాట్లాడతాం. వాక్యంలో పదాలు పొందిగ్గా వున్నాయో లేదో
చూసుకుంటాం. భావాలు సహేతుకంగా అతుకుతున్నాయోలేదో చూసుకుంటాం. ఉదాహరణకి ఓ చదువుకున్న
వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు వాడే ఉపమానాలు కలగాపులగంగా ఉండడానికి ఇష్టపడడు. అలా మాట్లాడితే
భావం అవిస్పష్టం అవుతుందని అనుకుంటాడు. కాని కలల నైజం వేరుగా ఉంటుంది. అర్థం పర్థం
లేని, పరస్పర విరుద్ధమైన చిత్రాలు స్వాప్నికుడి మానసాన్ని క్రమ్ముకుంటాయి. మామూలుగా
ఉండే కాలభావాన సమసిపోతుంది. సర్వసామాన్య విషయాలు కూడా ఏవో విపరీతమైన, విపత్కరమైన అంతరార్థాన్ని
సంతరించుకుంటాయి.
జాగృత జీవనంలో మనం మన ఆలోచనల
మీద ఎంతో క్రమాన్ని, క్రమశిక్షణని ఆపాదించడానికి ప్రయత్నిస్తాం గాని, అచేతనలోని అంశాలు
గందరగోళంగా, కకావికలంగా ఉండడం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఒక్క క్షణం ఏదైనా కలని జ్ఞాపకం
తెచ్చుకుని జాగ్రత్తగా గమనిస్తే ఈ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే మామూలుగా మనుషులకి
తమ కలలు అర్థం చేసుకోవడం అంత కష్టం అవుతుంది. మన జాగృత జీవనం పరంగా చూస్తే అవసలు అర్థం
లేనట్టు కనిపిస్తాయి. అందుకే అవి అర్థం కావడం లేదని తలబద్దలు కొట్టుకుంటూ వుంటారు,
లేదా అర్థం కావని వాపోతూ వుంటారు.
ఇక్కడ మనం గమనించాల్సిన విషయం
ఒకటుంది. మన జాగృత జివనంలో మనకి ఎదురయ్యే భావనలలో ఎంతో క్రమం వుందని అనుకుంటాం గాని
వాటిలో నిజంగా మన అనుకున్నంతగా క్రమం గాని, క్రమశిక్షణ గాని లేవని మనం గుర్తించాలి.
మన జాగృదావస్థకి చెందిన భావలలో మనం అనుకున్నంత స్థాయిలో నిర్దిష్టత, స్పష్టత ఉండదు. నిజం చెప్పాలంటే ఆ భావాలని మనం ఎంత నిశితంగా పరిశీలిస్తే
వాటిలోని అంతరార్థం (ముఖ్యంగా హార్దికమైన సారం) అంతగా అవిస్పష్టంగా కనిపిస్తుంది. దానికి
కారణం ఏంటంటే మనం విన్నది, అనుభూతి చెందినది అంతా మన అచేతనలోకి ప్రవేశిస్తుంది. అంతేకాక
మనం మన సచేతన మనస్సులో నిలుపుకున్నది, సంకల్పమాత్రం చేత వ్యక్తం చెయ్యగలిగేది కూడా ఓ కొత్త అచేతనమైన అంతరార్థాన్ని సంతరించుకుంటుంది.
మన జ్ఞాపకాన్ని తిరిగి గుర్తుతెచ్చుకున్న ప్రతీ సారి దానికి ఏదో అచేతనమైన వన్నె అలముకుంటుంది.
మన సచేతన జ్ఞాపకాలు వేగంగా ఓ అచేతన అంతరార్థాన్ని
సంతరించుకుంటాయి. ఆ గూఢార్థానికి ఏదో ఆత్మగతమైన విలువ ఉండి వుండొచ్చు. కాని ఆ అర్థమేమిటో,
ఆ విలువ ఏమిటో మనకి సచేతనంగా తెలియకపోవచ్చు. అదే ఆ భావన యొక్క బాహ్యార్థాన్ని ఎలా మరుగుపరుస్తుందో
మనకి అర్థం కాకపోవచ్చు.
(ఇంకా వుంది)
postlink




