7. బాలల సాహసగాధా సాహిత్యం (Stories of Adventure for Children)
ఊహా (ఫాంటసీ) సాహిత్యంలో కూడా సాహసం పాలు తప్పకుండా ఉన్నా, ఆ రకమైన సాహిత్యానికి సాహసగాధా సాహిత్యానికి మధ్య ఉన్న ముఖ్యమైన తేడా వాస్తవికత. సాహసగాధా సాహిత్యంలో దేవతలు, బ్రహ్మరాక్షసులు ఉండరు. ప్రకృతి సహజమైన ఉపద్రవాలు, క్రూరమృగాలు, దొంగలు మొదలైన సవాళ్లని ఎదుర్కుని చేసే సాహసం కథాంశంగా ఉండే కథలివి. తెలుగులో ఊహాసాహిత్యం బాగానే వున్నా, ఈ రకమైన వాస్తవికతగల సాహసగాధా సాహిత్యం తక్కువ.
సాహసగాధా సాహిత్యానికి సుదీర్ఘ చరిత్రే వుంది. ఒక విధంగా పంతొమ్మిదవ శతాబ్దానికి చెందిన గొప్ప రచనలు కొన్ని ఈ సాహితీ విభాగానికి చెందినవని చెప్పుకోవచ్చు. ఫ్రెంచ్ రచయిత జూల్స్ వెర్న్ రాసిన ‘Journey to the Center of the Earth,’ ‘Around the world in 80 days,’ మొదలైన రచనలు గొప్ప మేధస్సుతో కూడిన సాహసాన్ని ప్రదర్శించిన వ్యక్తుల కథలకి తార్కాణాలు. స్కాటిష్ నవలా రచయిత రాబర్ట్ లూయీ స్టీవెన్ సన్ రాసిన ‘Treasure Island’ ఆ కాలానికి చెందిన సాహసగాధే.
బాలసాహిత్యంలో ఈ విభాగంలో కూడా ఎనిడ్ బ్లైటన్ సృజన బాల పాఠకులని ఆకట్టుకుంది. ఆమె రాసిన ‘సాహసగాధా నవలావాహిని’ (adventure series) లో ‘Island of Adventure,’ ‘Castle of Adventure’ మొదలుకుని మొత్తం 8 నవలలు ఉన్నాయి. ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు పాపలు, ఓ పెంపుడు చిలుక ముఖ్య పాత్రలుగా ఉన్న ఈ కథలలో ప్రతీ పుస్తకంలోను ఈ పిల్లలు ఓ కొత్త ప్రదేశానికి వెళ్లడం, అక్కడ ఏదో ప్రమాదంలో ఇరుక్కోవడం, గొప్ప సాహసాన్ని ప్రదర్శించి ఆ ప్రమాదం నుండి బయటపడడం ప్రధానాంశంగా ఉంటుంది. ఉదాహరణకి Valley of Adventure అన్న పుస్తకంలో ఈ పిల్లలు తమ పెద్దవాళ్లతో కలిసి ఏదో ఊరికి వెళ్తూ తప్పుడు విమానం ఎక్కి, కొన్ని భయంకర పరిస్థితుల్లో ఓ లోయలో చిక్కుకుపోతారు. నిరంతరం కీచులాడూకుంటూ ఉండే కొందరు కొండ జాతి వారి మధ్యన, పోగొట్టుకుపోయిన ఏదో పెన్నిధి కోసం ప్రాకులాడే ఓ దొంగల ముఠా మధ్యన నలిగిపోతూ పిల్లలు బయటపడి తప్పించుకోవడం ఈ నవలలో కథాంశం.
ఎన్నో ఇతర రకాల బాలసాహిత్యంతో పాటు ఎనిడ్ బ్లైటన్ సాహసగాధా సాహిత్యం కూడా రాయడం జరిగింది గాని, ప్రధానంగా పిల్లల కోసం సాహసగధా సాహిత్యం మాత్రమే రాసిన రచయితలలో ప్రముఖుడు విలార్డ్ ప్రైస్ (Willard Price, 1887 – 1983). కెనడాలో పుట్టి అమెరికాలో స్థిరపడ్డ విలార్డ్ ప్రైస్ National Geographic Society లో సభ్యుడిగా ప్రపంచం అంతా ఎన్నో ప్రాంతాలు పర్యటించాడు. “చదివే అనుభూతి గొప్ప ఉత్సాహంతో, సాహస స్ఫూర్తితో నిండి వుండాలన్న లక్ష్యంతో ఈ ‘సాహసగాధా మాల’ యొక్క రచనకి పూనుకున్నాను” అని 1983 లో చెప్పుకున్నాడు. ‘Amazon Adventure’ తో మొదలుకుని మొత్తం పద్నాలుగు పుస్తకాలు రాశాడు ప్రైస్. “విలార్డ్ ప్రైస్ పుస్తకాలే నా చదువుకి ఓనమాలు చుట్టాయి” అంటాడు సమకాలీన బాలసాహిత్య రచయిత ఆంతొనీ హోరోవిట్జ్.
ఉపసంహారం
ఇంగ్లీష్ లో బాల సాహిత్యంలో మరి కొన్ని వర్గాలు ఉన్నాయి. సమయాభావం వల్ల వాటి గురించి మరింత విపులంగా ఇక్కడ చర్చించబోవడం లేదు. ఉదాహరణకి ‘బాలల చారిత్రక సాహిత్యం.’ చిన్నప్పుడు పాఠ్యపుస్తకాలలో చరిత్ర చదువుకుంటాం. అందులో ‘స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చెను?’ ‘షాజహాను ఎప్పుడు చచ్చెను?’ మొదలైన ప్రశ్నలకి సమాధానాలు బట్టీ పట్టే ప్రయత్నంలో పిల్లలు మునిగిపోయి వుంటారు కనుక చదవాల్సిన రీతిలో – ఓ గొప్ప కథలా - చరిత్రని సరదాగా, హాయిగా చదువుకోవడం జరగదు. అందుకే కాబోలు ‘చివరికి మిగిలేది’ లో బుచ్చిబాబు అంటాడు – “మనిషి చరిత్ర నుండి నేర్చుకునేది ఏంటి అంటే మనిషి చరిత్ర నుండి ఏమీ నేర్చుకోడు అన్న విషయం!” చమత్కృతి బావుంది గాని చరిత్ర నుండి నేర్చుకోవాలంటే నన్నడిగితే పరీక్ష అనే తలనొప్పి నేపథ్యంలో లేకుండా హాయిగా ఓ ‘మిస్టరీ థ్రిల్లర్’ చదువుకున్నట్టుగా చారిత్రక కథలని పిల్లలని చదువుకోనివ్వాలి. అంటే ముందు అలాంటి సాహిత్యాన్ని తెలుగులో సృష్టించాలి. చక్కని చారిత్రక సాహిత్యం చదివిన పిల్లలు ఎలా ఎదుగుతారో తెలుసుకోవాలంటే మనకి నెహ్రూ తన కూతురు ఇందిరకి రాసిన ఉత్తరాలే గుర్తొస్తాయి. ఈ ఉత్తరాలే తదనంతరం ‘Glimpses of World History’ అనే భారీ గ్రంథంగా రూపొందాయి. నెహ్రూ, ఇందిర లాంటి మహామహులకి సరిపోయింది గాని మామూలు పిల్లలకి అంత చరిత్ర అవసరమా? అని కొందరు సందేహించవచ్చు. చచ్చేటంత అవసరం అంటాను. చరిత్ర లేకుండా అసలు చదువు పూర్తికాదని అనిపిస్తుంది. మన దేశంలో చరిత్ర అంటే ఎక్కువగా భారతీయ చరిత్రకే, అదీ గత రెండు వేల ఏళ్ల చరిత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము. ఎందుకింత సంకుచిత భావం? ప్రపంచ చరిత్ర మొత్తం – అమెరికాలో ‘అలమో పోరాటం’ (Battle of the Alamo) నుండి ఆస్ట్రేలియాలో ఆదిమవాసుల వికాస క్రమం (evolution of Australian aborigines) వరకు – ఏదీ వదల కుండా తెలుగులోకి తెచ్చుకుని, అందరికీ అర్థమయ్యే సుళువైన భాషలో రాసుకుని, అందరికీ లభ్యమయ్యేలా అంతర్జాలంలో పొందుపరుచుకునే ప్రయత్నం చేస్తే ఎంత బావుంటుంది?
బర్మీస్ భాషలో అనువదించబడ్డ Glimpses of World History
బాల సాహిత్యంలో మరో ముఖ్యమైన వర్గం ‘జీవిత కథలు’ లేదా ‘ఆత్మకథలు.’ ఈ వర్గంలో మనకి సాహిత్యం చెప్పుకోదగ్గ మోతాదులోనే ఉన్నా ఆ కథలలో ఎక్కువగా భారతీయుల, లేదా తెలుగువారి జీవితకథలే ఉంటాయి. తరువాత పాశ్చాత్య సమాజాలలో పుస్తకాలు రాసే సంస్కారం బలంగా ఉంటుంది. సినిమా నటులు, దేశ నేతలు, కంపెనీల సీయీవో లు ఇలా నానా రంగాల వాళ్లు తమ జీవిత కథలు రాసుకుంటుంటారు. మన సంస్కృతిలో అధికంగా సాహితీ రంగంలో ఉన్న వారు మాత్రమే పుస్తకాలు రాయడం జరుగుతుంది. కనుక జీవితకథలలో, ముఖ్యంగా ఆత్మకథలలో, వైవిధ్యం తక్కువగా ఉంటుంది. కనుక మనకి ప్రస్తుతం తెలుగులో ఉన్న జీవితకథల/ఆత్మకథల జాబితాకి ప్రపంచ ప్రముఖుల (ఐన్ స్టయిన్, బిల్ గేట్స్, నెల్సన్ మండేలా మొ॥) జీవిత కథలు జోడిస్తే బావుంటుంది.
బాలసాహిత్యంలో ఇక ఆఖరుగా చెప్పుకోదగ్గ వర్గం ఒకటుంది. ఇన్ని రకాలుగా బాల సహిత్యాన్ని పెంచేసి పిల్లల్ని పుస్తకాల పురుగుల్లా మార్చేయడం వాంఛనీయం కాదు. ఆటపాటలతో హాయిగా ఎదగాల్సిన ప్రాయం బాల్యం. (కాని మరి టీవీ ప్రభావమో, బడి చదువుల ఒత్తిడో, ఖాళీ మైదానాలు అందుబాటులో లేకపోవడమో, - కారణాలు ఏవైనా పిల్లలకి హాయిగా ఆడుకునే అవకాశాలు తగ్గిపోతున్నాయి). కనుక ఆటపాటలకి, వృత్తులకి (activities), వైజ్ఞానిక ప్రయోగాలకి, ప్రాజెక్టులకి సంబంధించిన సాహిత్యం ఈ సందర్బంలో ఎంతో ఉపకరిస్తుంది. ఈ రకమైన సాహిత్యం తెలుగులో లేకపోలేదు. ఉదాహరణకి ‘జన విజ్ఞాన వేదిక’, ‘మంచి పుస్తకం’ లాంటి ప్రచురణలలో ఈ రకమైన పుస్తకాలు ఎన్నో ఉన్నాయి.
అయితే ఈ సాహిత్యాన్ని ఇంకా విస్తరింపజేసుకునే అవకాశాలు ఉన్నాయి. వివిధ దేశాలకి చెందిన ఆటపాటల వివరాలు అంతర్జాలంలో పుష్కలంగా ఉన్నాయి. అసలు ఈ రంగంలో అవగాహన పెంచేందుకు గాని ఓ అంతర్జాతీయ పిల్లల ఆటల సదస్సే వుంది. వీరికి ఓ వార్షిక సమావేశం కూడా ఉంది. 45 వ అంతర్జాతీయ పిల్లల క్రీడా సమావేశం 2011 లో స్కాట్ లాండ్ లో జరిగింది. అందులో 33 దేశాల నుండి 77 నగరాల నుండి అభ్యర్థులు పాల్గొన్నారు.
ఓ ముద్దులొలికే కప్ప బొమ్మ (http://www.allhallowsguild.org/fm/images/AHG-Frog-big.jpg)
ఈ విధంగా అంతర్జాతీయ సాహిత్యాన్ని, అంతర్జాతీయ పరిజ్ఞానాన్ని తెలుగులోకి తెచ్చుకుంటే, ఆ రకమైన సాహితీ విస్తరణ లోతైన చిత్తవికాసానికి, గాఢమైన చైతన్య వృద్ధికి దొహదం చేస్తుందని నా నమ్మకం. సామాజిక దృక్పథాలలో కూడా ఎంతో మార్పు వస్తుంది. ఈ రోజుల్లో ఎంతో మంది భారతీయులు ఉద్యోగరీత్యా విదేశాలు సందర్శిస్తున్నారు. అక్కడి పరిస్థితులు ప్రత్యక్షంగా చూసి, అక్కడి పద్ధతులని నేర్చుకుంటున్నారు. అక్కడి వ్యవస్థకి, సౌకర్యాలకి, భారతీయ పరిస్థితుల్లో మనకి అందే సౌకర్యాలకి మధ్య వేర్పాటు చూస్తున్నారు. అక్కడ పిల్లలకి ఎదగడానికి లభ్యమయ్యే సౌకర్యాల వైభవాన్ని తెలుసుకుంటున్నారు. ఆ తేడా కొన్ని సార్లు భరించరానిది గా ఉంటుంది. ఒక సింగపూర్ లోనో, ఒసాకా లోనో ఉండే జీవన సౌకర్యాలకి, ఓ హైదరాబాద్ లోనో, కొల్కతాలోనో ఉండే జీవన సౌకర్యాలకి మధ్య చెప్పరానంత వారడి వుంది. ఆ వారడి వాస్తవంలో, భౌతికంగా భర్తీ కావాలంటే, ముందు మానసికంగా, అవగాహన పరంగా, పరిజ్ఞానం పరంగా భర్తీ కావాలి. అభివృద్ధి చెందిన దేశాలలో విధానాల గురించి, పని తీరు గురించి, తగిన సాహిత్యం ద్వారా ఇక్కడ అవగాహన పెంచాలి. అలాంటి వికాసం చిన్నతనం నుండి జరిగితే ఆ విధానాలని అర్థం చేసుకుని, ఆకళింపు చేసుకుని, మన సంస్కృతితోను, విధానాలతోను వాటిని సమన్వయపరచుకోవడం సులభం అవుతుంది. ఆ విధంగా సువిస్తారమైన, సమున్నతమైన సాహిత్యంతో మనోభూమిక ముందు సంస్కరించబడితే, విస్తరించబడితే, ఆ సంస్కరణ భౌతిక రూపం దాల్చడానికి ఎంతో కాలం పట్టదు. ఉద్దీప్తమైన భావిభారతం సకాలంలో మన చుట్టూ అందంగా వెల్లివిరుస్తుంది.
(సమాప్తం)
5. భయానక సాహిత్యం (Horror literature):
పిల్లల కోసం భయానక సాహిత్యమా? అసలు ఆ ఆలోచనే చాలా మందికి విడ్డూరంగా ఉంటుంది. సున్నితమైన మనసున్న పిల్లలకి చక్కని ‘నీతి’ కతలు చెప్పాలిగాని దెయ్యాల కథలు చెప్పడమా? ఎక్కడో పిడుగు పడితేనే మంచం కిందకి దూరే పిల్లలకి ‘అర్జున, ఫల్గుణ…’ అంటూ భయం పోగొట్టే చిట్కాలు చెప్పకపోగా, రోమాలు నిక్కబొడుచుకునేలా చేసే భూతప్రేతాల కథలు పనిగట్టుకుని చెప్పడం ఎంతైనా విపరీతంగానే అనిపిస్తుంది. అందుకేనేమో ఒకప్పుడు గొప్ప సంచనలం సృష్టించిన ‘ఎగ్సార్సిస్ట్’ సినిమా ఇప్పటికీ యూ.కె. లో నిషిద్ధంగా ఉంది. కాని ఒకప్పుడు ఇంగ్లీష్ లో బాలసాహిత్యపు చీకటి సరిహద్దులకే పరిమితమైన భయానక సాహిత్యం, ఇప్పుడు ఓ ముఖ్యమైన బాలసాహితీ విభాగం కాగల స్థాయికి ఎదిగింది.
తెలుగులో కూడా భూత ప్రేతాల కథలు, బ్రహ్మ రాక్షసుల కథలు ఉన్నా అందులో భయం పాలు తక్కువ. బేతాళ కథల్లో భీతి కన్నా నీతి పాలు ఎక్కువ. చందమామ కథలలో అప్పుడప్పుడు దెయ్యాల ప్రసక్తి ఉన్నా పిల్లలని భయపెట్టడం మాత్రం ఆ కథల లక్ష్యాలలో ఒకటి కాదు.
ఇంగ్లీష్ లో భయానక సాహిత్యానికి పితామహుడు అని చెప్పుకోదగ్గ వాడు 'స్టెఫెన్ కింగ్'. ఈయన 49 నవళ్ళు, 5 నాన్-ఫిక్షన్ రచనలు, మరి కొన్ని కథా సంకలనాలు రాశాడు. ఈయన పుస్తకాలు 350 మిలియన్ల కాపీలు అమ్ముడుపోయాయి.
స్టెఫెన్ కింగ్ రచనలు ప్రత్యేకించి పిల్లల కోసం చేసినవి కావు. పిల్లల భయానక సాహిత్యంలో చెప్పుకోదగ్గ ప్రయోగం ‘Goosebumps’ (రోమాంచితం) అనే నవలా ధారావాహిక. దీన్ని రాసింది అమెరికన్ రచయిత ఆర్. ఎల్. స్టయిన్. 1992 లో విడుదల అయిన ‘Welcome to the Dead House’ (చావు కొంపకి స్వాగతం) అన్న పుస్తకానికి ప్రపంచ వ్యాప్తంగా మంచి స్పందన వచ్చింది. 2008 కల్లా ఈ ధారావాహికకి చెందిన పుస్తకాలు 350 మిలియన్ కాపీలు అమ్ముడుపోయి, 35 భాషలలోకి తర్జుమా అయ్యాయి. Goosebumps కథల ఆధారంగా వచ్చిన టీవీ ధారావాహిక కూడా విజయవంతం అయ్యింది.
భయానక సాహిత్యంలో మళ్లీ ఎన్నో ఉపవర్గాలు ఉన్నాయి. రక్తపిశాచులు (vampires), భీకర అసదృశ మృగాలు (beasts/monsters), మామూలు మనుషుల్లా భూమి మీద సంచరించే జీవచ్ఛవాలు (zombies), వినోదం కోసం హత్యలు చేసే విపరీతపు ఖూనీకోర్లు (serial killers), … మొదలైన ‘దుషటచతుషటయం’తో కిటకిటలడే చీకటి లోకం భయానక సాహిత్యం. ఇవి చదివి ఆబాలగోపాలం ఆనందిస్తారంటే చాలా మందికి మింగుడు పడదు.
మరి కాకపోతే ఊరికే జడుసుకునే పిల్లలని పనిగట్టుకుని భయపెట్టడం ఏంటి? భయానక సాహిత్యం వల్ల ఏదైనా ప్రయోజనం వుందా? అంటే అందుకు సమాధానంగా అవునంటాడు ‘రాబర్ట్ హుడ్’ అనే సాహితీ విమర్శకుడు. ఎనిడ్ బ్లయిటన్ కథలలో లాగా జీవితం ఎప్పుడూ ఓ తీపి కలలాగా ఉండదు. అనిశ్చయిత్వం, అభద్రత అనుక్షణం పొంచి వుంటాయి. అవాంతరాలు ఎదురైనప్పుడు ఎంతటివాడికైనా భయం కలగడం సహజం. పిల్లలలో అది మరీ సహజం. ఆ భయాన్ని ఊరికే అణిచిపెట్టకుండా, దాన్ని ఈ భయానక సాహిత్యం సహాయంతోనో, భయానక సినిమాల సహాయంతోనో బయటికి తెప్పించి, అది ఉత్తిత్తి ప్రమాదమేనని, భయపడాల్సిన పనిలేదని తెలియజెప్పినప్పుడు, ఆ భయం కాస్తా కాస్తంత ధైర్యంగా పరివర్తన చెందుతుంది. భయంలో ఉన్న ఆనందం ఏంటో అప్పుడు అనుభవం అవుతుంది. అడ్రినలిన్ గోదారి వరదలా పరవళ్లు తొక్కినప్పుడు, గుండె డప్పుల చప్పుడుకి ఛాతీ ఎగసెగసి పడుతున్నప్పుడు, సింపథెటిక్ నాడీమండలం శివాలెత్తిపోతున్నప్పుడు కలిగే ఆ ఉద్రిక్తత, ఉద్వేగం ఎలా ఉంటుందో … మరి ఆ భయానక సాహితీపిపాసులకే తెలియాలి.
(ఇక సినిమా రంగానికి వస్తే, మన దేశంలో ఎప్పుడో అడపాదపా తప్ప, డిపాజిట్లు పోతాయని తెలిసినా, ఓ యజ్ఞంలా హారర్ సినిమాలు తీసే ఏకాంత వీరులు, ఎవరో రామ్ గోపాల వర్మ లాంటి వాళ్ళు తప్ప, బహు అరుదు. ఇక నేడు తెలుగు సినిమాలలో మూడే రుచులు కనిపిస్తాయి – ‘క్యా(?)మెడీ’, ‘వయొలెన్స్’, ‘రొమాన్స్’. మూడిటికి కొన్నిసార్లు తేడా కనిపించక ఇబ్బంది అవుతుంటుంది. అది వేరే సంగతి!)
6. బాలల అపరాధపరిశోధనా సాహిత్యం (Crime and Murder mystery literature for children)
బాగా చిన్నతనంలో చిట్టిపొట్టి జంతువులతో ఆడుకుంటూ, వెండి రెక్కల దేవతలతో సావాసం చేస్తూ ఏవో కలల లోకాలలో తేలాడిన పిల్లలు, కాస్త పెద్దయ్యాక వాస్తవ ప్రపంచంతో తలపడడానికి సిద్ధం అవుతుంటారు. తాము అంతవరకు చూసిన సాహితీ ప్రపంచంలో లాగా కాక నిజ జీవితం అనుక్షణం ఓ పోరాటంలా కనిపిస్తుంది. చుట్టూ కనిపించే కర్కశత్వాన్ని, కుటిలత్వాన్ని, కపటత్వాన్ని ఎప్పటికప్పుడు కనిపెట్టి పరిహరించి, దాని స్థానే సత్యాన్ని, సౌందర్యాన్ని ప్రతిష్టించాలి. మన కన్నా బలవత్తరమైన దౌర్జన్యాన్ని ఎదుర్కోవాలంటే తెలివితేటలు కావాలి. పిల్లలలో అలాంటి తెలివితేటలని పోషించే సాహిత్యం అపరాధపరిశోధనా సాహిత్యం.
అపరాధపరిశోధన అనగానే మనసులో మొదట స్ఫురించే పేరు షెర్లాక్ హోమ్స్ (Sherlock Holmes). ‘ఓస్ ఇంతేనా వాట్సన్’ అంటూ ఎంత జటిలమైన నేరపరిశోధనని అయినా గొప్ప తర్కాన్ని, విజ్ఞానాన్ని, లోదృష్టిని ఉపయోగించి సునాయాసంగా పరిహరించే షెర్లాక్ అపరాధపరిశోధనా లోకానికే ఆరాధ్యుడు. షెర్లాక్ హోమ్స్ సాహిత్యం పిల్లలు – కౌమార దశలో ఉండే కాస్త పెద్ద పిల్లలు - కూడా చదివి ఆనందించదగ్గదే గాని ప్రత్యేకించి పిల్లల కోసం రాసింది కాదు.
ఇంగ్లీష్ లో ప్రత్యేకంగా పిల్లల కోసం రాసిన అపరాధపరిశోధనా సాహిత్యంలో అగ్రస్థానంలో ఉన్నది ఫ్రాంక్లిన్ డిక్సన్ రాసిన ‘హార్డీ బాయిస్’ (Hardy Boys) ధారావాహిక అని చెప్పుకోవచ్చు. 1927 లో మొదలైన ఈ నవలా మాలికలో, హైస్కూల్ లో చదువుకునే హార్డీ సోదరులు తమ తీరిక వేళల్లో అపరాధపరిశోధనా వ్యవహారాల్లో మునిగి తేలుతుంటారు. అపరాధపరిశోధన చాతనయ్యింది అబ్బాయిలకేనా అని సవాలు చేస్తూ, ఓ అమ్మాయి ముఖ్య పాత్రగా గల ‘నాన్సీ డ్రూ’ (Nancy Drew) నవలావాహిని పుట్టింది. దీన్ని రాసింది కారొలిన్ కీన్. 1930 లో మొదలైన నాన్సీ డ్రూ నవలవాహినికి చెందిన నవళ్లు 80 మిలియన్ కాపీలు అమ్ముడు పోయి, 12 భాషల్లోకి అనువదించబడ్డాయి.
హార్డీ బాయిస్, నాన్సీ డ్రూ నవలలు కూడా 9-12 ఏళ్ల పిల్లలకి సరిపోతాయి. ఇంకా చిన్న పిల్లలకి కూడా సముచితంగా ఉండే అపరాధపరిశోధనా సాహిత్యం ఉంది. అలాంటి సాహిత్యంలో ప్రఖ్యాత ఆంగ్ల బాల సాహిత్య రచయిత్రి ఎనిడ్ బ్లయిటన్ (Enid Blyton, 1897 –1968) రాసిన నవలలు పేర్కొనవచ్చు. సుమారు 800 నవలల దాకా రాసిన ఈ మహా రచయిత్రి నవలలు 90 భాషల్లోకి అనువదించబడ్డాయి. బ్లైటన్ రచనలు మొత్తం 600 మిలియన్ కాపీలు అమ్ముడుపోయాయి. ఈమె నవళ్లలో ‘Famous Five,’ ‘Secret Seven,’ ‘Five Find-outers’ మొదలైన ధారావాహిక నవలలు అపరాధ పరిశోధనలో పాల్గొనే చిన్నపిల్లల కథలే అంశంగా కలిగి ఉంటాయి.
ఈ వర్గపు సాహిత్యంలో ఇటీవలి కాలానికి చెందిన మరో ఉదాహరణ ‘అలెక్స్ రైడర్’ (Alex Rider). బ్రిటిష్ రచయిత ఆంతొనీ హోరోవిట్జ్ (Anthony Horowitz) రాసిన ఈ నవలావాహినిలో అలెక్స్ రైడర్ అనే 14-15 ఏళ్ల పిల్లవాడు ఓ రహస్యగూఢచారిగా పని చేస్తాడు. ఈ వాహినిలో Stormbreaker అనే పుస్తకం 2000 లో విడుదలై, 2006 లో చలనచిత్రంగా వచ్చింది.
(ఇంకా వుంది)
ఇంగ్లీష్ లో పిల్లల సైన్స్ సాహిత్య సముద్రమే వుంది. వాటి గురించి గణాంక సమాచారం కన్నా కొన్ని మచ్చుతుకలు గమనిస్తే మేలేమో.
1857 లో, మన దేశంలో సిపాయ్ తిరుగుబాటు జరుగుతున్న కాలంలో, ఇంగ్లండ్ లో మైకేల్ ఫారడే రాయల్ సొసయిటీ లో కొంత మంది పిల్లలని పోగేసుకుని రసాయన శాస్త్రం గురించి సరదా కథలు చెప్తూ కొన్ని ఉపన్యాసాలు ఇచ్చాడు. ఆ కథలే A chemical history of a candle అన్న పేరుతో ఓ చిరస్మరణీయమైన పుస్తకంగా వెలువడ్డాయి.
రష్యాకి చెందిన మీర్ ప్రచురణల పుస్తకాలు మనకి విరివిగా, చవకగా, - ముఖ్యంగా తెలుగు అనువాదాలు - దొరికే రోజుల్లో తెలుగులో సైన్స్ సాహిత్యం మంచి ఊపందుకుంది. ఒక తరంలో యాకొవ్ పెరెల్ మాన్ లాంటి రచయితల పేర్లు తెలియని తెలుగు పిల్లలు ఉండరన్నట్టు ఉండేది. పెరెల్ మాన్ రాసిన కళాఖండం ‘Physics for Entertainment’ ఇంటింటా వెలసింది. నాకు తెలిసి ఆ పుస్తకం రెండు సార్లు ‘నిత్య జీవితంలో భౌతిక శాస్త్రం’గా తెలుగులోకి అనువదించబడింది. మీర్ ప్రచురణలు ఒక మొత్తం తరాన్ని ప్రభావితం చేసి సైన్స్ వృత్తుల దిశగా తెలుగు యువతని మరల్చాయి అనుకోవచ్చు. ప్రస్తుత కాలంలో అవి లేని వెలితి స్పష్టంగా తెలుస్తోంది.
బ్రిటిష్ రచయిత లువిస్ కేరొల్ రాసిన ‘ఏలిస్ ఇన్ వండర్లాండ్’ ఒక విధంగా ఫాంటసీ వర్గానికి చెందినదే అయినా అందులో ఎంతో గణితం గుంభనంగా దాగి వుందని పండితులు వ్యాఖ్యానించారు. పైకి పిట్టకథలా కనిపించినా ఎంతో లోతుగల ఈ కథ అందుకే నేమో నూరేళ్లకి పైగా జీవించింది. అలాగే కణ భౌతిక శాస్త్రవేత్త జార్జ్ గామోవ్ రాసిన ‘Mr. Tompkins in wonderland’ సాపేక్షతావాదం, క్వాంటం సిద్ధాంతాల మూల భావాలని ఎంతో మనోరంజకంగా, నవ్వుపుట్టించే రీతిలో బాలపాఠకుల ముందు ఉంచింది.
ఇక వర్తమాన కాలంలో ఇంగ్లీష్ లో లెక్కలేనన్ని బాలాహితీ ప్రచురణ సంస్థలు వెలశాయి. సైన్స్ చదువు యొక్క ప్రధాన్యత నానాటికి పెరుగుతున్న ఈ రోజుల్లో ఈ ప్రచురణ సంస్థలు సైన్స్ సాహిత్యానికి పెద్ద పీట వేస్తున్నాయి. అంతరిక్షం నుండి ఆటం బాంబు దాక, పర్యావరణం నుండి పురావస్తు పరిశోధన దాక, పిల్లలకి అక్కర్లేని రంగమే ఉండకూడదు అన్నట్టు ఈ ప్రచురణ సంస్థలు విస్తృతమైన వైవిధ్యం గల బాల సైన్స్ సాహిత్యాన్ని సృష్టిస్తున్నాయి.
ఇంత అందమైన వైజ్ఞానిక సాహితీ వైభవానికి మన భాష ఎప్పుడు నోచుకుంటుందో తెలియదు.
తెలుగులో పిల్లలకి సంబంధించిన సైన్స్ పుస్తకాలు ఉన్నాయా అంటే ఉన్నాయిగాని ఓ ప్రత్యేక సాహితీ విభాగం అని చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. తెలుగులో సైన్స్ సాహిత్యాన్ని పోషించిన రచయితలని చేతి వేళ్ల మీద లెక్కించొచ్చునేమో. వెనుకటి తరంలో ఈ రంగంలో పని చేసిన వాళ్లలో ఇద్దరి పేర్లు ప్రధానంగా చెప్పుకోవచ్చు- నండూరి రామమోహన్ రావు, మహీధర నళినీమోహన్. అర్థం పర్థం లేని సైన్స్ విషయాలని పాఠకుడి నెత్తిన వద్దన్నా రుద్దకుండా, గొప్ప సాహితీ ప్రకర్ష జోడించి, చక్కని చమత్కృతిని కనబరుస్తూ, సమయోచితమైన హాస్యాన్ని చొప్పిస్తూ, కథలు/నవళ్లు/కవితలు తప్ప ప్రాణం పోయినా సరే సైన్స్ విషయాల జోలికి పోనని ఒట్టేసుకున్న సగటు తెలుగు పాఠకుడి చేత ఇష్టంగా సైన్స్ పుస్తకలు చదివింప జేశారు ఈ ఇద్దరూ. ఇక ఇటీవలి కాలంలో ఈ రంగంలో కృషి చేస్తున్న వాళ్ళు – వేమూరి వెంకటేశ్వర రావు, కొడవటి గంటి రోహిణీప్రసాద్, కె.బి. గోపాలం, నాగనూరి వేణుగోపాల్ మొదలైనవారు. తెలుగులో సైన్స్ సాహితీ రంగంలో వచ్చిన మరో సత్పరిమాణం ‘డిస్కవరీ’ అనే ఓ సైన్స్ పత్రిక. ప్రతిభావంతమైన సైన్స్ వ్యాసాలతో, అందమైన బొమ్మలతో ఈ పత్రిక సైన్స్ రంగంలో ఎంతో సేవ చేస్తోంది.
కాని ఈ ఇంటర్నెట్ యుగంలో, విశ్వజనీనమైన సైన్స్ సాహిత్యం కట్టలు తెంచుకుని విస్తరిస్తున్న ఈ దశలో, ఈ రంగంలో మరింతమంది వైజ్ఞానిక రంగంలో ప్రవేశం ఉన్న వ్యక్తులు ప్రవేశిస్తే బావుంటుంది.
4. బాలల కాల్పనిక విజ్ఞాన సాహిత్యం (Children’s science fiction): సైన్స్ ఫిక్షన్ అనగనే ఆ రంగపు త్రిమూర్తులు ఐసాక్ అసిమోవ్, ఆర్థర్ క్లార్క్, రాబర్ట్ హైన్ లైన్ లు గుర్తొస్తారు. కాని వీరి రచనలు చాలా మటుకు ప్రత్యేకించి పిల్లల కోసం రాసినవి కావు. అయితే వీరి రచనల నుండి స్ఫూర్తి తీసుకుని పిల్లల కోసం సై.ఫై. రంగంలో సృజన జరిగిన సందర్భాలు ఉన్నాయి.
ఉదాహరణకి అసిమోవ్ రాసిన ‘ఫౌండేషన్’ దారావాహికే స్టార్ వార్స్ చిత్ర మాలికకి స్ఫూర్తి అని చెప్పుకుంటారు. ఫౌండేషన్ నవళ్ళలో భూమి మీద ఆవిర్భవించిన మానవ జాతి క్రమంగా గ్రహాంతర, తారాంతర యానాన్ని నేర్చుకుని ఇరుగుపొరుగు తారామండలాలని ఆక్రమించి, క్రమంగా మొత్తం పాలపుంత గెలాక్సీ అంతా విస్తరించిన సామ్రాజ్యాలని స్థాపించడం నేపథ్యంగా కథ సాగుతుంది. ఆ కథలలో కిరాతకులైన సామ్రాజ్యవాదులకి, సామ్రాజ్యపు ఉక్కుపిడికిలి నుండి విముక్తి పొందజూస్తున్న విప్లవకారులకి మధ్య సంఘర్షణ ముఖ్యాంశంగా ఉంటుంది. స్టార్ వార్స్ చిత్ర మాలిక చూరగొన్న ఆదరణ నుండి స్ఫూర్తి పొందిన కొందరు సై.ఫై. రచయితలు ‘జెడై (Jedi) సాహిత్యం’ పేరిట విస్తృతంగా స్టార్ వార్స్ ఫక్కీలో సై.ఫై. రచన చేశారు.
సై.ఫై రంగంలో ఎన్నో కథలకి నేపథ్యం అంతరిక్షమే అయినా, ఇతర భూమికల మీద కట్టిన కథలు కూడా కొన్ని చాలా రక్తి కట్టాయి. 1966 లో ఓటో క్లెమెంట్, జెరోమి బిక్స్ బై లు రాసిన ‘Fantastic Voyage’ (ఓ అద్భుత యాత్ర) అన్న కథ అదే పేరుతో సినిమా రూపంలో వచ్చింది. (ఆ కథని పూర్తి నవలగా విస్తరించమని ఐసాక్ అసిమోవ్ ని అడిగారు. ఆ నవల సినిమా కన్నా ముందే విడుదల కావడంతో ఆ కథకి మూల రచయిత అసిమోవ్ అని పొరబడతారు.) ఈ కథలో అమెరికా, సోవియెట్ దేశాలు వస్తువులని విపరీతంగా కుంచించే (miniaturise) సాంకేతిక నైపుణ్యాన్ని వేరు వేరుగా రూపొందించుకుంటాయి. అలాంటి పరిజ్ఞానంలో ఆరితేరిన ఓ రష్యన్ శాస్త్రవేత్త అమెరికాకి పారిపోయే ప్రయత్నంలో హత్యాప్రయత్యం జరిగి మెదడులో రక్తం గడ్డకట్టడం (blood clot) వల్ల కోమా లోకి పోతాడు. అతడి మెదడు లోంచి ఆ రక్తపుగడ్డని తొలగించడానికి సంక్షిప్తీకరించబడ్డ ఓ న్యూక్లియర్ సబ్ మెరిన్ ని (కొంత మంది సిబ్బంది తో పాటు) రష్యన్ శాస్త్రవేత్త రక్త మండలంలోకి ఇంజెక్ట్ చేస్తారు. అయితే ఆ సంక్షిప్త స్థితి ఓ గంట కాలం మాత్రమే ఉంటుంది. ఆ గంటలో ఆ సబ్మెరిన్ శాస్త్రవేత్త రక్తమండలం అంతా గాలించి రక్తపు గడ్డని కనుక్కుని బాంబులతో ఛిద్రం చెయ్యాలి. ఇదీ కథనం. ఇదే తరహా కథ ఒకటి ఇటీవలి కాలంలో ‘innerspace’ అన్న పేరుతో సినిమా రూపంలో వచ్చింది.
ఇంగ్లీష్ లో బాలల సై.ఫై. సాహిత్యం యొక్క విస్తృతి అవగాహన కావడానికి ఈ లింక్ చూడండి -
http://www.goodreads.com/list/show/2450.Best_Children_s_Science_Fiction_Books
బాలల సైఫై సాహిత్యంలో కథ కాస్త ఉపప్రధానంగా ఉంటూ, విజ్ఞానం ముఖ్యాంశంగా ఉండేలా రాయబడ్డ సాహిత్యం కూడా ఉంది. అలాంటి పుస్తకాలలో మచ్చుకి రెండు -
ఇటీవలి కాలంలో వెలువడ్డ ఓ చక్కని బాలల కాల్పనిక విజ్ఞాన రచన ‘George’s Cosmic Treasure Hunt.’ దీన్ని రాసిన వారు లూసీ మరియు స్టెఫెన్ హాకింగ్ లు (Lucy and Stephen Hawking). సైద్ధాంతిక భౌతిక శాస్త్ర రంగంలో ఐన్స్టయిన్ తరువాత అంత సత్తా ఉన్నవాడు స్టెఫెన్ హాకింగ్ అని చెప్పుకుంటారు. ఆయన కుమార్తె లూసీ తన తండ్రితో కలిసి రాసిన నవల ఇది. ఈ కథలో జార్జ్ అనే పిల్లాడు తన నేస్తం ఆనీ తో పాటు, కాస్మాస్ అనే కంప్యూటర్ దారి చూపిస్తుంటే మొత్తం పాలపుంత గెలాక్సీ అంతా చుట్టి వస్తాడు. ఈ పుస్తకం రాయడానికి ముందు లూసీ హాకింగ్, క్రిస్ గాల్ఫర్డ్ అనే రచయితతో కలిసి, ‘George’s secret key’ అని మరో పుస్తకం రాసింది. ఈ పుస్తకం 38 భాషల్లోకి తర్జుమా అయ్యి 43 దేశాల్లో ప్రచురించబడింది.
(ఇంకా వుంది)
ఇంగ్లీష్ లో బాలసాహిత్యంలో ఎన్నో సాహితీ విభాగాలు కనిపిస్తాయి. వాటిలో కొన్ని – 1) ఊహా సాహిత్యం లేదా fantasy సాహిత్యం, 2) అన్వేషకుల గాథలు, 3) సైన్స్ సాహిత్యం, 3) సైన్స్ ఫిక్షన్ సాహిత్యం, 4) భయానక సాహిత్యం, 5) అపరాధ పరిశోధన, 6) సాహసగాధలు, 7) వృత్తులు, క్రీడలకి సంబంధించిన సాహిత్యం. ఈ రకమైన వర్గీకరణ తెలుగు బాలసాహిత్యంలో ఉందనుకోను.
1) ఊహా సాహిత్యం –
పిల్లల మానసిక జివితానికి ఊహే ఊపిరి. ఆ ఊహని పోషించే సాహిత్యానికి మరి బాలసాహిత్యంలో ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. గత దశకంలో ఇంగ్లీష్ లో బాల సాహిత్యానికి కొత్త ఊపిరి పోసిన పుస్తకమాల ‘హారీ పాటర్’ అనుకోవచ్చు. పట్టున ఐదేళ్లు కూడా లేని పిల్లలు కూడా అంతంతలేసి గ్రంథరాజాల్ని సునాయాసంగా చదువుతుంటే ఆ పుస్తకంలో ఏం మహత్తు ఉందో అని ఆశ్చర్యం కలుగుతుంది. టీవీ ప్రభావానికి లోనవుతున్న బాలతరాన్ని మళ్లీ పుస్తక పఠనం వైపుకి తిప్పాయి జె.కె. రౌలింగ్ రచనలు అని చెప్పుకుంటారు.
మాయా చీపురుకట్ట మీద షికార్లు కొడుతున్న హారీ పాటర్
హారీ పాటర్ విజయం తరువాత ఆ ఫక్కీలో ఇంగ్లీష్ లో మరెందరో పిల్లల పుస్తకాలు రాశారు. అంతే కాక గత శతాబ్దానికి చెందిన కొంత ‘ఫాంటసీ’ బాల సాహిత్యం కూడా పునర్జన్మించి కొత్త ఊపిరి పోసుకుంది. గత శతాబ్దపు తొలి సగంలో సి.ఎస్. లువిస్ రాసిన నార్నియా (Narnia) కథలు, సుమారు అదే కాలంలో జె.ఆర్. ఆర్. టోల్కీన్స్ రాసిన హాబిట్ (Hobbit) కథలు ఆ వర్గానికి చెందినవే. మన దేశంలో కూడా ఈ పుస్తకాలు పిల్లల మనసుల్ని దోచాయి.
ఈ మధ్యకాలంలో వస్తున్న ఫాంటసీ కథలు/నవళ్లలో కొన్ని ప్రాచీన గ్రీకు దేవతలని సమకాలీన ప్రపంచంలోకి ప్రవేశపెట్టి, ఆ పాత కొత్తల మేళవింపునే అంశంగా తీసుకున్నాయి. రిక్ రియోర్డెన్ నవళ్లు ఈ రకమైన ప్రయత్నానికి తార్కాణాలు. ఈ రకమైన ప్రయత్నాలు మన దేశంలో కొత్త కాదు. టీవీ లోకంలో ‘ఛోటా భీమ్,’ ‘బాల్ గణేశ్’, ‘వీర్ హనుమాన్’ మొదలైన వన్నీ ఆ రకమైన సృజనలే.
2. అన్వేషుల సాహస కథలు (Stories of explorers)- మానవ ప్రగతికి కారణం సాహసంతో కూడిన అన్వేషణ. అన్వేషుల కథలు పిల్లల మనసుల్లో గాఢమైన ముద్ర వేస్తాయి. మార్కో పోలో, కొలంబస్, వాస్కో ద గామా, మెగాలెన్, జేమ్స్ కుక్, అముండ్ సెన్ మొదలైన ధీరులు భూమి మీద దిశదిశలా పర్యటించి కొత్త ప్రాంతాలని కనుక్కోవడం వల్ల ఆ వీరులు చెందిన సమాజాలు ఎంతో పురోగమించాయి. వీళ్ల మీద పుస్తకాలు ఇంగ్లీష్ లో కుప్పలు తెప్పలుగా ఉన్నాయి.
అన్వేషణ కేవలం భూమికే పరిమితం కానక్కర్లేదు కనుక అంతరిక్షంలో కి ప్రవేశించే సాహసం చేసిన ఎడ్విన్ ఆల్డ్రిన్, వెలెంతినా తెరిష్కోవా మొదలైన అన్వేషుల కథలు కూడా ఎన్నో ఉన్నాయి. కొత్త విషయాలని తెలుసుకోవాలనే స్ఫూర్తి పాశ్చాత్య సంస్కృతిలో బలంగా కనిపిస్తుంది. కనుక వారి సంస్కృతిలో, సాహిత్యంలో అన్వేషుల గాధలకి అంత ప్రాధాన్యత ఇవ్వడంలో ఆశ్చర్యం లేదు. ఆ స్ఫూర్తి మనలో కొంచెం తక్కువ కావడమే ఆ రకమైన సాహిత్యం మన సంస్కృతిలో కొరవడడానికి కారణమేమో. ఇంగ్లీష్ లో బాల సాహిత్యంలో అన్వేషుల కథలకి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో తెలియడానికి ఈ లింక్ చూడండి.
http://www.enchantedlearning.com/explorers/
అయితే అన్వేషణా స్ఫూర్తి అడుగంటిన విషయం గత రెండు మూడు శతాబ్దాల భారతానికి మాత్రమే పరిమితం కావచ్చు. మన పూర్వీకులు కూడా దక్షిణ-తూర్పు ఆసియాలో సామ్రాజ్యాలు స్థాపించారు (శ్రీ విజయ సామ్రాజ్యం). మరి జావా, సుమత్రా మొదలైన దీవులని వాళ్ళు ఎలా కనుక్కున్నారు? ఆ వివరాలన్నీ ప్రస్తుతం లభ్యమైతే చదువుకోడానికి ఎంతో ఆసక్తికరంగా, తెలుసుకోడానికి ఎంతో గర్వంగాను ఉంటుంది. అలాగే మన పూర్వీకులు బౌధ్ధ మత ప్రచారం కోసం హిమాలయలు దాటి చైనా, జపాన్ భూములకి ప్రయాణించారు. ఆ యాత్రలు ఎలా చేశారు? సిల్కు దారుల వెంట మన పూర్వీకులు యూరప్, పర్శియా మొదలైన ప్రాంతాలతో ఎలాంటి సంబంధాలు పెట్టుకునేవారు? ఇలాంటి వివరాలు కొన్ని చరిత్ర పుస్తకాల్లో ఉన్నాయేమో మరి నాకు తెలీదు. కాని ఆ విశేషాలని పిల్లలకి అర్థమయ్యే భాషలో, భారతీయ భాషలలోకి తీసుకొస్తే ఎంతో బావుంటుంది. మన బాలసాహిత్యానికి మంచి పోషణ అందుతుంది.
(ఈ సందర్భంలో 2007 లో వెలువడ్డ ఓ అరుదైన పుస్తకం గురించి చెప్పాలి. సురవి, ఋషి అనే ఇద్దరు భారతీయ టీనేజ్ పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు ఒకసారి క్రిస్మస్ కి ఓ అపురూపమైన బహుమానం ఇచ్చారు. అందురూ ఇచ్చే బొమ్మలో, పుస్తకాలో కాదు. అంటార్కిటికా ఖండాన్ని సందర్శించే సువర్ణావకాశం ఆ బహుమానం! చిలీ దేశపు నౌకాదళానికి చెందిన ఓ పర్యాటక నౌకలో పిల్లలు ఇద్దరూ వారి తల్లిదండ్రులతో అంటార్కిటికా ఖండానికి పయనించి, ఆ యాత్రలో వాళ్ల అనుభవాలన్నీ పొందుపరుస్తూ ఓ అద్భుతమైన పుస్తకాన్ని రాశారు. దాని పేరు ‘Adventures in Antarctica.’ ఈ పుస్తకాన్ని ఎవరైనా తెలుగులోకి అనువదిస్తే బావుంటుంది.)
(ఇంకా వుంది)
పుస్తకాలు పిల్లలకు పసిడి నేస్తాలు. “ఏఏ వేళల పూచే పూవులతో ఆయా వేళల” దుర్గమ్మను పూర్ణమ్మ కొలిచినట్టు, ఒక్కొక్క దశలో ఒక్కొక్క రకమైన సాహిత్యం చదువుకుంటూ పిల్లలు సహజంగా, సజావుగా ఎదగాలి. ఆ రకంగా ఎదగడానికి ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు పిల్లవాడికి – తెలుగులో! – ఎలాంటి సాహిత్యం లభ్యం అవుతోంది? అని ఓ ప్రశ్న మదిలో మెదిలింది ఈ మధ్యన. ఇంగ్లీష్ లో సముద్రం లాంటి బాల సాహిత్యాన్ని తీసుకుంటే, మూడేళ్ల బుడుతల దగ్గర్నుండి, పదిహేనేళ్ల పిల్లల వరకు, ఎన్నో సాహితీ వర్గాలలో, సువిస్తారమైన సాహిత్యం ఉంది. ఐరోపా భాషలలో కూడా తత్తుల్యమైన సాహిత్యం ఉందనే నమ్ముతాను. ఇక పాశ్చాత్య ప్రభావం బలంగా ఉన్న తూర్పు దేశాల భాషలైన జపనీజ్, కొరియన్ భాషల్లో విస్తారమైన బాలసాహిత్యం ఉండడం చూశాను. ఈ సందర్భంలో తెలుగులోను, ఇంగ్లోష్ లోను లభ్యమైన బాలసాహిత్యాన్ని పోల్చుతూ వరుసగా కొన్ని పోస్ట్ లో ఓ సుదీర్ఘమైన వ్యాసం రాయాలని సంకల్పం.
తెలుగులో బాల సాహిత్యంలో నాకు తెలిసినంత వరకు గత రెండు మూడు దశకాలలో పెద్దగా కొత్తదనం వచ్చినట్టు లేదు. పంచతంత్రం, జాతక కథలు, నజీరుద్దీన్, బీర్బల్, తెనాలి రామలింగడు మొదలైన వాళ్ళ కథలు. ఇవి కాకపోతే మన ‘ఎవర్ గ్రీన్’ రామాయణ, భారత, భాగవత గాధలు. తరతరాలుగా ఆ సమాచారమే బాలల సాహిత్యం పేరిట ‘రీసైకిల్’ అవుతున్నట్టు అనిపిస్తోంది. నేను స్కూల్ లో చదువుకునే రోజుల్లో పరిస్థితి మరి కొంచెం మెరుగు అనిపిస్తుంది. చందమామ తో పాటు, బొమ్మరిల్లు, బుజ్జాయి, బాలమిత్ర ఇలా ఎన్నో పత్రికలు ఉండేవి. ఈ మాస పత్రికలతో పాటు చిన్న చిన్న పాకెట్ సైజు పుస్తకాలు (‘భైరవ ద్వీపం’, ‘నేపాళ మాంత్రికుడు’ తరహా పుస్తకాలు!) వచ్చేవి. వీటిని క్లాసులో కూడా టెక్స్ట్ పుస్తకాలలో దాచుకుని దొంగతనంగా చదివేవాళ్ళం! ఆ పుస్తకాలు ఎప్పుడో మాయమైపోయాయి.
(స్కూలు రోజుల్లో దొంగతనంగా చదువుకున్న పుస్తకాలు అంటే ఓ పుస్తకం గుర్తొస్తుంది. అది రైట్ సోదరుల కథ. ఇంపైన తెలుగులో రైట్ సోదరులు విమానాన్ని రూపిందించిన వృత్తాంతాన్ని చాలా రమణీయంగా వర్ణిస్తుంది ఆపుస్తకం. క్లాసులో పిల్లలం ఆ పుస్తకాన్ని లాక్కుని లాక్కుని చదువుకున్నాం. కాని అలాంటి పుస్తకాలు తెలుగులో అరుదు.)
అసలు బాలల సాహిత్యం పట్ల మన సమాజంలో ఓ విచిత్రమైన దృక్పథం ఒకటుంది. ఒకరకమైన ఏకపక్ష ధోరణి వుంది. (ఆ జాఢ్యం అంత సులభంగా పోయేట్టు కనిపించడం లేదు.) పిల్లలకి చెప్పే ప్రతీ కథా ఓ ‘నీతి కథ’ కావాలి. ప్రతీ కథకి చివర్లో ఓ నీతి ఉండాలి. ‘అబద్ధములు ఆడరాదు.’ ‘పెద్దలని గౌరవించవలెను.’ ‘తల్లిదండ్రులని సేవించవలెను.’ ఇలా ఏదో ఒకటి. ఆ నీతి వాక్యాలు చదివేసిన పిల్లలు సజ్జనులుగా ఎదిగేసి దేశానికి మంచిపేరు తెచ్చేసేయాలి.
(విష్ణుశర్మ పంచతంత్ర కథలు బోధిస్తున్న చిత్రం – చిత్రకారుడు వ.పా.)
కొంత మంది పెద్ద రచయితల రచనలలో కూడా ఈ ధోరణి కనిపిస్తుంది. గత ఏడాది ఒకసారి ఓ మేటి రచయిత, ఓ పత్రికలో రాసిన ఓ పిల్లల కథ చదివాను. దాని సారాంశం ఇది. ఓ తండ్రి తన కూతుర్ని తీసుకుని ఓ పుస్తకాల కొట్టుకి వెళ్తాడు. రామాయణం (భారతమో గుర్తులేదు) మీద పుస్తకం కొనిస్తానని తీసుకెళ్తాడు తండ్రి. కాని తీరా అంగడికి వెళ్లాక ఆ పాపకి చదరంగం మీద ఓ పుస్తకం నచ్చి కొనుక్కుంటానని అంటుంది. తండ్రి చిన్న క్లాసు పీకుతాడు. అప్పుడు పాపం ఆ పాప తన తప్పు తాను తెలుసుకుని, పశ్చాత్తాపపడి లెంపలేసుకుని, రామాయణ, భారత కథలు చదివేసి మోక్షమార్గాన వేగంగా ముందుకి సాగిపోతుంది. అదీ కథ.
(మరి నాకొక విషయం ఎప్పుడూ అర్థం కాదు. పుట్టినప్పటి నుంచి ‘నీతీ… నీతీ’ అని గటగటా నీతిసారాన్ని గ్రోలి పెరిగిన మన సమాజంలో ఇంత అవినీతి, ఇంత అసమానత ఎందుకున్నాయ్?)
అంటే పిల్లలకి నీతి కథలు కాక అవినీతి కథలు చెప్పాలని నీ ఉద్దేశమా? అంటారేమో. కాదు. ఎందుకంటే పిల్లల లోకం నీతికి, అవినీతికి అతీతమైన లోకం.
బాల్యం ఓ సుందరమైన, సున్నితమైన దశ. పిల్లల లోకమే వేరు. చీమిడి ముక్కులు, చీమచింతకాయలు, గాలిపటాలు, గచ్చకాయలు, తొక్కుడు బిళ్ళలు, గుజ్జెన గూళ్లు, ముద్ద మాటలు, అద్దె సైకిళ్ళు, బొత్తాలూడిన చొక్కాలు, పెచ్చుల్లేచిన మోకాళ్ళు – ఇలా ఎన్నో విచిత్రమైన అంశాలతో కిక్కిరిసిన లోకం అది. అదో అద్భుతమైన ఊహాలోకం. నానా రకాల అసంభవాలూ ఆ లోకంలో సహజ సంభవాలు.
నేను మూడో తరగతిలో ఉండేటప్పుడు అనుకుంటా… ఓ నేస్తం ఉండేవాడు. రోజూ తను చేసే ఏవో సాహస కృత్యాల గురించి, మహత్యాల గురించే కథలు చెప్పేవాడు. వాడు చెప్పిన ప్రతీ కథా శ్రధ్ధగా వినేవాణ్ణి, నమ్మేవాణ్ణి. ఇంటికి వచ్చి మా అమ్మకి ఆ కథ చెప్పాక గాని నా మబ్బులు విడేవి కాదు!
మరి పిల్లల లోకం అంటే అదే. ఆ అందమైన లోకానికి, తటపటాయిస్తూ అంకురింపజూస్తున్న ఆ అతిసుందరమైన అంతర్లోకానికి ప్రాణం పోసేలా ఉండాలి మనం వాళ్లకి అందించే సాహిత్యం. ఆ సాహిత్యంలో బోలెడంత ప్రేమ, ఆనందం, తీపి, సాహసం, అనంతపు హద్దులు తడిమే ఊహ… ఇవి దండిగా ఉండాలి. అలాంటి అంశాలు ఉన్న పరిస్థితుల్లో ఎదిగే పిల్లలు పిల్లల్లా ఎదుగుతారు. సక్రమంగా, నిండుగా, సంతుష్టుడిగా ఎదిగి, తన సత్తా ఏమిటో తెలుసుకుని, తన శక్తికి తగ్గ స్థానాన్ని జీవితంలో ఆక్రమించిన వ్యక్తి సహజంగా నీతిమంతుడు అవుతాడు. నీతి సాహిత్యంతో వాణ్ణి ‘బ్రెయిన్ వాష్’ చెయ్యనక్కర్లేదు.
ఈ సందర్భంలో అమెరికన్ రచయిత మార్క్ ట్వెయిన్ అన్న మాటలు గుర్తొస్తాయి - “Persons attempting to find a motive in this narrative will be prosecuted; persons attempting to find a moral in it will be banished; persons attempting to find a plot in it will be shot. By Order of the Author.”
కనుక ఓ నీతి సాహిత్యపు గోతి లోంచి పైకొచ్చి ఓ సారి ఇంగ్లీష్ లో బాలసాహిత్యం సంగతి చూద్దాం.
(ఇంకా వుంది)
ఇటీవల బ్లాగ్ లో వచ్చిన కొన్ని వ్యాఖ్యానాల దృష్ట్యా వైజ్ఞానిక సాహిత్యంలో పరిభాషకి సంబంధించిన సమస్య గురించి చర్చించుకోవలసిన అవసరం కనిపించింది.
కొందరు బ్లాగర్లు ’లంబం’, ’అభిఘాతం’ అన్న పదాలకి ఇంగ్లీషు అనువాదాలని ఇస్తే బావుంటుందని అంటే, మరో బ్లాగరి (నా చిరకాల మిత్రుడు, వృత్తి రీత్యా శాస్త్రవేత్త) cerebrospinal fluid ని మస్తిష్కమేరు ద్రవం అని అనువదించాలని సూచించాడు. పరస్పర వ్యతిరేకంగా కనిపించే ఈ రెండు సూచనలలోను కొంత సత్యం ఉంది.
ఏ భాషలోనైనా జనరంజక వైజ్ఞానిక సహిత్యంలో రచన కత్తి మీద నడక లాంటిది. అందరికీ అర్థం కావాలి కనుక ’మామూలు’ రోజూవారీ పదాలతో, అవసరమైతే భావాన్ని కాస్తంత కల్తీ చేస్తూ రాయవలసి వస్తుంది. కాని అలా రాస్తే శాస్త్రరంగంలో ఉన్న వారికి నచ్చదు. ఈ రెండు వర్గాల వారిని సమాధానపరుచుకుంటూ జాగ్రత్తగా రాసుకుపోవాలి. శాస్త్ర సాహిత్యం నిండుగా ఉన్న ఇంగ్లీష్ లాంటి భాషలోనే ఈ సమస్య ఉంటుంది. ఇక ఇంగ్లీష్ లో ఉండే సాహితీ సముద్రంతో పోల్చితే నాలుగు బొట్లు కూడా లేని తెలుగులో శాస్త్ర రచన చెయ్యడం కొంచెం ఇబ్బందే అవుతుంది.
దానికి కొన్ని సామాన్య కారణాలు ఉన్నాయి, కొన్ని వ్యక్తిగత పరిమితులు కూడా ఉన్నాయి.
(వ్యక్తిగత పరిమితులు: మీలో చాలా మంది లాగానే నేనూ ఇంగ్లీష్ మీడియం చదువులు వెలగపెట్టినవాణ్ణే. తెలుగుని కేవలం ఒక భాషగా మాత్రమే నేర్చుకున్నాను. శాస్త్రీయ పరిభాష ఇటీవలి కాలంలో కష్టపడి నిఘంటువులతో కుస్తీపడి నేర్చుకున్నది. కనుక కొన్ని చోట్ల పొరపాట్లు దొర్లవచ్చు. క్షమించాలి.)
సామాన్య కారణాలు:
ఇంగ్లీష్ లో శాస్త్ర సాహిత్యంలోనే కాదు, మరే ఇతర రంగంలో నైనా కఠిన పదాలని రచయితలు సంధర్భోచితంగా వాడడం, దాన్ని పాఠకులు సునాయాసంగా అర్థం చేసుకోవడం, ఆదరించడం పరిపాటి. కాని తెలుగులో రచయితకి ఆ వెసులుబాటు లేదు. కనుక ఒక విధంగా తెలుగు సజీవ పదజాలం కాస్త తక్కువనే అనుకోవాలి. నిఘంటువులలో ఎన్ని పదాలు ఉన్నాయన్నది లెక్క కాదు. సజీవంగా, చలామణిలో ఉన్న సాహితీ వాహినిలో ఎన్ని పదాలు పాల్గొంటున్నాయి అన్నదే ఆ భాషలో శబ్ద సంపదకి కొలబద్ద. తెలుగు రచనలలో ఎప్పుడూ అతి సామాన్యమైన, ’బుజ్జి బుజ్జి’ పదాలు మాత్రమే వాడాలి అని నియమం పెట్టుకుని రాస్తే ఇక ఓ అర్థశతాబ్దంలో తెలుగే లేకుండా పోతుంది.
దీనికి తోడు తెలుగు రచనలలో కూడా ఇంగ్లీష్ పదాలు విరివిగా వాడడం ఓ రివాజు అయిపోయింది. ’థ్రిల్లింగ్ గా వుంది’, ’ఇరిటేటింగ్ గా అన్నాడు” (ఇరిటేటెడ్ గా అనాల్సింది పోయి!), మొదలైనవి మన మేటి నవలా రచయితలు కూడా అలవాటుగా రాస్తుంటారు. అసలు అలా రాయడం ఒక విధంగా సమకాలీనతకి, ఆధునికకి చిహ్నం అన్నట్టుగా అయిపోయింది. ఇక కొందరు ఎన్.ఆర్.ఐ. రచయిత(త్రు)లు రాస్తుంటే అది తెలుగు కథా, లేక తెలుగు లిపిలో రాసిన ఇంగ్లీష్ కథా అని అనుమానం వస్తుంది. (అంత ’ఇది’గా ఉంటే ఏకంగా కథేదో ఇంగ్లీష్ లోనే రాయొచ్చు కదా? అనిపిస్తుంది. కాని తీరా ఇంగ్లీష్ లో రచనకి పూనుకుంటే అసలు భండారం బయటపడుతుంది.)
మరి ఇంగ్లీష్ లో వారికి ఎలా చెల్లిపోతుంది? మామూలు నవళ్లలో కూడా అంత గంభీరమైన భాషలో, చక్కని సందర్భోచితమైన శబ్దపుష్టితో, లోతైన విషయాలని రచయితలు రాసుకుపోతుంటారు. మిలియన్ల కొద్దీ పాఠకులు ఆ పుస్తకాలు కొని చదువుకుపోతుంటారు. ఇక ఇంగ్లీష్ లో వైజ్ఞానిక సాహిత్యం కూడా కాదు, కాల్పనిక విజ్ఞానంలో కూడా ప్రమాణాలు ఎంత ఎత్తున ఉన్నాయో ప్రదర్శించడానికి, ఓ సమకాలీన కాల్పనిక విజ్ఞాన నవల నుండి ఓ పేరాని కింద ఇస్తున్నాను.
Alistair Reynolds అనే బ్రిటిష్ కాల్పనిక విజ్ఞాన రచయిత రాసిన “Galactic North” అనే కథాసంకలనం నుండి, “Great Wall of Mars” అనే కథ నుండి ఓ పేరా (కొంచెం కఠినమైన పదాలని UPPERCASE లో ఇస్తున్నాను):
“The Wall was the most AUDACIOUS and visible of Voi’s projects. The logic had been INESCAPABLE: a means to avoid the millennia-long timescales needed to TERRAFORM Mars via such conventional schemes as COMETARY BOMBARDMENT or ICE-CAP THAWING. Instead of modifying the whole atmosphere at once, the Wall allowed the initial effort to be concentrated in a relatively small region, at first only a thousand kilometers across. There were no CRATERS deep enough, so the Wall had been completely artificial: a vast ring-shaped atmospheric dam designed to move slowly outward, ENCOMPASSING ever more surface area at the rate of twenty kilometers per year. The Wall needed to be very tall because the low Martian gravity meant that the column of atmosphere was higher for a fixed surface pressure than on Earth. The RAMPARTS were hundreds of meters thick, dark as GLACIAL ice, sinking great TAPROOTS deep into the LITHOSPHERE to harvest the ores needed for the Wall’s continual growth. Yet two hundred kilometers higher, the Wall was a DIAPHANOUSLY thin membrane only microns wide, completely invisible except when rare optical effects made it hang like a frozen AURORA agains the stars. Eco-engineers had seeded the liveable area CIRCUMSCRIBED by the Wall with TERRAN GENESTOCKS DEFTLY altered in ORBITAL labs. FLORA and FAUNA had moved out in VIVACIOUS waves, LAPPING eagerly against the constraints of the Wall.”
పై పేరా అర్థం కావాలంటే ఇంగ్లీష్ లో మంచి శబ్దజ్ఞానం ఉండాలి. Diaphanous, deftly లాంటి పదాలు తెలియాలంటే ఇంగ్లీష్ లో మంచి ప్రవేశం ఉండాలి. కాని అది ఉన్నా సరిపోదు. పై పేరా అర్థం కావాలంటే సైన్స్ లో కూడా మంచి పట్టు ఉండాలి. ఒక్కొక్క వాక్యం వెనుక ఉన్న విజ్ఞానాన్ని వివరించాలంటే పేరాలపేరా వ్యాఖ్యానం అవసరం. లేకపోతే పదాలు తెలిసినట్టే ఉంటాయి గాని, వాక్యం చదివితే తలాతోకా అర్థం కాదు. ఓ గోడ (Wall) ఏంటో, ఆ గోడు ఏంటో, తల గోడకేసి బాదుకున్నా అర్థం కాదు!
పోనీ ఇదేదో పీజీ కోర్సు కి చెందిన సైన్స్ టెక్స్ట్ పుస్తకం నుండి తీసుకున్న పేరా కూడా కాదు. ఓ రైల్వే స్టేషనులోనో, ఓ విమానాశ్రయంలోనో పుస్తకాల కొట్టులో ప్రయాణంలో కాలక్షేపం కోసం కొనుక్కుని సరదాగా చదువుకునే నవల నుండి తీసుకున్న అంశం.
నాకు ఇలాంటి రచన చూసినప్పుడు కుళ్లుగా ఉంటుంది. తెలుగులో మన పరిస్థితితో పోల్చుకుని బాధపడతాను. “ఆహ్! అందరికీ తినడానికి తిండి, తాగడానికి నీరు లేని మన దేశంలో ఇలాంటి విడ్డూరపు కాల్పనిక విజ్ఞానం లేకపోతే కొంపలేం అంటుకుపోవు” అంటారేమో. కాల్పనిక విజ్ఞానం ఉందా లేదా అన్నది ప్రశ్న కాదు. అలాంటి రచయితలు, రచనలు, పాఠకులు ఉన్న సమాజంలో విద్యాప్రమాణాలు ఎంత ఉన్నతంగా ఉండి ఉండాలో ఒక్క సారి ఆలోచించాలి.
మరి అది తెలుగులో ఎందుకు జరగదు? మన కథలలో, నవలలలో, సమకాలిన సాహిత్యంలో, సినిమాలలో ప్రతిభ, విజ్ఞత, పరిజ్ఞానం, లోతైన పాండిత్యం మొదలైన మాటలకి అర్థం లేకుండా ఎందుకు పోతోంది? (ఏవో కొద్ది పాటి మినహాయింపులు తప్ప) మూస పొసినట్టు ఒకే రకమైన భావాలని, భావోద్వేగాలని మళ్లీ మళ్లీచూపిస్తూ, వాటి గురించే రాసుకుంటూ, చదువుకుంటూ, వాటినే భజిస్తూ, వాటి కోసమే తపిస్తూ, దశాబ్దాలుగా కాలక్షేపం చేస్తున్నట్టు అనిపిస్తుంది.
మన దేశం గురించి, మన సమాజ పరిస్థితుల గురించి ఏం “అన్నా” దాన్ని “తిట్టడం” గా తీసుకుని, కొంత మంది (కొంత మందేం, చాలా చాలా మంది) విరుచుకు పడిపోతుంటారు. మన వాళ్ల ఈ అర్థం లేని సాంస్కృతిక అహంకారం (cultural chauvinism) గురించి “A better India, a better world” అన్న పుస్తకంలో ఇటీవలి కాలంలో ఇన్ ఫోసిస్ నారాయణ మూర్తి చాలా పదునుగా విమర్శించారు.
వర్తమాన పరిస్థితులు ఎలా ఉన్నా, ప్రస్తుతం మన దేశంలో వస్తున్న మార్పుల జోరు చూస్తే 2040 కల్లా మన దేశం గుర్తుపట్టలేనంతగా మారిపోతుందని అనిపిస్తుంది. అక్షరాస్తత 99% కి పెరిగి, విజ్ఞానం సమాజం లోకి లోతుగా చొచ్చుకుపోతుందని అనిపిస్తుంది.
అప్పుడిక సైన్స్ రచయితలు ఎంత “లంబంగా” రాసినా ఆ “అభిఘాతానికి” పాఠకులు తట్టుకుని, ఆ భాషని, భావాన్ని అర్థం చేసుకుని ఆనందించే రోజు వస్తుందని ఆశిస్తున్నాను.
చక్రవర్తి.
నేటి ప్రపంచాన్ని, సమాజాన్ని, సమస్త జీవన వైనాన్ని, సారాన్ని ఒక్క మాటలో వర్ణించాలంటే 'సంక్లిష్టత' అన్న మాటే ప్రధానంగా మనసుకి స్ఫురిస్తోంది. నేటి వ్యవస్థలో ఏ పని చెయ్యాలన్నా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అత్యంత నిర్దిష్టమైన, సునిశ్చయమైన సమాచారం అవసరమవుతోంది. ఆ సమాచారం నిపుణుల సొత్తు. ఒక పరుగు పందేనికి వెళ్లాలంటే ఎంతో సువిస్తారమైన పరిజ్ఞానాన్ని అందించే నిపుణుల ప్రమేయం తప్పనిసరి అవుతోంది. అలాగే డబ్బు ఆదా చెయ్యడం అంటే ఊరికే బ్యాంకులో దాచుకోవడం కాదు. డబ్బుకి ఇప్పుడు శతకోటి రూపాలు ఉన్నాయి. వాటిని శాసించడానికి శతకోటి ఉపాయాలు ఉంటాయి. అవి నిపుణుడికే తెలుస్తాయి. జీవిత భాగస్వామిని ఎలా ఎంచుకోవాలో నేర్పిస్తాడో నిపుణుడు. ఏ స్కూలు కెళ్లాలో, ఏ ఉద్యోగం చెయ్యాలో, ఏ ఉద్యోగానికి మారాలో, ఎప్పుడు, ఎలా రిటయిరవ్వాలో, చావాలో(?) దీనికీ ఉన్నారు నిపుణులు. నలుగురిలో ఎలా మాట్లాడాలో, మసలుకోవాలో, ఎలా నవ్వాలో, తినాలో... నిపుణుల నైపుణ్యం లేకుండా శ్వాస కూడా తీసుకోలేని రోజులివి.
'మామూలుగా', పరిపాటిగా పనులు చేసే యుగం కాదిది. ప్రతీ పనిని, వ్యవహారాన్ని శాసించే పరిజ్ఞానాన్ని సమగ్రంగా సంపాదించి, లేదా అది ఉన్నవారిని సంప్రదించి తీరుగా చేసిన పనే నిలుస్తోంది. సార్థకమవుతోంది. సామర్థ్యానికి మూలం పరిజ్ఞానం. మన ఆశయాలకి, వాటి సిద్ధికి మధ్య నిలిచిన బలమైన, బారైన సోపానమే పరిజ్ఞానం. "కర్మలలో కౌశలం"లోని మూల రహస్యం అదే. పరిజ్ఞానం, నైపుణ్యం, సమాచారం నేటి జీవితాల్ని అదిలిస్తున్న అధిదేవతలు.
అయితే నిపుణులతో వ్యవహారం అంటే కాస్త వ్యయంతో కూడుకున్న పని. అందుచేత వాళ్లు అందరికీ అందుబాటులో ఉండరు. ఇక మనకు మిగిలినవి సమాచార మాధ్యమాలు. టీవీ, ఇంటర్నెట్, పత్రికలు, పుస్తకాలు. వీటిలో మళ్లీ అన్నీ పెద్ద నగరాల్లో తప్ప, చిన్న ఊళ్లలో, పల్లెల్లో ఉండవు. చిన్న ఊళ్లలో పరిజ్ఞానం అంటే అది టీవీ ద్వారానో, పత్రికల, పుస్తకాల ద్వారానో, వీటన్నిటి కన్నా మించి నోటి మాట ద్వారానో, సాంప్రదాయ బద్ధంగానో రావాల్సిందే. ఇందులో మళ్లీ టీవీలో, పత్రికల్లో వచ్చే సమాచారం అల్పాయుష్షు కలదై ఉంటుంది. సందర్భోచితంగా పనికొస్తుందేమో గాని ఎక్కువ కాలం నిలవదు. నాలుగు కాలాల పాటు నిలిచే సమాచార ప్రచారానికి వీలైన మాధ్యమం పుస్తకం.
పుస్తకం అనగానే దృష్టి సాహిత్యం వైపు మరల్చక తప్పదు. సాహిత్యం అంటే మన సాహిత్యం, అంటే తెలుగు సాహిత్యం అన్నమాట. తెలుగు సాహిత్యం ఎంతో గొప్పది. కాదనం. కాని దాని వృద్ధిలో ఒక విధమైన ఏకపక్ష వైఖరి కనిపిస్తోంది. సాహిత్యాన్ని కల్పితం (fiction), అకల్పితం (non-fiction) అని విభాగిస్తే, తెలుగులో అకల్పిత సాహిత్యం చాలా చాలా తక్కువ అని చెప్పుకోవాల్సివస్తుంది. ఇక్కడ మళ్లీ నా ఉద్దేశ్యంలో పాఠ్య పుస్తకాలు అకల్పిత సాహిత్యం కిందకి రావు. మన దేశంలో చదువులు పరీక్షల కోసం, ఉద్యోగాల కోసం మొక్కుబడిగా చేసే కర్మకాండలు అని అందరికీ తెలిసిందే. కనుక పాఠ్యపుస్తకాల మాట పక్కన పెడితే శాస్త్రీయ పుస్తకాలు అరుదే. శాస్త్రం అంటే కేవలం సైన్సు మాత్రమే కాదు. వాణిజ్య శాస్త్రం, మానవ వనరుల శాస్త్రం ఇలా జీవితంలో ఏ అంశం మీద అయినా, దానికి ఆధారభూతంగా ఉండే కొన్ని సత్యాలని, వాస్తవాలని పొందుపరిచి, వాటి మీద తగిన పరిభాషతో చేసే వ్యాఖ్యానమే శాస్త్రం అవుతుంది. కనుక లెక్కల్లో ఒక పుస్తకం, రసాయన శాస్త్రం మీద ఒకటిన్నర, ఖగోళ శాస్త్రం మీద అర, జన్యు శాస్త్రం మీద ముప్పావు - ఇలా ఏదో మొక్కుబడిగా, లాంచన ప్రాయంగా చూపించే నిదర్శనాలు, ప్రభుత్వ రంగాల్లో క్రింద ఉద్యోగులు, పై అధికారులకి ఒప్పజెప్పే లెక్కల్లా బాగానే ఉంటాయేమోగాని, విశాలమైన సామాజిక అవసరాల దృష్ట్యా ఏ మూలకీ రావు. క్రిప్టాలజీ దగ్గర్నుండి ట్రైబాలజీ దాక, క్వాంటం కంప్యూటింగ్ దగ్గర్నుండి కెయాస్ సిద్ధాంతం దాక, బయోటెక్నాలజీ దగ్గర్నుండి, నానో టెక్నాలజీ దాక - ఒక్కటేమిటి ఏదీ వదలకుండా ఆధునిక విజ్ఞానార్ణవాన్ని బొట్టు బొట్టుగా మన మనసులనే దొన్నెలతో ఆత్రంగా తోడి, తెలుగు పుస్తక తటాకాలని అంచుల దాక పూరించాలి. తెలుగులో శాస్త్రీయ రచనని ఓ ఉద్యమంలా తీసుకుని ఇటు తెలుగు భాషా జ్ఞానం, అటు శాస్త్ర పరిచయం ఉన్న ఔత్సాహికులంతా నడుం కట్టి కనీసం ఓ రెండు దశాబ్దాలు గట్టి కృషి చేస్తే గాని తెలుగులో అకల్పిత సాహిత్యంలో ఉన్న ఈ అగాధమైన వెలితిని పూడ్చలేమని నాకనిపిస్తుంది.
తెలుగులో అకాల్పనిక సాహిత్యాన్ని బలపరిచి తెలుగు సాహిత్యాన్ని పునర్నవీకరించాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది.
రచయిత: వి. శ్రీనివాస చక్రవర్తి.






















