శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.
Showing posts with label జీవ శాస్త్రం. Show all posts
Showing posts with label జీవ శాస్త్రం. Show all posts

అహం చర్మాస్మి!

Posted by V Srinivasa Chakravarthy Monday, February 10, 2014 0 comments




ఆ మధ్య మీ నెల్లూరు మావయ్య మీతో ఫోన్లో “ఏందిరా? ఫోన్ చెయ్యడం మానేసినావు. కొవ్వు బాగా పట్టిండాదా యేం?” అనడం విన్నా లేండి.  అయినా మీరు అలాంటివన్నీ పట్టించుకోరని నాకు తెలుసులేండి. అసలు మనుషులు ఒకరొకరు ‘కొవ్వు పట్టిందీ’ ‘కొవ్వు పట్టిందీ’ అని తిట్టుకుంటారు గాని ఈ కొవ్వు అనేది ఎక్కడ పడుతుందీ అన్న విషయం మాత్రం ఎవరికీ తెలిసినట్టు లేదు. (ఏదో అనేశాడు గాని, మీ నెల్లూరు మావయ్యకి కూడా తెలుసో లేదో నాకు డౌటే!) ఇందాక డెర్మిస్, ఎపిడెర్మిస్ అని చెప్పుకున్నాం చూడండి. ఆ డెర్మిస్ అడుగున subcutaneous  పొర ఒకటి వుంటుంది. కొవ్వు అక్కడ పడుతుంది అన్నమాట!

ఇక కొవ్వు ఎందుకు పడుతుందీ అన్న విషయానికి వద్దాం. మనిషిలో ఈ కొవ్వు అనే పదార్థం ఒక రకమైన షాక్ అబ్సార్బర్ లాంటిది. ఈ మెత్తని కొవ్వు పొర వల్ల అంతరంగ అవయవాలకి కొంత రక్షణ దొరుకుతుంది. అలాగే ఒంట్లో వేడిమి లోపలే భద్రంగా ఉంచడానికి కూడా కొవ్వు ఉపయోగపడుతుంది. ఇక కొవ్వు వల్ల మరో లాభం ఏంటంటే దాని వల్ల ఒంటికి కాసిని వొంపుసొంపులు అమరుతాయి  – సామాన్యంగా స్త్రీలకి, పనీపాటా లేకపోతే ఆ సౌభాగ్యం పురుషులకీ  సొంతం!

ఇక్కడ చిన్న ధర్మసందేహం ఏంటంటే కొందరు నిపుణులు ఈ కొవ్వు పొర అసలు నాకు చెందనిది అంటూంటారు. (వాళ్లకి తప్పకుండా కొవ్వు పట్టింది!) ఎందుకంటే subcutaneous  అంటే చర్మానికి అడుగున అని అర్థం. అంటే చర్మం కాదన్నమాటేగా! అయినా అసలు కొవ్వు నాదా కాదా అన్నది పెద్ద విషయం కాదనుకోండి. మీ దగ్గరుంటే నా దగ్గర ఉన్నటేగా మరి.


ఇక నా పొరలలో కెల్లా బలమైనది డెర్మిస్. సంచీలో కూరగాయలు పదిలంగా వున్నట్టు ఈ డెర్మిస్ అనే సంచీలో దేహాంగాలు బయటికి పొర్లిపోకుండా భద్రంగా ఉంటాయి. ఈ డెర్మిస్ లోనే ఎన్నో నాడులు, రక్తనాళాలు, గ్రంథులు అన్నీ విస్తరించి వుంటాయి. మీకు ఒక అవగాహన రావాలంటే – సగటున ఒక చదరపు సెంటీంటర్ డెర్మిస్ లో  సుమారు నూరు చెమట గ్రంథులు, నాలుగు మీటర్ల నాడీ తీగలు, వందల కొద్దీ నాడుల కొసలు (nerve endings),  10  రోమ కూపాలు (hair follicles), 15  తైల గ్రంథులు (sebaceous glands), ఇక చివరిగా ఒక మీటరు పొడవున్న రక్త నాళాలు ఉంటాయి.

నాలో విస్తరించిన ఈ రక్తనాళాల జాలానికి మరో ముఖ్యమైన ప్రయోజనం కూడా వుంది. మీరు ఓ రోజు మొదటి రోజు మ్యాట్నీ కని వెళ్లి, చేతులు కాల్చుకుని, ఎండనపడి ఇంటికి తిరిగొచ్చారు అనుకోండి. ఎంత లేదన్నా బుగ్గలు కాస్త ఎరుపెక్కుతాయిగా మరి. అది సిగ్గుతోనో, బాధతోనో, సిగ్గుతో కూడిన బాధతోనో వచ్చిన ఎరుపు అనుకోకండి. అది ఎండకి వొళ్ళు వేడెక్కిపోతుంటే ఆ వేడిమిని వొదిలించుకోడానికి చర్మంలోని రక్తనాళాలు పన్నిన కుట్ర. అలాగే మీరు డిసెంబర్ నెలలో చలి అని కూడా చూడకుండా  తెల్లరే పెద్ద కింగ్ లా వాకింగ్ అని బయల్దేరి పది కిలోమీటర్లు ఎలాగోలా నడిచేసి ఇంటొకిచ్చేసరికి అద్దంలో ముఖం చూసుకుంటే సున్నపు గోడ నేపథ్యంలో పాలిన ముఖాన్ని కనిపెట్టడానికి కాస్త ఇబ్బంది అయ్యింది అనుకోండి. దాని కారణం అద్దంలో చూసుకోవడం వల్ల జడుపు కాదండి.  చల్లగాలికి ఒంట్లోని వేడంతా బయటికి పోకుండా చర్మంలోని రక్తనాళాలు మూసుకుపోవడం వల్ల ముఖం అలా వెల్ల వేసినట్టు అయిపోయింది.

ఒంటి మీద చెమట ఆవిరైతే ఒళ్ళు చల్లబడుతుంది అన్న విషయం చిత్తు కాగితాన్ని విసనకర్రలా వాడడం నేర్చిన ప్రతీ ప్రాణికి తెలుసుకదండి. కాని నాలో పని చేసే ఎయిర్ కండిషనింగ్ లో ఇంకా చాలా వ్యవహారం వుందండి. మీ ఒంట్లో ఉష్ణోగ్రత 98.6 F  కన్నా ఓ మూడు, నాలుగు డిగ్రీలు ఎక్కువ అయితే మీకు చాలా అవస్థ. అలాంటిది జరగకూడదనే రెండు చదరపు మీటర్ల వైశాల్యం గల మీద ఉపరితలం అంతటా ఓ ఇరవై లక్షల చెమట గ్రంథులు సిద్ధంగా ఉంచాను. ఈ చెమట గ్రంథి బాగా మెలికలు తిరిగిన సన్నని నాళం. చర్మం లోపలి పొరల నుండి ఉపరితలం దాకా విస్తరించే ఈ నాళాలు ఒక్కొక్కటి 1.25  మీటర్ల పొడవు ఉంటాయి. 

చెమట గ్రంథుల వల్ల నీరే కాక కొంత ఉప్పు, రక్తంలో వుండే మరి కొన్ని వ్యర్థాలు ఒంట్లోంచి బయటికి పోతాయి. బయట ప్రశాంతంగా ఉండి పెద్దగా చెమటలు పట్టని రోజు కూడా రోజుని అరకిలో నీరు చెమట గ్రంథుల ద్వారా బయటికి పోతుంది. ఇక మిట్టమధ్యాహ్న వేళ పిచ్ అరిగిపోయేలా మీరు పిచ్చిగా రన్నులు తీసే వేళ సుమారు ఆరు కిలోల నీరు ఆవిరైపోతుంది.

ఎండ కాసినప్పుడు, చలి కాసుకున్నప్పుడు మాత్రమే కాదండి, సిగ్గేసినప్పుడు, భయమేసినప్పుడు, ఇంకా చాలా వేసినప్పుడు కూడా చెమట గ్రంథులకి పని పడుతుంది అన్నమాట.

(ఇంకా వుంది)











నాలో స్మృతి పని చేసే తీరు చాలా ఆసక్తి కరంగా ఉంటుంది. కంప్యూటర్ మెమరీకి ఈ స్మృతికి ఎంతో తేడా వుంది. కంప్యూటర్ మెమరీలోని అంశాలన్నీ ఓ వరుస క్రమంలో భద్రపరచబడి వుంటాయి, లైబ్రరీలో పుస్తకాలలా. ప్రతీ అంశానికి ఓ అడ్రస్ ఉంటుంది. లైబ్రరీ పుస్తకానికి కాల్ నంబర్ తెలిస్తే దాన్ని బట్టి పుస్తకాన్ని కనుక్కోగలిగినట్టు, కంప్యూటర్లో ఒక అంశం యొక్క  అడ్రస్ తెలిస్తే ఆ అడ్రస్ వద్ద ఉన్న అంశాన్ని బయటికి తీయొచ్చు. కాని నాలోని స్మృతి కి ప్రత్యేకించి అడ్రస్ అనేది వుండదు. కావాలంటే మీరు ఎప్పుడో విన్న “కొండగాలి తిరిగిందీ….” పాట నాలో ఏ అడ్రస్ వద్ద ఉందో చెప్పుకోండి చూద్దాం! 

నా స్మృతిలోని అంశాలకి ఫలానా అడ్రస్ అని వుండదు. పరస్పర సంబంధం వున్న అంశాలన్నిటినీ ఓ జాలం లాగా ఏర్పాటు చేసుకుంటాను. ఉదాహరణకి మీరు సెలవల్లో కోన సీమని చూడడానికి వెళ్తారు. అక్కడ మావిడి తోటలు చూస్తారు. పడవలో ప్రయాణం చేస్తారు. బుద్ధి పుట్టినప్పుడల్లా కొబ్బరి నీళ్లు తాగుతారు. సెల్ ఫోన్ ని పక్కన బెట్టి సెలయేటి గలగలలు వింటారు. ఈ దృశ్యాలు, శబ్దాలు, వాసనలు అన్నీ ‘కోనసీమ’ అన్న పేరుతో మూటగట్టి నాలో దాచుకుంటాను.  ఈ సారి ఎప్పుడైనా మీరు రోడ్డు పక్కన కొబ్బరి నీళ్ళు తాగుతున్నప్పుడు మీ కోనసీమ యాత్ర గుర్తొస్తుంది. లేదా మావిడి కాయలు తింటున్నప్పుడో, నీళ్ల గలగలలు వింటున్నప్పుడో, పడవ ఎక్కినప్పుడో – ఇలా ఎన్నో అనుభూతులు మీ కోన సీమ యాత్రని గుర్తుకు తెస్తాయి. ఈ చిన్న చిన్న అనుభూతుల స్మృతులన్నీ ఓ జాలంలో కలిసి వుంటాయి. ఈ చిన్న స్మృతులన్నీ ‘కోన సీమ యాత్ర’ అనే పెద్ద స్మృతిలో భాగాలు అవుతాయి. ఇలా స్మృతులని (మొదటి అడ్రస్, మొదటి అంశం), (రెండవ అడ్రస్, రెండవ అంశం)… ఇలా ఓ పెద్ద పట్టికలాగా  కాకుండా జాలాల రూపంలో భద్రపరచడం వల్ల నాలో ని స్మృతులు సులభంగా చెరిగిపోవు. కోన సీమలో కొబ్బరి నీళ్లు తాగినట్టు గుర్తులేకపోయినా, మావిడి తోటల్లో నడవడం గుర్తు  ఉండొచ్చు కదండీ!

సొంత డబ్బా అనుకోకపోతే నాలో మరో సుగుణం కూడా వుందనుకోండి. నాలో ఒక చోట ఏదో కారణం చేత కణాలు చచ్చిపోయాయనుకోండి. నెమ్మదిగా ఆ ప్రాంతానికి ఇరుగు పొరుగున ఉన్న న్యూరాన్లు చచ్చిపోయిన న్యూరాన్ల బాధ్యతలని నెత్తిన వేసుకుంటాయి. ఉదాహరణకి నాలో బ్రోకా ప్రాంతం (Broca’s area) అనే ఓ ప్రాంతం మీ భాషని శాసిస్తుంది. ఉదాహరణకి దాని దగ్గర్లో కణాలు చచ్చిపోతే మాట పడిపోయే ప్రమాదం వుంది. కాని నెమ్మదిగా దాని చుట్టు పక్కల ఉండే న్యూరాన్లు ఆ ప్రాంతం యొక్క క్రియలని చేపట్టడం వల్ల పోయిన మాట తిరిగి వచ్చే అవకాశం వుంది.

 స్ట్రోక్ (stroke) వచ్చినప్పుడు సరిగ్గా అదే జరుగుతుంది. మెదడు లోని రక్తనాళాలలో ఎక్కడైనా రక్తం గడ్డ కట్టి, దాని వల్ల ఓ నాళం పూడుకు పోయింది అనుకోండి. లేదా రక్తనాళంలో పోటు పెరిగి అది పెటేలు మని పేలిపోయిందనుకోండి. అప్పుడు ఆ నాళం మీద ఆధారపడి బతుకు నెట్టుకొస్తున్న న్యూరాన్లు ఆకలితో చచ్చిపోతాయన్నమాట. అలాంటి అత్యవసర పరిస్థితిలో దాని పొరుగు న్యూరాన్లు కొంతవరకు చచ్చిపోయిన న్యూరాన్ల పనిని తీసుకుంటాయి. అలాంటి పరిస్థితిలో రోగికి పోగొట్టుకుపోయిన క్రియలు తిరిగి వచ్చేలా తగిన శిక్షణ నివ్వడానికి వీలవుతుంది. కాని మెదడులో మరీ పెద్ద భాగం దెబ్బతింటే ఇక ఇరుగు పొరుగు న్యూరాన్లు పెద్దగా చేసేదేం వుండదు. అలాంటప్పుడు రోగికి ఇచ్చే శిక్షణ పెద్దగా ఫలించకపోవచ్చు.

స్ట్రోక్ లాగే మరో ముఖ్యమైన మెదడు సమస్య ట్యూమర్. కాని ఎన్నో సందర్బాలలో శస్త్రచికిత్స చేసి ట్యూమర్ ని తొలగించవచ్చు. పరిస్థితులు అనుకూలిస్తే ఆపరేషన్ తరువాత రోగి పూర్తిగా కోలుగుకునే అవకాశం ఉంది.

తలకి దెబ్బ తగిలినప్పుడు కొన్ని సార్లు మెదడుకి అయ్యే గాయం విషమించవచ్చు. మెదడు చిక్కని ద్రవంలో తేలుతూ ఉంటుందని, తలకి గాయం తగిలినా లోపల మెదడు భద్రంగా ఉంటుందన్నది కొంత వరకు నిజమే. కాని తలకి దెబ్బ మరీ గట్టిగా తగిలితే లోపల మెదడు కూడా గాయపడవచ్చు. ఏ సెల్ఫోన్ లోనో మాట్లాడుతూ పరధ్యానంగా వేలిని తలుపు సందులో వేసి  చితగ్గొట్టుకున్నారనుకోండి. మరి వేలు వాయదండీ! అలాగే గాయపడ్డ మెదడు కూడా వాస్తుంది. దాంతో మెదడు చుట్టూ ఉండే ద్రవంలో ఒత్తిడి పెరుగుతుంది. దాని వల్ల స్పృహ కోల్పోవడం, ఇక మరీ కీలక పరిస్థితుల్లో ప్రాణం పోవడం కూడా జరుగుతుంటుంది.

ఈ  మెదడుతో ఇన్ని తలనొప్పులా అని బెంబేలు పడకండేం? దురదృష్టం కొద్దీ జబ్బు పడితే సమస్య గాని, ఆరోగ్యంగా ఉన్నప్పుడు అసలు నా సత్తా చూళ్ళేదు మీరు. నన్నెలా వాడుకోవాలో అసలు తెలీదు మీకు. క్రమబద్ధమైన శిక్షణ చేత నా శక్తి సామర్థ్యాలని విపరీతంగా పెంచుకోవచ్చు. నా సామర్థ్యం అపరిమితం. దాన్ని పెంచుకునే ఒడుపు తెలిస్తే ఆ సామర్థ్యం మీ సొంతం.










చలివిడి ముద్దలా, కొంచెం అదే రంగులో, కనిపిస్తానే గాని నిజానికి నేనో జాలాన్ని. మీరు ఊహించగలిగే దాని కన్నా పెద్ద జాలాన్ని. కావాలంటే ప్రపంచంలో కెల్లా  ఓ అతిపెద్ద జాలాన్ని ఊహించుకోండి. భూమి మీద మొత్తం జనాభా సుమారు 7  బిలియన్లు. నూటికి  సుమారు 87  మందికి సెల్ ఫోన్లు ఉన్నాయి. పోనీ సెల్ ఫోన్ల వినియోగం నూరు శాత అనుకుందాం. ప్రతీ సెల్ ఫోన్ లోను 200  కాంటాక్ట్ లు ఉంటాయని అనుకుందాం. అంటే 7  బిలియన్ల సెల్ ఫోన్లు గల ఈ జాలంలో, ఒక్కొక్క సెల్ ఫోను రెండొందల ఇతర ఫోన్లతో సూటిగా సంబంధం గలిగి వుంది.  ఇది చాలా పెద్ద, సంక్లిష్టమైన జాలం అని సులభంగా ఒప్పుకోగలం. మెదడులోని జాలం దీని కన్నా నూరు రెట్లు పైగా పెద్దది. ఎందుకంటే మెదడులో మొత్తం న్యూరాన్ల సంఖ్య  100  బిలియన్లు. ఒక్కొక్క న్యూరానుకి 1,000 నుండి 10,000   వరకు ఇతర న్యూరాన్లతో సంధులు (connections) ఉంటాయి.   అంటే మొత్తం 10^14 – 10^15  సంధులు అన్నమాట. ఇక కొన్ని న్యూరాన్లలో అయితే తలా లక్షా, రెండు లక్షల సంధులు ఉంటాయి. మెదడులో సెరిబెల్లం అనే ప్రాంతంలో ఉన్నాయి లేండి చింపిరి జుట్టు బూచాళ్లు… పుర్కిన్యే కణాలు (Purkinje cells) అంటారు వాళ్లని… వీళ్లకి తలా లక్షన్నర సంధులు దాకా ఉంటాయి (చిత్రం).



ఇక మా తీగలలో ప్రసారం అయ్యే విద్యుత్ సంకేతాలు మహా జోరుగా పరిగెడతాయి. లేకపోతే మీ కాలికి ముల్లు గుచ్చుకున్నప్పుడు, మీరు తేరుకుని కాలు వెనక్కి తీసుకునే సరికి తెల్లారిపోతే మరి ఇబ్బంది కదండి! నాడీ తీగల్లో సంకేతం ప్రసారం అయ్యే వేగాల్లో కూడా ఎంతో తేడా ఉంటుందనుకోండి. కొన్ని తీగల్లో అయితే 120 మీటరు/సెకను వేగం వరకు కూడా ఉంటుంది.  ఈ తీగలు కాస్త దళసరిగా అంటే ఓ 20  మైక్రాన్లు (1  మైక్రాను అంటే ఓ మిల్లీమీటరులో వెయ్యోవంతు!) మందం కలిగి ఉంటాయి. ఇక మరి కొన్ని తీగలైతే బాగా బక్కపలచగా ఉంటాయి. వీట్లో వేగం మరి కాస్త నెమ్మది – 4 మీటర్/సెకను దరిదాపుల్లో ఉంటుంది.

ఇన్ని చేస్తాం గానీండి ఒక్కటి మాత్రం మాకు చాతకాదండి. అదే… పునరుత్పత్తి అంటారు చూశారూ… మా మిగతా కణం తమ్ముళ్ళందరికీ ఇది బాగా చాతనవును. చర్మం కణం గాళ్ళు, రక్త కణాలు … ఈ కణాలు ఎప్పుడైనా చచ్చిపోయినా పెద్దగా బెంగ లేదండి. వాళ్ళ సంతానం ఉంటారు గనుక లెక్క సరిపోతుంది. కాని న్యూరాన్లు ప్రాణాలొదిల్తే  వాటి వంశ గౌరవం నిలపడానికి ఒక్కడు ఉండడండి. మీ మెదడులో న్యూరాన్లు ఒకసారి పోతే ఇక అదే పోవడం అండి. ఇప్పుడు మీ వయసు 35  అనుకోండి. మీ మెదడులో రోజుకి 1000  న్యూరాన్లు చొప్పున టపా కట్టేస్తుంటాయి. అందుకే వయసు పైబడుతున్న కొద్ది మెదడు కుంచించుకుంటుంది. బరువు కూడా తగ్గుతుంది. అప్పుడిక మీ మతి మరుపు పెరిగిపోతుందన్నమాట. పేర్లు, టెలిఫోన్ నెంబర్లు, తేదీలు లాంటివి గుర్తుకు రాక తల బాదేసుకుంటూ ఉంటారు. కాని మిగతా ముఖ్యమైన పనుల్లో మాత్రం పొరబాటు రానీకుండా నేను జాగ్రత్త పడుతుంటాను.

మీ లోని మిగతా అంగాలకి నాకు ఓ ముఖ్యమైన పోలిక వుంది. మీకు రెండు ఊపిరితిత్తులు – ఎడమ, కుడి వైపుల్లో – ఉన్నాయి. అలాగే రెండు మూత్ర పిండాలు. రెండు కళ్లు, చెవులు, చేతులు, కాళ్లు… అదే అర్థమయ్యింది కదండీ… ఇలా చాలా అవయవాలు రెండేసి చెరో వైపు ఉంటాయి. మెదడు మాత్రం ఒక్కటే ఉందని మీరు అపోహపడతారు. నాకు తెలుసు. కాని మెదడులో కూడా రెండు విభాగాలు చెరోవైపు ఉంటాయి. మీ ఒంట్లో కుడి వైపున జరిగే తంతులో ఎక్కువగా నా లో ఎడమ భాగం చెప్పు చేతల్లో ఉంటుంది. అలాగే మీ ఒంట్ళో ఎడమ వైపుని నాలో కుడి భాగం అదిలిస్తుంది. నాలో రెండు భాగాలున్నా రెండూ సరి సమానం కాదన్నమాట. మనకి చేతులు రెండున్నా కుడి చేయి చేసే పని ఎడమ చేయి చెయ్యలేదు కదండి. అలాగే మెదడులో కూడా ఒక భాగానిది పై చేయి అవుతుంది. అది తరచు ఎడమ బాగానిది అవుతుంది. ఎడమ మెదడు కుడి మెదడు మీద పెత్తనం చేస్తున్నట్లయితే అలాంటి మెదడున్న వాళ్ళు కుడి చేతి వాటం గల వాళ్లయి వుంటారు. అలాగే అమితాబ్ బచ్చన్ లాంటి ఎడమ చేతి వాళ్లలో కుడి మెదడు పెత్తనం ఎక్కువ అన్నమాట.
(ఇంకా వుంది)











విద్యుత్ జీవ క్రియా శాస్త్రంలో ఒక పక్క పురోగతి అలా ఉండగా, పందొమ్మిదవ శతాబ్దపు తొలిదశలలో యోహానెస్ ముల్లర్ అనే జర్మన్ జీవక్రియాశాస్త్రవేత్త ఇంద్రియ సంవేదనలు ఎలా పని చేస్తాయి అన్న విషయాన్ని శోధిస్తున్నాడు. ఒక ఇంద్రియ నాడి (sensory nerve)  ని ఉత్తేజింప జేసినప్పుడు కలిగే అనుభూతి ఆ ఉత్తేజాన్ని కలిగించిన మూలం యొక్క తత్వం మీద ఆధరపడదదని, కేవలం ఉత్తేజింప బడ్డ నాడి మీద ఆధారపడుతుందని ఇతడు కనుక్కున్నాడు.

ఉదాహరణకి కంట్లోని రెటీనా (retina)  నే తీసుకోండి. రెటీనాలో ఫోటోరిసెప్టార్లు ఉంటాయి. వీటి మీద కాంతి పడినప్పుడు ఇవి ఉత్తేజితమవుతాయి. అవి  ఉత్తేజితమైనప్పుడు విద్యుత్ సంకేతాలు ఆప్టిక్ నాడి (optic nerve) లోంచి ప్రసారమై మెదడుని చేరి దృశ్యాన్ని చూసిన అనుభూతిని కలుగజేస్తాయి. కాని చిత్రం ఏంటంటే కాంతి లేకుండా కూడా అలాంటి అనుభూతిని కలుగజేయొచ్చు. ఉదాహరణకి కన్ను మూసుకుని కనురెప్ప మీద మెల్లగా అరచేతితో వత్తితే చీకటిగా ఉండే దృశ్యం మీద పలచనని కాంతి చారలు కనిపిస్తాయి. అంటే కన్ను మీద చేసిన ఒత్తిడి వల్ల ఆ ఒత్తిడి రెటీనాకి ప్రసారమై, ఫోటోరిసెప్టార్లని ఉత్తేజపరిచింది. అప్పుడు పుట్టిన సంకేతం మెదణ్ణి చేరి దృశ్యానుభూతిని కలిగించింది. కనుక కాంతి లేకపోయినా దృశ్యానుభూతిని కలుగజేయొచ్చన్నమాట. దానికి కారణం రెండు సందర్భాలలో ఫోటోరిసెప్టార్లు ఉత్తేజితం కావడమే.



                                                 (Johannes Muller)



ఇంద్రియ సంవేదనలకి సంబంధించిన ఈ నియమానికి ‘Law of specific energies’ (ప్రత్యేక శక్తుల నియమం)  అని పేరు పెట్టాడు ముల్లర్. ముల్లర్ కృషితో భౌతిక నియమాలని నిస్సంకోచంగా మెదడు పని తీరుకి వర్తింపజేసే సాంప్రదాయం, ముఖ్యంగా మెదడులోని విద్యుత్ చర్యల పరిశోధనలో వినియోగించే సాంప్రదాయం మొదలయ్యింది. తను రాసిన Elements of physiology  అనే పుస్తకంలో, భౌతిక నియమాలని నాడీ మండలం యొక్క క్రియలని అర్థం చేసుకోడానికి ఎలా ప్రయోగించాలో వర్ణిస్తూ, ఆ ప్రయత్నంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇలా చెప్తున్నాడు  ముల్లర్ –

“పైపైన చూసినప్పుడు ప్రాణులకి సంబంధించిన చర్యలలో సాధారణ యాంత్రిక, భౌతిక, రసాయనిక ధర్మాలకి అందని దేదో ఉన్నట్టు అనిపించినా, ఆ విధమైన శోధన చేత ప్రాణుల గురించిన ఎన్నో విషయాలని చక్కగా వివరించవచ్చు. పరిశీలన, ప్రయోగం అనే పునాదుల మీద మనం స్థిరంగా ఆధారపడినట్లయితే ఆ రకమైన శోధనలో చాలా ముందుకి పోవచ్చు.”


ముల్లర్ శిష్యవర్గంలో ఇద్దరు ప్రముఖులు ముల్లర్ వేసిన బాటలో ఎంతో పురోగమించారు. వారు – ఎమిల్ దుబ్వా రేమండ్ (Emil Dubois Reymond) మరియు హర్మన్ ఫాన్ హెల్మ్ హోల్జ్ (Hermann von Helmholtz). దుబ్వా రేమాండ్ ప్రయోగాత్మక పద్ధతిలో ముందుకి సాగాడు. ముందుగా “విద్యుత్ చేపల” మీద పరిశోధనతో మొదలెట్టాడు. విద్యుత్ ఈల్ (electric eel) (కింద చిత్రం), కాట్ ఫిష్ (catfish) మొదలైన జలచరాలు ఈ కోవకి చెందినవే. ఈ జలచరాలలో పుట్టే విద్యుత్ శక్తి కారణంగా వాటి చుట్టూ ఓ విద్యుత్ క్షేత్రం ఏర్పడి వుంటుంది. ఆ విద్యుత్ శక్తికి మూలం నాడీ మండలమే. జంతు నాడీ మండలాలకి సంబంధించిన విద్యుత్ చర్యల గురించి దుబ్వా రేమాండ్ ఎన్నో పరిశోధనలు చేశాడు. తన పరిశోధనా ఫలితాలన్నీ Researches on Animal Electricity (జంతు విద్యుత్తు మీద పరిశోధనలు)  అనే పుస్తకంలో పొందుపరిచాడు. విద్యుత్ జీవక్రియా శాస్త్రంలో అతడు చేసిన అతి ముఖ్యమైన ఆవిష్కరణ action potential. నాడీ తీగలో విద్యుత్ ప్రవాహం ఓ కచ్చితమైన, క్లుప్తమైన విద్యుత్ తరంగం రూపంలో ఉంటుంది. ఆ తరంగాన్నే ఏక్షన్ పొటెన్షియల్ అంటారు. అయితే ఆ ఏక్షన్ పొటెన్షియల్ ఎలా ప్రసారం అవుతుందో అర్థం చేసుకోడానికి కావలసిన గణితభౌతిక శాస్త్ర నైపుణ్యం అతడికి అందుబాటులో లేకపోయింది.



మెదడు యొక్క విద్యుత్ ధర్మాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవడంలో ఉపయోగపడ్డ పరిణామం మరొకటి వుంది. మెదడుతో సంబంధం లేకుండా అసలు విద్యుత్ శక్తి యొక్క అవగాహనలో ఆ కాలంలో గొప్ప పురోగతి సంభవించింది. ఇంగ్లండ్ కి చెందిన జేమ్స్ క్లార్క్ మాక్స్ వెల్ అనే సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త విద్యుత్ శక్తిని, అయస్కాంత శక్తిని ఓ సమగ్రమైన సైద్ధాంతిక నిర్మాణంలో కలగలిపి విద్యుదయస్కాంత శక్తి గురించి ప్రపంచానికి తెలిపాడు. కాంతి అనేది ఓ విద్యుదయస్కాంత తరంగం అని ప్రకటించాడు.

సైద్ధాంతిక భౌతిక శాస్త్రంలో వచ్చిన ఈ రకమైన పురోగమనాన్ని వాడుకుంటూ హర్మన్ ఫాన్ హెల్మ్ హోల్జ్ లాంటి సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్తలు ఈ కొత్త భౌతిక శాస్త్ర సంగతులని జీవశాస్త్రానికి వర్తింపజేసే ప్రయత్నాలు మొదలెట్టారు. ముఖ్యంగా నాడీ మండలం యొక్క క్రియలని అర్థం చేసుకోవడంలో ఈ రకమైన పరిశోధన ఎంతో ఉపయోగపడింది. ఇటు సైద్ధాంతిక భౌతిక శాస్త్రంలోనే కాక అటు జీవక్రియా శాస్త్రంలో కూడా గొప్ప పాండిత్యం గల హల్మ్ హోల్జ్ లాంటి మహామహుల వల్ల ఆ రోజుల్లో జీవశాస్త్ర పరిశోధన మంచి ఊపందుకుంది. ఒక వ్యక్తికి రెండు పూర్తిగా భిన్నమైన రంగాల్లో లోతైన పరిజ్ఞానం ఉండడం అనేది వర్తమాన కాలంలో కూడా కొంచెం అరుదే. ఈ రోజుల్లో సామాన్యంగా ఏం జరుగుతుందంటే జీవశాస్త్రంలో బాగా ప్రావీణ్యం ఉన్న వాడు భౌతిక శాస్త్రం నుండో, గణితం నుండో కొన్ని భావాలని అరువు తెచ్చుకుని వాటిని జీవశాస్త్రంలోకి ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తాడు. లేదా ఓ భౌతిక శాస్త్ర సమస్యగానో, లేదా గణిత సమస్య గానో ముందే కచ్చితంగా నిర్వచించబడ్డ ఓ జీవశాస్త్ర సమస్యని తీసుకుని  దాన్ని భౌతిక, గణిత విధానాలతో పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. లేదా ఓ జీవశాస్త్రవేత్త, ఓ భౌతిక శాస్త్ర వేత్త చేయిగలిపి జీవశాస్త్రంలో ఏదైనా లోతైన సమస్యతో తలపడడం మొదలెడతారు. కాని జీవ, భౌతిక శాస్త్రాలలో “ఉభయ భాషా ప్రవీణుడైన” హెల్మ్ హోల్జ్ ఇలాంటి ఇబ్బందులేవీ పడలేదు.

(ఇంకా వుంది)
 



postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts