శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.
Showing posts with label 65 ని 90 గా మార్చడం ఎలా?. Show all posts
Showing posts with label 65 ని 90 గా మార్చడం ఎలా?. Show all posts


రాష్ట్రంలో అక్షరాస్యత అంత తక్కువా?

ఈ రోజు సాక్షి పత్రికలో ప్రచురించబడ్డ మన రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో అక్షరాస్యతకి సంబంధించిన వివరాలు బాధాకరంగా ఉన్నాయి. ఇటీవలే విడుదల అయిన Statistical Abstract – 2009 అనే ప్రభుత్వ నివేదికలో వెల్లడైన సమాచారం ఇది.

అక్షరాస్యతలో టాప్-5 జిల్లాలు:
హైదరాబాద్ - 78.8%
పశ్చిమగోదావరి - 73.5%
కృష్ణా - 68.8%
చిత్తూరు - 66.8%
రంగారెడ్డి - 66.2%

60% శాతం కన్నా తక్కువ అక్షరాస్యత ఉన్న 13 జిల్లాలు:
మహబూబ్ నగర్ - 44%
విజయనగరం - 51.1%
మెదక్ - 51.6%
నిజామాబాద్ - 52.0%
అదిలాబాద్ - 52.7%
కర్నూల్ - 53.2%
కరీమ్ నగర్ -54.9%
శ్రీకాకుళం - 55.3%
అనంతపురం - 56.1%
ఖమ్మం - 56.9%
వరంగల్ - 57.1%
నల్లగొండ - 57.2%
ప్రకాశం - 57.4%

2007 గణాంకాల ప్రకారం ఇండియా సగటు అక్షరాస్యత 67.6% అయితే, ఏ.పీ. సగటు అక్షరాస్యత 72.5% అని వెల్లడి అయ్యింది. (http://en.wikipedia.org/wiki/Indian_states_ranking_by_literacy_rate)
కాని పైన ’సాక్షి’ వ్యాసం ఇచ్చే సమాచారం ప్రకారం రాష్ట్రంలో అక్షరాస్యత ఇంకా తక్కువే (65% దరిదాపుల్లో) ఉండాలని అనిపిస్తోంది. ఏదేమైనా ఎన్నో జిల్లాలలో అక్షరాస్యత 50 ల ప్రాంతాల్లో ఉందన్నది స్పష్టం. ఇది చాలా తక్కువ అని వేరే చెప్పనక్కర్లేదు.
మనం పోల్చుకోదగ్గ కొన్ని ఇతర దేశాలలో అక్షరాస్యత ఎంత ఎక్కువో అంతకు ముందు ఒక పోస్ట్ లో వివరించడం జరిగింది. (http://scienceintelugu.blogspot.com/2009/07/65-90.html)
“అక్షరాస్యతలో మన దేశం ప్రపంచ దేశాలలో 144 వ స్థానంలో ఉంది. అక్షరాస్యత 99% పైగా గల దేశాలు 40 ఉన్నాయి. 90% కన్నా అక్షరాస్యత ఎక్కువ ఉన్న దేశాలు 88 ఉన్నాయి. అభివృద్ధి చెందిన దేశాలని పక్కన పెట్టినా, మనం పోల్చుకోదగ్గ దేశాలు – చైనా, మెక్సికో, థాయ్లాండ్ మొదలైన దేశాలు కూడా 90 ని మించిపోయాయి. బ్రెజిల్ కూడా ఆ దరిదాపుల్లోనే ఉంది. మొన్నమొన్నటి దాకా అగ్రరాజ్యాల మధ్య ఘర్షణలో పడి నలిగి, బాగా చితికోపోయిన వియట్నాం అక్షరాస్యత 90.3%. అంతస్సమరంతో యాతన పడుతున్న పొరుగుదేశం – శ్రీ లంకలో కూడా అక్షరాస్యత 90.7%. పై సమాచారాన్ని బట్టి 90% దరిదాపుల్లో అక్షరాస్యత గలిగి ఉండటం అంత విశేషమేమీ కాదన్నమాట. కానీ ఆ పాటి వైభవం కూడా ప్రస్తుతం మనకి లేదు.”

ఇటీవలి కాలంలో విద్యావ్యాప్తికి కావలసిన ఐ.టి. సాంకేతిక వనరులు బాగా పెరిగాయి. నిరక్షరాస్యత మీద యుద్ధం ప్రకటించడానికి ఇదే మంచి సమయం.ఆక్షరాస్యత అసలు విలువ నలభయ్యా, యాభయ్యా, అరవై అయిదా అన్నది ముఖ్యం కాదు. అది 90% కన్నా చాలా తక్కువ అన్నది మాత్రం వాస్తవం. చదువొచ్చిన సగం మందీ, రాని సగానికి ఏదో విధంగా సహాయం చెయ్యగలిగితే ఒక దశాబ్దంలో అక్షరాస్యత 90% చేరుకుంటుంది. అలా చేరుకునేలా చెయ్యాలి.

కొన్ని చిన్న ఉపాయాలు:
1. మీ ఇంట్లో పని చేసే పిల్లలకి చదువు చెప్పడం
2. చదువుకుంటున్న పేద పిల్లలకి పుస్తకాలు కొనివ్వడం
3. పల్లెటూళ్లలో గ్రంథాయాల నిర్మాణం, లేదా అలాంటి నిర్మాణానికి తగ్గ సహాయం చెయ్యడం
4. మీకు నైపుణ్యం ఉన్న రంగంలో స్కూళ్లలో ఉపన్యాసాలు ఇవ్వడం
5. పత్రికల్లో చదువుకి సంబంధించిన వ్యాసాల రచన
6. చదువుకి సంబంధించిన పుస్తకాలు రాయడం
7. అలాంటి పుస్తకాలు ప్రచురించడం
8. ఆటపాటల సహాయంతో నేర్చుకోవడానికి కొత్త పద్ధతుల సృజన
9. చదువుని అందించే వెబ్సైట్లు, బ్లాగ్ లు నడిపించడం
10. పేద పిల్లల స్కూలు ఫీజులో ధనసహాయం
11. విద్యారంగంలో స్ఫూర్తినిచ్చే సినిమాలు నిర్మించడం
12. విద్యారంగంలో పని చేసే ఎన్.జీ.వో.ల స్థాపన
...
ఉపాయాలకి అంతు లేదు. వాటిని ఎంత వరకు ఆచరణలో పెట్టగలుగుతాం అన్న దాని మీద మన భవిష్యత్తు ఆధారపడుతుంది.


“కోటి సంకల్పాల కన్నా, శతకోటి శపథాల కన్నా ఒక్క చిన్న నిర్మాణాత్మక చర్య మేలు.” – శ్రీమాత.

65 ని 90 గా మార్చడానికి 10 లో 2a:

Posted by V Srinivasa Chakravarthy Thursday, August 6, 2009 1 comments


అంతర్జాలం తరువాత విజ్ఞాన వ్యాప్తకి అత్యంత ముఖ్యమైన సాధనాలు పుస్తకాలు. వాటి గురించి కొంచెం చర్చిద్దాం.
పుస్తకాల గురించి చర్చ అంటే మొత్తం పుస్తక ప్రపంచం గురించి చర్చ అన్నమాట. అంటే పుస్తకాలు, రచయితలు, పుస్తకాల షాపులు, ప్రచురణ కర్తలు, పంపిణీ దార్లు, గ్రంథాలయాలు. ఇక చివరిగా వీటన్నిటినీ మూల్యాంకనం చేసే పాఠక దేవుళ్లు.

ముందు గ్రంథాలయాలతో మొదలెడదాం.

ప్రాచీన అలెగ్జాండ్రియాకి చెందిన గ్రీకులకి ఒక చక్కని ఆలోచన వచ్చిందట. విజ్ఞానం, కళ, కవిత్వం... ఇలా ప్రతీ రంగం లోను ఉన్న ప్రపంచ సాహిత్యాన్ని ఓ భవనంలో పోగెయ్యాలన్న ఆలోచన. అలా ఏర్పడ్డదే పేరుమోసిన అలెగ్జాండ్రియా గ్రంథాలయం. అది కేవలం పుస్తకాలయంగా మాత్రమే కాక ఆ రోజుల్లో అత్యుత్తమ వైజ్ఞానిక సంస్థగా కూడా ప్రపంచ ప్రఖ్యాతి తెచ్చుకుందట. దాని మహర్దశలో అందులో 5 లక్షలకి పైగా పుస్తకాలు ఉండేవని అంచనా. ఆధునిక గ్రంథాలయాల ప్రమాణాలతో పోల్చినా అది చాలా పెద్ద మొత్తం. పాశ్చాత్య సంస్కృతి పుస్తకానికి ఇచ్చిన విలువకి ఈ గ్రంథాలయం ఓ ప్రాచీన ప్రతీక.

అనాదిగా ముఖత: జ్ఞానాన్ని చేరవేసే సాంప్రదాయం ఉండడం వల్ల కాబోలు మన సమాజంలో పుస్తకానికి విలువ తక్కువే. కాని గత విజ్ఞాన సారం, సమాకాలీన విజ్ఞాన సర్వస్వం - ఈ రెండూ ప్రాంతీయ భాషల్లో, సులభంగా అందుబాటులో లేని సమాజం ఒక ఎత్తుని మించి వెళ్లలేదని అనిపిస్తుంది.

(తెలుగులో శాస్త్రీయ సాహిత్యంలో వెలితి గురించి మరో చోట మొర పెట్టుకున్నాను. అ విషయానికి మళ్లీ వస్తాను.)

అలెగ్జాండ్రియా గ్రంధాలయానికి దీటైన గ్రంథాలయాలు నేడు ఉంటే బానే ఉంటుంది. కాని వాటి స్థాపనలో ఎన్నో సాధక బాధకాలు ఉంటాయి. అంత కన్నా తక్కువ స్థాయిలో మరో రకం గ్రంథాలయాలు ఉంటే బావుంటుంది. అవి నగరాలలో ప్రతీ వాడలోనూ ఉండదగ్గ స్థానిక గ్రంథాలయాలు.

స్థానిక గ్రంథాలయాలు (Community libraries):

US లో నగరాలలో ప్రతీ విభాగంలోను ఈ స్థానిక గ్రంథాలయాలు ఉంటాయి. వీటిలో కేవలం దినపత్రికలు, (’స్వాతి’ బాపతు!) వార పత్రికలు మాత్రమే కాక ఎన్నో రంగాలకి సంబంధించిన విలువైన సాహిత్యం ఉంటుంది. ప్రపంచ యుద్ధం, డైనోసార్లు, అధునాతన వాహనాలు, ధరా తాపం - ఇది అది అని కాకుండా అన్ని రకాల పుస్తకాలు అక్కడ దొరుకుతాయి. కేవలం డ్రయివర్స్ లైసెన్స్ చూబించి పుస్తకాలని ఇంటికి తీసుకెళ్లొచ్చు.

ఇవి కాక వందల, వేల సంఖ్యలో ముచ్చటేసే రంగుల బొమ్మల్తో, చిన్న పిల్లల పుస్తకాలు... ఇంతేసి బుడుతలు, అంతేసి పుస్తకాలని ముందేసుకుని సాలోచనగా పేజీలు తిరగేస్తుంటే, డౌటొచ్చినప్పుడు పక్కనే ఉన్న అమ్మనో నాన్ననో ఓ సారి గోకి సందేహం తీర్చుకుంటుంటే, ఆ లిటిల్ రాస్కల్స్ ని ఓ సారి చటుక్కున ఎత్తుకుని ముద్దాడాలని ఉంటుంది.

కేవలం పుస్తకాల సరఫరా మాత్రమే కాక అక్కడ పిల్లల కోసం రకరకాల కార్యక్రమాలు కూడా ఉంటాయి.

ఉదాహరణకి శాస్త్రీయంగా శిక్షణ పొందిన కథకులు (story-tellers or raconteurs), తమాషా వస్త్రధారణతో వచ్చి పిల్లలకి చక్కని ఉచ్ఛారణతో, భావయుక్తంగా కథలు వల్లిస్తూ ఉంటే, పిల్లలు వాళ్ల ముందు కళ్లింత చేసుకుని అలికిడి చెయ్యకుండా ఆలకిస్తుంటారు.

ఒక విధంగా ఈ స్థానిక గ్రంథాలయం బడి కాని బడి లాంటిది అని చెప్పుకోవాలి. బడికి, ఈ స్థానిక గ్రంథాలయానికి మధ్య ఓ ముఖ్యమైన తేడా ఉంది. బడిలో పిల్లల మనోవికాసం యొక్క క్రమం, వేగం అన్నీ బడే నిర్ణయిస్తుంది. గోవిందా అంటూ ఆ గుంపులో పడి పిల్లలు ముందుకు తోసుకుపోవాల్సిందే! ఇక ఆ తొక్కిసలాటలో ఇది వద్దు, ఇది కావాలి అని ఎంచుకునే స్వేచ్చ పిల్లలకి పెద్దగా ఉండదు. స్వేచ్ఛ లేనిదే మనోవికాసం సాధ్యం కాదన్న విషయం బడులకి అర్థం కాదు.

కాని ఈ స్థానిక గ్రంథాలయాల తీరు వేరు. పిల్లలకి ఏది నచ్చితే అది చదువుకుంటారు. ఎలా పడితే అలా (కావాలంటే పుస్తకాన్ని తిరగేసి పట్టుకుని!) చదువుకుంటారు! సందేహం వస్తే తోటి బాల నిపుణుణ్ణి అడుగుతారు. చదివే మూడ్ లేకపోతే చల్లగా ఆ బల్ల మీదే నిద్దరోతారు...

ఉత్సాహంగా తెలుసుకోవడానికి, సంతోషంగా ఎదగడానికి చక్కని రంగస్థలాలు ఈ స్థానిక గ్రంథాలయాలు.
ఆ బీజాలని మన వాడలలోనూ నాటితే బావుంటుంది.

(సశేషం...)

65 ని 90 గా మార్చడానికి 10 లో 1బి

Posted by V Srinivasa Chakravarthy Tuesday, July 28, 2009 0 comments

అంతర్జాలం ద్వార విజ్ఞాన ప్రచారానికి వివిధ మార్గాల గురించి "65 ని 90 గా మార్చడం ఎలా " అన్న థ్రెడ్ లో ఇంతకు ముందు కొంత చర్చించడం జరిగింది. దాన్ని ఇప్పుడు కొనసాగిస్తున్నాం.

భారతీయ భాషల్లో సైన్సు ప్రచారం కోసం రూపొందించబడ్డ వెబ్ సైట్లలో సైన్స్ పాపులరైజర్ అరవింద్ గుప్తా వెబ్ సైట్ చెప్పుకోదగ్గది.
(www.arvindguptatoys.com)
వ్యర్థ పదార్థాలతో ప్రయోగ పరికరాలను, వైజ్ఞానిక భావనలని వ్యక్తం చేసే బొమ్మలని, రూపొందించడం అరవింద్ గుప్తా ప్రత్యేకత.
"ఎ మిలియన్ బుక్స్ ఫర్ ఎ బిలియన్ పీపుల్" అన్న థీం గల ఈ వెబ్ సైట్ లో కోకొల్లలుగా ఈ-బుక్స్ ఉన్నాయి. వాటిలో అరవింద్ గుప్తా స్వయంగా రాసిన పుస్తకాలు పోగా, సైన్సు సాహిత్యం, పిల్లల సాహిత్యం, విద్యకి సంబంధించిన సాహిత్యం ఎంతో ఉంది. ఆ వెబ్ సైట్ నుండి నెలకి సుమారు 65,000 డౌన్ లోడ్స్ జరుగుతున్నట్టుగా అరవింద్ ఇచ్చిన సమాచారం. ఈ వెబ్ సైట్ లో ఎక్కువగా సమాచారం ఇంగ్లీష్ లోనే ఉన్నా హిందీ, మరాఠీ భాషల్లో విశేషంగాను, కొంచెం తక్కువగా, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లోనూ అనువాదాలు ఉన్నాయి. ఇలాంటి వెబ్ సైట్ ని ప్రత్యేకంగా తెలుగులో సైన్స్ సాహిత్యం కోసం ప్రారంభిస్తే బావుంటుంది.

విజ్ఞానం లో గణితాన్ని కూడా కలుపుకుంటే గణితం మీద కూడా చక్కని వెబ్ సైట్లు ఉన్నాయి.

ఉదాహరణకి ప్రాజెక్ట్ ఆయిలర్ అన్న వెబ్ సైట్ లో కఠినమైన గణిత సమస్యలని కోకొల్లలుగా సమీకరించి పెట్టారు. ఒక్కొక్క సమస్యని పరిష్కరించిన వాళ్ల సంఖ్య ఆ సమస్య పక్కన ఇవ్వబడుతుంది. సులభమైన సమస్యలని పరిష్కరించిన వాళ్ల సంఖ్య పది వేలల్లో ఉంటే, కఠినమైన సమస్యలని సాధించిన వాళ్ల సంఖ్య వందల్లో మాత్రమే ఉంటుంది. మన దేశంలో గణితాభిమానులు లక్షల్లో ఉంటారు. ఈ వెబ్ సైట్ ని భారతీయ భాషల్లోకి అనువదిస్తే బావుంటుంది.

(projecteuler.net)

అలాగే సరదాగా గణిత పజిల్స్ గురించిన వెబ్ సైట్లు కూడా చాలా ఉన్నాయి. ఉదాహరణకి అగ్గి పుల్లలతో చేసే పజిల్స్ కి సంబంధించిన ఈ వెబ్ సైట్ చూడండి.

http://www.learning-tree.org.uk/stickpuzzles/stick_puzzles.htm

ఇందులో అనువదించాల్సిన సమాచారం కూడా తక్కువే. ఈ వెబ్ సైట్ కి హిట్స్ సంఖ్య 2.6 లక్షలు దాటడాన్ని బట్టి ఇలాంటి సమాచారానికి జనంలో ఎంత ప్రాచుర్యం ఉందో తెలుస్తుంది. ఇలాంటి వెబ్ సైట్లని కూడా తెలుగులో/భారతీయ భాషల్లో రూపొందిస్తే బావుంటుంది.

తెలుగు వికీపీడియాలో కూడా ఈ మధ్య కాలంలో సైన్స్ సమాచారం వేగంగా పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. ఈ ఒరవడి ఇలాగే సాగితే బావుంటుంది.

ఇండియా, చైనా దేశాల్లో అంతర్జాల వినియోగ దారుల సంఖ్య ఏడాదికి 20-30 శాతం పెరుగుతోందని భోగట్టా. కనుక గ్రామాల స్థాయిలో ప్రస్తుతం ఎక్కువ అంతర్జాల సదుపాయం లేకపోయినా, సమాచారం పోగైతే వచ్చే ముందు ముందు కనెక్షన్లు పెరిగినప్పుడు ఈ సమాచారం ఉపయుక్తంగా ఉంటుంది.



సైన్సు ప్రచారానికి 10 మార్గాలలో రెండవది అయిన పుస్తక రచన గురించి వచ్చే టపాలో...

65 ని 95 చెయ్యటానికి 10 లో 1:

Posted by V Srinivasa Chakravarthy Tuesday, July 7, 2009 9 comments

నేడు అంతర్జాలం మీద మనమంతా ఎంతగా ఆధారపడి బతుకుతున్నామో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా శాస్త్రీయ, సాంకేతిక, విద్యా, పరిశోధనా రంగాల్లో అంతర్జాలం లేనిదే రోజు గడవని రోజులివి.
కాని అంతర్జాలాన్ని ఉపయోగించుకోవడానికి భాష అనే మాధ్యమం కీలకం అవుతోంది. అంతర్జాలంలో తెలుగు సమాచారం ఇంకా శైశవ దశలో ఉన్నట్టు కనిపిస్తోంది.

కాదంటారా? అవును తెలుగులో అంతర్జాలంలో చాలా విషయాలే ఉన్నాయి. కాని అందులో చాల మటుకు కల్తీ లేని చెత్త. తెలుగు సినిమా కబుర్లు (ఇది వట్టి కాలయాపన), సినిమా విమర్శలు (ఇది మరీను), సినిమా విశ్లేషణలు (ఇవిక చెప్పనక్కర్లేదు), సినిమా పాటలు, పాటల సాహిత్యం, సినిమా వీడియో డౌన్లోడ్స్ - ఇది అంతూ పొంతూ లేని సినిమా భాగోతం. ఇక పోతే రాజకీయాలు, వార్తలు. ఇంకా చిన్న కథలు, చిట్టి కథలు, చిన్నా చితకా కథలు (కథలంటే తెలుగు వాళ్లకి వల్లమాలిన ప్రేమ. ఎందుకంటే కథలైతే రాయటానికి, చదవటానికి కూడా ఎక్కువ శ్రమ అవసరం లేదు. బద్ధకస్థులకి సదుపాయంగా ఉంటుంది. పుస్తకం రాయాలంటే శ్రమగానీ...). ఈ కథల పొదల మాటున ఓ పిడికెడు నవలా పీడీయెఫ్ లు. ఇవన్నీ కాక వ్యక్తిగత సమాచార సముద్రం: "నా ఫోటో, మా చెల్లి ఫోటో, మా స్నేహితుల ఫోటోలు, మా టామీ ఫోటో, తిరుపతి గుళ్లలో(తో) మా ఫోటోలు, నాకు నచ్చిన సినిమా, నేను సేకరించిన వాటిలో కెల్లా నాకు బాగా నచ్చిన స్టాంప్ ఫోటో..." ఈ బాపతు సమాచారం. ఈ హో(బో)రులో విజ్ఞానం మాట మనకెక్కడ వినిపిస్తోంది?

కనుక తెలుగులో అంతర్జాలంలో వైజ్ఞానిక సమాచారాన్ని పెంచాలన్న లక్ష్యంతో ఏకీభవించే వాళ్లంతా ఏకమై క్రమబద్ధంగా, వ్యూహాత్మకంగా అలాంటి సమాచారాన్ని పోషించాలి.

"చలి చీమల చేత చిక్కి..." అన్న పద్యంలోలా, చిన్న చిన్న ప్రయత్నాలే కలిసి కలిసి ఓ బృహత్ ఫలితానికి దారితీస్తాయి.

కొన్ని సులభమైన మార్గాలు:

1) తెలుగులో పాత శాస్త్రీయ పుస్తకాలు, ప్రింట్ లో లేనివి ఏవైనా ఉంటే, కాపీరైట్ సమస్యలు లేకపోతే, వాటిని స్కాన్ చేసి అంతర్జాలంలో పెట్టడం. లేదా అందులో ముఖ్యమైన అంశాలే టైప్ చేసి పెట్టొచ్చు.

2) శాస్త్ర రంగాల్లో ప్రవేశం ఉన్న వాళ్ళు ప్రత్యేక అంశాల మీద సొంత బ్లాగ్ లు ప్రారంభించవచ్చు. అలాంటి బ్లాగ్లు అన్నీ ఒక చోట అగ్రిగేట్ చేస్తే అదే గొప్ప సమాచారం అవుతుంది.

3) మరో మెట్టు పైకెక్కి ప్రత్యేక శాస్త్ర రంగాల్లో పిల్లల కోసం వెబ్ సైట్లు ఆరంభించవచ్చు. ఇంగ్లీష్ లో అలాంటివి కోకొల్లలు. మచ్చుకి కొన్ని:

Neuroscience for kids: http://faculty.washington.edu/chudler/neurok.html
Physics for kids: http://www.physics4kids.com/
Geography for kids: http://www.geography4kids.com/
Biology for kids: http://www.biology4kids.com/
Chemistry for kids: http://www.chem4kids.com/
Excellent source for children's activities: http://www.enchantedlearning.com/Home.html


ఇలాంటి సైట్లని అనుమతి తీసుకుని అనువదించినా చాలు ఎంతో మందికి ఉపయోగపడుతుంది.

4) తెలుగులో మన అదృష్టం బావుండి "డిస్కవరీ" అని ఓ చక్కని వైజ్ఞానిక పత్రిక వెలువడుతోంది. సైంటిఫిక్ అమెరికన్ కి దీటైన పత్రిక తెలుగులో ఉండాలన్న గొప్ప లక్ష్యంతో, దూరదృష్టితో ఈ పత్రిక సంపాదకుడు శ్రీనివాస్ రెడ్డి గారు దీన్ని సమర్థవంతంగా నడిపిస్తున్నారు. ఆ పత్రిక ఇప్పుడు ఇంగ్లీష్ లోను, మరి కొన్ని భారతీయ భాషల్లోను కూడా వెలువడుతోంది. అయితే తెలుగులో ఓ వైజ్ఞానిక వెబ్ జైన్ ప్రారంభిస్తే బావుంటుందని నా అభిప్రాయం. "ఈమాట" అన్న వెబ్ జైన్ చాలా విజయవంతంగా నడుస్తోంది. అలాంటి వెబ్ జైన్ సైన్స్ లో కూడా ఉంటే బావుంటుందేమో.

(సశేషం... )

65 ని 90 గా మార్చడానికి 10

Posted by V Srinivasa Chakravarthy Thursday, July 2, 2009 5 comments

Part 2

విద్య వేగంగా వ్యాపించాలంటే, అట్టడుగు వర్గాలలో కూడా విజ్ఞత పెరగాలంటే కొన్ని పరిణామాలు రావాలి. నిజానికి మనం ఊహిస్తున్న స్థాయిలో పరిణామాలు రావాలంటే మూడు వర్గాలు/సంస్థలు కలిసి పని చెయ్యాలి: 1) ప్రభుత్వం, 2) ప్రైవేటు సంస్థలు, 3)ఈ రెండు వర్గాలకీ బయట ఉంటూ పని చేసే ప్రతిభా వంతులైన వ్యక్తులు.

ప్రభుత్వం ఎన్నో చేస్తే బావుంటుంది. కాని ప్రభుత్వం చెయ్యాల్సిన వన్నీ సక్రమంగా చేసి, ఆ సత్ఫలితాలని మనం అనుభవించాలంటే మనం ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి!!! మరి అంత పుణ్యానికి మనం నోచుకున్నామో లేదో తెలీదు. అంత పుణ్యం మూట గట్టుకునేంత వరకు ఎదురు చూసే సహనం నాకైతే లేదు.

ఇక ప్రైవేటు సంస్థలు స్వలాభం అనే లక్ష్యాన్ని వొదులుకుని పని చేసే అవకాశం తక్కువ. ప్రస్తుతం మనకి కనిపించే ప్రైవేటు విద్యా సంస్థల్లో చాలా మటుకు పిల్లలకి యాంత్రికమైన శిక్షణ నిచ్చి, వారిచేత ఎలాగోలా ప్రవేశ పరీక్షల కంచెలని అంచెలంచెలుగా గెంతించడం తప్ప మరొకటి చేస్తున్నట్టు కనిపించదు. పిల్లల మానసిక వికాసాన్ని గురించి లోతైన అవగాహన కలిగి, వాళ్లు సహజంగా, సలక్షణంగా ఎదగటానికి అనువైన వాతావరణాన్ని కల్పించగల సంస్కృతి ఉన్న ప్రైవేటు విద్యా వ్యవస్థలు బహు తక్కువ. (ఈ రంగంలో కొన్ని ఎన్.జి.వో. లు చక్కని కృషి చేస్తున్నాయి. కాని అవి ప్రైవేటు సంస్థల లెక్కలోకి రావనుకుంటా.)

ఇక మిగిలినది ప్రత్యేక వ్యక్తుల కూటమి. ఉన్నతమైన సంస్కారం, విజ్ఞత, సత్తా గలిగి ఉన్న వాళ్లు వీళ్లు. ప్రపంచాన్ని జయించగలం అన్న ఉత్సాహంతో ఉవ్విళ్లూరే, విశ్వాసం ఉట్టిపడే ధీమంతులు, ధీరులు వీళ్లు. మన ఆశలన్నీ ఇక వీరి మీదే. గత ఒకటి, రెండు శతాబ్దాలుగా మన దేశంలో, విద్యారంగంలో ఇలాంటి వ్యక్తులు మౌనంగా సాధించిన విజయాల కథలన్నీ చెప్పుకుంటే అది రామాయణాన్ని మించిన పురాణం అవుతుందేమో! (ఈ కథలు కొన్ని సందర్భోచితంగా ముందు ముందు విన్నవిస్తాను.)

ఎవరు చేసినా, ఎలా జరిగినా విద్య వేగంగా వ్యాపించాలంటే, అరవై ఐదుని తొంభైగా తొందరగా మార్చాలంటే కొన్ని పరిణామాలు జరగాలని అనిపిస్తుంది. ఇవన్నీ మళ్లీ ఒక దానితో ఒకటి పొంతన లేని ప్రయత్నాలు కావు. కాకూడదు. ఇవన్నీ కూడా ఓ బృహత్పథకంలో భాగాలుగా, మాలలో సుమాలుగా ఇంపుగా ఒదిగిపోవాలి. ఇదుగో ఆ పరిణామాల/ప్రయత్నాల పట్టిక.

1. భారతీయ భాషలలో ఇంటర్నెట్ మీద ఓ బృహత్తర శాస్త్రీయ/సైన్సు భాండారం యొక్క కల్పన.
2. పాఠ్య పుస్తకాలతో సంబంధం లేకుండా సరదాగా సైన్సు నేర్చుకోవడానికి భారతీయ భాషల్లో కోకొల్లలుగా పుస్తకాల రచన.
3. విద్యా వ్యాప్తి కోసం వినూత్న పద్ధతులతో ఎఫ్.ఎం. రేడియో వినియోగం.
4. సైన్సు ప్రచారంలో టీవీ/సినిమా ల వినియోగం.
5. నాటకాలు, తోలుబొమ్మల ఆటలు, బుర్రకథలు మొదలైన సాంప్రదాయ కళా పద్ధతులలో సైన్సు ప్రచారం.
6. పట్టరానంతగా పెరిగిపోయిన మొబైల్ నెట్వర్కు ని సద్వినియోగం చేసుకుంటూ విద్యా వ్యాప్తి
7. ఐ.ఐ.టి., ఐ.ఐ.ఎస్.సి, ఎన్.ఐ.టి లు మొదలుకుని , దేశం అంతటా వ్యాపించిన కొత్త ఇంజినీరింగ్, మొదలైన ప్రొఫెషనల్ విద్యా సంస్థలు అన్నీ కలిసి, ఓ బృహత్తర వ్యూహంలో భాగంగా, ప్రభుత్వ సహకారంతో, గ్రామాలకి విద్యా సేవలు అందించడం.
8. ఇంటర్నెట్ మీద పని చేసే “ట్యూషన్” కేంద్రాల సంస్థాపన
9. విద్యార్థుల వికాస/శిక్షణ క్రమాన్ని కనిపెట్టుకునే ఓ సమగ్ర సాఫ్ట్ వేర్ వ్యవస్థ
10. కోటి విద్యలు కూటీ కొరకే – చదువు పూర్తి కాగానే ఉద్యోగావకాశాలు చూబించే సులభ మార్గాలు.

ఈ వాక్యాలని వచ్చే కొన్ని టపాలలో విపులంగా వివరిస్తాను. ఇందులో చాలా మటుకు తెలిసినవే, కాని చాలామటుకు జరగనివే! వీటిలో కొన్ని సైద్ధాంతికంగా ఆచరణీయమే అయినా వాస్తవంలో ఎన్నో కారణాల వల్ల జరక్కపోవచ్చు. మరి కొన్ని వట్టి “పగటి కలలు” కావచ్చు. మరి రంగులేని లోకంలో మిగిలిన హంగు కలలే కదా?!

మరి కొన్ని వివరాలతో, వివరణలతో వచ్చే టపా లో...

65 ని 90 గా మార్చడం ఎలా?

Posted by V Srinivasa Chakravarthy Wednesday, July 1, 2009 2 comments


పార్ట్ 1


1980 లలో అనుకుంటా... ఓ కొత్త ఒరవడి, ఓ వేగం, ఎదగాలన్న తాపత్రయం దేశం అంతా వ్యాపించింది. 90 లలో ప్రభుత్వ విధానాలలో వచ్చిన మౌలిక మార్పుల వల్ల దేశీయులలో అంతవరకు నిద్రపోతున్న సృజనాత్మక శక్తులు మేలుకున్నాయి. వేల వినూత్న రీతుల్లో అవి నేడు అభివ్యక్తం అవుతున్నాయి.

అయితే ఈ ఆధునిక మార్పులలో పెద్ద ఎత్తున పాలుపంచుకుంటున్నది మధ్య గరగతి వారు మాత్రమే ననుకోవచ్చు. ఈ సమకాలీన సత్ఫలితాలు సమాజంలో అన్ని స్తరాల వారికీ అందాలంటే ఒక్కటే మార్గం. విద్య విస్తృతంగా వ్యాపించాలి. అక్షరాస్యత మరెంతో పెరగాలి.

అంతరిక్షం, అణుశక్తి, ఐ.టి. ఇలా ఎన్నో రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిన మన దేశం, అక్షరాస్యతలో మాత్రం నమ్మలేనంత నిమ్న స్థితిలో ఉంది. 2001 సెన్సస్ ప్రకారం మన అక్షరాస్యత విలువ 64.84%. ఇది ఎంత తక్కువో ఒక అవగాహన రావాలంటే కొంత తులనాత్మక సమాచారాన్ని పరిశీలించాలి.

అక్షరాస్యతలో మన దేశం ప్రపంచ దేశాలలో 144 వ స్థానంలో ఉంది. అక్షరాస్యత 99% పైగా గల దేశాలు 40 ఉన్నాయి. 90% కన్నా అక్షరాస్యత ఎక్కువ ఉన్న దేశాలు 88 ఉన్నాయి. అభివృద్ధి చెందిన దేశాలని పక్కన పెట్టినా, మనం పోల్చుకోదగ్గ దేశాలు – చైనా, మెక్సికో, థాయ్లాండ్ మొదలైన దేశాలు కూడా 90 ని మించిపోయాయి. బ్రెజిల్ కూడా ఆ దరిదాపుల్లోనే ఉంది. మొన్నమొన్నటి దాకా అగ్రరాజ్యాల మధ్య ఘర్షణలో పడి నలిగి, బాగా చితికోపోయిన వియట్నాం అక్షరాస్యత 90.3%. అంతస్సమరంతో యాతన పడుతున్న పొరుగుదేశం – శ్రీ లంకలో కూడా అక్షరాస్యత 90.7%. పై సమాచారాన్ని బట్టి 90% దరిదాపుల్లో అక్షరాస్యత గలిగి ఉండటం అంత విశేషమేమీ కాదన్నమాట. కానీ ఆ పాటి వైభవం కూడా ప్రస్తుతం మనకి లేదు.

ఇక రాష్ట్రాలలో చూస్తే ఆంధ్ర రాష్ట్రం దేశం సగటు విలువ కన్నా కాస్త తక్కువలో 61.11% వద్ద ఉంది. ఉన్న 29 రాష్ట్రాలలో 22 వ స్థానంలో ఉంది.

మరి ఇంత ముఖ్యమైన రంగంలో ప్రభుత్వం చేతులు కట్టుకు కూర్చుందా అంటే లేదు. 1988లో ప్రభుత్వం National Literacy Mission ను స్థాపించింది. 2007 కల్లా అక్షరాస్యత 75% శాతం చేరగలిగితే ఇక అప్పట్నుంచి ప్రత్యేక పథకాల అవసరం లేకుండా, దానికదే నిలదొక్కుకుంటుందని ఆశిస్తున్నారు. 2007 లో ఆ విలువ ఎంత వరకు వచ్చిందో మరి 2011 సెన్సస్ సమాచారంతో గాని తెలీదు. పోనీ ఆ లక్ష్యం చేరుకున్నా అదంత పెద్ద విశేషం కాదని అనిపిస్తోంది. 75% అంటే ఏదో బొటాబొటి మారుకులతో పాస్ అయినట్టు ఉంది. ఆ విలువ 90% శాతం అయితే వినటానికి బావుంటుంది. మీసం మెలేసి ఇరుగు పొరుగు వాళ్ల దగ్గర బడాయి పోవడానికీ బావుంటుంది. బడాయి మాట అటుంచి సమకాలీన సత్ఫలితాలు నాలుగు కాలాల పాటు నిలవాలన్నా, ఇంకా వృద్ధి చెందాలన్నా అక్షరాస్యత విలువ 90 ఉండాలని అనిపిస్తోంది.

అంత ముఖ్యమైన లక్ష్యాని సాధించే బాధ్యతని పూర్తిగా ప్రభుత్వానికి వొదిలేయలేం. ప్రజాస్వామ్యంలో “ప్రజల చేత, ... ప్రజల కోసం” అన్న సూత్రం ఉండనే ఉంది. వర్తమాన ప్రపంచంలో ఇలాంటి మార్పుకు ప్రోద్బలాన్ని ఇవ్వగల రెండు మహాశక్తులు ఉన్నాయి.

1. ప్రతిభలో, పరిజ్ఞానంలో, జీవితంలో ఒక ఎత్తుకు ఎదిగి, ఆ సదవకాశాలు లేని వారి కోసం ఏదైనా చెయ్యాలనే స్ఫూర్తి, పట్టుదల ఉన్న విశేష వ్యక్తుల కూటమి.
2. ఇంటెర్నెట్ తో మొదలుకుని, దాని చుట్టూ పెనవేసుకుని పని చేసే సువిస్తార సమాచార మాధ్యమాల సౌలభ్యం.

ఈ రెండు శక్తుల కలయిక లోనే ఓ మహత్తర విద్యా విప్లవం పొంచి వుంది.

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts